29, సెప్టెంబర్ 2020, మంగళవారం

అమెరికన్ ప్రత్యక్ష ప్రసారంలో మాటల యుద్ధం

 

అమెరికన్ కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఆ దేశంలోని అత్యధికశాతం జనాభా టెలివిజన్ సెట్లకు అతుక్కుపోతారు. ప్రతి నాలుగేళ్ళకు ఓసారి ఇలా జరగడం అనేది గత అరవై ఏళ్ళుగా ఓ  ఆనవాయితీగా మారింది.

వచ్చే నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకోసం మంగళవారం నాడు ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో ఆయనతో తలపడనున్న ప్రత్యర్థి జో బిడెన్  ఓహియో  రాష్ట్రంలోని  క్లీవ్  లాండ్ లో  ఒకే వేదికపై తలపడనున్నారు. తమని గెలిపిస్తే దేశానికి ఏమి చేయబోతున్నారో  ప్రజలకు తెలియచెప్పడానికి ఈ ఏర్పాటు. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ అభిమానులే కాకుండా యావత్ దేశ ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి మెండు. బరిలో ఉన్న అభ్యర్ధుల ప్రసంగ  శైలి, హావభావాలు, వేదికపై వారి ప్రవర్తన ఇవన్నీ ఓటింగు సరళిపై ప్రభావం చూపుతాయనే నమ్మకం ప్రబలంగా ఉన్న కారణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్ తీసుకుంటాయి. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రసంగ పాఠాలను తయారు చేస్తారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్  ముఖాముఖి తలపడే ఈ చర్చకు ఫాక్స్ న్యూస్ ఛానల్ ప్రతినిధి క్రిస్ వాలెస్  మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షిస్తారని అంచనా.   

1960  నుంచి ఈ ఆనవాయితీ మొదలయింది. ఆ కార్యక్రమాన్ని టీవీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రసారం చేశారు. ఈ చర్చలో నాటి డెమోక్రాటిక్ అభ్యర్ధి జాన్ ఎఫ్. కెనడీ, రిపబ్లికన్ అభ్యర్ధి రిచర్డ్ నిక్సన్  పాల్గొన్నారు. వయసు రీత్యా చిన్నవాడయిన కెనడీది  సహజంగానే పైచేయి అయింది. అప్పటికే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వుండి వచ్చిన నిక్సన్ నీరసంగా కనిపించారు. ఆ రోజుల్లో అమెరికాలో రంగుల టెలివిజన్లు లేవు. కెనడీ ధరించిన బ్లూ సూట్  బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నిక్సన్ వేసుకున్న కోటు బూడిద  రంగు. స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ రంగు కూడా బూడిద రంగు కావడంతో అందులో కలిసి తేలిపోయింది. మొత్తం మీద కెనడీ గెలుపుకు ఆనాటి చర్చ చాలావరకు దోహదం చేసిందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. చెప్పినదానికన్నా ప్రజలు చూసిందే గుర్తు పెట్టుకున్నారు అనే  వ్యాఖ్యలు వినవచ్చాయి.

మొత్తం మీద అరవై ఏళ్ళ క్రితం మొదలయిన ఈ ముఖాముఖి చర్చాకార్యక్రమం ఓ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

2016 లో జరిగిన ఎలెక్షన్ డిబేట్  కొంత వివాదాస్పదం అయింది. అప్పుడు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ పోటీ పడ్డారు. ట్రంప్ మహాశయుడు మాట తూలడంలో ప్రసిద్ధి. స్టేజీ మీదనే హిల్లరీ క్లింటన్ ను రాక్షసి అనేసారు. అంతేకాకుండా ఆమె మాట్లాడుతున్నంత సేపూ వెనకాలే తిరుగుతూ, దాదాపు  మీదకు ఒరిగినంత పనిచేశారు. ఇదంతా టీవీల్లో ప్రజలు చూసారు.

‘ఆ సమయంలో ట్రంప్ ప్రవర్తన నాకు ఏవగింపు కలిగించింది. వెనక్కు జరుగు అని గట్టిగా గద్దిద్దామనిఅనుకున్నాను. కానీ సభామర్యాదకు కట్టుబడి ఊరుకున్నాను.” అని ఆ తరువాత తన ఆత్మకధలో రాసుకున్నారు, మిసెస్ క్లింటన్.

ఈ సారి ఏమి జరుగుతుందో, ఎలా  జరుగుతుందో చూడాలి మరి. (29-09-2020)

కింది  ఫోటో : 1960 లో జరిగిన మొదటి డిబేట్ 


28, సెప్టెంబర్ 2020, సోమవారం

గుడిసెలో వాన – భండారు శ్రీనివాసరావు

 

చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు

వెలవదాయ  ఆగదాయ మనసంటది ఉసురు 

పొయ్యి తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు

గూటిపైన తడవనట్టి ఎండుటాకు గుంజి  

కూరనార దేవుడెరుగు, కాయాలిక గంజి

 

కలిగినింట గ్యాసువంట

లేదుకదా తంటా

చినుకులుతో ఆరదు కద

పేదకడుపు మంట

 

కడుపు చల్ల కదలకుండ
ఏసీల్లో టీవీలతో

గడిపెటోని

కేముంటది కడుపులోన దిగులు

వానయినా వొగ్గయినా పేదోడికె కద గుబులు

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మీరేమిట్లు? – భండారు శ్రీనివాసరావు

‘నాన్నా మనమేమిట్లు?’ అన్నాడు మా పెద్ద కొడుకు సందీప్ ఓ రోజు స్కూలు నుంచి రాగానే.


ముందు ఆ ప్రశ్న అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత చిన్నప్పుడు ఈ మాట మా బామ్మగారి నోటంట విన్న సంగతి గుర్తుకువచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రాగానే వారిని ‘ఏమిట్లు’ అని అడిగేది. నాకు ముందు అర్ధం అవకపోయినా అర్ధం అవడం మొదలయినప్పటి నుంచి ఆ మాట వినగానే చిరాకేసేది. (ఏమిట్లు అంటే మీరెవరు? ఏం కులం?)


మా ఇద్దరు పిల్లల్నీ చిక్కడపల్లిలో మా ఇంటికి రిక్షా దూరంలో హిమాయత్ నగర్ సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాను. మొదటి రోజే నాకూ ఆ స్కూలు ప్రిన్సిపాల్ గ్రిగరీ రెడ్డి గారికీ మాట తేడా వచ్చింది.
‘మీరెన్నయినా చెప్పండి ఆ కాలమ్ (Column) నేను పూర్తి చేసేది లేదు’ అనేశాను.
‘అలా ఎలా కుదురుతుంది. అది రూలు’ అన్నారాయన ఇంకా గట్టిగా.
‘అన్నీ రూలు ప్రకారమే చేస్తున్నారా’ అన్నాను ఒకింత వెటకారంగా.
‘చూడండి. మీరు రేడియో జర్నలిస్టు అని మీ ఇద్దరు పిల్లలకీ డొనేషన్ తీసుకోలేదు. మిగిలిన వారి దగ్గర తీసుకోకపోతే స్కూలు నడపలేము’
‘అప్లికేషన్ లో పిల్లవాడి కులం రాస్తేనే స్కూలు నడుస్తుందా?
ఇండియన్ అని మాత్రమే రాస్తాను, కావాలంటే రెలిజియన్ రాస్తాను. అంతేగాని కులం పేరు రాయను’
చెప్పి వచ్చేశాను.

ఆ తర్వాత ఏమీ కాలేదు. ఆయన ఆ ప్రసక్తి లేకుండానే ఇద్దరు పిల్లల్ని చేర్చుకున్నాడు.


ఇప్పుడు మళ్ళీ మావాడి మాటలతో ఆ గతం గుర్తుకువచ్చింది.


‘ఎవరు అడిగారు’ అన్నాను మా వాడితో.
‘నా క్లాస్ మేట్స్ అడుగుతున్నారు’
‘తెలవదని చెప్పు’
‘సరే’ అని వెళ్ళిపోయాడు.


అప్పటినుంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే దాకా వారి కులం ఏమిటో తెలవకుండా వారి చిన్నతనం గడిచింది.

26, సెప్టెంబర్ 2020, శనివారం

సర్కారు భరోసా

 

 

అర్హత కలిగిన వారికి సాయం చేయడం సామాజిక ధర్మం అయితే సాయపడ్డవారికి కృతజ్ఞతలు  తెలపడం కనీస మానవతా ధర్మం.

మా మూడో అన్నయ్య (ఆయన ఇప్పుడు లేరు)  కుమారుడు రమేశ్  ఖమ్మంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. దురదృష్టం కొద్దీ  వాడికీ, వాడి భార్యకూ కరోనా పాజిటివ్  అని తేలింది. అమ్మాయికి ఖమ్మంలోనే హోం క్వారంటైన్. రమేశ్ కి కొద్దికాలం క్రితం స్టెంట్ వేయడం వల్ల హైదరాబాదు పంపారు. అయిదురోజులు  ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అన్నీ చక్కబడ్డ తర్వాత ఆ వివరాలు వాట్సప్ లో తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం  నారాయణ గారెకి పంపారు. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్  అసోసియేషన్, మీడియా అకాడమీ కలిసి కరోనా బారిన పడిన  జర్నలిస్టులకు కొంత ఆర్ధిక సాయం ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేసినా అది అందుకోవాలంటే కొంత ప్రయాస తప్పదు. సంబంధిత అధికారులను కలిసి ధరకాస్తులు ఇవ్వాలి. కరోనా వచ్చినవారు ఈ లాయలాస పడలేరు. మరి ఎలా అనుకుంటూ వుంటే ఈరోజు  ఇరవై వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఎస్సేమ్మస్ వచ్చింది. దీనికి వాళ్ళు తీసుకున్న సమయం నిండా రెండు రోజులు కూడా కాదు.

ఇది విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది.

ప్రభుత్వం  ఎన్నో రకాల సంక్షేమ పధకాలు ప్రజలకు అందిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని   సంబంధిత అధికారులు కూడా తెలంగాణా  మీడియా అకాడమీ పనితీరును ఆదర్శంగా తీసుకుంటే ప్రజలకు పెద్ద భరోసా లభించినట్టే.

అల్లం నారాయణ గారికి  అభినందనలు, ధన్యవాదాలు  (24-09-2020)

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రంగులు బహు భంగులు – భండారు శ్రీనివాసరావు

 

కలర్ బ్లైండ్ నెస్ – దీన్ని తెలుగులో ఏమంటారో తెలవదు. రంగులు సరిగా గుర్తుపట్టలేకపోవడం అని విన్నాను. ఈ కంటి జబ్బు నాకు లేదు. అయినా చప్పున కలర్లు గుర్తుంచుకోలేను. అంటే నిన్న కలిసిన మనిషి ఏ రంగు చొక్కా వేసుకున్నాడు అని మర్నాడు అడిగితే నేను చప్పున జవాబు చెప్పలేను.

ఇక విషయానికి వస్తే నిన్ననో మొన్ననో ఒక ఛానల్ లో ఈ రంగులు గురించి ఒక వింతైన విషయం విన్నాను, పోనీ చూశాను. రవికాంచనిచో కవిగాంచును అన్నట్టు కొన్ని చిన్న విషయాలు కూడా జర్నలిస్టుల దృష్టిని దాటిపోలేవని అనిపించింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి  తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నుదుటిమీద తిరునామాలు దిద్ది ఆయన తలకు పరివట్టం (పట్టు వస్త్రంతో తలపాగా) చుట్టి శేష వస్త్రాన్ని మెడపై ధరింప చేశారు. సరే ఈ విశేషాలన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి. అయితే ఆ టీవీ జర్నలిస్టు తలపాగా రంగును పసికట్టి అది అధికార వైసీపీ రంగును పోలి వుందని పాయింటు తీశారు. అంతటితో ఆగకుండా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పసుపు రంగు పరివట్టం  చుట్టారని గుర్తు చేస్తూ, టీటీడీ అధికారులు కూడా ఏ ఎండకాగొడుగు మాదిరిగా పాలక పక్షాలను బట్టి తలపాగా రంగులు మారుస్తున్నారా అంటూ  ఓ పాయింటు లేవదీశారు.  ముందే  చెప్పినట్టు నాకు రంగులు గుర్తుండవు కనుక నేనేమీ చెప్పలేను.

అయితే ఈ సందర్భంలో నాకు ఓ సొంత అనుభవం గుర్తుకు వచ్చింది.

చంద్రబాబునాయుడు దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయిన తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అప్పుడు దూరదర్సన్   కరస్పాండెంటుగా పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగారి స్వాతంత్ర దినోత్సవం సందేశం కాబోలు  రికార్డు చేయాలి. షరా మామూలుగా ఆ సందేశం స్క్రిప్ట్ కాపీ ఓ  ప్లాస్టిక్ ఫోల్డర్ లో పెట్టుకుని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగారి ముఖ్య పౌర సంబంధాల అధికారికి అందచేసాను. ఆయన దాన్ని అందుకుంటూ మందహాసం చేస్తూ ‘ఏమండీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టులేదు అన్నారు సరదాగా.

ఏమిటా అని చూస్తే ఆ ప్లాస్టిక్  ఫోల్డర్  రంగు పసుపు. ఆయన రెడీ విట్ కి నాకూ నవ్వు వచ్చింది.

ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కొలువుల్లో పనిచేసేవారికి అంతటి నిశిత పరిశీలన వుండాలి. దాన్ని మనం తప్పుపట్టలేము కూడా.    (25-09-2020)       

24, సెప్టెంబర్ 2020, గురువారం

నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావు

(హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.
ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు.

సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.

(అనుకూలమైనా,ప్రతికూలమైనా కామెంట్లను తొలగించే అలవాటు నాకు లేదు. సభ్యత పాటిస్తే సంతోషం)

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సహనావతు - భండారు శ్రీనివాసరావు

 వేదకాలం నుంచి వినవస్తున్న హితోక్తి ఇది. ఎల్లకాలం మననం చేసుకుంటూ ఆచరించాల్సిన మహా సూక్తి. దీన్ని గుర్తు చేయాల్సిన పరిస్తితి దాపురించడమే ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా మీడియాలో సహనం, అసహనం అనే రెండు పదాల చుట్టూ చర్చోపచర్చలు సాగిపోతున్నాయి. ‘సహనం పాటించండి’ అని నోటితో ఓపక్క చెబుతూనే, నొసటితో అసహనం ప్రదర్శించడం ఇందులోని విషాదం.
సహనం గురించి సాధారణ జనాలు అసహనానికి గురయ్యే విధంగా చర్చలు, వాదోపవాదాలు సాగిపోతున్న నేపధ్యంలో (ఆరేడేళ్ళ క్రితం అప్పటి) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేర్వేరు సందర్భాలలో విడివిడిగా చేసిన ఉద్బోధలు గుర్తు చేసుకోవడం అవసరమనిపిస్తోంది.
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కుపాదంతో అణచి వేస్తాము'

ప్రధాని ప్రసంగ సందర్భం ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల సమావేశం. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సదస్సుల్లో ఏవిధంగా మాట్లాడుతారో మోడీ గారి ప్రసంగం అదే విధంగా సాగిపోయింది.

మన దేశానికి చెందిన కురియా కోస్ అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకున్నవాళ్లకు, ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాల ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ ఆయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు.

మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.

ఇక రెండో సందర్భం కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన మాటా మంతీ.
దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. దేశ పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.

చురుక్కుమనిపించేలా మాత్రమే కాదు, ఆలోచింపచేసేలా కూడా వున్నాయి ఆయన మాటలు. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో మంచి చేసేలా కూడా వున్నాయి.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న ప్రభుత్వం అది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ, లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు. అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.

ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ ప్రసంగాలలో చెప్పిన మాటల్ని ఇన్నేళ్ళ తరువాత గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తుంచుకోమని చెప్పాల్సి రావడం బాధాకరం.

ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో సహనం, అసహనాలు గురించిన చర్చ సాధారణ జనం సహనం కోల్పోయే స్థాయిలో అనంతంగా సాగిపోతోంది. తమ మాట వినమని చెప్పే వాళ్ళే కాని ఎదుటివారు చెప్పేది వినిపించుకునే ఓపిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.

పార్టీలకు అతీతంగా సమాజ హితాన్ని కోరుకునే వారి మనసులను కలవర పరుస్తున్న అంశం ఇదే.

( ఈ వ్యాసం రాసింది: 04-11-2015 తేదీన)

17, సెప్టెంబర్ 2020, గురువారం

విలువల పతనంలో వ్యవస్థల పోటీ – భండారు శ్రీనివాసరావు

 చేదు మాత్ర:

వ్యవస్థలలో దాపరికం లేకుండా పోయినప్పుడే ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది.

కోర్టుల్లో విచారణలో భాగంగా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుంటాయి. లాయర్ల నుంచి సరైన సమాచారం రాబట్టడానికి న్యాయమూర్తులు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అంతిమంగా వెలువడే తీర్పుకి ఈ వ్యాఖ్యలకి ఎలాంటి పొంతన ఉండక పోవచ్చు. అయినా కానీ, ఇరవై నాలుగు గంటల వార్తా ప్రసారాల్లో వాటిని పదేపదే స్క్రోల్ చేస్తుంటారు. జడ్జీలు వీటి విషయంలో కూడా తగిన ఆదేశాలు ఇస్తే మంచిది. గతంలో ప్లీడర్లు జడ్జీల మీద విసుర్లు విసిరేవారు. వాటికి సినిమాల్లో కూడా మంచి ఆదరణ లభించేది. ఇప్పుడు న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు మీడియాలో అలాంటి ఆదరణే దొరుకుతోంది. అసలు వాదోపవాదాలకంటే ఇటువంటి వాటికి ప్రచారం ఇస్తున్నారు అంటే ఎక్కడో ఏదో స్వీయ ప్రయోజనం ఉన్నట్టుగా జనం భావించే అవకాశం వుంది.

స్వీయ ప్రయోజనాలు కలిగిన మీడియాకు స్వేచ్ఛ కోరే వెసులుబాటు వుండదు. స్వేచ్ఛ కావాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. సొంత ప్రయోజనాలా సమాజం ప్రయోజనాలా అన్నది మీడియా తేల్చుకోవాల్సి వుంది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. అలాంటి స్వేచ్ఛకి ప్రజల మద్దతు లభించదు.

అలాగే ఇతర రాజ్యాంగానికి మూడు మూల స్తంభాలుగా ఏర్పరచిన వ్యవస్థలు కూడా. వీటికి రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు వుంటాయి. వీటితో పాటు కొన్ని బాధ్యతలు వుంటాయి. విశాల జాతి ప్రయోజనాలను కాపాడేందుకే ఆ వ్యవస్థలకు ఈ అధికారాలు, హక్కులూ అన్నది అవి మరచిపోరాదు.

కనపడని మరో మూల స్తంభంగా పేర్కొనే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకు అధికారాలు అంటూ ఏమీ వుండవు. కాకపోతే స్వేచ్ఛ, దానికి తగ్గట్టుగా హక్కులు, బాధ్యతలు వుంటాయి.
అపరిమితమైన, అవాంఛిత స్వేచ్ఛకు రక్షాకవచం మాదిరిగా ఒక్కోసారి ఈ హక్కులను ఓ ఉపకరణంగా వాడుకోవడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు చాలాకాలం వరకు మీడియా స్వేచ్ఛను గౌరవిస్తూనే వచ్చాయి. మీడియా రంగంలో స్వీయ ప్రయోజనాలు చొరబడిన నాటి నుంచి ఆ గౌరవ ప్రతిపత్తులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇది గమనించని మీడియా వెనుకటి మాదిరిగానే తమ హక్కుల పరిరక్షణ కోసం మిగిలిన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణంలో చిక్కుకుంటోంది. ఇది కేవలం స్వయంకృతాపరాధం.
విలువల పతనంలో మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఏమీ వెనుకబడి లేవు. ఒకప్పుడు వాటికి ఉన్న పేరు ప్రతిష్టలు వేగంగా మసకబారుతున్నాయి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను అన్ని వ్యవస్థలు అతి సహజంగా తీసుకోవడమే ఓ విషాదం. ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం అనే విష క్రీడలో అవి మునిగి తేలుతున్నాయి. పౌర సమాజం కూడా ఈ క్రీడలను చూస్తూ వినోదిస్తున్నది. వారి మౌనానికి కారణం వెరీ సింపుల్. వారిని ఉత్తేజపరచాల్సిన మీడియా, మేధావి సమాజం ఏదో ఒక రాజకీయ గుడారానికి అనుబంధంగా పనిచేస్తూ, తమ స్వీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడమే. ఇలా ఎవరి ప్రయోజనాలు వారికి ప్రధానం అయినప్పుడు, వాళ్ళు కూడా విలువల పతనానికి సాగుతున్న యాగంలో సమిధలుగా మారుతూ తమ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చుకొంటున్నారు. ఈ కోవలోనే సాధారణ జనం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా!
ఆ విధంగా చక్రభ్రమణం పూర్తయి ప్రజాస్వామ్యానికి చెదలు పడుతున్నాయి.

ఈ స్థితిని చక్కదిద్దాలని కోరని వారుండరు. కానీ ఆ ప్రయత్నం తమ నుంచే ఎందుకు మొదలు కారాదని ఆలోచించే వాళ్ళే లేరు. (17-09-2020)

మూడు పరిష్కారాలు, పరిమితులు – భండారు శ్రీనివాసరావు

మొట్టమొదటిది, మీడియా స్వేచ్ఛగా తన విధులు నిర్వహించుకునేందుకు వీలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా చూడడం. అదే సమయంలో మీడియా సైతం తన బాధ్యతగా స్వీయ నియంత్రణ పాటించడం. అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి స్వీయ ప్రయోజనాలు. వీటిని వదులుకోవడం నేటి పోటాపోటీ ప్రపంచంలో సాధ్యమా?

రెండు,  ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి పారదర్సకత. తీసుకుంటున్న నిర్ణయాలు,  జారీ చేసిన జీవోలు ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో వుంచడం. (దేశ భద్రత, మత విద్వేషాలు రెచ్చగొట్టే  అంశాలకు సంబంధించిన వాటిని మినహాయించి, మిగిలిన అన్నింటినీ ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో వుంచడం)

ఇక మూడవది, అతి ప్రధానమైనది ఏమిటంటే, న్యాయస్థానాలు కూడా స్వీయ నియంత్రణ పాటించడం. రాజ్యాంగం ప్రసాదించిన విశేష హక్కులు, అధికారాలను సంయమనంతో ఉపయోగించుకోవడం. తాముకూడా రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక భాగమని  ఎల్లప్పుడూ గుర్తెరిగి వ్యవహరించడం. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థపై ముసురుకుంటున్న అనుమానాలు, చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల దృష్ట్యా న్యాయ వ్యవస్థే తనకు తానుగా ముందుకు వచ్చి కోర్టు ధిక్కరణ వంటి అంశాల్లో ప్రజల్లో పెరుగుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి వీలుగా వాటిపై  దేశవ్యాప్త బహిరంగ చర్చను ఆహ్వానించడం.

ఈ మూడు వ్యవస్థలలో దాపరికం లేకుండా చేయగలిగితే అంతకంటే ఉత్తమ పరిష్కారం మరోటి వుండదు.

ఇవన్నీ జరిగే పనులు కావని తెలుసు. కానీ సామాన్యుడి మనసులో మాట చెప్పుకోవాలిగా, అదీ స్వీయ నియంత్రణ  పాటిస్తూ. (17-09-2020)  

కోర్టు ధిక్కరణ - భండారు శ్రీనివాసరావు

ఇది చాలా పాత ముచ్చట. ఎంత పాతది అంటే ఓ అరవై ఏళ్ళో అంతకు పూర్వమో. కాస్త లీలగా గుర్తు వుంది.
బెజవాడలో ఓ పేరు మోసిన ప్లీడరు గారు ఓ సివిల్ కేసు తీసుకున్నారు. ఎదుటి కక్షిదారు సామాన్యుడు కాదు. ఆయనా ఓ గట్టి లాయరును పెట్టుకున్నాడు. సివిల్ కేసుకదా! తీరిగ్గా చాలా రోజులు సాగింది.
చివరికి తీర్పు వెలువడింది. మన లాయరుగారు ఓడిపోయారు. ఎదుటి పక్షానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సంగతి బెజవాడనుంచి వెలువడే ఓ పత్రిక తన ఈవినింగ్ ఎడిషన్ లో ప్రచురించింది. ఆ పత్రిక యజమానికి కూడా ఈ సివిల్ దావాతో సంబంధం వుందని చెప్పుకునేవారు.
మామూలుగా అయితే ఈ కధ అంతటితో ముగిసేది. కానీ ఈ లాయరు గారిది ఉడుం పట్టు.
ఆ పత్రిక మీద కోర్టు ధిక్కరణ (Contempt of court) కేసు వేశారు.
కోర్టు తీర్పు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వెలువడింది. ఆ పత్రిక సాయంత్రం ఎడిషన్ ముద్రణ పూర్తయి మార్కెట్లోకి వచ్చేసరికి ఆరుగంటలు. ఆ రోజుల్లో పత్రికల ముద్రణ ఇప్పట్లోలా మాదిరిగా కంప్యూటర్లతో కాదు. Manual Composing.
లాయరు గారు ఈ పాయింటు పట్టుకున్నారు. నాలుగున్నరకు వెలువడిన కోర్టు తీర్పు గురించి ఆ పత్రిక వారికి ముందుగా ఎలా తెలిసింది. తీర్పు వచ్చే సమయానికి పత్రిక ముద్రణ కూడా పూర్తయిపోయింది. అలాంటప్పుడు కోర్టు తీర్పు కాపీ వారికి ఎలా వచ్చింది అని ఆ లాయరు గారు లా పాయింటు లేవదీశారు.
చివరికి ఏమి జరిగింది అనేది చాలామందికి ఉత్సుకత.
ఏం జరిగింది! అనేకానేక కధల మాదిరిగానే ఆ కధ కూడా ఎలా ముగిసిందో, ఎక్కడ వుందో ఎవరికీ తెలియదు.
కంచికి పోయి వెతుక్కోవాలేమో!

14, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - 2 - భండారు శ్రీనివాసరావు

 

సత్సంగత్వే నిస్సంగత్వం

ఆధ్యాత్మికం, ఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.

“సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి:” 

మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.

ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీ, మంచి రచనలు చదవడానికీ, మంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలు, సమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయా, దొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు  ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.

వయసులో పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.

ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలు, అల్పాహారాలు, మధ్యాన్న భోజనాలు.  ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు.  ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు,  సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.

మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణ, భారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదు, దేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజానం తాలూకు  ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టత, ఏహ్యత ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే మా ఆవిడ గర్భవతిగా వున్న సమయంలో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఆమెని సాంప్రదాయక విశ్వాసాల ప్రకారం  చీకటి గదిలో పడుకోబెట్టకుండా ఆమె చేత అఢవా చాకిరీ చేయించిన చరిత్ర నాకుంది. తొలిచూలు అయినా మూఢ నమ్మకాల మీద నా యుద్ధానికి మౌనంగా సహకరించింది.  గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా విశ్రాంతిగా పడుకోని పక్షంలో వారికి పుట్టే బిడ్డలు అవకరంగా జన్మిస్తారనే నమ్మకాలు ప్రబలంగా వున్న రోజుల్లోనే    నా నిర్వాకం ఇది.

ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది. (14-09-2020)

(తరువాయి మరోసారి)                   

    

 

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - భండారు శ్రీనివాసరావు

 

(ఉపక్రమణిక)

ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదు, నాకై నేను నాతో  పెట్టుకున్న గొడవ.

గతంలో మాదిరిగా పేరాలు పేరాలు  రాయడం కుదరకపోవడానికి కారణం చెయ్యి నొప్పి అనుకున్నాను. అంచేత పూర్వం నేను రాసుకున్న నా రాతలనే కొంతకాలంగా తిరగమోత పెడుతూ వస్తున్నాను. అక్కరాజు నిర్మల్ వంటి స్నేహితులకు ఇది బాగా తెలుసనే అనుకుంటున్నాను.

ఇప్పుడు రాయకపోవడానికి ఆ చెయ్యి నొప్పి కారణం కాదు. చేతి మీద అదనపు భారం పడకుండా టైప్ చేయడానికి మా అబ్బాయి సంతోష్ ఇంట్లో  టేబులూ, కుర్చీ ఇలా మంచి ఏర్పాట్లే చేశాడు, కార్పొరేట్ తరహాలో. అలాగే ఈ ఏడాది చేసుకోని నా పుట్టిన రోజును పురస్కరించుకుని మా కోడలు నిష బోలెడు డబ్బు పోసి ఏకంగా ఓ  లేటెస్ట్ మోడల్ లాప్ టాప్ కొనిచ్చింది. దాన్ని జరాసంధుడి మాదిరిగా మధ్యకు  విరగదీసి మరీ  రాసుకోవచ్చు(ట).

అసలు సంగతి ఇది కాదు, మనిషికి రాయాలనే ఇచ్చ కలగనిదే ఏది రాసినా అందులో సారం వుండదు. ఇన్నాళ్ళు అలాంటి చేవ లేని రచనలే చేస్తూ వస్తున్నాను అనే సంగతి ఈ మధ్యకాలంలో తరచూ మనసును పీకుతోంది.

ఇదిగో ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అనుభవం అన్నమాట.

గతవారం నేను మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో అబ్బాయి ఉంటున్న కౌంటీకి వెళ్లి దాదాపు వారం రోజులు వున్నాను. పెద్ద ఇల్లు, విశాలమైన పడక గదులు, అన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీప, లాల్ బహదూర్,  తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు వారి  స్పురిత, హసిత. నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ. అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. అందరూ ఎడం ఎడంగా  కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన హాలు. చుట్టూ పూలమొక్కలు, కూరగాయల పాదులు, అన్ని రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది. వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ కుదరలేదు.

ఓ శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.

అక్కడ ఉండగానే నాకేమీ తెలియదనే  నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి దూరం జరిగాను.

దీనికి కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.

మరో కారణం, నాలో మరో నేను వున్నాడు అనే సంగతి తెలియరావడం.

ఆ రెండో నేను నాలో  ఉన్నాడని తెలిసింది కాని, ఎవరో ఏమిటో  తెలియదు.

అది తెలియడానికే ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి,  మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం.  నాకెలా వీలుపడుతుంది?

ఆ వివరాలు మరోమారు.         

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

“ఇన్ సైడ్ వాయిస్! అవుట్ సైడ్ వాయిస్!” – భండారు శ్రీనివాసరావు

 

నిజం చెప్పొద్దూ! నేను ఇంతవరకు వినని మాట. మా అన్నయ్య మనుమరాళ్లు స్పురిత, హసిత నోటి వెంట మొదటిసారి విన్నాను.

“టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు దగ్గర దగ్గరగానే కూర్చొంటారు కదా! తాతయ్యా! మరి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడతారు”

ఒకప్పుడు ఈ చర్చల్లో పాల్గొనేవాడిని కాబట్టి వారి ప్రశ్న ఒకరకంగా సూటిగా నాకే తగిలిన భావన కలిగింది.

నా నుంచి జవాబు రాకపోవడంతో వాళ్ళే మళ్ళీ అన్నారు, “ఈ డిబేట్స్ లో ఇన్ సైడ్ వాయిస్ చాలు, అనవసరంగా అవుట్ సైడ్ వాయిస్ తో మాట్లాడుతున్నారు” అని.

ఈ ఇద్దరూ అమెరికాలోనే పుట్టారు. కానీ మన చదువులకోసం, సాంప్రదాయకంగా వారిని  పెంచడం కోసం పిల్లల్ని తీసుకుని మా అన్నయ్య కొడుకు లాల్, కోడలు దీప ఆ దేశం నుంచి వచ్చేసి హైదరాబాదులో సెటిల్ అయ్యారు.

ఆ దేశంలో ప్రతివారికీ చిన్నప్పటి నుంచీ నలుగురిలో మాట్లాడడం ఎలాగో నేర్పుతారట. అందులో భాగమే ఈ ఇన్ సైడ్ వాయిస్, అవుట్ సైడ్ వాయిస్.

ఫుట్ బాల్ మైదానం పెద్దగా వుంటుంది. అక్కడ క్రీడాకారులు ఒకరితో మరొకరు స్వరం పెంచి మాట్లాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అది అవుట్ సైడ్ వాయిస్. కొంచెం గొంతు పెంచినా ఎవరూ ఏమీ అనుకోరు.

అదే ఇళ్ళల్లో, స్కూళ్ళల్లో, మాల్స్ లో మాట్లాడుకొనేటప్పుడు స్వరం తగ్గించి మెల్లగా మాట్లాడడం అలవాటు చేస్తారు. అది ఇన్ సైడ్ వాయిస్ అన్నమాట.

గురువు అనేవాడికి వయసు ప్రధానం కాదు, జ్ఞానం ముఖ్యం. అది కలిగి వున్నవారు చిన్నవారయినా, మంచి విషయాలను  వారి నుంచి నేర్చుకోవచ్చు.

ఆ విధంగా నేను, స్పురిత, హసితల నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను.

(10-09-2020)

10, సెప్టెంబర్ 2020, గురువారం

విశ్వనాధవారి పాండిత్య వైభవం - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు 10,  విశ్వనాధవారి 125వ  జయంతి)

తెలుగు సాహిత్యాన్ని తనదైన రీతిలో ఓ మలుపు తిప్పిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు జన్మించి నేటికి  నూట పాతిక సంవత్సరాలు. విశ్వనాధవారు రాసిన రామాయణ కల్పవృక్షం అనే గ్రంధం అనేక విశిష్టతల సమాహారం. రాసింది వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినా, విశ్వనాధవారు అనేక సందర్భాలలో తనదయిన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి చూపారు. ఇందుకు ఉదాహరణ రామాయణ కల్పవృక్షంలోని ‘అహల్యా శాప విమోచన ఘట్టం.

సాధారణంగా రామాయణాలు చదివేవారికి భర్త గౌతముడి శాపంతో అహల్య శిలగా మారిపోవడం, చాలా కాలం గడిచిన తరువాత రామపాద స్పర్శతో శాపము తీరి తిరిగి అహల్య రూపం ధరించడం తెలిసిన విషయమే. ఈ దృశ్యానికి  విశ్వనాధవారు తన కవి దృష్టితో ఒక చక్కని రూపం కల్పించారు.

భర్త శాపంతో ధూలిదూసరితమైన  అదృశ్య రూపంలో అహల్య రాముని రాకకోసం ఎదురు చూస్తుంటుంది.

“వాయు భక్షా! నిరాహారా! తప్యంతీ భస్మశాయినీ!” (బాల కాండ, 48 సర్గ, 30,31 శ్లోకాలు, శ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీ మద్రామాయణము, తత్వ దీపిక) అంటూ గౌతముడు, ‘ఈ  ఆశ్రమంలోనే  వుండిపోయి, నిన్ను ఎవ్వరు చూడకుండా, నీవు ఎవ్వరిని చూడకుండా, రామపాద స్పర్శ తగిలే వరకు కంటికి కనబడని ధూళి రూపంలో  తపస్సు చేసుకోమని’ అహల్యకు  ఆనతి ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యను శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అనేది కూడా అప్పలాచార్యుల వారి భాష్యం.

రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం తన వెంట తెచ్చుకున్న దశరధ తనయులు రామలక్ష్మణులతో, వచ్చిన కార్యం జయప్రదంగా పూర్తిచేసుకుని, ఆ అన్నదమ్ములను వెంటనిడుకుని విశ్వామిత్ర మహర్షి మిధిలానగరం దిశగా వెడుతూ, మార్గమధ్యంలో గౌతమముని ఆశ్రమం పరిసరాలకు చేరుకుంటాడు. గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోవడం, అహల్య భర్తశాపానికి గురవడం వంటి కారణాలతో ఆ ఆశ్రమం ఎండిపోయిన తరుల్లతలతో, మోడువారిన వృక్షాలతో కళాకాంతులు కోల్పోయివుంటుంది. ఈ నేపధ్యాన్ని విశ్వనాధవారు తన చాతుర్యానికి ఆలంబనగా చేసుకుని కావ్యరచన చేశారు. ప్రకృతిని స్త్రీతో పోల్చడం ఎరిగిన సంగతే. దాన్నే ఆయన ఇక్కడ చక్కగా వాడుకున్నట్టు అనిపిస్తుంది.

రాముడు గౌతముడి ఆశ్రమం సమీపిస్తుండగానే, ఆయన మేను తాకి ప్రసరించిన మలయమారుతం కారణంగా ధూళి రూపంలో వున్న అహల్యకు ముందు ఘ్రాణే౦ద్రియం (నాసిక) మేల్కొంటుంది. అదే సమయంలో గౌతమ ఆశ్రమంలో వడిలిపోయివున్న పుష్పలతలు వికసించి తమ స్వభావసిద్ధమైన  సువాసనలను విరజిమ్మడం మొదలుపెడతాయి. ఆ తరువాత తనను సమీపిస్తున్న శ్రీరాముడి అడుగుల చప్పుడుతో అహల్య శరీరంలోని శ్రవణే౦ద్రియాలు (చెవులు) మేల్కొంటాయి.  అందుకు మరో సూచనగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గౌతమాశ్రమం నుంచి  పక్షుల కిలకిలారావాలు వినవస్తాయి. రాముడు మరికొంచెం దాపులోకి రాగానే అహల్య శరీరంలో చక్షువులు (నేత్రాలు) మేల్కొని ఆమె కళ్ళకు శ్రీరాముడి ఆకృతి కనబడుతుంది. అ పిదప రాముడి  పవిత్రపాదం సోకి ఆమెలోని స్పర్శే౦ద్రియం మేల్కొనగానే, అహల్యకు శాపవిమోచనం కలిగి పూర్వ రూపం వస్తుంది.

అదే సమయానికి హిమాలయాల నుంచి గౌతముడు అక్కడికి చేరుకుంటాడు. ఈ ఘట్టం పూర్తి కాగానే అహల్యా గౌతముల పునస్సమాగమం జరుగుతుంది. తదుపరి మిధిలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి  ఇదో సూచనగా  భావించవచ్చు.

విశ్వనాధవారు ఇంద్రియాలు మేల్కొనే వరుసను వర్ణించిన రీతికి మరో అన్వయం కూడా చెబుతారు.

మనిషి సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థకు వచ్చే క్రమంలో కూడా  శరీరంలోని ఒక్కొక్క ఇంద్రియం క్రమక్రమంగా మేల్కొంటుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కాని  విశ్వనాధవారు మాత్రం అహల్యా శాప విమోచన ఘట్టానికి ఒక కొత్త రూపం ఇవ్వడంలో కృతకృత్యులు అయ్యారు.