'మీ ఆస్తి నా పేరున రాయండి నాన్నా!
ఇది చాలు ఈ జీవితానికి
అనుకునే సందర్భాలు,
ఈ జీవితం ఇక చాలు
అనుకునే సందర్భాలు మనిషి జీవితంలో తటస్థ lపడతాయి.
ఈ రెండింటి దామాషాని బట్టి చెప్పొచ్చు ఆ జీవితం ఎలాంటిదని.
' నాన్నా! వచ్చే వారం అమెరికా తిరిగి వెళ్లే లోగా ఒక పని చేయాలి. మీ ఆస్తి మొత్తం నా పేరున రాసి ఆ వీలునామా రిజిస్టర్ చేయించాలి '
అమెరికాలో సెటిల్ అయిన నా పెద్ద పిల్లవాడు సందీప్, మొన్న ఆగస్టు అయిదో తేదీన హైదరాబాద్ లో తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో 'ఏమి కావాలి?' అని నేను అడిగినప్పుడు ఇచ్చిన ఈ జవాబు విన్న తర్వాత, 'ఈ జీవితానికి ఇది చాలు' అని అనిపించింది. జీవితం ధన్యం అయిందనే భావన కలిగింది.
' నాకు తెలుసు రాసివ్వడానికి మీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవని. వుండి ఇచ్చినా అవి నాకు ఎందుకూ పనికిరావు. నాకు కావాల్సింది మీ దగ్గర మాత్రమే వుంది. అవి మీరు రాసే రాతలు. వాటన్నిటిమీదా నాకు కాపీ రైట్స్ ఇస్తూ విల్లు రిజిస్టర్ చేసి ఇవ్వండి '
అన్నాడు వాడు.
ఇప్పుడు చెప్పండి, నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
నిన్న ఆగస్టు ఆరో తేదీన వాడు నేనూ కలిసి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వచ్చాము. కటక్ లో ఉంటున్న నా రెండో కోడలు నిషా, మనుమరాలు జీవికని వెంటబెట్టుకుని ఎయిర్ పోర్టుకు వచ్చింది.
కటక్ నుంచి ఇప్పటివరకు అది నాకు టంకంలా అతుక్కుపోయింది.
కటక్ మొత్తం దేశంలోని పురాతన నగరాల్లో ఒకటని చెబుతారు. ఆ ఛాయలు ఇప్పటికీ బాగా కనబడతాయి. సైకిళ్ళు అతి ఎక్కువగా వున్న పట్టణం అనే పేరు కూడా వుంది. ఇరుకైన వీధుల్లో తేలిగ్గా తిరగడం కోసం బహుశా పాత కాలంలో సైకిళ్ళు ఎక్కువగా వాడే వారు అనుకుంటా. ఇప్పుడు వాటిల్లో సింహభాగం వాటాని ద్విచక్ర మోటారు వాహనాలు ఆక్రమించాయి.
రాత్రి మా వియ్యంకుడి ఇంట్లో బస. సాయంత్రపు మర్యాదల అనంతరం ఏడో తేదీ ఉదయం కటక్ లో జగన్నాధ ఆలయానికి వెళ్ళాము. దాదాపు ప్రతి లొకాలిటీలో జగన్నాధుడి గుళ్ళు దర్శనం ఇస్తాయి.
తిధుల ప్రకారం నాకు ఎనభయ్ నిండి ఎనభయ్ ఒకటో ఏట ప్రవేశించేరోజు. కొంచెం అటుఇటుగా అధిక మాసాలను బట్టి సహస్ర చంద్ర దర్శనం క్రతువు నిర్వహించేది ఈ సందర్భంలోనే. ( వేయి నిండు పున్నములను కళ్ళారా వీక్షించే నిండు వయసు వరకూ జీవించి వున్నవారికి ఈ వేడుక చేస్తారని వినికిడి) వాస్తవానికి ఎనభయ్ ఏళ్ళ ఎనిమిది మాసాలకి సహస్ర పూర్ణ చంద్ర దర్శనం పూర్తవుతుంది. ఇంకా ఎనిమిది మాసాల వ్యవధి వుంది. పీటల మీద పక్కన కూర్చోవడానికి మా ఆవిడ జీవించి లేదు కాబట్టి నాకు అస్సలు ఇష్టం లేని వేడుక ఇది.
మా అమ్మగారికి ఈ వేడుకను మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు సాంప్రదాయ బద్ధంగా జరిపారు. మా అమ్మ సంతానం అంతా కలిసి చాలా సన్నటి బంగారు తాపడం చేసిన పూలతో ఆమెను అభిషేకించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆమె చేతి మీదుగా కొత్త అయిదు రూపాయల నోటు అందుకున్నారు. మా అన్నయ్య ఎంతో శ్రద్దగా ఆ నోటు, బంగారు పువ్వు, ఆమె ఫోటోతో తయారు చేయించిన చిన్న ప్లాస్టిక్ కవర్ ను అమ్మమ్మ సంతానానికి పేర్లు రాసి మరీ అందచేసాడు. గత ముప్పైయ్యేళ్ళుగా అది నా పర్సులో వుంటూ వస్తోంది. అలాగే చాలా మంది దాన్ని అపురూపమైన కానుకగా పదిలపరచుకున్నారు.
అందరికీ అదొక మధుర జ్ఞాపకం.
మా అమ్మ తర్వాత మా కుటుంబంలో ఈ సాంప్రదాయం మాయమై పోయింది. మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు ఇలాంటి సందర్భాలలో ఊళ్ళో వుండకుండా ఏదైనా పుణ్య క్షేత్రానికి వెడతారు. నేనూ ఆయన పద్దతిలోనే, ఈ సందర్భంలో హైదరాబాద్ వదిలి మా మనుమరాలు జీవికని చూసే నెపంతో హైదరాబాద్ నుండి బయట పడ్డాను.
కటక్ లో ఈ ఉదయం శ్రీ ప్రసాదం అనే రెస్టారెంట్ లో అల్పాహారం. బహుశా తెలుగు వారి రుచులకు అనుగుణంగా పదార్ధాలు వుంటాయని ఆ హోటల్ సెలక్ట్ చేసినట్టున్నారు. ఫక్తు మన రుచులు. తగిన ఉప్పూ కారాల పాళ్ళతో చేసిన టిఫిన్లు నాకు బాగా నచ్చాయి.
హోటల్ లో వున్నప్పుడే మిత్రులు, బంధువులు అనేకమంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికాలో వున్న మా పెద్ద కోడలు భావన, మనుమరాళ్లు సఖి, సృష్టి వీడియో కాల్ చేశారు. కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగించి హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడుతూ ఉఫ్ మని ఊదమన్నారు. అదేమిటో విచిత్రం, ఉఫ్ అనగానే వీడియోలో కొవ్వొత్తులు ఆరిపోయాయి. కన్ను మలిగిందో, కనికట్టొ తెలియదు.
రాత్రికి డిన్నర్ కటక్ లో కొత్తగా కట్టిన స్టార్ హోటల్లో అంటున్నారు. పిల్లలు ముచ్చట పడి చేసే వాటికి అడ్డు చెప్పకపోవడమే పెద్దల పని అని ఇంత పెద్దయిన తర్వాత తెలిసొచ్చింది.
(ఇంకా వుంది )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి