28, ఫిబ్రవరి 2013, గురువారం

జగమంత కుటుంబం
జియోనా ఛానా
వినడానికి చాలా చిన్న పేరు. కానీ ఇతడి గురించి చెప్పడానికి చాలా వుంది.
ప్రపంచం మొత్తంలో అతడికున్నంత  పెద్ద కుటుంబం మరెవ్వరికీ లేకపోవడమే ఇతగాడి గొప్పతనం.
39 మంది భార్యలు –  94 మంది పిల్లలు- 33 మంది మనుమలు మనుమరాండ్రు.
పరువంలో వున్నప్పుడు ఒక్క ఏడాదిలోనే పదిమంది ఆడవాళ్ళను పెళ్ళాడి తన ఘనతను పదిమందికి చాటిచెప్పాడు.  
రెక్కలు వచ్చిన పక్షుల మాదిరిగా ఎగిరిపోకుండా అంతా కలసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. ఒక్క ఇంట్లోనే  వుంటున్నారు.
ఇందుకోసం జియోనా ఏకంగా వంద గదులతో నాలుగంతస్తుల ఇంటిని పర్వత సానువుల్లో నిర్మించుకున్నాడు.
ఇంతమంది భోజనం చేయాలన్నా, అందుకు ఏర్పాట్లు చేయాలన్నా మాటలు కాదు.
రోజుకు ముప్పయి కోళ్ళు తెగుతాయి.
వంద కిలోల బియ్యం వండి వారుస్తారు.
కూరగాయల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా ఓ రైతు బజారే కావాలి.
ఇంతకీ అసలు విశేషం ఏమిటంటే –
ప్రపంచం మొత్తంలో ఈ ఘన కీర్తి సంపాదించుకున్న జియోనా ఎవ్వరో కాదు.
మన తోటి భారతీయుడే. మిజోరాం రాష్ట్రంలో భక్త్ వాగ్  అనే గ్రామవాసి.
నలభై వేలమంది వున్న ఓ తెగకు  నాయకుడు.  ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ నాయకుడి  తెగింపుకి కారణం. 

NOTE: Courtesy Image Owners 

పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 3 ఈ వ్యాసాలు రాసి నాలుగయిదేళ్ళు  గడిచిపోయాయి. ఆనాటి  సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాశం  వుంది కాబట్టి ఈ వినతి. -  రచయిత

స్వేచ్ఛకు సైతం హద్దులు వుండాలి 

పత్రికలు చదవను.  టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల  ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
“విద్యా సంస్థలు బంద్  అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది.యెంత చెప్పినా వినదు. ఇక  స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ మాటలు అన్నది సాక్షాత్తూ హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
నిన్నబుధవారం నాడు  నగరంలో జరిగిన ఒక  సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
కొత్వాల్ గారు అంతటితో ఆగలేదు.
“ఉస్మానియా యూనివర్సిటీ లో చిన్న సంఘటన జరిగితే చాలు. మీడియా దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంది.విశ్వవిద్యాలయం గేటువద్ద జరిగే సంఘటనలను నగరమంతటా జరుగుతున్నట్టు చూపించడం ఏమిటి?” అని ఒక ప్రశ్నను కూడా మీడియాకు సంధించారు.
ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం  కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్ గారి ఈ  భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.  
 

 ‘చేతులు  బార్లా   జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతివేలి  కొనభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఆ  స్వేచ్చ  అని ఓ ఆంగ్ల సామెత వుంది.  అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

పైకి చెప్పుకునే కారణాలు ఏమైనప్పటికీ, ఎన్ని వున్నప్పటికీ, ప్రజాస్వామ్య మూలసౌధాలన్నీ పత్రికా స్వేచ్ఛకు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అసలు సిసలు పునాది రాయి వంటి సామాన్య వోటరుతో నిమిత్తం లేకుండా, అతడి ప్రమేయం లేకుండా ఈ రభస సాగుతూ వుండడమే  ఇందులోని  విషాదం.

మన దేశ ప్రజాస్వామ్యం ఇంత బలంగా వేళ్ళూనుకుని వుండడానికి కారణం మేమంటే మేమని ఎందరు బడాయిలకు పోయినా ఈ ఘనత సాధారణ వోటరుదని ఒప్పుకుని తీరాలి. అత్యధిక శాతం నిరక్షురాస్యులయిన వోటర్లు పత్రికలూ చదవకుండానే, మీడియా విశ్లేషణలతో నిమిత్తం లేకుండానే గతంలో జరిగిన ఎన్నో ఎన్నికలలో తమ పరిణతిని ప్రపంచానికి చాటి చూపారు. భారత దేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన ఇరుగు పొరుగు దేశాల్లోని  ప్రజాస్వామ్య వ్యవస్థలు  కుప్పకూలిపోయి, సైన్యం సాయంతో నియంతలు రాజ్యం చేయాల్సిన దుస్తితి దాపురిస్తుంటే, మన వోటర్లు మాత్రం కేవలం వోటు హక్కుతో ప్రభుత్వాలను మారుస్తున్నారు. గిట్టని పార్టీలకు బుద్ధి చెప్పి, తాము  మెచ్చిన పార్టీలను గద్దెనెక్కిస్తున్నారు.

మేధావులమని అనుకుంటున్నవాళ్ళు  గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్థలన్నీ  ఈ ఆరుదశాబ్దాల పై చిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్థానాల్లో , చట్ట సభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు ప్రతి విమర్శలు, వాదోపవాదాలు,నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు-
పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ-
వ్యాపార కళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి.  పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్థలు కాలక్రమేణా ప్రత్యర్ధులపై   పైచేయి కోసం కత్తులు దూస్తున్నాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ప్రభుత్వాలు  సాగించే అక్రమాలతో పోలిస్తే-
పత్రికలను  అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని  చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.
తాము ప్రాతినిధ్యం వహించే సంస్థల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ
తమ రాతలతో, చేతలతో సమాజానికి సంకటంగా తయారయిన వారు
వారు ఎవరయినా సరే-
ఆ వ్యక్తి,
గ్రామస్తాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు-
బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు-
ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు-
రాష్ట్రాన్ని పాలించే అధినేత కావచ్చు-
పార్ట్ టైం విలేకరి కావచ్చు-
ప్రధాన సంపాదకుడు కావచ్చు-
ఏ స్తాయిలో వున్నా, ఏ  హోదాలో వున్నా ఖండనకు అర్హులే.
ఏదో ఒక పేరుతొ ఏదో ఒక సాకుతో
అలాటివారిని కాపాడాలని అనుకోవడం
కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది. (13-01-2011)
NOTE: Courtesy Image Owner 

27, ఫిబ్రవరి 2013, బుధవారం

పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 2 ఈ వ్యాసాలు రాసి నాలుగయిదేళ్ళు  గడిచిపోయాయి. ఆనాటి  సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాసం వుంది కాబట్టి ఈ వినతి. -  రచయిత


శ్రీ నరిసెట్టి ఇన్నయ్య 


విదేశీ మద్యంలాటి పుస్తకం
రామభద్రుడంతటివాడు పలికించాడు కనుకనే తాను భాగవతం రాయగలిగానని భక్త పోతన అంతటివాడు చెప్పుకున్నాడు.
పలికేవాడికి పలికించేవాడు – రాసేవాడికి రాయించే వాడు – చదివేవాడికి చదివించేవాడు వుండాలన్నది నా అనుభవం.
లబ్ధప్రతిష్టుడయిన ఓ రచయిత – అంతగా ప్రతిష్ట లబ్దం కాని తొలి రోజుల్లో – తన ఇంట్లోని డ్రాయింగు రూమ్ అనే ఇంటి ముందు వసారాలో ఓ చిన్న సైజు గ్రంధాలయం లాంటి పుస్తక భాండాగారాన్ని ప్రదర్శించేవాడు.
‘అయ్యా/అమ్మా – దయచేసి ఈ పుస్తకాలను అరువు అడక్కండి. ఎందుకంటే ఇక్కడ వున్న ఈ పుస్తకాలన్నీ అలా అరువడిగి సేకరించినవే!’ అని రాసివున్న కాగితాన్ని ఆ పుస్తకాల బీరువాకు అంటించేవాడు. ఆ స్థాయిలో కాకపోయినా మా ఇంట్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే పుస్తకాలు వున్నాయి. వీటిల్లో మిత్రులు ఆర్ వీ వీ కృష్ణారావు గారు ఇచ్చినవే ఎక్కువ. ఆయన ఎప్పుడు పుస్తకాలు కొన్నా – మూడు నాలుగు కొనేసి- ఒకటి తను వుంచుకుని మిగిలినవి పుస్తక ప్రియులకు కానుకగా ఇచ్చేవాడు. ఆయనకున్న ఈ మహత్తర అలవాటు పుణ్యమా అని అనేకానేక పుస్తకాలను ఉచితంగా చదివే మహదవకాశం నాకు లభించింది. అలా ఎన్.ఇన్నయ్య రాసిన పుస్తకం ఒకటి ఈ మధ్య చదివాను. జర్నలిస్తుగా చిరకాలం పనిచేసిన ఇన్నయ్య, భిన్న రంగాలకు చెందిన వారితో తన అనుభవాలను ఇందులో పొందుపరిచారు.
అదృష్ట దురదృష్టాలను నమ్మే వ్యక్తి కాకపోయినా – తన అనుభవ’సారా’లను (ఆయన మాత్రం సరసాలనే రాసుకున్నారు) ఒక పుస్తకంగా  అచ్చువేయించుకోగలిగారు. చాలామంది జర్నలిష్టులు ఈ విషయంలో దురదృష్టవంతులే.
ఇక ఇన్నయ్య గారు ఈ పుస్తకంలో –అబ్బూరి మొదలుకుని పాలగుమ్మి పద్మరాజు దాకా ముప్పయి నాలుగు మందితో తనకున్న జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. వీరందరూ కీర్తిమంతుల కోవలోని వారే – ఇద్దరు ముగ్గురు మినహా- పోతే మిగిలినవారందరూ కీర్తిశేషులే.
కులాలు,మతాలూ, మూఢవిశ్వాసాలు వీటి పొడ గిట్టని ఇన్నయ్య ఈ పుస్తకంలో పేర్కొన్న కొందరిపట్ల చేసిన వ్యాఖ్యలు, వారితోవున్న చనువుతో చేసానని చెప్పుకున్నప్పటికీ – వివరణ ఇచ్చుకునే అవకాశం లేనివారిపట్ల కొంత ఉదారంగా వుంటే బాగుండునని ఈ పుస్తకం చదివిన తరువాత ఇన్నయ్యగారి మిత్ర బృందంలో ఒకడినయిన నాకు అనిపించింది.
నండూరి రామమోహనరావు ‘గుమాస్తా’ ఎడిటర్ అని, దేవులపల్లి కృష్ణ శాస్త్రి అబద్ధాలతో బతికేవాడని, పీవీ నరసింహారావు శీలవంతుడు కాడని, పురాణం సుబ్రహ్మణ్య శర్మ నార్ల కాళ్ళపై పడి క్షమించమని వేడుకుని ఉద్యోగం కాపాడుకున్నాడనీ- ఇలా కొన్ని వాక్యాలు చదివినప్పుడు, తెలిసిన అన్ని విషయాలను తెలిసినంత మాత్రాన ‘నగ్నంగా’ రాయాలని రూలేమీ లేదు కదా! అని ఎవరికయినా అనిపించకతప్పదు.
‘సినారె’ గురించి ఈ పుస్తకంలో ఇన్నయ్య రాసిన ఒక పేరా.
‘నారాయణ రెడ్డి సభలలో మాట్లాడేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా వుండి, శ్రద్ధగా వినాలని కోరేవాడు. తన బిరుదులన్నీ విధిగా ఆహ్వాన పత్రికలో వేయాలని షరతు పెట్టేవాడు. కాని ఇతరులు సభలో మాట్లాడేటప్పుడు సినారె క్రమశిక్షణ పాటించేవాడు కాదు’ – నిజం కాదని యెవరనగలరు?
‘సాహితీపరులు, పాత్రికేయులతో సరసాలు’ అనే పేరుతొ నరిసెట్టి ఇన్నయ్య రాసిన ఈ పుస్తకంలో పటుతరమయిన వ్యాఖ్యలు, కటుతరమయిన విమర్శలు, చురుక్కుమనిపించే ఛలోక్తులు, చివుక్కుమనిపించే వ్యంగోక్తులతో పాటు – పేజీకి కనీసం నాలుగు పెగ్గులయినా ‘మద్యం’ ప్రసక్తి దొర్లడం ఈ పుస్తకంలో మరో ప్రత్యేకత.
హాట్స్ ఆఫ్ టు ఇన్నయ్య! – త్రీ చీర్స్ టు ఇన్నయ్య!  (ఫిబ్రవరి -2009)
                             

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 1(ఈ వ్యాసాలు రాసి నాలుగయిదేళ్ళు  గడిచిపోయాయి. ఆనాటి  సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాశం వుంది కాబట్టి ఈ వినతి.)
ఈ ప్రశ్నకు బదులేది?

"అతడు ఖచ్చితంగా ఉగ్రవాది అయివుంటాడు. అతడి దగ్గర రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ వున్నాయి. మామూలు వాడికి ఇన్ని కార్డులు సంపాదించడం అంటే మాటలు కాదు"
(కార్టూనిస్టు సుభానీ గారికి కృతజ్ఞతలతో)    


పూర్వం ఆదిశంకరులవారు కాశీలో వెడుతున్నప్పుడు దారిలో ఎదురయిన వ్యక్తిని తప్పుకోమంటారు.
‘ఎవరిని తప్పుకోమంటున్నావు? నన్నా? నాలోని ఆత్మనా?’ అని ఆ వ్యక్తి ఎదురు ప్రశ్నించడంతో – ఎదురుపడ్డవాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అన్న ఎరుకగలిగిన ఆదిశంకరులవారు – శివుడిని స్తుతిస్తూ ఐదు శ్లోకాలతో కూడిన ‘మనీషా పంచకా’న్ని పఠిస్తారు.
ఈ ఘట్టాన్ని యెందుకు స్మరించుకోవాల్సి వచ్చిందంటే –
నగర జీవికి కావాల్సిన నిత్యావసరాల జాబితా క్రమంగా పెరిగిపోతోంది. వెనకటికి – రోటీ,కపడా,మకాన్- అంటే తినేందుకు తిండీ, కట్టేందుకు బట్టా,వుండేందుకు గూడూ వుంటే సరిపోతుందనుకునే వారు. ఇప్పుడీ జాబితాలో కొత్తగా ‘అడ్రసు ప్రూఫ్’ అనే కొత్త పదం జోడయింది.(అప్పటికి ‘ఆధార్’ కార్డుల ఆలోచన కూడా పురుడు పోసుకోలేదు) రేషన్ కార్డు మొదలుకుని పాన్ కార్డు వరకు యేది కావాలన్నా ముందు అడిగేది ఈ ‘అడ్రసు ప్రూఫే’
నువ్వెవరో ఏమిటో అక్కరలేదు. కాని  వుంటున్న చిరునామాకి సంబంధించిన రుజువు మాత్రం సంపాదించి పెట్టుకోవాలి. సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా, టెలి ఫోన్ పెట్టించుకోవాలన్నా ఈ ‘చిరునామా ధృవీకరణ పత్రం’ (రెసిడెన్సు ప్రూఫ్) తప్పనిసరి.
ఇక్కడే ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ అనే మాదిరి ప్రశ్న తలెత్తుతుంది.
‘మీరు పలానా చిరునామాలో వున్నట్టు రుజువు పట్రండి’ అని తేలిగ్గా అనేస్తారు. కరెంటు బిల్లో, వాటర్ బిల్లో, టెలిఫోన్ బిల్లో జిరాక్స్ కాపీలు తెమ్మంటారు.
నగరంలో అధిక శాతం జనాభాకి సొంత ఇళ్లు వుండవు. కిరాయి ఇళ్ళల్లో బతుకు బండి లాగిస్తుంటారు. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఇంటి యజమానుల పేరుతొ వుంటాయి. పోనీ ఫోను పెట్టించుకుని ఆ బిల్లు కాపీ పెడదామనుకుంటే ఫోను మంజూరుకు చిరునామా రుజువు పట్టుకు రమ్మంటారు. ‘అయ్యా! పలానా ఇంట్లో వున్నది నేనే’ అని  నెత్తీ నోరూ బాదుకున్నా ప్రయోజనం వుండదు. ‘అడ్రసు ప్రూఫ్’ లేనిదే పని నడవదు. రోజు గడవదు.
రేషన్ కార్డు, వోటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా,  ఏటీఎం కార్డు, పనిచేస్తున్న ఉద్యోగం తాలూకు కార్డు, చివరాఖరుకు పాస్ పోర్ట్ తో సహా అన్నీవున్నా – సొంత గూడు లేని సగటు జీవికి మాత్రం వుంటున్న చిరునామా  కార్డు కార్డుకీ ఇల్లు మారినప్పుడల్లా మారిపోతూనే వుంటుంది. అడ్రసు ప్రూఫ్ అవసరం వచ్చిందంటే  మళ్ళీ కధ మొదటికి వచ్చినట్టే.
‘నువ్వెవరు? నీ చిరునామా ఏమిటి?’ అనేవి నిజానికి చిన్న ప్రశ్నలే. రుజువు అడిగినప్పుడే సమాధానం దొరకని క్లిష్ట ప్రశ్నలుగా మారతాయి.
ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యంలో ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి వలసలు తప్పనిసరి. వలస వెళ్ళినప్పుడల్లా చిరునామాకు రుజువులు సంపాదించుకోవడంలోనే సగం కాలం చెల్లిపోతోంది. అందుబాటులోవున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సమస్యకు ఏదయినా పరిష్కారాన్ని కనుగొనగలిగితే సామాన్యుల కష్టాలు గట్టెక్కుతాయి.
‘నేనంటే ఎవరు? నేనా? నా లోని ఆత్మా?’ అన్న ప్రశ్నతో ఆదిశంకరులవారు ‘మనీషా పంచకాన్ని’ పఠించి – ఆ ప్రశ్న లోని క్లిష్టతను జగత్తుకు చాటి చెప్పగలిగారు.
‘ఎవరు నువ్వు? నీ చిరునామా ఏమిటి? దానికి రుజువేమిటి?’ అనే ఈనాటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే సామాన్యులకు సాధ్యపడే పనేనా? పాలకులూ ఆలోచించండి!
(వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాసరావు – 13-01-2008)

ఇంటర్యూలు చేయడం యెలా?ఉద్యోగాలకు సరయిన అభ్యర్ధులను యెలా ఎంపిక చేయాలి ?  అనే అంశంపై ఒక ఆసక్తికరమయిన విధివిధానం నెట్లో తారాడుతోంది. అది ఏమనిన:


ఉద్యోగార్ధులనందరినీ ఒక గదిలో ప్రవేశపెట్టాలి. ఆ గదిలో అంతకు ముందే  కొన్ని ఇటుకలను అట్టేపెట్టాలి. పెట్టి విడతలు విడతలుగా అభ్యర్ధులను ఆ గదిలోకి పంపి తలుపులు మూసేయాలి. అయిదారు గంటల తరువాత గదిలోకి వెళ్ళి అక్కడి పరిస్తితిని ఓ మారు పరిశీలించాలి.

ఒకవేళ వారిలో ఎవరయినా ఇటుకలను ఇంకా లెక్కపెడుతూవుంటే అలాటివారిని అక్కౌంట్ డిపార్ట్ మెంటులో నియమించాలి.
వారిలో ఎవరయినా లెక్కపెట్టిన ఇటుకలనే మళ్ళీ లెక్కిస్తూ కనబడితే వారిని ఆడిటర్లుగా నియమించాలి.
ఎవరయినా ఇటుకలను గదిలో గందరగోళంగా సర్దే ప్రయత్నం చేస్తే వారిని ఇంజనీరింగు విభాగానికి పంపాలి.    
అలాకాకుండా ఇటుకలను విడ్డూరమైన విధానంలో అమర్చినట్టు కనబడితే వారిని ప్లానింగు విభాగంలో నియోగించాలి.  
ఇటుకలను ఒకరిపై మరొకరు విసురుకుంటున్న వాళ్ళను తక్షణం ఆపరేషన్స్ విభాగానికి పంపాలి.
నిద్రపోతూ కనబడ్డవారిని సెక్యూరిటీ లో నియమించాలి.
అసలేమీ చేయకుండా బద్ధకంగా కూర్చున్నవారిని హెచ్ ఆర్డీ లో వేయాలి.
ఒక్క ఇటుక కూడా కదల్పకుండా ఆలోచిస్తూ కూర్చున్నవారిని సేల్స్ విభాగానికి పంపాలి.
కిటికీ లోనుంచి దిక్కులు చూసేవారికి  స్ట్రాటజిక్ ప్లానింగు విభాగంలో పోస్టింగు ఇవ్వాలి.
ఎవరయినా ఒక్క ఇటుక కూడా కదపకుండా ఒకరితో మరొకరు ముచ్చట్లు చెప్పుకుంటున్న వారు కనిపిస్తే వారిని మనసారా అభినందించి కార్యాలయ అధిపతులుగా నియమించాలి. (26-02-2013)
Courtesy image owner

Top Story - Debate on Dharmana Issue in AP (TV5)

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

నిర్లక్ష్యంలో సమన్వయంహైదరాబాదులో గత గురువారం సాయంత్రం జరిగిన ఘోర కలి గురించి రెండు  మూడు రోజులుగా అనేక టీవీ ఛానళ్ళు వరసగా పలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసాయి. వాటిల్లో పాల్గొన్న సందర్భాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇది అక్షర రూపం.


“ఉగ్రవాద ఘాతుకాలను శత్రు దేశం సాగించే యుద్ధంతో సమానంగా పరిగణించాలి. ఈ చర్యలకు బలై పోయినవారినీ, అంగవైకల్యం పొందినవారినీ ప్రభుత్వం ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆదుకోవాలి. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలు అనే షరా మామూలు ప్రకటనలతో సరిపుచ్చకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి లేదా గాయపడిన వీర సైనికులకు అందచేస్తున్న తరహాలో వారికీ, వారి కుటుంబాలకు శాశ్విత  ప్రాతిపదికన సాయం అందించాలి. ‘గాయపడిన వారికి మెరుగయిన వైద్య సాయం అందించాలని  అధికారులను ఆదేశించాం’ అంటూ చేస్తున్న ప్రకటనలను  టీవీల్లో చూస్తూ, గతంలో జరిగిన సంఘటనల్లో అంగవైకల్యం పొంది ఇప్పటిదాకా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు ఎంతగా రగిలిపోతుంటారో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక బాధ్యతగా టీవీ ఛానళ్ళు అలనాటి దురదృష్టవంతుల దీన గాధలను మరోమారు ప్రసారం చేసి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి.”
“ దిల్ సుఖ్ నగర్ ఘాతుకానికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ. నిఘావిభాగం ముందస్తుగా చేసిన హెచ్చరికలు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటవెంటనే తెలియచేసామని చెప్పి ఆయన చేతులు కడిగేసుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థల బృందాలను హైదరాబాదు పంపుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మొత్తం దేశానికి హోం మంత్రి అయిన ఆయన తనకు అందిన సమాచారాన్ని బట్వాడా చేసి వూరుకోకుండా మరికొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుని వుంటే కొంత ప్రయోజనం వుండేది. అలా కాకుండా సంఘటన జరిగిన తరువాత హైదరాబాదు వచ్చివెళ్లడం కేవలం కంటితుడుపు చర్యగా జనం భావిస్తే తప్పుపట్టాల్సింది వుండదు.”
“కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలను రొటీన్ వ్యవహారంగా భావించామని, ఇంత ఘోరం జరుగుతుందని వూహించ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి అన్నట్టు  ఈ ఉదయం పత్రికల్లో, మీడియా స్క్రోలింగు లలో వచ్చింది. ఇదే నిజమయితే, బాధ్యతారాహిత్యానికి అసలు సిసలు పరాకాష్ట అనే చెప్పాలి.”
“ఈ దుర్ఘటనకు నిరసనగా భారత్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం సహేతుకంగా లేదు. ప్రజలు ఆందోళనలో వున్నప్పుడు వారికి బాసటగా నిలవాలే కాని, బంద్ లు, రాస్తా రోఖోలు వంటి కార్యక్రమాలద్వారా వారి ఇబ్బందులను మరింత పెంచకూడదు. ప్రతిపాదిత సడక్ బంద్ ను వాయిదా వేసుకుంటున్నట్టు టీ ఆర్ ఎస్ ప్రకటించడం హర్షనీయం.”
“షిండే వచ్చివెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు  రాజనాథ్ సింగ్ వస్తున్నారు. పాదయాత్రకు విరామం ఇచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాదు వస్తున్నట్టు ఇప్పుడే టీవీ స్క్రోలింగు లలో వస్తోంది. రేపో మాపో ప్రధానమంత్రి రావచ్చు. ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా వెనుకబడే ప్రసక్తి వుండదు. ఇంతమంది వచ్చి చేసేదేమీ వుండదు. కానీ రాజకీయంగా వారికిది తప్పనిసరి. వస్తే, వీరు వచ్చి చేసిందేమిటి అంటారు.రాకపోతే వీళ్ళకు జనం ప్రాణాలు అంటే పూచికపుల్లలతో సమానం అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. అందువల్ల రాకతప్పదు. ఆలాంటప్పుడు అనుచరగణంతో హడావిడి చేయడం కాకుండా, విధి నిర్వహణలో వున్న పోలీసులను ఇబ్బంది పెట్టకుండా బాధితులను పరామర్శించి వెళ్ళే పద్ధతికి స్వీకారం చుట్టాలి. వూరికే వచ్చాం,చూసాం,వెళ్ళాం అని కాకుండా తమ పార్టీల తరపున బాధితులకు ఎంతో కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.”
“పేలుడు సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రధాన పత్రికల్లో ప్రచురించిన ఫోటోలు చూడండి. శరీరాలు చిద్రమై రోడ్డున పడివున్నవారి దాపుల్లో అక్కడక్కడా మంటలు చెలరేగుతూనే వున్నాయి. అంటే పేలుడు జరిగిన కొద్ది సేపటిలోనే మీడియా వారు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగలిగారు. ఆ ఫోటోలను పరికించి చూస్తే ఒక్క పోలీసు జవాను కూడా కనబడడు. పేలుడు జరిగిన తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. అప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే. రోప్ పార్టీలతో కూడిన రక్షణ వలయాలే.”
“ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం అమెరికాకే సాధ్యం కాలేదు. కాని జరిగిన తరువాత ఏం చేయాలి అన్న విషయంలో మన దగ్గర ఇంకా అయోమయమే. సమన్వయ లోపం కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. పోనీ ఇది మొదటిసారా అంటే కాదు. గతంలో కూడా జరిగాయి. కానీ వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకున్న దాఖలా కనబడడం లేదు. ఉగ్రవాదులకు హైదరాబాదు అడ్డాగా మారిందని అంతా అంటూ వుంటారు. కానీ చేతల్లో పూజ్యం.”
“ఇలాటి సంఘటనలు పునరావృతం కానివ్వమన్న ప్రకటనలే  పునరావృతం అవుతుంటాయి. పేలుళ్లు సరేసరి. అసమర్ధ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రత్యర్ధులు అంటుంటారు. వారు అధికారంలో వున్న రోజుల్లో కూడా ఇలాటి ఉగ్రవాద దాడులు జరిగిన సంఘటనలు మాత్రం మరచిపోతుంటారు. రాజకీయ జోక్యం లేకపోతే వీటిని అరికట్టడం సాధ్యమని రాజకీయ నాయకులే చెబుతూ వుండడం విడ్డూరం.”
“సీ.సీ. కెమెరాల సాయంతో మొన్నటికి మొన్న సైబరాబాదు పోలీసులు ఒక మహిళపై అత్యాచారం చేయబోయిన దుండగులను  ఇరవై నాలుగు గంటలు గడవకముందే అరెస్టు చేశారు. మరి, దిల్ సుఖ్  నగర్ లో సీ.సీ. కెమెరాల వైర్లు ఎవరో రెండు రోజులక్రితమే కత్తిరించారని అంటున్నారు. తీగెలు  కత్తిరిస్తే, ఆ ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడాల్సిన సిబ్బంది ఏమి చేస్తున్నట్టు. పలానా ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా  ఒక్క దృశ్యము రికార్డు కాలేదని యెందుకు తెలుసుకోలేకపోయారు?  అలాగే పోలీసు కమీషనర్  సాయిబాబాబా గుడికి వెళ్లడం వల్ల అక్కడ పోలీసుల హడావిడి గమనించి ఉగ్రవాదులు తమ టార్గెట్ ప్రాంతాన్ని మార్చుకున్నారని అంటున్నారు. అంటే ఏమిటి, పోలీసుల నిఘా వుంటే ఉగ్రవాదుల ఆటలు సాగవనే కదా. ఉగ్రవాద దాడిని గురించి ముందస్తు సమాచారం వున్నప్పుడు దాన్నేదో అతి రహస్యం కింద దాచిపెట్ట కుండా  అమెరికా వాళ్లు తమ పౌరులను హెచ్చరించినట్టు నగరంలో రద్దీగా వుండే ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసి వుండాల్సింది. పోలీసులను మోహరించి, పోలీసు జాగిలాలను ఆయా ప్రాంతాలలో తిప్పి  వుండాల్సింది.”  (24-02-2013)
(సాక్షి, దూరదర్శన్ సప్తగిరి,  హెచ్.ఎం.టీ.వీ.,  టీవీ -5,  స్టుడియో ఎన్, వీ 6 న్యూస్, మహా టీవీల సౌజన్యంతో) 

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎప్పుడో ఎక్కడో విన్నట్టు వుంది కదూ!
‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం!’
‘దోషులు ఎంతటివారయినా అరెస్టు చేసితీరుతాం!’
‘ప్రజల ప్రాణాలు కాపాడడం పాలకులుగా మా ప్రాధమిక కర్తవ్యం’
‘ఇలాటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’
‘పేలుళ్ళలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్ష రూపాయలు. గాయపడిన వారికి యాభై వేలు’
‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవడానికి మెరుగయిన వైద్యసాయం అందిస్తాం’
‘నిఘా వైఫల్యం’
‘ ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ అసమర్ధ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు’  
‘తక్షణం రాజీనామా చేయాలి’
‘చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి’
..........ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుంది కదూ.
ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఇలాటి మాటలు పరిపాటే.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో అసువులు బాసిన వారు ఈ వ్యర్ధప్రలాపాలు వినే అవకాశం ఎట్లాగో లేదు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి చెవినపడ్డా నవ్వుకునే పరిస్తితిలో వుండి వుండరు.
గతంలో జరిగిన ఈ మాదిరి దుర్ఘటనల్లో గాయపడి అంగవైకల్యంతో అలమటిస్తున్నవాళ్ళు ఈ మాటలు వింటూ ఎన్ని శాపనార్ధాలు పెట్టుకుంటున్నారో తెలవదు.
దేవుడే ఈ దేశాన్ని రక్షించాలి.
దేవుడి పేరుతోనే ఇవన్నీ జరుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? (22-02-2013)

NOTE: Courtesy image owner

21, ఫిబ్రవరి 2013, గురువారం

Hyderabad Blasts - Shame on Our PartOne thing we all should accept. When Blasting news scrolling was on TV channels, many relatives and friends from other cities and other parts of the country inquired about our safety. None from Hyderabad. We too, are not exception. We just watch the incidents just like any tv episode or serial. No concern. Leaders compete with each other to condemn the incident. Media covers it. Later, all of us forget conveniently.We must curse ourselves.Not anybody.Sakshi Prime Time Show 20th Feb 2013 - Sakshi TV

The ప్రైమ్ టైమ్ షో 20th feb -భండారు శ్రీనివాసరావు విత్ సాక్షి

The ప్రైమ్ టైమ్ షో 20th feb -భండారు శ్రీనివాసరావు విత్ సాక్షి

20, ఫిబ్రవరి 2013, బుధవారం

డబ్బును లెక్కచేయని డబ్బున్న మనిషి
లక్షా యాభయ్ వేల కోట్ల డాలర్లు. ఈ మొత్తాన్ని రూపాయల్లోకి మార్చి చెప్పాలంటే  పదిహేను పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో.


భార్యతో కలసి ఇంగ్వార్ కంప్రాడ్


అదొక సమావేశ మందిరం.
ప్రపంచంలో అత్యుత్తమ వ్యాపార ప్రముఖుడికి ఇచ్చే అవార్డ్ ప్రదానో త్సవం అక్కడ జరగబోతోంది. అంతా అతడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అక్కడ ఓ సిటీ బస్సు ఆగింది. అందులోనుంచి దళసరి కళ్ళద్దాలు, ముతక కోటు, మోటు బూట్లు ధరించిన ఓ వ్యక్తి కిందికి దిగి లోపలకు రాబోయాడు. అతడి వాలకం చూసి అక్కడి సెక్యూరిటీ గార్డులు ఆపే ప్రయత్నం చేశారు. వారికి తెలియదు, ఆ సాయంత్రం ఆ సభాభవనంలో జరిగే కార్యక్రమంలో అవార్డును స్వీకరించే ముఖ్య అతిధి అతడేనని.
ఇంగ్వార్ కంప్రాడ్ అతి సాధారణంగా కానవచ్చే అసాధారణ వ్యక్తి. కొన్ని వేల మిలియన్ల డాలర్లు విలువచేసే ‘ఐకియా’ సంస్థ సంస్థాపకుడు. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో ఏడో స్థానంలో వున్న వ్యక్తి. అయినా పైకి చూడడానికి డబ్బు ఇబ్బందుల్లో వున్న పింఛనుదారు మాదిరిగా కానవస్తాడు. అతడి మనస్తత్వాన్ని తెలిపే ఉదంతం ఒకటి ప్రచారంలో వుంది. అనేక  సంవత్సరాలుగా అలవాటయిన  క్షురకుడిని ఈ మధ్య మార్చారట. ఎందుకంటే అతడికంటే తక్కువ డబ్బులకు  క్షౌరం చేసే మరో క్షురకుడు దొరికాడట.
స్వీడిష్ జాతీయుడయిన కంప్రాడ్, ‘ఐకియా’ అనే పేరుతొ  గృహనిర్మాణ సామాగ్రి సంస్థను స్థాపించి, అనతికాలంలోనే  అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు, కోట్లల్లో డబ్బూ పోగేసుకున్నాడు. అంత కీర్తి గడించిన కంప్రాడ్ కాంస్య విగ్రహాన్ని అతడి సొంత పట్టణంలో  ఏర్పాటు చేసి కంప్రాడ్ ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారుట. ఆవిష్కరణ సూచకంగా రిబ్బన్ కత్తిరించడానికి బదులు కంప్రాడ్ ఆ రిబ్బన్ ను మడిచి నిర్వాహకుల  చేతిలో పెట్టి, బంగారంలాటి రిబ్బన్ ముక్కను ముక్కలుగా  కత్తిరించి వృధా చేయవద్దని ఓ ఉచిత సలహా ఇచ్చాడట.
భార్యతో కలసి లోకల్ రైళ్ళలో ప్రయాణిస్తూ, చిన్న చిన్న రెస్టారెంట్లలో భోజనం చేస్తుండడం ఆయనకు  అలవాటు. ‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు ఆయన వద్ద రెడీమేడ్ సమాధానం సిద్ధంగా వుంటుంది.
‘నేను పుటకతో సంపన్నుడిని కాను. నా పదిహేడో ఏట ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అయినా కష్టపడడంలో వున్న సుఖం ఏమిటో కష్టపడేవాడికే తెలుస్తుంది. డబ్బు ఖర్చు పెట్టడం, ఆడంబరంగా జీవించడం నాకు చేతకాకకాదు. నన్ను చూసి మరొకరు అనుకరించి కష్టాల పాలు కాకూడదనే నేనిలా చేస్తున్నాను. ఆదర్శాలు చెప్పడం కాదు ఆచరించడం అవసరం.’
అంటారాయన.
ఇక ఏమంటాం! 
NOTE: Courtesy image owner (20-02-2013)