8, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు – 10 – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 08-11-2019, Friday, today)

చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు  ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు, అన్నన్ని సంగతులు ఎలా గుర్తుంటాయని.' కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని. కొన్నేళ్ళ క్రితం  సర్వే వాళ్ళు వచ్చి అడిగారు,  'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ.  నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు  మిడిమిడి జ్ఞానం బాపతు.  అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే  మనలో నిండుకుని వున్న  అజ్ఞానం చాలావరకు అంధకారంలోనే కప్పబడిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర  ఖండన ముండనలు, హర్షాతిరేక  ప్రకటనలు,  ప్రగాఢ సంతాప ప్రకటనలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. ( ట్విట్టర్, ఫేస్ బుక్ ల పుణ్యమా అని ఇప్పుడిలా  పేపరాఫీసుల చుట్టూ  తిరిగే అవస్థ వారికి  తప్పింది)
వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారి వారి నొసటిరాత ప్రకారం  మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే  స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. కానీ పేరు వేరుగా వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' ఆ ఎంపీ ఈ ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డును పరికించి చూస్తే మాత్రం  అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటే ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే  ఇప్పుడు మాత్రం మాజీ.  'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు, హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో  చిన్న అక్షరాలలో ముద్రించారు. 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకు నేనే సమాధాన పడ్డాను.
అలా ఆసారి కూడా నా  అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల,  ఇదిగో ఇప్పుడిలా,  కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను.
రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన  పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి,  రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: