11, జులై 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (192) : భండారు శ్రీనివాసరావు

 మరణమా! జీవన్మరణమా!

నిన్న  వాల్ మార్ట్ కు వెళ్ళినప్పుడు ఒక వృద్ధ వనిత ట్రాలీ తోసుకుంటూ  బయటకు వస్తూ కనిపించింది. ముడుతలు పడ్డ శరీరం, నడుం వంగిపోయి వుంది. ఖచ్చితంగా ఆమె వయసు తొంభయ్ దాటి వుండాలి.

అయితే భిక్షువర్షీయసి గేయంలో శ్రీశ్రీ రాసినట్టు

‘ముగ్గుబుట్టవంటి తలా,

ముడుతలు తేరిన దేహం,

కాంతిలేని గాజుకళ్లు,

తన కన్నా శవం నయం’ అన్నంత దయనీయంగా లేదు. పైపెచ్చు  ఆమె కళ్ళల్లో కాంతి తగ్గలేదు. సామాన్లు వేసుకున్న ట్రాలీని  తోసే విషయంలో శరీర పాటవం సరిపోక అవస్థ పడుతున్నదే కానీ, ఎవరి సాయం అక్కరలేదనే ధీమా ఆమె కళ్ళల్లో స్ఫుటంగా కనబడుతోంది. నిర్గమన ద్వారానికి దగ్గరలో వృద్ధులకు రిజర్వ్ చేసిన చోట పార్క్ చేసి వుంచిన కారులో సామాను వేసుకుని చూస్తుండగానే, వాహనం నడుపుకుంటూ, ‘నా బతుకు నేను బతకగలను’ అన్నట్టు ధీమాగా  వెళ్ళిపోయింది. ఇంతటి ధీమంతం ఆ వృద్ధురాలికి ఎవరు ఇచ్చారు? ఏ వ్యవస్థ ఇచ్చింది?

ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు. ఒకరిపై ఆధారపడకుండా బతకగలమా! ఇది సాధ్యమా! కాళ్ళూ చేతులూ సరిగా వున్నప్పుడే, మంచాన పడకముందే, ‘ఇదిగో నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అని చెప్పినంత సులభంగా, హుందాగా మరణించడం అయ్యేపనేనా!  

పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా, ఒక వయసు వచ్చిన తర్వాత చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంత తత్వం మరింత పెరుగుతూ వుంటుంది. మన దగ్గర  చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా, తమ మరణం హుందాగా ఉండాలనే ప్రతి మనిషి ఆలోచిస్తూ వుంటారనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్  ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారి, అందం చెడకుండా వుండే  విషం కోసం అన్వేషించి,  ఒక రకం సర్పాన్ని అందుకోసం  ఎంపిక చేసుకుంటుంది.  చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై,  ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.

పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన  స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ  భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం  అందరికీ దక్కదు.     

 

‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.

‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.

ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణ భీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.

జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు  మనిషిని  వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.

‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే  ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు  కావాలి. శతమానం భవతి అంటూ  నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ  పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.  

ఈ నేపధ్యంలోనే కారుణ్య మరణాల అంశం తెర మీదకు వచ్చింది.

ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.

మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు  కారుణ్య మరణం అనేది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో  మంచానికి బందీగా మారి  కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ  ఏర్పాటు ఒక విముక్తి మార్గంగా  కనిపించవచ్చు.

ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం.  ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది   గొంతెమ్మ కోరికే.

ఇవన్నీ ఆలోచించడానికి ముందు, ముందు చెప్పిన ముసలావిడను గమనంలో వుంచుకోవడం మంచిది. బతుకు మీది తీపి చావకుండా ఎలా జీవనం సాగిస్తున్నదో తెలుసుకోవడం మంచిది. అలాంటి ధీమాను ఎలాంటి వ్యవస్థ హామీ ఇస్తున్నదో దాన్ని కోరుకోవడం మరీ మంచిది.

ఉపశృతి: మా దూరపు చుట్టం ఒకరు జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చుకున్నారు. పిల్లల చదువులు, పెండ్లి పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఒక పద్దతిగా పూర్తి చేసుకున్నారు. పిల్లలు, మనుమళ్ళు కళకళలాడుతూ  నట్టింట తిరుగుతూ వున్నవేళ, ఒక రోజు భార్యాబిడ్డలతో  తీరి కూర్చుని కబుర్లు చెబుతూ, చెబుతూ  హఠాత్తుగా ఒక పక్కకి ఒరిగిపోయారు. అంతే. ఒక క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. అంతవరకూ నవ్వుతూ కబుర్లు చెప్పారు. పిల్లలు చెప్పినవి నవ్వుతూ విన్నారు. అలా ఆయన జీవనయానం   హాయిగా, ప్రశాంతంగా  ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని  అరుదయిన అవకాశం.

చావు ఒక ముగింపు కావచ్చు, పరిష్కారం మాత్రం కాదు.

కింది ఫోటో: Courtesy Google



(ఇంకావుంది)

11-07-2025

కామెంట్‌లు లేవు: