28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 5


కన్నుకొట్టని కరెంటు దీపాలు
ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం. అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా. ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులు, బస్సులు, ట్రాములు, మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్ సర్కస్ డేరాలు చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశఖ్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి పులి పంజా విసురుతున్నా- ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు. ఎయిర్ కండిషన్ వ్యవస్తకు  మరమ్మతులు చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే వేడితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. దేశ ప్రజలను పొత్తిళ్ళలో పాపాయిలమాదిరిగా నులి వెచ్చగా ఉంచేందుకు అక్కడి పాలకులు చూపించిన శ్రద్ధాసక్తులకు ఇదో చక్కని తార్కాణం.


(హాయిగా తెలుగువార పత్రిక తిరగేస్తూ మా ఆవిడ నిర్మల)


 అలాగే రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమా, పెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన  తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది  యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని  ఒక సారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడంలాంటిది కాదు. ఇది సంవత్సరం అంతా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం.

దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!
దేవుడంటే వుండాల్సింది భక్తా? భయమా?


చిన్నతనంలో నాకు దేవుడంటే భయంతో కూడిన భక్తి. తెల్లవారుఝామున లేచి స్నానం చేసి బెజవాడ గవర్నర్ పేట శివాలయం వీధిలో వున్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి విబూది పట్టీలు పెట్టుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చేవాళ్ళం. అదేమిటో బడికి వెళ్ళిన తరువాత కూడా నుదిటిమీద విబూది రేఖలు అలాగే చెదరకుండా వుండేవి. ఇప్పట్లా గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టడం, హుండీలో డబ్బులు వేయడం ఎరగం. ఆ రోజుల్లో గుళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా వుండేవి. కాసేపు కూర్చోవాలని అనిపించేది.
ఇళ్ళల్లో కూడా ఇప్పటిమాదిరిగా విడిగా పూజ గదులు వుండేవి కావు, దేవుడి గూళ్ళు తప్ప. దేవుళ్ళందరూ గూటికే పరిమితం. అక్కడే గోడమీద పసుపూ సున్నం  కలిపి ఎర్రగా తిరుపతి వెంకన్న నామాల పట్టెడ వుండేది. ఇంటిల్లిపాదీ అక్కడే నిలబడి దణ్ణం పెట్టుకునేవారు. స్నానం చేసి దణ్ణం పెట్టుకోవడం మినహా ఇక ఎలాటి నియమాలు వుండేవి కావు. నాకు తెలిసి అది భక్తి. ఇప్పుడు పూజ గదుల్లో దేవుడి పట్ల భక్తి కంటే భయం ఎక్కువ కనిపిస్తోంది.
తరవాత్తరవాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మనుషుల  మనస్తత్వాల్లో మార్పులు రావడం మొదలయింది. ‘దేవుడు లేదు’ అనే గోరాగారి ప్రభావం.(దేవుడు లేడు అనేవారు కాదు, ఎందుకంటే ఆయన దృష్టిలో దేవుడే లేడు కనుక ఆయన మగో ఆడో అనవసరం అనుకుని  ‘లేదు’ అని అంటుండేవారు. సరే! ఆయన మరణించిన తరువాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఆయనే దేవుడు అనుకోండి. నిజానికి దేవుళ్ళు ఇలానే పుడతారేమో).
‘తెలుగునాట భక్తి రసం వరదలుగా పారుతోంది’ వంటి రచనల స్పూర్తి.
దేవుణ్ణి విమర్శిస్తే నలుగురిలో పెరుగుతున్న గౌరవం.
మొత్తానికి ఏమయితేనేం దేవుడు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు. (ఇదీ ఒక భ్రమే! ఇందుగలడందులేడనేవాడు దూరం కావడం ఏమిటి? దూరం చేసుకోవడం ఏమిటి?)
తోటివాళ్ళు, సాటివాళ్ళు సావాసగాళ్ళు చాలామంది అదేబాటన వెడుతూ సంఘంలో మర్యాద,మన్నన పొందడం చూసి దేవుడికి మరింత దూరం జరిగాను. (ఈ నాస్తికులలో  చాలామంది దేవుడ్ని తమ బాగుకోసమే ఉపయోగించుకున్నారనీ, సాధారణ ఆస్తికులకంటే ఎక్కువగా దేవుడ్ని నమ్ముతారనీ చాలాకాలం తరువాత తెలిసింది). పెళ్లి వేడుకలకు స్వస్తిచెప్పాను. పిల్లలకు బాలసారలు చేసి పేర్లు పెట్టలేదు. మా పెద్ద పిల్లవాడు కడుపులో వున్నప్పుడు సూర్య గ్రహణం వస్తే, అప్పట్లో వున్న నమ్మకాలను కాదని  మా ఆవిడను చీకటి గదిలో పడుకోనివ్వలేదు. పైగా పిండి కలిపి రొట్టెలు చేస్తే, అవకరం కలిగిన  పిల్లలు పుడతారని భయపెట్టే జనం మధ్య సొంత ప్రయోగాలు ధైర్యంగా చేసాను. మా ఆవిడ సహకారం లేకపోతే ఇవి సాధ్యమయ్యే పనులు కాదు.
నా తరహా తీరూ చూసి మా వాళ్లల్లోనే చాలామంది నాకు నాస్తికుడనే ముద్ర వేసారు. పూజలు, పునస్కారాలతో దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటున్నామన్నది నా ఉద్దేశ్యం. భక్త కన్నప్ప నాకాదర్శం. కానీ నా గోడు వినేవాళ్ళెవ్వరు ఆ దేవుడు తప్ప.  
సరే! దేవుళ్ళ గురించి తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆలోచించాలి అనే స్పృహ కలిగించింది మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు.  గోరాగారిని పరిచయం చేసిందీ ఆయనే. అనేక పరిశోధనలు చేసి నారసింహతత్వాన్ని బోధించింది ఆయనే. సమర్ధుడు కనుక ఈ ద్వంద్వ ప్రకృతిలో ఆయన నెగ్గుకు రాగలిగాడు. నేను కొట్టుకు పోయాను.
అయితే ఈ క్రమంలో సాగుతూ వచ్చిన సంభాషణల్లో, వాద ప్రతివాదాలలో అనేక ఆసక్తికర విషయాలు బోధపడుతూ వచ్చాయి. దేవుడ్ని నమ్మిన వారు, నమ్మని వారు కూడా తెలుసుకోదగ్గ సంగతులవి.
గుడిలో ఏముందీ?
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం గుడిలో వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్నాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు,  అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. (09-01-2013) 

ప్రశ్నోపనిషత్

ప్రశ్నోపనిషత్ 
“నాయనలారా… నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానము చెప్పుడి…”
“అటులనే”
“2006 తరవాత ఏమి వచ్చును?”
“2007 వచ్చును”
“కరెక్ట్‌ ఆన్సర్‌! మీరో కొవ్వత్తి గెలుచుకున్నారు. బైదిబై… ఇంత టఫ్‌ ప్రశ్నకి అంత ఈజీ సమాధానం చెప్పావంటే… నాకు భలే ముచ్చటేస్తోంది. నా పదహారో ఏడు వరకు నా పేరు కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయే వాణ్ణి. కాబట్టి… మీరింత చిన్న వయసులో ఎంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పినా నాకు పిచ్చిపిచ్చిగా ఆనందం కలుగుతుంది. వెర్రివెర్రిగా ఆశ్చర్యం వేస్తుంది.
తరవాతి ప్రశ్నలు చాలా కష్టం… రెడీ అయ్‌ ఉండండి… ఈసారి నేను వరసగా పది ప్రశ్నలు అడుగుతాను. ఠకీఠకీమని సమాధానం చెప్పాలి.”
“ఓకే. మేం రెడీ”
“దానము వల్ల ఏమి పుట్టును…?”
“పుణ్యము పుట్టును”
“వాగ్దానము వల్ల ఏమి పుట్టును?”
“అధికారము పుట్టును”
“వాగ్దానము తప్పినచో ఏమి పుట్టును?”
“ఆందోళన పుట్టును”
“ఆందోళన ఎవరికి పుట్టును?”
“అధికారమున ఉన్నవారికి పుట్టును”
“ఆందోళన ఎవరివల్ల పుట్టును?”
“ప్రజాగ్రహము వల్ల పుట్టును”
“ప్రజాగ్రహము ఎందులకు పుట్టును?”
“విద్యుక్త ధర్మమును వీడినందులకు పుట్టును”
“ఉచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“ఉచితముగా అధికారము పుట్టును”
“అనుచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“రైతుల గుండెలయందు మంట పుట్టును”
“మంట వల్ల ప్రభుత్వమునకు ఏమి పుట్టును?”
“సెగ పుట్టును”
“అప్పుడు ప్రభుత్వమునకు ఏమి ఆలోచన పుట్టును?”
“చేతులెత్తు ఆలోచనలు మెండుగా పుట్టును”
“ఓ సెభాష్‌. మీరు రెండు టార్చి లైట్లు, ఒక చార్జింగ్‌ లాంతర్‌ గెలుచుకున్నారు. తరవాతి రౌండ్‌లోకి వెళ్ళేముందు… కాసేపు కరెంట్‌ కట్‌”
(శ్రీ వింజమూరి వెంకట అప్పారావు, శ్రీ జీ ఎస్ నవీన్ల సౌజన్యంతో -)

పాతికేళ్ళక్రితం మాస్కో - 4


మంచు కాలం 
మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.
ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే'
ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి. 


(ఓ వేసవి సాయంత్రం మాస్కో వీధిలో మా కుటుంబం) 


ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే ఉంచేసి , మెట్రో రైళ్ళ పయినే రాకపోకలు సాగిస్తుంటారు. 

అదిగో నవలోకం

భూగర్భంలో కొన్ని వందల అడుగుల దిగువన నిర్మించిన ఒక అద్భుత నిర్మాణం 'మాస్కో మెట్రో'. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మెట్రో రైళ్ళు - తెల్లవారు ఝామునుంచి అర్దరాత్రివరకు నిరంతరం సంచరిస్తూ లక్షలమంది ప్రయాణీకులను గమ్యాలకు చేరవేస్తుంటాయి. చిత్రమేమిటంటే- నేలపైన, రోడ్డుపక్కన మెట్రో స్టేషన్ వున్నచోట 'ఎం' అనే అక్షరం రాసిన గుర్తు మాత్రమే వుంటుంది. ('ఎం' అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో మాదిరిగానే రష్యన్లోకూడా రాస్తారు) అక్కడనుంచి భూగర్భంలోని స్టేషన్ కు చేరడానికి ఎస్కలేటర్లు వుంటాయి . అయిదు కోపెక్కుల (రష్యన్లకు మన అయిదు పైసలతో సమానం) నాణెం అక్కడి మిషన్లో వేయగానే ఎస్కలేటర్లలోకి వెళ్ళే ద్వారం ఆటోమాటిక్ గా తెరుచుకుంటుంది.
 
ఒక్కసారి అయిదు పైసలు వేసి ఏదయినా ఒక మెట్రో లోకి ప్రవేశించామంటే చాలు, దానితో మాస్కో నగరం భూగర్భంలో నిర్మించిన సుమారు నూట నలభయి స్టేషన్ లకు యెంత దూరమయినా, ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు.
 ఒక స్టేషన్ కు మరో స్టేషన్ కు పోలిక లేకుండా విభిన్న ఆకృతులతో, సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వాటిని నిర్మించిన విధానం అపూర్వం. భూ ఉపరితలానికి వందల అడుగుల దిగువన అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతి లో పట్టపగలులా మెరిసిపోయే మాస్కో మెట్రో స్టేషన్ లు మయసభలను మరిపిస్తూ మానవ నిర్మిత కట్టడాల ప్రశస్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నయా అన్నట్టుగా వుంటాయి.

 
అంత లోతున డజన్లకొద్దీ నిర్మించిన సొరంగ మార్గాలలో మెట్రో రైళ్ళు మెరుపు వేగంతో పరుగులుతీస్తుంటాయి. రైలు  వెళ్లి పోయిందే అన్న బెంగ లేకుండా ఒక దానివెంట మరొకటి నిమిషాల వ్యవధిలో రాకపోకలు సాగిస్తుంటాయి.
 రైలు  ప్లాటు ఫారం మీదకు రాగానే తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకుంటాయి. ప్రయాణీకులు దిగినదాకా ఆగి ఎక్కాల్సిన వాళ్ళు తోపులాటలు లేకుండా ఎక్కుతుంటారు. ఈ రైలు తప్పిపోతే ఇలా అనే భయం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. మరో నిమిషంలో మరో రైలు వస్తుందనే భరోసా వారికి ఆ ధైర్యాన్ని ఇస్తోంది. ఒకసారి పిల్లలతో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎక్కగలిగారు కానీ నేనూ మా ఆవిడా ఎక్కేలోగానే రైలు కదిలింది. చిన్నపిల్లలయినా ఏమాత్రం కంగారు పడకుండా పక్క స్టేషన్ లో దిగిపోయి మా కోసం ఎదురుచూశారు. వెనువెంటనే వచ్చిన మరో మెట్రో రైలు లో వెళ్లి మేము వారిని కలుసుకున్నాము. మెట్రో గురించిన మరో విశేషం ఏమిటంటే - సమయ పాలన. నేను అక్కడవున్న అయిదేళ్ళు ఒక విషయం గమనించాను. మెట్రోలో మా ఆఫీసు కు వెళ్ళడానికి పద్నాలుగు నిమిషాలు పట్టేది. ఏరోజునా అరనిమిషం తేడా కూడా వచ్చేది కాదు. అంత ఖచ్చితంగా రైళ్ళు నడిచేవి. 

(మాస్కో 'గోంగూర' గురించి మరోసారి) 

27, ఫిబ్రవరి 2014, గురువారం

పాతికేళ్ళక్రితం మాస్కో - 3


రష్యన్ మహిళ నోట తెలుగు మాట
మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను  పరిచయం చేసుకుంది. 'శ్రీనివాసరావు గారూ! మీ ఆగమనం కోసం ఎన్నో మాసాలుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము' అంటూ ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము. మాస్కో వాతావరణానికి సరిపడే ఉన్ని దుస్తులు, కాలిజోళ్ళు మా అందరికి కొనిపెట్టమని ఆఫీసు వాళ్లు డబ్బులిచ్చి మరీ ఆమెను పంపారన్న సంగతి తెలుసుకుని మరింత సంబరపడ్డాము. లిదా తీసుకెళ్ళి కొనిపెట్టిన ఉన్ని దుస్తులు వేసుకున్నతరవాత మా రూపు రేఖా విలాసాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అవి ధరించి ఉన్ని టోపీలు పెట్టుకుంటే ఆడెవరో, మగెవరో ఒక పట్టాన గుర్తు పట్టడం కష్టం. అక్కడి ఆహార్యం విచిత్రంగా వుంటుంది. ఎవరయినా ముందు ఉన్నితో చేసిన 'ఇన్నర్లు' వేసుకోవాలి. వాటిపై పాంటూ షర్టూ కోటూ వేసుకుని 'ఫర్' తో చేసిన లాంగ్ కోటు ధరించాలి. మామూలు బూట్లు పనికిరావు. 'ఫర్' బూట్లు, 'ఫర్' సాక్స్ లేకపోతె ఇంతేసంగతులు.
 అయితే ఈ దసరా వేషం ఇంటినుంచి ఆఫీసుకు చేరేవరకే. అక్కడికి వెళ్ళిన తరవాత ఈ చలి దుస్తులన్నీ అక్కడి ప్రత్యేక కౌంటర్లలో ఒప్పగించి, పాంటూ షర్టుతో ఎంచక్కా తిరగగలిగేలా ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు చేశారు. ఇక రేడియో మాస్కో విభాగంలో నా సహచరులు - ముందు చెప్పిన లిదాతో పాటు, విక్టర్, గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు - నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి తెలియదు. వాళ్ళతో నా సంభాషణ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అవరోధం కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటె, పెళ్ళయి పదహారేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట. 
క్రమంగా కొత్త ప్రదేశంలో- కొత్త జీవితానికి, కొత్త వాతావరణానికీ అలవాటు పడడం ప్రారంభించాము. మా పిల్లలు, సందీప్, సంతోష్- ఇద్దర్నీ ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా వున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ - కేంద్రీయ విద్యాలయ్ లో చేర్పించాము. రష్యన్ స్కూళ్ళలో మధ్యాన్న భోజనం, పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, ఇండియన్ స్కూల్లో ఇందుకు విరుద్ధం. అయినా, రష్యన్ మీడియంలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సివచ్చింది.
 అక్కడాఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు - రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక - ఆ రోజుల్లో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి (తదనంతర
కాలంలో శర్మగారు ప్రసార భారతికి సీ.ఈ.ఓ.గా పనిచేసారు.) ఫోన్ చేసి విషయం వివరించాను.
 ఆయన కూల్ గా విని - రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కాని, మా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది. ఆ స్కూలు చదువు వాళ్ళిద్దరి జీవితాల్లో పెనుమార్పు తీసుకురాగలదని కలలో కూడా ఊహించలేదు.


(ఇండియన్ స్కూల్ ప్రోగ్రాం లో సందీప్ భండారు)

.
ఎదుగుతున్న దశలో, ఓ విదేశంలో - వాళ్లకు లభించిన ఎక్స్పోజర్   భవిష్యత్ లో యెంతో ఉపకరించింది. ముందు ఇబ్బంది పెట్టిన గంగల్  గారు కూడా పిల్లల చదువు విషయంలో తీసుకున్న శ్రద్ధ మరచిపోలేనిది. అలాగే శర్మ గారు. అడగకనే వరాలిచ్చే దేవుడిగా ప్రసార భారతిలో సిబ్బంది మన్ననలందుకున్నారు. 

 (ఉందిలే 'మంచు కాలంముందూ ముందునా)

పాతికేళ్ళక్రితం మాస్కో - 2

ఇంగువ తెచ్చిన తంటా
  
అక్టోబర్ - 31, 1987 - అంటే శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజున - ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ ' ఏరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఏమీ కనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని ' షెర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వెజిటేరియన్లకు ఏమీ దొరకవు, ఉప్పూ ,పాలూ తప్ప అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము- లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

ఇల్లా? హోటలా?

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది. 
మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. కారులో లగేజి ఎక్కించిన తరవాత - కారు డోరు తెరిచే వుంచి - ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు - మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి. 
మంచు కురిసే వేళలో 
మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్లు  వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల - పగలో రాత్రో తెలియని అయోమయావస్థలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది. 


(మా పిల్లలు సందీప్, సంతోష్)

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేసించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి - సెలవు తీసుకున్నాడు సెర్గీ మహాశయుడు.  లోపలకు వెళ్లి చూస్తె కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు,దిండ్లు, దుప్పట్లు, కలర్ టీవీ (అప్పట్లో మనదేశంలో అదో లగ్జరీ), నాలుగు బర్నర్ల స్టవ్, గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది.ఆ పూటకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము. 
 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము. 
 'రష్యన్ మహిళ నోట తెలుగు మాట' వినడానికి కొంత వ్యవధానం)


26, ఫిబ్రవరి 2014, బుధవారం

VALID UPTO 2099

సీ.జీ.హెచ్.ఎస్.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సురపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)  
1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే విదేశాల్లో ఉద్యోగం కనుక ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాలేదు. ఆ తరువాత ఆమెకే  మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్,  గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ  చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు దొరకలేదు. ఈ మధ్య డీడీ లో నా సీనియర్ సహోద్యోగి కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట  పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని ఇచ్చిన  కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న  గర్వంతో బయట పడ్డాను.


(Valid upto 2099)

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే ఇప్పటికే 68 ఏళ్ళు నిండిన నేను  మరో 85  ఏళ్ళు ఈ కార్డు వాడుకోవచ్చు అని. ఆరోగ్య  సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను. 

పాతికేళ్ళ క్రితం మాస్కో -1

(ఇంతవరకు ఈ రచన చదవనివారి కోసం)
జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం  చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు. గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం అయినప్పటికీఅనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకూ జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే- ఇంచుమించు రెండున్నర  దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు అయిదేళ్ళ అనుభవాలను అక్షర బద్దం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.

ఏకధృవ ప్రపంచ వ్యవస్థను ప్రశ్నిస్తూ- లెనిన్  నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ- ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్  యూనియన్కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని -  'మార్పు చూసిన కళ్ళుఅనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన  కాంక్షను  ఎన్నో ఏళ్ళుగా అదిమిపట్టుకోవాల్సి వచ్చింది.  దీనికి కారణాలు అనేకం. 
ఆ నాడు నేను చూసింది మరో ప్రపంచం. 
అప్పటికీ యిప్పటికీ యెంతో తేడా.


మాస్కో అనుభవాలు గురించి నేను రాసిన 'మార్పు చూసిన కళ్ళు' పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య ఆవిష్కరించిన సందర్భంలో వార్తా కధనం)

 రోజుల్లో 'అలా వుండేదియిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలు'  చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. 
నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ   రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలు మోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయినగౌరవ ప్రదమయినతృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంతచేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతొ నా అనుభవాలను అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సివచ్చింది. 
అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలుపేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేకపోతున్నామేమో అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
 ( రష్యన్ లో  'దస్వి దానియా' అంటే 'మళ్ళీ కలుద్దాం' అని అర్ధం.)