24, మే 2022, మంగళవారం

టీవీ ఛానళ్ళు, ప్రసారాల తీరుతెన్నులు – భండారు శ్రీనివాసరావు

 గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ లు ఏకచత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న కాలంలో, ప్రముఖ దినపత్రికల్లో వారానికోసారి వాటి కార్యక్రమాల మంచి చెడులను విశ్లేషిస్తూ చక్కటి వ్యాసాలు వచ్చేవి. కార్యక్రమాల మెరుగుదలకు తోడ్పడే మంచి సూచనలు అప్పుడప్పుడు వాటిల్లో తొంగిచూస్తుండేవి. కాకపోతే, వాటి నిర్వహణ యావత్తూ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగేది కనుక ఆ సూచనలను ఏమాత్రం ఖాతరు చేసాయన్నది చరిత్రకే ఎరుక. ఈలోగా ప్రభుత్వ మీడియా సంస్థలకు తమ పనిపాటల్లో ఓమేరకు స్వేచ్చ (ఫంక్షనల్ ఫ్రీడం) కల్పించే క్రమంలో వాటిని ‘ప్రసార భారతి’ గొడుగు కిందకు తేవడం జరిగింది. కానీ ఆ సరికే దేశంలో ప్రైవేటు రంగంలో టీవీ ఛానళ్ళ శకం మొదలవడంతో, వాటికి వున్న వెసులుబాట్లు ప్రసారభారతికి కొరవడడంతో, ఏ లక్ష్యం కోసం రేడియో, దూరదర్సన్ లకు స్వేచ్చ కల్పించారో ఆ ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరకుండా పోయింది. కొత్త ఛానళ్ళ ధగధగల ముందు పాత ఛానల్ వెలవెల బోయిన మాట వాస్తవం. ఈ పోటాపోటీ కాటాకుస్తీ పోటీల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దూరదర్సన్ ప్రసారాలు, ప్రస్తుతం వున్నాయంటే వున్నాయన్న చందంగా కొనసాగుతున్న భావన ప్రజల్లో ప్రబలుతోంది. కొత్తొక వింత మాదిరిగా సరికొత్త ఛానళ్ళు తామర తంపరగా పుట్టుకొచ్చి కొంగొత్త కార్యక్రమాలకు పురుడు పోస్తూ వీక్షకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటూ వుండడమే, ప్రైవేటు టీవీల రాకను మనసారా కోరుకున్న వారిని కూడా మధన పడేట్టు చేస్తోంది.

స్పర్ధ వల్ల విద్య పెరుగుతుందని చెప్పేవారు. అలాగే పోటీవల్ల నాణ్యత మెరుగు పడుతుందని కూడా అంటారు. సాంకేతికంగా నాణ్యత పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ కార్యక్రమాలలో ఆ విషయం ప్రస్పుటమవుతున్నదా అంటే చప్పున అవునని చెప్పలేని స్తితి. దీనికి ఆయా టీవీల యాజమాన్యాలను కూడా తప్పుపట్టలేని పరిస్తితి. వాణిజ్యపరంగా చూస్తే, టీవీల నిర్వహణ కూడా అలవికాని భారంగా పరిణమిస్తున్న రోజులివి. తియ్యనీటికి చేపలు ఎగబడే చందంగా ఈ రంగంలో ఏదో వుందన్న ఆశతో జర్నలిజంతో సంబంధం లేని పెట్టుబడుదారులు ఇందులో చేరడంతో విలువలకంటే పెట్టుబడుల పరిరక్షణ ప్రధానంగా మారిపోయింది. దీనికి తోడు రాజకీయాల రంగూ, రుచీ, వాసనా  కాఫీ డికాక్షన్ మాదిరిగా దిగిపోయి పరిస్థితులను మరింత దిగజార్చాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒకే టీవీ, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒకటో రెండో టీవీలు. (సొంతం కాకున్నా, సొంతంకంటే ఎక్కువగా మద్దతు ఇచ్చేవి)

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీటికి తోడు సోషల్ మీడియాలో ముసుగులు కప్పుకున్న తాలిబాన్ల వంటి కలం వీరులు, గళం ధీరులు.   

ఏదైనా మార్పు మంచిదే. మార్పును ఆహ్వానించాల్సిందే. ఈ క్రమంలో కొన్ని అగచాట్లు తప్పవు. మంచి చెడుల నడుమ ఘర్షణ తప్పదు. మురుగు నీరు సర్దుకుని, తేటనీరు బయట పడడానికి కొంత సమయం అవసరం. ఐతే, ఈ వ్యవధానం మరీ పెరుగుతూ పొతే, ఆశించిన ఫలితాలు అందడం కూడా ఆలస్యం అవుతుంది. మంచి మరుగునే వుండిపోయి, చెడు చెంతనే వుంటుంది.

ఆశాజీవులు కూడా ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.

కాకపోతే, ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే, పూర్వం దూరదర్శన్ కూడా ఇంతటి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం వచ్చాయి. కానీ, ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్ ఛానళ్ళకు మాత్రం విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం) కూడా ఇవ్వడం లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఈ ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు. అయినా ఇది కాదనలేని నిజం.

నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ, ‘లెస్ నాయిస్ చిల్డ్రన్, లెస్ నాయిస్ ప్లీజ్ ’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు, కాబట్టి ఆ చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది దానికి టీకా తాత్పర్యం.

ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతేరేటింగులను’ ఓపక్క కనిపెడుతూనే, జనం నాడినిపట్టుకునే కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా ఉపాయాలు ఉండకపోవు.

వాటిని గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి!

22, మే 2022, ఆదివారం

ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు


ఒక చమత్కారం గురించి చెప్పుకుందాం!
ఒకడు ఒక మైనర్ బాలికను పాశవికంగా బలాత్కరించి, అనుభవించి, శరీరాన్ని చిత్ర హింసలకు గురిచేసి, సాక్ష్యాలు దొరక్కుండా ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసి పారిపోయాడు.
పోలీసులు కష్టపడి రుజువులు సంపాదించి ముద్దాయిని పట్టుకుని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. బాలిక హత్యోదంతాన్ని టీవీల్లో చూసి రగిలిపోయిన సామాన్య జనం అతడికి మరణశిక్షే సరైన శిక్ష అని గగ్గోలు పెట్టారు. న్యాయమూర్తి కేసు పూర్వాపరాలను పరిశీలించి ముద్దాయికి ఉరి శిక్ష విధించారు. కాకపోతే ఇదంతా తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టింది. మధ్యలో మానవ హక్కుల సంఘాల వాళ్ళు, ఫీజు రాకపోయినా ఆ రాబడికి మించిన పేరు ప్రతిష్టలు సంచలన కేసులు చేసి గడించాలనే న్యాయవాదులు కొందరు రంగప్రవేశం చేసి, కేసును పై కోర్ర్టు, ఆపై కోర్టు దాకా తీసుకువెళ్లి ముద్దాయి నిర్దోషి అని నిరూపించి అతడి విడుదలకు సహకరించారు. కామాంధుడి చేతికి చిక్కి బలయిపోతూ కాపాడండి కాపాడండి అని ఆ బాలిక చేసిన రోదనలకు ఏళ్ళ తర్వాత లభించిన న్యాయం అది.
మరొకడు అలాగే ఓ మైనర్ బాలికను రాక్షసంగా మానభంగం చేసి అమానుషంగా హత్య చేసి శరీరాన్ని తగులబెట్టి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తపడి పారిపోయాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు, ముద్దాయిని పట్టుకుని, ఈసారి తమదైన శైలిలో అతడ్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ప్రజలు ఆ పోలీసులకు బ్రహ్మరథం పట్టారు. కోర్టులు తప్పుపట్టాయి. ఆ పని మీది కాదు అన్నాయి.
న్యాయస్థానాలు మన రాజ్యాంగ వ్యవస్థలో ఓ భాగం. అలాగే పోలీసులు మరో వ్యవస్థలో మరో భాగం.
కోర్టులు ఉరిశిక్షలు విధించగలవు. పోలీసులు అలా చేయలేరు.
చమత్కారం కాక దీన్ని యేమని అంటాం!
(22-05-2022)

సతీ నీలాంబరి – భండారు శ్రీనివాసరావు

 నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.

'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే. మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'

'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.

భార్య సహకారం చూసిన ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.

'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.

మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి. ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.

ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.

నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.

'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక ఎవరూ లేనట్టే అని'

ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు

 

21, మే 2022, శనివారం

డొక్కు జీపులో రాజీవ్ గాంధి – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభలో ప్రచురితం)

ఒకరు,  సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్షసాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం, ఎన్ టీ రామారావు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం, అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్రమంత్రి జలగం వెంగళరావు, అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేకరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన, హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి, రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలపడం సాగించారు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం, చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం,  ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు. కానీ, ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది. ఆ మలుపు తిరిగేముందు ఓ పిట్టకధ చెప్పుకోవాలి.

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది. నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంటపట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే,

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమ వైపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.

రాజీవ్ గాంధీ,  కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు, వెంగళరావు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్( ప్రెస్ అకాడమీ మాజీ  చైర్మన్)  అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత, 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావుకు కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు,  మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు,  వెంగళరావు,  సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము, సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా. 

జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు, సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్, అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా, రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా, నిబ్బరం కోల్పోకుండా, సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టూ గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి, అన్నం మెతుకులను పట్టి చూసి,  ఆ పేదరాలి భుజంపై చేయి వేసి,  సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిథి, దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో! తర్వాత షరా మామూలే.

రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.

ఒక ప్రధాని, ఒక ముఖ్య మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి, మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.
20, మే 2022, శుక్రవారం

అంతులేని టీవీ చర్చలు భండారు శ్రీనివాసరావు

 (పొద్దున్నే టీవీ చర్చలు చూసిన నిర్వేదంలో)

పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.

ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.

చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.

కారణం ఒక్కటే. 'రాజకీయం'.

ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.

ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.

ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.

సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.

(20-05-20)

నిర్వచనోత్తర రామాయణం – భండారు శ్రీనివాసరావు

 సదస్సు

ఒకడి మనస్సులో వున్న అయోమయాన్ని

హాజరయిన అందరికీ, పెంచి మరీ పంచే వేదిక

 

రాజీ

వున్న ఒక్కకేకునూ అందరికీ పంచి, ప్రతి ఒక్కరూ తమకే పెద్ద ముక్క దొరికిందని సంతోషపడేలా

చేయడం.

 

కన్నీరు

ఆడదాని కంట్లో నుంచి వచ్చే ఆ కన్నీటి వేగం ముందు ఎంతటి బలవంతుడయిన మగవాడయినా నీరు కారిపోక తప్పదు అని నిరూపించే ప్రబల శక్తి

 

నిఘంటువు

వివాహం కన్నా విడాకులు అనే పదం ముందు కనపడే పుస్తకం

 

గోష్టి

ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా ఆఖర్న ఒకరితో ఒకరు విభేదించే మహత్తర కార్యక్రమం.

 

గొప్ప పుస్తకం

అందరూ మెచ్చుకునేది, ఎవరూ చదవందీ.

 

చిరునవ్వు

పైకి మెలికలాగా కనిపించినా, వంకర తిరిగినవాటిని కూడా సాపు చేయగల అద్భుత సాధనం

 

ఆఫీసు

ఇంట్లో పడ్డ శ్రమ అంతా మర్చిపోయి బడలిక తీర్చుకునే ఆహ్లాదకరమైన ప్రదేశం

 

ఆవులింత

భార్య ముందు నోరు తెరవడానికి మగవాడికి దొరికే అరుదైన అవకాశం

 

ఎట్సెట్రా

ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు బుకాయించే పదం

 

కమిటీ

విడివిడిగా ఎవరికి వారు ఏమీ చేయలేని మనుషులందరూ ఒక చోట కలిసి ఏమీ చేయలేమని కలిసికట్టుగా తీర్మానించే సంఘం

 

అనుభవం

తాము చేసే పొరబాట్లకు మనుషులు పెట్టుకున్న ముద్దుపేరు

17, మే 2022, మంగళవారం

అదృష్టం అంటే - భండారు శ్రీనివాసరావు

ఓసారి ముళ్ళపూడి వారు రాసారు. అదృష్టం అంటే ఎవడో కొన్న లాటరీ టిక్కెట్టును వాడు మన జేబులో పెట్టి మరిచిపోయి వెడితే, దానికి మొదటి బహుమతి తగలడం అని. మనం రూపాయో, అర్ధో పెట్టి టిక్కెట్టు కొంటే లాటరీ తగలడం అదృష్టం కాదని ముళ్ళపూడి వారి చమత్కారం.

అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాదుకు దూరంగా ఉంటున్న ఓ రాజకీయ నాయకుడికి జిల్లా ఎస్పీ నుంచి ఫోన్ వెళ్ళింది. ఆయన గారు మంచి నిద్రలో వున్నారు.
ఎస్పీ చెప్పారు ఆయనతో. ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉన్నపాటున హైదరాబాదు వచ్చి కలుసుకోమన్నారు’ అని. వెహికిల్ అవసరం అయితే చెప్పండి అనేది కూడా ఆ ఫోన్ సారాంశం.
ఆయన రెక్కలు కట్టుకుని హైదరాబాదు వెళ్ళారు. అప్పటికే సిద్ధం చేసి వున్న రాజ్యసభ అధికార పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ ప్తరాలపై సంతకం చేశారు.
అంతే! ఆయన ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించారు.

ప్రతి ప్రభుత్వానికీ అనుసరణీయం గడప గడపకు కార్యక్రమం - భండారు శ్రీనివాసరావు

 గడప గడపలో నిరసనలు వెల్లువెత్తినా సరే,  గడప గడపకు అనే  కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. టీవీ చర్చల్లో వెలువడే విమర్శలకు రాజకీయ రంగు ఉండవచ్చు కానీ ఈ గడప గడపకు కార్యక్రమంలో వెలువడే నిరసన నిఖార్సయినది.  వీటిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయం ఉండవచ్చు కానీ అది చాలా స్వల్పం. దీని ద్వారా లభించే ఫీడ్ బాక్  ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉపకరిస్తుంది కూడా.  ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామా లేక ప్రజలకు అనవసరమైనవి పంచి పెడుతున్నామా అనేది తెలిసి వస్తుంది. ఏ పధకం ఎలా అమలవుతోంది, ఏ పధకం అమల్లో విఫలం అవుతోంది అనే విషయాలు  వాస్తవ రూపంలో తెలుస్తాయి.  రాజకీయాలకు అతీతంగా  అందరి గడపలకు కూడా వెడితే పాలక పక్షం నేతలకు వాస్తవాలు బోధపడుతాయి.  ప్రజలు తమ సమస్యలను టీవీలకు ఎక్కి అనుదినం  చెప్పుకోలేరు. అలాంటి వారికి ఇది వరప్రసాదం. నిరసన తెలిపినా, నిలదీసినా ఆ హక్కు ప్రజలకే వుంటుంది. ఇలాంటి వాటికి నెగెటివ్ ప్రచారం ఎలాగు వుంటుంది. అయితే పొరబాట్లు  సరిదిద్దుకునే మహత్తర అవకాశం ప్రభుత్వానికి ముందుగా  లభిస్తుంది. నిఘా వర్గాలు కూడా ఇటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయలేవు. వేసినా అరకొర సమాచారమే ప్రభుత్వానికి చేరుతుంది.  ప్రజల నాడి యధాతధంగా  పట్టుకోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక కొలమానం ఈ గడప గడపకు కార్యక్రమం. అంతా సజావుగా వుంది అనే భ్రమలు ఏమైనా వుంటే అవి తొలగడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుంది.  ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు నేతలు పోవడం అనేది ఆ నాయకులకే ప్రయోజనం. ప్రజలు నిరసన తెలిపినా దానిని ఆ స్థాయిలోనే అదుపు చేయడానికి, అది అసహనంగా మారి ఆగ్రహంగా పరిణమించకుండా జాగ్రత్త పడడానికి  నాయకులకు ఇదొక  ఆయుధంగా ఉపయోగపడుతుంది.  నిరసనలకు కారణం ప్రత్యర్థుల ప్రేరేపణ అని ఎదురుదాడికి దిగడం కన్నా వాటిని సానుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల ప్రతిభ, పరిణతి  వెలుగు చూస్తుంది.

తప్పులు దొర్లడం తప్పుకాదు. ఆ తప్పులను దిద్దుకోవడం ఉత్తమ లక్షణం. కాబట్టి ఈ గడప గడపకు కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా  ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేస్తే ఇటు ప్రజలకు మంచిది, అటు ప్రభుత్వానికి మంచిది.

కేంద్రంతో సహా, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో తమ స్థానం ఏమిటన్నది తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలి.

(17-05-2022)

కాటి కాపరిని చూడాలని వుంది - భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు హైపర్ టెన్షన్ డే అంటున్నారు, కాస్త ఉల్లాసం కోసం అంతే)

‘కలం కూలీ’, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా విభిన్న వ్యావృత్తులకు చెందిన వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు. ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే, బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చోను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)
(ఈరోజు హైపర్ టెన్షన్ డే అంటున్నారు, కాస్త ఉల్లాసం కోసం అంతే)

‘కలం కూలీ’, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా విభిన్న వ్యావృత్తులకు చెందిన వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు. ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే, బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చోను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)


(రోశయ్య గారితో కరచాలనం చేస్తున్న కృష్ణ. పక్కన పచ్చ చొక్కాలో నేను)