16, జూన్ 2021, బుధవారం

పిడికెడు బియ్యం – భండారు శ్రీనివాసరావు

  అరవై ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా!

ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి, ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.

కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!

కంచి పరమాచార్య కూడా ఈ పిడికెడు బియ్యం గురించే చెప్పారు.

స్వామి ఏమన్నారంటే:

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది "

14, జూన్ 2021, సోమవారం

పెద్ద పాము నోట్లో… పడుతుంది అనుకుంటే – భండారు శ్రీనివాసరావు

 

“భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య” అనే నా తెలుగు బ్లాగుకి వీక్షకులు పది లక్షలు దాటారు. ఇది కాదు విషయం.
వీక్షకుల సంఖ్య కోసం వున్నవి ఆరే ఆరు గళ్ళు. నిన్న అది 999999 కి చేరింది. ఆ తర్వాత మరో ఒకటి చేరితే ఏడో గడి దర్శనం ఇచ్చి 1000000 (పదిలక్షలు) అనే అంకె కనబడుతుందా లేదా అనేది ఇప్పటివరకు ఎదురైన లక్ష డాలర్ల ప్రశ్న. దానికి ఈరోజు సమాధానం దొరికింది. 999999 అంటే తొమ్మిది లక్షల తొంభయ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభయ్ తొమ్మిది మంది వీక్షకులు నా బ్లాగును చూసిన పిదప 1000000 లక్షల అంకె ఇక ‘రాదు రాదు’ అని ఖచ్చితం అని బ్లాగు ప్రపంచంలో తలపండిన వారు కొందరు తేల్చి చెప్పారు.
పరమపద సోపాన పఠంలో (మేము చిన్నప్పుడు ఈ ఆటని పాముల పఠం అనే వాళ్ళం) చిన్న చిన్న నిచ్చెనలు ఎక్కుతూ, చిన్న చిన్న పాముల నోటపడకుండా తప్పించుకుంటూ పై దాకా వెళ్లి, చివరాఖర్లో పెద్దపాము నోట్లో పడి జర్రున కిందికి జారి, ఆట మొదలు పెట్టిన చోటికే చేరినట్టు, ఇప్పుడు బ్లాగులో కూడా అదే జరుగుతుందని గట్టిగా అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా 999999 వరకు వెళ్ళడం, మరో బాక్సు రావడం, ఎంచక్కగా వీక్షకుల సంఖ్య 1000002 అని కనపడడం జరిగింది.


మొత్తం మీద నేను బ్లాగు ప్రపంచంలో చేరిన తర్వాత మొదటిసారి పది లక్షల ఒత్తుల నోము పూర్తి చేసుకున్నాను, వాయినాలు ఇవ్వకుండానే.
(14- 06-2021)

రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చు కదా! – భండారు శ్రీనివాసరావు

 బాధలు, ఇబ్బందులు రెలెటివ్ (సాపేక్షం) అని  తీర్మానించాడు ఒకాయన.

నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా గుర్తున్నాయి.

ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మేం అనుకునే ఇబ్బందులు వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.

తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!

 

అమరావతి శివలింగం – భండారు శ్రీనివాసరావు

 999999

ఈ సంఖ్యకు ఒకటి చేరితే...  100000 అక్షరాలా పది లక్షలు.కానీ అక్కడ వున్నవి ఆరు గళ్ళే మరి.

ఇదంతా దేనికంటే ,,,,,

ఈ అంకెలు నా బ్లాగులో వీక్షకుల సంఖ్యలు. ఈరోజు వరకు ఈ సంఖ్య  999 555 కి చేరుకుంది. మరో 444తో లక్ష వత్తుల నోములు పది పూర్తవుతాయి. Total Viewers అనే దానికింద  వున్నవి తొమ్మిది గళ్ళు (బాక్సులు)  మాత్రమే. ఇక లక్ష అయితే  ఈ తొమ్మిది గళ్ళు ఎలా సరిపోతాయి. మరో గడి వచ్చి చేరుతుందా! లేని పక్షంలో ఏమి జరుగుతుంది? (Like Y2K Problem) నా బ్లాగు అనికాదు కానీ ఈ ప్రశ్న నాకు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అమరావతిలోని అమరలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గర్భగుడిలోని  శివలింగం ప్రతి రోజూ పెరిగి పోతుంటే, లింగం మీద ఒక మేకు కొట్టారని, దానితో లింగం పెరుగుదల ఆగిపోయిందని, లింగం మీద ఎర్రటి రక్తపు చారికలు ఇప్పటికీ వున్నాయని  ఓ కధ చిన్నప్పుడు విన్నాను.

ఇక్కడ కూడా అలాగే జరిగి  999999 దగ్గరే ఆగిపోతుందా!

ఈ ప్రశ్నకు సమాధానం  ఇవ్వాళ  రేపట్లో తేలిపోతుంది.

(14-06-2021)

పార్టీ మార్పిళ్ళపై భాట్టం ఘాటు వ్యాఖ్య

 1978 లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో  ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు వ్యాఖ్య చేసారు.

'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'

ఈ వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.

పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగిన  పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.

తోకటపా:

పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏకం తప్పితే అనేకం అన్నట్టు,  టీడీపీ తీర్థం కూడా తదనంతర కాలంలో  పుచ్చుకున్నారు.

 

13, జూన్ 2021, ఆదివారం

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు - భండారు శ్రీనివాసరావు

 సూటిగా ....సుతిమెత్తగా.....

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు భండారు శ్రీనివాసరావు
(పదకొండు సంవత్సరాల క్రితం రాసింది)
(Published in SURYA Daily)

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని వాళ్ళ తాలూకు ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ – సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.

తోకటపా: నేను పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకిని. అయితే, రాజకీయ పార్టీలు సమయానుకూలంగా, అధికారంలో లేనప్పుడు చేసే విమర్శలకు, నిరసన ప్రదర్శనలకు, ప్రభుత్వంలో వున్నప్పుడు సమర్ధించుకుంటూ చేసే ప్రకటనలకు కూడా వ్యతిరేకిని.
(25-06-2010)

ఈ ప్రపంచం ఓ మాయా దర్పణం

 

ఓ కుక్క దారి తప్పి దారి పక్కన కనబడ్డ ఓ మ్యూజియంలోకి ప్రవేశించింది. ఆ హాల్లో ఎటు చూసినా అద్దాలే. బ్రూస్ లీ సినిమాలో మాదిరిగా కిందా, పైనా, పక్కనా, నలువైపులా నిలువెత్తు అద్దాలు. అందులో దూరిన కుక్కకు మతి పోయింది. ఎటు చూసినా తనను బోలిన శునకాలే. నిజమో కాదో తేల్చుకోవడానికి ఆ కుక్క పళ్ళు బయటపెట్టి భయపెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపిస్తూవున్నవి దాని ప్రతిబింబాలే. అవి కూడా పళ్ళు బయటపెట్టి భయపెట్టినట్టు కనిపించడంతో తన జాతి కుక్కల గుంపు నడుమ తాను నిష్కారణంగా చిక్కుకు పోయాననుకుని ఆ కుక్కకు పెద్ద భయం పట్టుకుంది. వాటిని మరింత భయపెట్టి తప్పించుకుందామన్న ఆలోచనతో మొరగడం మొదలు పెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపించే ఆ కుక్క ప్రతిబింబాలు సయితం అదేమాదిరిగా మొరగడం మొదలు పెట్టాయి. కుక్క గొంతు పెంచి గట్టిగా మొరుగుతూ అటూ ఇటూ దూకడం మొదలెట్టింది. చుట్టూ అద్దాల్లోని వందలాది కుక్కలు కూడా అంతే మెరుపు వేగంతో గెంతడం మొదలయింది. ప్రాణ భయంతో కుక్క ప్రాణాలు ఠావులు తప్పాయి. ఆరోజు సెలవు దినం కావడం వల్ల మ్యూజియం సిబ్బంది మరునాడు వచ్చి తలుపు తీసేసరికి ఆ అద్దాల మహల్ లోని అద్దాలు అన్నీ పగిలిపోయి చిందరవందరగా పడివున్నాయి. వాటి మధ్యలో విగతజీవిగా పడున్న ఓ కుక్క శరీరం.

నిజానికి ఆ హాల్లో కుక్కకు హాని తలపెట్టే వాళ్లు ఎవ్వళ్ళూ లేరు. అద్దాల్లో తన ప్రతిబింబాలను తానే చూసుకుని గాభరా పడిపోయి, అందువల్ల కలిగిన భయంతో తన చావును తానే కొనితెచ్చుకుంది.

ఈ ప్రపంచం తనకు తానుగా ప్రజలకు ఏ అపకారం తలపెట్టదు. మన మనస్సుల్లోని ఆలోచనలే మనకు మేలయినా, కీడయినా కలిగిస్తాయి. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కారణం మన భావాలే. మన కోరికలే. మన నిర్ణయాలే. మనం చేసే పనులే.

ఎందుకంటే మన చుట్టూ వున్న లోకమే ఓ పెద్ద దర్పణం.

(ఓ ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్ఛానువాదం)