26, మార్చి 2013, మంగళవారం

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని


(గమనిక: ఇది రెండేళ్ళ క్రితం రాసింది. పరిస్థితులు ఏవయినా మారాయంటారా?)

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోయి నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.


మన దేశానికి స్వతంత్రం వచ్చి అరవై నాలుగేళ్ళు నిండాయి. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ అరవై ఏళ్ళ పైచిలుకు కాలంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా – పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే నేనున్నానంటూ దీన జనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.
అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని దీన జనావళి స్తితి రాముని కాలం నాటి కధలోని కప్పను తలపిస్తోంది.
ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయాధీశులే - కంచే చేనుమేసిన చందంగా దొరికిపోయి అభిశంసనలకు గురికావడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం అరవై అయిదేళ్ళ వయస్సులో స్వతంత్ర భారతానికి అంటుకున్న మకిలి. కడిగినా వొదలని మురికి.
ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-
నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే – వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా - తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. కాకపొతే, దొంగని దొంగే పట్టించిన చందంగా అందరి భాగోతాలు తెర చాటునుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కాబోలు. ఏదో ఒక రకంగా భవిష్యత్ తరాలకు మేలుచేసేదే కాబట్టి ఆహ్వానించదగ్గ పరిణామమే అనుకోవాలి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.
అవినీతి అంశంగా ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు అవినీతిని ఈసడించుకునే పౌరులందరినీ కలత పరుస్తున్నాయి. అక్కడ అన్నా హజారే ఉద్యమం తీసుకున్నా, ఇక్కడ జగన్ ఆస్తులపై సీ.బీ.ఐ. సాగిస్తున్న దర్యాప్తు విషయం తీసుకున్నా, వాటి గురించి మేధావులు, రాజకీయపార్టీల నడుమ సాగుతున్న చర్చలు పక్కదోవపడుతున్నాయి.
ఉభయపక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.
వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే. రాజ్యాంగం ప్రసాదించిన పవిత్రమయిన వోటు హక్కుని సరిగా వాడుకోకుండా, లేదా అసలు వాడుకోకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో పాలు పంచుకున్నవాళ్లమే.
ఈ సందర్భంలో- కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.
“భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”
చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముప్పూటలా వాక్రుచ్చే రాజకీయనాయకుల మాటలన్నీ నీటి మూటలని మొత్తం మూటకట్టి మూలన పడేయనక్కరలేదు. ఎందుకంటె ఆ విదేశీ యాత్రీకుడు దేవుడి విషయంలో చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది. మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు – ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.
కవికుల తిలకుడు తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు – ‘దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని’.
(26 -08-2011)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అవును మరి. సంజయ్ దత్‌ను శిక్షనుండి బయటపడేసేందుకు అన్ని రాజకీయ పక్షాలూ, సీనీ నటులు, మీడియా ప్రయత్నించడం సిగ్గుచేటు . వాడికి తగిన శిక్ష పడింది. సంజయ్‌ను రక్షించే క్రమంలో అందరి రంగులూ బయటపడుతున్నాయి.