30, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (22) - భండారు శ్రీనివాసరావు

 

 

 

“కావాల్సిన కూరగాయలన్నీ  ఇంటి పెరట్లోనే పండేవి. కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ, ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.                

 “ఆడవాళ్ళు ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని  నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు  ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.  దెనుసు గడ్డలు (Sweet Potato) వేరే ఊళ్ళ నుంచి బండ్ల మీద తెచ్చి వీధుల్లో తిప్పుతూ అమ్మేవాళ్లు. ధాన్యం కొలిచి కొనుక్కునేవాళ్ళు. డబ్బుల అవసరం వుండేది కాదు. మా ఊర్లో సోడా దుకాణం వుండేది. అయితే అక్కడ తయారు చేయడం మాత్రమే. సోడా కాయల్లో నీరు నింపి ఓ మిషన్ లో వుంచి గిర్రున పైకి కిందికి తిప్పేవారు. దాంతో సోడాకాయల్లోకి గ్యాస్ వెళ్ళేది. వాటిని తోసుకుంటూ పోయే ఒక చిన్న బండిలో పెట్టి వూళ్ళో ఖామందుల భోజనాలు అయ్యే సరికి తీసుకువచ్చి అమ్మేవారు. అన్నం తిన్న తర్వాత సోడా తాగితే జీర్ణం అవుతుందని ఓ నమ్మకం. సోడాకాయ ఎదురు రొమ్ము మీద ఆనించుకుని ఒక రబ్బరు బిరడాతో గట్టిగా అదిమితే పెద్ద చప్పుడుతో లోపల వున్న గోళీ అడ్డు తొలగిపోయేది. నా చిన్ననాటి స్నేహితుడు వెంకటేశ్వర్లు ఆ సోడాలు అమ్మేవాడు. చదువుకోలేదు కానీ తెలివితేటలు ఎక్కువ. సోడాలతో పాటు నాటు కోడి గుడ్ల వ్యాపారం కూడా చేసేవాడు. సోడా కొట్టేటప్పుడు వివిధరకాలుగా శబ్దాలు వచ్చేలా చేసేవాడు. చిత్రంగా వుండేది ఆ ప్రక్రియ. ఒక్కోసారి కీచుమని చప్పుడు. మరోసారి ఏదో బాంబు పేలుతున్న ధ్వని.

సోడా అంటే బెజవాడ వాసులకు గుర్తొచ్చే ఒక పేరు పుష్పాల రంగయ్య. జైహింద్ టాకీసు వెనుక రోడ్డులో ఆయన పేరు మీదనే ఒక కూల్ డ్రింక్ షాపు వుండేది. మామూలు సోడాలే కాకుండా రకరకాల రంగుల సోడాలు, నిమ్మకాయ సోడాలు, ఐస్ సోడాలు  దొరికేవి. ఊరి పెద్దలు చాలామంది ఆ షాపు ముందు గుమికూడి నిలబడి, రంగయ్య గారూ మాకు ఆ సోడా కొట్టండి, ఈ సోడా కొట్టండి అని అడుగుతుండేవారు. పిల్లలకేమో రంగు సోడా తాగాలని మనసు. మా ఊళ్ళో మాదిరి కాదు కదా డబ్బులు ఎప్పటికప్పుడు  ఇవ్వకుండా నెలకోసారి ఇవ్వడానికి. ఆ దారంట స్కూలుకు వస్తూ పోతూ, ఎప్పుడైనా పెద్దవాడిని కాకపోతానా, దర్జాగా నిలబడి, రంగయ్య దుకాణంలో  రంగు సోడా తాగకపోతానా అనే చిన్నతనపు మనసు. ఆ రోజుల్లో నాకు మరో గట్టి కోరిక వుండేది. ఎప్పటికైనా సరే, బీసెంటు రోడ్డు మొగదలలో వున్న రవీంద్ర కూల్ డ్రింక్స్ అద్దాల షాపులో దర్జాగా కూర్చుని, గాజు కుప్పెలో ఇచ్చే తెల్లటి ఐస్ క్రీం ని వేరే వారితో పంచుకోకుండా నేను ఒక్కడ్నే, చుట్టూ వున్న అద్దాలలో నన్ను నేనే చూసుకుంటూ తినాలని. మా అక్కయ్య ఇంట్లో చదువుకుంటున్న రోజుల్లో, మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు,  బెజవాడ ఎప్పుడైనా వచ్చి, తిరిగి రైలు స్టేషన్ కు వెడుతున్నప్పుడు, నన్నూ, మా బావగారి అబ్బాయి సాయిబాబుని వెంటబెట్టుకుని వెళ్లి, మధ్యలో రవీంద్ర కూల్ డ్రింక్ షాపులో ఐస్ క్రీం తినిపించేవాడు. దాంతో పెద్దవాడిని కాకముందే నా చిన్ననాటి కోరిక తీరిపోయింది.

అప్పటికి నిద్రాణమైన మా పల్లెటూరిలో పండగలు, పబ్బాలతో చక్కటి కళ వచ్చేది.        

 చెప్పుకుంటే రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద  పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.

 వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం, కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరాబతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి  ఇలా పండగలే పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ  అదిరిపోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు. ఆనాడు  పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే సంతోషం  సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావడం లేదు. సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు అంటే మరీ సంబర పడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ పండగలకే పిల్లలకు కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు. పెనుగంచిప్రోలు లోని బట్టల దుకాణం నుంచి అరువుమీద ఒకే రకం బట్ట కొని, ఊళ్ళోని దర్జీ పనివాడితో  అదే రంగు బట్టతో పిల్లలు అందరికీ ఒకే మోస్తరుగా చొక్కాలు, లుడిగీలు (నిక్కర్లు). మరీ చిన్నవాళ్ళం అయిన నాలాంటి వారికి అన్నయ్యలు వాడేసిన బట్టలు, పుస్తకాలు. పండగల్లో దీపావళి మరీ స్పెషల్. పిల్లలకి తలా ఒక ఐదో, పదో రూపాయలు ఇచ్చేవాళ్ళు. పదిరోజుల ముందే టపాకాయలు కొనుక్కుని వాటిని జల్లెడలో వుంచి పందిరిమీద ఎండడానికి పెట్టేవాళ్ళం. నాకు ప్రతి పది నిమిషాలకు అవి ఎండాయా లేదా చూడాలని ఆత్రం. ఈ టపాకాయల్లో బొమ్మ పిస్తోల్లు, వాటిలో పెట్టి పెట్టడానికి, పేల్చడానికి చిన్న చిన్న ఎర్రటి టేపులాంటి చుట్ట ఉంచిన చిన్న కాగితం  పెట్టె. అది సింహం బ్రాండ్ అయితే చాలా సంతోష పడేవాళ్ళం, బాగా పేలుతాయని. అలాగే లక్ష్మి బ్రాండ్ ఔట్లు, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు. సీమటపా కాయలు. వాటిని కాల్చడానికి భయమైనా పెద్దవాళ్లు ఎవరైనా కాలుస్తుంటే గట్టిగా రెండు చెవులు మూసుకుని ఆనందించేవాళ్ళం. అలాగే రవ్వలురాలని, చిటపటలాడని సాదా కారప్పువ్వత్తులు అంటే ముచ్చట పడే వాళ్ళం. ఇక మతాబులు, చిచ్చుబుడ్లు ఇంట్లోనే, గంధం (పాస్పరస్) పొడి, సూరేకారం కలిపి తయారు చేసుకునే వాళ్ళం.  అలాగే ఇనుముతో తయారు చేసిన చిన్న సైజు రోలు రోకలి పల్లెటూళ్ళలో ప్రత్యేకమైన దీపావళి టపాసు. రోలు వంటి చిన్న ఇనుప రోటిలో కొంచెం మందు కూరి, దానిపై రోకలి లాంటి ఇనుప కడ్డీ వుంచి ఏదైనా గట్టి రాతిపై మోదితే పెద్ద శబ్దం వచ్చేది. అది కొట్టిన చోట పసుపు రంగుతో మచ్చ పడేది. వూళ్ళో దీపావళి మందులు కొనే స్తోమత లేని చాలామంది పిల్లలు ఈ రోలూ రోకలితోనే పండగ జరుపుకునే వాళ్ళు.  పగలంతా ఊరు ఊరంతా ఈ చప్పుళ్ళు వినవస్తూనే ఉండేవి. వెళ్ళు నలిగిపోతాయని మా వాళ్ళు వీటి జోలికి పోనిచ్చేవాళ్ళు కాదు. చాలా సార్లు దీపావళి పడగకి రెబ్బారం నుంచి మా రెండో బావగారు కొలిపాక రామచంద్ర రావు గారు, పండగకి మా ఊరు వస్తూ,  పెద్ద పెద్ద బుట్టల్లో టపాకాయలు వెంటబెట్టుకుని తెచ్చేవారు. ఆయన వస్తున్నారు అని తెలియగానే, పిల్లల కళ్ళల్లో దీపావళి కాంతులు మెరిసేవి.

ఇక ఆ రోజుల్లో  పుట్టిన రోజు పండగ  చేయడం అలవాటు లేని పని. పుట్టినరోజు ఎప్పుడో, పెళ్లిరోజు ఎప్పుడో పెద్దవాళ్లకు కూడా గుర్తుండేది కాదు. ఈ ఒక్క విషయంలో నాకు పెద్దవాళ్ల పోలిక వచ్చింది. మా ఆవిడ పుట్టిన రోజు, పిల్లల పుట్టిన రోజు ఇప్పటికీ గుర్తురావు, గూగుల్ గుర్తు చేస్తే తప్ప.  ఈ పండగలు  కాక, బంధు మిత్రులతో కలసిచేసే వనభోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు, పేరంటాలు, ఆ రోజుల్లో అలా ఇంటింటా, ఊరంతా  ఒకటే  సందడే సందడి.

కింది ఫోటోలు:  (గూగుల్ సౌజన్యం)

(గోళీ సోడా మిషన్)


(దీపావళి పిల్లల బొమ్మ పిస్తోలు)





 

(ఇంకా వుంది)

29, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (21) - భండారు శ్రీనివాసరావు

 


ఆడవాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడ పట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.

ఇంటి వెనుకనే శివాలయం.

కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. ఏటి ఒడ్డున మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. మా చిన్నతనంలో అదొక పెద్ద ఆకర్షణ. మామూలుగా వెదురు గడలతో ప్రభలు కడతారు. అలాంటిది తిరుపతమ్మ ప్రభను పూర్తిగా ఇనుముతో తయారు చేశారు. దాని చక్రాలు కూడా ఇనుమే. పైగా చాలా ఎత్తు. అంత ఎత్తైన  ప్రభ  ఊరేగింపుగా  ఊళ్ళో తిరుగుతుంటే  జనం ఎగబడి చూసేవాళ్ళు. ఇలాంటి ఇనుప ప్రభ వున్న గుడి మరోటి లేదని చెబుతారు. వూరికి కరెంటు వచ్చిన తరువాత  తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు. తిరుపతమ్మ వారి ప్రభలు దశదిశలా వ్యాపించడంతో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద స్థలంలో చిన్నగా వున్న గుడి ఇప్పుడు చిన్న స్థలంలో పెద్ద దేవాలయంగా కనబడుతోంది. ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. గుడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గుడి పుణ్యమా అని పెనుగంచిప్రోలు స్థితిగతులు కూడా బాగా మెరుగుపడ్డాయి.  

పెనుగంచిప్రోలు దేవాలయాలకు ప్రసిద్ధి.  101 ప్రాచీన దేవాలయాలు వున్నాయని స్థల పురాణం. అందుచేత  పెద కంచీపురం అనేవారుట. శ్రీ  తిరుపతమ్మ కధ అనే పేరుతొ గతంలో ఒక సినిమా కూడా వచ్చింది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు, కృష్ణకుమారి 1963 లో విడుదల అయిన ఈ చిత్రంలో నటించారు. మా ఐదో అక్కయ్యగారు కొమరగిరి  అన్నపూర్ణ  తిరుపతమ్మ మీద ఒక పుస్తకం రాసింది. ప్రతి ఏటా గుడిలోని తిరుపతమ్మ, గోపయ్యల విగ్రహాలను పదకొండు జతల ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా జగ్గయ్యపేట తీసుకు వెళ్లి, అక్కడి రంగుల మడపంలో కొత్త రంగులు వేయించి తిరిగి పెనుగంచి ప్రోలు తీసుకువచ్చి మళ్ళీ గర్భ గుడిలో పునః ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది.       

తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచిప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండిపోయేది.

తిరుణాల జరిగినన్నాళ్ళు ఏటి వడ్డున గుడి ప్రాంతం యావత్తూ సంబరాలతో మారుమ్రోగేది. బొమ్మల దుకాణాలు, మిఠాయి అంగళ్లు, కోలాటాలు, భజనలతో అంతవరకూ నిద్రాణంగా ఉన్న ప్రాంతం సందడి సందడిగా మారిపోయేది.     

తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది.  రోజూ వచ్చే భక్తులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని.

జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ఊరికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. ఖరీదైన మోటారు వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వారికి తగిన వసతి సదుపాయాలు కూడా ఏర్పడ్డాయి.

మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించకుండా పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు.

 

కింది ఫోటోలు:


పెనుగంచిప్రోలులో ఒకప్పుడు ఇనుప ప్రభతో తిరుపతమ్మ గుడి


ఇప్పుడు అభివృద్ధి చేసిన తిరుపతమ్మ దేవాలయం







(ఇంకా వుంది)   

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (20 ) - భండారు శ్రీనివాసరావు

 

 

కంభంపాడు  గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు, మండల వ్యవస్థ ఆవిర్భావం తరువాత మా గ్రామం వత్సవాయి మండలంలో చేరింది. ఇటీవలనే జిల్లాకు ఇంటిపేరు కూడా చేరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు.  స్తంభము ప్రోలు’ అన్నది కంభంపాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా ‘స్థంభం పహాడ్’ కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీపహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా ‘జయస్థంభం’ లాంటిది వుంటేస్థంభంప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయస్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటితిరువూరు దగ్గర ఒకటిఅమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి.

 గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారు. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి కూడా వుంది.  వీటికి మా కుటుంబం వారు ధర్మకర్తలు.   కొత్తూరు (కొత్త వూరు)లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని అక్కడి రైతులు నిర్మించారు. తరువాత ఆ వూరు ఖాళీ అయినా, దానికి రహదారి సౌకర్యం కల్పించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఇవికాక, మా వూరిలో ముత్యాలమ్మ గుడి వుంది. ఒకసారి ముత్యాలమ్మ గ్రామ దేవత, పర్వతాలయ్య గారి కలలోకి వచ్చి ‘బందిపోట్లు వూరి పైకి రాబోతున్నారని’ హెచ్చరించిందట. వెంటనే అంతా గ్రామం వొదిలి తప్పుకున్నారట. బందిపోట్లకు ఏమీ చిక్కలేదు. అందుకని కోపించి వారు ముత్యాలమ్మ దేవతను గడ్డపారతో పొడిచి పగులగొట్టారని అంటారు. వెంకటస్వామి అనే అతను ముత్యాలమ్మకు చిన్న గుడి కట్టించాడు. వూరికి తూర్పున పొలిమేర మీద జమ్మి చెట్టు కింద ఎండ పల్లెమ్మ అనే ఓ అమ్మవారి విగ్రహం కూడా వుంది. వూరి బయట మా తాతయ్య గారు సుబ్బారావు గారు నిర్మించిన ఆశ్రమంలో ముక్తినాధ స్వామి ఆలయం వుంది. అది ఉన్న ప్రాంతంలోనే శ్యాం ప్రసాద్ బ్రహ్మచారి అనే కాశీ స్వాముల వారి ఆశ్రమం వుండేది. ఆయన  ఒక వేద పాఠశాలను సైతం నిర్వహించేవారు.

మా వూరి కాపురస్తులు చావా ప్రసాద్ గారనే పెద్ద మనిషి సొంత డబ్బు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి కోదండ రామాలయాన్ని నిర్మించారు. చేకూరి రామారావు గారనే మరో పెద్దమనిషి ఈ గుడి నిర్మాణం కోసం అవసరమైన, విలువైన  స్థలాన్ని  ఇచ్చారు. మా కళ్ళ ముందు కట్టిన కొత్త గుడి ఇది. పూజాదికాలు నిర్వహించే అయ్యగారికి నివాసం ఉండడానికి ఇంటితోపాటు, తన తదనంతరం కూడా నిత్య ధూప నైవేద్యాలు సజావుగా  జరగడానికి వీలుగా ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చిన వదాన్యులు ఆయన. ఈ మధ్యనే కన్నుమూసారు.  రామాలయానికి చేరువలోనే షిర్డీ సాయి బాబా గుడిని, మా ఊరు వచ్చి ష్టిరపడ్డ ఆర్.ఎం.పి. గుండు పుల్లయ్య గారు నిర్మించగా,  వడ్డెరగూడెంలో  నాగేంద్రస్వామి (పుట్ట) గుడిని గ్రామస్తులు పునర్నిర్మించారు.

దేవాలయాలకు సంబంధించి మా చిన్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకునేవారు. ఆ పాత రోజుల్లో అనేక మూఢ నమ్మకాలు ఉండేవి. అంటువ్యాధులు ప్రబలి ప్రాణాలు పోతున్నప్పుడు, ఊరికి ఏదో అరిష్టం పట్టుకుందని భావించేవారు. గుడిలో గండదీపం వెలిగించి దానిని ఎవరూ చూడకుండా పొరుగూరి గుడిలో పెట్టి వస్తే అరిష్టం తొలగిపోతుందని నమ్మేవారు. ఆ పొరుగూరి వారు కూడా ఆ దీపాన్ని రహస్యంగా తీసుకెళ్ళి మరో ఊరి గుడిలో పెట్టి వచ్చేవారట. ఈ విషయంలో ఊళ్ళ మధ్య తగాదాలు, కొట్లాటలు  జరిగేవని  కూడా విన్నాను.

వూళ్ళో మా ఇల్లు చాలా పెద్దది. ముందూ వెనకా బోలెడంత ఖాళీ జాగా.సెలవులు రాగానే మా అక్కయ్యల పిల్లలు అందరూ మా ఊరికి వచ్చేవారు. ఆరుబయట  ఆడుకునేవాళ్ళం. రకరకాల ఆటలు. దాగుడుమూతలు  మేము ఎక్కువగా ఆడుకున్న ఆట. దొంగాపోలీసు మాదిరి. చేతులతో పంటలు వేసుకుని దొంగని నిర్ణయించేవాళ్ళం. వాడు ఒక్కడే మిగిలిన వారిని ఎక్కడ దాక్కున్నా వెతికి  పట్టుకోవాలి.

అందరం రోజూ రెండుపూటలా స్నానాలు చేసేవాళ్ళం. బావి దగ్గరనిలబడితే పనివాళ్ళు చేదతో తోడి  పోసేవాళ్ళు. కాలకృత్యాల కోసం అందరూ ఇంటికి కొద్ది దూరంలోవున్న తుమ్మల బీడుకు చెంబులు తీసుకునివెళ్ళేవాళ్ళు. మరీ పెద్దవాళ్ల కోసం పెరట్లో ఒక దడి కట్టి వుండేది.

ఇంట్లో పదిమంది పిల్లలం కాక మరో పదిహేనుమంది దాకా పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావడం అలవిమాలిన పని. ప్రతిపూటా కూరా నారా అంటే కుదరని పని. అందుకే, పిల్లలందరికీ పొద్దున్నే చద్దన్నం పెట్టేవాళ్ళు. అదో మధుర జ్ఞాపకం. అదే మా బ్రేక్ ఫాస్ట్. రాత్రిళ్ళు తినగా  మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపి, పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, ఒకరి తరవాత మరొకరికి వొంతులవారీగా ముద్దలు తినిపించేవాళ్ళు. పిల్లలకు విడిగా అన్నం పళ్ళాలు వుండేవి కాదు. పెరుగన్నంతో పిల్లల కడుపునిండి పోయేది.

పెద్దవాళ్లకయితే జాంబెడు (పెద్ద గ్లాసు) కాఫీ లేదా చెంబెడు తేట మజ్జిగ.

ఇల్లు యెంత పెద్దదయినా మూడంటే మూడే లాంతర్లు వుండేవి. పొద్దుగుంకడానికి ముందుగానే లాంతరు  అద్దాలను ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచికిరసనాయిలు పోసి సిద్ధంగా వుంచేవారు. పూర్తిగా చీకటి పడకముందే పిల్లలకు అన్నాలు పెట్టేసేవాళ్ళు. అన్నం, గరిటెజారుడు పప్పు, తోటలో కాసిన ఏదో ఒక కూర, పప్పుచారు, ఆవకాయ, నెయ్యీ, పెరుగు ఇదీ  భోజనం.

తరవాత అంతా ఆరుబయట మంచాలు వేసుకుని పండుకునేవాళ్ళం. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మిలమిల మెరిసే  నక్షత్రాలు చూస్తూ వుంటే ఆ ఆనందం అంతా  ఇంతా  కాదు. వెన్నెట్లో ఎన్నోరకాల ఆటలు. వెన్నెల కుప్పలు అనే ఆట బాగుండేది. ఒక జట్టు  చేతిలో మట్టి తీసుకుని ఇంటి ఆవరణలోని రకరకాల చోట్ల మట్టిని  చిన్న చిన్న కుప్పలుగా పోసేది. రెండో జట్టు అవి ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని చెరిపేసేది. ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు.

ఒక్కొక్క మంచంలో ఇద్దరిద్దరం పడుకునేవాళ్ళం. నులక మంచాలు కొన్ని, నవారు మంచాలు మరికొన్ని. నవారు మంచాలు పెద్దవాళ్ళకు వేసేవాళ్ళు. మంచం పట్టెడ వొదులు కాకుండా సాయంత్రం కాగానే వాటిని బిగించి కట్టేవాళ్ళు. 

 ఆ రోజుల్లో మా ఊరికి కరెంటు లేదు. రోడ్డు లేదు. మంచినీటి పంపులు లేవు. ఎవరి కాళ్ళకూ చెప్పులు కూడా వుండేవి కాదు.  అల్యూమినియం కంచాల్లో అన్నాలు. పెద్దవాళ్ళకు విస్తరాకులతోనో, బాదం ఆకులతోనో కుట్టిన  విస్తళ్లలో వడ్డించే వాళ్ళు. మా బామ్మ గారికి, నాన్న గారికి, అమ్మగారికి మధ్యలో బంగారం పువ్వు తాటించిన వెండి కంచాలు ఉండేవి. భోజనాలు కాగానే వాటిని శుభ్రంగా కడిగి లల్లూరాం కంపెనీ వారి  ఇనప్పెట్టెలో దాచిపెట్టేవారు. అందులోనే వివిధ సైజుల్లో వెండి గ్లాసులు, గిన్నెలు ఉండేవి. అల్లుళ్లు వచ్చినప్పుడు వాటిని బయటకు తీసేవారు. అది తెరవాలి అంటే మూడు తాళం చేతులు కావాలి. ఆ తాళాల గుత్తి మా బామ్మ దగ్గర వుండేది.

ఉప్పుడు పిండికీ, తప్పాల చెక్కకూ,  ‘పేటెంట్’ ఇవ్వాల్సివస్తేఅది మా అమ్మకే ఇవ్వాలి. తప్పాలచెక్క అంటే బియ్యపు పిండితో చేసే వంటకం. బియ్యపుపిండిలో నానేసిన సెనగపప్పు, ఉప్పూ కారం జీలకర్ర కలిపి ముద్దగాచేసేవాళ్ళు.  ఇత్తడి గిన్నెను పొయ్యిపై వేడిచేసి, దానిలోపల ఈ ముద్దను  తందూరీ రోటీ మాదిరిగా పలచగా అంటించి మూతపెట్టేవాళ్ళు. కాసేపయిన తరవాత, గిన్నెని దించి లోపల ఎర్రగా కాలిన తప్పాలచెక్కను చేత్తో బయటకు తీసి దానికి వెన్నరాసి పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అన్ని లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. కానీ అది తయారుచేసేటప్పుడు అమ్మ కాల్చుకున్న చేతుల సంగతి ఎవరికీ గుర్తుండేది కాదు.

 

  

 

కింది ఫోటోలు:

ఊరిలో కొత్తగా కట్టిన కోదండ రామాలయం 






 

 

28, నవంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (19 ) - భండారు శ్రీనివాసరావు


“ మా ముత్తాత రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభయ్ ఏళ్ళకు పైగా బతికింది. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య (మా తాతగారు), లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరణీకం. చాలా కాలం అంతా కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేదిట. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహ ద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు. కొద్దిగా  కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. జాగ్రత్తగా పరికించి చూస్తే ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కానవస్తాయి. 
ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసీల్దారు  రావడం అంటే గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు పొలాల వెంట తిరుగుతూ అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేవారో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే , కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు, వెంట పరిగెత్తుతూ పంటల వైనం, సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాల మీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్లపై గాని ప్రయాణం చేసేవారు. నేను కాలేజీ చదువులకు వచ్చే వరకు ఆ మేనా మా ఇంట్లో వుండేది.  మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్లబండ్లలో వెళ్ళే వాళ్ళు. బండ్ల ప్రయాణాల్లో జీతగాళ్ళు ఎడ్ల తాళ్ళు పట్టుకుని ముందు  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్లనే పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టి వాడు అని పిలిచేవాళ్ళు. మా నాన్నగారివద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు. ఇప్పుడు వారికి సమాజంలో గౌరవం లభించేలా వారి ఉద్యోగ హోదాలు మార్పు చేయడం అభిలషణీయం)
బండ్లు వెడుతున్నప్పుడు  వడ్డేరకాలు (బాటలో ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా వాళ్ళు బండి చక్రం పట్టుకుని బరువానేవాళ్ళు.  వానాకాలం దోవ బురదగా వుండి బండి చక్రాలు కూరుకుపోతాయనే భయంతో ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను కట్టే వాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయపు పనులు చెడతాయని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా  భయం. 

ఆరంభంలోనే చెప్పినట్టు, ఇది నా ఒక్కడి కధ కాదు. మా ఊరి కధ. మా కుటుంబం కధ. నేను పుట్టకముందు, పుట్టిన తరవాత, నాటి జీవన విధానాలు, సాంఘిక, ఆర్ధిక, సామాజిక పరిస్థితులు నా తరువాత తరం వారికి తెలియచెప్పాలనే ప్రయత్నంతో మొదలుపెట్టిన కధ. సహజంగా ఇటువంటి సొంత విషయాల్లో బయట వారికి ఆసక్తి వుండదు. ఆ సంగతి పూర్తిగా తెలిసే ఈ ప్రయత్నం మొదలు పెట్టాను. ఒక చరిత్రను రికార్డు చేయడమే ఈ రచన ధ్యేయం. 
పునరుక్తి దోషం అయినా మరోమారు నా తత్వం గురించి చెబుతాను.
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడినని గారాబం చేయడంతో, మా కుటుంబంలో ఎవరికీ లేని మొండితనం, మంకుపట్టు నాకు అబ్బాయి. 
ఈ స్వగతం ఎందుకంటే నాలోని ఆ మొండితనమే మా ఊరు గురించి, చిన్ననాటి కబుర్లు గురించి నాచేత ఇంతగా రాయించేలా చేస్తోంది. రోజులో సింహభాగం కంప్యూటర్ ముందే గడిచిపోతోంది.  ‘బాగున్నాయి, బాగా రాస్తున్నారు’ అని ఎవరయినా కితాబులు  ఇచ్చినప్పుడు, ‘పోనీలే! మొండితనం కూడా ఒక రకంగా మంచితనమే’ అనుకుంటున్నాను.
రాయడం నాకు కొత్తేమీ కాదు, బ్లాగుకూ, పత్రికలకీ వందల కొద్దీ వ్యాసాలు, వేల పుటల్లో రాసాను. కానీ అవన్నీ రాజకీయ అంశాలు. 
ఈ విషయంలో నాకెందరో సహకరించారు. సహకరిస్తున్నారు.  ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా చెబుతున్నారు.  నేను రాసిన వాటిల్లో ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాను. నిజానికి చాలా సందర్భాల్లో నేను అనేవాడినే అప్పటికి లేను. నేను పుట్టక ముందు జరిగిన అనేక సంగతులు చాలామందిని అడిగి తెలుసుకున్నాను. నాకే డెబ్బయి తొమ్మిది నడుస్తోంది. చాలామంది రాలిపోయారు. మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు, కంభంపాడు స్కూల్లో నాతో కలిసి చదువుకున్న చిన్నప్పటి స్నేహితులు తుర్లపాటి సాంబశివ రావు,  వేమిరెడ్డి ఓబులరెడ్డి (కోటిరెడ్డి, కోటయ్యఅని పిలిచేవాళ్ళం), పమ్మి సత్యమూర్తి, పర్సా రామ్మూర్తి చనిపోయారు. విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు. మా అక్కయ్యలు తుర్లపాటి సరస్వతి, కొమరగిరి అన్నపూర్ణ రాసిపెట్టుకున్న సంగతులు నాకు అక్కరకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. కాని వారి జ్ఞాపకాలు ఇలా నా రాతల్లో మిగిలిపోయాయి. ఇలా ఎందరి నుంచో  సేకరించిన ఇంకా ఎంతో సమాచారం నా మెదడులో నిక్షిప్తం అయి వుంది. నెమ్మదిగా బయటకు తీసి అక్షర రూపం ఇవ్వాలి. దీనికి తోడు నాకు సంప్రాప్తించిన మతిమరపు రోగం తాలూకు  భయం ఒకటి.  అదృష్టవశాత్తు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు రాసి వుంచిన భండారు వంశం వివరాలు లభించాయి.   
మా పెద్దన్నయ్య బహుగ్రంధ కర్త. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎంతో శ్రమించి మా వంశానికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరించారు. పుట్టపర్తిలో ఒక చిన్న గదిలో వుండి రాసిన ఈ వివరాల వ్రాత  ప్రతులను మా వదిన గారు సరోజినీ దేవి పదిలంగా హైదరాబాదు చేర్చి మా అన్నయ్య రామచంద్రరావుగారి ఇంట్లో  భద్రపరిచారు. ఆ భాండాగారంలో దొరికిందే మా అన్నయ్య రాసిపెట్టిన ‘భండారు వంశం’. 
కంభంపాడులో భండారు వంశానికి మూలపురుషుడు వీరేశలింగం అని ఆయన పేర్కొన్నారు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే  కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిరపడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట). భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో  ఇంటి పేరును స్పష్టంగా  ‘భండారు’ అనే రాసారు. కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో, భండారు కుటుంబానికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె  లింగధారులు  కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులు.

కింది ఫోటోలు :


మా అమ్మగారితో అమ్మలగన్న అమ్మలు మా అక్కయ్యలు



జీవిత చరమాంకంలోఆధ్యాత్మిక రచనా వ్యాసంగంతో మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు



మా పెద్ద వదిన గారు సరోజినీదేవి







(ఇంకా వుంది )

27, నవంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (18 ) - భండారు శ్రీనివాసరావు

 

 

 

ఈ మధ్య అంటే 2024 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో అమెరికా వెళ్ళినప్పుడు మా మూడో అన్నయ్య కుమారుడు సత్యసాయి ఉంటున్న ఊరికి వెళ్లి వాడింట్లో కొన్ని రోజులు వున్నాను. వాడికి ఇద్దరు కుమారులు, శైలేష్, శైలేంద్ర. శైలేష్ ఈ ఏడాదే యూనివర్సిటీలో చేరాడు. వాడికి కారు డ్రైవింగ్ లైసెన్స్ వుంది. సెలవులు కావడం మూలాన వాడే నన్ను అనేక ప్రాంతాలకు తిప్పేవాడు. వాడు అడిగింది ఒక్కటే. కంభంపాడు సంగతులు ఏమిటి తాతయ్యా? నాకు నాన్న, మీరు, పెద్ద తాతయ్యలు మినహా ఎవరూ తెలియదు. అసలు మన కుటుంబం గురించి నాకేమీ తెలియదు, చెప్పమని అదే పనిగా అడిగేవాడు. అది ఒక్క గంటలో, ఒక్క రోజులో చెప్పే విషయాలు కావు. నేను హైదరాబాదు పోయిన తర్వాత నా బ్లాగులో రాస్తాను, కానీ నువ్వు తెలుగు చదవగలవా? అని అడిగాను. నేను నెట్లో తెలుగు పేపర్లు చదువుతాను, ఇబ్బంది ఏమీ లేదు అని వాడు జవాబు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.  బహుశా వాడి మాటలే ఈ రచనకు ప్రేరణ కావచ్చు.   

మా చిన తాతగారు భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో వారి తండ్రి రామయ్య, పినతండ్రి లక్ష్మయ్య గార్ల పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య కులకర్ణి’ అని ఉదహరించారు. భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేల మాదిరిగా గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టే అధికారం వారికి వుండేది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ దాఖలాలు కనిపిస్తాయి.

మా ముత్తాత గారి నాన్నగారు అప్పయ్య గారికి చాలాకాలం సంతానం కలగక పోవడంతో శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కొందరు రైతు పెద్దలకు ఒకసారి కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. ఆ రోజుల్లో ఊరి పెత్తందారులు బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని తిరిగేవారట. వాళ్ళు వచ్చినప్పుడు పర్వతాలయ్యగారు ఈకకలంతో ఏదో రాసుకుంటున్నారు. ఏదో మాటామాటా వచ్చి, ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట పెరిగింది. సరసం విరసం అయింది. వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, ముందు జాగ్రత్తగా  వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారు. ఆ పళానవెళ్లి, అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా, నాలికపైనా పొడిచారట. కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా, తమ పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట. తరువాత బండ్లు కట్టుకుని నైజాంలోకి పారిపోయారుట. ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే, ‘నా’, కా’ అనే అక్షరాలు రాసారుట. ‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా చెబితే వాళ్ళు పగబట్టి పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారు. నాకేం తెలియదు. చీకటి. ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు. రామయ్య, లక్ష్మయ్య. రామయ్యకు పన్నెండేళ్ళు. అయినా, ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’ అని తాసీల్దారు అడిగితే, ‘చేస్తాన’ని దస్త్రం తీసుకున్నాడట. ఆరోజుల్లో కరణీకం ఉద్యోగానికి మేజరయి ఉండాలన్న నియమం లేదన్నమాట. రామయ్య గారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.

ఆ రోజుల్లో  పుట్టిధాన్యం (పది బస్తాలు) రూపాయకో, రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట. ఆయనకు కరణీకం చేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. అవేం చేయాలో తెలిసేది కాదు. ఇంటికి అవసరమైనవి  వస్తువులు అన్నీ ధాన్యం ఇచ్చి కొనుక్కునేవారు. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలుశిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట. (అలా ఉత్త పుణ్యానికి వచ్చిన ఆస్తి కాబట్టే రెండు తరాలు గడిచేటప్పటికి హారతి కర్పూరంలా హరించి పోయిందని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అంటుండేవారు)

“రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే ఒక రైతు  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితే  ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం మా వూరి మోతుబరుల్లో ఒకరయిన   బండి సత్యనారాయణ పూర్వీకుడు. బండి సత్యనారాయణ గారు, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు  మా వూరి వారిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లు. మా అన్నయ్య ఉద్యోగాల పేరుతొ అనేక ఊళ్లు తిరిగితే, బండి సత్యం బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు.

“అలాగే వేమిరెడ్డివారికి,  ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేసుకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు.

“ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా ఆయనే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామకరణాలు చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.

ఇంగువ వెంకటప్పయ్య గారు మా ఇంటి పురోహితులు. ఏ కార్యం అయినా వారి చేతుల మీదుగా జరగాల్సిందే. ఆయన తర్వాత వారి కుమారుడు వెంకయ్య గారు కూడా తండ్రి మాదిరిగానే.  కానీ వారితో ఎప్పుడూ పోట్లాటే. చివరికి మా పెద్దన్నయ్య  వారికి పోట్లాడే పురోహితుడు అని పేరు పెట్టారు.

‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.

అయితే, మా ఇంటి పురోహితులైన ఇంగువ వెంకయ్య గారు యుద్ధాలు చేసేవారు కాదు, శాపాలు పెట్టేవారూ అంతకంటే  కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవారు. అదీ వారు అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన వారికి నచ్చకపోవడం వల్ల.

ఇందులో విశేషం ఏముంది?

చాలా సందర్భాలలో విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని అనిపించింది.

మా ఇంట్లో శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో, అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.  మా పెద్దన్నయ్య ఈడువాడు.

మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.

మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.

ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమ తమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.

‘వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.

మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.

గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకునే వారు.

కింది ఫోటోలు:



ఈ రచనకు ప్రేరణ మా మూడో అన్నయ్య కుమారుడు శైలేష్

మా పెద్దన్నయ్య పర్వతాలరావు
మా బాబాయి కుమారుడు, గ్రామానికి మొదటి సర్పంచి భండారు సత్యమూర్తి
మా లక్ష్మయ్య తాతయ్య కుటుంబం


బండి సత్యం, బియ్యే


మా పెద్దన్నయ్య కుమారుడి పెళ్లి చేయిస్తున్న 'పోట్లాడే పురోహితుడు' వెంకయ్య గారు 






(ఇంకా వుంది)