24, ఫిబ్రవరి 2024, శనివారం

మూడు రోజుల్లో ముగిసిన 47 ఏళ్ళ జీవితం – భండారు శ్రీనివాసరావు

 

సరిగ్గా నేటికి ఇరవై రోజుల క్రితం నా నెత్తిన ఓ పిడుగు పడింది. మెదడు మొద్దు బారింది. నా కలంలో ఇంకు ఇంకిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి అయిపోయింది. నలభయ్ ఏడేళ్ల వయసున్న నా రెండో కుమారుడు సంతోష్ ఈ నెల ఫిబ్రవరి నాల్కో తేదీ ఉదయం కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు. ఒకటో తేదీ చెస్ట్ కంజెషన్ కంప్లయింట్ తో అపోలో ఆసుపత్రిలో చేరాడు. మొదటి రోజు అడ్మిషన్, రెండో రోజు ఐ సీ యు, మూడో రోజు వెంటిలేటర్, నాలుగో రోజు ఉదయం మా ప్రయత్నం మేము చేశాం అనేసి చెట్టంత కొడుకుని కట్టెగా మార్చి ఇంటికి పంపేశారు. అలా మూడు రోజుల్లో మావాడి నలభయ్ ఏడేళ్ల జీవితం ముగిసిపోయింది.

అయిదేళ్ళ క్రితం మా ఆవిడ నిర్మల ఇలాగే నన్ను వదిలేసి పై లోకాలకు వెళ్లి పోయింది. అప్పుడు ఇలాగే రంపపు కోత. ఇప్పుడు ఏకంగా కడుపు కోత.

నా కోడలు నిషా బాధతో పోలిస్తే నాదెంత అని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నాది. ఎదిగే పొద్దు వాళ్లది. వాలే  పొద్దు నాది.

‘భరింప శక్యం కాని బాధ ఏమిటి?’ అని యక్షుడు ధర్మరాజుని ప్రశ్నిస్తే, ‘పెద్ద వాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్లు దాటిపోవడాన్ని మించిన బాధ ఏముంటుంది అంటాడు. 

పిల్లల్ని ముద్దు పేర్లతో కాకుండా అసలు పేర్లతో పిలవాలి అనే కోరికతో నా పిల్లలకు సందీప్,  సంతోష్ నామకరణం చేసుకున్నాను. ఎప్పుడూ అరె ఒరే పిలవలేదు. ఇప్పుడు తప్పడం లేదు.

      

‘నన్ను సరే! నీ ప్రాణానికి ప్రాణం అయిన నీ రెండేళ్ల కూతురు జీవికను వదిలి ఎలా వెళ్ళావురా సంతోష్!  జరిగి రోజులు గడిచిపోతున్నా నేను ఇంకా  ఇలా వున్నాను అంటే నేను తండ్రి నేనా!

నాది గుండా! రాతి బండా!

(24-02-2024)