1, ఏప్రిల్ 2021, గురువారం

ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు

 ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్’

ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’

అందుకోసం పొద్దటి నుంచీ తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్! ఇంతకీ ఆ జరగబోయే మంచి ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’

ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో కూడా ఊహించలేదు సుమా!’

ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు పడ్డాయేమిటి కడుపులో’

అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్ వచ్చేసింది. ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే నెలలో మరో రెండు  రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’

మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు ఇంకా మండుతాయి’

ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు. అన్నీ మంచి రోజులే. పించన్లు నాకూ మా ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి కాని దానికి మనం కొనిపెట్టలేని అవేవో ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనకు పోయేదేమీ లేదు. వాళ్ళందరూ గెలవాలనే మనం దేవుడ్ని కోరుకుందాం’

అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’

అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా నొక్కేద్దాము, ఓ పనైపోతుంది. ఏవంటావ్’

(01-04-2021}

కామెంట్‌లు లేవు: