31, జనవరి 2012, మంగళవారం

‘శ్రీరామ’భగవద్గీత‘శ్రీరామ’భగవద్గీత


అనగనగా ఓ రాముడు. ఆయనకో బంటుపేరు హనుమంతు. ఆ రాముడికో కోరిక కలిగింది. నాడు లంకలో  రావణుడి చెరలో వున్న సీతను తిరిగి తెచ్చుకునే నిమిత్తం   సముద్రం దాటేందుకు వీలుగా వానర సేన సాయంతో నిర్మించిన వారధి – రామసేతు – ఎలావుందో చూద్దామని  యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తరువాత రామ బంటును  వెంటబెట్టుకుని రాముడు  భూలోకానికి  వచ్చాడు. తాము  వనవాసంలో వుండగా  రావణుడు అపహరించుకు పోయిన సీతను   మళ్ళీ తన  కళ్లబడేలా చేసిన ఆ వారధి అంటే ఆయనకు ఎంతో మక్కువ. దాన్ని చూడగానే దానిపట్ల  ఆయన పెంచుకున్న ఇష్టం ఆయన  మాటల్లో మరో సారి బయట పడింది.

‘హనుమా! ఈ వారధి నిర్మాణానికి నువ్వూ, నీ  సహచర వానరులు పడ్డ శ్రమను నేనారోజుల్లో కళ్ళారా చూసాను. మొబిలైజేషన్ అడ్వాన్సులు సరే కనీసం హీనపక్షం రోజు కూలీ కూడా అడగకుండా ఇంత బ్రహ్మాండమయిన వంతెనను నాకోసం ఎంతో కష్టపడి కట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో యుగాలు  గడిచిపోయాయి. ఎన్నెన్నో  ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడ్డాయి.  మరెన్నో  సునామీలు సంభవించాయి. అయినా కానీ, ఆనాటి  రామసేతు ఆనవాళ్ళు మాత్రం  వీటన్నిటినీ తట్టుకుని నిలిచాయి. అంటే ఈ వంతెన నిర్మాణంలో  మీరు ఉపయోగించిన ఇంజినీరింగ్ పనితనం అంత గొప్పదన్న మాట. నిన్న గాక మొన్న హైదరాబాదులో గామన్ కంపెనీ  అధునాతన టెక్నాలజీ సాయంతో  కట్టిన ఫ్లై వోవర్ కధ ఏమయిందో  తెలుసుకదా. ‘కాళ్ళ పారాణి కూడా ఆరకముందే’ అన్న సామెతను నిజం చేస్తూ  ఆ వంతెన ఫిల్లర్లపై సినిమా పోస్టర్లు   అంటించేంతవరకయినా ఆగిందా అంటే  ఆగలేదు. సరికదా ఓపక్క  కడుతుండగానే మరో పక్క  డమాలున  కూలిపోయింది’ అంటూ  రాముడు కాసేపు  ఆగాడు.
సమయం కోసం ఎదురు చూస్తున్న హనుమ వెంటనే అందుకున్నాడు.

‘జై శ్రీరాం!  రామ సేతు నిర్మాణంలో మాగొప్పదనం ఇసుమంత కూడా లేదు. మేము చేసిందల్లా ఆ రాళ్ళపై  నీ పేరు రాయడం వరకే. వంతెనకోసం టిస్కో కంపెనీ  ఉక్కు దిమ్మలు  వాడలేదు. అంబుజా సిమెంటో, ఏసీసీ సిమెంటో ఉపయోగించలేదు. అయినా కానీ,  నీ దయవల్ల అది గట్టిగా నిలబడింది. అయినా రామయ్యా! ఆ పాత సంగతి ఇప్పుడెందుకయ్యా!’

రాముడన్నాడు.
‘కలియుగం వచ్చేసింది ఆంజనేయా! మన రోజులు కావివి. ఇప్పుడు రామసేతును పడగొట్టి దాని  స్తానంలో కాలువ లాటిదేదో  నిర్మించాలని కొందరు అనుకుంటున్నట్టు ఈ మధ్య టీవీ స్క్రోలింగులలో చూసాను. కాలువ నిర్మిస్తారో లేదో  కానీ మనం కట్టిన సేతువుని తొలగించడం ఖచ్చితమనిపిస్తోంది. ఎందుకంటె,  ఈ కాలువ కాంట్రాక్ట్ లో కోట్ల డబ్బు కొందరి చేతుల్లోకి  చేరుతుంది.  వాళ్లు మరికొందరి చేతులు తడిపయినా సరే ఆ  కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం ఖాయంగా కనబడుతోంది. మాల్తూసియన్ అనే ఒక ఆర్ధిక వేత్త  ఏనాడో చెప్పాడు కదా. జనాలకు ఉపాధి కల్పించాలంటే  ‘Dig a pit and cover it’ అని. అంటే ఏమిటి?  ముందు ఒక గొయ్యి తవ్వించు. మళ్ళీ దానిని పూడ్పించు.   గొయ్యి తవ్విన వాడికో పని. దాన్ని పూడ్చినవాడికి మరో  మరో పని. అసలా గొయ్యి ఎందుకు తవ్వాలో ఎందుకు పూడ్చాలో అడిగే నాధుడు వుండడు. అలాగే ఇప్పుడు రామసేతు వ్యవహారం. పడగొట్టినందుకు డబ్బులు. మళ్ళీ కాలవ నిర్మించినందుకు  డబ్బులే డబ్బులు.’

ఆ మాటలు వింటూనే  హనుమంతుడిలా అన్నాడు.
‘ఆ రోజుల్లో వంతెన నిర్మాణానికి మేము కూలీ డబ్బులు తీసుకోకుండా పని చేసిన  మాట వాస్తవమే. అటు రాజ్యలక్ష్మిని,ఇటు  గృహలక్ష్మిని పోగొట్టుకుని వుసూరుమంటూ అడవుల్లో తిరుగుతూ వున్న  మీనుంచి  డబ్బు డిమాండ్ చేయడం కూడా మాకు  సబబు అనిపించలేదు. అదీకాక పళ్ళూ కాయలు తిని పొట్ట నింపుకునే మా వానరులకు విత్తముతో పని ఏముంటుంది?   కాకపొతే,  ఈ మానవులున్నారే వాళ్లు మామూలు వాళ్లు కాదు. క్షమించాలి తొందర్లో మీదీ అదే జాతి అని మరచిపోయి మాట తూలాను. అయినా కానీ,  ఈ కలియుగం మానవులకూ, మన కాలం నాటి మానవులకూ పోలికెక్కడ ప్రభూ. మీరు మీరే వాళ్లు వాళ్ళే. వాళ్లు  బాగా వొళ్ళు బలిసి పోయి  వ్యవహరిస్తున్నారు. అలాటి వారినుంచి డబ్బు పిండినా తప్పులేదు. ఆ విషయం ఆలోచిద్దాం. అసలా  వంతెన కట్టింది మేము. దాని ఆనుపానులన్నీ తెలిసింది మాకు. అలాటప్పుడు దాన్ని  కూలగొట్టడం ఎలాగో మాకు తెలిసినంతగా వేరేవారెవ్వరికీ  తెలిసే వీలు లేదు. కాబట్టి  మనమే వెళ్లి మన  సంగతి ఆ మూఢ మానవులతో చెప్పుకుని  ఆ పనేదో నెత్తికెత్తుకోవడం మంచిదేమో ప్రభూ’

‘హనుమా! నీకు శారీరక  బలం తప్ప మేధోపరమయిన తెలివితేటలు పూజ్యం. ఆ బలం కూడా ఎవరయినా గుర్తుచేస్తేనే నీకు గుర్తుకొచ్చి అక్కరకొస్తుంది. అదీ నీ పరిస్తితి. ఒక విషయం తెలుసుకో. మన  రోజులు కావివి. అప్పుడంటే నేను టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద మీకు పని వొప్ప చెప్పాను. మీరూ ఏమీ ఆశించకుండా పని పూర్తిచేశారు. అందుకే  మన మీద ఏ ఆరోపణలు రాలేదు. గిట్టనివారెవరూ  సీబీఐ  దర్యాప్తు డిమాండ్ చేయలేదు. కాని ఇప్పుడలా కాదు. ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం జరగాలి. లెక్కలన్నీ పక్కాగా వుండాలి. లేకపోతే ఏ ‘కాగో’ పట్టుకుని విచారణ పేరుతొ మనల్ని కాగులో వేసి మరగ పెడుతుంది. దర్యాప్తుల పేరుతొ నిద్ర పట్టకుండా చేస్తారు. జైళ్ళంటారు. నార్కో పరీక్షలంటారు. ముందు ఏసీ కారులో  దిల్ కుశా గెస్ట్ హౌస్ కు పోదాం  అంటారు. అక్కడికెళ్ళాక అరెస్ట్ అంటారు. ఆ తరువాత  సీబీఐ కోర్టుకంటారు. ఆ కోర్టు న్యాయమూర్తి వున్నాడే నాగ మారుతీ శర్మ. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే  మన  రోజుల్లో కూడా ఇలాటి ఖరాఖండీ  న్యాయమూర్తిని చూడలేదు. నిజానికి  వాళ్ల నాన్న నా భక్తుడు. అసలు పేరు సుందర లాల్. నా పేరు అనుక్షణం ఆయన నాలుక మీద ఆడుతూ వుండేది. ఖమ్మంలోవుండగా  ఆయన పేరు ‘రామాయణం మునసబు’.  రోజూ రామాయణ పారాయణం చేస్తేకాని ఆయనకు నిద్రపట్టేది కాదు. ఖమ్మంలోవుండగా  ఆయన్ని అందరూ  ‘రామాయణం మునసబు’ గారనేవారు. మామిళ్లగూడెంలో ఆయన  అద్దెకు వున్న ఇంట్లో క్రమం తప్పకుండ  సుందరాకాండ పారాయణం జరిగేది.   నా పేరు కలవరిస్తూనే ఆయన కళ్ళు మూశాడని చెప్పుకుంటారు. కాని ఆయన కొడుక్కు మన సంగతి తెలుసో లేదో తెలవదు. బెయిల్ ఇవ్వనన్నాడో చెంచల్ గూడా జెయిలే గతి. ఇక అన్నిటికంటే ఘోరం  టీవీల్లో మన గురించి జరిగే ప్రచారం. నామీద ఈ మానవులు గతంలో  ఎన్నో సినిమాలు తీసి డబ్బు చేసుకున్నారు. అదంతా మరచి,  మనల్ని జెయిల్లో తోయించే దృశ్యాలను వాటికి  లక్ష రెట్లు ఎక్కువ సార్లు చూపిస్తారు. రాముడు మంచి బాలుడన్న సంగతి మట్టిలో కలిసిపోతుంది. నన్ను నమ్ముకున్న రామదాసు లాటివాళ్ళు  బందిఖానాలో పడ్డ మాట నిజమే.  కాని, నాకు మాత్రం  జెయిళ్లు, బెయిళ్లు తెలియదు.  వనవాసంలో లక్ష్మణుడు తెచ్చిపెట్టిన కందమూలాలు తప్ప   జెయిల్లో పెట్టే చిప్ప కూడు ఏనాడూ తిని ఎరుగను. ఇప్పుడు పోయిపోయి సీబీఐ చేతుల్లో పడితే ఇక మన చేతిలో ఏమీ వుండదు. ఇంత బతుకూ బతికి మళ్ళీ ఆ చేతి పార్టీ చేతులే పట్టుకోవాలి. వాళ్లు ఓ పట్టాన తేల్చరు. అయిదు రాష్ట్రాల ఎన్నికలంటారు. తిధులంటారు. పండగలంటారు. ఈ లోపల మనం మళ్ళీ అవతారం ఎత్తాల్సిన త్రేతా యుగం  రానే వస్తుంది. అది తప్పిపోయిందంటే మళ్ళీ మరో నాలుగు యుగాలు ఆగాలి.    రామరాజ్యంలో ఏదయినా కూడబెట్టుకున్నది వున్నదంటే అది లాయర్లకు చదివించు కోవడానికే సర్వం సరిపోతుంది. ఈ లోగా యుగాలు, మన్వంతరాల తరబడి కష్టపడి మనం  సంపాదించుకున్న మంచి తనం కాస్తా టీవీ చర్చల్లో మంట కలిసిపోతుంది. కలియుగం మనుషులంటావా తింటారు తినిపిస్తారు. దర్యాప్తులు, విచారణలు ఏళ్లతరబడి సాగిస్తారు. సాగదీస్తారు. ఈ లోపల వాళ్లకు వాళ్లకు లెక్కలు డొక్కలు కుదిరితే కేసులన్నీ  అటకెక్కుతాయి. ఆ టక్కుటమార విద్యలు నా గురువులు నాకు నేర్పలేదు. పోనీ నేర్చుకుందామనుకున్నా  ఈ వయస్సులో వంటపట్టవు. ఏదో  నువ్వు చెబుతున్నావు కదా, పోతే పోయింది ఒక రాయి విసిరి చూద్దాం   అని వెళ్ళామే అనుకో. నిలబెట్టి   వెయ్యి ప్రశ్నలు అడుగుతారు. వంద సర్టిఫికెట్లు తెమ్మంటారు. వయస్సు సర్టిఫికేట్  ఏదంటే ఏం చెబుతాం. ఏం చదివారంటే మన దగ్గర  ఏం జవాబుంది? చదువు  చెప్పిన విశ్వామిత్రుడు తన దగ్గర నేను చదివినట్టు నాకు ఏ  సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతూ త్రిశంకు స్వర్గంలో  వుండిపోయాడు. ఆయన్ని ఇప్పుడు యెక్కడని వెతికి పట్టుకుంటాం. రోజులు బాగున్న రోజుల్లో  రధాల మీద తిరిగాము. కాలం ఖర్మం కలసిరానప్పుడు  కాలినడకన అడవుల్లో సంచరించాము. అలాగని ఆ   రధానికి  డ్రైవింగ్ లైసెన్సు తెమ్మంటే ఎక్కడ తెస్తాము చెప్పు. యెలా తెస్తాము చెప్పు.      
          
“అంతటితో అయిపోతుందా. అడ్రసు ప్రూఫ్ అడిగారనుకో  అదీ లేదు. నేను జన్మించిన  అయోధ్యనే ఈ  మానవులు ఏళ్లతరబడి కోర్టు  లిటిగేషనులో పెట్టి తమాషా చూస్తున్నారు. మనిద్దరం విల్లంబులు పట్టుకుని టెండర్ వేయడానికి వెడితే, పని ఇవ్వకపోగా ఎస్ టీ కోటా కింద  ఏదయినా ఆశ్రమ  పాఠశాలలో చేర్పించి చేతులు దులుపుకుంటారేమో కూడా. అంతటి ఘనులు వీళ్ళు. ఇంకో సమస్య ఏమిటంటే మనం భగవంతుడి అవతారం అన్న ట్యా గ్ లైన్ ఒకటి వుంది. అది పెట్టుకుని ఇప్పుడు కాలినడకన వెడితే ఏం బాగుంటుంది చెప్పు. మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరిగా త్రీ పీస్ సూట్ వేసుకువెళ్ళామంటే ఇంతే సంగతులు. మన భక్తులు కూడా మనల్ని  అనుమానిస్తారు. అదింకా ప్రమాదం. టెండరు దక్కక పోగా మనకే టెండరు పడుతుంది.’
రాముడు చెప్పిన భగవద్గీత అంజనీకుమారుడి చెవికేక్కినట్టులేదు. అతడు తోకతో  ఓమారు వీపు గోక్కుని  దాంతోనే మరోమారు  తల  తడుముకుని ఇలా అన్నాడు.
‘ రామసేతు వంతెనను నేనూ నా సహచర వానరులు స్వయంగా కట్టామని ఆ మానవాధములకు స్టాంపు పేపరు మీద రాసి ఇస్తాను. అదీ నమ్మరా. అలాటప్పుడు ఆ పేపర్లు ఎందుకు, డూప్లికేట్ స్టాంపు కాగితాలు తయారు చేసే తెల్గీ లాటి వాళ్లు బాగు పడడం కోసమా?’

‘ఓరి అమాయక వానర చక్రవర్తీ!’ రాముడు మళ్ళీ చెప్పాడు.   

“అలాటి కాగితాలు వాళ్లకు చిత్తు  కాగితాలతో సమానం. వాళ్ళు ముందు నిన్ను రామసేతువు  లేఅవుట్ సబ్మిట్ చేయమంటారు. ప్రాజెక్ట్ వివరాలు అడుగుతారు. ఇన్ కం టాక్స్ రిటర్న్లు తెమ్మంటారు. అప్రూవ్  చేసిన ప్లాను అడుగుతారు. మునిసిపల్ పర్మిట్లు, ఎస్కవేషన్  పర్మిట్టు,  రామసేతు కట్టిన కంట్రాక్టర్ పేరు వివరాలు, అతడికి యెంత ఖర్చయింది, ఎన్నాళ్లలో కట్టాడు, దాన్ని సకాలంలో పూర్తిచేసిన సర్టిఫికేటు వుందా ఇలా   రకరకాల పత్రాలు అడుగుతారు.ప్రశ్నలు వేస్తారు. రామసేతు పూర్తయిన తరువాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు గట్రా పట్రా అంటారు. ఎందుకంటె ఈ కలియుగంలో మనిషి మాటకన్నా సర్టిఫికేట్లకే విలువెక్కువ. ప్రత్యేకించి పవిత్ర బారతంలో ఈ పత్రాల గోల మరీ ఎక్కువ. పెన్షన్  తీసుకునే వాడు స్వయంగా వెళ్ళినా అతడు బతికే వున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ఏదీ ఒప్పుకోరు. నువ్వు ఖల్లు ఖల్లున దగ్గుతున్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర వుంటేనే నీకు దగ్గు జబ్బు వున్నట్టు లెక్క.”

శ్రీ రామ గీత వింటున్న పవన సుతుడుడికి మతి పోయినంత పనయింది.

‘స్వామీ ఇదెక్కడి మాయ లోకం. నువ్వు ప్రతి వందేళ్లకీ ఓ మాటు  సూరదాసు, తులసీదాసు, త్యాగరాజు, జయదేవుడు, భద్రాచల రామదాసు,  భక్త తుకారాం లాటివారికి నీ ఉనికినీ, మహిమలనూ  ప్రదర్శిస్తూనే వున్నావు. అయినా సరే ఇప్పటికీ  నువ్వున్నావా అసలున్నావా   అని సినిమా పాటలు రాస్తూనే వున్నారు. ఇక నీ ఉనికి గురించిన చర్చోప చర్చలు టీవీ తెరలపై అనంతంగా సాగి పోతూనే  వున్నాయి. రామాయణం పుక్కిటి పురాణమని, రామసేతు నిర్మాణం అసలు జరగనేలేదనీ వాదించేవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. ఈ స్తితిలో నాకు ఒకే దారి కనబడుతోంది. ఏమయినా సరే నువ్వు రాముడిగా మరో సారి అవతారం ఎత్తాలి. రామాయణం నిజంగా జరిగిందేనని నిరూపిస్తూ దాన్ని మరోసారి ఈ మానవులకు ప్రదర్శించి చూపాలి.’అన్నాడు ఆంజనేయుడు ఆవేశంగా.

రాముడు తనదయిన రీతిలో మందహాసం చేసి  చెప్పాడు.

‘అదంత సులభం కాదు అంజనీ పుత్రా. ఈనాటి రాజకీయ నాయకులతో పోలిస్తే  రావణుడు లాటి విలన్  కూడా జనాలకు ఒక హీరో లాగానే అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఈ మధ్య మారీచుడు నాకు తారస పడితే అడిగాను. మారీచుడు ఎవరో  గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు. అరణ్యంలో బంగారు లేడిని వేటాడుతూ  వెడుతున్నప్పుడు అచ్చు  నా స్వరాన్ని అనుకరిస్తూ ‘హా లక్ష్మణా’ అంటూ   లక్ష్మణుడిని ఎలుగెత్తి  పిలిచాడు చూడూ  ఆ మారీచుడే. ఏమన్నాడో తెలుసా! సల్మాన్ ఖాన్ వున్నంతవరకు మళ్ళీ భూమి మీద కాలు మోపే ఛాన్స్ తీసుకునేది  లేదని తెగేసి చెప్పాడు.’

శ్రీరాముడు బోధించిన ఈ భగవద్గీతతో ఆంజనేయుడికి జ్ఞానోదయం అయింది.
స్వస్తి. (31-01-2012)

-- 
Bhandaru Srinivas Rao (I.I.S.)
Cell: 98491 30595 Res: 040 2373 1056.
Please click on below URL to visit my Blog:
http://bhandarusrinivasarao.blogspot.com

28, జనవరి 2012, శనివారం

బాలయ్య బాబు


బాలయ్య బాబు
పూర్వం సినిమాలు విడుదల చేసినప్పుడు వాటితో పాటు ఆ సినిమాలోని పాటలతో కూడిన చిన్న పుస్తకాన్ని  ప్రేక్షకులకు అమ్మేవారు. అవి కొనుక్కుని ఇంటికి వచ్చిన తరువాత వాటిని పాడుతూ ఆ పాటల్ని వల్లె వేయడం అదో సరదాగా వుండేది. ఆ పాటల పుస్తకాల  వెనుక అట్ట మీద ఆ చిత్ర నిర్మాత తదుపరి తీయబోయే చిత్రాల పేర్లు వుండేవి. ఎన్టీ రామారావు తాను తీయబోయే ఒక చిత్రం పేరు  ‘ముసలి మొగుడు – పడుచు పెళ్ళాం’ అని  ఒక పాటల పుస్తకం పై ముద్రించారు. కానీ ఎందుకో ఏమిటో ఆ చిత్రాన్ని ఆయన నిర్మించనే లేదు.
నేనూ ఎప్పుడయినా ఆత్మ కధ అంటూ  రాయడం అంటూ జరిగితే దానికి ‘నడిచి వచ్చిన దారి’ అని పేరు పెట్టాలని ఎంతగానో మనసు పడ్డ మాట నిజం. ‘జీవిత చరిత్రలు రాసుకోగలిగిన స్తాయి జీవితమా! నాది’ అన్న మీమాంసతో అది కొరుకుడు పడలేదు. చివరికి ‘మార్పు చూసిన కళ్ళు’ అనే పేరుతొ నా మాస్కో జీవితంలో ఎదురయిన కొన్ని అనుభవాలను గ్రంథస్తం (బ్లాగస్త్రం) చేయగలిగాను. 
తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక  విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే  సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన ‘నా కాశీ యాత్ర’ పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి  ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన  పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు  స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా ‘పర దూషణ’ ఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి  యెంతటి  మేఘనగధీరుడయినా  ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసిన  తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ‘ఆత్మ స్తుతి-పరనింద’ తొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. గాంధీ గారు రాసుకున్న ‘మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్’ అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి,  లేదా వాస్తవాలనుబట్టి  తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం  మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.

    
నాందీప్రస్తావన ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. దామోదర ప్రసాద్ పట కమూరు / బొద్దులూరి శ్రీనివాసరావు అనే వారి నుంచి  నాకు ఈ మధ్య ఒక ఈ మెయిల్ అందింది. అది వారిద్వారా వచ్చిందో, లేక ఎవరయినా పంపితే దాన్ని నాకు పంపారో తెలియదు. ఏమయినా  వారికి కృతజ్ఞుడిని. మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవన యానంలోని ఒడిదుడుకులను, కష్ట నష్టాలను  తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ అనే జీవిత చరిత్రను ‘హార్పర్ కాలిన్స్ ఇండియా’ వారు ప్రచురించారు. తెలంగాణా  ప్రాంతంలో తండ్రిని బాబు అని పిలుస్తారు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు బాలయ్య బాబు అని పేరు పెట్టాను. ప్రముఖ పత్రికా రచయిత మల్లేపల్లి లక్ష్మయ్య, హెచ్.ఎం.టీ.వీ. కి చెందిన ఆంగ్ల దినపత్రిక ‘హాన్స్ ఇండియా’ లో ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.


డాక్టర్ సత్యనారాయణ ఈ పుస్తకం రాయడంలో ఎలాటి  భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు  ఇట్టే బోధపడుతుంది. తాను, తన కుటుంబం సాంఘికంగా, ఆర్ధికంగా అనుభవించిన మానసిక క్లేశాలను ఆయన చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా అక్షరబద్ధం చేసారని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రం పర నిందా సూత్రాన్ని  ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన ఈ మూడు తరాల కధ కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటే మనిషి జీవితం ఇంత పర పీడనమా అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే ఈ కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని  తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న  నిజం డాక్టర్ సత్యనారాయణ  రాసిన ఈ పుస్తకం  చదివినవారికి బోధపడడం తధ్యం.
ఈ మధ్య విడుదలయిన ఒక తెలుగు సినిమాలో అలనాటి తెలంగాణలో బీదాబిక్కీ ఎదుర్కున్న అవమానాలను చూసిన ఈ నాటి తరం పిల్లలు – మనుషులు సాటి మనుషులపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అన్న సంశయాన్ని వెలిబుచ్చడం నాకు తెలుసు. అవన్నీ నిజంగా నిజం అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
మనసుల్ని కదిలించే ఓ సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య ఓ లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. ఆ కాలిజోళ్ల పనితనం గమనించి  ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది  ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
ఆ నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ  నరసయ్యే. ఆ జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో   పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి  అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని  జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట  తీసుకుని, వూరుబయట ఓ వాగు చెంత గొయ్యి తవ్వి భార్య శవాన్ని పూడ్చిపెట్టి,  వున్న వూరు విడిచిపెట్టి బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్  బాలయ్యను ప్రాణప్రదంగా  చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు  ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు.  తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా   అతడి కలను నిజం చేస్తూ  పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి  విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే ఈ గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. ‘కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’ అన్న కవి వాక్యం నిజం చేసిన ‘మట్టిలో మాణిక్యం’.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన సత్యనారాయణ గారికి, ఆయన తండ్రి ‘బాలయ్య బాబు’కు నమోవాకాలు. (28-01-2012)                             

27, జనవరి 2012, శుక్రవారం

రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరంరోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం


మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం నాటి ఆ జలాశయంలోకి  వాలున చేరే వాననీటితో పాటు నగర జీవితంలో భాగమయిన కాలుష్య జలాలన్నీ కలుస్తుంటాయి. అలాటి కలుషిత  నీటిని శుద్ధి చేయడంకోసం భారీగా నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. అపరిశుభ్ర జలాలను పరిశుభ్రం చేయడానికి నిరంతరం అనేక యంత్రాలు పనిచేస్తుంటాయి. అయినా ట్యాంక్  బండ్ కంపు  గురించిన కధలు అనేకం వినవస్తూనే వుంటాయి. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా వున్న ట్యాంక్ బండ్ జలాలు ఇప్పుడు వాడకానికి పనికిరాకుండా  కేవలం పడవ షికార్లకు మాత్రమే పరిమితమై పోయాయి.  దీనికి కారణం ఏళ్లతరబడి ఆ తటాకంలో  కలుస్తున్న వ్యర్ధ పదార్ధాలు, కాలుష్య జలాలు  గురించి ఎవరూ అంతగా  పట్టించుకోకపోవడమే.

మనిషి శరీర ధర్మం కూడా దాదాపు ఈ మాదిరే. తినే ఆహారం, తాగే నీరు ద్వారా శరీరానికి అవసరమయిన మాంసకృత్తులు, పోషక విలువలు సమకూరడంతో పాటు  రక్తంలో కలవని  లవణాల వల్ల అది  కలుషితమవుతూ వుంటుంది. ఒక్కోసారి రక్తం విషపూరితమయ్యే  ప్రమాదం కూడా వుంటుంది. ఇలా కలుషితమయిన రక్తాన్ని వడపోసి అనవసర లవణాలను తొలగించి వాటిని  మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పంపడానికి  మూత్రపిండాలు(కిడ్నీలు) పనిచేస్తుంటాయి. అయితే, హుస్సేన్ సాగర్ జలాల మాదిరిగానే, కాలం గడుస్తున్న కొద్దీ కొందరిలో అనవసర లవణాలు పేరుకుపోయి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఇవే కిడ్నీ సంబంధమయిన వ్యాధులు. ఇవి బాగా ముదిరితే, కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడం, మూత్రపిండాలు దెబ్బతిని వాటి స్తానంలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధిచేసే డయాలసిస్ వంటి ఖరీదయిన వైద్యం తప్పనిసరి అయ్యే ముప్పు పొంచుకుని వుంటుంది. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిబారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముదిరిపోయిన తరువాత చేసే చికిత్స కంటే నివారణ మేలు కదా. 


ఈ రకంగా ఆలోచించినప్పుడు రూపాయి  కూడా ఖరీదు చేయని కొత్తిమీర కట్టతో కిడ్నీ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలగడం అన్న ఆలోచన ఆలోచించదగిన సంగతే. పెద్దగా ఖర్చు లేని వ్యవహారం అయినప్పుడు ప్రయత్నిస్తే పోయేది రూపాయే కదా.

ఇంతకీ ఈ రూపాయి వైద్యానికి కావాల్సింది ప్రతి ఇంటి  వొంటింట్లోనే దొరుకుతుంది కూడా.  కరివేపాకు, కొత్తిమిర అనేవి లేని ఇళ్లు, వాటిని వాడని ఇల్లాళ్ళు వుండరు కూడా.

కిడ్నీకి, కొత్తిమిరకు వున్న బాదరాయణ సంబంధం ఏమిటన్న మాట అటుంచి ఈ వైద్య విధానం ఏమిటో చూద్దాం.
ముందు కొత్తిమిర కట్టను మంచి నీటితో శుభ్రంగా కడగండి.

తరువాత కొత్తిమిర ఆకులను చిన్నగా కత్తిరించండి. ఆ ఆకులను పదినిమిషాల పాటు ఉడికించండి. ఆ నీటిని చల్లబరచి ఆకుల్ని తీసివేసి శుభ్రమయిన సీసాలో పోసి రిఫ్రిజిరేటర్ లో వుంచండి.
ఆ నీటిని ప్రతి రోజూ ఒక గ్లాసు తాగుతూ వుండండి. మీ రక్తంలో పేరుకుపోయిన ఉప్పు, ఇతర విష పదార్ధాలు మూత్రంతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. కొద్ది రోజుల తరువాత మీలో కలిగే  మార్పును మీరే గమనించగలుగుతారు.

ఇంకెందుకాలశ్యం.  మొదలు పెట్టండి కొత్తిమిర వైద్యం. (27-01-2012)

26, జనవరి 2012, గురువారం

అలనాటి బెజవాడ


అలనాటి బెజవాడ
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూ, బిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.
  
ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినా, ఒక్క నవరాత్రులను మినహాయిస్తే, గుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.
వేసవి కాలంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలి, వందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.

గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కాని, ఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.

ఒక జీవ నది, మూడు కాలువలు, అనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం.   

బెజవాడ అంటేనే బ్లేజ్ వాడ. అంటే మండే నగరం. ఇక్కడ ఎండలు అలా మండిపోతుంటాయి. ఎండల్ని గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ బెజవాడ ఎండలతో పోల్చి చెప్పడం కద్దు. ఎండల కారణంగా బెజవాడకు రావాల్సిన  ఆంధ్ర విశ్వ విద్యాలయం రాకుండా పోయిందనే ఒక వాదన ప్రచారంలో వుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు బెజవాడ ఎండలకు భయపడే వాల్తేర్ ను ప్రత్యామ్నాయంగా సూచించారని అంటారు. ఈ ఒక్క కారణంగా బెజవాడ వాసులు ఇప్పటికీ ఆయన్ని క్షమించరని అనే వాళ్లు కూడా వున్నారు.

నిద్రపోని నగరంగా బెజవాడ గురించి చెప్పుకుంటారు. ఉత్తర దక్షిణ భారతాలను కలిపే రైళ్ళు అన్నిటికీ కూడలి కావడం వల్ల అర్ధరాత్రీ  అపరాత్రీ అని లేకుండా ప్రయాణీకుల రాకపోకలు నిరంతరం సాగుతూనే వుంటాయి. అలాగే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు. సినిమాలకు వెళ్ళే జనం కూడా ఎక్కువే. వీటికి తోడు ప్రధానమయిన తెలుగు దినపత్రికలన్నింటికీ బెజవాడే ప్రచురణ కేంద్రం. పత్రికల్లో పనిచేసి అర్ధరాత్రో, తెల్లవారుఝామునో ఇళ్లకు చేరుకునే మా బోంట్లకు హోటళ్ళలో తాజాగా వేడి వేడిగా దొరికే కాఫీ పలహారాలే దిక్కు. ఈ విషయంలో  ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాంధీ నగరంలోని బాబాయి హోటలు. సినిమా తారలతో సహా పెద్ద పెద్ద  వాళ్లు అనేకమంది ఈ హోటలుకు  వస్తుంటారు. అలాగే కౌతా సెంటరులో వున్న రాములు కిల్లీ కొట్టు కూడా అంతే  ప్రసిద్ధం. అక్కడ దొరికే కిళ్ళీల కోసం జనం బారులు తీరేవారు. ( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)  

24, జనవరి 2012, మంగళవారం

బెజవాడ సొగసు చూడ తరమా!


బెజవాడ సొగసు చూడ తరమా!

(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు ) పీఎస్: నాగేస్రావ్ అనే పాఠకుడు ఇచ్చిన సలహా ప్రకారం దాసు గారి  వెబ్ సైట్  నుంచి ఆయన ఫోటో సేకరించడం జరిగింది- రచయిత దాసు కృష్ణమూర్తి గారు 

   
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
     
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.
“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి)
(24-01-2012)

14, జనవరి 2012, శనివారం

తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా!


తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా! ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 
  
సంగీతం గురించిన వ్యాసాలు చదివి స్పందించిన మైత్రేయి, చెన్నాప్రగడ - వీరిరువురూ  తెలుగునాట కర్నాటక సంగీతానికి తమిళనాట వున్నంత  ఆదరణ ఎప్పుడు వస్తుందో అన్న  ఆవేదన వ్యక్తం చేసారు.  అలా రావడానికి ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలో చర్చ జరగాలి అన్నారు. వారి ఈ  ఆవేదనతో పాలు పంచుకునే వారు తెలుగునాట ఎందరో వున్నారు.
అందులో  భాగంగానే ఈ నాలుగు వాక్యాలు.తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

 జనవరి పద్నాలుగు శనివారం త్యాగరాజ స్వామి ఆరాధన జరుగుతోంది.  తంజావూరు జిల్లా తిరువాయూర్ లో త్యాగరాజు సమాధి వద్ద అందరూ ఆయన రాసిన కీర్తనలు గానం చేస్తూ వుంటారు.  తొంభై శాతం మంది తమిళులే. కాని వారు పాడేవన్నీ తెలుగులో త్యాగరాజు రాసిన కీర్తనలే.  ఆంధ్ర ప్రాంతం నుంచి త్యాగరాజు పూర్వీకులు తిరువాయూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అయినా తెలుగు మర్చిపోలేదు.  తమిళదేశం నడిబొడ్డులోవున్నా తెలుగు లోనే కీర్తనలు రాసారు. త్యాగరాజు  సిద్ధి  పొందిన తర్వాత  ఆయన సమాధి నిర్లక్ష్యంగా పడి వుంటే బెంగుళూరు నాగరత్నమ్మ అనే వో గొప్ప విద్వాంసురాలు తాను  సంపాదించినదంతా ధారపోసి సమాధి మందిరం కట్టించి ఓ  పెద్ద ప్రాంగణంగా అభివృద్ధి చేశారు. త్యాగరాజ  కీర్తనలన్నీ తెలుగులో  పాలరాతి మీద చెక్కించారు.  సంగీతం అంటే చెవి కోసుకునే వారందరూ అక్కడికి వెళ్లి త్యాగరాజ స్వామి సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తుంటారు.  మార్గశిర బహుళ పంచమి నాడు త్యాగరాజ వర్ధంతిని పురస్కరించుకుని ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.  సంగీతం కావాలనుకొంటే తెలుగు వచ్చి తీరాలి.  సంగీత త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఎవ్వరూ తమిళంలో కీర్తనలు రాయలేదు.  అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్రంతో పాటు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా తెలుగులోనే కీర్తనలు రాశారు. తమిళనాడులో కచేరీలు జరిగినా వొకట్రెండు  మినహా అన్నీ తెలుగులో కీర్తనలే. వాళ్లకు సంగీతమే ప్రధానం.  ఈ వొక్క విషయంలో మాత్రం వాళ్లు తమ సహజసిద్ధమయిన  భాషాదురభిమానాన్ని కాస్త  పక్కన పెడతారు. తెలుగువాళ్ళం మనకి అంత వొరపు లేదు.   
1940లో ఓసారి  తమిళులందరికీ  తెలుగులో ఎందుకు పాడాలి ? మన తమిళంలో పాడలేమా ? అనుకుని ఓ  ప్రయత్నం చేసారు.   రాజా అన్నామలై చెట్టియార్, కల్కి కృష్ణ మూర్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.  సంగీతానికి కులాన్ని కూడా ఆపాదించారు, బ్రాహ్మణుల చేతిలో చిక్కుకు పోయిందని. అప్పుడు చెట్టియార్  మ్యూజిక్ అకాడెమి  ప్రెసిడెంట్ కూడా.  రెండు మూడేళ్ళు కష్టపడ్డా ఫలితం కనపడలే. తమిళం సంగీత పరమయిన భాష కాదని వారికి తేలిపోయింది.  సంగీతానికి తెలుగు, సంసృతం,  కన్నడం, మలయాళం సరిపోతాయి కాని తమిళం పనికి రాదని అర్ధమయింది.
 1980 లో మరోసారి దండపాణి దేశికర్,  మదురై   సోమసుందరం ఎక్కువ తమిళ  కీర్తనలు పాడడం ప్రారంభించారు.  అయితే శ్రోతలు తగ్గడంతో వారూ ఈ ప్రయత్నంలో వెనక్కి తగ్గారు.  ఇదంతా ఎందుకంటే ఇంత గొప్ప తెలుగు కీర్తనలు వున్నా మనం ఎందుకు ఆదరించడం లేదు ? అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించడానికే. తమిళనాడులో వున్న  ప్రాభవం తెలుగునాట రావాలంటే ఏమి చెయ్యాలో తెలియని అయ్యోమయంలో వుండి పోయాం.  ఎందుకు ? ఎందుకు ?ఎందుకు ? అన్న ప్రశ్నలే ఈ అయోమయంలో నుంచి పుట్టుకు వస్తున్నాయనుకోవాలి.
తెలుగునాట కూడా వొకప్పుడు సంగీతానికి మంచి ఆదరణ వుండేది. విజయనగరం సంస్థానంలో సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేశారు. పాతికేళ్ళక్రితం వరకు విజయనగరంలో సంగీతం నేర్చువడం అంటే  ఎంతో గొప్ప. అల్లాగే కచేరీలు వినడానికి ఎన్నో సభలు ఉండేవి. కాకినాడ సరస్వతి గానసభ అన్నిటి కంటే పాతది. సూర్యకళా మందిరం అని ఆరోజుల్లోనే సంగీతం కోసం ఓ ఆడిటోరియం  కట్టారు.  టి.ఆర్. మహాలింగం, చెంబై వైద్యనాధ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, అరియక్కుడి రానుజ అయ్యంగార్,  సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పాల్ఘాట్ మణి అయ్యర్,  పళని సుబ్రహ్మణ్యం,  పట్టమ్మాళ్ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, వసంత కుమారి, మధురై మణి అయ్యర్, జీ ఎన్ బీ   వంటి విద్వాంసులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కచేరీలు చేసే వారు. బెజవాడలో  కనకదుర్గ కళాసమితి, త్యాగరాజ సంగీతకళా సమితి, సద్గురు సంగీతసభ వాళ్లు  నెలవారీ కచేరీలు  ఏర్పాటుచేసే వారు. ఏడాదికోసారి ఉత్సవాలు ఉండేవి. అమలాపురంలో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు.  పాలకొల్లు వర్తక సంఘంవారి త్యాగరాజ ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈనాటి  మాండొలిన్  శ్రీనివాస్ పాలకొల్లు నుంచి వచ్చినవాడే. తెనాలిలో నారుమంచి సుబ్బారావుగారి సీతారామగాన సభ అంటే తమిళ సంగీత  విద్వాంసులకు ఎంతో గౌరవం. ఇలా ఎన్నయినా చెప్పవచ్చు గత వైభవం  గురించి.  ఇప్పుడు ఈ సభలు కనుమరుగయిపోయాయి. 
1966 ప్రాంతంలో హైదరాబాదులో  త్యాగరాజ గానసభ ప్రారంభమయింది.  మొదటి రోజుల్లో  చిక్కడపల్లి లేబర్ వెల్ఫేర్  సెంటర్ ఓపెన్ స్టేజి పైన కచేరీలు జరిగేవి. కే.ఎల్. రెడ్డి గారని టెలిఫోన్స్  డిస్ట్రిక్ట్ మేనేజర్ వుండేవారు. వయోలిన్ వాయించేవారు.  ఇప్పటి హైదరాబాద్ సిస్టర్స్ లలిత, హరిప్రియలు  వోణీలు వేసుకొని కచేరీలు చెయ్యడం చాలామందికి గుర్తు వుండేవుంటుంది. హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి, రాఘవాచారిల గురువు సుసర్ల శివరాం, ఆర్. జానకీదేవి, వీ.ఎస్. అనంతరావు, మారెళ్ళ కేశవ రావు, నేతి శ్రీరామశర్మ, కోలెంక వెంకటరాజు, ఆకెళ్ళ మల్లిఖార్జున శర్మ, వాసా పద్మనాభం వంటి స్థానిక విద్వాంసులు సభ స్థిరపడడానికి దోహదపడ్డారు.  త్యాగరాజ గానసభ నిలదొక్కుకొని ఓ  ఆడిటోరియం కట్టిన తర్వాత త్యాగరాజ విగ్రహం మాత్రం పెట్టి సంగీతాన్ని వొదిలేసింది.  హాలు  అద్దెకు ఇచ్చుకోవడం మినహా సంగీతానికి ఇప్పుడు చేస్తున్నదేమి లేదు. నిజానికి ఇప్పుడున్న ఆర్ధిక స్తోమతకు చక్కటి కచేరీలు ఏర్పాటు చెయ్యొచ్చు.  ఇప్పటి నిర్వాహకులకు ఆ శ్రద్ధ వున్నట్టు లేదు. (14-01-2012)