17, జనవరి 2015, శనివారం

రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్

PUBLISHED IN 'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 18-01-2015,SUNDAY
(జనవరి, 18 యన్టీఆర్ వర్ధంతి) 


యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు.
"ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"
కాదన్నారు వాళ్లు.
"మరేమిటి?" సీ.ఎం. అరా.
"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల జవాబు.
"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ ముగించారు యన్టీయార్.
ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ, నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ  ఏ.కే. మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే ఈ ఉదంతం వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో యన్టీయార్ ది ఒక ఉత్కృష్ట అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను  బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో  ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కాగలిగారు. మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా యన్టీయార్ తెలుగుదేశం పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.     
 తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు, 'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన  తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో తొమ్మిది మాసాల పసికూన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203  స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన కాంగ్రెస్ 60  సీట్లకే పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీయార్ ప్రతిభ దేశం నలుమూలకు పాకింది.
అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ ప్రజాకర్షణ ఆత్మ స్తైర్యాన్ని మరింత పెంచింది. ఈ విజయం వల్ల వొనగూడిన ఆత్మవిశ్వాసంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత  ప్రదర్శించిన ధిక్కార ధోరణి యన్టీయార్ కు జనబాహుళ్యంలో మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడుపోసుకోవడానికి ఉపకరించింది. ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల  భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పుతెచ్చింది. దరిమిలా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికల ద్వారా కాకుండా ఎన్నికయిన సభ్యులను తమ వైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ అవిర్భావంవల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసరాలు  కావడం, నైతిక విలువలు దారుణంగా  క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే పెరిగిపోయాయి అనడం  సత్య దూరం కానేరదు. ఈ మంచి చెడులకు  రామారావు గారిని బాధ్యుడిని చేయడం కూడా సమజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ, సన్నిహితంగా మెలిగిన  అధికారులకు, కొందరు విలేకరులకు  ఈ విషయం ఎరుకే. దానికి మహంతి వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు.  ఆ  ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా అదే.
ఏ కాంగ్రెస్ పార్టీని యన్టీయార్ సకల పాపాలకు కూపంగా అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో  సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో యన్టీయార్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం వాస్తవం.
గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు' మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం  విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ,   జనం గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.                
చనిపోయినవాడి కన్నులు చారడేసి అని సామెత. పోయినవాళ్ళను గౌరవంగా తలచుకోవడానికి అలా అంటారు. బతికివున్నప్పుడు కూడా అదేవిధమైన గౌరవ,ప్రతిపత్తులు, మర్యాద మన్ననలు సంపాదించుకున్నవాళ్ళు మరింత అదృష్టవంతులు. ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో మొట్టమొదట స్మరించుకోదగినవారు యన్.టీ. రామారావు గారు.

ఆయన చనిపోయి ఈనాటికి (జనవరి, 18) పందొమ్మిదేళ్లు గడిచిపోయాయి.  ఒకరకంగా అప్పటికీ ఇప్పటికి  ఒక తరం మారిపోయింది. అయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్మృతి పదిలంగానే వుంది. (18-01-2015)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

1983లో NTR సాధించిన విజయానికి, 2014లో మోదీ సాధించిన విజయానికి చాలా పోలికలు ఉన్నట్టు అనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

Do not compare Modi with NTR. Modi is a born leader. Whereas NTR leadership qualities projected by eenadu. He was not a leader.

అజ్ఞాత చెప్పారు...

ఎప్పుడు చూడు రామోజీ మీద పడి ఏడవడమే. ఎవడైనా బాగుపడితే చూడలేరు, కష్టపడి పైకిరాకూడదు, పందికొక్కుల్లాగా జనాలని దోచుకుతింటే మీ కళ్ళు చల్లగా ఉంటాయి.