31, మార్చి 2012, శనివారం

మార్పు చూసిన కళ్ళు – మాస్కో అనుభవాలు


మార్పు చూసిన కళ్ళు – మాస్కో అనుభవాలు

ఆస్తాంకినో టీవీ టవర్



అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన ఈ ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి.


మబ్బుల్ని చీల్చుకుని కానవస్తున్న టీవీ టవర్ 


ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.
‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపొతే వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అన్న ఆనిమల్ ఫాం రచయిత సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు అందులో వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి. ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి. కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.         

30, మార్చి 2012, శుక్రవారం

మార్పు చూసిన కళ్ళు - (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు


మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు
పాలయినా పెట్రోలయినా ఒకటే ధర 
ఎముకలు కొరికే చలిలో ఏమి చెయ్యాలనిపిస్తుంది నాకయితే ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ రేడియోలో పాత పాటలు వినాలనిపిస్తుంది.




 కానీ రష్యన్లు చలి ముదురుతున్న కొద్దీ చల్లటి బీరు తాగాలనోఇంకా చలచల్లటి ఐస్ క్రీములు తినాలనో ఉత్సాహపడతారు. మంచుకురిసే వేళలో  ఆపాదమస్తకం ఉన్ని దుస్తులు ధరించి ఐస్ క్రీములకోసం ఆడామగాపిల్లాపెద్దా తేడాలేకుండా వీధి దుకాణాల ముందు ఆరుబయట  బారులుతీరి నిలబడే రష్యన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆనాటి మాస్కోలో ఎక్కడికిపోయినా ముందు కనిపించేవి పెద్ద పెద్ద క్యూలే. ఆఖరికి  పాలుకొనాలన్నాపెరుగుకొనాలన్నా క్యూలను తప్పించుకోలేము. ధరాభారం లేకపోవడంవల్లనోమళ్ళీ ఈ చలిలో బయటకు రావడం ఎందుకనో, అవసరంవున్నా లేకపోయినా ప్రతివస్తువును దొరికినప్పుడే కొనుక్కోవడం మంచిదనో  కారణం ఏదయితేనేమి కానీ ప్రతిచోటా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తాయి. ఉత్పాదక  వ్యయంతో నిమిత్తం లేకుండా ప్రజల అవసరాలనుబట్టి ధరలను బాగా అదుపులో వుంచడంవల్ల  కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయివారు చేసే అనవసర కొనుగోళ్ళతో కృత్రిమ కొరతలు ఏర్పడిఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని మాస్కోలో చాలా కాలం నుంచి వుంటున్న మా తోటి ఉద్యోగులు చెబుతుండేవారు. మాటవరసకు పాల విషయమే తీసుకుందాం. ప్రతి నివాసానికి చేరువలోనే పాలుపాల ఉత్పత్తులు అమ్మే ప్రోదుక్తి’ దుకాణం వుంటుంది. పాలు లీటరు ముప్పయి కోపెక్కులు. ఇంత చలిలో మళ్ళీ ఏం వస్తామనుకునే బద్దకస్తులు అవసరానికి మించి కొనుగోలుచేసేవారు. వాడకానికి పోను మిగిలిన పాలను డస్ట్ బిన్ లో పారేసి మర్నాడు  మళ్ళీ కొనుక్కునేవాళ్లను చూసాము. ధర బహు తక్కువగా వుండడం వల్ల ఇలా దుబారా జరుగుతోందని చెప్పుకునేవాళ్ళు. అలాగే పెట్రోలు. లీటరు పాల ధరలీటరు పెట్రోలు ధర ఒకటే విధంగా వుండడం ఆ దేశంలోనే చెల్లు. ట్యాంకు నిండిన తరవాత పెట్రోలు లీటర్లకు లీటర్లు కారిపోతున్నా చోద్యం చూస్తూ నిలబడేవాళ్ళు, ఒకటో రెండో రూబుళ్ళు అదనంగా విదిలిస్తే పోలా అనుకునేవాళ్ళు అక్కడే కానవస్తారు.
అక్కడ ప్రతివారు ఒక చేతి సంచిని సిద్ధంగా దగ్గరవుంచుకుంటారు. వీధిలోకి వెడితే ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలవదు. క్యూ పొడుగ్గావుంటే చాలు అక్కడ ఏమి అమ్ముతున్నారన్నదానితో నిమిత్తం లేకుండా వెంటనే అందులో దూరిపోతారు. జనం బాగా వున్నారంటే క్యూబానుంచి దిగుమతి చేసుకున్న అరటి పండ్లో లేక ఇంకా అపురూపమయిన టమాటాలో అక్కడ అమ్మకానికి పెట్టారనుకోవచ్చు. టమాటాలు కనబడితే  కిలోలకు కిలోలు కొనేస్తారు. వాటిని ఇంటికి చేర్చడానికి పడే ప్రయాస ఆ క్షణంలో ఎవరికీ గుర్తు వుండదు.ఎందుకంటె అవి ఏడాది పొడుగునా దొరికేవికావు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తో పాటు పెద్ద పెద్ద డీప్  ఫ్రిజ్ లు కూడా వుంటాయి. ఇలా కొనుక్కొచ్చిన టమాటాలను వాటిల్లో భద్రం చేస్తుంటారు. అవి గట్టిపడి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. టమాటాలు  దొరకని రోజుల్లో వాటిని బయటకు తీసి వేడి నీటిలో ఉడకపెట్టుకుని వంటల్లో వాడుకుంటూ వుంటారు.
ఇక ఇండియన్లకు, ప్రత్యేకించి దక్షిణాది  శాకాహారులకు సంబంధించి ప్రధాన సమస్య రోజూ తినే బియ్యం. రష్యన్ బియ్యం బాగా మొద్దుగా వుంటాయి. చూడడానికి ఇంపుగా వుండకపోవడమే కాకుండా వాటితో వండిన అన్నం నోటికి హితవుగా వుండదు. అందుకే ఏ షాపులోనయినా ఇండియా నుంచి వచ్చిన బియ్యం అమ్ముతున్నారని తెలిస్తే  అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాపుపై ఎగబడేవారు.దీనికి సంబంధించి ఒక జోకు ప్రచారంలో వుండేది. మాస్కోలోని బారత రాయబారి కార్యాలయానికి కొత్తగా ఓ ఉన్నతాధికారి వచ్చారు. ప్రతి రోజూ ఉదయం జరిగే అధికారుల సమావేశానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. కొత్త అధికారి పాత అధికారిని ఆలస్యానికి కారణం అడిగారుట. దోవలో ఒక షాపులో బియ్యం అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఆగడం వల్ల ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారుట. అంతేఆ మీటింగులో ఒక్కరు వుంటే ఒట్టు. అందరూ ఒక్క పెట్టున లేచి పొలోమని ఆ దుకాణం వైపు పరిగెత్తారట. 

25, మార్చి 2012, ఆదివారం

మారానంటే నమ్మరేం! - కిరణ్ ఆత్మ ఘోష


మారానంటే నమ్మరేం! - కిరణ్ ఆత్మ ఘోష 
నెలలు గడిచిపోయాయి రాష్ట్ర రాజకీయాలను గురించి రాసి. ఎందుకంటే రాసిన దాంట్లో ఏదో ఒక కోణాన్ని తీసుకుని రాజకీయులకి ఆపాదిస్తూ ఆయా పార్టీల భుజకీర్తులు ధరించిన పాత్రికేయునిగా ముద్ర వేసే ధోరణి పెచ్చుపెరిగిపోతున్న తరుణంలో రాయకపోవడమే మంచిదన్న ఉద్దేశ్యంతో మానుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రాజకీయ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాయడానికి కూడా ఒక కారణం వుంది.
‘ముఖ్యమంత్రిని మార్చాలా! ముఖ్యమంత్రి మారాలా!’ అనే అర్ధం వచ్చేలా  గతంలో నేను రాసిన వ్యాసంలో ముఖ్యమంత్రికి సరిపడని సంగతులు వున్నాయని ఒక పత్రిక దాన్ని ప్రచురించలేదు. రాష్ట్ర రాజకీయాలను గురించి నేను వారం వారం రాస్తున్న వ్యాసాలను ఆ పత్రిక అప్పటికి కొన్ని మాసాలనుంచి క్రమం తప్పకుండా ప్రచురిస్తూనే వస్తోంది. అప్పటికే ఆ పత్రిక యజమాని ఏదో  కేసులో చిక్కుకుని వున్నందున కిరణ్ గురించిన ఈ  వ్యాసం ప్రచురించడంలో తమకు కొన్ని ఇబ్బందులు వున్నాయని సంపాదక వర్గ సభ్యుడొకరు తరువాత వివరణ ఇవ్వడం వల్ల ‘పీత కష్టాలు పీతవి’ అని సరిపుచ్చుకున్నాను.
కానీ, ఇప్పుడు అదే పత్రిక ముఖ్య మంత్రి కిరణ్ అనుకూల ధోరణిలో ప్రధాన వార్త రాస్తూ మరో పక్క ‘నేను మారానంటే నమ్మరేం!’ అంటూ ఆయన ఫోటో కింద ప్రచురించి కిరణ్ మనసులోని మాట ఇదే అని స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. పాఠకుల కోసం ఆ వ్యాసాన్ని మరోమారు ఇక్కడ ఇస్తున్నాను. (25-03-2012)
--------- దిన పత్రిక సంపాదకులకు (పత్రికా సంప్రదాయాలను గౌరవిస్తూ పత్రిక పేరు రాయడంలేదు)
శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ నెల ఇరవై నాలుగో తేదీకి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా రాసిన ఈ కింది వ్యాసాన్ని మీ పరిశీలన కోసం  పంపుతున్నాను.
భవదీయుడు
భండారు శ్రీనివాసరావు (18-11-2011)


కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది పాలనలో సాఫల్య వైఫల్యాలు  - భండారు శ్రీనివాసరావు
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అనేక ఒడిదుడుకులకు గురయింది. పాలక పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఒక రకమయిన అనిశ్చితి నెలకొనివున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో అధికార  పగ్గాలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఏడాదిలో ముఖ్యమంత్రిగా సాధించింది ఏమిటి అని విశ్లేషించే ముందు గతాన్ని ఓ సారి నెమరు వేసుకోవడం బాగుంటుంది. 
ముప్పయ్యేళ్ళ కిందటి మాట.
ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు  కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.
అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి  ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే  తుంచేయాలని భావించిన  ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్  అతిరధులంతా ఆ

సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కుయ్ కయ్ అంటే వొట్టు.    
మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. మంత్రులే కాదు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని  అశక్తతలో నేటి అధిష్టానం.

మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో   రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత  ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై  ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన కూడా పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.
వైఎస్సార్  దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ  చీకాకులకు  అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది.  వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.
ఈ పరిణామాలు  సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే  వై.ఎస్.  మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా  వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం  రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
ఎందుకంటె,  ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండే  చిల్లర దేవుళ్లు  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి.  చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై  పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం  జాతీయ పార్టీలయినా,  ప్రాంతీయ
పార్టీలయినా వాటి  అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ  ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ అధికారం లో వున్నప్పుడు జడ్పీ చైర్మన్ల ఎంపిక సందర్భంలో సీల్డ్ కవర్రాజకీయం నడిపిన విషయం అందరికీ తెలిసిందే.
కాకపొతే తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ గద్దె ఎక్కడానికి దోహదపడిన  వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో కలగూరగంపను తలపించే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త  బాధ్యతలు, తొలి విడత పాలనలో రాజశేఖరరెడ్డికి ఓ మేరకు కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి రాజశేఖరరెడ్డి వంటి అన్నింటా సమర్ధుడయిన ఒక ప్రాంతీయ నాయకుడి అవసరం  ఢిల్లీ పెద్దలకు వుండడం ఆయనకు మరింత కలసి వచ్చింది. 
వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న  మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా  ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల  కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు.అయితే, 2009 లో   అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ  తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని,  వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులపై మునుపటి మాదిరిగా పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.
వై ఎస్ మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టిన  రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చూపిన  కారణం ఆయన వయో భారం. ఆ విషయాన్ని  కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.
కారణాలు ఏమయినా గత నవంబర్ ఇరవై నాలుగో తేదీన వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని  ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు,  మంత్రుల శాఖల పంపిణీలో స్వతంత్రించి సీనియర్లను సైతం
పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం  మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.
కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించిన సంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న  కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత  చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే   అటకెక్కిస్తున్నదన్న  భావన ఆ పధకాల  లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు  అధికారులు  కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా  ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా  పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ  కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు  అసమ్మతికి భయపడాల్సిన పని ముఖ్యమంత్రికి వుండదు. 
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను రుజువు చేసుకోవడంలో ఆయన కొంతవరకు  వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం.  క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి.  సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం ఇవన్నీ  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ  నిష్క్రియాపరత్వానికి   కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి  వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు  ఎదుర్కొనక తప్పని  సమస్యలే.  
నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా  పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు.  ఎన్నెన్ని అవినీతి  ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు  వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనకు రాజకీయంగా కలసివచ్చిన కాలం తక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సమస్య.  ఒకదాని వెంట  మరొకటి. ఇలా దాదాపు మొదటి ఆరుమాసాలకాలం ఉక్కిరిబిక్కిరిగానే గడిచిపోయింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మారనున్నారనే వదంతుల నడుమ కిరణ్ కుమార్ రెడ్డి పాలన సాగడంవల్ల యంత్రాంగంపై పట్టు చిక్కించు కోవడానికి కొంత సమయం పట్టింది.  ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సంకేతాలు కానవస్తున్నాయి.  సంక్షేమ పధకాలకు సంబంధించి సొంత ముద్ర వేసుకొనే క్రమంలో ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం పధకం, లక్షమందికి ఉపాధి కలిగించే రాజీవ్ యువ కిరణాలు పధకం, పరిపాలనలో జవాబుదారీతనం కల్పించడానికి ఉద్దేశించిన మీ కోసంపధకం ఇలా అనేక కొత్త పధకాలకు
కిరణ్  స్వయంగా రూపకల్పన చేశారు. అయితే వాటిని విస్తృతంగా ప్రచారం చేసి  జనంలోకి తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నం  పూజ్యం. గతంలో ముఖ్యమంత్రులు ప్రచారాలకు పెట్టిన ఖర్చుతో పోలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అందుకోసం  చేస్తున్న వ్యయం చాలా తక్కువనే చెప్పాలి. కానీ, పని చేయడమే కాదు పని చేస్తున్నట్టు కనిపించాలి అన్న ఈ కాలపు సూత్రాన్ని ఆయన గమనం లోకి తీసుకున్నట్టులేదు.      
అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ పైచిలుకు  వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు.
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.  కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (18-11-2011)       

       

22, మార్చి 2012, గురువారం

‘గీత’ గెలిచింది



‘గీత’ గెలిచింది

భగవద్గీతను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రష్యా న్యాయస్తానంలో దాఖలయిన కేసు వీగిపోయింది. (నేటి వార్త)
కేసు దాఖలయిన వార్త వెలువడినప్పుడు రాసిన వ్యాఖ్య :
భగవద్గీత మీద ప్రమాణం చేసి  - భండారు శ్రీనివాసరావు



ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి దాదాపు అరవై ఏడేళ్ళు గడిచాయి. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన అమెరికా ట్రినిటీఅనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది.  అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత కమ్యూనిజానికి కాలం చెల్లిన రష్యాలో వ్యాస విరచితమయిన భగవద్గీత ను నిషేధించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ట్రినిటీఅయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆగస్టు ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్ మ్యాన్
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షిం చకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  పరీక్షించడానికి వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు  బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు.
పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్క్రుతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందో వంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానంయిన ఎనర్జీవిడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.   బాంబు పేలిన చోట పది అడుగుల లోటు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -   ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశ నానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. చీ! జరగరానిది జరిగి పోయింది ‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) ‘వేయి సూర్యుల కాంతి అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే -
 ‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని
ఇక మాస్కో  కోర్టు భగవద్గీత గురించి ఏ తీర్పు యెలా  ఇస్తే ఎవరికి కావాలి  (27-12-2011)

20, మార్చి 2012, మంగళవారం

మాస్కోలో మెక్ డొనాల్డ్




మాస్కోలో మెక్ డొనాల్డ్


1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయం లో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.



లెనిన్ సమాధి దగ్గర బారులు తీరిన ప్రజలు 




 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.


మాస్కోలో మెక్ డొనాల్డ్

ఇనుప తెరదేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్ ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్అనేవారు. రష్యన్లో బల్షోయీఅంటే పెద్దఅని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.
 (20-03-2012)

19, మార్చి 2012, సోమవారం

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా


వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా

(ఈరోజు పత్రికల్లో ఢిల్లీ కొత్త సీఎం వుండబోయే కొత్త జంట ఇళ్ళ ఫోటోలు చూసిన తరువాత 2012 మార్చి నెలలో రాసింది గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ దీదీ అక్కడే వున్తున్నారో లేదో తెలవదు)

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.













ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.

కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.

పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.

ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీ’ – మమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత, కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు లేకపోవడం నిజం కూడా.

ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని ‘హింగ్లీ’  (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి. 

దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)                

7, మార్చి 2012, బుధవారం

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!




సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా




ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే.
సౌదీ మహిళల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ వివక్ష కారణంగా  ఆ దేశంలో చాలా కుటుంబాలు డ్రైవర్ ని పెట్టుకోవాల్సిన పరిస్తితి. అలా సొంతంగా డ్రైవర్ ని పెట్టుకుకోవాలంటే అతగాడికి నెలకు రెండు వేల సౌదీ రియాల్స్ చెల్లించుకోవాలి. లేదా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఆఫీసులకు వెళ్లి రావడానికి భర్త మీదనో లేదా కుటుంబంలోని  మరో మగవాడి మీదనో  ఆధారపడాలి. ఇందువల్ల వాళ్లు ఎంతో విలువయిన సమయాన్ని నష్టపోతున్నారు. శారీరకంగా, మానసికంగా కష్టపడుతున్నారు.       
పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగినుల పరిస్తితి మరీ దారుణం.
మనాల్ షరీఫ్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఇందుకొక ఉదాహరణ.
భర్త తోడు లేని ఈ మహిళ  పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో కారున్నప్పటికీ, పిల్లల్ని పార్కు తీసుకు వెళ్ళాలన్నా లేక ఆసుపత్రికి వెళ్ళాలన్నా అన్నదమ్ములపై ఆధారపడాల్సిన దుస్తితి. ఆ మాత్రం మగతోడు కూడా లేని ఆడవాళ్లు, సొంత కారున్నప్పటికీ  అవసరం పడితే  టాక్సీలో వెళ్ళాలి. ఇలాటి సందర్భాలలో  ఆడవాళ్ళు ఎంతో నిర్వేదానికి లోనవుతుంటారు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళడానికి పరాయి మగవాళ్ళని దేబిరించడం  కనాకష్టంగా  ఉంటోందని మనాల్ తన స్నేహితురాలికి యూ ట్యూబ్ లో ఒక సందేశం పంపారు.
కారు నాది.  నా డబ్బుతో కొనుక్కున్నాను. నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అయినా కానీ దాన్ని నడపలేని దౌర్భాగ్య స్తితి నాది.  ఏం చెప్పమంటావు?’ అంటూ అందులో  తన గోడు వెళ్లబోసుకుంది.

ఉన్నత కుటుంబీకులకీ, సంపన్న వర్గాలవారికీ డ్రైవర్ను పెట్టుకోవడం పెద్ద ఖర్చేమీ కాదు. కానీ, ఆడా మగా ఇద్దరూ సంపాదించుకుంటే కాని సంసారం నడవని మధ్య తరగతి కుటుంబాలలోని ఆడవారికి సౌదీలో ఇదొక ప్రధాన సమస్యగా తయారయింది. హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఆఫీసుకు సకాలంలో చేరాలన్నా, పిల్లల్ని స్కూళ్ళలో దింపాలన్నా, పచారీ దుకాణానికి వెళ్లి సరకులు కొనుక్కోవాలన్నా ఆడవారు సొంత కారు పెట్టుకొని కూడా  ఎవరినో ఒకరిని ప్రాధేయ పడాల్సి వస్తోంది. అందుకే అక్కడి ఆడవారు ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్టీలు డ్రైవింగ్ లైసెన్స్ హక్కు కోసం ఆందోళనలు దిగుతున్నారు.
  
బాగా అవసరం పడ్డప్పుడయినా కారు నడపడం రావాలని ఆదేశంలో కొందరు ఆడవాళ్ళు పొరుగునవున్న బహ్రెయిన్, లేదా యూయేయీ దేశాలకు వెళ్లి కారు నడపడం నేర్చుకుంటున్నారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించుకుని స్వదేశానికి వస్తున్నారు. 
కారు డ్రైవింగ్ నా తమ్ముడు నేర్పాడు. వూరికి దూరంగా తీసుకువెళ్ళి కారు నడపడంలో మెళకువలు నేర్పాడునూర్ అనే పేరుగల మహిళా అరబ్  వార్తా  సంస్థతో చెప్పింది.
నిరుడు జెడ్డాలో వరదలు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను ఓ మహిళ కారులో సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని పత్రికల్లో  చదివినప్పుడు నాకూ కారు డ్రైవింగ్ వస్తే యెంత బాగుండుననిపించింది. అందుకే లెబనాన్ కు వెళ్లి దాన్ని సంపాదించుకున్నానుఅని మోనా హేజాజీ అనే సౌదీ స్త్రీని ఉటంకిస్తూ రియాద్ న్యూస్  పేర్కొన్నది.  
రాత్రివేళల్లో తాను కారు నడుపుతున్న దృశ్యాలను అరీజ్ ఆల్ ఖల్డీ అనే మహిళ  ఇంటర్నెట్ లో పెట్టింది. దాన్ని చూసయినా మరికొందరు మహిళలు స్పూర్తి పొందుతారేమో అన్నది ఆవిడ ఆకాంక్ష.
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆవిడ ఆకాంక్ష నెరవేరడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు వేచివుండాలో!)
  
(08-03-2012)