పుగెట్ సౌండ్. (Puget sound)
ఇది వంద మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి. జలసంధి కంటే పెద్దది. సముద్రం కంటే చిన్నది. పీటర్ పుగెట్ అనే వ్యక్తి పేరిట పుగెట్ అనే పేరు పెట్టారు. ఇక సౌండ్ అంటే మధ్యలో అనేక దీవులు, లంక భూములు, సముద్రంలో కలిసే నీటిపాయలు కలిగిన సముద్ర ముఖద్వారం లాంటిది. సముద్రంలోని ఉప్పు నీరు, నదులలోని తాగు నీరు కలిసివుండడం కారణంగా జల జీవ రాశులు, పక్షుల మనుగడకు తోడ్పడే వాతావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. భారీ నౌకలు ప్రయాణించడానికి వీలైన లోతు, వెడల్పు కలిగిన ఈ జలాశయం ఒడ్డున వున్న నెలకొన్న అతి పెద్ద నగరం సియాటిల్.
పుగెట్ సౌండ్ తీరం పొడుగునా మైళ్ళ దూరం అతి చక్కటి కాలిబాటలు వేశారు. వాటికి, జలరాశికి నడుమ ఇనుప కంచె వుంది. ఆ ఇనుప తీగెల కంచెకు వందల సంఖ్యలో తాళాలు. కొంచెం వింతగా అనిపించే దృశ్యం. ఈ ఒక్క చోటనే కాదు యూరోపులో కూడా ఈ సాంప్రదాయం వుంది.
మన దేశంలో ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోషపడినట్టే, ఇక్కడ అమెరికాలో కూడా ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ సంతుష్టిపడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
తమ ప్రేమ బంధాన్ని తాళపు గుత్తులలో బంధించిన ఈ ప్రేమికుల్లో ఎందరి ప్రేమ ఫలించి పెళ్ళికి దారితీసిందో, ఎందరి ప్రేమ వికటించి దేవదాసులు అయ్యారో, ఎందరి ప్రేమ పెళ్ళిళ్ళు పుష్పించి పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారో, తాళం చేసిన చేత్తోనే ప్రేమకు గుడ్ బై చెప్పి వేరే తాళాలు వేసిన వారెందరో ఆ లెక్కలు మనకు తెలవ్వు.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.
ఈ ప్రేమ తీరం వున్న అల్కి అవెన్యూ లోనే రెండు జంట గృహాలు వున్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే వాటిని పూలతో అలంకరించడం. వీలుంటే పూలతో ఇంట్లో ఒక గదిని అలంకరించుకుంటాం, ఇంకా వీలుంటే ఇంటికి ముందూ వెనుకా పూల పొదలు పెంచుకుంటాం. అంతే కానీ మొత్తం ఇంటినే పూలతో నింపేయం!
కానీ ఈ రెండు ఇల్లు పూర్తిగా పూలగృహాలే! అడుగడుగు, అంగుళం అంగుళం అన్నీరంగురంగుల పూలే! ఎరుపు, తెలుపు, పచ్చ, ఊదా, గులాబీ ఇలా ఆ సృష్టికర్త ఎన్ని రంగులు ఇచ్చాడో అన్ని రంగాల పుష్పాలు అక్కడ చూడవచ్చు. కళ్ళారా చూస్తేనే కాని అభివర్ణించలేని గొప్ప దృశ్యం. వీటిని లో నిర్మించారు. తరువాత వెలిసిన అధునాతన గృహ సముదాయం నడుమ ఈ రెండు ఇళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటూ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అదేదో తెలుగు సినిమాలో ఒక పాత్ర చేత చెప్పించినట్టు ఈ అమెరికా వాళ్లకు అన్నీ విచిత్రాలే.
మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో...
సీనియర్ ఎన్టీఆర్ పాత పాతాళ భైరవి చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారు రాసిన కలవరమాయే మదిలో అనే పాటలో ‘మోసులు వేసి’ అనే పాద ప్రయోగం చేశారు. ఈ మోసులు ఏమిటి అని అప్పుడు నా చిన్న బుర్రలో సందేహం. నెమ్మదిగా తెలిసింది ఏమిటి అంటే మోసులు అంటే మొలకలు అని.
సరే ఈ మొలకలు ప్రతి మనిషి జీవితంలో వుంటాయి. మోహం, మోజు, తమకం, ప్రేమ, కోరిక, ఇష్టం ఈ పదాలకు అర్ధాలు అన్నీ వయసును బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి.
చిన్నప్పుడు నాకు నూగాయ, నువ్వుపొడితో పెట్టిన ఆవకాయ కారం అంటే చచ్చేంత ఇష్టం. వేళ్ళ సందుల నుంచి కారిపోయేదాకా నెయ్యి వేసుకుని అన్నం తినడం మహా మోజు. పెనుగంచిప్రోలులో, నలుగురితో పాటు భోజనం చేస్తున్నప్పుడు, మా అన్నపూర్ణక్కయ్య ఎవరికీ కనపడకుండా కొంగు చాటున తెచ్చి నా కంచంలో మాత్రమే వేసే వెన్నపూస అంటే మహా ఇష్టం. వరంగల్ జిల్లా, మానుకోట దగ్గర ఈదులపూసపల్లిలో మా ప్రేమక్కయ్య ఉల్లిపాయ ముక్కలతో చేసే పచ్చి పులుసు, శ్రావణ మాసం రోజుల్లో అమ్మవారి మహా నైవేద్యం మీద పడకుండా, పిల్లలకోసం మా సరస్వతి అక్కయ్య చేసే చిరుతిండ్లు, ఎంత రుచిగా వుండేవంటే ఎవరికంటా కనబడకుండా దొంగతనంగా తినాలి అనిపించేంతగా గొప్పగా వుండేవి.
అంతేనా! మా పెద్దన్నయ్య గారింట్లో కొత్త సంవత్సరం అని ఓ కేలండర్ ఇచ్చారు. మూడు తెల్లటి పిల్లులు. అబ్బా వాటి అందం చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఎవరో చుట్టం వచ్చి ఆ కేలండర్ కావాలంటే ఇచ్చేసారు. నాకు కడుపు రగిలిపోయింది. ఆ పిల్లుల కోసం ప్రాణం కొట్టుకుపోయింది. చంపడం అనే పదం తెలియని రోజులు. లేకపోతె అంతపనీ చేయాలన్నంత కోపం వచ్చింది అన్నమాట.
అలాగే కాలేజి అమ్మాయిలతో ప్రేమలు. వారిని మెప్పించడానికి కవితలు. రాసి పోస్టు చేయని ప్రేమ లేఖలు. ఈ టైపు ప్రేమలు, దోమలు ఆనాటి ఆడపిల్లలకు పట్టవని తెలిసేసరికి జుట్టు నెరిసింది.
పాతికేళ్ళ క్రితం మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు ప్రతిదీ వింతే! కనబడ్డవన్నీ కొనేసి ఇండియాలో కనబడ్డ వాళ్లకు పంచేయాలన్నంత ఆతృత. ఇప్పుడు ఉభయ పక్షాలకు ఈ గోల లేదు. అన్నీ అక్కడే దొరుకుతున్నాయి, ఇక్కడి నుంచి మోసుకుపోవడం దేనికనే తలంపు. ఆ కాలంలో ఊరికొకడు అమెరికాలో. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు.
జీవన గమనంలో ఒక చోట ఆగి సేద తీరుతుంటే ఇవన్నీ వ్యామోహాలా! మోజులా! తమకాలా! కోరికలా! ఇష్టాలా! అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇవన్నీ మనసు ఆడే ఆటలు అని అర్ధం కావడానికి ఇన్నేళ్ళు పట్టింది.
మనసు చాలా తెలివైనది. వయసుకు తగ్గట్టుగానే ఆడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి