అన్ని రోజులకు ఒకటికి మించిన పేర్లు ఉన్నట్టే ఒకరోజు స్టేట్ బ్యాంక్ డే.
రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.
పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు.
ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి ఈనాటి వరకు నా అక్కౌంటు అక్కడే, ఎన్. మధుర బాబు గారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్. అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం, కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది.
అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత.
‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన ఇదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే, ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది.
రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. మహా భారతం విరాట పర్వం అజ్ఞాత వాసంలో పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.
పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన బోర్డులు వున్నాయి కానీ, ఇటువంటి ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
మొత్తం మీద మా ఆవిడను నామినీగా చేర్చాను కానీ, ఆ అవసరం పడకుండా మరుసటి సంవత్సరమే నన్ను వదిలి వేరే లోకానికి తరలి వెళ్ళింది.
తోకటపా: (కొంచెం పెద్ద తోక సుమా!)
“మీ పేరు త్రినాథ్ కదూ’
అడిగాను నేను బ్యాంకుకు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చి కౌంటర్ లో కూర్చున్న కూర్చొన్న ఉద్యోగిని.
“అవును మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆశ్చర్యంగా.
సెల్ ఫోన్ అతడి ముందుకు తోసి, “మీకు అభ్యంతరం లేకపోతే ఒక నిమిషం ఇది చదువుతారా” అని అడిగాను సాధ్యమైనంత వినమ్రతతో కూడిన స్వరంతో. నా గొంతులోని మార్దవాన్ని గమనించి అతడు చదవడం మొదలు పెట్టాడు.
అది నిరుటి సంవత్సరం అంటే 2020 నవంబర్ ఇరవై ఒకటిన పోస్టు చేసిన కధనం.
అదే ఇది:
21-11-2020 నాటికి భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్ ఇచ్చారివాళ.
మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు అని సంబరపడి అరిసెలు వండి పెట్టేదేమో, మా ఆవిడ బతికి ఉన్నట్టయితే. ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి (కట్టుకు) మూసుకు వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి ఉంటున్నాను.
స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్ ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్ జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో జిరాక్స్ మిషిన్ వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఈ మర్యాదకు ఆశ్చర్యపోతూనే అక్కడికి వెడితే నోట్ల కట్టల వెనుక నగదు అధికారి ఒకరు తదేక దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి, నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే తోటి సిబ్బందితో ముచ్చట్లు చెప్పడం, తేనీరు సేవించడం వంటి పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరా మామూలుగా థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని ధ్రువపత్రంతో పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇచ్చాను. అతడు నా వేలి ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.
వయసు మళ్ళిన పెన్షనర్లతో ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని, థాంక్స్ త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.
ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది పని పూర్తి అయింది.”
ఇదంతా ఓపిగ్గా చదివిన త్రినాధ్ అన్నాడు నాతో మన్నింపుగా.
“సారీ అండీ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను, మేనేజర్ దగ్గర పనిలో వుండి”
అంటూనే నా పని నిమిషాల్లో పూర్తి చేసి జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టాడు.
థాంక్స్ త్రినాధ్! (హోప్ టు సీ యు నెక్స్ట్ ఇయర్)
బ్రాకెట్లోది పైకి అనలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి