9, మే 2021, ఆదివారం

తల్లీ నిన్ను దలంచి......

 (మే నెల రెండో ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం)

అమ్మ అన్న దేవత లేకపోతే-

ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.

రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది.

అదే, – మదర్స్ డే – మాతృమూర్తి దినోత్సవం.

దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.

అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.

తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.

సంవత్సరంలో మూడువందల అరవై అయిదు రోజుల్లో ఒక రోజుకిమదర్స్ డే’ గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే – తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు – 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరం వొదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి – చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకిమదర్స్ డే’ గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి – అన్నా రీవేస్ జార్విస్ కన్నుమూయడానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా – ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో ‘మదర్స్ డే’ అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం – ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ ‘మదర్స్ డే’ ఉత్తర్వులో ఒక విశేషం వుంది. మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే 'అమ్మ'కే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే – ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమే గౌరవించుకునే రోజుగా కాకుండా – అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా ‘మదర్స్ డే’ ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో ‘మదర్స్ డే’ రాసేటప్పుడు ఏకవచనంలో అంటే 'తల్లి' దినోత్సవం (Mother's Day) గా పేర్కొంటారు.

మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. 'మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండ'న్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తే వేరనీ - జార్విస్ చేసిన విజ్ఞప్తులన్నీ – తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే ‘మార్కెట్ శక్తుల’ ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్ – పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే – 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో – ఆ తల్లి సమాధి చెంతనే అన్నా జార్విస్ ని ఖననం చేయడం అన్న తృప్తి ఒక్కటే ఆమెకు దక్కింది.

అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా – మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.

మదర్స్ డే నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో – గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.

మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.

 

8, మే 2021, శనివారం

నస్మరంతి గాడు

 ఇది ముళ్ళపూడి వారు సృష్టించిన పదం

“పెళ్ళయి పదేళ్లవుతున్నా పెళ్ళానికి పుట్టింటి పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే ఆ మొగుడు ముండావాడిని ‘నస్మరంతిగాడు అంటారని అప్పుడెప్పుడో రాఘవయ్య గారి జ్యోతి పత్రికలో ఆయన  రాశారు. అంటే, ఎవరూ పట్టించుకోని వాడిని గురించి ముళ్ళపూడి వెంకట రమణ గారు తనదైన శైలిలో అలా భాష్యం చెప్పారు.

ఫోను సంభాషణలో ఈ విషయం నానుంచి విన్న మిత్రుడు ఒకరు మరో ఆసక్తికరమైన విషయం దీనికి జోడించాడు.

“ఈ ఫేస్ బుక్ ప్రపంచంలో పోస్టు పెట్టి పది గంటలు అయినా ఒక్క లైకు కానీ, చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష”

శాస్త్రం – శాస్త్రీయం

 

శివ పురాణంలో ఒక ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోవడం చూసి లయకారుడు అయిన మహా శివుడికి మహాకోపం కలిగింది. ఆయన వెంటనే తన జటాఝూటం నుంచి ఒక కేశాన్ని తీసి దానితో కృత్య అనే మహమ్మారిని సృష్టించి పాపులను సంహరింప చేస్తాడు. ఇది ఐతిహ్యం.

అలాగే, జనాభా గురించి మాల్తూసియన్ థియరీ అని ఒకటుంది. థామస్ రాబర్ట్ మాల్తూస్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ప్రపంచంలో జనాభా, ఆహార ధాన్యాల ఉత్పత్తితో నిమిత్తం లేకుండా అపరిమితంగా పెరిగిపోయే సందర్భాలలో ప్రకృతి తనంతట తాను ఆ దామాషాను తగిన విధంగా సవరించుకుని, సమతూకం చేసుకుంటుందని (Checks and Balances) మాల్తూస్ మహాశయుల సిద్ధాంతం. ఈ క్రమంలోనే కరువులు, కాటకాలు, ఉప్పెనలు, తుపానులు, మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, అంటువ్యాధులు ప్రబలి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారని ఆ శాస్త్రవేత్త భాష్యం.
(08-05-2021)

7, మే 2021, శుక్రవారం

జీవితం అంటే ఓ పరీక్షే!


“భయం అంటే కోరిక” అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.
కోరిక తీరదేమో అనే సందేహమే భయంగా మారుతుంది అని వారి తాత్పర్యం.

ఒక విద్యార్థి పరీక్షలను లెక్కపెట్ట కుండా ఏడాది పొడుగునా అడ్డమైన తిరుగుళ్లతో కాలక్షేపం చేస్తాడు. పరీక్షలు దగ్గర పడేసరికి భయపడిపోతాడు, సరిగ్గా రాయలేనేమో అనే సందేహంతో. పరీక్ష పాసవాలి అనే కోరిక తీరదేమో అనే భయంతో. ఎందుకంటే పరీక్ష రాయడానికి అతడు సంసిద్ధంగా లేడు. అందుకు తగిన సన్నాహం చేసుకోలేదు.

అలాగే జీవితం అనే పరీక్ష రాయడానికి కూడా కొంత సంసిద్ధత కావాలి. అది లేకపోతే భయం వేస్తుంది.
ఇక్కడ పరీక్ష అంటే మరణం. మరణ కాలం దగ్గర పడుతుంటే మనసులో ఆందోళన మొదలవుతుంది. అప్పటిదాకా ఎందుకూ పనికిరాని లౌకిక విషయాలతో మమేకమై, సంపాదన యావలో మునిగిపోయి, ప్రాపంచిక ప్రలోభాలకు లోనయి అసలు జీవిత పరమార్థం ఏమిటో మరిచిపోతాడు మనిషి. అల్లరిచిల్లరగా తిరిగిన విద్యార్ధికి మల్లేనే మానవుడికి కూడా మరణం అంటే భయం వేస్తుంది. కోరికలు తీరకపోవడమే దానికి కారణం. బాగా శ్రద్ధగా చదివిన విద్యార్థి ఎలాంటి భయ సంకోచాలు లేకుండా పరీక్షకు తయారవుతాడు. కోరికలు లేని మనిషి కూడా మరణ భయానికి దూరం అవుతాడు.

కాబట్టి జీవితం అనే విలువైన సమయాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే, మంచి విద్యార్ధికి పరీక్ష భయం లేనట్టే మంచి మనిషికి కూడా మరణ భయం మాయమై పోతుంది.
(07-05-2021)

ఆంధ్రపత్రిక కధ

 

ఆంధ్రపత్రిక కధ అంటే ఓ మనసున్న మనిషి కధ. ఆయనే రాధాకృష్ణ.
రాధాకృష్ణ అంటే గుర్తు పట్టడం కష్టం. అదే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ అంటే తెలియనివాళ్ళు వుండరు.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన ఆంద్రపత్రిక దినపత్రిక తొలిరోజుల్లో బొంబాయి నుంచి ఆ తరువాత మద్రాసు నుంచి మొదలయి తదుపరి విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి ప్రచురణ సాగించింది. నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆధ్వర్యంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రపత్రిక చివరకు ఆయన కుమారుడు శివలెంక రాధాకృష్ణ చేతిలో కొన్నేళ్ళు నడిచి ఆగిపోయింది.

హైదరాబాదులో బషీర్ బాగ్ లో ఒక పెద్ద భవనంలో ఆంధ్రపత్రిక కార్యాలయం వుండేది. రాజగోపాల రావు గారు, ముక్కు శర్మ గారు, సుందరం, పాశం యాదగిరి, వేణుగోపాల్, విద్యారణ్య మొదలయిన వాళ్ళు బ్యూరోలో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఈవెనింగ్ ఎడిషన్ కు మంచి గిరాకీ వుండేది. పత్రికారంగంలో ఎదురయిన పోటీ తట్టుకోలేక అది మూతపడే సందర్భం వచ్చింది.

విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు పత్రికకు ఏదో సాయం చేయాలని సంకల్పించుకుని నామ మాత్రపు ధరకు ఆ భవనాన్ని వాళ్ళకే విక్రయించేలా ఏర్పాటు చేయమని తన కార్యదర్శి రాఘవేంద్ర రావు గారిని కోరారు. విషయం దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో రాధాకృష్ణ గారు ఇలా అన్నారు.
‘చిన్న పిల్లలకు మిఠాయిలు చూడగానే వాటినన్నిటినీ తినాలని అనిపిస్తుంది. అవన్నీ తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుంటారు. ఒకటి రెండు తినగానే నిద్ర వస్తుంది. ప్లేట్లో మిఠాయిలు అలాగే వుంటాయి. మనుషులమూ అంతే. ఎన్నెన్నో ఆస్తులు కూడబెట్టి అనుభవించాలని అనుకుంటాం. నానా అవస్థలు పడి ఆస్తులు పోగేస్తాం. ఏం లాభం! అనుభవించే వ్యవధానం లేక శాశ్వత నిద్రలోకి జారుకుంటాం’

ఇలాంటి వేదాంతంతో ఎంతో విలువైన ఆస్తిని ఆనాడు ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు.
ఆ భవనమే వుంటే, పంతులుగారు స్థాపించిన ఆంధ్రపత్రిక బతికేదేమో!
ఏం యాదగిరీ! అంతేనంటావా!

ఇప్పుడూ అంధ్రపత్రిక వస్తోంది దినపత్రికగానే. యాజమాన్యం మారినట్టుంది.

"పక్కవారికి చెప్పేటందుకే.....

 

ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.

సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.

అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.

 

ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.

ఆరోజుల్లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోనుతో పని పడినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో, ఇంట్లో  ప్రభుత్వం సమకూర్చిన ఫోనులోమాట్లాడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి, ‘సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మ’న్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను. ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.

 

'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు.

 

'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే మాత్రం వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి జాబితాలో నా పేరు కూడా కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని అవినీతిపరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.

 

నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.

ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

 

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

 

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.

 

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!