7, డిసెంబర్ 2011, బుధవారం

బెజవాడ అంటే ఇదా!


బెజవాడ అంటే ఇదా!ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని  ఆయన మాటల్లోనే -

“బెజవాడ సినిమా చూసారా. బెజవాడ అంత భయంకరంగా  ఉంటుందా. రోడ్లమీద
రవుడీలు అలా కత్తులు పట్టుకొని చంపుతామంటూ తిరుగుతారా?   నడిరోడ్లమీదే జనాలను అంత అమానుషంగా  రక్తసిక్త మయ్యేలా చంపేస్తారా?  బాబోయి!” 

“నేను సినిమాలు  చూడడం దాదాపు మానేశాననే చెప్పాలి.
ఎప్పుడేనా వో మంచి సినిమా వస్తే ఇంట్లో వాళ్ల  బలవంతం మీదా ఏడాదికి ఒక్కటో
రెండో చూస్తాను. అదీ హాయిగా నవ్వుకొనే సినిమా అయితేనే.
“ఇప్పుడు బెజవాడ పేరుతొ  సినిమా తీసారని తెలిసి ఆ సినిమా  మీద
రోజూ ఛానల్స్ లో వచ్చే చర్చలు అప్పుడప్పుడు చూస్తున్నాను, గోడలమీద వాల్ పోస్టర్లు, హోర్డింగులు
కూడా చూస్తూనే వున్నాను.  నిజంగానే భయంకరంగా వున్నాయి. వాటిని చూస్తుంటే  నా బెజవాడ ఇది కాదు అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది.
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే  వ్యక్తుల మధ్య రగిలే పగలు,సెగలు ఇవాళ  బెజవాడ అంటే. బహుశా దాన్ని  విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో.
“నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన  బెజవాడ మాత్రం  కాదు.
“నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు  పేరు.
 “అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.
“సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,  మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు,  శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు
“సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ  వంటి కవి పండిత శ్రేష్ఠులు,  పరిశ్రమలతో పాటు  ధార్మిక సంస్థలు నెలకొల్పిన  చుండూరు  వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ  రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -   బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
“ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని   అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,  బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,  సీడీ  కృష్ణమూర్తి,   నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,  ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి,  చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి,  ఏబీకె ప్రసాద్,   పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు -  వీరిదీ  బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
“ప్రభాకర ఉమామహేశ్వర పండితుల  ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి  లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,  నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి  ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే  నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

“టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి  లక్ష్మీ జనరల్ స్టోర్స్,  వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు  శ్రీ రామనవమి  పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా,  బోడెమ్మ హోటల్,  న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్,  అలంకార్  సెంటర్,  మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు,  జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే  జనం ఇవీ బెజవాడ  అంటే.
“లీలా  మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు  రోడ్డు  సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె,  దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం,  పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల  హల్వా,  రామచంద్రరావు హోటల్లో  అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,  కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం,  సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక  శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమా,  జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు,  ఎప్పుడూ  హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
“రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం,  దివ్యజ్ఞాన  సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,  ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో  గోపికలతో  సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా  కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ  మునిసిపల్ హైస్కూల్,  సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.

“అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో  ఎందుకు చెప్పాలో  తెలియనివాళ్లు తీసిన ‘బెజవాడ’  సినిమా చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.
“మా బెజవాడ చాలా గొప్పది.
“అరవ వాళ్లకి  మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”
(07-12-2011)
,

41 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

really good. u reminded me my old bezawada....thanks

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

http://youtu.be/1UK3mOR_MTU

?!

ఆత్రేయ చెప్పారు...

చాల బాగా వ్రాసారు శ్రీనివాస్.
మీరు చెప్పింది చదివితే ధనుర్మాసం లో తెల్లారే తిరుప్పావై విన్నంత బాగుంది.
జాతర్ల లో కోళ్ళు కోసేవాడు సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది మరి ?

బొందలపాటి చెప్పారు...

చాలా బాగా చెప్పారు రావు గారు మన బెజవాడ గురించి. కాకపోతే మా దిగువ కృష్ణా (బందరు,అవనిగడ్డ,) వారు బెజవాడ వారు కొంచెం "ముదుర్లు" అనుకోవటం కద్దు.

Rao S Lakkaraju చెప్పారు...

మళ్ళా అక్కడ గడిపిన జ్ఞాపకాలని నెమరువేసు కున్నాను. చక్కటి పోస్ట్.

శరత్ కాలమ్ చెప్పారు...

బాగా వ్రాసారు. నేను విజయవాడలో గడిపిన రోజులు గుర్తుకువచ్చాయి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత,ఎందుకో యేమో,ఆత్రేయ,బొందలపాటి,Rao S Lakkaraju,శరత్ కాలం - ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

"జాతర్ల లో కోళ్ళు కోసేవాడు సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది మరి ?" అని ఆత్రేయగారు చెప్పినది అక్షరాలా నిజం. ఎప్పుడో గొవింద గొవింద అని సినిమా తీసి భంగపడిన దిక్కుమాలినవర్మ "ఇంక తెలుగులో సినిమాలు తీయను" అనగానే వదిలిన శని మళ్ళీ మన తెలుగు వాళ్ళకి పట్టింది. జీవితంలో ఒక పద్ధతీ పాడూ లేకుండా పోకిరీగా, తిరుగుబోతుగా పైకెదిగిన ఆ దిక్కుమాలినవర్మకి ఏమి తెలుస్తుంది విజయవాడ గొప్పతనం....

అజ్ఞాత చెప్పారు...

బొందలపాటిగారూ మన జిల్లాలో ఏకైక "ఫాక్షనిస్టు" ప్రాతం అవనిగడ్డేనెమో, ఎక్కువమంది బెజవాడ రౌడీలుగా చలామణి అవుతున్న వారి జన్మస్తలం కూడా మీరు చెప్పిన ప్రాతాలనుకుంట.

Pavani చెప్పారు...

వావ్ ! చాలా బాగా...సారీ, చాలా చాలా బాగా బాగా రాసారు. నాకేదో వేదం విన్నట్టుంది

confused చెప్పారు...

thanks sir.I miss my Vijayawada.

Saahitya Abhimaani చెప్పారు...

ఎవడండీ ఆ బేవార్స్ ఎక్టర్ గొడ్డలి పట్టుకుని బెజవాడ సినిమాలో?? చదువూ సంధ్యా లేకుండా పూవీకుల పేరు చెప్పుకుని సినిమాల్లోకి దూరిన వాడా? సినిమా తీసినవాడొక మానసిక రోగి, అందులో ఒక బేవార్స్ గాడు హీరోనా? బెజవాడ సినిమా విజయవాడలో ఎందుకు ఆడనిస్తున్నారు. విజయవాడలో కొందరు కులగజ్జితో తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ రొగంలో పడి కొట్టుకుంటూ 1970 ల నుంచి విజయవాడ పేరు చెడగోడుతున్నారు . చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఊరికే పెట్రేగి పోతున్నారు. వీళ్ళకి ముందు, బుద్ది చెప్పాలి, విజయవాడ పేరు ఇలా చెడకుండా ఉండాలి అంటే.

నేనెప్పుడూ రాయలసీమ వెళ్లలేదు. మానసిక రొగులైన డైరెక్టర్లు తీసిన ఫాక్షన్ సినిమాలు చూసి, అమ్మో రాయల సీమ అనుకుంటున్నాను. ఇప్పుడు మా ఊరు ఐన విఇజయవాడ గురించి ఇలాంటి సినిమా వచ్చినాక, అక్కడ పుట్టి పెరిగిన వాడిగా నాకు తెలుసు అసలు విజయవాడ ఏమిటో. రాయల సీమ ఫాక్షన్ సినిమాలు ఎంత అబద్ధమో తెలుస్తున్నది.

ఏమిటి అసలు విజయవాడ?? ఊరు అభివృద్ది పట్టించుకోని చెత్త గాళ్ళు ఎక్కువ ఉన్న ఊరు,, కుల గజ్జితో తీసుకుంటున్న రెండు కులాలు.ఏది జరిగినా ఈ రెండు కులాల మధ్యనే? ప్రతి చిన్నదానికీ నానా అల్లరీ చేసుకుంటూ ఊరి పరువు తీస్తున్నారు వీళ్ళు అప్పుడెప్పుడో 1988 లో జరిగిన అలగావాళ్ళ గొడవలు ఊరి మొత్తం మీద రుద్ది సినిమా తియ్యటమా? ఎంతటి దురన్యాయం. తీవ్రంగా ఖండిస్తున్నాను.

పానీపూరి123 చెప్పారు...

శశిరేఖ పరిణయం సినిమాను గుర్తుకు తెచ్చారు :-)

నీహారిక చెప్పారు...

Vijayawada Abhimaanula Sangham Zindaabaad !!!

నీహారిక చెప్పారు...

Sir,

There is no laila college.

It's Maris Stella College, prepares for the forthcoming Golden Jubilee celebrations.

Vineela చెప్పారు...

thanks for reminding all the streets and places i went growing up..bejawada lo emaina places anna chupistaru ani chusa gani assalu ekkaledu movie.
@niharika..the author must have meant layola college not laila.

అజ్ఞాత చెప్పారు...

శివరాంప్రసాదుగారూ మీరు చెప్పినది అక్షర సత్యం......నేను రాయల సీమ అంతా తిరిగిన వాణ్ణి; సుమోలోంచి చేతులు బయట పెట్టి కత్తులు పట్టుకొనె తిప్పేవాళ్ళు నాకెక్కడా కనపడలేదు.... ఎక్కడో కొన్ని గ్రామాలలో కొన్ని పనికి మాలిన కుటుంబాల మద్య జరిగే అసూయా, ఆధిపత్యపు పైత్యమే రాయల సీమ ఫేక్షనిజంగా సినిమా వాళ్ళు రూపొందించారు. ఇటువంటి తగాదాలు మనకు కోస్తాలోనూ, తెలంగాణాలోనూ కనపడతాయి. ఎవడో మొదట రాయలసీమ గొడవల మీద సినిమా తీసినప్పుడు అది హిట్ అవటంతో, మిగిలిన డబ్బు యావగాళ్ళు మరియు "తమని తాము దైవంగా భావించే మానసిక రోగులైన హేరోలు" అదే పనిగా ఫేక్షను సినిమాలు తీసి అమ్మో రాయలసీమా అన్నట్లు చెశారు.

ఇక విజయవాడ దగ్గరికొస్తే, ఇక్కడ కొట్టుకు చచ్చేది కూడా రెండు కులాలు కాదు....కేవలం రెండు మూడు కుటుంబాల మద్య అంతర్గత పోరు మాత్రమే. పైన చెప్పిన రెండు కులాలవారు వారిలో వారు వివాహాలు కూడా చెసుకుంటారు.

కాబట్టి, సినిమా గాడిదలు ఏదో సినిమా తీసినంత మాత్రాన అది నిజమైపోదు. సినిమా వాళ్ళు ఎంత నీచులంటే సినిమాలో ఆడవాళ్ళు మొహాన బొట్టు పెట్టుకుంటే పాకిస్తానులో ఆడవని, అనేక హిందీ సినిమాలలో అవి లేకుండా తీశారు[అవి లేకపోతే మనదేశంలో ఎమైవుంటుందో అందరికీ తెలుసు]. డబ్బులోస్తాయంటే సినిమా వాళ్ళు ఏ రకమైన ప్రేమ సినిమాలు తియ్యటానికైనా వెనుకాడరు......తీరా తమదాకా వచ్చేటప్పటికి పెద్దగా గడ్డం పెంచుకొని ఒకడు...తుపాకీ పట్టుకొని ఒకడు టీవీలలో కనపడి "నీతులు" చెపుతారు.

Praveen Mandangi చెప్పారు...

బెజవాడ సినిమా ఫ్లాపైందట కదా. సాధారణంగా మా పట్టణంలో ప్రముఖ హీరో లేదా ప్రముఖ నిర్మాత యొక్క సినిమా విడుదలైతే టికెట్లు అడ్వాన్స్‌లో అమ్మేసి కొన్ని టికెట్లు బ్లాక్‌లోకి పంపించి అమ్ముతారు. కానీ బెజవాడ సినిమా విషయంలో అలా జరగలేదు.

Praveen Mandangi చెప్పారు...

రాధాకృష్ణ గారు, రాంగోపాల్ వర్మ ఒక తెలివితక్కువ సన్నాసే కానీ జాతర్లలో కోళ్ళు కోసేవాళ్ళు వాడి కంటే నయంలెండి. తిరునాళ్ళలో దేవాలయం దగ్గర జంతు బలులు ఇచ్చి రక్తం చూసి ఆనందించే సన్నాసులతో రాంగోపాల్ వర్మని పోల్చొచ్చు.

బొందలపాటి చెప్పారు...

రెండవ అజ్ఞాత గారు,
నేను ముదుర్లు అన్నది,
వ్యవహార దక్షత, లౌక్యం విషయం లో. విజయవాడ పెద్ద పట్నం కాబట్టీ అక్కడి వారికి వ్యవహార జ్ఞానం ఎక్కువ అనుకొంటా.అది మా వైపు వారికి ముదురుతనం గా కనపడేది. అలానే దాని location వలన, బెజవాడకు బయటి ప్రపంచం తో సంబంధాలు ఎక్కువ. మా వైపు వారికి బెజవాడ బయటి ప్రపంచానికి ఒక gateway. అవనిగడ్డ నుంచీ వచ్చి బెజవాడ లో వెలుగొందుతున్న ప్రముఖమైన రౌడీ ఎవరూ నాకు తెలియదు. ఒకప్పుడు అవని గడ్డ చుట్టుపక్కల ముఠా కక్షలు ఉన్న మాట నిజమే. ప్రస్తుతం అందరూ చదువులూ, ఉద్యోగాలలో పడ్డారు.

Kalyan చెప్పారు...

అద్భుతంగా చెప్పారు .. ఉద్దండులపేర్లు ఒక్కక్కటీ చదువుతూ ఉంటేమనసంతా ఎంతో గర్వంతో నిండిపోయింది .. కృతఙ్ఞతలండి

Praveen Mandangi చెప్పారు...

ఇంకో జోకేమిటంటే రాయలసీమ ఫాక్షనిస్టులు రిమోట్ కంట్రోల్ బాంబులు ఉపయోగిస్తున్నట్టు చూపించడం. నాకు తెలిసి రాయలసీమ ఫాక్షనిస్టులలో మద్దిలచెరువు సూరి, పవన్ కుమార్ రెడ్డి తప్ప ఎవరూ రిమోట్ కంట్రోల్ బాంబులు ఉపయోగించలేదు. సూరి బంధువు పవన్ కుమార్ రెడ్డి ఎలెక్ట్రానిక్స్ ఇంజినీర్ కావడం వల్ల తాను స్వయంగా రిమోట్ కంట్రోల్ బాంబు తయారు చేశాడు. అవి బయట మార్కెట్‌లో దొరకవు. అవి సైనిక ఆర్డినెన్స్ ఫాక్టరీలలో మాత్రం తయారవుతాయి.

Praveen Mandangi చెప్పారు...

మా బాబాయి గారు ఇబ్రహీంపట్నం నుంచి కొత్తగూడెంకి ట్రాన్స్ఫర్ అవ్వకముందు విజయవాడ వెళ్ళాను. అక్కడ రాంగోపాల్ వర్మ చెపుతున్నంత హింస లేదు కానీ రౌడీ నాయకులు డబ్బుల కోసం ఆస్తి తగాదాలలో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేసి ఒక పక్షానికి అనుకూలంగా తీర్పులు చెప్పడం లాంటివి మాత్రం జరుగుతుంటాయి.

అజ్ఞాత చెప్పారు...

శర్మగారూ......."జాతర్ల లో కోళ్ళు కోసేవాడు సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది మరి ?" అని చెప్పింది "ఆత్రేయ గారు"....మీరు చెప్పినది కూడా బానే ఉన్నది. మనం తిట్టాల్సిన పనేలేదు,మన అదృష్టం కొద్దీ ప్రేక్షకులు బానే బుద్ధి చెప్పారు. అదేకానీ హిట్ అయ్యుంటే జిల్లాకొక రౌడీ సినిమా తీసేవాడు ఈ సన్నాసివర్మ.

Praveen Mandangi చెప్పారు...

మా పట్టణంలో మధుకృష్ణ అనే రౌడీ ఉండేవాడు. ఇండిపెండెంట్‌గా ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. పల్లెటూర్లలో రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతుంటాయి, పదవుల కోసం. కానీ కులం కోసం ఎక్కడా కొట్లాటలు జరగవు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేది మాత్రం సినిమావాళ్ళే.

tarakam చెప్పారు...

ప్రియమైన శ్రీనివాసరావు గారికి,

బెజవాడ ప్రముఖులగురించి మీరు వ్రాసిన బ్లాగ్ చాలా బాగుంది.వర్మ ఒక మానసిక రోగి.అతని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@TAARAKAM - మీ స్పందనకు ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

Praveen Mandangi చెప్పారు...

పదిహేను, ఇరవై ఏళ్ళ క్రితం రాంగోపాల్ వర్మ తీసిన ఒకటిరెండు సినిమాలు కొంత బాగుండేవి. తరువాతే రాంగోపాల్ వర్మ అదో రకంగా మారాడు.

అజ్ఞాత చెప్పారు...

మీ పాత పోస్ట్లు పిల్లలకు చూపించాలంటే ఇబ్బందిగా ఉంది..పూర్వం చక్కగా పాత పోస్ట్లు కనబడేవి..గమనించారా...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@KVSV- మీరు రాసేదాకా పాత పోస్ట్లుల విషయం నేనూ గమనించలేదు.ఈ విషయంలో ఏం చేస్తే యెలా చేస్తే బాగుంటుందో దయచేసి సలహా ఇవ్వగలరా. ఎందుకటే రాసి పోస్ట్ చేయడం తప్ప మిగిలిన అంశాల్లో నా పరిజ్ఞానం చాలా పరిమితం. ముందస్తు కృతజ్ఞతలతో - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

కృష్ణా పుష్కరాల్లో వెల్లివిరిసే ఆధ్యాత్మిక వాతావరణం, వూరి నడుమనుంచి నిరంతరం ప్రవహిస్తున్న మూడు ముఖ్యమైన కాలవలు. వాటె నోస్టాల్జియా ? పులకించి పోయాం. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ పోస్ట్ అయితే 1983 నుంచి క్రమక్రమంగా రాష్ట్రంలోని మిగత ప్రాంతాల్లాగే బెజవాడ కూడా సర్వ నాశనం కావడం ప్రారంభమైంది. తన స్వార్ధం కోసం ప్రతి చోట గ్రూపులను ఎగదోసి ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తి పాపం కట్టుకున్నాడు. దాన్నుంచి కూడా పేలాలు ఏరుకొనే వాళ్ళ
ప్రయత్నమే బెజవాడ సినిమా అని నా నమ్మకం
ప్రసాద్.

kvsv చెప్పారు...

శ్రీనివాస రావు గారూ..నమస్తే అండీ..నాకూ ఈ విషయమై అంతగా అవగాహన లేదండీ...కాకపోతే కొత్త టాంప్లెట్ తో నా బ్లాగు ప్రివ్యూ చూసుకుని..పాత పోస్ట్లు అందులో కనబడే విధంగా వచ్చినపుడు...ఆ టాంప్లెట్ ను ఒకే చేసుకుంటాను..అందువల్ల..పాత పోస్ట్లు బ్లాగ్ ఓపెన్ చేసిన ప్రతీ సారి కనబడుతూ ఉంటాయి...మీ బ్లాగ్ లో పాత పోస్టుల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయ్ ...వాటిని మాపిల్లలకు చూపించడానికి ప్రయత్నించినపుడు ప్రస్తుత టాంప్లెట్లో పాత పోస్టులు కనబడడంలేదన్న విషయం గ్రహించాను..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@KVSV - మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు. విషయం తెలిసిన వారి సలహాలు తీసుకుని మీ సూచనను అమలు చేసే ప్రయత్నం చేస్తాను. - భండారు శ్రీనివాసరావు

vamsi చెప్పారు...

I am Vamsi Musunuri, I had a glance at with your blog post on BEZAWADA, That was written by RVV KRISHNA RAO. I am very thankful to you sir, coz it contained my Grand Father's Name, late. MUSUNURI VENKATARAMA SASTRY GARU. I am happy to send the concern post to all my family members, But pedananna had also read your post. He was amazed to see the starting line RVV Krishna Rao. So i am writing this letter to you because my pedananna studied in SRR College 1964 batch. His name is Musunuri Subrahmanya Sastry. According to him he said RVV Krishna Rao garu also studied in SRR college and later worked with IIS. He asked me consult you so that you can give me contact email of Mr.RVV Krishna Rao Garu. I thought of finding your email id, couldnt get it hence writing you this way. Sir i kindly request you to please provide me the contact details of Mr. R Krishna Rao to my email id. vamsimusunuri@gmail.com

Praveen Mandangi చెప్పారు...

రాంగోపాల్ వర్మ కొత్త సినిమా నిర్మిస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ "రెడ్డి గారు పోయారు".
http://praveensarma.in/ram-gopal-varma-is-ready-to-get-admission-in

Ram Pandu చెప్పారు...

నాది విజయవాడ.గత 20 ఏళ్ళుగా తెలంగాణా లో జాబు చేస్తున్నా.ప్రతి నెల విజయవాడ లబ్బీపేట ఇంటికి వచిన్నప్పుడు కృష్ణ నది రాగానే కలిగే feeling మీ బ్లాగ్ చదువుతుంటే కలిగింది.థాంక్స్ sir.

Ram Pandu చెప్పారు...

నాది విజయవాడ.గత 20 ఏళ్ళుగా తెలంగాణా లో జాబు చేస్తున్నా.ప్రతి నెల విజయవాడ లబ్బీపేట ఇంటికి వచిన్నప్పుడు కృష్ణ నది రాగానే కలిగే feeling మీ బ్లాగ్ చదువుతుంటే కలిగింది.థాంక్స్ sir.

susee చెప్పారు...

Vijayawada pattanam gurinchi- daanitho anubandham kaligina pramukhula gurinchi chesina vishleshana baagundi -abhinandanalu, srinivasa rao garu-

dvn చెప్పారు...

You made me nostalgic

Ravindranath Potu చెప్పారు...

Bhandaru SreenivasaRaogariki,Meeru
Vijayawada lo VictoriaMuseum,Power
House,KaleswarRaoMarket,GandhiHill,KKristnaAanakatta,SriDurgaMalleswaraSwamy,KanakaDurgaDevi sivalaymTemples,gurtu
chesthunnanu.Meeru Bezwada(vijayawada)gurinchina paatha
vivaraalu present genaretion telusukonela,old generation paatha
jnapakalu gurthuku techu konela chesaru.Meeku Dhanyavadalu.

Vamsi చెప్పారు...

Sir,
Mee anumati to ee post naa facebook lo share chesukundamanukuntunnau. Konni lines Baga nachheyee.