14, జులై 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో (194 ) : భండారు శ్రీనివాసరావు
కోట జీవితానికి తెర పడింది - భండారు శ్రీనివాస రావు
13, జులై 2025, ఆదివారం
అయాం ఎ బిగ్ జీరో (193) : భండారు శ్రీనివాసరావు
11, జులై 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో (192) : భండారు శ్రీనివాసరావు
మరణమా! జీవన్మరణమా!
నిన్న వాల్
మార్ట్ కు వెళ్ళినప్పుడు ఒక వృద్ధ వనిత ట్రాలీ తోసుకుంటూ బయటకు వస్తూ కనిపించింది. ముడుతలు పడ్డ శరీరం,
నడుం వంగిపోయి వుంది. ఖచ్చితంగా ఆమె వయసు తొంభయ్ దాటి వుండాలి.
అయితే భిక్షువర్షీయసి గేయంలో శ్రీశ్రీ రాసినట్టు
‘ముగ్గుబుట్టవంటి తలా,
ముడుతలు తేరిన దేహం,
కాంతిలేని గాజుకళ్లు,
తన కన్నా శవం నయం’ అన్నంత దయనీయంగా లేదు.
పైపెచ్చు ఆమె కళ్ళల్లో కాంతి తగ్గలేదు.
సామాన్లు వేసుకున్న ట్రాలీని తోసే విషయంలో
శరీర పాటవం సరిపోక అవస్థ పడుతున్నదే కానీ, ఎవరి సాయం అక్కరలేదనే ధీమా ఆమె కళ్ళల్లో స్ఫుటంగా
కనబడుతోంది. నిర్గమన ద్వారానికి దగ్గరలో వృద్ధులకు రిజర్వ్ చేసిన చోట పార్క్ చేసి వుంచిన
కారులో సామాను వేసుకుని చూస్తుండగానే, వాహనం నడుపుకుంటూ, ‘నా బతుకు నేను బతకగలను’
అన్నట్టు ధీమాగా వెళ్ళిపోయింది. ఇంతటి
ధీమంతం ఆ వృద్ధురాలికి ఎవరు ఇచ్చారు? ఏ వ్యవస్థ ఇచ్చింది?
ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు. ఒకరిపై
ఆధారపడకుండా బతకగలమా! ఇది సాధ్యమా! కాళ్ళూ చేతులూ సరిగా వున్నప్పుడే, మంచాన
పడకముందే, ‘ఇదిగో
నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అని చెప్పినంత సులభంగా, హుందాగా మరణించడం
అయ్యేపనేనా!
పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా, ఒక
వయసు వచ్చిన తర్వాత చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన
తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంత తత్వం
మరింత పెరుగుతూ వుంటుంది. మన దగ్గర చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ
చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న
సందర్భాలలో కూడా, తమ మరణం హుందాగా ఉండాలనే ప్రతి మనిషి ఆలోచిస్తూ వుంటారనడానికి చరిత్రలో
అనేక రుజువులు వున్నాయి. యావత్ ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని
విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా
పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన
తరువాత కూడా తన శరీరం రంగు మారి, అందం చెడకుండా వుండే విషం కోసం అన్వేషించి,
ఒక రకం సర్పాన్ని అందుకోసం ఎంపిక చేసుకుంటుంది. చక్కగా
అలంకరించుకుని, శయ్యాగతురాలై, ఆ
విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.
పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం
కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా
చిల్లులు పడి, అంపశయ్య
మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి
ఇచ్చిన స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ
భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం అందరికీ దక్కదు.
‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు.
హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి
బతుక్కు వేరే సార్ధకత వుండదు.
‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం.
పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి
ప్రశ్న.
ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా
ప్రతి ఒక్కరూ మరణ భీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.
జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో
దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు మనిషిని వెంటాడి
వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని
అనుకుంటారు. కోరుకుంటారు.
‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే
ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు కావాలి. శతమానం భవతి అంటూ
నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే
బాల్య, కౌమారాది
నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల
ద్వారా బలవన్మరణాలు తగవనీ పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని
నిర్ధారణ చేసి, దాన్ని
నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.
ఈ నేపధ్యంలోనే కారుణ్య మరణాల అంశం తెర మీదకు
వచ్చింది.
ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య
మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం.
ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు
వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే
ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.
మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి
ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు కారుణ్య మరణం అనేది ఉపశమనం కలిగించే విషయమే.
అలాగే, వయోభారంతో
మంచానికి బందీగా మారి కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు
లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే
వారి సంతానానికి సయితం ఈ ఏర్పాటు ఒక విముక్తి
మార్గంగా కనిపించవచ్చు.
ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా
గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా
బాగున్నప్పుడు, జీవితంలో
ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా
కన్నుమూయడం ఎందరికి సాధ్యం. ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు
తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది గొంతెమ్మ
కోరికే.
ఇవన్నీ ఆలోచించడానికి ముందు, ముందు
చెప్పిన ముసలావిడను గమనంలో వుంచుకోవడం మంచిది. బతుకు మీది తీపి చావకుండా ఎలా జీవనం
సాగిస్తున్నదో తెలుసుకోవడం మంచిది. అలాంటి ధీమాను ఎలాంటి వ్యవస్థ హామీ ఇస్తున్నదో
దాన్ని కోరుకోవడం మరీ మంచిది.
ఉపశృతి: మా దూరపు చుట్టం ఒకరు జీవితంలో అన్ని
బాధ్యతలు నెరవేర్చుకున్నారు. పిల్లల చదువులు, పెండ్లి పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు
అన్నీ ఒక పద్దతిగా పూర్తి చేసుకున్నారు. పిల్లలు, మనుమళ్ళు కళకళలాడుతూ నట్టింట
తిరుగుతూ వున్నవేళ, ఒక
రోజు భార్యాబిడ్డలతో తీరి కూర్చుని కబుర్లు చెబుతూ, చెబుతూ
హఠాత్తుగా ఒక పక్కకి ఒరిగిపోయారు. అంతే. ఒక క్షణం ముందు వరకు ఆయన ప్రాణం
వున్న మనిషి, మరుక్షణం
విగత జీవి. అంతవరకూ నవ్వుతూ కబుర్లు చెప్పారు. పిల్లలు చెప్పినవి నవ్వుతూ
విన్నారు. అలా ఆయన జీవనయానం హాయిగా, ప్రశాంతంగా ముగిసింది. కోటికొక్కరికి కూడా
లభించని అరుదయిన అవకాశం.
చావు ఒక ముగింపు కావచ్చు,
పరిష్కారం మాత్రం కాదు.
కింది ఫోటో: Courtesy
Google
(ఇంకావుంది)
11-07-2025
10, జులై 2025, గురువారం
అయాం ఎ బిగ్ జీరో ( 191 ) : భండారు శ్రీనివాసరావు

9, జులై 2025, బుధవారం
జులై తొమ్మిది
దేవుడికి తెలియదా తనకు దగ్గరి వారెవ్వరో! అందుకే తన దాపున వున్న మీ ఇద్దరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు.
8, జులై 2025, మంగళవారం
నెత్తినే వుంది గంగమ్మ – భండారు శ్రీనివాసరావు
శివ రాచర్ల గారితో ఓ పదిహేనేళ్ల క్రితమే పరిచయం అయివుంటే బాగుండేదని మరో పాతికేళ్ళ తర్వాత కూడా అనుకుంటాను. వచ్చే నెలలో ఎనభయ్యవ పడిలో పడతాను కనుక నాకా అదృష్టం ఉండకపోవచ్చు.
పిలిచిన
ప్రతి ఛానల్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చే రోజుల్లో, ఒకరోజు ఆయన ఒక స్టుడియోలో పరిచయం అయ్యారు. తర్వాత
కూడా కొన్నిసార్లు కలిశాము. నాదీ స్నేహ స్వభావమే కానీ పేర్లు, మొహాలు చప్పున గుర్తు రావు. అంచేత
మధ్యలో ఎవరో మళ్ళీ పరిచయం చేయడం, నేను
శివగారు నాకెందుకు తెలియదు అన్నట్టు కప్పి పుచ్చుకోవడం వారికి అర్ధం అయ్యే
వుంటుంది. అయితే తర్వాతి రోజుల్లో నా
మతిమరపు తత్వాన్ని ఆయన అర్ధం చేసుకున్నారు అనే అనుకుంటున్నాను. లేకపోతే, నన్నో పొగరుమోతుగా
భావించి, మధ్యమధ్యలో ఫోన్ చేసి మాట్లాడేవారు కాదు.
ఇక ఆయన
సంగతి చెప్పాలంటే ఒక నడిచే ఎన్సైక్లో
పీడియా. చేయి తిరిగిన జర్నలిస్టుల దగ్గర కూడా లేనంత రాజకీయ సమాచారం శివ గారి దగ్గర
వుంది. ఇక ఇరిగేషన్ రంగంలో ఆయన పరిజ్ఞానం అపూర్వం. ఇవ్వాళ ఎవరో పోస్టు పెడితే అదే
కామెంటు పెట్టాను,
శివుడి నెత్తి మీదే గంగ వుంది, ఇక
నదుల గురించి ఆయనకు మనం చెప్పాలా అని.
ఆయన
గురించి అనేకమంది కామన్ మితృలు రాసిన పోస్టులు అమెరికాలో తీరి కూర్చుని చదివాను .
శివగారిలో నాకు తెలియని అద్భుత కోణాలను పరమాద్భుతంగా ఆవిష్కరించారు. వారందరికీ
నా ధన్యవాదాలు.
ఇక
ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారా! ఈ ఒక్కరోజే ఎందుకు? వారికి నా తరపున ప్రతిరోజూ, ప్రతి
ఉదయం వుంటాయి.
మరో
ముక్కతో ఈ పోస్టు ముగిస్తాను.
కిందటి
నెలలో నా అమెరికా ప్రయాణం.
ఓరోజు పొద్దున్నే
శివగారి నుంచి ఫోను. పదిన్నరకు వస్తాను అన్నారు. అన్నట్టే వచ్చారు.
ఇలా నా
అంతట నేనుగా మిత్రులను వెళ్లి కలిసే రోజు
ఎప్పుడు వస్తుంది? రాదని తెలుసు. ఎందుకంటే
నేనో సీతయ్యను.
Many many happy returns of the day Siva Racharla garu
7, జులై 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో (190) : భండారు శ్రీనివాసరావు
నాకు సముద్రం అంటే వల్లమాలిన ప్రేమ. తీరంలో కూర్చుని ముందుకు వెనక్కి వెళ్ళే అలలు చూస్తూ, సముద్రపు హోరు వింటూ గంటలు గంటలు గడపాలని అనిపిస్తుంది. కానీ నా చదువు సంధ్యలు సాగిన విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, ఉద్యోగాలు వెలగబెట్టిన హైదరాబాదు, మాస్కోలలో కానీ ఎక్కడా సముద్రం లేదు. పెద్దయ్యేవరకు సినిమాల్లో చూసి సంతోషించడమే.
అలాంటిది 2025 జులై ఆరో తేదీ, ఒకే రోజున ఒకే సముద్రంతో, అదీ ప్రపంచంలో అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రంతో మూడు చోట్ల ములాఖత్తులు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని రాత్రి డిన్నర్ వరకూ పసిఫిక్ తీరాల్లోనే గడిపాము. కేనన్ బీచ్, హగ్ పాయింట్ బీచ్, షార్ట్ శాండ్ బీచ్ ఈ సముద్రానికి సంబంధించి అరెగాన్ రాష్ట్రంలో మూడు ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు. లాంగ్ వీకెండ్ కావడంతో జనం పోటెత్తారు. ఫలితం రహదారులపై వాహనాల వరద. కారు పార్కింగ్ కోసం వెతుకులాట. చాలా సమయం కృష్ణార్పణం.
హగ్ పాయింట్
వున్నవూరు వాడికి వల్లకాడు భయం, పొరుగూరువాడికి ఏటి భయం అనేది మా బామ్మగారు.
వున్న ఊరు వాడికి ఏటి భయం వుండదు. ఏట్లో ఎంత వరద పారుతోందో, ఎక్కడ సుడిగుండాలు వున్నాయో ఈ వివరాలు తెలుసు కనుక భయం లేకుండా ఏరు దాటేస్తాడు. అదే స్మశానం అంటే జంకుతాడు. పొరుగూరు వాడికి అంటే పరదేశికి ఏటిలో ఎక్కడ ఎంత లోతు ఉన్నదో అని భయపడి ఏరు దాటడానికి భయపడతాడు. వల్లకాడు అని తెలియదు కాబట్టి నిక్షేపంగా అందులో నడిచి వెడతాడు.
హగ్ పాయింట్ బీచ్ లో నా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో విలాసంగా కూర్చుని ఎదురుగా కనబడుతున్న అనంత జలరాశిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న సమయంలో, మూడు నాలుగేళ్ల కుర్రాడు ఒకడు సముద్రం ఎదురుగా వెడుతూ కనిపించాడు. చుట్టుపక్కల చూస్తే అతడి తాలూకు వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అరెరే అనుకుంటుంటే ‘భయపడకండి ఇక్కడి వాళ్లకు ఇవన్నీ మామూలే’ అన్నట్టు మా వాళ్ళు కళ్ళతోనే వారించారు. ఆ పిల్లాడు కూడా సముద్రంలో దిగి అలలతో ఆడుకుంటున్నాడు. ముందుకు పోవడం, ఎగిసే కెరటాలతో పాటు వెనక్కి రావడం. కాసేపటి తర్వాత ముందు పరిగెత్తుతున్న ఓ కుక్క, దాని వెనుకనే పరిగెత్తుకుంటూ అతడి తలితండ్రులు కాబోలు, పిల్లాడికంటే అదే ఎక్కువ అన్నట్టు కనిపించారు.
మా చిన్నప్పుడు మా ఊళ్ళో కొందరు నా దోస్తులు లోతయిన దిగుడుబావిలోకి పైనుంచిదూకేవారు. వాళ్ళ పెద్దవాళ్లు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. మోచేతులు, మోకాళ్లు చీరుకుపోయినా తేలిగ్గా తీసుకునే వారు. జీవితంలో ఢక్కా మొక్కీలు తినాలంటే ఇవన్నీ తప్పవు అన్నట్టు వుండేది వాళ్ళ వ్యవహారం.
పసిఫిక్ తీరంలో ఇసుక కూడా సాయంత్రపు సూర్య కాంతికి మిలమిలా మెరుస్తోంది. నాలుగుసార్లు మర పట్టించిన బియ్యపు తవుడులా ఎంతో మెత్తగా వుంది. ఈ బీచ్ లోకి వెళ్ళాలి అంటే పైన కార్లు ఆపుకుని కాలినడకన దాదాపు ఓ కిలోమీటరు కొండ దిగి వెళ్ళాలి. ఆ కొండదారికి ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు. నడుమ సెలయేళ్ళు. వాటి మీద కర్ర వంతెనలు. ఆ కాలిబాటలో నడిచేవాళ్ళు ఒక నిబంధన పాటించడం గమనించాను. దిగేవాళ్ళు కుడివైపుగా దిగుతుంటే, పైకి వచ్చేవాళ్ళు ఎడమవైపుగా ఎక్కుతున్నారు.
ఆ చెట్లని చూస్తుంటే ఇవి కూడా పసిఫిక్ సముద్రంతో పాటే పెరిగాయా అన్నట్టు కొన్ని గజాల చుట్టుకొలతతో, మెడలు రిక్కించి చూడాల్సిన ఎత్తులో వున్నాయి. గొడ్డలి వేటు అంటే ఏమిటో తెలియనట్టుగా పెరుగుతున్నాయి. పెనుగాలులు వీచినప్పుడు కూకటి వేళ్ళతో కూలిన పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అది అలాగే పడివుంది. దాని కాండం మీద మరికొన్ని చెట్లు పెరుగుతున్నాయి.
ఆ కిలోమీటరు నడవడానికి నా ఒళ్ళు నాకే బరువనిపించి ఆయాసపడుతుంటే, ఆడా మగా తేడా లేకుండా చాలామంది బరువైన సర్ఫింగ్ బోట్లు పట్టుకుని చులాగ్గా నడిచి వెడుతున్నారు. రోజంతా బీచిలో, సముద్రంలో గడపడానికి తమవెంట తెచ్చుకున్న టెంట్లు, కుర్చీలు, తిండి పదార్ధాలు ఈ బరువుకి అదనం. బీచిలోకి అడుగు పెట్టగానే దుస్తులు తీసేసి, ఈత దుస్తుల్లోకి మారిపోయి సర్ఫింగ్ బోట్లు తీసుకుని, నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ సర్ఫింగ్ చేయడం వాళ్ళకో ఆట మాదిరిగా వుంది.
రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వెలుతురు తగ్గలేదు. నీరెండలో నా నీడ పొడవు రెండింతలు సాగింది. సముద్రం మీద నుంచి వీస్తున్న బలమైన గాలులకు వాతావరణం బాగా చల్లబడింది. ఆ చలి గాలి తగలకుండా నన్ను రెండు గుట్టల నడుమ కూర్చోబెట్టారు. కోడలు భావన ముందుగా సిద్ధం చేసి తీసుకువచ్చిన పులిహార పెరుగన్నం తింటూ మెత్తటి ఇసుకపై మా చిన్న మనుమరాలి పేరు తెలుగులో రాశాను. అదోతుత్తి. అంతే!
కేనన్ బీచ్ లో, సముద్ర జలాల మధ్య వుండే హే క్ కొండని చూడడానికి వెళ్ళాము. విపరీతమైన రద్దీ. పెయిడ్ పార్కింగ్ కోసం అరగంట వెతికినా దొరకలేదు. పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు దీన్ని దగ్గర నుంచి చూశాము. అప్పుడు సముద్రం బాగా వెనక్కి పోయింది. దానితో కొండ తీరంలోకి వచ్చింది. చుట్టూ నీళ్ళ మధ్య వుండే ఈ కొండను పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేశారు.
కేనన్ బీచ్ కి వెళ్లే దోవలో అడవి మలుపులో అడవి దుప్పి ఒకటి కనిపించింది. చాలా బలిష్టంగా వుంది. అడవి జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కానీ, అడవిలో దొరికే ఆహారం తప్పిస్తే, వాటికి వేరే ఆహారం అందించడం కానీ వీల్లేదు. ‘మీరు అడవి జంతువుల ఆవాసాల్లోకి అతిధులుగా వచ్చారు. అలాగే వెళ్లిపోండి’ అనే బోర్డులు కొన్ని చోట్ల కనిపించాయి.
ఇలాంటిదే ఒకటి అమెరికా కెనడా సరిహద్దులో చూశాను.
‘పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటికి ఇబ్బంది కలిగించకండి’ అని బోర్డు పెట్టారు.
పోర్ట్ లాండ్ లో నాలుగు రోజులు గడిపి ఈ ఉదయం సియాటిల్ తిరిగివస్తూ మధ్యలో వాషింగ్టన్ రాష్ట్ర రాజధాని అయిన ఒలింపియాలో కాసేపు ఆగి అసెంబ్లీ భవనం, సుప్రీం కోర్టు (టెంపుల్ ఆఫ్ జస్టిస్) భవనాలను చూశాము. ఈరోజు ఆదివారం అనే కాకుండా చూడాలనుకునే వారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నిషేధాలు లేవు. అనుమతి పత్రాలు అక్కరలేదు. సెక్యూరిటీ తనిఖీలు లేవు. అసలు పోలీసులే లేరు. పైగా ఒక గైడ్ ని పెట్టి భవన విశేషాలను వివరిస్తారు. స్వేచ్ఛగా ఫోటోలు తీసుకోవచ్చు. చాలా పెద్ద భవనం. అనేక మెట్లు ఎక్కి వెళ్ళాలి. భవన నిర్మాణ శైలి అద్భుతంగా వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల స్మారక స్థూపం ఆ ఆవరణలో వుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా చట్ట సభల్లో శాసనాలు చేస్తారు. ఆ భవనంలో పౌరుల ప్రవేశానికి అభ్యంతరాలు ఎందుకు? ఆంక్షలు ఎందుకు అనే ప్రశ్నలకు తావు లేకుండా చేశారు.
కింది ఫోటోలు: అరెగాన్ రాష్టంలో పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో విహారం
(ఇంకా వుంది)