18, ఏప్రిల్ 2024, గురువారం

విన్ విజన్ – భండారు శ్రీనివాసరావు

 “ ఆల్ ఓకే! ఇక రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడండి” అంటున్నారు డాక్టర్ శ్రీ లక్ష్మి.

డాక్టర్ శ్రీ లక్ష్మి గారి ప్రత్యేకత ఏమిటంటే, సర్జరీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు, కబుర్లు చెబుతున్నారో సర్జరీ చేస్తున్నారో తెలవనంతగా. అంతమాటకారి.

అయిదేళ్ళ క్రితం ఒక కన్ను. ఇప్పుడు మళ్ళీ రెండో కన్ను. నా  రెండు కళ్ళకు కేటరాక్ట్ ఆపరేషన్ చేసింది ఆవిడే.  మొదటిసారి చేసినప్పుడు అనుమానం వచ్చింది, అసలు సర్జరీ చేసినట్టే లేదు. అదే అడిగాను. ఈసారి మరీ ముదరబెట్టుకుని వచ్చారు, అంచేత అలా అనిపించివుంటుంది అన్నది డాక్టరు గారి జవాబు.

ఈ కేటరాక్ట్ ఆపరేషన్ తో ఉన్న సులువు ఏమిటంటే పదిహేను, ఇరవై నిమిషాల్లో పూర్ర్తవుతుంది. చేసిన చోట ఎలాంటి నొప్పి వుండదు, కంటి వరకు ఎనస్తీషియా ఇస్తారు కాబట్టి. దాని ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎలాంటి నొప్పి అనిపించలేదు. అసలు చిక్కల్లా మూడు రకాల కంటి చుక్కల్ని రోజుకు ఆరుసార్లు, నాలుగు సార్లు, మూడు సార్లు చొప్పున నెల రోజులు టైం టేబుల్ ప్రకారం వేసుకోవాలి. ఇదొక చికాకైన, తప్పనిసరి  వ్యవహారం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ పరీక్ష చేసి కంటి పవర్ కు తగిన కంటి అద్దాలను సిఫారసు చేస్తారు. ఆ కళ్ళజోడు తగిలించుకుని డాక్టరుగారు చెప్పినట్టు రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి అన్నమాట.

ఆసుపత్రిలోకి ప్రవేశించగానే నిలువెత్తు వినాయకుడి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. డాక్టర్ శ్రీలక్ష్మి కూడా లోనికి రాగానే ఆ విఘ్ననాయకుడికి    చేతులు జోడించి నమస్కరించిన తర్వాతనే  తన విధులు మొదలు పెట్టడం గమనించాము. రిసెప్షన్ లో వున్న వ్యక్తికి మనం వచ్చిన పని లేదా అప్పాయింట్ మెంట్ గురించి చెప్పగానే ఒక సహాయకురాలు వచ్చి మనల్ని మొదటి అంతస్తుకి తీసుకువెళ్లి అక్కడి రిసెప్షన్ హాలులో కూర్చోబెడతారు. ఈలోగా మరో సహాయకురాలు వేడి వేడి కాఫీ, తేనీటి పానీయాలతో మర్యాదలు చేస్తారు. మనం వచ్చింది కంటి పరీక్షలకా, లేక పెళ్లి రిసెప్షన్ కా అని ఆశ్చర్యపోయేలోగా మరో సహాయకురాలు వివరాలు కనుక్కుని సంబంధిత విభాగానికి తీసుకు వెడతారు. అయితే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చార్జీ వగైరాలు చెల్లించిన తరువాతనే అనుకోండి. ఇక్కడ నాకు విశేషంగా అనిపించింది ఏమిటంటే ఈ పనులన్నీ ఆడపిల్లలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా హోస్టెస్ ల మాదిరిగా వారి కట్టూ బొట్టూ, మాటా మన్ననా ఒకే తీరున కుదుమట్టంగా వుంది. వారి పేర్లు కూడా ఆసుపత్రివారే పెట్టారేమో అన్నట్టుగా ఒకే రకంగా వున్నాయి. నాకు గుర్తున్నంత వరకు, వారిలో కొందరి పేర్లు: సంతోషిణి, సంగీత, శ్రీలత, అనిత, కవిత, నిఖిత, నవనీత. (మరునాడు  చెకప్/ రివ్యు కోసం పోయినప్పుడు  వారు వస్త్రధారణలో భాగంగా పెట్టుకున్న చిన్ని నేమ్ ప్లేట్ల మీది ఈ పేర్లు చూశాను. ఇవి  చదవగలిగాను. అంటే ఆపరేషన్ సక్సెస్ అయినట్టే కదా!)

కనుపాపలు పెద్దవి కావడానికి కంటిలో చుక్కలు వేసే కార్యక్రమంతో ఓ గంట కాలక్షేపం అవుతుంది. ఆ తరువాత వరుసగా అనేక విభాగాలు తిప్పుతారు. కంటి వైద్యంలో ఇన్ని అధునాతన పరికరాలు రంగప్రవేశం చేసాయనే సంగతి ఈ టూరు వల్ల మనకు    బోధపడుతుంది. ఒక్కొక్క పరికరం లక్షల ఖరీదు చేస్తుంది అని వాటిని చూడగానే తెలిసిపోతుంది. పరవాలేదు, మనం మంచి ఆసుపత్రికే వచ్చాము అనే ఎరుక కూడా కలుగుతుంది.

అసలు ఆపరేషన్ చేసే డాక్టర్ శ్రీ లక్ష్మి గారిని కలిసే లోగా ఈ పరీక్షల తతంగం పూర్తయి,  ఫలితాలు అన్నీ డిజిటల్ రూపంలో   అక్కడికి చేరిపోతాయి. వాటిని ఆకళింపు చేసుకున్న డాక్టరు గారు, పలానా రోజు, పలానా టైముకు రండి అంటారు. సరే అని పలానా రోజున పలానా టైముకు వెడతాము. పలానా రోజునే చేస్తారు కానీ, పలానా టైముకే జరగాలని లేదు. మరేదైనా జరూరు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందు నిర్ణయించిన షెడ్యూలు మారే అవకాశం వుంది. నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ కేటరాక్ట్ ఆపరేషన్ అనేది ఇటువంటి పెద్ద ఆసుపత్రులలో అతి సులువుగా చేసే అతి చిన్న సర్జరీ. అంచేత, వారి  ప్రాధాన్యతాక్రమంలో ఇది చిట్ట చివరిది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నాకూ అలానే అనిపించింది. 


(డాక్టర్ శ్రీలక్ష్మి)

           

తోకటపా:

హైదరాబాదు బేగంపేట గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ విన్ విజన్ కంటి ఆసుపత్రిని 2015 నవంబరులో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు ప్రారంభించారు. మొదలు పెట్టడమే కార్పొరేట్ హంగులతో, అధునాతన చికిత్సా పరికరాలతో ఆవిర్భవించిన ఈ కంటి ఆసుపత్రి ఇప్పుడు మరిన్ని హంగులను సమకూర్చుకుంది. అంచేత అక్కడి వైద్యం నాణ్యతకు తగ్గట్టుగానే బిల్లులు చురుక్కుమనిపిస్తాయి. అయితే మంచి బీమా కంపెనీ నుంచి ఆరోగ్య పాలసీ వున్నవారు దర్జాగా అందులోకి అడుగు పెట్టి అంతకంటే దర్జాగా చికిత్స పూర్తిచేసుకుని బయట పడవచ్చు. రోబోటిక్ సర్జరీ వంటి అధునాతన విధానాలతో కూడా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కాకపొతే డాక్టర్ శ్రీ లక్ష్మి గారి హస్తవాసి పట్ల నాకు గురి. అందుకే ఆమె చేతితో చేసే శస్త్రచికిత్సను ఎంచుకున్నాను.

అసలు తోక, అసలు టపా:

నాకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా కార్డు (CGHS) ఉన్నప్పటికీ చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ భీమా అంటే అదోరకమైన చిన్నచూపు అనే అపోహ వుంది. అంచేత మా చిన్నకోడలు, నిషా  తాను పనిచేసే పెద్ద కార్పొరేట్ కంపెనీ హెల్త్  ఇన్సురెన్స్  కార్డు మీద ఈ ఆపరేషన్ చేయించింది. దాంతో Cashless treatment with no questions asked.

దరిమిలా కలిగిన సందేహం.

మరి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పట్ల  ఈ ‘చూపుల్లో’ తేడాను ఏ కంటిడాక్టరు  సరిచేయాలి చెప్మా!

16-04-2024

16, ఏప్రిల్ 2024, మంగళవారం

ఎవరీ సాయి పద్మగారు - భండారు శ్రీనివాసరావు

 రాత్రి పొద్దుపోయిన తర్వాత Sujatha Velpuri గారి పోస్టు చూశాను. అందులో ఒక వాక్యం నన్ను రాత్రంతా నిద్ర పోకుండా చేసింది. అదే ఇది.

“వెళ్ళిరండి పద్మా! నొప్పి, బాధ, మోసం, దుర్మార్గం లేని ప్రపంచంలోకి, వీల్ చైర్ విసిరేసి స్వేచ్ఛగా పరిగెత్తండి”

అప్పుడు మొదలయిన ఆలోచనలు రాత్రంతా నిద్ర లేకుండా చేసాయి.

ఎవరీ పద్మ? ఫేస్ బుక్ మొత్తం మితృలు పంచుకుంటున్న పద్మగారి జ్ఞాపకాలతో నిండిపోతోంది. ఎందుకు ఇలా అందరూ అర్ధరాత్రి వేళ మౌనంగా రోదిస్తున్నారు? ఒకళ్ళా ఇద్దరా వందలమంది ఆమె గురించి రాస్తూనే వున్నారు. నేను ఆవిడ గారి గురించి ఆలోచిస్తూనే వున్నాను.  నాకున్న రెండువేల పై చిలుకు మిత్ర బృందంలో ఈ సాయి పద్మ గారి పేరెందుకు లేదు? ఇంత గొప్ప మనిషి ఇంతకాలం నాకు తెలియకుండా ఎందుకు వుండిపోయారు. పద్మగారిని తెలిసిన వారు, కేవలం ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తెలుసుకున్న వారు, వారూ వీరని లేకుండా ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు అంటే ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అయి వుండాలి.

చివరికి ఆమె గురించి తెలుసుకునేసరికి దాదాపు తెల్లవారింది. అదీ పద్మగారు స్వయంగా రాసుకున్న ఒక పోస్టు ద్వారానే.  పద్మగారు రాసుకున్న అమ్మ కధల ద్వారానే.

నా కంటపడ్డ ఆ పోస్టులో పద్మగారు ఇలా రాసుకున్నారు.

దేవుడు అంత చక్కటి మొహం అందం ఇచ్చి ఇంత లోపం పెట్టడం ఎందుకు కనీసం ఒక కాలు అన్నా నడిచేందుకు వీలుగా ఉంటే బాగుండు.... నా మొదటి సారి ఆపరేషన్ అప్పుడు అనుకుంటా అమ్మ అమ్మమ్మతో అన్నమాటలు.. ఆపరేషన్ థియేటర్ బయట ఇంకా నాకు మత్తు వీడలేదు బహుశా ఆరు ఏడేళ్లు ఉంటాయేమో

ఆ కొంచెం అన్న అవకరం ఎందుకు ఉండాలి? ఏంటో అంటూ నిట్టూర్చిన అమ్మమ్మ మాటలు. సరే ఓహో నేను అందంగా ఉంటానా అని గొప్పగా ఫీల్ అయ్యాను రెండు కాళ్లు తొడల నుంచి పాదం చివర దాకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో ఉన్నా కూడా..

అది మార్చి నెల పదో తారీకు. నా పుట్టినరోజు నాడు కూడా ఒక ఆపరేషన్ చేయించారు. బహుశా నాకు గుర్తుండి అది మొదటి ఆపరేషన్.. అంతకు ముందు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్లు అలాంటివి పెద్దగా గుర్తు లేవు.

అప్పటికి రెండు పాదాలు పూర్తిగా వాలిపోయి ఉండేవి నడుము పట్టుకుని లేవదీస్తే పాదాలు మెలి పడిపోయేవి. టెండన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటి సర్జరీ ఏదో చేశారు. ఎడమ కాలు ఫీమర్ బోన్ బోన్ కట్ చేసి పాదం వాలిపోకుండా ఏడు ముక్కలుగా పాదం చుట్టూ బోన్ కి జత చేశారంట.

డాక్టర్ కైలాస రావు గారు, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారి నేతృత్వం లో విశాఖపట్నం అమెరికన్ హాస్పిటల్లో చేశారు.

తను పుట్టినరోజు కదా ఒక రెండు రోజులు ఆగొచ్చు కదా అని అమ్మ అన్నదని తర్వాత మళ్లీ డాక్టర్లు దొరకరు బోన్ ముదిరిపోతే పాదం మళ్ళీ హీల్ అవ్వదు అని నాన్నగారు పట్టుదలగా చేయించారు అని తర్వాత తెలిసింది.

ఆ సంవత్సరం సుమారు ఐదు నెలలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో మంచం మీదే ఉన్నాను. విశాఖపట్నం విజయనగరం ఇలాంటి ప్రదేశాల్లో పీక్ సమ్మర్ భయంకరంగా ఉంటుంది. సర్జరీ చేయించుకోవడానికి ఒకసారి మళ్లీ కుట్లు విప్పించుకోడానికి ఒకసారి అమెరికన్ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆ కట్లు కట్టించుకొని విపరీతమైన దురద, చమట నొప్పి బాధ ఎలా అనుభవించాను అన్నది ఈరోజున నాకు ఊహకి కూడా అందదు.

షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏది దొరికిన ఆ ప్లాస్టర్ లోకి నెమ్మదిగా దూర్పి గోక్కునేదాన్ని.అందుకని అమ్మ అమ్మమ్మ పిన్ని నాకు బలమైన ఆయుధాలు ఏవి దగ్గరలో ఉంచేవారు కాదు. ప్లాస్టిక్ స్కేలు, పళ్ళు ఊడిపోయిన దువ్వెన, గట్టిగా వున్న చీపురు పుల్లలు ఇవి నా ఆయుధాలు.

అప్పట్లో సూచర్స్ బొంత కుట్లు లాగా కుట్టేవారు. ఫీల్ అవ్వడానికి నెలలు పట్టేది మధ్యలో మనం ఇలా గోక్కోవడం వల్ల లేదా చెమట పట్టి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయేవి. బోన్ ఇన్ఫెక్షన్స్, టిష్యూ ఇన్ఫెక్షన్స్ పరమ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఆర్థోపెడిక్ అంటేనే ఎంతకీ హీల్ అవ్వదు అని అర్థం అలాంటిది పాదం చుట్టూ బోన్స్ అమర్చి అన్ని కుట్లు వేస్తే నేను ఒక బొంతలా ఉండేదాన్ని.

సమ్మర్ స్నానం చేయకుండా ఉండలేను అని ఏడిస్తే అమ్మమ్మ కార్పెంటర్ నీ పిలిపించి ఒక కుర్చీ చేయించింది. దానికి మధ్యలో ఒక ప్లేట్ లా కట్ చేసి పెట్టుకొని తీసేటట్టు అదే స్నానానికి బాత్రూం కి.

తొడల దగ్గర నుండీ పాదం చివరి దాకా కట్లతొ స్నానం ఒక గోల గా ఉండేది. అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాబట్టి, కాస్త తడి తగిలినా మెత్తబడి పోయేది. అమ్మమ్మ చాలా తెలివిగా నా ఎత్తులకు పై ఎత్తులు వేసేది ఒక వడియాలు పెట్టుకునే పెద్ద ప్లాస్టిక్ కవర్ తెప్పించి దాన్ని చేసి పూర్తిగా తొడిగేది స్టిక్కర్ టేప్ లాగా దాన్ని ఫుల్ గా అతికించేది. ఏంటీ కష్టంగా ఉందా అని అడిగేది..అవును అమ్మమ్మా అంటే.. పర్లేదు అలవాటు అయిపోతుంది అనేది.

ఇదంతా దేనికి అంటే నీ పని మాత్రం నువ్వే చేసుకోవాలి అది ఎంత కష్టమైనా బయట నుంచి సహాయం మాత్రమే తీసుకో అనేది.

చాలా సర్జరీలు అయిపోయిన తర్వాత కుట్లు విప్పడం మాత్రం నాన్నగారు అమ్మ చేసేవారు. ఫలానా రోజు కుట్లు విప్పుతారంటే భయానికి నాకు జ్వరం వచ్చేది. దాని బాధ చూడలేను అదేదో మీరే చేసేయండి అని అమ్మ అనేది, అయినా తప్పకుండా బెటాడిన్ టించర్ పట్టుకొని నిల్చునేది.

ఈ సర్జరీలలో నాకు రిలీఫ్ వేసవి సెలవులకు వచ్చి మా కజిన్స్ అందరూ. వాళ్ళందరూ ఆడుకుంటుంటే డాబా మీద నేనా పక్కనే కూర్చునే దాన్ని. వాళ్లు నన్ను మోయలేక మా తమ్ముళ్లు గోపి బుజ్జి రెండు కాళ్లు ఇద్దరు మోసేవారు, మా అక్కలు వెనకాల నుంచి పట్టుకుని వాళ్లే స్త్రెచర్ లాగా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను మోసుకొని పోయేవారు. మా డాబా మధ్యలో మెట్లు ఉండేవి దాని చుట్టూ ఒక గూడు లాగా సిమెంట్ తో కట్టిన కట్టడం ఉండేది,పక్కనే పెద్ద సిమెంట్ నీళ్ల ట్యాంక్ ఉండేది. అక్కడ నీడగా ఉండేది. ఒక చాప వేసేసి నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. పక్కనే అమ్మమ్మ చేసిన జంతికలు చేగోడీలు. నా పని ఏంటంటే వాళ్ళు ఆడుకుంటుంటే పాయింట్స్ లెక్కపెట్టడం. ఎవరికైనా ఆడడం బోర్ కొడితే వాళ్ళు వచ్చి నాతో బ్యాంకాట గాని చైనీస్ చక్కర్ గానీ ఆడేవారు. వాళ్ళ ఆడుకుంటుంటే నేను అలా చూస్తూ కూర్చోవడం నాకు అప్పుడప్పుడు తిక్క వచ్చేసేది. ఒకసారి అమ్మమ్మ తో నేను డాబా మీదకి వెళ్ళను అంటే.. ఒకసారి కుట్లు అల్లికలు మరోసారి పుస్తకాలు. శివరాత్రి నా పుట్టినరోజు చాలాసార్లు దగ్గరలో ఉండేవి ఒకసారి అపూర్వ సహస్ర శిరచ్చేద చింతామణి పుస్తకాలు అన్ని భాగాలు, మరో పుట్టినరోజు నాడు మొగలాయి చరిత్ర అన్ని భాగాలు చదివేసిన గుర్తు.

ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టలో ఉన్నప్పుడు పొద్దున్నే నూనె రాసి కనీసం స్నానం కూడా చేయించలేకపోయాను ఏమిటో దీనికి కష్టం అంటూ అమ్మమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం అమ్మ మొహం తిప్పుకుంటూ వెళ్ళటం కూడా గుర్తు.

స్థలాలు కాలాలు మారుతాయి అన్నిటికంటే విచిత్రంగా మనుషులు మారుతారు వాళ్ల చుట్టూ ఆహాలు పంతాలు.. నార్శిసిజం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లాంటి ఎన్నో పేరుకుంటాయి.

అమ్మమ్మ అనేది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నీకు తగిలిన నొప్పులు బాధలు మంచి జ్ఞాపకాలుగా తలచుకొని నవ్వుకునేంత అని.

ఇందులో నవ్వుకోడానికి ఏముంది అమ్మమ్మ నా బొంద అనేదాన్ని..!

కానీ నిజమే.. ఇవాళ కుట్లు విప్పుతారు అంట అంటూ నిద్ర లేచాను. ఏదైనా చేసేయగలవు అనే అమ్మమ్మ, దీన్ని బంగాళా ఖాతంలో పడేసినా ఈదుకొని వచ్చేస్తుంది అనే తమ్ముడు, దాని మైండ్ బానే వుంది కదా శేషు బాధపడకు అనే నాన్నగారూ, మాట్లాడని మల్లె మొగ్గ మా అమ్మ ఎవరూ లేరు కుట్లు విప్పటానికి...!!

కొన్ని జ్వరాలు బావుంటాయి

ITS HARD TO TURN THE PAGE WHEN YOU KNOW SOMEONE WON'T BE IN THE NEXT CHAPTER, BUT THE STORY MUST GO ON.


(కీర్తిశేషులు సాయి పద్మ గారు)


 

దైన్యం తెలియని మనిషి, ధైర్యం ఒక్కటే తెలిసిన మనిషి పద్మగారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?

 

(16-04-2024)

8, ఏప్రిల్ 2024, సోమవారం

సర్వే పంచాంగాలు – భండారు శ్రీనివాసరావు

 రేపే, అంటే ఏప్రిల్ తొమ్మిది శ్రీ క్రోధి ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు.  

ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం.

మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు పంచాంగకర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో, చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే ప్రెస్సులో ముద్రించేవారు. (ఇలాంటి ఓ ముద్రణాలయం తెనాలిలో ఉండేదని జ్ఞాపకం)  ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి పంచాంగాల ముద్రణకు ద్రవ్యసాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి అందుకు ప్రతిఫలంగా తృణమో ఫణమో స్వీకరించేవారు. పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా గుర్తు, సత్యనారాయణ సిద్ధాంతిగారు అస్తమానం గాలిలో చేతులు ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లదో లోకం.

తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక తెలుగు ఛానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతొ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుండడం  ఒక ఆనవాయితీగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా  తన కార్యాలయంలో ఒక సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని, తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతూ వుండడం కూడా కొత్తేమీ కాదు. నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో  గుళ్ళల్లో జరిగే పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు. టెక్నాలజీ వినియోగం తక్కువగా వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే ఆసక్తి వుండేది. ఈ ఏడాది వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం విభేదించడానికి కాని వీలులేదు.

కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని పండితుల చేత నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.

ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో. మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్రపాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి ముక్కలతో ప్రారంభమై ఇప్పడు పొగడ్తల అగడ్తలలో కూరుకుపోతున్నాయి. పేరున్న సినిమానటి ‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నట్టు, ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలుపడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు పోగొట్టుకుంటున్నాయి. ‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.

తోకటపా:

పంచాంగపఠనం అనాలా, పంచాంగ శ్రవణం అనాలా అనే విషయం పక్కనపెడితే, అసలే ఎన్నికల సమయం, మరి రాజకీయ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఎన్నికల నియమావళి కిందికి వస్తాయా లేదా అనేది మరో సందేహం.

08-04-2024  

 

 

5, ఏప్రిల్ 2024, శుక్రవారం

శాంతి స్వరూప్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 “ఏంటి శాంతీ ఏమిటి కబుర్లు”

నా మాటలు విని నాతొ ఫోన్లో మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎవరో ఆడపిల్ల అనుకునే వారు నా పక్కన వున్నవాళ్ళు. పలానా అని చెప్పగానే, నిజమా మీకు శాంతి స్వరూప్ అంత బాగా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగేవారు అతడో  సెలెబ్రిటి అన్నట్టుగా. ఇలాంటి రెండు మూడు అనుభవాల తర్వాత కానీ, శాంతి స్వరూప్ స్పెషల్ స్టేటస్  నాకు అవగతం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అలా జనంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నలభయ్ ఏళ్ళ క్రితం మొదలైన దూరదర్సన్ తెలుగు వార్తా ప్రసారాల్లో తొలి తెలుగు బులెటిన్ చదివిన న్యూస్ రీడర్ కావడం ఒక కారణం అయితే,  ఆయన వార్తలు చదివే తీరులోని విలక్షణత్వం మరో కారణం. మీదు మిక్కిలి ఆయన ధారణ శక్తి అమోఘం. పది నిమిషాల వార్తలని కాగితాలు చూడకుండా ఏకధాటిగా  చదివేసేవాడు, టెలి ప్రాంప్టర్లు లేని ఆ కాలం లోనే. దూరదర్సన్ అనగానే శాంతి స్వరూప్ అని గుర్తు చేసుకునే మంచి పేరు సంపాదించుకొన్నాడు.

నా కంటే ఆరేళ్లు చిన్న. మొన్న గుండెపోటు అన్నారు. ఆసుపత్రిలో చేర్చారు అన్నారు. ఈ ఉదయం లేడు, దాటిపోయాడు  అన్నారు.

ఏమిటో ఈ జీవితాలు.

ఓం శాంతి!


(సదా మందహాసి శాంతి స్వరూప్)5-4-2024