ఇది కదా గవర్నర్ ఎంపిక అంటే!
రాజభవనాల్లో పుట్టి పెరిగిన ఈ రాజు గారు గోవా రాజ్ భవన్ లో అడుగుపెట్టబోతున్నారు.
అశోక్ గజపతిరాజు రాజవంశం వాడయినా రాచరికపు లక్షణాలను వంటబట్టించుకోలేదు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ రాజకీయ కాలుష్యానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన సచ్చీలత, నిరాడంబరత లోకవిదితం.
కొన్ని దశాబ్దాలుగా ఆయన తన పార్టీలో శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు.
ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తే ఆయన ఛాంబర్ ఖాళీగా కనిపించేది. చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో, రాజుగారి ఆఫీసులో జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్ ఓ.యస్.డీ., బీ ఎన్ కుమార్ గారు నన్ను చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక, తలుపు తోసుకుని లోపలకు వెళ్ళేవాడిని. విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ, ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.
రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతిపోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ సక్రమంగా జరిగిపోయాయి.
ఆ రోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దంన్నర దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు.
నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.
సాధారణంగా ఐ ఏ ఎస్ అధికారులు రాజకీయ నాయకుల వ్యవహార శైలి పట్ల సుముఖంగా వుండరు. మరీ ముఖ్యంగా రూలు బుక్కు పరకారం ముక్కుసూటిగా పోయే అధికారులు, అడ్డదిడ్డంగా పనులు చేయమని ఆదేశాలు ఇచ్చే మంత్రులు, ముఖ్యమంత్రుల విషయంలో వారికి సదభిప్రాయం వుండదు.
అయితే అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘ కాలం క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఆయన కింద పనిచేసిన ఏ ఒక్క అధికారీ రాజు గారి గురించి పల్లెత్తు మాట అనేవారు కాదు.
‘నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు అడిగితే ఎలా కాదంటాము, మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెడతాము చెప్పండి’ అంటారు రాజకీయులు. అదే నిజమనుకుంటే, రాజు గారు తమ యావత్తు క్రియాశీలక రాజకీయ జీవితంలో అన్ని పర్యాయాలు ఎన్నికల్లో ఎలా నెగ్గగలిగారు? పైగా ఆయన నిర్వహించిన శాఖలు ఆషామాషీవి కాదు. రెవెన్యూ, ఫైనాన్స్, ఎక్సైజ్ అన్నీ కీలక శాఖలే. అన్నీ బంగారు గుడ్లు పెట్టే బాతులే. అయినా, ఒక్క చిన్న మచ్చ పడకుండా రాజకీయం నడిపారు. మచ్చలేని మారాజు అశోక గజపతి రాజు.
కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన శ్రీ పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే ఇందుకు రుజువు. అదేమిటో చూద్దాం.
“సర్! ఈ సారా, లిక్కర్ అమ్మటం నా అలవాట్లకు విరుద్ధం. దయచేసి ఈ పోస్టులో మరెవరినైనా వేయండి” అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వేడుకున్నారు ప్రసాద్ గారు.
“బ్రదర్, లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే. కానీ రెవెన్యూ తెచ్చే వారుణి వాహిని పధకం పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు వుండాలి. ఇది ఉద్యోగ ధర్మం. ఆబ్కారీ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి. లేకపోతే కిలో రెండు రూపాయల పధకానికి వందలాది కోట్లు ఎక్కడనుంచి తెస్తాం? ” అన్నారు ముఖ్యమంత్రి రామారావు గారు.
‘అసలేం జరిగిందంటే ..’ అనే పేరుతొ ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో ఇలాంటి కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.
“(ఈ కొత్త ఉద్యోగంలో) నాకు ఎదురైన మొదటి సవాల్ సారా పాటల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎలా అని.
“ప్యాకింగు లేని సారాని కల్తీ చేయకుండా నిరోధించడానికి నాటు సారాని కూడా బ్రాందీ, విస్కీల మాదిరిగా సీలు వేసిన సీసాల్లో సరఫరా చేస్తే... ఈ ఆలోచన అమలు చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అనే సంస్ట కి నేను చైర్మన్ ని. సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన దువ్వూరి సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్. ఈ పోస్టులో వేయగానే నా దగ్గరకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నాడు. ‘నాకు ఆ సారా వాసనే పడదు. నన్నీ పోస్టులో ఇరికించారేమిటి?” అన్నాడు.
“రైట్ కొస్చెన్ టు రాంగ్ పర్సన్ (Right question to wrong person) సుబ్బారావ్. ఏం చేద్దాం. తప్పో రైటో ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు”
“అంతే! ఇద్దరం పనిలో దిగిపోయాం. ఊబిలో దిగిపోతున్నాం అనే సంగతి అప్పటికి తెలియదు.
“బాట్లింగ్ ప్లాంట్ల కోసం జిల్లాల్లో స్థలాలు సేకరించాం. బాట్లింగ్ యంత్రాలు కొన్నాం. సీసాలు కొన్నాం. వాటిని సరఫరా చేయడానికి క్రేట్లు కొన్నాం. చాలా బాగా చేశావయ్యా సుబ్బారావ్ అని అభినందించాను. సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతడి కవి హృదయం అర్ధం అయింది.
“కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
“సరఫరా చేసిన సీసాలన్నీ బాట్లింగ్ ప్లాంట్లకు తిరిగి రావాలి. దుమ్ముకొట్టుకు పోయిన వాటిని శుభ్రం చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ జరిగినా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం. (ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని తాగేవారి క్షేమం గురించి ఆలోచించడం చిత్రంగా లేదూ)
“ఈ ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే పాలిథిన్ సంచుల్లో సారా సరఫరా. ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు వుంచాం. రామారావు గారికి బాగా నచ్చింది. ‘అద్భుతం. అలాగే చేయండి’ అన్నారు.
“ఈ పధకానికి ఓ మంచి పేరుకోసం ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. చివరికి మన పురాణాల్లో మద్యానికి అభిమాన దేవత, ఆదిశేషుని భార్య వారుణి పేరు బాగుందన్నారు. ఆ వారుణిని ఇప్పుడు ప్రజల్లోకి ఏరుల్లాగా ప్రవహింప చేయాలి కాబట్టి వారుణి వాహిని అని నామకరణం చేశారు.
“ఇలా రకరకాలుగా పన్నిన వ్యూహాలు ఫలించి వేలం పాటల్లో ఆబ్కారీ ఆదాయం ఒక్కసారిగా 180 కోట్ల రూపాయలకు అదనంగా పెరిగింది.
“రామారావు గారి ఆనందానికి అవధులు లేవు. మా అదృష్టం బాగుండి నిజాయితీపరుడు అయిన అశోక్ గజపతి రాజు గారు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది అందరికీ కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించగలిగాము. మా ఎక్సైజ్ సిబ్బంది పీక్కు తినకుండా అడ్డుపడగలిగాం.”
అత్యంత సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన పీవీ ఆర్కే ప్రసాద్, తమ శాఖ మంత్రి గురించి అంత చక్కని కితాబు ఇచ్చారంటే అశోక్ గజపతి రాజు గారు ఎంతటి నిఖార్సయిన రాజకీయ నాయకుడన్నది అర్ధం చేసుకోవచ్చు.
విజయనగర సంస్థానానికి మహారాజు ఆయన, డబ్బులకు కక్కుర్తి పడే అవసరం ఏముంది అనవచ్చు. లంచాలు మేస్తున్నవారు, ప్రజాధనాన్ని దోచుకుంటున్న వాళ్ళు, పూట గడవకనే ఆ పనులు చేస్తున్నారా!
ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదా అంటే ఏమనగలము?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి