26, జూన్ 2014, గురువారం

ఇద్దరూ ఇద్దరే!


టీవీ - 5  ఈరోజు (26-06-2014)  రాత్రి   ఏడు గంటలకు తమ హాట్ టాపిక్ ప్రోగ్రాం లో 'ఇద్దరూ ఇద్దరే!' అంటూ చంద్రబాబు, కేసీఆర్ ల వివాదగ్రస్త వ్యాఖ్యలపై ఒక  చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. శ్రీ సుబ్బారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ప్రోగ్రాంలో నాతో పాటు  టీడీపీ నాయకుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్, కొత్తగా టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎం ఎల్ సీ శ్రీ భాను ప్రసాద్, బీజెపీ తరపున శ్రీ భాను ప్రకాష్ (ఫోన్ ఇన్) పాల్గొన్నారు.యధాప్రకారం రెండు కొత్త రాష్ట్రాల నడుమ రేగుతున్న వివాదాల చుట్టూనే చర్చ పరిభ్రమించింది. ఎవరి వాదన వారిదే. వారిని తప్పుబట్టే పనిలేదు. వర్తమాన రాజకీయాలు అలా వున్నాయి. ఇద్దరు ముఖ్య మంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోయినా రెండు ప్రాంతాల్లో వాతావరణం తేలికపడుతుందని యధాప్రకారం నేను చేసిన  సూచనను శ్రీ రాజేంద్ర ప్రసాద్ నెరవేరని కలతో పోల్చారు. ఇరుపక్షాలు తమ వైఖరికి బాగా కట్టుబడి వున్నాయని, అంగుళం మేర కూడా సడలింపుకు అవకాశం ఇచ్చే ధోరణి కానరావడం లేదని ఈ చర్చలో పాల్గొన్న తరువాత అవగతం అయింది. సర్దుబాటు మనస్తత్వంతో వ్యవహరిస్తే వివాదాలు సర్దుకుపోతాయన్న నా వాదన అరణ్య రోదనమే అయింది. ఇక ఈ విషయాలపై మీడియాలో మరో కొన్ని వారాలపాటు చర్చలు తప్పవని కూడా బోధపడింది. ఇలానే కొనసాగితే, 'ఇద్దరూ ఇద్దరే' కాదు,  శ్రీ మోడీని కూడా కలుపుకుని   'ముగ్గురు ముగ్గురే' అని చర్చించాల్సి వస్తుందని కూడా చెప్పాను. ఎందుకంటే సర్వం రాజకీయం అయిపోతున్నప్పుడు ఆ పార్టీ మాత్రం యెందుకు మిన్నకుంటుంది?

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

నేను మనం 105గురి లా ఉండాలి అని ఒక మంచి మాట చెప్పబోతే అసలు ధర్మరాజు మాటనీ, తద్వారా వేదవ్యాసుడ్నీ కవిత్రయాన్నీ కూడా తప్పు పట్తే వాళ్ళు సామరస్యానికి పెద్ద పీట వేస్తారని యెలా నమ్మాలి?

వారు కోరుకున్నది ప్రత్యేక అస్తిత్వం, అస్తిత్వం నిరూపణ కావాలంటే పోటీ పడి గెలవాలి.వాళ్ళు పతీదానిలోనూ ప్రాంతంగా పోటీ పడుతుంటే ఆంధ్రావాళ్ళు మాత్రమే మనందరం తెలుగువాళ్ళం అని మురుసుకుంటూ వుంటారా?