31, జనవరి 2015, శనివారం

నాయకులు, నమ్మకాలు


(Published by 'SURYA' telugu daily in its edit page on 01-02-2015,Sunday)   
హైదరాబాదులో నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ వొడ్డున వున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ప్రాంతంలోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణానికి తరలించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.  ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి  కార్యాలయాలు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ విభాగాల ప్రధానాధికారుల కార్యాలయాలు మొత్తం అన్నింటినీ  ఒకే చోట నిర్మిస్తే, ప్రజలకు అనేక వ్యయ ప్రయాసలు తగ్గిపోతాయన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  మొన్న గురువారం సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం గురించి ఇప్పటికే మీడియాలో కధనాలు వస్తున్నందువల్ల ఇదేమంత సంచలన నిర్ణయం కాదు. అలాగే అందుకు చూపిన కారణాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు.  కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెల్లడించిన మరో ప్రధాన  కారణం మాత్రం సంచలనాత్మకమైనదే. సందేహం లేదు.
నిజాం కాలంలో నిర్మితమయిన ప్రస్తుత సచివాలయం వాస్తు రీత్యా అనుకూలం అయినది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయం. నిజానికి ఇది ఒక కారణం అయినా అధికార పదవుల్లో వున్నవాళ్ళు తమ వ్యక్తిగత నమ్మకాలను బహిరంగంగా వొప్పుకోరు,  ఇలాటి వాటిని గురించి  బయటకు చెప్పుకోరు. కానీ కేసీఆర్ వ్యవహార శైలే వేరు. భయంకరమైన వాస్తు దోషం వున్నందువల్ల ప్రస్తుత సచివాలయాన్ని అక్కడినుంచి మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎలాటి భేషజాలకు పోకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సచివాలయం తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి వాస్తు నమ్మకాలు మరింత  పదును పెట్టాయి. దీనితో అసలు విషయం వెనక్కిపోయి 'నాయకులూ, నమ్మకాలూ' అనే కొత్త చర్చ మొదలయింది.



ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గురించి ఒక మాట  చెబుతారు. చేయి చాపుకునే హక్కు ఎవరికయినా వుంటుంది. కానీ ఆ చాపిన చేయి పక్కవాడి ముక్కుకు తాకనంతవరకే ఆ స్వేచ్ఛ. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదనేది  ఇందులోని అంతరార్ధం. దీన్నే కాస్త అటూ ఇటూ మార్చి, వాస్తు, జ్యోతిష్యం వంటి కొన్ని వ్యక్తిగత విశ్వాసాలకు కూడా అన్వయింపచేయొచ్చు. ప్రజాజీవితంలో వున్నంత మాత్రాన వ్యక్తిగత విశ్వాసాలకు నీళ్ళు వొదులుకోవాల్సిన అవసరం లేకపోయినా వాటికోసం ప్రభుత్వ ఖజానాలోని ప్రజా ధనాన్ని ఖర్చుచేయడం సమంజసం అనిపించుకోదు. వాస్తు అనేది వ్యక్తిగతం. మీకున్న నమ్మకాలనుబట్టి, మీ సొంత వనరులతో ఏం చేసుకున్నా ఎవ్వరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం వుండదు. కానీ వాటికోసం ప్రభుత్వ నిధులను వెచ్చించాలని చూసినప్పుడే విమర్శలు ఎదురవుతాయి. వీటికి జవాబు చెప్పడం కొన్ని సందర్భాలలో తలకు మించిన  పని అవుతుంది.
రాజకీయ నాయకులు అనేకమందికి ఇటువంటి నమ్మకాలు వుండడం ఇటీవలి కాలంలో బాహాటంగానే చూస్తున్నాం.  ప్రతిదానికీ వాస్తు చూడడం, ప్రతి పనికీ ముహూర్తాలు అనడం ఒక ఆనవాయితీగా మారుతోంది. ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు సరే, క్యాబినెట్ సమావేశాలు  సయితం ముహూర్తాల ప్రకారం మొదలుపెట్టడం  కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. పేర్లు ప్రస్తావించడం అనవసరం కానీ, గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు కూడా వాస్తు నమ్మకంతో అనేక నిర్మాణాలు చేశారు. కొన్ని కట్టడాలు పడగొట్టారు. సచివాలయం, అసెంబ్లీ ప్రధాన ప్రవేశ మార్గాలను మార్చారు. తమకు పనికొచ్చే వాస్తుకు అనుగుణంగా తమ కార్యాలయాల్లో, అధికారిక నివాస భవనాల్లో ప్రభుత్వ ఖర్చుతో పలుమార్పులు చేశారు. కానీ వారెవ్వరూ వాస్తు నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరచకపోవడం వల్ల వారి చర్యలు మీడియాలో అంతగా వివాదాస్పదం కాలేదు.    
'వాస్తు హేతుబద్ధమా, జ్యోతిష్యం శాస్త్రీయమా' అనే మీమాంస కాదు ఇప్పుడు చర్చనీయాంశం. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకం మరొకరికి మూఢ నమ్మకంగా కానవస్తుంది. వ్యక్తిగా ఎవరు ఎలాటి నమ్మకాలు పాటించినా అది పూర్తిగా వారి వ్యక్తిగతం. కానీ ప్రజాజీవితంలో వున్నప్పుడు అర్ధాలు మారిపోతాయి. భాష్యాలు వేరుగా వుంటాయి. అది గమనంలో పెట్టుకుని వ్యవహరిస్తే ఆత్మ రక్షణలో పడే ప్రమాదాలు తగ్గిపోతాయి.
ఇక పోతే ఈ నమ్మకాలకు సంబంధించి కొన్ని సరికొత్త పాత సంగతులు:
ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారిక నివాస భవనం వుండాలనే ఉద్దేశ్యంతో గతంలో బేగం పేటలోని ప్రభుత్వ అతిధి భవనాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి హయాములో ఆయన పేరు కలిసివచ్చేలా 'ఆనంద నిలయం' పేరుతొ ఏర్పాటు చేశారు. విజయ భాస్కరరెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే భవనంలో వుండేవారు. డాక్టర్ చెన్నారెడ్డి  తార్నకాలోని తన సొంత ఇంట్లో వుంటూ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు సౌకర్యాలను, తన వాస్తు విశ్వాసాలకు సరిపడేలా మార్పులనూ చేయించారు.  అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు బరఖత్ పురాలోని ఆయన ఇల్లు చాలా చిన్నది కావడం వల్ల గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అనేక వాస్తు మార్పులతో 'జయప్రజా భవనం'గా తయారు చేశారు. ఆయన అర్ధంతరంగా పదవి దిగిపోయేవరకు అందులోనే వుండి, ఇరుకిరుకు గదులున్న తన చిన్న ఇంటిలోనే చనిపోయేవరకు రోజులు గడిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కూడా ఈ విశ్వాసాలు జాస్తి. సినిమారంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన చంద్రబాబు నాయుడుకి వాస్తు పట్ల మొదట్లో  అంతగా పట్టింపు వున్న దాఖలాలు లేవు. కాకపొతే రెండు పర్యాయాలు అధికారానికి దూరం అయిన తరువాత ఆయనలో కూడా ఈ నమ్మకాలు పెరిగాయని చెబుతారు. గుంభన పాటించే తత్వం కాబట్టి ఈ నమ్మకాల విషయంలో ఆయన వ్యవహార శైలి పెద్దగా వార్తలకు  ఎక్కలేదు. కొత్త రాజధాని విషయంలో, సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విషయంలో చంద్రబాబు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, పెద్దగా చర్చనీయాంశం కాలేదు.
రాజకీయ నాయకులే కాదు ఉన్నతాధికారుల్లో  సయితం వాస్తుకు తగ్గట్టు నడుచుకునేవారు పెక్కుమంది వున్నారు. వారి కార్యాలయాలను, అధికారిక నివాస భవనాలను ఎటువంటి భేషజం లేకుండా హాయిగా ప్రభుత్వ  ఖర్చుతో మార్పులు చేసుకున్నారు. కాబట్టే ఈ విషయంలో చంద్రశేఖర రావు నిర్ణయాన్ని రాజకీయంగా ప్రశ్నించగలుగుతున్నారు కానీ గట్టిగా నిలదీయలేకపోతున్నారు.
నమ్మకాలు అనండి, మూఢ నమ్మకాలు అనండి ఇప్పుడివి సమాజంలో చాలా విస్తృతంగా అనేక రంగాలలో అల్లుకుపోయాయి. అధికారం, డబ్బు ముడిపడివున్న రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగాల్లో వీటి ఉనికి మరింత ప్రస్పుటంగా కానవస్తుంది. శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో ప్రకాశిస్తున్న అనేకమంది కూడా వీటికి అతీతులు కారన్నది జగద్విదితం. కేవలం నిరక్ష్యరాస్యుల్లో మాత్రమే ఈ మూఢ నమ్మకాలు ఎక్కువ అనే వాదాలు ఇటువంటివారివల్ల పూర్వపక్షం అవుతున్నాయి. నాటి జన గణన ప్రకారం మన దేశ జనాభాలో నిరక్షరాస్యుల శాతం డెబ్బయి నాలుగు. కానీ వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మకాలు వున్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ. అంటే ఏమన్నమాట. చదువుకూ నమ్మకాలకూ ముడి పెట్టి మాట్లాడడం అంత సమంజసం కాదని.
ఈ నమ్మకాలకు సంబంధించి అనేక రసవత్తర విషయాలు చరిత్రలో చోటుచేసుకున్నాయి.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
1962 జనవరిలో కొందరు భారతీయ జ్యోతిష్కులు అదే ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ ప్రళయం సంభవిస్తుందని జోస్యం చెప్పారు. ఆ ప్రచారానికి భీతిల్లి కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలు గుట్టలు ఎక్కి తలదాచుకున్నారు. సిక్కిం మహారాజు తన పెళ్లి వాయిదా వేసుకున్నారు. వ్యాపారాలు మందగించాయి. ఇదంతా చూసి నెహ్రూ, 'నవ్వుకోవడం మినహా చేసేదేమీ లేదు' అని వ్యాఖ్యానించారు. 1984 మార్చిలో ప్రపంచ యుద్ధం వస్తుందని 1981 లోనే అనేకమంది జ్యోతిష్కులు భవిష్యత్ వాణి వినిపించారు. 1995 లో విలయం వాటిల్లి 70-80 శాతం జనం తుడిచి పెట్టుకుపోతారని జ్యోతిష్యం చెప్పిన వాళ్లు వున్నారు. ఇవేవీ నిజం కాలేదు.

1981 జూన్ లో ఒక జ్యోతిష్కుడు ఒక అడుగు ముందుకు వేసి అదే ఏడు సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురవుతారని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, ఆ  తరువాత కొద్దిరోజుల్లోనే శ్రీమతి గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని కూడా చంపేస్తారని ఆయన చెప్పారు. ఆ దరిమిలా హెచ్ ఎన్ బహుగుణ ప్రధాని అవుతారని కూడా  ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఆయన జ్యోతిష్యం అప్పుడు నిజం కాలేదు కానీ, ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఇందిరా, రాజీవ్ లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. కానీ ముందే కూసిన ఆ 'కోయిల'ను  మాత్రం పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.  

'పనిచేసే ఆఫీసుల్లో మూఢనమ్మకాలు' అనే అంశంపై 2012 లో ఒక సర్వే చేశారు. ఎనిమిది నగరాల్లో  సుమారు ఎనిమిదివందల కంపెనీల్లో పనిచేసే సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి  తెలిసింది ఏమిటంటే వారిలో అరవై ఒక్క శాతం మందికి వాస్తులో విశ్వాసం వుందన్నవాస్తవం.
అందుకే అన్నారు, 'మొక్కితే సాయి, తొక్కితే రాయి' అని.
అంతా నమ్మకంలోనే వుంది. నమ్మితే అది నమ్మకం, నమ్మకపోతే అది  మూఢ నమ్మకం.
 (31-01-2015)
NOTE: Courtesy Image Owner 

27, జనవరి 2015, మంగళవారం

సంచలన నిర్ణయాలు

(Published by 'SURYA' telugu daily in its Edit page on 29-01-2015, Thursday)

'నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక రకమైన నిర్ణయమే' అనేవారు   మాజీ ప్రధాన మంత్రి, కీర్తిశేషులు శ్రీ పీవీ నరసింహారావు.
రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలనుబట్టి, తీసుకునే సందర్భాలను బట్టి ఆయా నాయకుల తలరాతలు మారిపోతుంటాయి. కొన్ని నిర్ణయాలు ఎదుగుదలకు మెట్లుగా ఉపయోగపడితే, మరికొన్ని నిర్ణయాలు ఎదురులేని దెబ్బతీస్తాయి. నిర్ణయాల మంచి చెడులను నిర్ణయించగల శక్తి ఒక్క కాలానికే వుంది. కాలం గడిస్తే కాని వాటి ఫలితాలు, పరిణామాలు అవగతం కావు. అప్పటివరకు మనం తీసుకున్న నిర్ణయమే భేషయినదని భ్రమ పడడం మానవ సహజం.  ఇది చరిత్ర చెప్పే సత్యం.
నిర్ణయాన్ని ప్రశ్నించలేని వాళ్లు కూడా నిర్ణయం తీసుకున్న తీరును అధిక్షేపించిన సందర్భాలు అనేకం. వాటిల్లో ఎన్నదగినది నిరుడు కాంగ్రెస్ పార్టీ తన పాలనాకాలం  ముగియబోయే  ఆఖరు ఘడియల్లో  హడావిడిగా తీసుకున్న  రాష్ట్ర విభజన నిర్ణయం. విభజనను గట్టిగా కోరుకున్నవారు కూడా ఆ నిర్ణయం తీసుకున్న తీరును ఎండగట్టడం ఇందుకు  ఒక ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా నాన్చిపెట్టి  చివరి నిమిషంలో ఆదరాబాదరాగా తీసుకున్న  ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి యెంత చేటు చేసిందన్నది ఆ పార్టీ వారికే బాగా ఎరుక.
పోతే, గత ఆదివారం నాడు తెలంగాణా ముఖ్యమంత్రి  కల్వకుంట్ల  చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయాలు,  వాటిని అమలు పరచడంలో కనబరచిన వేగం, వురవడి గమనిస్తే సంచలనం అన్న పదానికే  కొత్త నిర్వచనం ఇచ్చినట్టు అనిపించింది. కేసీఆర్  అంటేనే  సంచలనాలకు నెలవు అనే పేరు ఇప్పటికే వుంది. అది ఇంకా బలపడే విధంగా, తన మంత్రివర్గం  నుంచి,  ఉపముఖ్యమంత్రి రాజయ్యను  బర్తరఫ్ చేసే ఉత్తర్వుతోపాటు,  అయన స్థానంలో పార్లమెంటు సభ్యుడయిన   కడియం శ్రీహరి చేత ఆఘమేఘాల మీద ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన  వైనాన్ని పరిశీలిస్తే,  రాజకీయాల్లో ఇది అత్యంత సంచలనాత్మక నిర్ణయం అని వొప్పుకోకతప్పదు.


అంతకు కొన్ని గంటల ముందు   ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సభ్యుల్లో అనేకమంది హైదరాబాదు నగర పొలిమేరల్లో కొంపల్లి దగ్గర జరిగిన ఒక వివాహవేడుకకు  హాజరయ్యారు. రాజయ్య కూడా ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారని వినికిడి.  వధువు తండ్రి టీ.ఆర్.యస్. పార్టీలో అత్యంత ముఖ్యుడు కావడంతో రాజకీయ ప్రముఖులు పెక్కుమంది అక్కడకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం చాలాసేపు వివాహమండపంలో తీరిగ్గా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని చూసిన వారికి, మరికొద్దిసేపట్లో ఆయన  రెండు ప్రధానమైన నిర్ణయాలను అమలు పరచబోతున్నారు అన్న అనుమానం లేశమాత్రం కూడా కలగలేదు. అంత నిబ్బరంగా, అంత తాపీగా  అక్కడకు వచ్చిన వారితో మాటలు ముచ్చట్లతో  గడిపారు. వచ్చిన అతిధులు, విలేకరుల్లో చాలామంది తిరుగుముఖం పడుతుండగానే రాజభవన్ లో కడియం శ్రీహరి  ప్రమాణ స్వీకారం, రాజయ్య  తొలగింపులకు సంబంధించిన  విశేషాలను టీవీల్లో చూపిస్తున్నట్టు  మిత్రులనుంచి  వర్తమానాలు అందాయి. కేసేఆర్ యెంత త్వరగా, యెంత గుట్టుగా  నిర్ణయాలను అమలుపరచగలరు అన్న విషయం ఈ ఉదంతంతో మరోమారు స్పష్టపడింది.
తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించాలి ఎవరిని చేర్చుకోవాలి అనే విషయంలో ఏ ముఖ్యమంత్రికయినా పూర్తి స్వేచ్చవుంటుంది. ఇది నిర్వివాదాంశం. కానీ ముందే చెప్పినట్టు నిర్ణయం తీసుకునే తీసుకున్న తీరు, సందర్భం బట్టి ఆ నిర్ణయం  ప్రశ్నార్ధకంగా మారే అవకాశాలు వుంటాయి.
రాజయ్య తొలగింపుకు కారణాలను ప్రభుత్వం తరపున అధికారికంగా తెలియచెప్పకపోయినా వాటిని గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కధనాలు వెలువడుతూనే వున్నాయి.  రాజయ్య నిర్వహిస్తూ వచ్చిన వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణతో ఆయన పేషీలో పనిచేసే కొందరు అధికారులను, సిబ్బందిని ఆయనతో  ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా తొలగించారు. అధికారులమీద చర్య తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి రాజయ్య పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కొందరు తొందరపడి భాష్యాలు చెప్పారు. కానీ కేసీఆర్ ఎత్తుగడ మరో రకంగా వుందనుకోవాలి. రాజకీయ అవినీతితో పాటు బ్యూరోక్రాటిక్ వర్గాల్లో పేరుకుపోయివున్న అవినీతి మకిలిని సయితం  వదిలించాలి అన్నది అయన యోచన కావచ్చు. మంత్రిని తొలగిస్తే సంకేతాలు ఉద్యోగ వర్గాలకు చేరవు. మంత్రితో పాటే వారూ తప్పుకుంటారు కాని,  హెచ్చరికలు వారికి చేరే అవకాశం వుండదు. అందుకే కాబోలు, ముందు  అవినీతి మచ్చపడిన సిబ్బందిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులకు, ఆ తరువాత మంత్రిని తప్పించడం ద్వారా ఇతర మంత్రులకు ఒకేమారు గట్టి సంకేతాలు ఇచ్చినట్టయింది. ఒకే దెబ్బకు  రెండు పిట్టల సామెత చందంగా కేసేఆర్ ఈ  చర్యలకు పూనుకున్నారు.
అయితే, ఉపముఖ్యమంత్రి స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇలా చేయడం సహజంగానే రాజయ్యకు మనస్తాపం కలిగించే అంశం.  అంతే సహజంగా  దీనికి  సామాజిక కోణం ఆపాదించడం ప్రతిపక్షాలకు అసహజమేమీ కాదు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు దీనిపైనే ధ్వజం ఎత్తారు. సామాజికంగా వెనుకబడిన రాజయ్యను కేవలం కుల అహంకారం తోనే కేసీఆర్ ఈవిధంగా అవమానించారని విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయంగా నాలుగాకులెక్కువ చదివిన కేసేఆర్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ఈ పరిణామాలకు తెరలేపారు. మంత్రి వర్గం నుంచి తొలగించిన  రాజయ్య కులానికే చెందిన, రాజయ్య జిల్లాకే చెందిన ఇంకా చెప్పాలంటే రాజయ్య నియోజకవర్గానికే చెందిన  కడియం శ్రీహరిని, రాజయ్య  స్థానంలో మంత్రిగా తీసుకోవడం మాత్రమే కాకుండా ఉపముఖ్యమంత్రి హోదాను కూడా కట్టబెట్టారు. ఆవిధంగా సామాజిక కోణం నుంచి వెలువడే విమర్శలకు పదును తగ్గేలా ముందుగానే జాగ్రత్తపడ్డారు అనుకోవాలి.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి కేసీఆర్ ఒక విషయంలో తన మంత్రివర్గ సహచరులను హెచ్చరిస్తూ వచ్చిన మాట కూడా వాస్తవమే. బంగారు తెలంగాణా లక్ష్యం నెరవేరాలంటే, రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేసి తీరాలని ఆయన పదేపదే  చెబుతూ వచ్చారు. అవినీతిని ఎట్టి పరిస్తితిల్లోను సహించేది లేదని, ఈ విషయంలో తన కొడుకునయినా ఉపేక్షించేది లేదని అనేక సందర్భాలలో స్పష్టం చేస్తూ వచ్చారు.
ఈ దశలో వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి భాగోతాలపై వెలువడిన  మీడియా కధనాల నేపధ్యంలో, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే  నడవడిక మార్చుకోవాల్సిందని తోటి మంత్రుల ద్వారా  సంకేతాలు పంపినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే రాజయ్య తొలగింపు నిర్ణయం హటాత్తుగా తీసుకున్నది కాదని, బాగా ఆలోచించి చేసిన నిర్ణయమే అని బోధపడుతోంది. కాకపొతే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేకించి హైదరాబాదులో చెలరేగిన స్వైన్ ఫ్లూ వ్యాధి, ఈ నిర్ణయం అమలును వేగిరపరచి వుంటుంది. తొలగింపుకు ఒక హేతువు మాదిరిగా ఉపయోగపడివుంటుంది.  
అయినా కానీ,  అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన, అవినీతి జరిగినట్టు నిఘావర్గాల నుంచి సమాచారం అందినంత మాత్రాన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తిపై, అదీ సామాజికంగా అణగారిన వర్గానికి చెందిన విద్యాధికుడయిన సహచరుడిపై  వేటు వేసిన తీరు, సంచలనం కావడం మాత్రమే కాదు ఒక ఆయుధాన్ని చేతులారా ప్రతిపక్షాల చేతికి అందించినట్టు అయిందని స్వపక్షంలోనే కొందరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రాజయ్య బర్తరఫ్ జరిగి రోజులు గడిచిపోతున్నా దానికి కారణాలు వివరిస్తూ అధికారికంగా ప్రకటన చేయకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. అవినీతి యెలా జరిగిందీ, ఏ మేరకు జరిగిందీ, ఎవరు కారకులు అన్న వివరాలపై స్పష్టత లేదు.  అలాటి పక్షంలో  విమర్శకుల నోళ్లకు తాళాలు పడివుండేవి. వివరణ రాని నేపధ్యంలో సహజంగానే ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాయి. చేస్తున్నాయి కూడా. కేసీఆర్ నిర్ణయం ఆయన అహానికి అహంకారానికి ప్రతీక అనే  ఆరోపణల పర్వానికి తెర తీసాయి. ఆ పార్టీలు అధికారంలో వున్నప్పుడు ఈ మాదిరి ఘటనలు జరిగాయి కాబట్టి ఆ విమర్శలకు అంతగా విలువ వుండకపోవచ్చు.
 సరే! వీటితో మీడియాకు కొన్నాళ్ళు కాలక్షేపం. అలా అని ప్రజాస్వామ్యంలో ఈ రకమైన తీరుతెన్నులను సమర్ధిస్తూ పోవాలా అన్న ప్రశ్న మిగిలే వుంటుంది.
గతంలో తెలుగుదేశం తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తల్లో,  పదివేల రూపాయలు లంచం తీసుకున్నారు అన్న ఆరోపణతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ఒక మంత్రినే  బర్తరఫ్ చేశారు. ఆరోజుల్లో అదొక సంచలనం. అలాగే,  ఒకసారి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన మంత్రివర్గం లోని మొత్తం ముప్పయ్ రెండు మంది మంత్రులను ఒకే ఒక్క ఉత్తర్వుతో బర్తరఫ్ చేసి, ఢిల్లీ వెళ్ళి కొన్ని రోజులపాటు అక్కడే హస్తినలో మకాం పెట్టారు. మంత్రుల మూకుమ్మడి తొలగింపుకు  కారణం అవినీతి ఆరోపణలు  కాకపోయినా, బడ్జెట్ లీకును ఒక మిషగా చూపారు. అది కాదు, మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అలా చేసారని కొందరు చెబుతారు. అలాగే మరో సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి, సీనియర్ నాయకుడు అయిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉద్వాసన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. సొంత జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వెళ్లారు. ఈలోగా  మంత్రిని బర్తరఫ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రిగా పర్యటనకు వెళ్ళిన శ్రీనివాసులు రెడ్డి మాజీ మంత్రిగా హైదరాబాదు తిరిగొచ్చారు. తిరిగి వెళ్ళడానికి వాహనం సమకూర్చడానికి కూడా అధికారులు సుముఖత కనబరచక పోవడంతో ఆయన నిస్సహాయంగా రైలులో రావాల్సివచ్చిందని వార్తలు వచ్చాయి. శ్రీనివాసులు రెడ్డి బర్తరఫ్ కు ప్రభుత్వం ఎలాటి కారణం చూపలేదు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అభియోగం మోపారు. ఆయన మాత్రం మంత్రి పదవి పోయిన తరువాత కొన్ని రోజులు మౌనం పాటించి తరువాత నోరు విప్పారు. అధికారం అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు  అడ్డదారుల్లో లక్షలు పోగేసుకుంటున్నారని ఆయన  ఆరోపణలు చేశారు. తరువాత  కాంగ్రెస్ లో చేరారు కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి మళ్ళింది మాత్రం ఆ బర్తరఫ్ తోనే.
కాంగ్రెస్ పార్టీలో ఇలాటివి జరగలేదా అంటే జరిగాయి కాని అమలు చేసే విధానమే మరో రకంగా వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులను వెంటవెంటనే మార్చిన తీరు దీనికి ఉదాహరణ. దెబ్బయ్యవ దశకం చివర్లో అయిదేళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులను, మళ్ళీ తొంభయ్యవ దశకం మొదట్లో అయిదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులను కారణం చెప్పకుండా తొలగించిన చరిత్ర కాంగ్రెస్ అధిష్టానానికి వుంది.
అంచేత, ఇలాటి సందర్భాలలో అధిక్షేపించే నైతిక హక్కు  పార్టీలకి లేని మాట నిజమే. అయినా రాజకీయం కోసం విమర్శించే ప్రాధమిక హక్కు తమ హక్కుభుక్తం అని  అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా  నమ్ముతున్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయగలిగింది లేదు. 

24, జనవరి 2015, శనివారం

అభివృద్ధిపధంలో - 'భారత రిపబ్లిక్'

Published by 'SURYA', Telugu Daily in its Edit Page on 25-01-2015, SUNDAY)

( జనవరి ఇరవై ఆరు, భారత గణతంత్ర దినోత్సవం)



దసరాదీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేనుజనవరి యిరవై ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే - గణతంత్ర దినోత్సవాన్ని  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
భారత రిపబ్లిక్ కు - దానితోపాటే జాతీయ గీతం 'జనగణమనకు షష్టిపూర్తి కూడా పూర్తయి ఆరో ఏడు నడుస్తోంది. నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై సంవత్సరాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఒక లెక్కలోది  కాదు. అయితే, ఏ  ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు  'నడిచి వచ్చిన దారిని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.

ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమనగీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందోఏ ఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - 'ను 'లాగా- 'ను 'లాగాతప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదుఎర్రకోట అంటే తెలియదుకానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలిఅంటే- కాసేపు పడుకోనీ మమ్మీఈ రోజు సెలవే కదా!అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా జనగణమనపాడడం పోయి –   గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్యనిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.

సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు,  ఈనాటి పరిస్తితులను చూసి – 'మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా నిలబడి జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం,యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినా ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా  పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి.
గిద్దెలుసోలలుశేర్లుసవాశేర్లుమానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.
అలాగేవీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు. 

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి  ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే , 'అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా  ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న  అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం కళ్ళ ముందే ఆవిష్కృత మవుతోంది.

అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. కానీ  అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.

భారత రిపబ్లిక్ వార్షికోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

21, జనవరి 2015, బుధవారం

పాలక ప్రతిపక్షాలకు రాష్ట్రపతి హితబోధ

(Published by 'SURYA' telugu daily in its edit page on 22-01-2015, Thursday)

దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. ప్రస్తుత పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.
చెప్పింది సాక్షాత్తు భారత రాష్ట్రపతి. విన్నది భవిష్యత్ భారతానికి నిర్ణేతలయిన  విద్యార్ధులు. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో,  శ్రీ ప్రణబ్ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గత సోమవారం నాడు  ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు రాష్ట్రపతి జవాబులు చెప్పారు. నేడు దేశం ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను ఆయన తన సమాధానాల్లో స్పృశించారు. మొత్తం జాతికి ఒక పెద్దగా,  ఎలాటి హితవు పలకాలో  శ్రీ ముఖర్జీ  ఆ సంభాషణలో స్పష్టంగా చెప్పారు. అవి విద్యార్ధులకోసం చెప్పిన జవాబులే.  కానీ  దేశానికి జవాబుదారీగా వుండాల్సిన పాలక ప్రతిపక్షాలకు కూడా పనికొచ్చే హితబోధలు వాటిల్లో వున్నాయి. చురుక్కుమనిపించేలా  మాత్రమే కాదు,  ఆలోచింపచేసేలా కూడా  వున్నాయి. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో  మంచిదనిపించేలా కూడా వున్నాయి.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న  ప్రభుత్వం అది.  శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ,  లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు.  అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.





ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను  ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చట్ట సభల పనితీరు పట్ల ఆయన ఆవేదన, సభల నిర్వహణకు కలుగుతున్న ఆటంకాల పట్ల అసహనం ఆయన మాటల్లో వ్యక్తం అయింది.
పార్లమెంటు సభ్యులు సభ జరగనివ్వకుండా నినాదాలు చేయడం, స్వతంత్ర భారతం స్వయంగా రూపొందించుకున్న  పార్లమెంటరీ సంప్రదాయాలకు మేలు చెయ్యదన్న అభిప్రాయం అయన మాటల్లో ద్యోతకమయింది. ఈ విషయంలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి తీవ్రంగా దుయ్యబట్టారు.
'సభలో అల్పసంఖ్యాకులు (మైనారిటీ) తమ ఆందోళనలతో అధిక సంఖ్యాకుల (మెజారిటీ) హక్కులకు భంగం కలిగిస్తున్నారు. దీన్ని ఎంతమాత్రం అనుమతించరాదు' అని శ్రీ ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
'చట్టాలు చేయడం చట్ట సభల కర్తవ్యం. ఇందులో పార్లమెంటు విఫలం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్మవుతుంది. ఇలా చేయడం అంటే ప్రజల విశ్వాసానికి ఘాతుకం కలిగించడమే' అని రాష్ట్రపతి అన్నారు. అంచేత ఎట్టి పరిస్తితుల్లోను పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా చూడాలని హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో విపక్షాలు సభను అడ్డుకున్న నేపధ్యాన్ని మనసులో పెట్టుకుని రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్లమెంటు, సామూహిక ఆందోళనలకు, బజారు స్థాయి నిరసనలకు వేదిక కారాదని ఆయన చెప్పిన తీరును బట్టి,  ఈ పరిణామాలు ఆయన్ని ఎంతగా కలత పెట్టి వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. 'పార్లమెంటు అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంతమైన సాధనం. దాన్ని మరింత శక్తివంతంగా ఉపయోగించుకోవాలి. సభను స్తంభింపచేయడమే ప్రధానంగా పెట్టుకుంటే విలువయిన సభ సమయం వృధా అయిపోతుంది. విధాన ప్రక్రియ కుంటుపడుతుంది' అని ఆయన అన్నారు.
పార్లమెంటు సమావేశాల కాలం కాలక్రమంలో క్రమేపీ కుదించుకుంటూ పోవడం, సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడిగా వున్న ప్రణబ్ మనసును కలత పెట్టి వుంటుంది. అందుకే ఆయన, పార్లమెంటు సమావేశాల సమయం యెలా కుదించుకుపోయిందో గణాంకాలతో సహా  వివరాలను వెల్లడించారు.
విపక్షాలకు సుద్దులు చెప్పడంతోనే రాష్ట్రపతి సరిపుచ్చుకోలేదు. అంతే తీవ్రంగా అధికార పక్షం తీరును కూడా ఎండగట్టారు.  మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సుల బాటలో వెళ్లడం ఆయనకు రుచించినట్టుగా లేదు. 'చట్టసభల్లో ఒక పద్దతి ప్రకారం చట్టాలు జరగాలి. అలాకాకుండా సాధారణ చట్టాలకు సైతం ఆర్డినెన్సుల మార్గం ఎంచుకోవడం సరికాద'ని అన్నారు. అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో  మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయాలని రాజ్యాంగం పేర్కొంటున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. 'ఏ ఆర్డినెన్సు జారీ చేసినా దానికి ఆరు నెలలలోగా పార్లమెంటు ఆమోదం లభించేలా చూడాలి. లేనిపక్షంలో అది నిరర్ధకమవుతుంద'ని చెప్పారు.
మోడీ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సుల విషయంలో అనుసరించబోతున్న పద్దతి ఎలాటిదో తెలియని వ్యక్తి కాదు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. రాజ్యసభలో కొన్ని బిల్లులను ఆమోదింప చేసుకునే బలం ప్రస్తుతానికి బీజేపీకి, దాని మిత్ర పక్షాలతో కూడిన  ఎండీఏ కూటమికి లేని మాట నిజం. అందుకే పార్లమెంటు ఉభయ సభల  సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను గట్టెక్కించే వ్యూహ రచన చేస్తున్న సంగతి కూడా బహిరంగ రహస్యమే.
విద్యార్ధులతో మాటా మంతీ కార్యక్రమంలోనే రాష్ట్రపతి తెలివిగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చన్న ధ్వని ఆయన మాటల్లో వ్యక్తం అయింది. 1952  నుంచి ఇప్పటివరకు అలాటి సందర్భాలు నాలుగే వచ్చాయి. సంయుక్త సమావేశాల్లో బిల్లులను నాలుగు పర్యాయాలు మాత్రమే ఆమోదం పొందేలా పాలక పక్షాలు ప్రయత్నించిన సంగతిని  ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఈ అంశంలో తన వైఖరి  యెలా వుండబోతోందో అయన ఈ విధంగా అన్యాపదేశంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారనుకోవాలి.          
కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. ఏదైనా ప్రభుత్వ బిల్లును ఉభయ సభల్లో ఒకటి ఆమోదించి మరొకటి తిరస్కరించినప్పుడు ఆ బిల్లును తిరిగి ఆమోదింప చేసుకోవడానికి రాజ్యాంగంలో ప్రత్యేక సౌలభ్యం వుంది. గతంలో ఇలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి, 1961 లో వరకట్న నిషేదం బిల్లును, 1978లో బ్యాంకింగ్ సర్వీసు కమీషన్ రద్దు బిల్లును, 2002లో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆనాటి ప్రభుత్వాలు చట్టాలుగా మార్చుకోగలిగాయి.
సాధారణంగా పాలక పక్షాలకు లోక సభలో బిల్లులను ఆమోదింప చేసుకోగల మెజారిటీ వుంటుంది. రాజ్యసభతోనే అప్పుడప్పుడు చిక్కులు ఎదురవుతాయి. రాజ్యసభకు రొటేషన్ ప్రకారం సభ్యులను ఎన్నుకుంటారు కాబట్టి ఏదైనా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం లోకసభలోనే ఆ పార్టీకి  మెజారిటీ వుంటుంది. రాజ్యసభలో కొంతకాలంపాటు పాత పాలక పక్షానికే ఎక్కువమంది సభ్యులు వుండడం కద్దు. ప్రస్తుతం రాజ్యసభలో అదే పరిస్తితి. బీమా, బొగ్గు గనులు, భూసేకరణ చట్ట సవరణ, పౌరసత్వ సవరణ మొదలయిన అంశాలకు సంబంధించి జారీ చేసిన ఆర్దినెన్సులకు చట్ట స్వరూపం కల్పించడంలో ప్రతిపక్షాలనుంచి చిక్కులు రాగలవన్న సందేహం పాలక పక్షానికి  వుంది.    
ఈ గడ్డు పరిస్తితిని అధిగమించడానికి మోడీ ప్రభుత్వం,  రాజ్యాంగంలో ఇందుకోసం పొందుపరచిన   118 వ అధికరణం ఉపయోగించుకునే అవకాశాలున్నాయని మీడియాలో కధనాలు వెలువడుతున్న తరుణంలో  రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. సంయుక్త సమావేశంలో బిల్లులను ఆమోదించేటప్పుడు వోటు వేసే వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు తప్ప వారు రాజ్యసభ సభ్యులా, లేక లోకసభ సభ్యులా అన్న విషయం గమనంలోకి తీసుకోరు. 'విపక్షాలు బిల్లుల ఆమోదానికి సహకరించవు, లేదా ఆర్డినెన్సుల కాలపరిమితి ముగిసిపోతుంది' అనుకున్నప్పుడు పాలక పక్షాలు రాజ్యంగంలో పొందుపరచిన ఈ అధికరణాన్ని వాడుకుంటాయి. అయితే అత్యంత అత్యవసరం అనుకున్నప్పుడే ఈ వెసులుబాటును గతంలో ఉపయోగించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వంలో కదలిక తెచ్చిన సూచనలు కానవస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధానం తీసుకుని కేంద్రంలోని సీనియర్ మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు, 'దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆర్దినెన్సులను జారీచేసింద'ని చెప్పారు. 'మోడీ ప్రభుత్వం ఆరుమాసాల కాలంలో రికార్డు స్థాయిలో ఆర్దినెన్సులను జారీ చేసిందనీ, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేద'ని కాంగ్రెస్ నాయకులు  చేస్తున్న విమర్శలను వెంకయ్యనాయుడు తగిన గణాంకాలను ఉదహరిస్తూ తిప్పికొట్టారు. 1952 నుంచి ఇప్పటివరకు కేంద్రం మొత్తం  637 ఆర్డినెన్సులను జారీ చేయగా వాటిల్లో 456 ఆర్డినెన్సులు  కాంగ్రెస్ ప్రభుత్వ హయాములోనే జారీ అయిన సంగతి ఆయన గుర్తు చేశారు.
ఫిబ్రవరి మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే అవకాశాల దృష్ట్యా సంయుక్త సమావేశాల విషయంలో కేంద్రం అప్పటిలోగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం  వుంది.
అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఇలాటి విషయాల్లో అన్ని పార్టీలదీ  ఒకటే విధానం. అదికారంలో వున్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు మరో తీరు.
రాజకీయ అనుకూలతలే పార్టీల నిర్ణయాలకు ప్రాతిపదికలవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలే నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశ హితం, జాతి హితం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్రపతి హితవచనలయినా పాలక ప్రతిపక్షాలను దారిలో పెడతాయని ఆశిద్దాం. (21-01-2015)

NOTE: Courtesy Image Owner 

20, జనవరి 2015, మంగళవారం

ఎయిర్ ఫోర్స్ వన్


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత సందర్శన పుణ్యమా అని ఆయన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ గురించి మీడియాలో ఎన్నో ఆసక్తికరమైన కధనాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో దశాబ్దకాలం క్రితం నేనూ మా ఆవిడా అమెరికాలోని సియాటిల్ కు వెళ్ళినప్పుడు ఆ విమానం ఎక్కి కలయ తిరిగే ఓ అపూర్వ అవకాశం లభించింది. ఆ వివరాలను అప్పట్లో నా బ్లాగులో 'అమెరికా అనుభవాలు'  అనే శీర్షికతో అనేక భాగాలుగా రాసి నిక్షిప్తం చేసాను. అదే ఇది:  

"ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి. ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన ప్రత్యేక అనుమతి పత్రాలతో  ఒక రోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలు కల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజంను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
"మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యేక బస్సుల్లో లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశద పరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.
అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.
"రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు, సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్పాత మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.
"అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు. (2004)



NOTE: Courtesy Image Owner