11, మే 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (305) : భండారు శ్రీనివాసరావు

 

ఈ నగరానికి ఏమైయింది?
1975 వ సంవత్సరం. నవంబరు నెల.
రేడియో ఉద్యోగంలో చేరడానికి బస్సులో హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరక ముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ చువ్వలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు ఎక్కడా గోతులు, గుంటలు లేకుండా శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో ఊరవతల జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూ ఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దాటితే అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే దారిలో ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. దాని అంచున అడ్డంగా ఇనుపకడ్డీల రెయిలింగ్. అక్కడ నుంచి చూస్తే, కింద నిండు కుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయా లేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల (బీ) కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమై పోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి)
ఇప్పుడు అదే తటాకం వేసవిలో వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
ఒకప్పుడు ఏడాదిలో చాలా మాసాలు, ఎయిర్ కండిషన్లు సరే, కనీసం పంకాలు కూడా అవసరం లేని చల్లటి వాతావరణం కలిగిన హైదరాబాదులో ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయంకృతం.
తోకటపా:
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే !
రెండేళ్ల క్రితం మండే వేసవిలో ఒక రోజు :
'త్తాతా త్తాతా' అంటూ నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది నా మనుమరాలు జీవిక. తా కు వత్తు పెట్టి పిలవడంలోనే కనిపిస్తోంది దాని ఎక్జైట్ మెంట్.
'తాతా! వాన, ర్రెయిన్! దా దా ' అంటూ చేయి పట్టి బయటకు తీసుకువచ్చింది.
అపార్ట్ మెంట్ జీవితాల్లో, పిడుగులు పడితే తప్ప, చినుకుల చప్పుడు లోపల వినపడదు. వర్షాన్ని టీవీల్లో చూడాల్సిందే.
వెంటనే చిన్నతనం గుర్తుకు వచ్చి ఓ కాగితం పడవ తయారు చేసి, చిన్నదాన్ని వెంటబెట్టుకుని కిందికి వెళ్లి వర్షపు నీళ్లలో కాగితపు పడవ మజా ఏమిటో చూపించాలని బయట తలుపు తెరిచాను. మండుతున్న శరీరాలు చల్లపడేట్టు ఒక్క ఉదుటున చల్లగాలి తోసుకు వచ్చింది. లక్షల ఎయిర్ కండిషనర్లు చేయలేని పని ఒక్క వాన చేసింది.
అడుగు బయట పెట్టే లోగా కరెంట్ ఫట్. వాన రాకడ కరెంటు పోకడ అంటారు అందుకే.
కరెంటు లేకపోతే లిఫ్ట్ పనిచేయదు. అంచేత కాగితపు పడవల ఆటకు అలా బ్రేక్ పడింది. ఏమిటో జీవితం! స్మాల్ ప్లెజర్స్ కు కూడా నోచుకోలేదు.



(ఇంకావుంది)

6, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (304): భండారు శ్రీనివాసరావు

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం
75 ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.
2025 ఏప్రిల్ మాసం
నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం ఏప్రిల్ పదిహేనున.
హైదరాబాదు కేంద్రం వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు దూరదర్సన్ వార్తా విభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.
అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.
రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక, నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను.
పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఆనాడు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది. రిటైర్ అయి, అడుగు బయట పెట్టి ఇరవై ఏళ్ళు. కానీ బయట గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.
అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి, ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా పనిచేస్తున్న మా న్యూస్ యూనిట్ ‘చిట్టి చెల్లెలు’ శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.
ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్ ని ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో, అందరూ వినే రోజుల్లో ఇన్ని భోగాలు లేవు.
రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా ముచ్చట్లతో గడిచింది.
నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే.
‘శ్రీనివాసరావు అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడంటే చాలు, ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన’ అనే పేరొకటి.
ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ, ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం. అది నా కోరిక.
నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. అంత చిన్న మనిషిని ఇంత పెద్దవాడిని చేసింది రేడియోనే అనే విషయం నేను ఎప్పటికీ మరిచిపోలేను.
నా ఉద్యోగం హోదా ఏమైనప్పటికి, ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ ఆఫ్ ఆఫీస్ బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్ లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి బయట వరకు వచ్చి సాదరంగా నాకు వీడ్కోలు చెప్పారు. వారి గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను.
పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ, పుట్టిల్లు ఎన్నటికీ మరవదు.
తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు.
' చూసారా! మన రేడియో స్టేషన్ కంటే వయసులో మీరే నాలుగేళ్లు పెద్ద' అనడం నాకు నవ్వు తెప్పించింది.
థాంక్స్ చిన్నా!
కింది ఫోటోలు: ఆలిండియా రేడియోలో తీసినవి.






(11-04-2025)
ఇంకా వుంది

5, మే 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (303): భండారు శ్రీనివాసరావు

 

హాఫ్ పోస్తుమస్ అవార్డ్
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు, నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.
ఆ మధ్య ఎప్పుడో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.
నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇచ్చింది.
కానీ మా ఆవిడతో కలిసి మరోసారి, అదే ఆఖరు సారి, కలిసి వెళ్ళడం, అప్పటికి మా మనుమరాళ్లే ప్రయోజకులై, మా అవసరాలను వాళ్ళే కనుక్కునే స్థాయికి చేరారు.
ఇది జరిగి చాలా కాలం అయింది.
నా బ్యాంకు ఖాతాలో, చాలా కొద్ది మొత్తంలోనే అనుకోండి, మరిన్ని డాలరు డబ్బులు, జి ఎస్.టి మినహాయించుకుని, రూపాయల రూపంలో చేరాయి. ఇది ఇలా వుండగా META నుంచి మరికొన్ని డాలర్లు వచ్చాయి. నా పెన్షన్ డబ్బులు బొటాబొటిగా నా అవసరాలను తీరుస్తున్నాయి. ఇలా అదనంగా వచ్చే ఈ డబ్బులు అవసరంలో ఉన్నవారి అవసరాలను తీర్చడానికి సరిపోయేవి కాదు. పర్సులో చిల్లర డబ్బుల మాదిరి.
‘సిరి దావచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
అన్నట్టు, వచ్చినా పోయినా పట్టించుకోని స్థిత ప్రజ్ఞత వున్న వాడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. ఒక వయసు దాటిన తర్వాత డబ్బు అవసరం ఉండవచ్చు కానీ, అదే ప్రధానం కాదు.
కిందటి ఆదివారం కాక, అంతకు ముందు ఆదివారం నాడు ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ కోసం ఏమో అని రాంగ్ నెంబర్ అనే లోగా అవతలి గొంతు, ‘నా పేరు రాజగోపాల్! హై బిజ్ టీవీ సీ ఈ ఓ’ అని పలకరించింది.
వారు ఫోనులో చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఈ ఏడాది వారి సంస్థ తరపున ఇచ్చే లెజెండ్ ఇన్ జర్నలిజం అవార్డ్ కు నన్ను ఎంపిక చేశారట. అదీ రేడియో జర్నలిజం రంగంలో. చిత్రం ఏమిటంటే, మా ఆవిడ పోయిన తర్వాత ఈ గుర్తింపులు. హాఫ్ పోస్తుమస్ అవార్డ్ అంటే ఇదే!
లొకేషన్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. ‘వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వచ్చాను’ అని చెప్పారు చాలా మర్యాదగా. ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడానికి మా ఇంట్లో వసతి లేదు.
‘నా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు’ అనేది నా ప్రశ్న. ‘ఫేస్ బుక్ రీడర్ని’ అని జవాబు.
ఓహో! జీరో ముందు ఒకటి చేరుతోంది అన్నమాట.
‘మీరిచ్చే ఈ అవార్డ్ నాకు హాఫ్ పోస్తుమస్’ అన్నాను. నివ్వెరపోతుంటే ‘మా ఆవిడ వుండుంటే సంతోషపడేది’ అన్నాను.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
ఆ ఆదివారం వచ్చింది. మా పెద్దన్నయ్య కుమారుడి గృహ ప్రవేశం అంతకు ముందు రాత్రే జరిగింది. అక్కడికి వెళ్లి వచ్చాను. మర్నాడు ఆదివారం పగటిపూట సత్యనారాయణ వ్రతం.
హైబిజ్ టీవీ వాళ్ళు పంపించిన కారులో శిల్పారామం దగ్గర సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లాను. పాత్రికేయ మితృలు అనేకమంది కలిసారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుశీల్, రచయిత్రి మృణాలిని, సాక్షి రెంటాల జయదేవ్, ఆలిండియా రేడియో గోపీచంద్ సాటి అవార్డు గ్రహీతల్లో వున్నారు. మరో పాత్రికేయ మిత్రుడు ములుగు సోమశేఖర్, రేడియో సహచరుడు రాంబాబు ఇలా చాలా మంది కలిసారు. అవార్డు కన్నా ఇంతమంది పాత మిత్రులను కలవడం మరింత సంతోషం కలిగించింది.
అవార్డు ప్రదానం చేసిన రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించారు. నిజానికి వారి నాన్నగారు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు గారితో నాకు మరింత అత్యంత సన్నిహిత పరిచయం. అన్యాయంగా నక్సలైట్ల చేతిలో మరణించారు.
ముసలితనంలో వసంతం జరిపించిన హైబిజ్ టీవీ రాజ్ గోపాల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు.














(ఇంకా వుంది)