30, ఏప్రిల్ 2021, శుక్రవారం

కొలనరావు ఇక లేడు

 నా చిన్న మేనల్లుడు కొలనరావు కొలిపాక (లచ్చుబాబు) అనేక వేలమందికి స్నేహపాత్రుడు. ఆ  కొలనరావు ఇక లేడు. కరోనా కాటుకు బలై  29-04-2021  రాత్రి కన్ను మూశాడు.


(కొలనరావు)

ఈ మూడు ముక్కలు రాయడానికే నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉబుకి వస్తున్న కన్నీళ్లు అక్షరాలను మసకబారుస్తున్నాయి.  ఏం చెప్పను? ఏం రాయను? భగవంతుడా!  వయస్సులోనే వాడికి నూరేళ్లు నిండిపోతాయని ఏనాడూ అనుకోలేదు. కళ్ళముందు చిన్నవాళ్లు రాలిపోవడమే పెద్దవాళ్లు చేసుకున్న పాపం అని మా బామ్మ చెప్పేది.

28, ఏప్రిల్ 2021, బుధవారం

రాకూడని కష్టం

 

ఫేస్ బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్  జానకిదేవి, సంజీవరావు  దంపతులకు కరోనా గర్భశోకం  మిగుల్చింది. ముప్పయ్యేళ్లు  కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని  ఈ లోకంలో వదిలేసి.

బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.

రెండేళ్ల క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు  అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి వెళ్ళారు.

కుమార్తె భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ  దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?

ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.

కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు 




పడిలేచిన కెరటం

 

సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.

పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.

అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి తన కంపెనీని నిలబెట్టాడు.

అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.

ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.

అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.

యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో!

(2015)

27, ఏప్రిల్ 2021, మంగళవారం

కరోనా అనుభవాలు గుణ పాఠాలు కావాలి

 

‘పెసరట్టు వేయాలంటే  పెసర పిండి కావాలి. పెసర పిండి కావాలంటే పెసలను నానబోసి రుబ్బాలి. పెసలు నానడం అనేది మనిషి చేతిలో లేదు. దానికి కొంత వ్యవధానం అవసరం. ఎంత డబ్బువున్నా, ఎంత అధికారం వున్నా పెసలని వున్నట్టుండి నానేలా చేయడం అసాధ్యం. కాబట్టి డబ్బుతో అన్ని పనులు సాధ్యం కావు’  అనే అర్ధం వచ్చే ఒక సన్నివేశం బాపూరమణల అందాల రాముడు సినిమాలో వుంది.

విస్తరిస్తున్న కరోనాని మట్టుపెట్టడం అనేది తమ ఒక్కరి చేతిలో లేదని అటు పాలకులకు, ఇటు పాలితులకు తెలిసివచ్చేటప్పటికి ఏడాది పుణ్య కాలం గడిచిపోయింది. ఈ అంతుపట్టని రోగాన్ని అంతం చేసే వాక్సిన్ తయారు చేయడం అనేది ఏడాదిలోపే పూర్తి చేయడం భారత దేశం సాధించిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాక్సిన్  తారక మంత్రం కాదని కూడా  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ వాక్సిన్ మంచి ఫలితాలి ఇచ్చినప్పటికీ,  దేశంలో అందరికీ ఈ వాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడం అంత త్వరగా సాధ్యపడేట్టు లేదు.

ఈ లోగా పులిమీద పుట్రలా  కరోనా రెండో దాడి మొదలయింది. మొదటిదే నయమనిపించేలా వుంది ఈ రెండో దాడి. అసలు కరోనా గురించే జనాలకు సరైన అవగాహన లేదు అనుకునే తరుణంలో ఈ వ్యాధి గురించి రకరకాల కధనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా ఎప్పటికప్పుడు తన స్వరూప స్వభావాలు  మార్చుకుంటున్నదని మరో సమాచారం. ఇవన్నీ  వింటుంటే ఏదో హాలీవుడ్ సైంటిఫిక్ సినిమా గుర్తుకు వస్తోంది.

ఒకటి వాస్తవం. ఈ కరోనాని అంత  తొందరలో అదుపు చేయడం కష్టం. ఎప్పటికి అంటే చెప్పలేని పరిస్థితి. వారాలు కావచ్చు. నెలలు కావచ్చు.  చూస్తుండగానే ఏడాది గడిచింది. వాక్సిన్ కనుక్కుంటే చాలు దీన్ని తరిమి తరిమి కొట్టొచ్చు అనుకున్న ఆశలపై రెండో వేవ్ నీళ్ళు చల్లుతోంది.

టీవీ పెడితే, పేపరు తెరిస్తే చాలు  ఆందోళన కలిగించే వార్తలు. గతంలో బింకంగా వున్న వాళ్ళు కూడా బెంబేలు పడుతున్నారు. మందులు, మాస్కులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, వాటిల్లో తగిన సదుపాయాలు, ఆఖరికి ఆక్సిజన్ అన్నింటికీ కొరత  అంటుంటే, వాటిని వింటుంటే భయం వేయకుండా ఉంటుందా!

ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. ఈ కరోనా ప్రపంచంలో అడుగిడడానికి ముందు ఎన్ని ఆసుపత్రులు వున్నాయో ఇప్పుడూ అన్నే వున్నాయి.  అప్పుడున్న సంఖ్యలోనే  సిబ్బంది. నలుగురు వస్తే భోజనం పెట్టగల ఇంటికి హఠాత్తుగా నలభయ్ మంది చెప్పాపెట్టకుండా వస్తే,  ఏ ఇల్లాలు అయినా ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు పరిస్థితులు అలాగే వున్నాయి.

మామూలుగా ఏ ఆసుపత్రిలో అయినా, అది సర్కారీ దవాకానా కావచ్చు, ప్రైవేటు ఆసుపత్రి కావచ్చు సదుపాయాలు పరిమితంగానే వుంటాయి. ఒక వంద పడకల ఆసుపత్రిలో డెబ్బయి అయిదు జనరల్ వార్డులోనో, ప్రత్యేక గదుల్లోనో వుంటే,  ఓ పాతిక పడకలు ఐ.సీ.యూ. లో వుంటాయి. ఇది ఉదాహరణకు చెప్పే లెక్క మాత్రమే. ఇప్పుడు కరోన వచ్చిన తర్వాత జనరల్ వార్డులో వుండే రోగులందరూ ఐ.సీ.యూ.ల్లో ఉండాల్సిన పరిస్థితి. అందరికీ ఆక్సిజన్ కావాలి. ముందు అందాల రాముడు సినిమా గురించి చెప్పింది ఇందుకే. డాక్టర్లను, నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆక్సిజన్ ఎక్కడ నుంచి తెస్తారు. నిజానికి చుట్టూ వున్న గాలిలో ఆక్సిజన్ వుంటుంది. కానీ దాన్ని రోగులకు అవసరమయ్యే రీతిలో తయారు చేయడం, సరఫరా చేయడం  రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పనా!  ఎంత అధికారం వున్నా, ఎన్ని వనరులు వున్నా, ఎంత చిత్తశుద్ధి వున్నా కొన్ని సాధ్యం కానివి వుంటాయి. వీటికి మంత్ర దండాలు వుండవు.      

మళ్ళీ లాక్ డౌన్ మాటలు వినపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు కూడా. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

కిందటిసారి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సమాజంలో అనేక మంది ప్రత్యేకంగా  రెక్కాడితేకాని  డొక్కాడని  బీదాబిక్కీ, వీధి వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు. లాక్ డౌన్ కారణంగా పని దొరక్క, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి రవాణా సదుపాయాలు లేక, సామాను నెత్తిన పెట్టుకుని  మైళ్లకు మైళ్ళు నడిచి వెడుతున్న దృశ్యాలు ఇంకా జనం మనస్సులో పచ్చిగానే వున్నాయి. వాళ్ళందరూ  సొంత ఊళ్లకు వెళ్లి పోయేలా వారికి తగిన వ్యవధానం ఇస్తూ లాక్ డౌన్ ప్రకటించాలి. లేని పక్షంలో గత ఏడాదిలో చూసిన హృదయవిదారక దృశ్యాలే పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

ఇక్కడ కేంద్రమా, రాష్ట్రాలా అని కాదు, పాలకులు అందరికీ ఒకే విజ్ఞప్తి.

అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోతే ఈ దేశాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు.    

(27-04-2021)

ఎం.సత్యనారాయణరావుగారు – ఓ జ్ఞాపకం

 

వెనుకటి  రోజుల్లో హైదరాబాదు రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్. చైర్మన్ లైన్లోకి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో,  ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే, నిర్మలా వసంత్, విజయకుమార్  వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన.

అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక, మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మూడు పర్యాయాలు లోక సభ సభ్యులుగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే,  రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో,  ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

అలాంటి రేడియో అభిమాని, రాజకీయ కురువృద్ధుడు అయిన ఎం. సత్యనారాయణ రావు రాత్రి కరోనా కాటుకు బలయ్యారు అని తెలిసినప్పుడు ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది.

వారికి నా శ్రద్ధాంజలి

(27-04-2021)

26, ఏప్రిల్ 2021, సోమవారం

మరుగున పడిన ‘మణిరత్నం’

కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియక పోవచ్చు. జర్నలిష్టు మిత్రుడు వీ.జే.ఎం. దివాకర్ కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...

ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాథ్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి, బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్ కెమెరామన్ గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్ లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు.
కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా సప్తపది అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్ గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు. తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.
అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.

రావణుడిని చంపింది రాముడు కాదు

 

ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణబ్రహ్మ పట్టమహిషి, పంచ మహాపతివ్రతల్లో ఒకరైన మండోదరి. (సీత, అనసూయ, సావిత్రి, మండోదరి, ద్రౌపది)

రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో తన భర్త నిహతుడు అయినాడన్న సమాచారం తెలుసుకుని మండోదరి పెద్దపెట్టున రోదిస్తూ యుద్ధరంగం చేరుకుంటుంది. రావణుడి భౌతిక కాయం చెంత నిలబడి ఏడుస్తూ ఇలా అంటుంది.

“నాధా! నువ్వు మహా వీరుడివి. పది తలలు, ఇరవై చేతులు. యముడినే ఓడించావు. నీ పేరు వింటేనే ముల్లోకాలు గడగడలాడేవి. చివరికి ఒక మానవుడి చేతిలో చనిపోయావు.

“నిన్ను చంపింది రాముడని లోకం అనుకుంటుంది. కానీ నీ భార్యని కాబట్టి దేనిచేత చనిపోయావో నాకు తెలుసు. భర్తకు వుండే కొన్ని ప్రగాఢమైన బలహీనతలు భార్యకు మాత్రమే తెలుస్తాయి.

“ఇంద్రియాలను అదిమిపెట్టి తపస్సు చేసి వరాలు పొందావు. ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. నీ మీద పగ తీర్చుకున్నది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. (నీకున్న పరస్త్రీ వ్యామోహమే)
“ఎక్కడో అరణ్యంలో భర్తతో వనవాసం చేస్తున్న సీతమ్మ మీద నీకు ఎందుకు కోరిక పుట్టిందో తెలుసా! ఆ కామం జనించింది ఆమెను నువ్వు అనుభవించడానికి కాదు, నువ్వు మరణించడానికి. సర్వనాశనం కావడానికి.

“రాజ్యం పోయింది. కొడుకులు పోయారు. ఆఖరికి నువ్వు కూడా పోయావు. నన్ను విధవరాలిని చేశావు. పది రోజుల్లో లంక సర్వనాశనం కావడానికి నువ్వే కారణం. పెద్దల మాట వినక ఈ దుస్థితి తెచ్చుకున్నావు”

మండోదరి కడుపులో బాధ తగ్గేదాకా రాముడు ఏమీ మాట్లాడలేదు.
రావణ బ్రహ్మ పార్ధివ దేహానికి సముచిత రీతిలో అంత్యక్రియలు జరపాల్సిందని విభీషణుడిని అడుగుతాడు. అతడు సంక్షేపిస్తుంటే రాముడు అంటాడు.

“మరణంతో వైరం పోవాలి. ఏ శరీరంతో అయితే ఒక వ్యక్తి ఇన్ని ఆగడాలు చేసాడో ఆ ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టగానే వైరం కూడా వెళ్ళిపోయింది. అందుకని ఇక వైరం పెట్టుకోకూడదు. నీకు అంగీకారం లేకపోతే చెప్పు, ఆ పుణ్యకార్యం నేను చేస్తాను. స్నేహితుడి అన్నగారు నా అన్నగారే”

ఇంతటి ఉత్తముడు కనుకనే రాముడు పురుషోత్తముడు అయ్యాడు.
(26-04-2021)

25, ఏప్రిల్ 2021, ఆదివారం

టీకా తాత్పర్యం – భండారు శ్రీనివాసరావు

 టీకా హిందీ పదం అని  పాశం యాదగిరి కుండ బద్దలు కొట్టి మరీ చెబుతాడు. కాదనడానికి లేదు. ఎందుకంటే ‘హిందీ నా మదర్ టంగ్, తెలుగు  స్టెప్ మదర్ టంగ్’  అని  మరో కుండ బద్దలు కొడతాడు.

టీకా అంటే బిందు, అంటే బొట్టు,  అంటే సింధూరం, అంటే చుక్క అంటూ  ఇలా ఎన్నో అంటేల తర్వాత  చెబుతాడు, ఓ కధ. లోగడ  భుజాల మీద టీకా వేసేటప్పుడు ‘ఏం కాదు చిన్న బొట్టు’ అంటూ వేసేవారట. నిజంగానే  అక్కడ పడ్డ పుండు నయమయిన తర్వాత బొట్టు మాదిరిగా మచ్చ పడేది.

మా చిన్నతనంలో టీకాలు వేసేవాళ్ళు ఊరికి వచ్చాడని తెలియగానే వాళ్లకు కనబడితే పట్టుకుని టీకాలు పొడుస్తారని భయపడి చిన్నపిల్లలం వారి గడ్డి వాముల్లో దాక్కునే వాళ్ళం. అయినా పట్టుకుని పొడిచేవాళ్ళు. టీకా వేసిన చోట మరునాడు పొంగేది. చీము పట్టేది. రసి కారేది. సలసలమని సూదులతో  గుచ్చినట్టు నొప్పి. దానితో పాటే జ్వరం. ఆ టీకా బాధలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఆ టీకాలు ఏమిటో, ఎందుకు వేస్తారో తెలియని వయసు. పెద్దవాళ్లు కూడా చెప్పేవాళ్ళు కారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకి సరైన దారులు ఉండేవి కావు. అయినా టీకాల వాళ్ళు మాత్రం ప్రతి ఊరూ తిరిగి టీకాలు వేసేవాళ్ళు.

ఆ టీకాల పుణ్యమా అని దేశంలో మశూచి వ్యాధి అంతరించి పోయింది. అలాగే పిల్లకు చిన్నతనంలో వచ్చే కోరింత దగ్గులు (ఆస్తమా వాళ్ళ లాగా ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టుగా విడవకుండా దగ్గడం) చిన్న పిల్లల చేష్టలు ( ఉన్నట్టుండి మెలికలు తిరిగి కళ్ళు తేలవేయడం) ఇలా అనేకం వచ్చాయి. అన్ని రకాల టీకాలు వేయించుకున్నాం రాగి దమ్మిడీ ఖర్చు లేకుండా.

ఇవెప్పుడో చిన్నప్పటి టీకాల సంగతులు.

తర్వాత పల్స్ పోలియో వచ్చింది. అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను. 

ప్రభుత్వాలు, ప్రజలు ఏకతాటిపై నిలుస్తే ఒక మహమ్మారిని ఎలా తిప్పికొట్టి, రూపుమాపవచ్చో అనడానికి మనదేశంలో జరిగిన ఈ  పల్స్ పోలియో కార్యక్రమం  ఒక ఉదాహరణ. చిన్నతనంలో వచ్చే ఈ వ్యాధికి గురయి ఏటా లక్షలాదిమంది పిల్లలు జీవితాంతం వికలాంగులుగా జీవచ్ఛవాల మాదిరిగా జీవించే దుస్థితి నుంచి బయట పడేయడానికి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఒక సంజీవనిలా పనిచేసింది. 

బాగా  గుర్తుంది. 1995  డిసెంబరు 10. దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క రోజున అయిదేళ్ళ లోపు వయసున్న చిన్నపిల్లలకు అందరికీ పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వేలాదిమంది డాక్టర్లు, లక్షలాదిమంది వైద్య సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో సైనికుల మాదిరిగా పాల్గొన్నారు. ఒక ఊరు ఒక వాడ అనిలేదు. బస్సు స్టేషన్లలో, విమానాశ్రయాలలో సైతం పోలియో డ్రాప్స్ వేశారు. కొండలు, గుట్టల్లో నివసించే వారి పిల్లలకు ఈ డ్రాప్స్ వేయడానికి వైద్య సిబ్బంది శ్రమ అనుకోకుండా వెళ్ళారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు వున్నారని తెలిసినా సరే, వదిలి పెట్టకుండా చిన్న చిన్న గూడేలకు, తండాలకు వెళ్ళారు.

హైదరాబాదులో విషయాలు ఒక విలేకరిగా నాకు తెలుసు. అప్పుడు హైదరాబాదు పురపాలక సంస్థ ఇండియా పాపులేషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న డాక్టర్ ఏపీ రంగారావును  జంటనగారాలకు సంబంధించి బాధ్యుడిగా ఆరోగ్యశాఖ  కార్యదర్శి రేచల్ చటర్జీ నియమించారు. పల్స్ పోలియో ప్రాముఖ్యత, అవసరం గురించి  సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగించడానికి విస్తృతమైన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజుల్లో ఇటువంటి వాటికి రేడియో బాగా ఉపయోగపడేది. అంచేత ఈ ఈ కార్యక్రమంలో నేనూ కొంత భాగస్వామిని గా వున్నాను.

డిసెంబరు  పదో  తేదీ  దగ్గర పడింది. హడావిడి పెరిగింది. పల్స్ పోలియో కార్యకర్తలు అందరూ ఒక రోజు ముందే తొమ్మిదో తేదీ సాయంత్రానికే మునిసిపల్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది  అంతా పోలింగుకు వెళ్ళే ఎన్నికల అధికారుల మాదిరిగా తరలి వచ్చి పోలియో డ్రాప్స్ వున్న బాక్సులను వెంటబెట్టుకుని వెళ్ళారు.

మరునాడు ఉదయం అప్పటి గవర్నరు,  ముఖ్యమంత్రి  పిల్లలకు డ్రాప్స్ వేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలుపుసొలుపు లేకుండా పనిచేసిన వైద్య సిబ్బంది ఆ రాత్రి ఇళ్లకు చేరేసరికి అర్ధరాత్రి దాటి వుంటుంది.  కార్యక్రమం జయప్రదం అయిన సంతోషంలో వారికి అలసట తెలియలేదు.  

 ప్రతి పల్స్ పోలియో రోజున  కనీసం పదిహేడు కోట్ల మంది పిల్లలకు  ఈ  డ్రాప్స్ వేస్తూ వచ్చారు.  అలా చేస్తూ పొతే, దేశంలో చిట్ట చివరి పోలియో కేసు వెస్ట్ బెంగాల్ లోని హౌరా జిల్లాలో 2011 జనవరి  13 వ తేదీన రిపోర్ట్ అయింది. అదే దేశంలో చివరి పోలియో కేసు. తర్వాత, అంటే అధికార గణాంకాల ప్రకారం 2012 మే 2 వరకు  ఒక్కటంటే ఒక్క పోలియో కేసు కూడా రిపోర్ట్ కాలేదు. పోలియో  రహిత దేశంగా భారత దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012 ఫిబ్రవరి  24న అధికారికంగా ప్రకటించింది.

(25-04-2021)

మృదు భాషణకు మారుపేరు జస్టిస్ రమణ

 (Published in both Andhra and Telangana editions of Andhra Prabha today, 25-04-2021)

అవి నేను మాస్కో నుంచి వచ్చిన కొత్త రోజులు. సంజీవ రెడ్డి నగర్ లో ఉంటున్న మా మాస్కో మిత్రుడు ఒకరిని కలవడానికి వెళ్లి అక్కడికి దగ్గరలోనే  జస్టిస్ రమణ ఇల్లు వుందని జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను. అప్పుడే హైకోర్టు నుంచి వచ్చినట్టున్నారు. వేరెవరో కాకుండా ఆయనే స్వయంగా ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. పలానా అని చెప్పి ఇప్పుడు కలవడానికి  వీలుపడుతుందా అని అడిగాను. ‘భలే వాళ్ళే రండి. చాలా రోజులయింది కలిసి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. వెళ్లి కలిసాను. అంతకు ముందు పెద్ద పరిచయమేమీ లేదు. అయినా  ఆయన పలకరించిన తీరు అదీ నేను ఇప్పటికీ మరిచిపోలేను. అప్పటికే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  తాత్కాలిక ప్రధాన  న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.  నేను రేడియో విలేకరిని మాత్రమే. ముందు అప్పాయింట్ మెంటు తీసుకోకుండా కలవ్వచ్చా  అని నేను ఆలోచించలేదు. చిత్రం ఏమిటంటే,  ముందుగా చెప్పాపెట్టకుండా  నన్ను కలవడానికి ఆయన కూడా  తటపటాయించ లేదు. భేషజాలు లేని మనిషి అనిపించింది.

మనిషి ఆకారం చిన్న. కానీ చేసిన ఉద్యోగాలు పెద్ద హోదా కలిగినవి. అయినా నిరాడంబరంగా వుండడం మరింత విచిత్రం.  ఆయనతో  గడిపింది కాసేపే అయినా హాయిగా మాట్లాడారు. మాస్కో జీవితం గురించి అడిగారు. పుస్తకాలు అంటే రమణ గారెకి చాలా చాలా  ఇష్టం  అని అప్పుడే తెలిసింది. తెలుగు అంటే మరెంతో ఇష్టం అని కూడా.

తరవాత కలవడం అనేది చాలా ఏళ్ళ తరువాత జరిగింది. హిందూ రెసిడెంట్ ఎడిటర్, కీర్తిశేషులు హెచ్. జే. రాజేంద్ర ప్రసాద్ రాసిన పాత్రికేయ అనుభవాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో  జస్టిస్ రమణను  మరోసారి కలిసే అవకాశం లభించింది. అప్పటికి ఆయన  ఢిల్లీ   హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి.

ఏదో మొక్కుబడి ప్రసంగం  కాకుండా రాజేంద్ర ప్రసాద్ రాసిన పుస్తకం గురించి, ఆయన గురించి లోతుల్లోకి వెళ్లి మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  ఒక సీనియర్ పాత్రికేయుడి పుస్తకం కాబట్టి ఆవిష్కరణ కార్యక్రమానికి దేవులపల్లి అమర్ మొదలయిన సీనియర్ జర్నలిస్టులు చాలామంది హాజరయ్యారు. జస్టిస్ రమణ తన ప్రసంగంలో ఆ మాట కూడా చెప్పారు. ఇంతమంది  జర్నలిస్ట్  మిత్రులను కలుసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే తను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు చెప్పారు. సభికులలో కూర్చుని వున్న జర్నలిస్టులను ఆయన పేరు పెట్టి ప్రస్తావించడం మరింత ఆశ్చర్యం అనిపించింది. బహుశా న్యాయవాద వృత్తిలోకి రాకపూర్వం కొన్నాళ్ళు ఓ ప్రముఖ  తెలుగు వార్తా పత్రికలో పనిచేసిన అనుభవం వల్ల కావచ్చు, జస్టిస్ రమణకు జర్నలిస్టులు అంటే సానుకూల భావం.

నిజానికి న్యాయమూర్తులకు, పాత్రికేయులకు చుక్కెదురు. పత్రికల వారితో ముచ్చటించే విషయాలు వారికి ఆట్టే వుండవు. కానీ జస్టిస్ రమణ  ఆ రోజు ఆయన అనుకున్న సమయానికి మించి ఎక్కువసేపు అక్కడ గడిపారు. ప్రోగ్రాం ముగిసిన తరువాత కూడా జర్నలిష్టులతో  మాటామంతి కొనసాగించారు.

తక్కువ మాట్లాడడం, మాట్లాడిన నాలుగు ముక్కలూ మృదువుగా మాట్లాడడం, వాటిల్లో వ్యంగ్యం లేకపోవడం, అన్నింటికీ మించి ఆధిక్యతా ధోరణి రవంత కూడా  కనబడకపోవడం జస్టిస్ రమణకున్న సహజ  లక్షణాలని ఆయన్ని ఎరిగున్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు.

ఇప్పుడాయన దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సర్వోన్నత న్యాయమూర్తి. ఒక తెలుగు వ్యక్తి అంతటి అత్యున్నత స్థానానికి ఎదగడం తెలుగువారందరికీ గర్వకారణం. (EOM)






     

24, ఏప్రిల్ 2021, శనివారం

మంచి నిర్ణయం, భేషైన నిర్ణయం

 కరోనా వాక్సిన్ ని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. చాలా సముచితమైన నిర్ణయం. ఇది ఎప్పుడో చేయాల్సింది అనే చర్చలు ఇక అనవసరం.

అయితే ఒక మాట! ఇటువంటి సూచనే గతంలో చేయడం జరిగింది.  మసూచికి, పోలియోకు ప్రభుత్వాలే ముందుకు వచ్చి టీకాలు, పోలియో డ్రాప్స్ వేసిన సంగతి ప్రస్తావిస్తే, ప్రతిదీ ప్రభుత్వాలే ఉచితంగా ఇవ్వాలా! ఆ మాత్రం ఖర్చు భరించలేరా అని కొందరు దీర్ఘాలు తీశారు. ప్రజల్లో కొంతమందికి ఆ కొనుగోలు శక్తి ఉన్నమాట నిజమే. కానీ ప్రభుత్వమే పూనుకుని ఒక ఉద్యమంలా వేయడం వల్ల మశూచి వ్యాధి దేశంలో లేకుండా పోయింది. పోలియోకి అడ్డుకట్ట పడింది.

అదికాకుండా, ఇలాగే సెకండ్ వేవ్ కొనసాగి, మరోసారి లాక్ డౌన్ పరిస్థితి ఎదురయితే!

దాన్ని తట్టుకోగల స్థితి ఉందా! మొదటి సారి లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయింది. సామాన్యుల నడ్డి విరిగింది. వలస కూలీలు వందల కొద్దీ మైళ్ళు నడిచి స్వస్థలాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ నష్టంతో పోలిస్తే, లేదా భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాన్ని అంచనా వేసుకున్నా దేశ జనాభాకు ఉచితంగా కోవిడ్ టీకాలు వేయడమే సముచితం అనిపిస్తుంది.

అందుకే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించేది. 

(24-04-2021)

'నేనే!

 


'నేనే! నేను తప్ప వేరు లేదు’ అనుకునే ‘అహం బ్రహ్మాస్మి’ల కోసం, మహాకవి, సంస్కృత పండితుడు భవభూతి ఈకింది సూక్తిని ప్రవచించారు.



'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'.

విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'



(నిజానికి వ్యావహారికంలో అహం బ్రహ్మాస్మి అర్ధం వేరే విధంగా మారింది. నేనే బ్రహ్మం, జీవుడూ, దేవుడూ ఒక్కరే అనేది దీని మూలార్ధం. ఇక్కడ అహం అంటే అహంకారం కాదు)

 

ఏమి బాధలే హలా!

 పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని.

భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.

 

దొరకని పుస్తకంలో విజయవాడ

 నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే నా భోజనం. ఆయన అక్కడే చాప మీద వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.

ఆఫీసులో గుర్రపు నాడా ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు  వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు  చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.

ఇక అసలు విషయానికి వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.

ఈ మధ్య ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలోభారతి’ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్ సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో వారి ప్రస్తావన వుంది)

ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.

హువాన్ చాంగ్ చూసిన బెజవాడ”

చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.

ఇంకో విచిత్రమైన విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.

ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.

హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు