31, మే 2015, ఆదివారం

అమెరికా అధ్యక్షులు - అందరికీ తెలియని కొన్ని సంగతులు


అబ్రహాం లింకన్ పేరు తెలియని వాళ్లు వుండరు. దేశం కాని దేశంలో కూడా ఆయన ఫోటో గుర్తుపడతారు. అయితే ఆయన గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే - ఆ బక్క పలచటి మనిషి గట్టి మల్ల యోధుడు. గోదాలోకి దిగారంటే చాలు ఎంతటివారయినా సరే మట్టి కరవాల్సిందేనట.


అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళలో జాన్ టైలర్ ఒకరు. మరి వీరి గొప్పతనం ఏమిటంటే టైలర్ గారు ఏకంగా పదిహేనుమంది పిల్లకు తండ్రి. వైట్  హౌస్ కాబట్టి సరిపోయింది.  ఆయన ఇద్దరు మనుమలు ఇంకా  జీవించే వున్నారట.

ఇక ఫ్రాంకిలిన్ పియర్స్ - వీరికి గుర్రపు స్వారీ ఇష్టం. అయితే అలా పియర్స్ మహాశయులు గుర్రమెక్కి షికారు చేస్తుంటే ఆ గుర్రం ఒక మహిళను తొక్కుకుంటూ వెళ్ళింది. తొక్కుతూ  వెళ్ళింది గుర్రం అయినా స్వారీ చేస్తోంది పియర్స్ కాబట్టి ప్రెసిడెంటు అనికూడా చూడకుండా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. కాకపొతే సరయిన సాక్ష్యం లేని కారణంగా కోర్టులో ఆ కేసు వీగి పోయింది. అది వేరే కధ.
ఆండ్రూ జాన్ సన్ ప్రెసిడెంటు కాక  మునుపు దర్జీ పనిచేస్తూ దర్జాగా బతికేవాడు.వైట్  హౌస్ లో ప్రెసిడెంటుగా వున్నకాలంలో కూడా అయన తన కుట్టుపని మరిచిపోకుండా తన కోట్లు సూట్లు తానే కుట్టుకునేవాడు.
జేమ్స్ బుచానన్. ఈ మహాశయుడిది మరో తరహా. ప్రెసిడెంటుగా వున్నప్పుడు వాషింగ్ టన్ డీసీలో బానిసల్ని కొనుగోలు చేసేవాడు. వారిని గుట్టుచప్పుడు కాకుండా పెనిసుల్వేనియా చేర్చి అక్కడ వారికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించేవాడు.
రూధర్ ఫోర్డ్. అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తొస్తోందా! ఆయన వేరు ఈ రూధర్ ఫోర్ట్ వేరు. ఈయన కూడా ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంటే. అంతరుధ్యం కాలంలో గాయపడ్డ ఏకైక అమెరికా అధ్యక్షుడు ఈయన. ఒకసారి కాదు నాలుగు సార్లు గాయపడడం  ఇంకో ప్రత్యేకత.
విలియం టఫ్ట్. 'బిగ్ బిల్' అని ముద్దు పేరు. ముద్దు పేరుకు తగ్గట్టే మొద్దు శరీరం. అమెరికా ప్రెసిడెంట్లు అందరిలో ఇంతటి భారీ కాయం వున్న వాళ్ళు మరొకరు లేరు. ఒకసారి స్నానం చేద్దామని వైట్  హౌస్ లోని ఓ బాత్ టబ్ లోకి దిగి మళ్ళీ పైకి లేవలేకపోయాడట. ఆయన్ని బయటకు తీయడానికి సర్వెంట్లని పిలవాల్సివచ్చిందట.
హెర్బర్ట్ హూవర్. ఈయనా అమెరికా ప్రెసిడెంటే. ఈయనగారితో ఏ చిక్కూలేదు కాని ఈ ప్రెసిడెంటు గారి కొడుక్కి మొసళ్ళ పిచ్చి. రెండు మొసళ్ళను వైట్ హౌస్ లో పెంచేవాడు. అవి ఆ శ్వేత భవనంలో స్వేచ్చగా తిరుగాడుతుంటే అక్కడి సిబ్బంది గుండెలు చిక్కబట్టుకుని విధులు నిర్వహించేవారు.
చెస్టర్ ఆర్ధర్. పెద్ద పెద్ద మీసాలు. పెద్ద అందగాడేమీ కాదు. కాకపొతే చక్కటి దుస్తులు  ధరించి చూపరుల మార్కులు కొట్టేసేవాడు. ఎలిగెంట్ ఆర్ధర్ అని ఆయనకు నిక్  నేమ్ కూడా  వుండేది. ప్రెసిడెంటుగా వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఆయనంటే  మోజుపడేవారట. పదవిలో వున్నప్పుడు సరే.  అధ్యక్షపదవి నుంచి దిగిపోయే ఆఖరు రోజున కూడా నలుగురు అతివలు ఆయన వద్ద పెళ్లి ప్రస్తావనలు తెచ్చారట.
జేమ్స్ గార్  ఫీల్డ్. గ్రీక్ అండ్ లాటిన్ అంటాము  చూడండి. అంటే ఒక్క ముక్కా అర్ధం కాకపోతే మనవైపు అనేమాట. కానీ ఈ ఫీల్డ్ గారికి  ఆ రెండు భాషలు కొట్టిన పిండి. ఈయన గారు కుడి చేత్తో గ్రీకు భాషలో రాస్తూ, ఎడం చేత్తో లాటిన్ భాషలో రాస్తూ పోయేవాడట.
బెంజమిన్ హారిసన్ వైట్ హౌస్ లో ప్రెసిడెంటుగా పాదం మోపేవరకు ఆ భవనంలో నూనె దీపాలే గతి.  ఆయన హయాములోనే  శ్వేత భవనానికి  కరెంటు భాగ్యం కలిగింది. అయితే అప్పటివరకు కరెంటు అంటే ఏమిటో తెలియని హారిసన్ గారికి  కరెంటు అంటే ఎక్కడలేని భయం. విద్యుత్ దీపం వెలిగించాలంటే ఎక్కడ షాక్ కొడుతుందో అని హారిసన్  గారు హడిలిపోయేవారట.
కాల్విన్ కూలిడ్జ్ .  ఈయనది మరో తరహా.  కూలిడ్జ్ గారు కూల్ గా వైట్  హౌస్ లోని అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీసులో కూర్చుని, ఆ  భవనం మొత్తంలో వినబడేట్టు ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ  బెల్స్ మోగించేవాడు. సిబ్బంది కంగారు పడి అటూ ఇటూ పరిగెడుతుంటే ఆయనగారు విలాసంగా ఆనందించేవాడు. సిబ్బంది పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నానని ముక్తాయింపు ఇచ్చేవాడు.

 ప్రెసిడెంట్ టాడీ రూజ్ వెల్ట్ వ్యవహారం మరీ విడ్డూరం. అయన ఒక సభలో ప్రసంగిస్తున్నారు.
"మీరు గమనించారో లేదో తెలియదు కాని, ఇప్పుడే ఓ దుండగుడు నన్ను తుపాకీతో కాల్చాడు" అంటూ ప్రసంగం కొనసాగిస్తూ పోయాడు. ఆయన చెప్పేది నిజమో అబద్దమో సభికులకు అర్ధం కాలేదు. అల్లా ఆయన గంటన్నర మాట్లాడుతూ పోయాడు. ప్రసంగం ముగిసిన తరువాత చూస్తే నిజంగానే ఆయన ఛాతీలో బుల్లెట్ దిగబడివుంది.

(మరికొన్ని ముచ్చట్లు తరువాత)

My weekly TV schedule from 1st June 2015


(With ref. to some friends' requests)
Every Monday from 7.30 am to 8 am - I News


Every Tuesday  from 7 am to 7.45 am - Maha News

Every Wednesday  from 7.30 am to 8.30 am - 6 TV


Every Thursday  from 7 am to 8 am - 10 TV


Every Friday from  8.30 am to 9.30 am - 99 TV


Every Saturday   from 7-30 am to  8.30 am - Express TV


Every Sunday from 7.30 am to 8.30 am - TV 5


(Evening debates flexible, no fixed dates and timings)  


NOTE: Courtesy Image Owners 

30, మే 2015, శనివారం

తెలంగాణా, శత కోటి ఆశల ఖజానా

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-05-2015,SUNDAY)
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) 
తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.  హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమాలాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.  
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  ఏడాది గడిచిపోయింది కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా ఈ వేసవిలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. అప్పుడే  ఏడాది గడిచి పోయింది. అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అంటే ఏడాదిలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యెక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఏడాది కాలంలో  చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, ఏడాదిగా చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. వీరిని గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గుణం వారిలో వుంది.
'ఏడాదిగా ఏం చేస్తున్నారు' అనే ప్రశ్నకి జవాబు సర్కారు వద్ద సిద్ధంగా వుంది. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏం చేయాలో అవన్నీ ఆలోచిస్తున్నాము' అనేది అ జవాబు. 'ఆలోచనలు ఆచరణలోకి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు' అనేది దానికి ముక్తాయింపు. కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

   
ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?
'స్వచ్చ తెలంగాణా! స్వచ్చ హైదరాబాదు' అసలు ఈ ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినా  దానికి కొత్త మెరుగులు దిద్ది ఓ ఉద్యమంలా అమలు పరుస్తున్న తీరు చూస్తె, చెప్పిన ప్రతి పనీ చేసి చూపే సత్తా కేసీఆర్ కి వున్నదని ఆయన  ప్రత్యర్ధులు సయితం అంగీకరించే స్తితి. ఇది జాతీయ కార్యక్రమం. అయినా, దాన్ని ఓ వినూత్న పద్దతిలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మాత్రం కేసీఆర్  నేతృత్వం వహిస్తున్న తెలంగాణాయే అన్నది సుస్పష్టం.
పుష్కర కాలం పైచిలుకు తన సారధ్యంలో సాగిన వేర్పాటు ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ రాజకీయాల్లో రాటు తేలారు. సమస్యలని తనకు అనుకూలంగా మలచుకునే విద్యను పుణికిపుచ్చుకున్నారు. ఉద్యమ మూల స్వభావం మారకుండా ఎప్పటికప్పుడు పరిస్తితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా విధి విధానాల్లో, వ్యూహ ప్రతివ్యూహాల్లో మార్పులు చేసుకుంటూ కడకంటా లాక్కువచ్చారు. ఎంతో ఓపిక, ఎంతో ఏకాగ్రత వుంటే కానీ ఇది సాధ్యం కాని విషయం. ఈ పట్టుదలతోనే, అందరూ  అసాధ్యం అనుకున్న తెలంగాణా స్వప్నాన్ని  సుసాధ్యం చేసి కొత్తగా ఏర్పడ్డ ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన కలను కూడా సాకారం చేసుకోగలిగారు. వాస్తవానికి తెలంగాణా ఏర్పాటుకావడంలో  సోనియా గాంధీది కీలకమైన పాత్ర  అయినప్పటికీ, ఆ మొత్తం ఖ్యాతి తన ఖాతాలో పడేలా రాజకీయ చాతుర్యం ప్రదర్శించి ప్రత్యర్ధులను ఖంగు తినిపించారు. తనదయిన బాణీలో పాలన సాగించే క్రమంలో  ఎదురయిన ఎదురు దెబ్బలను ఒడుపుగా తనకు అనుకూలంగా మలచుకుంటూ, తెలంగాణా వాదం బలహీన పడకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఎగదోస్తూ మొత్తం తెలంగాణాకు ఎదురులేని నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే,  ఈ క్రమంలో, బంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు. ఇది చరిత్ర చెప్పే సత్యం.          
ఆంధ్ర ప్రదేశ్ అంటే హైదరాబాదు అని జనం నమ్మేలా చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పొరబాటు చేసారు. కాకపొతే, అభివృద్ధి యావత్తూ ఒకే నగర కేంద్ర బిందువుగా  జరగడంవల్ల హైదరాబాదుకు మంచి మేలే జరిగింది. విశ్వ నగరంగా అది దేశ విదేశాల్లో కొత్త ప్రాచుర్యం పొందింది. ఎక్కడెక్కడి దేశాలవారికీ హైదరాబాదు ఒక గమ్యస్థానంగా మారింది. బయటి పెట్టుబడులకు చక్కని స్థావరంగా తయారయింది.  సంజయ్ బారు చెప్పినట్టు పాతకాలంలో కూడా  హైదరాబాదుకు మంచి పేరే వుండేది. చక్కటి వాతావరణం. భాషాబేధాలు లేకుండా  కలిసిమెలిసి వుండే  ప్రజలు.   అయితే అప్పట్లో  కొన్ని పరిధులు, మరికొన్ని పరిమితులు. ఇప్పుడలా కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకదానిగా పేరు తెచ్చుకుంది. పెట్టుబడుల ఆకర్షణకు ఈ కొత్త పేరు చాలా వరకు ఉపయోగపడింది.   అయితే వికేంద్రీకరణ విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోని కారణంగా అది ప్రాంతీయ భావాలు పెచ్చరిల్లడానికి, ప్రాంతీయ అసమానతలు పెరగడానికి  కూడా దోహదం చేసింది.
ఇప్పుడు మళ్ళీ టీ.ఆర్.యస్. సర్కారు సయితం అదే పొరబాటు చేయబోతున్నదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాదు అంటే రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలు మాత్రమే అని చంద్రబాబు చేసిన ప్రయోగం మంచికంటే చెడు ఎక్కువ చేసింది. అభివృద్ధి యావత్తూ ఒకచోటే కేంద్రీకృతమై మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలకు దూరంగా వుండిపోయాయి. రాష్ట్ర విభజన అత్యంత క్లిష్టంగా మారడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి.  కేసీఆర్ మరో రెండు మూడు జిల్లాలు కలిపి హైదరాబాదు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నారు. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిని విస్తరించాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నం  మరో 'షో కేస్' ప్రయోగం కాకూడదు. విశ్వ నగరం నమూనాను ప్రపంచానికి చూపి హైదరాబాదును మార్కెట్ చేయడానికి ఈ ఆలోచన పనికి వస్తుందేమో కాని మొత్తం వెనుకబడిన తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. భవిష్యత్తులో అసమానతలకు చోటిచ్చే విధంగా సాగే ఏ రకంయాన అభివృద్ధి, సమతూకంతో, సమన్యాయంతో  కూడిన పురోగతి అనిపించుకోదు. ఈ వాస్తవాన్ని టీ.ఆర్.యస్. అధినాయకత్వం గుర్తెరిగి అడుగులు వేయడం మంచిది.
ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే ఏడాది పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం నాలుగేళ్లే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! (30 - 05 - 2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: COURTESY IMAGE OWNER

29, మే 2015, శుక్రవారం

కలిసిన ధృవాలు


ఆయనకు రామారావు సినిమాలు ఇష్టం. ఆవిడకు నాగేశ్వర్రావంటే పిచ్చి. ఆయనకు రంగనాయకమ్మ రచనలు ఇష్టం. ఆవిడ పొద్దస్తమానం యద్దనపూడి పుస్తకాలు ముందేసుకు కూర్చుంటుంది. ఆయనకు ఉల్లిపాయ పకోడీలు ఇష్టం. ఉల్లిపాయ పేరు చెబితే ఆమెకు వాంతి. ఆయనకు పేపర్లు ముద్దు. ఆవిడకి టీవీ సీరియళ్లు తప్ప వార్తలు పట్టవు. ఆయనకు ఐస్ క్రీం పడదు. కొంకర్లు పోయే చలికాలంలో కూడా ఐస్ క్రీం తినడం ఆవిడకి ఇష్టం.   తీర్ధయాత్రలు చేయాలని ఆవిడ కోరిక. సాయంకాలపు  'తీర్ధ'యాత్రలు తప్ప పుణ్య క్షేత్రాల గొడవ ఆయనకు పట్టదు. ఇలా వారి అభిరుచులు, అభిప్రాయలు ఒకదానికొకటి పొసగవు. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం. అయినా సరే వారి దాంపత్య జీవితం ఎలాటి ఒడిదుడుకులు లేకుండా యాభయ్ ఏళ్ళుగా  సాగిపోతోంది.

అద్భుతాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే కాదు, అప్పుడప్పుడూ జీవితాల్లోకి కూడా తొంగి చూస్తుండాలి సుమా!  


NOTE : COURTESY IMAGE OWNER  

27, మే 2015, బుధవారం

444444


అక్షరాలా నాలుగు లక్షల నలభయ్ నాలుగువేల నాలుగువందల నలభయ్ నాలుగు
"భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య" అనే పేరుతో నేను రాస్తున్న  నా ఈ  బ్లాగు విజిటర్ల సంఖ్య నేటికి ఈ సంఖ్యని దాటిపోయింది.
ధన్యవాదాలు, నమస్కారాలు  

మంచివాళ్ల మౌనం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 28-05-2015, THURSDAY)
ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.


సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.

ఆరోజుల్లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ  చిక్కడపల్లిలో అద్దెకు   ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు  ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి  ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబుఅనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన  పండక్కి తాను కొనుక్కున్న  చీరెల రంగులూ, వాటి  అంచులు  గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా  అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే,  ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి,  సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు,  కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య  ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను. ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.
'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని  అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది  తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన  తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి.  ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి. 'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. 'రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు సామాన్యులు అయితే మాత్రం  వాటిని వెంటనే పట్టించుకోవాలి'. ఇదీ నా థియరీ. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. ఇలా ఛానళ్లలో పదేపదే చెప్పడం వల్ల అవినీతిని సమర్ధించేవారి  జాబితాలో నా పేరు కూడా కలిపేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. 'పోనీలే అవినీతి సమర్ధకుడినే కాని అవినీతిపరుడిని అనలేదు కదా' అని నన్ను నేనే సముదాయించుకున్నాను.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ  చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల  దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది  అద్దం పడుతోంది.


ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!
Note: Courtesy Image Owner 
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

26, మే 2015, మంగళవారం

తుళ్ళూరు కనబడుటలేదుఎప్పటినుంచో నాయకుల నోళ్ళల్లో, మీడియా వార్తల్లో మారుమోగిపోయిన 'తుళ్ళూరు' ఎక్కడా కనబడడం లేదేమిటి చెప్మా! 


అది వార్త - ఇది వ్యాఖ్య


ఇది ఈ రోజు ఆంద్ర జ్యోతిలో పడ్డ వార్త:


మోదీ కోసం మూడు విమానాల దారి మళ్లింపు
ప్రధానమంత్రి మోదీ మధుర ర్యాలీలో పాల్గొని తిరిగి ఢిల్లీ వచ్చే సమయంలో ప్రధాని ప్రయాణం కోసం అధికారులు మూడు విమానాలను దారి మళ్ళించారని ఆ వార్త సారాంశం. మరి మనది ఇండియా కదా! ఇది చదివినప్పుడు ఓ పాత సంగతి గుర్తొచ్చింది. అదే వ్యాఖ్య
"ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ఎయిర్ ఫోర్స్ వన్విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం.
అది అమెరికా మరి. (26-05-2015)
(Photo Courtesy Andhra Jyothy)     


దేవుడు నిర్దయుడు


శనివారం ఉదయం పదిన్నరకు ఫోను మోగిందంటే అది ఖచ్చితంగా  టీవీ నిస్సార్ నుంచే.

(నిస్సార్)

'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి' వద్దువద్దన్నా ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం  చెప్పేవాడు. కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.
ఎన్నో ఏళ్ళుగా ప్రతి శనివారం తప్పనిసరిగా నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదు. ఫోన్ కాదు ఎప్పుడూ నవ్వుతూ వుండే అతడి మొహాన్ని కూడా నేను జీవితంలో చూడలేను. ఎందుకంటె అతడిక లేడు.
పొద్దున్న మహా టీవీకి వెడుతుంటే టీవీ 5  విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి  రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసాడని. సొంతూరు కర్నూలు జిల్లా కొడుమూరుకు తీసికెళ్ళారని.  
మూడు పదులు దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. యెంత కష్టమో అతడి కుటుంబానికి.

దేవుడు నిర్దయుడు. ఎవరికీ ఇష్టం లేని ఇలాటి పనులు చేస్తుంటాడు. దయామయుడు కూడా. తెలిసిన వారందరూ ఇష్టపడే నిస్సార్ ని తాను  కూడా ఇష్టపడి తన దగ్గరకు రప్పించుకున్నాడు.  

PHOTO COURTESY SRI NARAYANA MURTHY  

23, మే 2015, శనివారం

మోడీ ఏడాది పాలన, ఒక పరిశీలన
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-05-2015, SUNDAY)  


మనిషిది  నూరేళ్ళ జీవితం అంటారు. అంచేత అందులో  ఓ ఏడాది కాలం చెప్పుకోతగ్గది కాకపోవచ్చు. కానీ,  ప్రజాస్వామ్య దేశంలో  ఎన్నికల్లో తీర్పు ద్వారా ఆయా రాజకీయ పార్టీలకి  ప్రజలిచ్చిన అయిదేళ్ళ అధికారంలో  ఒక సంవత్సరం  గడిచిపోయిందంటే మాత్రం  అది అంత  చిన్నా చితకా సమయం అయితే కాదు. ఇక మిగిలింది కేవలం నాలుగేళ్లే అన్నది ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మిగిలున్న ఈ సమయం, అధికారంలోకి రాగానే చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినవాటిని కానీ, అధికారంలోకి రాగానే కొత్తగా జోడించిన తాజా వాగ్దానాలను లేదా సరికొత్త  పధకాలను కానీ  నూటికి నూరు శాతం అమలుచేయడానికి  సరిపోయేదయితే  కాదు.
నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా పగ్గాలు చేతిలోకి తీసుకుని ఈ నెల ఇరవై ఆరుకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ రెండు రోజుల్లో కొత్తగా సాధించి చూపించే వ్యవధానం ఎటూ లేదు కాబట్టి అయన పరిపాలనను అంచనా వేసే ప్రయత్నం కొంత ముందుగా చేస్తే తప్పేమీ కాదు. ఏడాది స్వల్ప సమయంలోనే  'ఎన్నో చేశాం' అని చెప్పుకోవడం పాలక పక్షాలకు, ఏడాది గడుస్తున్నా 'సర్కారు ఒరగబెట్టింది ఏమీ లేదు' అని ఎద్దేవా చేయడం ప్రతిపక్షాలకూ  అనూచానంగా వస్తున్న ఆచారమే . ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిగ్గా ఇదే వ్యాఖ్య చేసారు. అమేథీలో మాట్లాడుతూ, మోడీ ఏడాది పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్నట్టు చెప్పారు. పైగా ఉత్త సున్నా కాదు పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ యువ నాయకుడి విమర్శలను బీజేపీ సీనియర్ నాయకులు తిప్పికొట్టారు. అమేథీలో యువ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయి తరువాత మోడీ క్యాబినెట్లో మంత్రిగా చేరిన స్మృతి ఇరానీ కాస్త పదునైన ప్రతి వ్యాఖ్యలు చేసారు. మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఈ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ అన్నారు. పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వ కాలం పరిగణనలోకి తీసుకుంటే సున్నకు సున్నా,హళ్లికి హళ్లి అని కొట్టిపారేశారు.  మోడీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ వంటి ప్రధాన శాఖకు మంత్రిగా వున్న అరుణ్ జైట్లీ కూడా తన పాత్రకు తగ్గట్టే మాట్లాడారు. అవినీతి రహిత పాలన అంటే ఎలా వుంటుందో దేశ ప్రజలకు ఈ ఏడాది కాలంలో ప్రదర్శించి చూపామని అన్నారు. యూపీఏ పాలనలో దేశ ప్రజల్లో అలముకున్న నిరాశను పోగొట్టామనీ, కొత్త ఉత్సాహాన్ని నింపామని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ముందే చెప్పినట్టు ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడడం సహజం.          
అందుకే, ఈ  ఏడాది కాలంలో పాలకులు  'ఏం మంచి చేసారు, ఏం  చేయలేదు, అలా చేసి వుండాల్సింది కాదు' అనే మూడు మూడు అంశాలను మాత్రమే  తీసుకుని  మోడీ ప్రభుత్వం పనితీరును స్థాలీపులాకన్యాయంగా విశ్లేషించి ఒక అంచనా వేయడానికే  ఈ ప్రయత్నం.
మోడీ అనే ఈ రెండు అక్షరాలు  భారత రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పి ఇంకా ఏడాది కాలేదు. మోడీ మాయ  అప్పట్లో దేశాన్ని  కమ్మివేసింది. ఆ మాయ ఇంకా పూర్తిగా తొలగిపోయిన దాఖలాలు కానరావడం లేదు. దేశంలోని  నవ తరం యువజనుల్లో అధిక శాతం మందిని  ఆ మాయ ఇంకా కమ్ముకునే వుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి  మాధ్యమాల్లో మోడీ ప్రభలు ఇంకా విరజిమ్ముతూనే వున్నాయి. విదేశాల్లో చెప్పనక్కరేలేదు.
ఒక్క ఏడాదిన్నర వెనక్కి వెళ్లి చూస్తె భారత రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీ బీజేపీలో సయితం నరేంద్ర మోడీ ఒక సాధారణ నాయకుడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక జాతీయ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో నేతృత్వం వహించే పరిస్తితి నాడు మోడీకి వుందని వారి పార్టీ వారికే నమ్మకం లేదు. ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరు  ప్రకటించడానికి బీజేపీలో ఎంతగా మల్లగుల్లాలు పడ్డదీ తెలుసుకోవడానికి చరిత్రను తవ్వితీయనక్కర లేదు. అయితే, దరిమిలా సంభవించిన రాజకీయ పరిణామాలన్నీ మోడీకి కలసి వచ్చాయి. రెండో విడత పాలన ముగియవస్తున్న సమయానికి యూపీయేకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పీకల లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయింది. జైట్లీ అన్నట్టు ప్రజలు నిరాశలో వున్నారు. నిస్పృహకు గురై వున్నారు. కాంగ్రెస్ పట్ల అత్యధిక ప్రజానీకం పట్టరాని కోపం పెంచుకునివున్న  స్తితిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వచ్చాయి. బలహీన పడ్డ  కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి నిజానికి  బీజేపీ పెద్ద కష్టపడే పరిస్తితి లేదు. మోడీ అవసరం అంతకన్నా లేదు. కానీ,  ప్రధాని అభ్యర్ధిగా పార్టీలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికలకు ముందు మోడీ చెలరేగిపోయారు. తన వాగ్ధాటితో, తన ఆహార్యంతో, తన నేపధ్యంతో దూసుకుపోయారు. మోడీ తమలో ఒక్కరు  అని సామాన్యులు అనుకునేలా ప్రచారం సాగించారు. అన్నీ కలసివచ్చిన  మోడీ, ఎన్డీయే కూటమికి, అంతకు మించి బీజేపీకి తిరుగులేని విజయం సమకూర్చి పెట్టారు. ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.     
కొన్నేళ్ళ క్రితం వరకు నేపధ్యంలోనే నిశ్శబ్దంగా వుండి, హఠాత్తుగా వెలుగులు విరజిమ్ముతూ దూసుకువచ్చి, అదే వేగంతో నేలరాలి పోతుందని  ఇంటా (అంటే వారి సొంత పార్టీలో) బయటా (అంటే ఎదుటి పక్షాల్లో)  అందరూ అనుకున్న తరుణంలో నిలదొక్కుకుని నిలబడ్డ  'నక్షత్రం'  నరేంద్ర మోడీ. వ్యక్తులకంటే వ్యవస్థ ప్రధానం అంటూ అన్ని పార్టీలు వల్లె చేస్తుంటాయి కాని వ్యక్తుల ప్రభావంతో ఆయా రాజకీయ పార్టీల భవితవ్యాలు నిర్ధారణ అవుతూ వుండడం భారత రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ్, రాజీవ్ గాంధీ, వాజ్ పాయ్ వంటివారు జాతీయ స్థాయిలో తమదైన, బలమైన ముద్ర వేసి నాయకులు అనిపించుకున్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో కూడా స్థానిక నాయకుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు.  గుజరాత్ ముఖ్యమంత్రిగా  అంటుకున్న మరకలు, తన రాజకీయ భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నాయన్న  ఆందోళన ముసురుకుంటున్న తరుణంలో వచ్చి పడిన సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని  మోడీ రాజకీయ జీవితం  ఊహాతీతమైన మలుపు తిరిగింది. నిరుడు జరిగిన  ఎన్నికలకు కొద్ది వారాలు ముందు నుంచీ మొదలయిన మోడీ ప్రభావం ఇప్పటివరకు ప్రజలపై గణనీయంగానే వుందని సర్వేలు చెబుతున్నాయి.  ఓ ఏన్నర్ధం క్రితం బీజేపీ అగ్రనాయకుడు అద్వానీని సయితం తోసిరాజని మోడీ నేతృత్వంలో ఎన్నికల రణరంగంలో కాలుమోపాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినప్పుడే ఆ పార్టీ పగ్గాలను  మోడీ దొరకబుచ్చుకున్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్దిత్వానికి సొంత  పార్టీలోనే మొగ్గ తొడిగిన అసమ్మతి, ముదిరి పాకాన పడకముందే ఎన్నికలు ముంచుకు రావడం మోడీకి మంచి మేలే చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించి 'నభూతో నభవిష్యతి' అనే తీరులో ఓ అపూర్వ విజయాన్ని 'బీజేపీ' ఖాతాలో జమ చేయడంతో మోడీ ప్రభలు దేశ విదేశాల్లో వెలుగులు విరజిమ్మాయి.
'కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెత్తనం, గరిష్ట స్థాయిలో ప్రజా పాలన' అనే కొత్త నినాదంతో అధికార పీఠం అధిరోహించిన మోడీ,  తొలినాళ్ళలో మూటగట్టుకున్న ప్రజాభిమానమే  దరిమిలా జరిగిన కొన్ని  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  బీజేపీ  విజయపరంపర కొనసాగడానికి దోహదం చేసింది. నల్లధనం వంటి ఒకటి రెండు ఎన్నికల వాగ్దానాలు మినహా ప్రజలకు మాటిచ్చి తప్పిన అపరాధభావం అంతగా లేని పాలనావకాశం మోడీకి దొరకడం ఒక రకంగా  ఆయన అదృష్టం. 'ఒకనాటి చాయ్ వాలా ఈనాటి దేశ ప్రధాని' అనే కొత్త  ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గతంలో వీసా ఇవ్వడానికి సయితం నిరాకరించిన అమెరికా వంటి అగ్రరాజ్యంలో మోడీ భారత ప్రధాని హోదాలో అధికార పర్యటన జరపడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని కొండంతగా పెంచింది. ప్రధాని అయిన తదాదిగా మోడీ జరిపిన విదేశీ పర్యటనలు, ఆ సందర్భంగా ఆయన ఆహార్యం ఓమేరకు  విమర్శలకు  గురయినప్పటికీ, నానాటికీ పెరిగిపోతున్న మోడీ ప్రభావం ముందు అవన్నీ వెలవెల పోయాయి. 'స్వచ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా' వంటి నినాదాలు మోడీ ఆకర్షణను మరింత పెంచాయి.
అయితే, ఎన్ని చేసినా, ఎన్నో చేసామని బీజేపీ నాయకులు పదే పదే తమ నాయకుడ్ని స్తోత్ర పాఠాలతో ముంచెత్తుతూ వున్నా, ఈ ఏడాది కాలంలో మోడీ చేసిన ఒక్క మంచి పని ఏమిటంటే గట్టిగా  చెప్పుకోవడానికి స్వచ్చ భారత్ కార్యక్రమం మినహా మరొక్కటి కానరాని పరిస్తితి. ఇంకా ఏమైనా వున్నాయని చెప్పుకున్నా, అవన్నీ మోడీ  ఏడాది పాలనలో సాధించినట్టు చెప్పుకునే  ఘనకార్యాలను కీర్తించే ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే  పరిమితం.
ఇక మోడీ అభిమానులు సయితం బాధ పడే అంశం ఒకటుంది. తిరుగులేని సంఖ్యాబలం అందించి జనం ఆయన్ని గద్దె ఎక్కించారు. ఆయనకు కానీ, ఆయన నేతృత్వంలోని ఎండీఏ సర్కారుకు కానీ ముంచుకు వచ్చే ముప్పేమీ కనుచూపు మేరలో లేదు. అయినా కానీ, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆర్డినెన్సు తరహా పాలనకు పూనుకోవడం నిజానికి మోడీ వంటి నాయకుడి నుంచి ప్రజలు ఎన్నడూ కోరుకోరు. ఆర్డినెన్సుల పాలనకు స్వస్తి పలకాలని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు,  అధికార పీఠం ఎక్కగానే వాటితోనే పాలనకు స్వీకారం చుట్టడం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడడం లేదు.                              
ఇక, చెప్పి చేయని అంశం నల్ల ధనం. ఈదిశగా ఏదయినా చేసామని చెప్పుకున్నా అవి నేలబారు ప్రకటనలే. మునుపటి మన్మోహన్ ప్రభుత్వం ఇలా చేసి వుండాల్సిందని నాడు ఎన్డీయే నాయకులు చెప్పిన దాంట్లో ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దురదృష్టం ఏమిటంటే నల్లదనం వంటి అంశాలు వున్నవాళ్ళకే కాని సామాన్యులకు అంటని విషయాలు. కనుక ప్రస్తుతానికి ఈ అంశం మోడీ మెడకు బిగుసుకుపోయే అవకాశాలు తక్కువ.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, జైట్లీ గారు సెలవిచ్చినట్టు  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది. (23-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595  


22, మే 2015, శుక్రవారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో .....


'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా  లేదు'
అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు.  కొన్నేళ్ళ క్రితం  శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో  కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి  కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు. 


(సరయూ నదీ తీరంలో శాస్త్రి గారు, పుణ్యవతి గారు 2012 లో)

శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు.  అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ  'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే  మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో  'కట్టె'. అంతే.
శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో  కనిపించని వేదాంతం వుంది.
"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు  బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా  చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన.  ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి  కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
(22-05-2015)                    


ఎండల్ మండేలా

రెండు రాష్ట్రాల్లో చంద్రులేనాయే - అందుకే సూర్యుడికి కాలివుంటుంది,Image Courtesy Andhra Jyothi

20, మే 2015, బుధవారం

ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర

  
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 21-05-2015, THURSDAY)
ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి  కాస్తంత  ఉదాత్తమైన  పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల  పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక  రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.  
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల  కొద్దిసేపు  ట్రాఫిక్ సిగ్నల్స్  పనిచేయడం మానేశాయి. దాంతో  ఎవరి హడావిడిలో వాళ్ళు  పోవడం వల్ల  వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ  తన  పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ  కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను  పరిపాలనలో పాలకులకు తోడ్పడే అధికారులు ఎత్తిచూపి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు.  అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానే,  వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. 

       
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.
నిజమే. రాజకీయ నాయకులు ఎక్కడలేని వైభోగాలు అనుభవిస్తున్నారనే లోకోక్తిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ 'పీత బాధలు పీతవి' అన్నట్టు వారి ఇక్కట్లు,  వారి ఇబ్బందులు వారివి. అధికారం అన్న ఓ దండం చేతిలో వున్న కారణంగా మెడలో పడే దండలు, జనాలు పెట్టె దండాలు  మినహాయిస్తే వారి జీవితాలు కూడా పూలపానుపులు కావు. దీన్ని రుజువుచేసుకోవడానికి సచివాలయానికి వెడితే చాలు. మంత్రి దర్సనంకోసం అప్పటిదాకా పడిగాపులు పడ్డ జనం ఆయన కనబడగానే మీదపడిపోతారు. అదే ఒక చిన్న అధికారి ఆఫీసులోకి కూడా చొరవగా జొరబడలేరు. మంత్రులు, ఎమ్మెల్యేల కార్లలోకి నెట్టుకుదూరిపోయే చోటా నాయకులు అన్ని చోట్లా కనిపిస్తారు. అదే అధికారులు అయితే ఆమడ దూరంలో వుంటారు. అందుకే ముప్పయ్యేళ్ళ క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు అనుచరుల తాకిడి తట్టుకోలేక, తొడతొక్కిడి భరించలేక కారులో ముందు సీటుకు మారిపోయారు.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా  దాని వెనుక ఏదో పైకి కనిపించని  రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా  రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో  కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం  ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి  కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.                   
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా  ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి  విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు  ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది.
ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.  (20-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner