30, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 30 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 01-12-2019, SUNDAY)
వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ
కందుకూరి రామభద్రరావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కవి, పండితుడు, రచయిత. గోదావరీ తీర ప్రాంతంలో ప్రసిద్ధ కవులైన  దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు మొదలైన భావకవులకు ఆయన సమకాలికులు. వీరందరూ కలిసి నవ్య సాహిత్య పరిషత్ పేరుతొ ఒక సంస్థని నడిపేవారు. కందుకూరి రామభద్రరావు గారు  కవిమాత్రమే కాదు, చక్కని వక్త కూడా. తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి దిగ్గజాలు సయితం రామభద్రరావుగారి ప్రసంగ పాటవానికి పరవశులయ్యారని చెప్పుకునేవారు. రేడియో ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట – ఎంతపరిమళమోయి ఈ తోట పూలు’ అనే కవిత వీరి కలం నుంచి జాలువారినదే.  టీచరుగా పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా విజయవాడ ఆకాశవాణిలో విద్యావిషయిక కార్యక్రమాల ప్రొడ్యూసరుగా కూడా అయన పనిచేశారు.   
ఈ రామభద్రరావుగారి పుత్రుడే ఈ వ్యాసానికి ప్రేరణ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ.
వీరిది రాజమండ్రి దగ్గర రాజవరం.


(శ్రీ  కందుకూరి  సూర్యనారాయణ)

సూర్యనారాయణ మద్రాసులో ఎమ్మే చేసారు. ఏడాది ఎదురు చూసినా సరైన ఉద్యోగం రాలేదు. అలా రోజులు దొర్లిస్తున్నప్పుడు, 1960 లో  ఆంధ్రజ్యోతి ఎడిటర్  నార్ల వెంకటేశ్వర రావు గారు, రామభద్రరావు గారిపట్ల ఉన్న మిత్రవాత్సల్యంతో, ఆయన కుమారుడు అయిన సూర్యనారాయణకు తమ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చారు. విద్వాన్ విశ్వం అసిస్టెంట్ ఎడిటర్. నండూరి రామమోహన రావు సీనియర్ సబ్ ఎడిటర్, తుర్లపాటి కుటుంబరావు, ఎల్లోరా, వీరభద్రరావు  ఇతర సహోద్యోగులు.
అలా ఓ ఏడాది  గడిచిన తర్వాత, న్యూస్ రీడర్ ఉద్యోగాలకు  రేడియో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన చూసి దరఖాస్తు చేసారు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. హైదరాబాదులో ఇంటర్వ్యూ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. సూర్యనారాయణగారిని ఢిల్లీలో న్యూస్ రీడర్ గా సెలక్ట్ చేసారు. అదే సమయంలో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ గార్లను కూడా న్యూస్  రీడర్లుగా ఎంపిక చేశారు.
1962 లో ఢిల్లీ వెళ్లి ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్ గా చేరిపోయారు. అప్పటికే అక్కడి తెలుగు వార్తావిభాగంలో శ్రీయుతులు పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి, తిరుమలశెట్టి శ్రీరాములు పనిచేస్తున్నారు. శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు తరువాత చేరారు.    
1967 లో మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం వచ్చింది.  సూర్యనారాయణ గారికి మాస్కో పోవాలని మనసులో పడింది.  కానీ ఆయనది రేడియోలో కాంట్రాక్టు ఉద్యోగం. స్టాఫ్ ఆర్టిస్ట్ కేటగిరీ. ప్రభుత్వ కొలువు కాదు. మాస్కో పంపడానికి రేడియోవారికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాలి. మంచి ఉద్యోగం. ఎందుకు పోగొట్టుకోవాలి అని హితైషులు సలహా చెప్పారు. ఉన్న ఉద్యోగం వదులుకోవాలి అనే షరతు నచ్చని కందుకూరివారు ఆ ఆఫర్  తిరస్కరించారు. దాంతో ఆఫీసు వారే దిగివచ్చి, మూడేళ్ళ లోపు తిరిగొస్తే ఉద్యోగం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆయన మాస్కో ప్రయాణానికి అవరోధం తొలిగి పోయింది.
1967 లో మాస్కో వెళ్ళారు. ప్రాస్పెక్ట్ మీరా ప్రాంతంలో అపార్ట్ మెంటు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత  కుటుంబాన్ని పిలిపించుకున్నారు. అలా మాస్కో రేడియోలో తెలుగు ప్రసారాలను ఆయన మొట్ట మొదటిసారి ప్రారంభించారు. (ఇక్కడ ఓ స్వవిషయం ప్రస్తావించడం సముచితంగా వుంటుంది. సూర్యనారాయణ గారు మొదటి సారి మాస్కో నుంచి, రేడియో మాస్కో ద్వారా  తెలుగులో వార్తలు చదవడం ప్రారంభిస్తే, 1991 లో నేను అదే మాస్కో నుంచి అదే రేడియో మాస్కో ద్వారా చిట్టచివరిసారి తెలుగు వార్తలు చదివి అక్కడి తెలుగు ప్రసారాలకు మంగళం పాడాను. మా ఇద్దరి నడుమ తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు గార్లు రేడియో  మాస్కోలో పనిచేశారు.)
రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన తరువాత సూర్యనారాయణ గారి పనితీరు నచ్చి మరో ఏడాది పొడిగించారు. అలా మొత్తం మీద దాదాపు మూడున్నరేళ్ళు మాస్కోలో గడిపి, 1970 లో ఢిల్లీ తిరిగివచ్చారు.
ఆశ్చర్యం. ఢిల్లీ రేడియోలో ఉద్యోగం సిద్ధంగా వుంది. వెంటనే చేరిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటంటే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ ఆయన సీనియారిటీ కోల్పోయారు. 1995 లో రిటైర్ అయ్యారు. ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. భార్య శ్రీమతి కందుకూరి మహాలక్ష్మి. మంచి రచయిత్రి. నాలుగు కధా సంపుటాలు వెలువారించారు.
‘మీ రేడియో జీవితంలో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగిందా?’
ఫోనులో గంటకుపైగా హైదరాబాదు నుంచి కందుకూరి సూర్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న.  
‘మీరూ రేడియోలో పనిచేసారు కదా! మీకు తెలియంది కాదు. జనరల్ న్యూస్ రూమ్ లో అనేక భారతీయ భాషా విభాగాలు వుంటాయి. అన్నింటికీ కలిపి ఉమ్మడిగా బులెటిన్ తయారు చేసి వివిధ విభాగాలకు పంపిస్తారు. మనం కొత్తగా కలపడం కానీ, లేదా ఉన్నది తీసివేయడం కానీ జరగడానికి వీల్లేదు. ఒకసారి  ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు నలుగురితో పాటు నన్నూ పిలిచి సత్కరించారు. నాతొ పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కూడా పురస్కారాలు స్వీకరించారు. రేడియో తెలుగు వార్తల్లో చెప్పడానికి అధికారులు అభ్యంతర పెట్టారు. చివరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ పేరు లేకుండా తెలుగు వార్తల్లో చివరన చేర్చడానికి వారిని ఒప్పించేందుకు  చాలా కష్టపడాల్సి వచ్చింది.
‘సరే! మీరు అడిగారు కాబట్టి ఒక సంగతి చెబుతాను. అరవైలలో కాబోలు గోవధను నిషేధించాలని కోరుతూ సాధువులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు భవనానికి దగ్గరగా వుండడం వల్ల రేడియో స్టేషన్ నుంచి ఇంటికి పోయే వీలు లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. దాంతో రెండ్రోజులు ఆఫీసులోనే వుండిపోవాల్సి వచ్చింది. అక్కడే పడక, అక్కడే భోజనాలు’ 
80 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన స్వరం స్పుటంగా వుంది. అంతసేపు మాట్లాడినా అలసట కనబడలేదు. స్వరాన్ని వరంగా పొందిన ధన్యుల్లో ఆయన ఒకరు.
అందుకే రేడియో వార్తలు చదివే రోజుల్లో కందుకూరివారికి అంతమంది అభిమానులు.
(ఇంకా వుంది)
  
            

తొంభయ్ ఏళ్ళు వచ్చినా ఆ ముసలితనపు ఛాయలు కనబడకుండా ఉండాలంటే.....


(అమెరికాలోని, ఒహియో రాష్ట్రం, క్లీవ్ లాండ్ కు చెందిన రెగీనా బ్రెట్ అనే రచయిత్రి  ఏర్చి కూర్చిన హితోక్తులు)
“జీవితం మనం అనుకునేటంత చెడ్డదీ కాదు, మనం ఊహించుకునేటంతటి చెడ్డదీ కాదు.
“ఏదైనా సందేహం కలిగినప్పుడు అక్కడే ఆగిపోండి. తర్వాత నెమ్మదిగా మరో చిన్న ఆడుగు  వేయండి
“నిండు నూరేళ్ళ జీవితం అంటారు కానీ, చూస్తుండగానే కరిగిపోయి ఇంత చిన్నదా  అనిపిస్తుంది. అంచేత ఉన్న  కాస్త సమయాన్ని ఇతరులను  ఆడిపోసుకోవడానికో, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికో వృధా చేసుకోకండి.
“ఉన్నట్టుండి పడకేస్తే మనల్ని ఆదుకునేది, కనిపెట్టుకు చూసుకునేది మన చుట్టపక్కాలు, మన స్నేహితులే అని మరచి పోకండి.
“చేసే ప్రతి వాదనలో మనదే పై చేయి కావాలని భీష్మించుకోకండి. కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించండి.
“దుఖం కలిగితే ఒంటరిగా ఏడవకండి.  ఎవరో ఒకరితో మీ బాధను పంచుకోండి.
“దేవుడి మీద కోపం వస్తే దాన్ని ఆయన మీద చూపండి. ఆయనకి ఇలాటివి కొత్తేమీ కాదు.  
“గతంతో రాజీ పడి, పాత వాటిని మరచిపోతే, ఆ అనుభవాలు భవిష్యత్తులో శాంతిని కలిగిస్తాయి.
“ఇతరులతో మనల్ని పోల్చి చూసుకోవడం అంటే మన మనశ్శా౦తిని మనమే చేతులారా పోగొట్టుకున్నట్టే”
“ప్రపంచంలో ప్రతిదీ కనురెప్పపాటులో మారిపోతుంటుంది. భయం లేదు. ఆ భగవంతుడికి మనలా కనుగీటడం  తెలియదు.
“నువ్వు తప్ప  నీ ఆనందాన్ని ఎవరూ దూరం చేయలేరు.
“అన్నీ మరచిపోయి అందర్నీ క్షమించండి.
“మీ గురించి  బయటవాళ్ళు ఏమనుకుంటున్నారనేది మీకు అస్సలు సంబంధం లేని విషయం.
“అన్ని బాధలను, అన్ని వేదనలను, అన్ని గాయాలను నయం చేసే శక్తి కాలానికి ఒక్కదానికే వుంది. దానికి కొంత  వ్యవధానం ఇవ్వండి.
“అద్భుతాలను ఆస్వాదించండి.        
“ప్రతి రోజూ అలా కాసేపు బాహ్య ప్రపంచంలోకి వెళ్లి చూడండి. మీరు ఊహించని అద్భుతాలు మీ కళ్ళబడతాయి.
“అసూయ పడితే ప్రయోజనం వుండదు. శుద్ధ టైం వేస్టు. మీకు కావాల్సినవి, మీరు కోరుకున్నవీ మీచెంతనే  వున్నాయి. ఆ సంతృప్తి ఒక్కటే అసూయని మీకు దూరం చేస్తుంది”


రేడియో రోజులు - 29 - భండారు శ్రీనివాసరావు


(Published  in SURYA daily on 30-11-2019, Saturday)

'జ్ఞానపీఠ్' అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ అసలు పేరు

నేను రేడియోలో చేరిన రోజుల్లో తెల్లని ధోవతి, లాల్చీ  ధరించి, చేతిలో కొన్ని కాగితాలతో ఒక పెద్దాయన రేడియో ఆవరణలో కనిపించేవారు. వెంకట్రామయ్య గారు కాబోలు ఓసారి ఆయన్ని నాకు పరిచయం చేశారు. ఆయనే  రావూరి భరద్వాజ.
నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వచ్చేది. ఆ నవల ఆకర్షణకు గురయిన అనేక వేలాదిమందిలో నేనొకడిని. సాక్షాత్తు ఆ నవలా రచయిత పనిచేస్తున్న రేడియోలోనే నేనూ పనిచేస్తున్నాను అనే ఎరుక నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. తర్వాత నేను ఎక్కడ కనబడినా ‘ఏమయ్యా శ్రీనివాసూ! ఎలా వున్నావు’ అని ఆప్యాయంగా పలకరించేవారు.
నేను చదువుకునే రోజుల్లో చదివిన ఈ పాకుడు రాళ్ళు నవలకే తదనంతర కాలంలో 'జ్ఞానపీఠ్' అవార్డ్ లభించింది. ఈ అవార్డు  ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. ఎంత ఆలస్యం జరిగిందంటే అది స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించడమే అందుకు తార్కాణం.
భరద్వాజ గారు రేడియో మీడియంను ఆపోశన పట్టారేమో అనిపిస్తుంది. స్పోకెన్ వర్డ్ కార్యక్రమానికి ఆయన ఆధ్వర్యం వహించేవారు. రేడియోలో మాట్లాడినట్టు వుండాలి కానీ, కాగితం చూసి చదివినట్టు వుండకూడదు అనేవారు. స్క్రిప్ట్ రాసుకుని స్టుడియోలోకి వెళ్ళి చదివినా ఏదో కబుర్లు చెబుతున్నట్టు వుండేది. స్క్రిప్ట్ ఆ విధంగా తయారు చేసుకోవడం కూడా ఒక కళ. ప్రముఖుల ప్రసంగాలను రికార్డు చేసేటప్పుడు కూడా వారి రాత ప్రతిని తేలిగ్గా చదవడానికి వీలుగా సవరించేవారు.
రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు,  విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది.  
భార్య చనిపోయిన తర్వాత అనుకుంటాను ఆమెను గుర్తు చేసుకుంటూ  కాంతం కధలు రాశారు. ఆ వియోగభారంతోనే కాబోలు రావూరి భరద్వాజ గారు గడ్డం మీసాలు పెంచడం మొదలుపెట్టారంటారు.
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ, పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి.
ఆయన గురించిన  మరో చిన్న జ్ఞాపకం:
మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి అనే పేరుతొ తెలుగులో భరద్వాజ అనువదించిన ఈ పుస్తకం వెనుక చిన్నకధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేఏ అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెనిగించారు.
ఒకసారి  శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజగారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సరిసమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
తన మేలైన జ్ఞాపకాలను మనకు వొదిలేసి రావూరి భరద్వాజగారు 2013 లో  హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం  కన్నుమూశారు. 

29, నవంబర్ 2019, శుక్రవారం

నిర్భయతో ఉన్న భయం పోయిందా ? లేని భయం పట్టుకుందా? – భండారు శ్రీనివాసరావు


ఆడపిల్లలకు సంబంధించి ఘోరమైన వార్తలు వినబడుతున్న నేపధ్యంలో ఏడేళ్ళ నాటి మరో ఘోర దురంతం గుర్తుకు వస్తోంది.
2012 డిసెంబరు 16  తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది.   సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న  యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనం  ఊపిరి పోసుకుంది.  నాకు తెలిసి స్వతంత్ర భారతంలో ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా అదే.  చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామిక (ఆ యువతి తల్లి ఆశాదేవి, చనిపోయిన తన కుమార్తె పేరు జ్యోతి సింగ్అని మొదటిసారి బహిర్గత పరిచారు. ఇటువంటి ఘోరాలకు బలి అయిన ఆడవారి పేర్లను బయట పెట్టరాదని మీడియా ఆ రోజుల్లో తనకు తానే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంది) సింగపూరులో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేత్ర్యత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెల రోజుల లోపునే  సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా వారు అభిప్రాయపడ్డారు.  కమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఆ తరువాత  మూడేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. అలా అని ఈ శాసనం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా ఆ  అబలలకు  ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా నిర్భయగా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
మూడేళ్ళ తర్వాత ఢిల్లీ నిర్భయకేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది. చివరకు సుప్రీం కోర్టు దాన్ని  యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
మరో సంగతి ఇక్కడ ప్రస్తావించాలి. ఈ కేసు విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదనిఅతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
ఆరో  ముద్దాయి మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువెనైల్ హోం లో ఉంచారు. మైనారిటీ తీరగానే అతడ్ని విడుదల చేసారు. నేరం జరిగిన నాటికి మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ జువెనైల్ హో౦ నిర్బంధంతో సరిపుచ్చాల్సి వచ్చింది.
అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టిన  అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు, నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప చువ్వతో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడుఅనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం జ్యోతిసింగ్ తలితండ్రులను నిరాశ పరచింది. నేరం జయించిందని, తామే పరాజితులమనిఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపించేలా వుంది. చట్టం ప్రకారం అలాంటి  బాల హంతకులకు   జువనైల్ హోం నుంచి బయటపడగానే కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ ఆర్ధిక సాయం చేస్తారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలిస్తారు. అప్పటినుంచి అతడు సమాజంలో నూతన నామధేయంతో చెలామణీ అవుతాడు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ అల్ప వయస్కుడుకూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.
వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ఈ అల్పవయస్కుడివిడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది.