13, మే 2015, బుధవారం

ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలు ఇష్టం

బుక్ షెల్ఫ్ - 2
ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలు ఇష్టం
(శ్రీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయనకు సమాచార సలహాదారుగా వున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ పీవీ.ఆర్.కే. ప్రసాద్ రాసిన 'అసలేం జరిగిందంటే...' అనే పుస్తకం నుంచి)
"నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలను చూడడానికి ఆ నాటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇప్పుడు పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాకు సమానం) ఖాన్ గారు వచ్చారు. ఖమ్మం ట్రావెలర్స్ బంగాళాలో మధ్యాన్నం భోజనం చేసాము. మాతో పాటు  ఖమ్మం ఎస్పీ శ్రీ సదాశివరావు, అడిషినల్ ఎస్పీ శ్రీ సుదర్శన్ కూడా వున్నారు.  భోజనంలో అప్పటికప్పుడు తాజాగా వేయించి వడ్డించిన మిరపకాయ బజ్జీలు ఖాన్ గారికి బాగా నచ్చాయి. తిని ఊరుకోకుండా 'చాలా బాగున్నాయి. ఇవి నాకు ఇష్టమని మీకెలా తెలుసు' అని అడిగారు.
ఇల్లెందు చేరిన తరువాత పోలీసు అధికారుల మీటింగు జరిగింది. అక్కడ తేనీటితో పాటు వేడి వేడి మిరపకాయ  బజ్జీలు పెట్టారు. అడవి తోవలో జీపుల్లో గుండాలకు ప్రయాణం మొదలెట్టాం. దారి మధ్యలో రెండు మూడు గూడేల్లో ఆగి గిరిజనులతో మాటా మంతీ. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ కూడా మిరపకాయ బజ్జీలు మళ్ళీ ప్రత్యక్షం.
జీపులో వెడుతున్నప్పుడు వైర్ లెస్ సెట్లలో పోలీసులు మాట్లాడుకుంటున్నారు.
'ఇల్లెందు కాలింగ్ గుండాల. ఐజీ దొరగారి ప్రోగ్రాం. దొరగారితో పాటు, కలెక్టర్ దొరగారు, ఎస్పీ దొరగారు, అడిషినల్ ఎస్పీ దొరగారు కూడా వస్తున్నారు. అంతా సిద్ధమేనా...'
'అంతా రెడీ. దొరగారు ఇల్లెందు ఒదిలారా?'
'ఒదిలి అరగంట దాటింది. ఇంకో గంటలో గుండాల వస్తారు. ఐజీ దొరగారికి మిరపకాయ బజ్జీలంటే మహా పిచ్చి. వేడి వేడిగా అరేంజ్ చేయండి. ఓవర్' అని పెట్టేసాడు.
వైర్ లెస్ సంభాషణ అందరికీ వినబడింది. ఐజీ గారి మొహం ఎర్రబడింది. ఏదో అనబోతుండగా మరో గూడెం వచ్చింది. గుడిసెల పక్కనే కుంపటి, మిరపకాయ బజ్జీలు.
ఖాన్ గారికి కోపం ఆగలేదు.
'ఏమనుకుంటున్నారు. ఏమిటిదంతా! ఇక్కడికి వచ్చింది మిరపకాయ బజ్జీలు తినడానికా!  ఏదో బాగున్నాయి అని మాటవరసకు అంటే ఇంత  హదావిడా!'  అంటూ ఆయన ఆవేశంగా విరుచుకు పడ్డారు. ఎవరూ మాట్లాడలేదు.
ఖాన్ గారు మంచి ఆఫీసరు. నేను పీవీ గారి  దగ్గర ముఖ్యమంత్రి  కార్యదర్సిగా వున్నప్పుడు ఆయన జంట నగరాల కమీషనర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ ఉదంతం మొత్తంలో నాకో విషయం అర్ధం కాలేదు. సుదర్శన్ ని పక్కకి పిలిచి అడిగాను.
'ఇప్పుడే కదా ఇల్లెందు పోలీసులు బజ్జీల సంగతి చెప్పింది. అప్పటికే ఈ అడవిలో కుంపట్లు,  వేడి వేడి బజ్జీలు రెడీగా వున్నాయే. ఇదెలా సాధ్యం?'
'ఖమ్మంలో భోజనం చేసేటప్పుడే  ఐజీ గారు మిరపకాయ బజ్జీలు బాగున్నాయని చెప్పారు కదా! అంటే ఖమ్మం నుంచే ఈ కబురు వైర్ లెస్ ద్వారా  అన్ని పోలీసు స్టేషన్ లకీ చేరిపోయి వుంటుంది. అందుకే ఈ అడవిలో కూడా అన్నీ సిద్ధంగా ఉంచారు. ఎందుకయినా మంచిదని ఇల్లెందు వాళ్ళు మిగిలినవాళ్లకు  జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సరఫరాల విషయంలో మా వాళ్ళు చాలా  ఎఫిషియెంట్' అన్నారు సుదర్శన్ నవ్వుతూ.


(అసలేం జరిగిందంటే.... రచన: పీవీఆర్ కే ప్రసాద్, ఎమెస్కో ప్రచురణ)                


కామెంట్‌లు లేవు: