30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా! - భండారు శ్రీనివాసరావు
కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
          

ముప్పయ్యేళ్ళ కిందటి మాట.

ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని భావించిన ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కిమ్మిన్నాస్తి.

మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. సాటి మంత్రులపై తోటి మంత్రులే అవినీతి ఆరోపణలు చేసే పరిస్తితి. మంత్రులతో పాటు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని అశక్తతలో నేటి అధిష్టానం.మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.

వైఎస్సార్ దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ చీకాకులకు అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది. వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.

ఈ పరిణామాలు సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే వై.ఎస్. మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఎందుకంటె, ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండి చిల్లర దేవుళ్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి. చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం జాతీయ పార్టీలయినా, ప్రాంతీయ పార్టీలయినా వాటి అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం.

అయితే వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో సంకీర్ణ

ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త బాధ్యతలు రాజశేఖరరెడ్డికి ఓ మేరకు

కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి వారికి కూడా రాజశేఖరరెడ్డి వంటి ‘అన్నింటా సమర్ధుడయిన’ ఒక ప్రాంతీయ నాయకుడు అవసరమన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించిన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేని దైన్య స్తితి పార్టీ అధిష్టానానిది. ఆ ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రతో, టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలతో ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని ముందుగానే రిజర్వ్ చేసుకున్నారనే అనుకోవాలి. వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు. కానీ, మరోసారి అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని, వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్య మంత్రిపై వెనుకటి పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.

అనుభవశాలి అయిన రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చెప్పిన కారణం ఆయన వయో భారం. ఆ కారణాన్ని కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.

వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు, మంత్రుల శాఖల పంపిణీలో సీనియర్లను సైతం స్వతంత్రించి పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.

కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించినసంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే అటకెక్కిస్తున్నదన్న భావన ఆ పధకాల లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు అసమ్మతికి భయపడాల్సిన పరిస్తితి ముఖ్యమంత్రికి వుండదు.

కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన వైఫల్యం చెందారనే అనుకోవాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ తక్షణం హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకుసమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం – ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనక తప్పని సమస్యలే.

నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ నేపధ్యంలో సంభవించిన దురదృష్టకర మరణం వై.ఎస్.ఆర్. ను సామాన్యుల మనస్సుల్లో చిరంజీవిని చేసింది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోకుండా, వై.ఎస్.జగన్ ను అడ్డుకునే క్రమంలో వై.ఎస్, పాలనను తప్పుబడుతూ చేసిన కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవి ప్రత్యర్ధికి కలసి వచ్చాయి.

మరో అయిదు వారాల్లో అంటే నవంబర్ 24 నాటికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది కాలంలో ఆయన సాధించింది పూజ్యమనే చెప్పాలి. జనాలకు పనికొచ్చే పాత పధకాలు పక్కన పెట్టడమే కాకుండా పేరుకయినా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పధకం కూడా ఆయన హయాంలో శ్రీకారం చుట్టుకోలేదు. క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే గగనంగా మారిన రోజులు కిరణ్ పాలనలోనే కాంగ్రెస్ కళ్ళచూస్తోంది.

ఇప్పుడిప్పుడే ఈ అంశాలనన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి పరిగణన లోకి తీసుకుంటున్నట్టు కానవస్తోంది. నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి ఆర్భాటంగా చేస్తున్న పధకాల ప్రకటనలే ఇందుకు సాక్ష్యం.

అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు. నిజమే. ఇప్పడు ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం.

పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.

ఇది గమనంలో పెట్టుకునే పాలకులకు సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (29-09-2011)

29, సెప్టెంబర్ 2011, గురువారం

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం – భండారు శ్రీనివాసరావు

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం – భండారు శ్రీనివాసరావు


ఆనంద రావుకు చికాగ్గా వుంది.

తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి. ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తోచక కాఫీ తాగుదామని హోటల్లోకి అడుగుపెట్టాడు.

వేళ కాని వేళేమో ఖాళీగావుంది. ఓ మూల బల్ల దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాడు. ఇంతలో ఎక్కడినుంచో వూడిపడ్డట్టు అయిదారుగురు అమ్మాయిలు పక్క టేబుల్ వద్దకు చేరారు.

అసలే ఆడపిల్లలు. ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించు కుంటున్న వాళ్లు. లోకం పోకడ తెలిసిన వాళ్లు. ఇక కబుర్లకేం తక్కువ. ఎక్కడలేని విషయాలు వాళ్ల నోళ్ల నుంచి గలగలా తన్నుకువస్తున్నాయి.

ఏమయిందో యేమో వారిలో ఒకమ్మాయి దిగ్గున లేచి కెవ్వున కేక పెట్టింది. ఆనందరావు కూడా అటు చూశాడు.

చూడరానిదేదో చూసినట్టు ఆమె మొహంలో భయం తాండవిస్తోంది. తాకరానిదేదో తాకినట్టు ఆమె వొళ్ళు కంపిస్తోంది. సాయం చేయండంటూ స్నేహితురాళ్ల ని కంటి చూపుతోనే బేలగా అర్ధిస్తోంది.

తీరా చూస్తే ఆమె చున్నీ మీద ఓ బొద్దింక విలాసంగా వాలి తమాషా చూస్తోంది.

బొద్దింక ను చూడగానే వాళ్ళందరికీ మతులు పోయాయి. అది లేచి వచ్చి తమ మీద ఎక్కడ దాడి చేస్తుందేమో అన్నట్టుగా వాళ్ళంతా హడలి పోతున్నారు.

వాళ్లు అనుకున్నంతా అయింది. బొద్దింక మొదటి అమ్మాయిని వొదిలేసి మరో అమ్మడి భుజం మీద వాలింది. అంతే! ఇక ఏడుపులు మొత్తుకోళ్ళు ఆ రెండో అమ్మాయి వంతయ్యాయి.

ఇదంతా చూసి ఓ వెయిటర్ ముందుకు వచ్చాడు. రిలే జంపింగ్ లో భాగంగా బొద్దింక అమాంతం యెగిరి అతడి చొక్కాపై వాలింది.

కానీ, అతడు కంగారు పడలేదు. ఇతరులను కంగారు పెట్టలేదు. కదలకుండా నిలబడి దానివైపు కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. తనని తాను కుదుట పరచుకున్నాడు. సుతారంగా చేయి చాపి బొద్దింకను వేళ్ళతో పట్టి విలాసంగా బయటకు విసిరేసాడు.

కాఫీ చప్పరిస్తూ ఇదంతా గమనిస్తున్న ఆనంద రావులో కొత్త ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ‘ఆ ఆడపిల్లలు అలా భయం భయంగా ప్రవర్తించడానికి కారణం ఆ బొద్దింక అయివుంటుందా ?

‘పోనీ అలానే అనుకున్న పక్షంలో అదే బొద్దింక ను చూసి వెయిటర్ ఎందుకు కంగారు పడలేదు? కంగారు పడకపోగా ఎలాటి గందరగోళానికి తావివ్వకుండా , ఎటువంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా ఆ బొద్దింక ను ఎలా వొదుల్చుకోగలిగాడు?

వేర్వేరు వ్యక్తులు ఒకేరకమయిన పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఏమయి వుంటుంది?’

అంటే ఏమిటన్న మాట.

అమ్మాయిలు అలా గాభరా పడడానికి కారణం బొద్దింక కానే కాదు. అనుకోకుండా ఎదురయిన పరిస్తితిని ఎదుర్కోవడానికి వాళ్ల శక్తి యుక్తులు, సామర్ధ్యం సమయానికి అక్కరకు రాలేదని అనుకోవాలి.

ఆనందరావు ఆలోచనలు మరింత వెనక్కు సాగాయి.

‘నాన్న తనపై కేకలు వేసినప్పుడు, బాసు ఆఫీసులో అకారణంగా ఇంతెత్తున యెగిరి పడ్డప్పుడు తన మనసు బాధ పడింది. నిజానికి ఇంత గందరగోళపడడానికి వాళ్ల ప్రవర్తన ఎంత మాత్రం కారణం కాదన్నమాట. ఆ సమయంలో ఆ పరిస్తితిని తట్టుకోవడంలో తన మానసిక సామర్ధ్యం కొరవడడమే కారణం అన్నమాట.’

మనసు కలత పడడానికి, బాధ పడడానికి మనసు కారణం కాదు. తగిన మానసిక ధైర్యంతో పరిస్తితులను వాటికి తగ్గట్టుగా ఎదుర్కోలేకపోవడమే మానసిక వొడిదుడుకులకు కారణం.

రోడ్డుమీద వెడుతుంటా ము. ట్రాఫిక్ జాం లో చిక్కుకోగానే మనసు గందరగోళంలో పడుతుంది. దీనికి కారణం ట్రాఫిక్ జాం అని విసుక్కుంటాము. అంతేకాని ట్రాఫిక్ జాం చూడగానే మనసులో ఏర్పడ్డ గందర గోళాన్ని ఎదుర్కోవడంలో మన వైఫల్యం అని అనుకోము.

సమస్య కంటే కూడా ఆ సమస్యవల్ల కలిగే మానసిక వొత్తిడే మనుషుల్ని ఎక్కువ బాధ పెడుతోంది.

అందుకే, బొద్దింక ను చూడగానే అమ్మాయిలు గాభరా పడ్డారు. వెయిటర్ మాత్రం కుదురుగా ఆ పరిస్తితిని ఎదుర్కున్నాడు.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలను చూసి గందరగోళానికి గురికాకూడదు. వాటిని ఎదుర్కోవడం పైనే దృష్టి పెట్టగలగాలి.

క్రియ ప్రతిక్రియ అతి సహజంగా అప్పటికప్పుడు జరిగేవి.

స్పందన ప్రతిస్పందన బుద్ధి సూక్ష్మత వల్ల కలిగేవి.

సమస్య పట్ల రియాక్ట్ కావడం కాదు దాని విషయంలో సరిగా రెస్పాండ్ కావలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది.

బోధి వృక్షం అవసరం లేకుండానే ఆనందరావుకు జ్ఞానోదయం అయింది. (29-09-2011)

NOTE: Image in this blog belongs to owners

28, సెప్టెంబర్ 2011, బుధవారం

వాదించి వగచిన ఏమి ఫలము ? - భండారు శ్రీనివాసరావువాదించి వగచిన ఏమి ఫలము ?   - భండారు శ్రీనివాసరావుతమలపాకుతో నేనిట్లంటే తలుపుచెక్కతో తానిట్లనేప్రతి విషయంలో మన వాదనే నెగ్గాలనుకోవడం అవివేకం. కొన్ని కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చినవి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. వాటిని అంగీకరించనంతమాత్రాన పుట్టేమీ మునిగిపోదు.అంగీకరించినంత మాత్రాన నట్టేటిలో కొట్టుకుపోము.  సాటివారితో సర్దుకుపోవడం, సిద్ధాంతాలతో రాజీపడకపోవడం అన్నదే ప్రధానం.

ONE CAN COMPROMISE WITH PERSONS BUT NOT WITH PRINCIPLES.

మొండి వాదనల వల్ల వచ్చేదేమీ  వుండదు - మొండి మనిషన్న  చెడ్డ పేరు రావడం తప్పిస్తే.

(28-09-2011)

(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)   

26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఆటో నెంబర్ – MH 02 Z 8508 - భండారు శ్రీనివాసరావు

ఎక్కగానే తెలిసిపోయింది మాకు అది అలాటిలాటి అల్లాటప్పా ఆటో కాదని.

మేము కూర్చున్న సీటు ఎదురుగా విమానంలో అమర్చినట్టు ఓ సంచీలో కొన్ని పత్రికలు కనిపించాయి. మాముందు ఓ చిన్న టీవీ సెట్టు వుంది. అందులో కేవలం దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే పెడతానని డ్రైవర్ చెప్పాడు.


ఆటో ఎక్కిన నాకూ నా భార్యకూ కాసేపు ఆశ్చర్యంతో మాటలు పెగల్లేదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డెట్టాల్, దూది కొన్ని మందులు అందులో చూసిన తరువాత.


అంతే కాదు. టీవీ తో పాటు రేడియో, వాల్ క్లాక్, చిన్నపాటి మంటలను అదుపు చేసే పరికరం, కేలండర్, ఇలా చాలా కనిపించాయి. వివిధ మతాలకు చెందిన సింబల్స్ తో పాటు ముంబై ఉగ్రవాదుల దాడిలో హీరోలు గా పేరుతెచ్చుకున్న కామ్టే, కర్కరే, సలాస్కర్, ఉన్నికృష్ణన్ ల ఫోటోలు వున్నాయి.మేమెక్కిన ఆటోనే కాదు దాని డ్రైవర్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవాడని కొద్ది సేపటిలోనే మాకు తెలిసివచ్చింది.


దారిలో మెల్లగా అతడితో మాటలు కలిపాను. ముందు నా మాటల్లో ధ్వనించిన వ్యంగాన్ని నేను గుర్తించక పోలేదు. కానీ ఆ వెటకారం కాసేపటిలోనే ఆవిరై పోయింది. దాని స్తానంలో అతడిపట్ల తెలియని గౌరవభావం చోటుచేసుకుంది.హీరోలకే హీరో సందీప్ బచ్చే


ఆ ఆటో రిక్షా డ్రైవర్ పేరు సందీప్ బచ్చే. పెద్దగా చదువుకోలేదు. అందుకే ఓ చిన్న ప్లాస్టిక్ ఫాక్టరీ లో చిన్న ఉద్యోగంలో కుదిరాడు. దురదృష్టం. ఆ ఫాక్టరీ ఎన్నో రోజులు నడవలేదు. అది మూతపడడంతో సందీప్ రోడ్డున పడ్డాడు. కాకపొతే కిరాయి ఆటోతో. ఆటో నడుపుతుండగానే పదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో కిరాయి ఆటో బదులు సొంత ఆటో నడుపుకునే స్తితికి చేరాడు. ఇద్దరు పిల్లల్నీ స్కూల్లో చేర్చాడు. బతుకు బండి ఓ గాటన పడింది. కానీ అతడు బాట తప్పలేదు. కష్టపడడం మానలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటికి చేరేది రాత్రి పది తర్వాతనే.

“ఇంట్లో వుండి చేసేది ఏమిటి సార్ టీవీ చూడడం తప్పితే. అదే ఆటో పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తే ముందు ముందు పనికొస్తాయి కదా!” అంటాడు అతగాడు.

నిజమే పనికొస్తాయి. తన కోసం కాదు సమాజంలో తనకంటే ఆర్ధికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం. ఎంత చక్కటి ఆలోచన.


మాకర్ధమయింది మాకు పరిచయం అయిన వ్యక్తి మామూలు మనిషి కాదని. పని విలువ, జీవితం విలువ తెలిసిన ముంబై నగరానికి అసలు సిసలు ప్రతినిధి అని.

తేనెటీగ లాగా పనిచేసే అతడికి తీరుబాటు సమయం అంటూ ఏమయినా వుందా? వుంటుందా? అదే అడిగాను.

కాస్త మొహమాట పడుతూనే జవాబు చెప్పాడు.

వారానికోసారి అంధేరీలోని వృద్ధ మహిళల ఆశ్రమానికి వెడతాడు. అదనంగా ఏదయినా ఆదాయం లభిస్తే వారికి అవసరమయిన టూత్ బ్రష్ లు, సబ్బులు, తలనూనెలు మొదలయినవి కొనుక్కుని తీసుకువెడతాడు.

ఆటో దిగుతుంటే కళ్ళబడింది.


 


ఆటో మీటర్ కింద ఇలా రాసి వుంది.

“వికలాంగులకు మీటర్ చార్జి లో పాతిక శాతం రాయితీ. యాభయి రూపాయల వరకు అంధులకు ఆటో ప్రయాణం ఉచితం.”

నాకూ మా ఆవిడకు అతడు ఆటో డ్రైవర్ లాగా కనిపించలేదు. నిజంగా అతడొక హీరో.

మా ప్రయాణం ముగిసింది. ఆ నలభై అయిదు నిమిషాల్లో జీవితం గురించిన కొత్త కోణం మాముందు ఆవిష్కృతమైంది. హీరోలు సినిమాతెరలపైనే కాదు నిజ జీవితాల్లోనూ తారసపడతారు. నిజానికి నిజమయిన హీరోలు సందీప్ బచ్చే లాటి వాళ్ళే.

ఈసారి ఎప్పుడయినా ముంబై వెడితే ఆ ఆటో నెంబర్ గుర్తు పెట్టుకోండి.

-MH 02 Z 8508-


“లక్ష మంది మొహాల్లో నవ్వులు పూయడానికి కారణం కండి. ఒక్కరి వేదనకు కూడా కారణభూతులు కాకండి.” సందీప్ వల్ల మేము నేర్చుకున్న జీవిత సత్యం ఇదే.


(నెట్లో సంచరిస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి స్వేఛ్చానువాదం – భండారు శ్రీనివాసరావు ) 

ఇందులో ఉపయోగించిన ఫోటోల సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 


‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది.

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సర్కారు దోపిడీ - భండారు శ్రీనివాసరావు
సర్కారు దోపిడీ - భండారు శ్రీనివాసరావు

"భార్యతో పాటు రెండు కార్లను కూడా పోషించాలి" 


పెట్రోలుకు మండే గుణం సహజం. పెట్రోలు ధరలు కూడా మండిపోతూ వుండడం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. అలాగే ఈ ధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా కొత్తేమీ కాదు. కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం చూస్తుంటే రాజకీయ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రో ధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా ఈ పాటికి వొంటబట్టే వుంటుంది.

పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు.మళ్ళీ పెంచారు అనడం కంటే ఇంకోసారి పెంచడానికి వీలుగా మరోసారి పెంచారు అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం ఇది ఆఖరు సారీ కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ కూడా లేదు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం – అది ఇప్పటి యూ.పీ.యే. కావచ్చు ఒకప్పటి ఎన్.డీ.యే. కావచ్చు – చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు. కానీ ఈ సారి లీటర్ ఒక్కింటికి మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచిన సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగావుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ – రూపాయి మారకం విలువలో వచ్చిన తేడాల భారత ఆయిల్ కంపెనీలకు లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట. అందువల్ల భారీగా పెంచిన ధరను జనం మంచిమనసు చేసుకుని భరించాలట. పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయి విలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.

చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని

ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.

ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే సులువయిన మార్గం. ఇది తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. ఇవన్నీ చూసేవారికి నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.

లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.

ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నారు. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది.(16-09-2011)

(కార్టూనిస్ట్ / ఇమేజ్ సొంతదారుడికి కృతజ్ఞతలు - రచయిత)14, సెప్టెంబర్ 2011, బుధవారం

మోసం గురూ - భండారు శ్రీనివాసరావు


మోసం గురూఅనగనగా ఒక వూరు.


వున్నట్టుండి ఓ రోజున ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒకడు తన సహాయకుడిని వెంటబెట్టుకుని ఆ వూరు వచ్చాడు. వచ్చీరాగానే రచ్చబండ దగ్గర వూళ్ళో వాళ్ళతో భేటీ అయ్యాడు.


‘నాది కోతుల వ్యాపారం. ఒక్కో కోతికీ పది వరహాల చొప్పున ఇస్తాను. పోయి కోతుల్ని పట్టుకు రండి.’ అని చెప్పాడు.


గ్రామస్తులకి మతి పోయింది. వూరికి వున్నదే కోతుల బెడద. పట్టుకువచ్చి ఒప్పచెబితే పది వరహాలంటు న్నాడు. బేరం భేషుగ్గావుంది. కోతుల పీడా వొదలడంతో పాటు నాలుగు రాళ్ళు కూడా వొళ్ళో పడతాయి.


వూరి జనమంతా పొలోమని కోతుల వేటలో పడ్డారు. మాట ఇచ్చినట్టే ఆ కోతుల బేహారి, కోతికి పది వరహాల చొప్పున లెక్కకట్టి మరీ చేతులో పెడుతున్నాడు. తెచ్చిన కోతిని తెచ్చినట్టు ఒక పెద్ద బోనులో పడేసి మేపుతున్నాడు.


కొన్నాళ్ళకు వూళ్ళోనే కాదు చుట్టుపక్కలకూడా కోతుల సంఖ్య తగ్గడం మొదలయింది. దాంతో బేహారి ధర పెంచాడు. ఒక్కో కోతి రేటు ఇప్పుడు అక్షరాలా పదిహేను వరహాలు.


కొన్నాళ్ళకి కోతుల కొరత మరీ ఎక్కువయింది. పదిహేను కాదు పాతిక వరహాలన్నాడు. జనం పెరుగుతున్న ధర చూసారు కానీ అందులో మర్మం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. బేహారి కూడా కొన్న కోతుల్ని మారు బేరానికి అమ్మడం లేదు. తెచ్చిన కోతుల్ని తెచ్చినట్టు బోనులోనే వుంచుతున్నాడు. మనకు రావాల్సింది మనకు చెల్లిస్తున్నప్పుడు అతడా కోతుల్ని ఏం చేసుకుంటే మనకెందుకు అని జనమే సర్దిచెప్పుకున్నారు.


అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వ్యాపారి రేటు యాభయి వరహాలకు పెంచాడు.


తమ పంట పండిందనుకున్నారు గ్రామస్తులు.


ఓ రోజు ఆ వ్యాపారి కోతుల కొనుగోలు వ్యవహారం సహాయకుడికి ఒప్పచేప్పి వ్యాపారపు పనులమీద పట్నం వెళ్లాడు.


అతడలా వెళ్ళగానే అతడి సహాయకుడు వూల్లోవాళ్లని పిలిచి చెప్పాడు.


‘ఆ బోనులో మేం కొన్న కోతులన్నీ అలాగే వున్నాయి చూశారు కదా. నేను మీకు వాటిని ముప్పయ్ అయిదు వరహాలచొప్పున అమ్ముతాను. మా వాడు వూరినుంచి రాగానే మీరు వాటిని యాభయికి అమ్మేయండి. శ్రమలేకుండా మీకు పదిహేను వరహాలు మిగులుతాయి.’


గ్రామస్తులకు మతులు పూర్తిగా పోయాయి. కోతులు అమ్మి సంపాదించిందే వారి దగ్గర చాలా వుంది. ఇక ఇప్పుడో ఇలా ఇచ్చి అలా తెచ్చుకోవడమే. వ్యాపారి సహాయకుడు చెప్పిన మాటలతో వారికి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరపడ్డారు.పెళ్ళాం నగలు కుడువబెట్టీ, హెచ్చు వడ్డీలకు అప్పులు తెచ్చి కోతికి ముప్పయి అయిదు వరహాల చొప్పున ఆ సహాయకుడికి చెల్లించి వున్న కోతులనన్నింటినీ కొనుగోలుచేశారు.


అంతే. మర్నాటి నుంచి ఆ వ్యాపారి కానీ అతడి సహాయకుడు కానీ మళ్ళీ వాళ్లకు కనిపిస్తే వొట్టు.


ఆనాటి వరహాల రోజులనుంచి ఈ నాటి రూపాయల కాలం దాకా ఇదే తంతు.


మోసం చేసేవాళ్ళు మారలేదు. మోసగించబడే వాళ్లు మారలేదు.


మోసం చేసే తీర్లు ఏమన్నా మారుతున్నాయేమో.

(షేర్ సింగ్ లు చేసే మాయాజాలాల గురించి అంతర్జాలంలో షికారు చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

14-09-2011


13, సెప్టెంబర్ 2011, మంగళవారం

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు


9/11
ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదేళ్లు గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.

ఈ దాడి జరిగి మొన్నటికి పదేళ్లు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా సాగుతోంది. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు. (13-09-2011)11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సరదాకి - భండారు శ్రీనివాసరావు

సరదాకి - భండారు శ్రీనివాసరావు

‘మీ కుక్క పెరటి గుమ్మంలో అదేపనిగా మొరుగుతోంది. అదేసమయంలో ఇంటి ముందు మీ ఆవిడ తలుపు తీయమని గట్టిగా అరుస్తోంది. ముందు ఎవరికి తలుపు తీస్తావ్?’ అడిగాడు ఏకాంబరం లంబోదరాన్ని.
‘ఇందులో పెద్దగా ఆలోచించేది ఏముంది. ఎంత మాత్రం మతి వున్నవాడయినా ముందు కుక్కనే ఇంట్లోకి రానిస్తాడు. లోపలకు రాగానే అది మొరగడం ఆపేస్తుంది కాబట్టి.' జవాబిచ్చాడు లంబోదరం.ఏకాంబరం తన తల్లి చనిపోయిన రోజు ఆమె సమాధి వద్ద పూలుపెట్టి తిరిగివస్తుంటే మరో సమాధి వద్ద మోకాళ్ళ మీద నిలబడి ప్రార్ధన చేస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు.


‘ఎందుకు అలా హటాత్తుగా చనిపోయి నన్ను తీరని వేదనలో ముంచి వెళ్ళావ్ ! ఇది నీకు ధర్మమేనా!’ అంటూ అతగాడు పెద్దగా ఏడుస్తూవుండడం చూసి ఏకాంబరం ఆశ్చర్య పోయాడు.


‘చనిపోయినవాళ్ల కోసం ఇంతగా బాధపడేవాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు. ఇంతకీ పోయిందెవరు’ అని ఆరాతీశాడు.


‘మా ఆవిడ మొదటి మొగుడు’
టపీమని జవాబుచెప్పాడు అతగాడు కాసేపు ఏడుపాపి.యాత్రలు చేస్తున్న దంపతులకి గైడ్ ఒక బావిని చూపించి చెప్పాడు.
‘అది ఎంతో మహిమ కలిగిన బావి. దానిలోకి తొంగి చూస్తూ మనసులో ఏమి కోరుకున్నా సరే అది వెంటనే జరిగి తీరుతుంది.'


ముందు భర్త బావిలోకి తొంగి చూశాడు.


తరువాత భార్య కూడా అందులోకి తొంగిచూస్తూ ప్రమాద వశాత్తు కాలు జారి అందులో పడి మునిగి పోయింది.
కంగారు పడుతున్న గైడ్ తో మొగుడు అన్నాడు నింపాదిగా.


‘నువ్వు చెప్పింది నిజమే! ఇది చాలా మహిమలు కలిగిన బావి అనడంలో ఎలాటి సందేహం లేదు. మనసులో ఇలా అనుకున్నానో లేదో అలా జరిగిపోయింది.’

ఇంటి ఖర్చులు గురించి భార్యా భర్తా గొడవ పడుతున్నారు.
‘ఎంత డబ్బూ నీ ఖర్చుకు చాలడం లేదు. నాకీ డబ్బే లేకుండా వుంటే ఈ సంసారం ఈ గోల వుండేవి కావు.’ మొగుడు తలపట్టుకుంటూ అన్నాడు.
‘ఇన్నాల్టికి ఓ మంచి మాట చెప్పావు. నీకు ఈ డబ్బే లేకపోతే నీ భార్యగా నేనూ వుండేదాన్ని కాదు.’చేతిలో మిగిలేవి చిల్లిగవ్వలే !

‘పెళ్లి చేసుకుని సంసారం పెట్టాలంటే ఎంత ఖర్చవుతుంది?’ అడిగాడు ఓ బ్రహ్మచారి ఓ సంసారిని.
‘పెళ్ళయి పాతికేళ్లయింది. ఇంకా చెల్లిస్తూనే వున్నాను కానీ బాకీ చెల్లు కావడం లేదు.’

ఆడ మనసు

‘ఆడవారిని అర్ధం చేసుకోవడం అంటే మాటలు కాదు. పెళ్ళికి ముందు కాబోయే మొగుడి నుంచి ఏవేవో ఆశిస్తారు. పెళ్ళయిన తరువాత అతగాడిని శాసిస్తారు. భర్త చనిపోయిన తరువాత పూజిస్తారు'
పరాశరం ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ మాట ఆమెతో చెబుతూ ఆమెకోసం నరకానికి వెళ్ళడానికయినా సిద్ధం అన్నాడు


ఇద్దరికీ పెళ్లయింది.


తరువాత అతడన్నదే నిజమయింది.
'పెళ్ళాం దిగడానికి ఎవడయినా కారు డోరు తెరిచి పట్టుకున్నాడంటే ఒకటి మాత్రం నిజం.
ఆ కారయినా కొత్తదయివుండాలి లేదా కొత్త భార్య అయినా అయివుండాలి.'

భార్యను ఎత్తుకుపోయిన కిడ్నాపర్ల నుంచి ఏకాంబరానికి ఫోను వచ్చింది.
‘నీ భార్యను విడిచి పెట్టాలంటే వెంటనే యాభయి లక్షలు ఇస్తానని మాకు మాట ఇవ్వాలి. నువ్వలా ప్రామిస్ చేయకపోతే నీ భార్య తలకోసి పార్సెల్ చేస్తామని మేము వాగ్దానం చేయాల్సివుంటుంది. జాగ్రత్త!’
ఏకాంబరం జవాబు చెప్పాడు.
‘అంత డబ్బు ఇస్తానని మాట ఇచ్చి తప్పలేను. కనీసం మీరయినా మీ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.’

‘ఎందుకలా సర్వస్వం పోయినట్టు విచారంగా వున్నావు?’


‘భార్యతో గొడవగా వుంది.’


‘అసలేమి జరిగింది?’
‘నాతొ లడాయి పెట్టుకుని ముప్పయి రోజులు నాతో మాట్లాడేది లేదని భీష్మించుకుంది.'
‘దీంట్లో బాధ పడడానికి ఏముంది? అన్నాళ్ళు మాట్లాడకుండా వుంటే మంచిదేగా’
‘కరక్టే. కానీ ఈరోజే చివరి రోజు’

(11-09-2011)(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)  
7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావుదేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.


వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.


దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు. వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.


దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.


తొక్కితే రాయి – మొక్కితే సాయి. అంతా నమ్మకం.


దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.


దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవ దేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.


దేవుడ్ని నమ్మని గోరాగారు ‘దేవుడు లేదు’ అనేవాడు. ‘లేదు’ ఏమిటండి ‘లేడు’ అనాలిగా అంటే ‘అసలు లేని వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిట’ని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.


దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ).


‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినే దెవరు? ‘చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.


మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.


పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!


దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.


నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.


సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు.

(07- 09- 2011)

(ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత)

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు


పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ‘సారీ’ అనే పదం ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.

చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖః డం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.

దుఖః డం అంటే దుష్క్రు త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.

జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున – భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘ నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.

ఈమెయిలు లో వచ్చిన ఈ సమాచారాన్ని పురస్కరించుకుని ఉత్తేజితులయిన డాక్టర్ బాలాజీ ఊట్ల అప్పటికప్పుడు ఒక ఆంగ్ల కవితను రాసి నాకు మెయిల్ చేశారు. దాని స్వేచ్చానువాదం:

ఎప్పుడిక ? – డాక్టర్ బాలాజీ ఊట్ల

చిన్నప్పుడు మట్టిలో ఆడుకుంటూ బొక్క బోర్లా పడ్డాను.

దెబ్బ తాకింది, నొప్పి పుట్టింది.

‘ఛీ పాడు మట్టి

ఆ పాడు మట్టిదే తప్పు. నీది కాదులే చిట్టి కన్నా’ అన్నారు మా పెద్దాళ్లు.

చెయ్యి తెగింది.

నెత్తురు ధారగా కారింది

‘ఛా ఆ పాడు చాకునెందుకు పట్టుకున్నావు

ఆ చాకుదే తప్ప’న్నారు మళ్ళీ మా వాళ్లు.


మెట్ల మీద జారిపడ్డాను

తల బొప్పి కట్టింది

మళ్ళీ మెట్లకే పడ్డాయి అందరి మొట్టికాయలు.


ఇలా ఇంతప్పటినుంచి అందరూ నన్ను కాచుకున్నారు

కనురెప్పలా కనిపెట్టి చూసుకున్నారు.

నన్ను బాధ పెట్టిన వాటిని కసురుకున్నారు

కోపడ్డారు.

ఏమయినా ఒక్కటి నిజం

సాటివారిని బాధ పెట్టడం చాలా తేలిక

మన బాధలకు, వేదనలకు ఇతరులపై నెపం మోపడం ఇంకా సులువు

ఇక -

నేను నేర్చుకుండేది ఎప్పుడు?

నేర్చుకోకుండా వుండేది ఎప్పుడు?

పక్కవారిని తప్పు పట్టకుండా వుండడం

ఇక నేనెప్పుడు నేర్చుకుంటాను ?

నా చేతకానితనానికి

నేచేసే నిర్వాకాలకు

జరుగుతున్నవాటికి

కాకతాళీయంగా జరిగే వాటికి

ప్రమాదాలకు

ప్రమోదాలకు

అన్నింటికీ

కారణం నేనే అని నన్ను నేను నిందించుకోవడం

తప్పు నాదే అని హుందాగా ఒప్పుకోవడం

నేనెప్పుడు నేర్చుకుంటాను ?


తప్పుచేయడం మానవ సహజం అని తెలుసు

తప్పు నావల్లే జరిగినప్పుడు తటాలున గుర్తుకు వచ్చే ఈ సూక్తి

ఇతరులు చేసినప్పుడు

ఎందుకు స్పురణకు రావడం లేదో

ఎప్పుడు తెలుసుకుంటాను ?

బాధ పెట్టిన వాడిని మరింత బాధ పెట్టడం

పరిష్కారం కాదని

ఇంకెప్పుడు తెలుసుకుంటాను ?


కన్నుకు కన్ను జవాబు కాదని

రక్తం మరకను రక్తంతో కడుక్కోలేమని

ఎప్పుడు తెలుసుకుంటాను ?

ఎప్పుడు? ఇంకెప్పుడు ? ఆ రోజెప్పుడు ?

(స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు)

(05-09-2011)

5, సెప్టెంబర్ 2011, సోమవారం

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు


‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’


మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -

“గురుద్దేవో నమః”

(05-09-2011)

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు


‘కని పెంచుట’ లేదు!

డిష్యుం డిష్యుంపక్కింటి పిల్లల రాక్షసి గోల 
విని గుండెల్లో బాంబులు పేల
అనుకుంది కొత్త కోడలు రమాబాల
ఇక కని పెంచుట ఏల ?(మే, 29, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)కాయ 'గోరా'లుకుయ్యో మొర్రోఇంట్లోనే కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా(జూన్, 11, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)కార్టూనిష్టు/ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు – రచయిత


4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ముద్రారాక్షసం
క్రిమినల్ లాయర్ శ్రీ కేజీ విమల్
తెల్లారి పేపర్లో మాజీ క్రిమినల్
ఎన్నివేస్తే మాత్రమేం సవరణల్
ఎంతమందికివ్వాలో ఆయన వివరణల్


(జూన్ - 4, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)


మైకేరియాపేర్మోసిన మహావక్త రంగ రంగ భజరంగం
మైకు ముందు నిలవగానె పిల్లికూతలారంభం
పనిచేయని మైకు చూసి సభాసదుల సంరంభం
స్టేజి మీద భజరంగం – మొదలెట్టును వీరంగం

(జూన్, 10, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)

(కార్టూనిష్టులకు /ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)

3, సెప్టెంబర్ 2011, శనివారం

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


కీర్తిశేషులు నండూరి రామమోహనరావు గారు


పందొమ్మిదివందల డెబ్భయ్ ఒకటి ఆగస్టులో నేను విజయవాడ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో చేరిన కొత్తల్లోనే ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు తమ మకాంని హైదరాబాదుకు మార్చుకోవడంతో ఆయన బాధ్యతలు చాలావరకు నండూరి రామమోహన రావు గారిపై పడ్డాయి. జర్నలిజం లో నాకు అక్షరాభ్యాసం చేసిన తొలి గురువు ఆయనే. పేరులో వున్న ‘రామ’ శబ్దానికి తగినట్టుగా ఆయన గారి మాట మహా మృదువు. కోపం వచ్చిన సందర్భాలలో కూడా అది ఆయన కళ్ళలో కానీ, నోటిమాటల్లో కానీ ఎంతమాత్రం కానవచ్చేది కాదు. కఠినంగా చెప్పాల్సివచ్చినా మాటలో మృదుత్వం తొంగి చూసేది. ఈ విషయంలో నాకొక అనుభవం వుంది. ఆ రోజుల్లో సబ్ ఎడిటర్లం రాసిన వార్తలు అచ్చుకు పోయేముందు ఎస్ గ్యాలీ రూపంలో మళ్ళీ మా దగ్గరకే వచ్చేవి. చివరిసారిగా సరిచూసి తిరిగి కంపోజింగ్ సెక్షన్ కు పంపేవాళ్ళం. ఎస్ గ్యాలీ కాపీ ఒకటి నండూరి వారి టేబుల్ మీదకు కూడా వెళ్ళేది. ఒకసారి ఓ వార్తను అనువదిస్తూ ‘బాధ’ కు ‘భాద’ అని రాశాను. అది ఆయన దృష్టిలో పడింది. ఎస్ గ్యాలీ పట్టుకు వచ్చిన అటెండర్ నాగేశ్వరరావు - రామ్మోహన్ రావు గారు పిలుస్తున్నారని నాకు కబురు మోసుకొచ్చాడు. తీరా వెడితే, ఆయన నేను రాసిన ‘భాద’ అనే పదాన్ని చూపించి - ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత ‘భాద’ ఏమిటండీ!’ అని ‘వొత్తు’ ఎక్కడ పెట్టాలో నేను మనసు కష్టపెట్టుకోకుండా చెప్పారు. తప్పును ఎత్తి చూపడంలో కూడా నండూరి రామమోహనరావు గారి తరహానే వేరు. అందుకే ఈ ఉదంతం ఇన్నేళ్ళ తరవాత కూడా నా మనసు మడతల్లో భద్రంగా వుండిపోయింది.

అటువంటి ఆ మహా మనీషికి నా అశ్రు నివాళి!

(02-09-2011 – 10-30 PM)

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అర్ధం కాని విషయం


అర్ధం కాని విషయం

అజ్ఞాని : మాకు తెలియని ఎన్నెన్నో ఊసులు చెబుతున్నారు. చాలా సంతోషం. వింటున్నకొద్దీ వినాలని వుంది గురూ గారూ.
విజ్ఞాని: విషయాలేవీ తెలియవంటున్నావు. కొంపతీసి వైయస్సార్ మాట విని ఆ రెండు పేపర్లు చదవడంలేదా! అందుకే కాబోలు ఇలా అజ్ఞానిగా వుండిపోయావు.
అ: ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందంటారు.
వి: అవును శిష్యా. అతగాడికి భవిష్యత్తే కాదు వర్తమానం కూడా లేనట్లే.
అ: ఏం జరగబోతోందని మీ అంచనా?
వి: ఏముంది? అతడి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇవ్వాళో రేపో అరెస్ట్ చేస్తారు. బ్యాంకు అక్కౌంట్స్ సీజ్ చేస్తారు. పొట్లంలో బెల్లం లేదని తెలిసాక చుట్టూ చేరిన చీమలన్నీ తప్పుకుంటాయి. హీనపక్షం పదేళ్లన్నా జైల్లో వుండక తప్పదు. ఇక అలాటి వాడిని నమ్ముకుని ఎవరు వెనకాల వేళ్ళాడుతారు చెప్పు.
అ: ఇవన్నీ ఆ రెండు పేపర్లూ చాన్నాళ్ళ నుంచి రాస్తూనే వున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు గురూ గారూ. ఏదయినా సరి కొత్త సంగతి చెప్పండి.
వి: ప్రతి రోజూ కొత్త విషయం ఎక్కడనుంచి వస్తుంది. పాత విషయాన్నే మార్చి మార్చి రాస్తుండాలి. చెబుతుండాలి. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. జగన్ పోట్లాటెట్టుకుంది ఎవర్తో. సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టాన దేవతతో. ఢిల్లీ లో, గల్లీలో అధికారం చేతిలోవున్న కాంగ్రెస్ పార్టీ తో. ఎదురు తిరక్కుండా, నీ బాన్చెను అంటూ మోచేతినీళ్ళు తాగే ఎంతమందినయినా, వాళ్లు ఎంత లంచగొండులయినా సరే అధిష్టానం చూసీ చూడనట్టు వొదిలేస్తుంది కానీ ఎదురుతిరిగిన వాళ్ళను మాత్రం వూరికే వొదిలిపెట్టదు. పార్టీలో కింద నుంచి పైదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పిల్లోడు పార్టీకి కొత్తకదా. వాళ్ల నాయనలాగే ఉడుకు రక్తం. అందుకే అలా ఆవేశపడిపోయి ఢిల్లీ పెద్దలతో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. గిల్లి వూరుకున్నా అదో సంగతి. ఏకంగా అధినేత్రి పైనే నోరు చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పెళ్ళాలనన్నా ఎవరన్నా ఏమన్నా అంటే వూరుకుంటారేమోకానీ, సోనియాపై పల్లెత్తు మాట తూలినా చాలు వొంటి కాలు మీద లేస్తారు. తమ ఇంట్లో వోట్లు కూడా నమ్మకంగా తమకు వేయించుకోలేని కొందరు నాయకులు కేవలం ఈ ఒక్క లక్షణం కారణంగానే ఢిల్లీలో ఇన్నేళ్ళుగా నెగ్గుకువస్తున్నారు.
అ: కొత్త విషయం అంటూ మళ్ళీ ఆ పేపరోళ్లలాగానే పాతపాటే పాడుతున్నారు. మీరంటే ఆ రెండు పేపర్లు తెగ చదివేసి ఇలా విషయాలన్నీ ఇడమరచి చెబుతున్నారు. ఇన్ని ఇన్నాక కూడా ఓ సంగతి మాబోటోళ్లకు అర్ధం కావడం లేదు. మొన్న రేత్రి మా పక్కింటికి పోలీసోడు వచ్చి ఏవో రాసుకుపోయాడు. అంతే. ఉప్పుకీ, పప్పుకీ
పక్కింటి తలుపు తట్టే మా ఇంటిది కూడా మర్నాడు ఆ యింటి మొహం చూస్తే వొట్టు. పోలీసు బయం అంటే అల్లాగుంటది. అలాటిది జగన్ బాబు మీద అదేదో సెంటర్ పోలీసోళ్లు దిగిపోయారు. మీరన్నట్టు, ఆ రెండు పేపరోళ్ళు రాస్తున్నట్టు ఈ పొద్దో, రేపటిసందో ఆ బాబుని పట్టుకెళ్ళి చర్లపల్లి జెయిల్లో వేస్తారు. అల్లాగే,  బ్యాంకుల్లో ఆయన డబ్బు చెలామణీ కాకుండా చూస్తారు. మరి, ఆయనదగ్గర మరేటి వుంటాదని పాతికమందో, ముప్పయిమందో ఎమ్మెల్యేలు ఆయన వెంట వెడుతున్నట్టు. సీటు పోయిందని టీవీల్లో రాతలు వచ్చీ రాకముందే మన వెనకున్నోళ్లు అయిపు ఆజా లేకుండా పోయే రోజులివి. పోనీ, సొమ్ములకు కక్కుర్తి  పడ్డారనుకుంటే ఇవతల ఇంకా రెండేళ్ళ అధికారం వుందాయె. పదవిలో వుంటే పది పనులు చేసుకుని పది కాలాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకొచ్చు. అంకెల మీద రోజులు వెళ్ళదీసే సర్కారు తన అవసరానికి అందించే తాయిలాలకు ఆశ పడే వాళ్ళుంటారు కానీ, జగన్ ఎప్పుడో సీ ఏం అవుతాడని, అప్పుడు ఆదుకుంటాడని, వున్నదాన్ని వూడగొట్టుకునే వాళ్ళుంటారా ఎక్కడయినా. పదవిని వొదులుకుని, సర్కారు చేసే సాయాలు వొదులుకుని ఏం బావుకుందామని జగనెంట ఇంతమంది వెడుతున్నట్టు? మాకర్ధం కాని ఈ ఒక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పండి గురువు గారూ. (02-09-2011)