నిద్రపట్టడం ఎలా!
ఈ కాలపు పిల్లలు వయసులో చిన్నవారే కావచ్చు కానీ, అనేక పనులు (మల్టీ టాస్కింగ్) ఏకకాలంలో నిభాయించుకుని రావడంలో సిద్ధహస్తులు. ఈ విషయంలో ఆడామగా తేడా లేదని నా ఉద్దేశ్యం.
ఆఫీసు, వర్క్ షాపులు, అయిదు రోజుల అమెరికా మీటింగు కోసం నా చిన్న కోడలు నిషా కటక్ నుంచి నెల క్రితం హైదరాబాదు వచ్చింది. తను ఆఫీసు పనులతో బిజీగా వుంటే, నా మనుమరాలు జీవిక నన్ను ఇబ్బంది పెడుతుందేమో అని, హైదరాబాదు రావడానికి ముందే ఆన్ లైన్ లో, మా ఇంటికి దగ్గరలో వున్న ఓ డే కేర్ సెంటర్ లో అడ్మిషన్ తీసుకుంది. అలాగే ఇరవై నాలుగు గంటలు పిల్లను కనిపెట్టి చూడడానికి కేర్ టేకర్ ని పెట్టుకుంది. ఇవన్నీ నేను చేయలేనని నాకు తెలుసు.
మధ్యలో ఒక మూడు రోజుల వర్క్ షాపు కోసం అమెరికా వెళ్లి వచ్చింది. వచ్చిన మర్నాడే జెట్ లాగ్ లెక్కచేయకుండా సోమవారం నాడు శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం చేసుకోవాలనే కోరికతో రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్ళింది. తగిన ఏర్పాటు లేకుండా వెడితే ఇబ్బంది పడతావేమో అంటే, నేను వెడుతోంది దైవ దర్సనానికి కదా! కొంత ఇబ్బంది పడితే నష్టం ఏముంది అని జవాబు. ఆ రాత్రి ఒక చిన్న సత్రంలో బస చేసింది. తెల్లవారి క్యూ లైన్లలో నిలబడి తను కోరుకున్నట్టుగా దైవ దర్శనం చేసుకుంది. ఒక్క రోజు ముందు బిజినెస్ క్లాసులో ప్రయాణం చేసి వచ్చిన అమ్మాయి, ఏసీ కూడా లేని ఒక చిన్న గదిలో నిద్ర చేసింది. రోడ్డు పక్కన హోటల్ లో భోజనం. ఇవన్నీ బూజుపట్టిన భావాలతో సతమవుతున్న నాకు కళ్ళు తెరిపిడ్లు పడే విషయాలే.
పెద్దలు PVRK ప్రసాద్ (IAS) గారు చెబుతుండే వారు. మనం ఎంత గొప్ప ప్రయత్నం చేసినా, ఆ భగవంతుడు ఎవరికి ఎలాంటి దర్శనం ఇవ్వాలో అదే ప్రసాదిస్తాడు అని. తన నాహం కర్త : పుస్తకంలో ఆ మాటే రాశారు. ఎలాంటి ప్రయత్నం లేకుండా వెళ్ళిన మా కోడలికి, మనుమరాలికి ఆ దేవుడు వాళ్లకు తృప్తికరమైన దర్శనమే ఇచ్చాడని అనుకోవాలి.
ఆమె దృష్టి ఒక్కటే. మహాదేవుడి దర్శనం చేసుకోవాలి. హైదరాబాద్ వెళ్ళిపోవాలి.
మూడు గంటలు క్యూలో వున్నా ఆమెలో ప్రశాంతత చెదరలేదు.
నేను ఫోను చేసినప్పుడు మంచి దర్శనం జరిగిందనే తృప్తితో మాట్లాడింది.
నా కోడలు అని కాదు కానీ ఇలాంటి వాళ్లే నిజమైన భక్తులు. నా లాంటి వాళ్ళు కాదు.
హైదరాబాదు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాలేదు, మళ్ళీ తెల్లారి భువనేశ్వర్ తిరుగు ప్రయాణం.
ఇన్ని రోజులుగా మనుమరాలితో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. ఏమిటో జీవితం. నా పిల్లలు చిన్నగా వున్నప్పుడు వారితో గడిపే తీరికలేదు. ఇప్పుడు తీరిక వున్నా పిల్లలు దగ్గర వుండరు. మధ్యాన్నం నుంచీ జీవిక ధ్యాసే.
మొబైల్ ఫోన్ పట్టుకోగానే ‘తాతా నాకది ఇవ్వు, యు ట్యూబ్ లో శివ చూడాలి’ అంటూ వచ్చేది. ‘వద్దమ్మా పిల్లలు మొబైల్ చూడకూడదు, టీవీలో చూడు అంటే, బుంగమూతి పెట్టుకుని ఓ పక్కకు పోయి కూర్చునేది.
టీవీలో IPL మ్యాచ్ కోసం టీవీ ఆన్ చేయగానే, పరిగెత్తు కొంటూ వచ్చి, ‘క్రికెట్ వద్దు, నాకు 529 ఛానల్ కావాలి, శివ చూడాలి’ అంటూ మారాము చేసేది.
భోజనం చేసి ట్యాబ్ లెట్లు వేసుకోవడానికి సిద్ధం కాగానే, ‘ఆగు తాతా నేను ఇస్తాను నీకు దవాయ్’ అంటూ వచ్చేది.
అన్నం తినడానికి కూర్చోగానే, ‘తాతా నాకు కూడా అన్నం పెట్టు’ అనేది. ‘వద్దమ్మా ఇది కారం. నువ్వు తినలేవు’ అంటే ‘కాదు తాతా నాకు కారం ఇష్టం, పెట్టి చూడు ఎలా తింటానో’ అనేది.
‘ఈ రాత్రి నీ దగ్గరే పడుకుంటాను తాతా’ అంటూ పిల్లిలా వచ్చి, ‘తలుపు వేశాను, అమ్మ చూడదులే , ఇప్పుడు టీవీ పెట్టు’ అనేది.
ఉదయం పూట ‘స్కూలు టైం అయింది’ అన్నా నిద్ర లేవని జీవిక, ‘అమ్మా నువ్వు లేచి స్నానం చేసి తయారు అయితే, రెండు GEMS PACKTS ఇస్తాను’ అనగానే తటాలున లేచి కూర్చునేది.
పగలు, ఇప్పడు ఇవే ఆలోచనలు.
తోకటపా :
అతనో రాజు. పేరుకు కాదు, నిజంగానే ఓ రాజ్యానికి రాజు.
ఉదయం లేచిన దగ్గరనుంచి చుట్టూ కనిపెట్టుకుని వుండే పరిచారికలు, క్రీగంట కనిపెట్టి అప్పటికప్పుడు సకల పరిచర్యలు చేసే పరివారం. కొలువు తీరిస్తే చాలు రాజాధిరాజా అంటూ ఆస్థాన కవిగాయక బృందాల బృందగానాలు. కొలువు ముగించి అంతఃపురంలో అడుగు పెట్టగానే ఇష్ట సఖుల సరస సల్లాపాలు. వారితో కూడి విందులు వినోదాలు. రాత్రి పడక గది చేరి పట్టపు రాణి వారితో ప్రియ సంభాషణలు.
సమయం గడుస్తున్న కొద్దీ ఉత్సాహభరిత, ఉల్లాసపూరిత వాతావరణంలో నిశ్శబ్దపు నీడలు. తెలియకుండానే ఒంటరితనం వొళ్ళు విరుచుకుంటుంది. పరివారాలు తప్పుకుంటాయి. పరిచారికలు సెలవు తీసుకుంటారు. రాణివాసంలో నిశ్శబ్దం తాండవిస్తుంది.
రాజుకు నిద్ర పట్టదు. శత్రు భయం కాదు. ఒంటరితనం అనే భయం. పొరుగురాజులు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టినా వెరవని అరివీర భయంకరుడే. కానీ ఆ నిశ్శబ్ద నిశీధిలో చుట్టుముట్టిన ఒంటరితనాన్ని ఎదుర్కోవడమే పెద్ద సమస్య.
రాజ్యం తనది. ప్రజలు తన వాళ్ళు. సకల భోగభాగ్యాలు తనవే. కానీ సమస్త ప్రపంచం ఓ పక్క గాఢ నిద్రలో వుంది. తన కంటికే కునుకు లేదు. తలచుకుంటే అప్పటికప్పుడు కవిగాయక శ్రేష్టులను పిలిపించి ఆ రాత్రి పొద్దు పుచ్చడం అనేది తనకో లెక్క కాదు. కానీ రాజుకు నిద్ర పట్టడం లేదు అనే కఠోర వాస్తవం నలుగురుకీ తెలిస్తే ఇంకేమైనా ఉందా!
ప్రపంచంలో ఉన్న ప్రతి సుఖమూ తనకు అందుబాటులో వుంది. మృష్టాన్న భోజనాలు, సురలు మాత్రమె సేవించగల మధుపానీయాలు, సుఖంగా శయనించడానికి వీలైన హంస తూలికా తల్పాలు వున్నాయి. కానీ నిద్ర పట్టడం ఎలా! అది తన చేతిలో లేదే! వజ్రవైడూర్యాలు, మరకత మణిమాణిక్యాలు సకల సంపదలతో పొంగిపొరలుతున్న తన ఖజానాలో కూడా అది లేదు, ‘ఎవర్రా అక్కడ! పోయి నిద్రాదేవిని పట్టుకు రండి’ అని ఆజ్ఞాపించడానికి.
సమస్య అంటూ ఎరుగని ఆ రాజుకు జీవితంలో ఎదురయిన సమస్య నిద్ర పట్టకపోవడం. అది ఎంత పెద్ద సమస్యో ఆ నిద్రపట్టని రాత్రి రాజుకు తెలిసివచ్చింది.
(ఇంకావుంది)