25, మే 2023, గురువారం

ఎం.వి.ఎస్. ప్రసాద్ (ఐ.ఏ.ఎస్.) ఇక లేరు

 

గత మార్చి పదకొండో తేదీన ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు ఫేస్ బుక్ లో ఈ కింది కవిత రాశారు. అది చదివిన మావంటివాళ్ళం నివ్వెరపోయాము. ఏమిటి సార్ ఇలా రాసారు అని అడిగాము కూడా. కానీ ఆయన గారి దగ్గరనుంచి సమాధానం లేదు.  అది ఇలా సాగింది.  


“అలసిపోయాను ధైర్యం పూర్తిగా మరుగునపడింది 

అధఃపాతాళంకి దిగజారిన ఆలోచనా స్రవంతి 

జీవితంలో బుస్సుమని పొంగి పొర్లిన ధారాపాతం 

నేలపాలయి బురద బురద చేసి కకావికలైంది 

బురదపాలైన కాళ్ళు కడుగుదామంటే నీరింకిపాయే 

ఎన్నాళ్లీ ఇష్టంలేని ప్రయాణం ఇక ఆగిపోతే బాగుండు”

చివరి వాక్యం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏమిటి ఈ నిర్వేదం అనిపించింది.

ఆయన రాసుకున్నట్టే  ఆయనకు ఇష్టం లేని ప్రయాణం ఈరోజు అంటే  మే 25 మధ్యాన్నం  నిజంగానే ఆగిపోయింది.

1975 లో నేను ఆలిండియా రేడియోలో చేరినప్పుడు నాకు తారసపడిన మొదటి ప్రభుత్వ అధికారి ఏమ్వీఎస్ గారు. అప్పుడు ఆయన SFDA (Small Farmers Development Agency) కి ఆయన అధికారి. ఎమర్జెన్సీ లో కావాల్సినవి డెవలప్ మెంట్ వార్తలే కాబట్టి ఆయన్ని కలిసాను. అలా అప్పుడు ఏర్పడ్డ  పరిచయం ఇప్పటిదాకా కొనసాగింది. ఆయన ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చాలా కీలకమైన పదవులు నిర్వహించారు. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, జీఏడి సెక్రెటరి  ఇలా ఎన్నో. కానీ ఎక్కడా తన మంచి పేరు చెడగొట్టుకోలేదు. రిటైర్ అయిన తర్వాత తన ఇంటి పేరుతొ మేళ్లచెరువు ఫౌందేసన్ స్థాపించి అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన స్వగ్రామం కూడా మేళ్లచెరువు (ప్రకాశం జిల్లా). కనిపినప్పుడు లేదా ఫోన్ చేసినప్పుడు మా దేవాలయం ఒకసారి వచ్చి చూడండి అనేవారు. ఇక అలాంటి ఆహ్వానం ఆయన నుంచి రాదు.  

Madhavi Kolli కొల్లి మాధవి గారు కొంతసేపటి క్రితం ఫేస్ బుక్ లో ఈ సమాచారం ఇచ్చినప్పుడు నా సమాధానం UNBELIEVABLE. గబాగబా అన్ని ఛానల్స్ తిప్పాను. ఎక్కడా ఈ వార్త జాడలేదు.  

చాలా వార్తలు తర్వాత నిజం కాదని  తేలిపోతాయి. కానీ ఇది అలా కాదే! 

బహుశా ఎల్లుండి అంత్యక్రియలు జరగొచ్చని ఏమ్వీఎస్ గారి అబ్బాయి ద్వారా తెలిసిందని  ఇప్పుడే పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణా రావు  మెసేజ్ పెట్టాడు.



(Shri M>V>S>Prasad, IAS)


(25-05-2023)


20, మే 2023, శనివారం

ఒకటోసారి..రెండోస్సారి.. మ్మూడోస్సారి... భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 20-05-2023, Saturday)

 

1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.

ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.

జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందనిఅందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనిఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.

ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులుప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.

అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.

భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.

సాధారణంగా అవినీతిఅక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం. పిచ్చి పిచ్చిగా డబ్బు పోగేసుకున్న  ఖామందులవాళ్ళు  నల్ల డబ్బు దాచుకునే మార్గాలు వేరే ఉంటాయని ఆయన మనోగతం కావచ్చు.

నల్ల డబ్బును సూట్ కేసుల్లోదిండ్లకవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.

ఇది జరిగి  45 ఏళ్ళు అవుతోంది.

2016, నవంబరు,8, న్యూ ఢిల్లీ

ఆ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్ ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీసరిహద్దులలో తీవ్రత గురించిన అంశం కానీ ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియోదూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు సయితం సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారనిఅప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. ఈ విషయంలో గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీచాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.

నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనిరిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడంఆమోదించడంఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.

ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనేదాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాముకష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.

గతంలో నాటి జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత పెద్ద నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.

ఇప్పుడు, అంటే తాజాగా కొద్ది సేపటి క్రితమే  మ్మూడో స్సారి.

రెండువేల రూపాయల నోట్లకు మంగళం!

కాకపొతే ప్రకటన బాధ్యత ఈసారి రిజర్వ్ బ్యాంక్ కు అప్పగించారు.

NOTE: Courtesy Image Owner)



19-05-2023

 

16, మే 2023, మంగళవారం

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా! – భండారు శ్రీనివాసరావు

 రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంవత్సరం తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు తెర తీస్తున్నాయి.

రాజకీయ పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే. అది విజయం వైపు పయనం.

2019లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాజయం పాలయిన టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు  కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు.  ఈ లక్ష్యసాధన కోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు  పూర్తిగా మారిపోతాయని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయనడానికి ఏపీలో  రోజురోజుకి మారుతున్న పరిణామాలే   మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.

నేటి రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు, ఈనాడు అవసరాల పునాదులపై నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.

పాలకపక్షం వైసీపీ పూర్తిగా బలహీన పడిందని  నమ్ముతూ  తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.  

రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి గెలిపిస్తారు.

రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. 

బ్రహ్మాండంగా విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే, అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు. ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు  కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా, కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి ఆ సీటు కోసం పట్టు పడతాయి.

1982 ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120  సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్  80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి  60 సీట్లు అడిగారు.  20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్ దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగి  ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా  కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే,  ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టిన పట్టు, రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది.

ఇక ప్రస్తుతానికి వస్తే.       

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం.  ఈసారి ఏదీ ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం, ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా పోతాయి.

ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి, అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.

పాలకపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు,  ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట.  చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి.

రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు  ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.

అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.

ఇది నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం ఉన్నట్టు కూడా లేదు.

Below Photo: Courtesy Google Images



14, మే 2023, ఆదివారం

సాధనాత్ సాధ్యతే సర్వమ్ – భండారు శ్రీనివాసరావు

 కొందరు అంతే! తలపెట్టిన పని చేసుకుంటూ పోతుంటారు. ప్రచారం వచ్చిందా! గుర్తింపు దొరికిందా!  ఇలాంటివన్నీ వాళ్లకి అత్యల్ప స్వల్ప విషయాలు.

ఈరోజు కళ్ళతో చూసిన తర్వాత నిజమే అనిపించింది. ఈ మధ్యాన్నం జ్వాలాతో కలిసి అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించిన ఉచిత అవధాన శిక్షణాకార్యక్రమం ముగింపు సమావేశానికి వెళ్లాను. నటీనటులుగా శిక్షణ ఇస్తాము అంటే వేలు తగలేసి వెళ్ళేవాళ్ళను చూశాను. టీవీ యాంకర్ గా, రేడియో జాకీగా శిక్షణ ఇస్తామన్నా ఎగబడి వెళ్ళే వాళ్ళను చూశాను. కానీ ఇదేమిటి అవధానంలో శిక్షణ అంటే పిల్లలు సరే, వాళ్ళ తలితండ్రులు కూడా ప్రోత్సహించడం వింతగా అనిపించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారిలో పన్నెండు ఏళ్ళ అమ్మాయి నుంచి యాభయ్ ఏళ్ళ వయసు కలిగిన పెద్ద వాళ్ళు వుండడం మరింత వింతగా తోచింది. అంతేనా! ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువకుడు కూడా అవధాన శిక్షణ పొందడం చూసిన తర్వాత గొప్పగా కూడా అనిపించింది.

దీనికి జవాబు ప్రధాన అతిధిగా వచ్చిన ప్రముఖ అవధాని మేడసాని మోహన్ గారి ఉపన్యాసంలో దొరికింది. అవధానంలో ముందు అలవారచుకోవాల్సింది ఏకాగ్రత. ప్రతి విద్యార్ధికి కావాల్సింది కూడా ఇదే. బయట విద్యాసంష్టలలో దొరకంది కూడా ఇదే. అవధాన శిక్షణ ద్వారా ధారణ శక్తి అలవడుతుంది. దీని ద్వారా చదివిన విషయాన్ని చక్కగా గ్రహించడం, గ్రహించిన దాన్ని గుర్తు పెట్టుకోవడం, అవసరమైన సందర్భాలలో కొన్ని విషయాలను సందర్భోచితంగా వాడడం, తద్వారా  బుద్దికి పదును పెట్టడం జరుగుతుంది. ఏ విద్యార్ధికి అయినా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? ప్రభుత్వాలు చొరవతీసుకుని అవధాన ప్రక్రియను చిన్నతరగతుల నుంచే ఒక పాఠ్యా౦శ౦గా  చేరిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. ఆన్నింటికంటే ముఖ్యమైనది ప్రపంచ భాషల్లో ఒక్క తెలుగుకే సొంతం అయిన పద్యాన్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలంటే అవధాన ప్రక్రియ ఒక్కటే మార్గం. ఆధునిక చదువులకు కూడా అక్కరకు వచ్చే అవధానానికి అవసరమైంది ఏకాగ్రత. ఏకాగ్రతకు కావాల్సింది సాధనం. సాధనం వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు.

అవధాన విద్యా వికాస పరిషత్ కు కర్తా కర్మా క్రియ అయిన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు కూడా బహుశా ఈ సాధనం అనే మార్గాన్నే నమ్ముకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అవధాన విద్యను ప్రదర్శించే స్థాయికి చేరిన నాడు, అవధానం మరింతగా ప్రజలకు చేరువ అవుతుంది. ప్రాచుర్యం పెరుగుతుంది.

దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి అనేక పురస్కారాలు పొందిన మేడసాని మోహన్ గారు అవధాన ప్రదర్శనలో అవధాని ఎదుర్కునే ఇబ్బందులను సోదాహరణ పూర్వకంగా వివరించారు. దత్తపది, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం మొదలయిన అవధాన ప్రక్రియల ద్వారా మెదడు ఎలా పదునెక్కుతుందో  విశదం చేశారు. గండపెండేరాలు, కీర్తి కిరీటాల దశ దాటి వచ్చానని చెబుతూ, జ్వాలా నరసింహారావు తనకు బహుకరించిన రామాయణ గ్రంధమే పెద్ద సత్కారంగా భావిస్తానని వినమ్ర పూర్వకంగా చెప్పారు.  

ఒక్కోరోజు ఇలా గడుస్తుంది. ఇలా గడిచిన రోజు, మరో రోజును  ఉత్సాహంగా గడపడానికి ప్రేరణ ఇస్తుంది.






(14-05-2023)

10, మే 2023, బుధవారం

‘స్వ’గతం

 

ఈ స్వగతం నాది కాదు, మాజీ ఐజీ, సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామా రావు గారిది.

అట్ట చాలా అట్టహాసంగా వుంది. చాలా ఖరీదైన ఆర్ట్ పేపరు. ముఖచిత్రం మీద కొలువుతీరిన వారందరూ సుప్రసిద్ధులు, మాజీప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పత్రికారచయితలు, ఆధ్యాత్మిక వేత్తలు, సినీ ప్రముఖులు. అంటే అర్ధం అయిపోతుంది, రచయిత స్వగతం ఎవరి గురించో. పోలీసు అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో పనిచేసిన అనుభవాల్లోని గతం అన్నమాట. అన్నట్టు తిరుపతి వెంకన్నతో అనుభవాలు కూడా వున్నాయి సుమా.

పోలీసు అధికారిగా ఆయన లాఠీ పదును అయినా, రచయితగా ఆయన కలం చాలా మృదువైనది. అంచేత నొప్పించక, తానొవ్వక తరహాలోనే ఈ అనుభవాల పరంపర అక్షరరూపం ధరించింది. ఇప్పుడే చేతికి అందితే అప్పుడే చదివేశారా అనేదానికి జవాబు వుంది. ఈ వ్యాసాలు అన్నీ ఇటీవలి కాలంలోనే ఆంధ్రప్రభ దినపత్రికలో వారం వారం  స్వగతం శీర్షిక రూపంలో వెలువడ్డాయి. ఆ విధంగా నా తొలి రీడింగ్ అయిపోయింది అన్నమాట.  

పుస్తకం ఎవరికైనా నచ్చుతుంది అని ఘంటా పదంగా చెప్పడానికి కూడా కారణాలు వున్నాయి. రావులపాటి వారి శైలి వాటిల్లో ముఖ్యమైనది.  మరోటి పుస్తకం సైజు. చక్కనమ్మ అయితే చిక్కినా అందమే. నూటపాతిక పేజీల్లో స్వగతం పొందికగా అమిరింది. కూర్చుని, పడుకుని, మాట్లాడుతూ, ముచ్చట్లు చెబుతూ చదువుకునేలా వుంది.

ఒకరకంగా ఇది ఆయన బర్త్ డే బుక్. నిన్న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యుల నడుమ ఎంచక్కా స్వయం ఆవిష్కరణ చేసుకున్న పుస్తకం ఇది.

(సాహితి ప్రచురణలు, వెల : రు. 90/-)

 

 

   




4, మే 2023, గురువారం

విశ్వ జ్ఞాన ధ్రువ – భండారు శ్రీఎనివాసరావు

 ‘దూరాభారం అనుకోకుండా అంత దూరం నుంచి మన ఇంటికి వచ్చి పిలిచి వెళ్లినప్పుడు, ఆ శుభ కార్యానికి వెళ్లి రావడానికి  మీనమేషాలు లెక్క పెడతారేమిటి చోద్యం కాకపోతే అంటుండేది మా ఆవిడ. చిన్న కుటుంబం నుంచి వచ్చి, నా పుణ్యమా అని అతి పెద్ద కుటుంబంలోకి వచ్చిపడింది. అంచేత కుటుంబాలలోని వాళ్ళు ఏదో వంకన కలుస్తూ వుండడం ఆమెకు చాలా సరదాగా, వేడుకగా అనిపించేది.

నిజానికి మాదొక పెద్ద కుటుంబం. పదకొండు మంది సంతానంలో అందరిలోకి చిన్నవాడిని. ముగ్గురు అన్నయ్యలు.  ఏడుగురు అక్కయ్యలు. మేనకోడళ్ళు ఓ యాభయ్ మంది. వాళ్ళ పెళ్లిళ్లలో పెళ్లి కూతురురిని బుట్టలో కూర్చోబెట్టి కళ్యాణ వేదికకు చేర్చే మేనమామ పాత్ర నాది. మొదట్లో ఈ పాత్ర పోషించడానికి తెగ ఉబలాట పడేవాడిని. ఫోటో ఆల్బంలో ఎవరున్నా లేకపోయినా మేనమామ ఫోటో  వుండి తీరాల్సిందే.  అయితే, ఎందుకో ఏమిటో, కాలం గడుస్తున్న కొద్దీ  పెళ్ళిళ్ళ పేరిట ఇంత ఖర్చు, ఇంత శ్రమ  అవసరమా అనే ధోరణిలో పడిపోయాను. దరిమిలా పెళ్లి వద్దు పెళ్ళాం కావాలి అనే నినాదం వంటబట్టించుకుని చేసుకున్న పెళ్లి కాని పెళ్లి మాది. ఉభయ పక్షాలు మా ప్రేమ వివాహానికి ఒప్పుకున్నప్పటికీ పెళ్లి తంతుకు నేను  ససేమిరా అన్నాను. దాంతో నా పెళ్లి నేను పట్టుబట్టినట్టే జరిగింది. అయితే ఆ తర్వాత ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్ళడానికి సంకోచం. నా పెళ్ళికి ఎవరినీ  పిలవకుండా వాళ్ళు పిలిచే పెళ్లిళ్లకు పొతే ఏం బాగుంటుంది అని దాటవేస్తూ వచ్చాను. కానీ ఎంతయినా ఇళ్ళల్లో భార్య మాటే చివరాఖరు మాట అనే వాస్తవం  త్వరలోనే తెలిసి వచ్చింది. పెళ్ళికి ముందు నా మాటే ఆమెకు వేద వాక్కు. అయిన తర్వాత ఆవిడ మాట నాకు నాలుగు వేదాల వాక్కు.

ఈ రోజు నా మేనకోడలి మనుమడి ఉపనయనం. భార్యా భర్తలు ఇంటికి వచ్చి పిలిచి వెళ్ళారు. ‘అమ్మ గట్టిగా చెప్పింది, ఎవర్ని పిలిచినా పిలవక పోయినా ఊళ్ళో వున్న నా మేనమామలు ఇద్దర్నీ పిలవమని. తప్పకుండా రా తాతయ్యా అన్నాడు. నేను వాడికి ఏమవుతానో, ఆ వావీవరస ఏమిటో  నాకే తెలియదు. తాతయ్యనే కాబోలు అనుకుని తలూపాను.

ఉదయమే మా అన్నయ్య రామచంద్రరావు గారు కారులో వచ్చి నన్ను వెంటబెట్టుకుని బాచుపల్లిలోని హిల్ కౌంటీకి తీసుకువెళ్ళారు. అదేమిటో చిత్రం హైదరాబాదులో ఉన్న చుట్టపక్కాలు అందరూ ఈ రోజు ఆ వేడుకలో కలిసారు. ఉపనయనాన్ని పెళ్ళిలో కలిపి చేయడం అనే కొత్త సాంప్రదాయం  ఎప్పుడో మొదలయింది. అలాంటిది తలితండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే వడుగు చేయాలని సంకల్పించడం, పిల్లలు బుద్దిగా అందుకు ఒప్పుకోవడం కొత్తగా వస్తున్న మార్పు అనిపిస్తోంది. మనుమడి ఉపనయనానికి వచ్చినందుకు నా మేనకోడలు విమల, వటువు తలితండ్రులు లక్ష్మి, దీపలు సంతోషించారు.

ఈ వేడుకలో నన్ను ఆకట్టుకున్నది ఏమిటంటే వడుగు జరిగింది అపార్ట్ మెంటులో అయినా, వాళ్ళ  గుమ్మం ముందు చిన్న తాటాకు పందిరి వేయడం.

విశ్వ జ్ఞాన ధ్రువ

పిల్లలకు చాలా కొత్త కొత్త పేర్లు పెడుతూ వుండడం విచిత్రమేమీ కాదు. అయితే విశ్వ జ్ఞాన ధ్రువ అనే పేరు విచిత్రంగానే కాదు చాలా  చక్కగా కూడా వుంది. నా మేనల్లుడు, చిన్నప్పటి నుంచి నాకు   మంచి దోస్తు కొలిపాక రాజేంద్ర ప్రసాద్ (రాజన్న) మనుమడు ఈ ధృవుడు. తలితండ్రులు సుస్మిత, గోకుల్ కోరి పెట్టుకున్న పేరు ఇది. ఈరోజు ఈ ధృవుడి ఉపనయనానికి వెళ్ళాము. చాలా శాస్త్రోక్తంగా చేశారు. ఈ చిన్నవాడి మరీ చిన్నతనం లండన్ లో గడిచింది. చిన్న చదువు అక్కడ పూర్తిచేసుకుని, పెద్ద చదువుల కోసం హైదరాబాదు రావడం చిత్రమే బహు చిత్రమే ఈ రోజుల్లో. ఇంత చక్కటి తెలుగు ఎలా మాట్లాడుతున్నావ్ అంటే మా అమ్ముమ్మ నేర్పింది అనేది ఆ చిరంజీవి జవాబు.

కరోన కాలంలో రాకపోకలు పూర్తిగా తెగిపోయిన అనేక మంది బంధువులను కుటుంబసమేతంగా కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది.


కింది ఫొటో: కుర్ర బ్రహ్మచారితో మా అన్నయ్య రామచంద్ర రావుగారు, నేను. 



 

(03/4-05-2023)