26, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (202) : భండారు శ్రీనివాసరావు

 మధ్యతరగతి మందహాసాలు

కధ సుఖాంతం అయింది. అనుకున్నా, కానీ కాలేదు.
‘’రెండు రోజులు అయింది, అమెరికా నుంచి వచ్చి. ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ఓ మిత్రుడు ఫోన్ చేసి.
నా జవాబు విని ఆశ్చర్యంగా అడిగాడు, 'నీళ్ళతో యుద్ధం చేస్తున్నారా' అని.
కష్టాలు కట్టగట్టుకుని వస్తాయి అనడానికి తెనాలి రామకృష్ణుడు, కృష్ణ దేవరాయల వారితో చెప్పిన పద్యం జ్ఞాపకం వచ్చింది.
“గురువుల రాక దాసి మృతి గుఱ్ఱపుదాడియు నల్లు నల్కయున్ పొరుగున నప్పుబాధ చెవిపోటును దొమ్మరులాట యింటిలో వరసతిగర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తెయున్ కరవు దరిద్రమాబ్దికము కల్గెనొకప్పుడు కృష్ణభూవరా!”

(తాత్పర్యం: "ఇంటికిగురువులు వచ్చారు, ఆయన కోసంఏర్పాట్లు చెయ్యాలి. అప్పుడే యింట్లో పనిచేసే దాసీ చచ్చిపోయింది. ఊరు మీద దోచుకోవడానికి గుఱ్ఱపు దండు వచ్చిపడింది. ఇంటికి వచ్చిన అల్లుడు అలిగి కూర్చున్నాడు. ఒకప్రక్క భార్య ప్రసవవేదన పడుతోంది. కూతురి పెళ్లి ముహూర్తం ఆనాడే. విత్తనాలు చల్లే కార్తి కూడా వచ్చిపడింది. పొరుగువాళ్ళు అప్పు తీర్చమని సతాయిస్తున్నారు. చెవిపోటు మొదలైంది. వీధిలో దొమ్మరి వాళ్ళు అట మొదలుపెట్టి చెవులు పగిలేటట్లు డోలు వాయిస్తున్నారు, దేశంలో కరువు, యింటిలో దరిద్రం, పైగా తద్దినమొకటి. ఏం చెప్పను నాస్థితి కృష్ణ భూవరా")
ఈనాడు మధ్యతరగతి వాళ్ళ స్థితి యిలాగే వుంది.

ఉదయం ఆరుగంటలకు నీళ్ళు వదిలారు. ఒక్కడిని. ఎన్ని కావాలి? అరగంటలో కాలకృత్యాలు, స్నానపానాలు పూర్తయ్యాయి. ఇంకా అరగంట సేపు వస్తాయి. ఏమి చేసుకుంటాను.
పైన తథాస్తు దేవతలు విన్నట్టున్నారు. వెనుకటి రోజుల్లో అంటే ఈ ఇల్లుకట్టి పాతికేళ్ళు దాటింది, ఆ రోజుల్లో అన్నమాట, నీళ్ళ కరువు వుందేమో, ముందు జాగ్రత్తగా రెండు బాత్ రూముల్లో పెద్దపెద్ద ప్లాస్టిక్ నీళ్ళ ట్యాంకులు పెట్టించారు. అంచేత మాకు ఎప్పుడూ నీళ్ళ కొరత వుండేది కాదు.
ఏమి జరిగిందో ఏమో తెలియదు, అరగంట సమయంలోనే ఆ ట్యాంకులు నిండిపోయి, బొగత వాటర్ ఫాల్స్ మాదిరిగా నీళ్ళు పొంగి కిందికిధారలు ధారలుగా కారడం మొదలు పెట్టాయి. వాచ్ మన్ సమ్మయ్యని పిలిస్తే అతడు కళ్ళు తేలేశాడు. అసలే నీళ్ళ కొరత. ఇంటి పైన ట్యాంకులోకి ఎక్కించిన నీళ్లన్నీ ఇలా వృధా అయిపోతే మిగిలిన ఫ్లాట్ల వాళ్ళు ఏమనుకుంటారు అని నా బాధ. ఇద్దరం కలిసి కారుతున్న నీళ్ళలో మరోసారి సరిగంగ స్నానాలు చేస్తూ, ఆ ప్రవాహాలని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశాము. కానీ కాలేదు.
ఈ లోగా సమ్మయ్య ఎవరో ప్లంబర్ కి ఫోను చేశాడు. అతడు ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి పైన నీళ్ళ ట్యాంకు కట్టే సమయం అయింది. దాంతో అప్పటికి నీటి ధారలు నిలిచిపోయాయి.
ఈలోగా ప్లంబరు మహాశయులు విచ్చేశారు. చెప్పినదంతా విని, ‘కొన్ని సామాన్లు కొనాలి, ఇప్పుడు షాపులు తెరవరు. అంచేత డబ్బులు ఇస్తే కొనుక్కుని మధ్యాన్నం మళ్ళీ వస్తా’ అని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.
మాట ప్రకారం వచ్చి పని మొదలు పెట్టాడు. బాత్ రూమ్ ట్యాంకులో బంతి పనిచేయడం లేదన్నాడు. కొత్త బంతి కొనుక్కొచ్చాడు. వేసాడు. బాపు గారి కార్టూన్ ఒకదానిలో, డాక్టరు గారు రోగికి రెండు మాత్రలు ఇచ్చి, ‘ఒకటి రాత్రి నిద్రపోయే ముందు వేసుకోండి, పొద్దున్న ‘లేస్తే’ రెండోది వేసుకోండి’ అన్నట్టు, నీళ్ళు మళ్ళీ సాయంత్రం వదిలినప్పుడు చూసి చెప్పండి’ అని తన డబ్బులు ఫోన్ పే చేయించుకుని వెళ్ళిపోయాడు.
సాయంత్రం అయిందాకా ఎదురు చూస్తూ కూర్చోవడమే సరిపోయింది. మొత్తానికి నీళ్ళు వదిలారు. గుండెలు దడదడలాడుతున్నాయి. కొంతసేపు కాగానే మళ్ళీ దడదడమంటూ జలపాతాలు మొదలయ్యాయి. పంబ్లర్ కు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయమన్నాడు. కారుతున్న నీళ్ళల్లో తడుసుకుంటూ, ఫోన్ తడవకుండా చూసుకుంటూ అతడు చెబుతున్న విధంగా తిప్పమన్న నాబ్స్ తిప్పుతూ, ఆపమన్న నాబ్స్ ఆపుతూ కొంతసేపు పంబ్లర్ అసిస్టెంట్ లా పనిచేశాను. మొత్తం మీద ధారాపాతం ఆగిపోయింది. తల తుడుచుకుంటూ అతడు చెప్పేది విన్నాను. రేపు ఉదయం నీళ్ళు వదిలే టైం కు వచ్చి చూస్తాను. అప్పటిదాకా ఏ పంపు తిప్పకండి’ అని హుకుం జారీ చేశాడు.
ఈ రోజు ఉదయం వచ్చి, 'పైన ట్యాంకు నుంచి నీళ్ళు వదిలే సమయంలో నాబ్స్ ఇలా వుంచండి. నీళ్ళు కట్టేయగానే ఇలా తిప్పండి' అని, నేను మరిచిపోతానేమో అని వాటి ఫోటోలు తీసి నాకు ఫార్వార్డ్ చేశాడు.
ఇలానే వర్షాలు పడి, బోర్లు బాగుపడి, మళ్ళీ నీళ్ళ సరఫరాకు పూర్వ వైభవం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అడుగుదామనుకున్నా. ఇప్పుడు చెప్పినా ఎలాగు గుర్తువుండి చావదు, అప్పటి సంగతి అప్పుడే చూసుకుందాం అని మనసు రాయి చేసుకున్నాను.
నిజానికి మధ్యతరగతి జీవులు అందరికీ ఇలాంటి ఇబ్బందులు కొత్త కాదు. కానీ నేనే కొత్త బిచ్చగాడిని. మా భావన చెప్పినట్టు ఇవన్నీ ఇబ్బందులే, కష్టాలు కావు అనుకుని నవ్వుకున్నాను.
తోకటపా:
తాళం చెవి ఇంట్లో పెట్టి ఆటోమేటిక్ లాక్ వేసిన అనుభవం లోగడ కూడా వుంది. కాకపోతే అప్పుడు నాకు దన్నుగా మా అబ్బాయి సంతోష్, కోడలు నిషా వున్నారు. అంచేత నాకు భరోసా.
2022 అక్టోబరు 23, దీపావళి పండుగ రోజులు.
ఏడున్నర ప్రాంతంలో మనుమరాలితో ఆడుకుంటూ వుంటే కోడలు వచ్చి, పాపా జీవికను కిందికి తీసుకువెళ్లి ఒకటి రెండు మతాబాలు కాల్చి తీసుకువస్తాము అంది. 'నేనిక్కడ వుండి చేసేదేమిటి నేనూ వస్తాను పదండి' అంటూ లేచాను. 'నేను ఇంటి కీ పట్టుకు వస్తాను మీరు వెళ్ళండి' అని డ్రాయరులో వున్న ఇంటి తాళం తీసుకుని నేనూ వారి వెంటనే కిందికి వెళ్ళాను. అప్పటికే ఒకటి రెండు చిచ్చుబుడ్ల వంటివి వాళ్ళు కాలుస్తున్నారు. ఒక కాకర పువ్వొత్తి నాచేత కాల్పించారు. అందరం కలిసి పైకి వచ్చాము. తలుపు తెరవడానికి చూస్తే జేబులో తాళం చెవి లేదు. జేబులో వేస్తున్నప్పుడు కిందపడి వుంటుంది, నేను గమనించలేదు. నా దగ్గర వుందని చెప్పాను కనుక వాళ్ళూ తీసుకురాలేదు. అదేమో సెవెన్ లీవర్స్ గోద్రెజ్ లాక్. ఆ ఆటోమేటిక్ లాక్ పడితే ఇంతే సంగతులు. కొడుకూ కోడలు కారేసుకుని అమీర్ పేటలో చాబీవాలాలను వెతుకుతూ వెళ్ళారు.
నేను పసిదానిని పెట్టుకుని ఇంట్లోనే, ఇంటి బయట వుండిపోయాను.
తాళాలు తీసే వాడు ఈ రాత్రి దొరక్కపోతే అనే ఆలోచన చిన్నగా మొదలై కొద్దిసేపటిలో పెనుభూతంగా మారింది.
పసిదానికి ఫీడింగ్ టైం అయితే ఏం చేయాలి? పెద్ద వాళ్ళ తిండీ తిప్పలు అంటే జొమాటో కాకపోతే మరోటో వున్నాయి. ఉన్నపాటున బయటకు వచ్చాము కాబట్టి పర్సులు, బ్యాంక్ కార్డులు లేవు. ఒక వేళ వున్నా, ఈ ఆకారాల్లో వెడితే ఏ హోటల్ వాడు రూము కూడా ఇవ్వడు. తెల్లవారితే మాకు దీపావళి హారతులు ఇవ్వడానికి మా అన్నయ్య పిల్లలు వస్తారు.
బాణాసంచా కాల్చడానికి కిందికి వెళ్ళాము కనుక ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్లు మాత్రం చేతిలో వున్నాయి.
ఈ లోపల కోడలు ఫోన్ చేసింది. అమీర్ పేటలో వెతగ్గా వెతగ్గా ఓ షాపు దొరికింది. కానీ బాగుచేసేవాడు ఇంటికి వెళ్లి పోయాడు. అతడికి ఇలాంటి లాక్స్ తీయడంలో మంచి ప్రవేశం వుందని చెబుతూ అతడి నెంబరు ఇచ్చాడు షాపులోని వాడు. ఫోన్ చేస్తే అతడు అత్తాపూర్ లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మళ్ళీ అంత దూరం రాలేను అన్నాడు అతడు. అప్పుడు మా కోడలు ఫోన్ తీసుకుని చెప్పింది. చూడు భయ్యా. మాకు ఎనిమిది నెలల పాప, దాదాపు ఎనభయ్ ఏళ్ళ మామయ్య వున్నారు. ఈ రాత్రి చాలా కష్టం అవుతుంది. నీ కష్టం మేము వుంచుకోము, దయచేసి రమ్మని అడిగితే అతడు మెత్తబడి నేను వచ్చేసరికి గంట, గంటన్నర అవుతుంది, వెయిట్ చేయండి అన్నాడు. ఈ లోపల మా అపార్ట్ మెంటు ఇరుగూ పొరుగూ వచ్చి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఏమీ పర్వాలేదు ఒకవేళ అవసరం అయితే మా ఇళ్ళల్లో వుండండి, సర్డుకుందాం అని భరోసా ఇచ్చారు. ఒకావిడ వెళ్లి మా మనుమరాలికి అరటి పండు మెత్తగా గుజ్జు చేసి ఇచ్చింది. ఒకళ్ళు చపాతీలు తెచ్చారు. మరొక ఇంటివారు పులిహోర తెచ్చారు.
ఈలోగా చాబీవాలా వచ్చాడు దేవుడిలా.
ఏం మంత్రం వేశాడో తెలియదు, చిన్న చేతి రంపం తీసుకుని తన దగ్గర వున్న తాళం చేతుల్లో ఒక దాన్ని చిత్రిక పట్టాడు. పదే పది నిమిషాల్లో కొత్త తాళం చెవి తయారుచేసి తలుపు తెరిచాడు.
పది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా మళ్ళీ కొడుకు, కోడలు, మనుమరాలితో కలిసి పునః గృహ ప్రవేశం చేశాను.
అంత దూరం నుంచి వచ్చిన ఆ చాబీవాలా మేము ఇస్తామన్న డబ్బు తీసుకోకుండా, తను తయారు చేసిన తాళం చెవిని మాకే ఇచ్చేసి తన కూలీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు.
లోకంలో మంచి మనుషులు ఇంకా మిగిలే వున్నారు.
కింది ఫోటో: అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా వచ్చి, తాళం తీసి మమ్మల్ని రోడ్డున పడకుండా ఇంట్లోకి పంపిన మెకానిక్ మహానుభావుడు




(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: