30, జూన్ 2014, సోమవారం

హైదరాబాదు మెట్రో రైలు పట్టాలెక్కుతుందా !

జెమినీ న్యూస్ సాయంకాలపు చర్చ     
ఈరోజు (30-06-2014) సాయంత్రం నాలుగున్నర గంటలకు జెమినీ న్యూస్  టీవీ ఛానల్  పబ్లిక్ వాయిస్  ప్రోగ్రాం. ప్రెజెంటర్ హరికిషన్ 


"మెట్రో వివాదం విషయంలో సంయమనం అవసరం. చారిత్రిక కట్టడాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే. కానీ పాత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. పాలకులు మారినప్పుడల్లా ఒప్పందాలను తిరగతోడడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు జంకే ప్రమాదం వుంది. చారిత్రిక కట్టడాలు కనుమరుగు కాకుండా యెం చేయాలనేది ఉభయులు కూర్చుని మాట్లాడుకోవాలి. అడ్డుకుంటాం అని ఒకరు, అసలు పనులు ఆపేసి వెళ్ళిపోతాం అని మరొకరు భీష్మించుకోవడం సరయిన పద్దతి కాదు. మాల్దీవుల్లో మాలే విమానాశ్రయం ఒప్పందాన్ని అక్కడి  ప్రభుత్వం మారగానే రద్దు చేయడం వల్ల ఎలాటి  వివాదం చెలరేగిందో గమనంలో వుంచుకోవాలి. గత ప్రభుత్వాలు కాసులకు కక్కుర్తి పడి ఒప్పందాలు చేసుకున్నట్టు రుజువయినా, నాణ్యత విషయంలో రాజీ పడ్డట్టు అనుమానం వచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటే తప్పు పట్టేవారు వుండరు.

" ఇలాటి విషయాల్లో పాలకుల చిత్తశుద్ధి ప్రధానం. నా బాల్యాన్ని నాకివ్వు అనే హిందీ కవిత గుర్తుకు వస్తోంది. ఓ ఏభయ్ ఖమ్మం నుంచి బస్సులో హైదరాబాదు వస్తున్నప్పుడు కిటికీ చువ్వలు చల్లబడ్డాయి అంటే నగరం పొలిమేరలు చేరినట్టు. వీధులన్నీ శుభ్రంగా కడిగినట్టు వుండేవి. పక్కన పచ్చగా చెట్లు. ఇది ఇలాంటి హైదరాబాదు మళ్ళీ రావాలి, తెస్తాను అంటే జనం బ్రహ్మరధం పడతారు. అలాకాకుండా మైనదిగా పోవడం మంచిదికాదు. చర్చలకు పిలిచి కోరింది చెప్పాలి. వారు కోరుతోంది వినాలి. సమస్య చిటికెలో గాన్, గాయబ్. మాయమయింది. అంతే!'  
అసందర్భం అయినా ప్రస్తావించిన మరో అంశం:
మాస్కోలోని లెనిన్ స్కీ ప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో - పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చు బెట్టి ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.
 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి- భూగర్భం లోనే దానికింద చక్రాల ఉక్కు పలకను ఉంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చిని ఏమాత్రం దెబ్బతినకుండా వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డు పని పూర్తిచేశారని చెప్పుకునేవారు.

ఇది కధ అయినా కాకపోయినా ఇందులోనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. కదూ!

ఐ న్యూస్ న్యూస్ వాచ్


ఈరోజు (30-06-2014) ఉదయం ఏడు గంటలకు ఐ న్యూస్ టీవీ ఛానల్ న్యూస్ వాచ్ ప్రోగ్రాం. ప్రెజెంటర్ విజయ్.


"కృష్ణా జలాలను మళ్ళీ పంచాలని తెలంగాణా రాష్ట్రం డిమాండ్ చేయడం సబబే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు కేటాయింపులు అవి. ఒక రాష్ట్రం రెండు కొత్త రాష్ట్రాలుగా విడియినప్పుడు, గతంలో ఏవయినా అన్యాయాలు జరిగి వుంటే సరిదిద్ది మళ్ళీ పంపిణీ చేయాలని కోరడంలో తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు"

"మెట్రో వివాదం విషయంలో సంయమనం అవసరం. చారిత్రిక కట్టడాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే. కానీ పాత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. పాలకులు మారినప్పుడల్లా ఒప్పందాలను తిరగతోడడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు జంకే ప్రమాదం వుంది. చారిత్రిక కట్టడాలు కనుమరుగు కాకుండా యెం చేయాలనేది ఉభయులు కూర్చుని మాట్లాడుకోవాలి. అడ్డుకుంటాం అని ఒకరు, అసలు పనులు ఆపేసి వెళ్ళిపోతాం అని మరొకరు భీష్మించుకోవడం సరయిన పద్దతి కాదు. మాల్దీవుల్లో మాలే విమానాశ్రయం ఒప్పందాన్ని అక్కడి  ప్రభుత్వం మారగానే రద్దు చేయడం వల్ల ఎలాటి  వివాదం చెలరేగిందో గమనంలో వుంచుకోవాలి. గత ప్రభుత్వాలు కాసులకు కక్కుర్తి పడి ఒప్పందాలు చేసుకున్నట్టు రుజువయినా, నాణ్యత విషయంలో రాజీ పడ్డట్టు అనుమానం వచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటే తప్పు పట్టేవారు వుండరు"     

29, జూన్ 2014, ఆదివారం

గాయత్రి మంత్రం


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్(శ్రీ పరిపూర్ణానంద స్వామివారి 'శ్రీ పీఠం' ఆధ్యాత్మిక మాస పత్రికలో ప్రచురితం) న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.
• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.
• భూ: ఉనికి కలిగినవాడు 
• భువః – జ్ఞాన రూపుడు 
• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు 
• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు 
• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త 
• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు
• భర్గః – పరిశుద్ధుడు 
• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు 
• ధీమహి – ఆత్మలో ఏకమయిన 
• యః – ఆ పరమేశ్వరుడు 
• నః ధ్యః – మా బుద్ధులను 
• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.
ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

ఓ భగవాన్! 
ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే. 
మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సుమేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటేఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

• 
ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమిభువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిదిఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 
అందుకేఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం 
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికిగౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపంపేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపంనామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడునక్షత్రాలు) మనకు తెలియనిమనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగేఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 
భర్గో దేవస్య ధీమహి 
భర్గో అంటే కాంతిదేవస్య అంటే దేవతధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి)యో (ఎవరయితే),నః (మనమంతా)ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 
కాబట్టిమనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః రిగ్వేద 

(
అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)

28, జూన్ 2014, శనివారం

నిప్పుతో చెలగాటం


అట్టడుగున భూగర్భపు పొరల్లో నిక్షిప్తం అయివున్న చమురు గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడం, వాటిని వొడిసిపట్టి వినియోగంలోకి తీసుకు రావడం నిజంగా నిప్పుతో చెలగాటమే.     
అయినా  సరే చెలగాటానికే సిద్ధం అంటున్నారు ఈ రంగంలో మునిగితేలుతున్న వారందరూ.  
దీనికి కారణం వుంది. మిగిలిన ఇంధన వనరులతో పోలిస్తే ఇది నమ్మకంగా లభ్యం అవుతుంది. అలాగే ఇతరేతర   ఇంధన  వనరులు  అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా ఇది దొరుకుతుంది. నిలవచేసుకుని వాడుకునే సౌలభ్యం వుండడం అనేది మరో అదనపు ఆకర్షణ.
అంతా బాగానే వుంది కాని భూమి లోపలి పొరల్లో దాగున్న గ్యాస్ నిక్షేపాలను పైకి తీసుకురావడం అన్నది మాటలు కాదు. ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రభుత్వ రంగంలో వుండాల్సిన గ్యాస్ ఉత్పత్తిని క్రమంగా ప్రైవేటు సంస్థలు  చేజిక్కించుకున్నాయి. కృష్ణా గోదావరీ బేసిన్ ఇందుకు ఉదాహరణ. ఇక్కడ జరిగే గ్యాస్  ఉత్పత్తిలో  ప్రభుత్వ రంగ సంస్థ ఓ.ఎన్.జీ.సీ.తో పాటు రిలయెన్స్ వంటి బడా ప్రైవేటు సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్న ఈ ఉత్పాదక  రంగం మరోపక్క సృష్టిస్తున్న భీతావహ దుర్ఘటనలు గమనించినప్పుడు, మనం  వేస్తున్న ఈ అడుగులు సరిగా ముందుకు పడుతున్నాయా లేక గోతిలోకి నెడుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ముందే చెప్పుకున్నట్టు గ్యాస్ వెలికితీత  అనేది నిప్పుతో చెలగాటమే. భూమి అట్టడుగు పొరల్లో దాగున్న  గ్యాస్, అక్కడ  అనేక వొత్తిడులకు గురవుతూ వుంటుంది. భూమిపై జరిపే నిర్మాణాలు  కూడా ఒక్కోసారి ఈ వొత్తిళ్లలో హెచ్చుతగ్గులకు కారణం అవుతుంటాయి. వొత్తిడికి గురైన గ్యాస్ పైకి  తన్నుకువచ్చే  క్రమంలో దాన్ని నిరోధించేందుకు, క్రమబద్ధం చేసేందుకు గ్యాస్ సంస్థలు ఏర్పరచుకున్న  అదుపు వ్యవస్థలు పనికిరాకుండా పోయే ప్రమాదం వుంటుంది. ఆ సందర్భాలలో బయటకు దూసుకు వచ్చే గ్యాస్ మంటల్ని అదుపు చేయడం అసాధ్యంగా మారుతుంది. ఇలా గ్యాస్ తన్నుకువచ్చేటప్పుడు వెలువడే ధ్వని - వెయ్యి ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఒకేసారి  దూసుకువచ్చేటప్పుడు వినవచ్చే  భీకర ధ్వని మాదిరిగా వుంటుందట.
1995 లో తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద సంభవించిన బ్లో అవుట్,  మొత్తం చమురు గ్యాస్ నిక్షేపాల వెలికితీత చరిత్రలోనే అతి ఘోరమైనది. అప్పుడు  ఎగసిన అగ్ని కీలలు ఆ ప్రాంతంలోని 19 డ్రిల్లింగ్ కేంద్రాలను చుట్టుముట్టాయి. 12 కోట్లు ఖరీదు చేసే ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్గు, మరో 7 కోట్లు విలువచేసే డ్రిల్లింగ్ పరికరాలు,ఇతర  సామగ్రి  నాటి దుర్ఘటనలో కాలి బూడిద అయ్యాయి.  ఆ మంటలను ఆర్పడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. విదేశీ నిపుణులను రప్పించి వారి  సాయంతో వాటిని అదుపు చేయడానికి రెండు నెలలకు పైగా వ్యవధి పట్టింది. అయినా  కానీ ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడం అన్నది  వూరట కలిగించే విషయం.  
ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా చిన్నవీ పెద్దవీ కలిపి మొత్తం ఇరవై ఇటువంటి  సంఘటనలు జరిగాయి. మొన్న శుక్రవారం తొలిపొద్దులో సంభవించిన ఆకస్మిక ప్రళయం మాత్రం  చాలా భయంకరం. మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది.  ఈ వ్యాసం రాస్తున్న సమయానికి అందిన  సమాచారం ప్రకారం పదిహేనుమంది గ్యాస్ పైప్ లైన్  పగిలిన కారణంగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్తితి విషమంగా వున్నట్టు చెబుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు చెప్పే విషయాలు హృదయ విదారకంగా వున్నాయి. తెలవారకముందే ఇది సంభవించడం వల్ల కొంతమంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉలిక్కిపడి లేచారు. చూస్తే  చుట్టూ మంటలు. ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతున్నదో అర్ధం కాదు. దిగ్గునలేచి దగ్గర్లో వున్న పొలాల్లోకి పరిగెత్తారు. ఎటు చూసినా కార్చిచ్చులా మంటలు. ఎవరు వున్నారో, ఎవరు పోయారో తెలవదు. అంతా అయోమయం, గందరగోళం.  బతికి బట్ట కట్టిన వారు చెప్పే మాటలవి.
'నిన్నటి నుంచీ అనుమానంగానే వుంది. ఎక్కడో గ్యాస్ లీకవుతున్నట్టు. కానీ అది ఇంత ప్రాణాంతకంగా  పరిణమిస్తుందని అనుకోలేదు. ఎందుకంటే రిఫైనరీ వాళ్లు అప్పుడప్పుడు పనికి రాని  గ్యాస్ ను ఇలా వొదిలి పెట్టడం మామూలే. అంచేత, అంతే  అయివుంటుందని పెద్దగా పట్టించుకోలేదు'  అన్నది మరో స్థానికుడి  కధనం.
అధికారులు ధృవపరచడం లేదు కాని మంటలు అలా వువ్వెత్తున ఎగసిపడడానికి కొందరు మరో కారణం చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో  టీ దుకాణం నడుపుకునే ఓ వ్యక్తి తన రోజువారీ పనులకు సమాయత్తమవుతున్నాడు. అంతకుముందే అ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ పగిలి అందులోనుంచి గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్ముకుంటున్న సంగతి ఎవరూ గమనించలేదు. పైగా వాతావరణం మబ్బులు పట్టి వుండడం వల్ల కూడా గ్యాస్ అంతటా కమ్ముకుంటున్న సంగతిని గమనించడానికి వీలు లేకుండా పోయింది. పైపెచ్చు ఇలా వెలికి తీసే సహజ వాయువుకు, ఇళ్ళల్లో వాడే వంట గ్యాస్ మాదిరిగా  రంగూ, వాసనా వుండదు. అందువల్ల కూడా కమ్ముకువస్తున్న మృత్యు వాయువు ఆనవాళ్ళు వారికి కానరాలేదు. ఈ నేపధ్యంలో స్టవ్ వెలిగించడానికి ఆ టీ కొట్టు యజమాని వెలిగించిన అగ్గిపుల్లతో చుట్టుపక్కల ఆవరించి వున్న గ్యాస్ ఒక్కసారిగా భగ్గుమని మండింది. క్షణాల్లో అగ్ని కీలలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. ఏం జరుగుతున్నదో తెలిసేలోపే జరగరానిది మొత్తం జరిగిపోయింది.     
గతంలో పసర్లపూడిలో జరిగిన బ్లో అవుట్ కు,  శుక్రవారం నాటి  సంఘటనకు తేడావుంది. అది ప్రమాదం. తాజాది  మానవ తప్పిదం. సహజవాయువుకు రంగూ, వాసనా లేకపోవడం వల్ల,  పైప్ లైన్ పగిలి గ్యాస్ గాలిలో కలిసి మృత్యు రూపంలో పాకివస్తున్నా జనం దాని జాడ కనిపెట్టలేకపోయారు. అగ్గిపుల్ల గీసే దాకా అక్కడే మృత్యువు పొంచి వున్న సంగతి వారికి  తెలియదు.
కొన్ని నెలలక్రితం మా ఇంట్లో గ్యాస్ లీకయింది. పిర్యాదు చేస్తే గ్యాస్ కంపెనీ సిబ్బంది తాపీగా వచ్చి, 'అప్పుడప్పుడూ సిలిండర్ పైపు మార్చుకుంటూ వుండాలని  చదువుకున్న వాళ్లు మీకు కూడా తెలియకపోతే యెట్లా' అని లెక్చర్ ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు కోనసీమను మరుభూమిగా మార్చిన సంఘటనలో, అధికారులు చెప్పే ఇలాటి  సుద్దులు ఎక్కడికి పోయాయో.
మరో విషయం మెల్లగా వెలుగులోకి వస్తోంది. గ్యాస్ పైప్ దుస్తితి గురించి స్థానికులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. గ్యాస్ నిల్వలు వెలికి తీసే ప్రాంతం అంటే వంద ఆటం బాంబుల మీద పక్క పరచుకుని పండుకున్నట్టు. అంతటి ప్రమాదం ఎల్లవేళలా పొంచే  వుంటుంది.
జనావాసాల ప్రాంతంలో గ్యాస్ వెలికి తీస్తున్నప్పుడు అధికారులు కనీస ముందు జాగ్రత్తలు తీసుకున్నారా అన్నదానిపై ఆలశ్యంగా చర్చ మొదలయింది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సరపరా నిలిచిపోయేలా అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్టు లేదు.  జనవాసాల నడుమ  గ్యాస్  పైపు లైన్లు వేసినప్పుడు హెచ్చరిక  బోర్డులు కూడా పెట్టలేదంటున్నారు.  చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, ముగ్గురు సభ్యులతో విచారణా సంఘం ఏర్పాటు, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు, అన్నీ రొటీన్ ప్రకటనలు. ఇవన్నీ సరే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనే ఆ ఒక్క మాట అన్నా నిలబెట్టుకుంటే అదే పదివేలు.


అగ్గి పుల్ల గీస్తే అడవి తగలడి పోతుందా!


అలాగే వుంది కోన సీమ దుర్ఘటన గమనిస్తే. ఈ అంశంపై సాక్షి టీవీ, ఈరోజు (28-06-2014)ఉదయం ఏడుగంటలకు హెడ్ లైన్ షో. యాంఖర్ హరి. నాతో పాటు మాజీమంత్రి శ్రీ విశ్వరూప్, విశాఖ నుంచి చమురు వ్యవహారాల నిపుణులు శ్రీ సీ.వీ.రామన్ చర్చలో పాల్గొన్నారు."గతంలో జరిగిన బ్లో అవుట్ కు, నిన్నటి సంఘటనకు తేడావుంది. అది ప్రమాదం. నిన్నటిది మానవ తప్పిదం. సహజవాయువుకు రంగూ, రుచీ వాసనా వుండవంటారు.  పైప్ లైన్ పగిలి గ్యాస్ గాలిలో కలిసి వ్యాపిస్తున్నా, మృత్యువు పాకివస్తున్నట్టు, పక్కనే పొంచి వున్నట్టు అగ్గిపుల్ల గీసే దాకా తెలియదు. కొన్ని నెలలక్రితం మా ఇంట్లో గ్యాస్ లీకయింది. పిర్యాదు చేస్తే గ్యాస్ కంపెనీ సిబ్బంది తాపీగా వచ్చి, 'అప్పుడప్పుడూ  సిలిండర్ పైపు  మార్చుకోవాలని చదువుకున్న వాళ్లు మీకు కూడా తెలియకపోతే యెట్లా' అని లెక్చర్ ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు కోనసీమను మరుభూమిగా మార్చిన సంఘటనలో, అధికారులు చెప్పే ఈ సుద్దులు ఎక్కడికి పోయాయో. గ్యాస్ పైప్ దుస్తితి  గురించి స్థానికులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. గ్యాస్ నిల్వలు వెలికి తీసే ప్రాంతం అంటే వంద ఆటం బాంబులు పెట్టుకుని పైన పక్క వేసుకుని పడుకున్నట్టు. అంత ప్రమాదం ఎల్లవేళలా పొంచి వుంటుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా  సరపరా నిలిచిపోయేలా అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్టు లేదు. కనీసం, జనావాసాల మధ్య పైపు  లైన్లు వేసినప్పుడు ముందు జాగ్రత్త బోర్డులు కూడా పెట్టలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, ముగ్గురు సబ్యులతో విచారణా సంఘం ఏర్పాటు, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు. అన్నీ రొటీన్ ప్రకటనలు. ఇవన్నీ సరే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనే ఆ ఒక్క మాట అన్నా నిలబెట్టుకుంటే అదే పదివేలు"         

27, జూన్ 2014, శుక్రవారం

పీవీ - ఓ జ్ఞాపకం


(జూన్ 28, పీవీ నరసింహారావు గారి జయంతి)  
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులుఅనధికారులుమందీ మార్బలాలు, వందిమాగధులు ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమాఅన్నట్టు వుండేది.మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండిఅన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా!అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  


జేబులో రాజీనామా


1971 లో బెజవాడ  ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా  చేరడానికి వెళ్లాను. ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు.
ఏదీ నీ రాజీనామా?’ అన్నారు. ఒక్క క్షణం గతుక్కుమన్నాను. ఇంతలో ఆయనే జర్నలిస్టు అనేవాడు తన జేబులో రాజీనామా సిద్ధంగా వుంచుకోవాలి.తెలిసిందాఅన్నారు.
నాలుగున్నర ఏళ్ళదాకా నాకు రాజీనామా అవసరం పడలేదు. తరువాత ఆంధ్రజ్యోతికి సలాం చెప్పి హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేఖరిగా చేరాను. నేను చిక్కడపల్లిలో వుండేవాడిని.


(తొంభయ్యవ దశకంలో ఫోటో. ఎడమవైపు శ్రీ కృష్ణ, శ్రీ రోశయ్య, వెనుక పచ్చ చొక్కాలో నేను) 

కలం కూలీ జీ.కృష్ణ గారి నివాసం రాం నగర్లో. బెజవాడలో వుండగా మా అన్నయ్య పర్వతాలరావు గారి ద్వారా కృష్ణ గారు పరిచయం. తరువాత హైదరాబాదులో ఆయన ఇండియన్  ఎక్స్ ప్రెస్ లో, నేను రేడియోలో విలేఖరులం. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది ప్రముఖులను ఆయన ద్వారా కలుసుకునే అవకాశం దొరికింది. కృష్ణ గారి ధారణ శక్తి అపూర్వం. ఎన్నెన్నో పాత సంగతులను చెబుతుండేవారు. ఎందరో ప్రముఖులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ముఖ్యమంత్రి వెంగళరావు గారిని ఏం వెంగళరాయా!అని సంబోధించేవారు. అనేక పత్రికల్లో పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కడా కాలునిలవని తత్వం. నార్లగారు చెప్పిన సూత్రాన్ని అక్షరాలా పాటించిన జర్నలిస్టు. అనేక పర్యాయాలు రాజీనామా చేసి పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద పదవులను వొదులుకున్నారు.
అనేక దశాబ్దాల క్రితం కొంతకాలం ఢిల్లీలో పనిచేశారు. ఆనాటి ఆయన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.
ఢిల్లీలో నేను సరిగా ఇమడలేకపోయాను. అక్కడ తక్కువ జీతగాళ్ళు వుంటారు  కాని తక్కువ జీతంపైన వుండలేం.
ఢిల్లీలో తమిళులు ఒక స్వయం సమృద్ధవర్గం. వాళ్ల పురోహితులు వాళ్ల వాళ్ళే. వాళ్ల హోటళ్ళు వాళ్ళవే. ఒక తమిళుడు కుంభకోణంలోని తన స్నేహితుడికి ఇలా రాశాడట. ఢిల్లీ మనదే. కాకపోతే ఇక్కడ అనవసరంగా ఉత్తరాదివాళ్ళు వచ్చిపడ్డారు.’  బెంగాల్ వాళ్ళది మరోతీరు. వాళ్లు తాము అందరికన్నా కనీసం ఒకరోజు ముందు ఆలోచించగలం అన్నది వాళ్ల ధీమా. అప్పట్లో నెహ్రూ నెల జీతం 2,500. దానిపై బెంగాలీల వ్యాఖ్య.- నెహ్రూ గారు తన యోగ్యతకు మించి నెలకు 2,500 ఎక్కువగా జీతం పుచ్చుకుంటున్నారని"
తోక ముక్క:  మన దేశంలో పత్రికా యజమానుల రాజకీయాలు సరేసరి. విలేఖరుల రాజకీయాలు కూడా వుంటయ్యి.కృష్ణ గారి ఉవాచ.

మనసు ముళ్లు


దూరానికి సరళరేఖల్లా కనబడ్డా

నిజానికి ఎన్నో కనబడని వొంకర్లు

ఆలోచనలకు పెయింట్ వేసి వుంచినా

నిద్రపట్టే వేళకు

మెదడు తుప్పురాలుతున్న చప్పుడు

నిశ్శబ్దం చేసే ధ్వని భరించడం ఎలా

పగలు పలురకాల అనుభవాల్ని నమిలి

నాలుక కొసతో నిశీధిని నంజుకుని

నవ్వినలిగి

పక్కపై చేరే సమయానికి

ఆలోచనల నల్లుల బారులు

లోపలి వ్యక్తి చేసే చీకటి ఆక్రందనలు

ఇక నిద్రపట్టడం ఎలా?

లేచి లైటు వెయ్యాలి.
భండారు శ్రీనివాస రావు

భారం కాదు బాధ్యత అనుకోవాలి

ఈరోజు (27-06-2014) ఉదయం ఏడు గంటలకి ఐ న్యూస్ 'న్యూస్ మార్నింగ్' ప్రోగ్రాంలో పృచ్చకుడి ప్రశ్నలు నా జవాబులు.


'కరెంటు కోతలు'
'దీర్ఘ కాలిక ప్రణాళికల విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలె ప్రస్తుత పరిస్తితికి కారణం. చౌక అనే కారణంతో జల విద్యుత్ మీదా, బొగ్గు లభ్యత కారణంతో థర్మల్ మీదా ఆధారపడుతూ వచ్చాం. పెట్టుబళ్ళ గురించి సందేహపడి ప్రత్యామ్నాయ విద్యుత్  వనరులపై దృష్టి పెట్టలేదు. అదే గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఖర్చు ఎక్కువయినా సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించింది. అలాగని అక్కడ కరెంటు చార్జీలు తక్కువేమీ కాదు. నాణ్యమైన విద్యుత్ సరఫరాపట్ల అక్కడి ప్రజలు కూడా మొగ్గుచూపారు. కొత్త రాష్ట్రాల పాలకులు కూడా తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నాలు చేసినా దీర్ఘ కాలిక పధకాలపై శ్రద్ధ పెట్టాలి'
'అయోమయంలో విద్యార్ధులు'
'ఎక్కడ చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వాలే ఫీజు భరించాలి అనేది వినడానికి బాగానే వుంటుంది. కొంత నేపధ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పధకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రం విడిపోయిలేదు. కలిసే వుంది. నాణ్యమైన విద్య బోధించే కాలేజీలన్నీ సహజంగా రాజధానీ నగరం  హైదరాబాదు చుట్టు పక్కలే వెలిశాయి. దాంతో శ్రీకాకుళం. అనంత పురం, ఆదిలాబాదు  జిల్లాల వాళ్లు కూడా ఈ కాలేజీల్లో చేరడానికే మొగ్గు చూపారు. ఫీజుల విషయంలో రెండు రాష్టాల ప్రభుత్వాలు పేచీ పడితే నష్ట పోయేది విద్యార్ధులు అనే వాస్తవం గుర్తుంచుకోవాలి.1956 కు ముందు అనే వాదం లేవదీయడానికి కూడా కారణం వుంది. విభజన ఉద్యమానికి  ఉద్యోగాలు కూడా కారణం. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నవారికి ఫీజులు కడితే,  ముందు ముందు వారికి  ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని 1956 ముందు అనే వాదన బయలుదేరి వుంటుంది. సచివాలయం  యుద్యోగుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై చర్చించినట్టు   పత్రికల్లో వచ్చింది. అలాగే వారు మళ్ళీ సమావేశమై ఎక్కడ చదువుకుంటున్నా తమ తమ  ప్రాంతపు విద్యార్ధుల ఫీజు భారం తామే భరిస్తామని ఒప్పందానికి వస్తే సరిపోతుంది. భారం అనుకోకుండా బాధ్యత అనుకుంటే సమస్య సులువుగా తేలిపోతుంది'