30, జూన్ 2018, శనివారం

ఆదిరాజులాంటి జర్నలిష్టులు ఉంటారా? సేలం పాఠకుడి ఆశ్చర్యం! – భండారు శ్రీనివాసరావు

ఈ సాయంత్రం ఒక ఫోను కాల్ వచ్చింది. ‘సేలం నుంచి శ్రీధర్ విశ్వనాధన్ ని మాట్లాడుతున్నాను’ అన్నది అవతల గొంతు స్వచ్చమైన తెలుగులో. అప్పుడు నాకూ ఆశ్చర్యం వేసింది, తమిళనాడు అంటున్నాడు, ఈ తెలుగేమిటని. అదే అడిగాను. ‘పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నాను, అదో కధ. ముందు నేను ఫోను చేసింది ఆదిరాజు అనే జర్నలిష్టు విషయంలో’
‘ఆదిరాజా! ఆయన మీకెలా తెలుసు?’
‘మీరు ఈ రోజు ఆంధ్రప్రభలో ఆయన్ని గురించి ఓ వ్యాసం రాశారు. అది చదివిమీకు ఫోన్ చేస్తున్నాను. మీ పేరుతొ పాటు ఆంధ్రప్రభవాళ్ళు మీ నెంబరు కూడా ఇచ్చారు’
‘ఆంధ్రప్రభ’ సేలం లో దొరుకుతుందా”
‘దొరకదు, కానీ నేను నెట్లో చదువుతాను. ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు నాకు ఇదే పని’
‘అలాగా! సంతోషం. మీది తమిళనాడు, అక్కడ కూడా తెలుగువాళ్ళు చాలామంది వున్నారు. కానీ వాళ్ళ ఉచ్చారణ అదో రకంగా వుంటుంది. మీరెలా నేర్చుకున్నారు?’
‘పదేళ్ళ క్రితం నేనొకసారి రామోజీ ఫిలిం సిటీ చూడడానికి హైదరాబాదు వచ్చాను. రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవరు నా తెనుగు చూసి చిన్నతనంగా చూసాడు. దాంతో నాకు పట్టుదల పెరిగింది. మా వూరికి తిరిగొచ్చిన తర్వాత లైబ్రరీలకు వెళ్లి తెలుగు పుస్తకాలు తిరగేసేవాడిని. నెట్లో తెలుగు పత్రికలు చదవడం మొదలు పెట్టాను. తెలుగు సినిమాలు నెట్లో చూస్తాను. ఆ విధంగా నాకు తెలుగు భాష మీద పట్టు పెరిగింది. మరో సారి హైదరాబాదు వచ్చి ఆ ఆటో వాడితో తెలుగులో మాట్లాడాలి అనే కోరిక వుంది, కానీ అది సాధ్యపడే విషయం కాదు, నాకూ తెలుసు
‘........’
‘అసలు విషయానికి వస్తాను. ఆదిరాజు గారి గురించి చదివిన తర్వాత ఆయన మీద నా అభిమానం, గౌరవం పెరిగాయి. అసలు అలాంటి జర్నలిష్టులు ఈనాడు వున్నారా? మాదగ్గర పరిస్తితి మరీ ఘోరం. ఇక్కడ పత్రికలు విడిగా అమ్ముడు పోవు. పత్రికలే మొత్తంగా అమ్ముడు పోయాయి’
‘......’
‘ఏమండీ! ఆదిరాజు గారి కుటుంబానికి నా తరపున నమస్కారాలు చెప్పండి’
చివర చివర్లో నా మౌనానికి కారణం ఆయన మాటలకు నా గొంతు పూడిపోవడం.
మౌనమే ఆయనకు నా సమాధానం.
విశ్వనాధన్ గారి ఫోను నెంబరు: 0701084208825, జూన్ 2018, సోమవారం

సిగ్గుతో తలదించుకున్నాను – భండారు శ్రీనివాసరావు


రాజీవ్ గాంధి బాంబు దాడిలో మరణించినప్పుడు నేను మాస్కోలో వున్నాను. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు ఇండియన్లా) అని అడిగింది. ఔనని చెప్పగానే మా ఆవిడను పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రష్యన్ లో ఏమిటో అంటోంది. ఆ భాష కొద్దిగా తెలిసిన మా పిల్లలు చెప్పింది ఏమిటంటే రాజీవ్ గాంధి చనిపోయాడని తెలిసి ఆమె తన దుఃఖాన్ని మాతో పంచుకుంటోంది. పరాయి దేశంలో వనిత మన దేశంలో జరిగిన ఘోరానికి బాధ పడుతోంది. ఆవిడను చూసి మాకే సిగ్గనిపించింది.
కొన్నేళ్ళ తరువాత హైదరాబాదు వచ్చి రేడియోలో మళ్ళీ చేరాను. ఆ రోజు ఎవరో పెద్దాయన చనిపోతే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఒకాయన మాకు ఫోను చేసి ఈ సెలవు ‘ Negotiable instruments Act’ కిందికి వస్తుందా అని  అడిగాడు. ఆయన ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ యాక్టు కింద సెలవు ప్రకటించకపోతే అది బ్యాంకులకు వర్తించదు. అదీ సంగతి.
ఆయన ధోరణి  చూసి నాకు సిగ్గనిపించింది. మాస్కో వృత్తాంతం గుర్తుకు వచ్చింది.    

అర్ధం కాని అర్గ్యుమెంటు

ఈ రోజు ఉదయం  AP 24 X 7 ఛానల్ సీయీఓ వెంకట కృష్ణ నిర్వహించే చర్చాకార్యక్రమంలో ఒక వింత వాదన నా చెవిన పడింది. (ఈ అంశంపై జరిగిన చర్చలో నాకు అవకాశం రాలేదు, నా వరకు వచ్చేసరికి మరో అంశం తీసుకున్నారు. ఒకోసారి సమయాభావం వల్ల ఇలా జరుగుతూ వుంటుంది)
విషయం ఇది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల మంది గ్రామ సహాయకుల జీత భత్యాలను ఇతోధికంగా పెంచింది. ఆహ్వానించదగ్గ నిర్ణయం. వారందరూ కలిసి అమరావతిలో ఒక సమావేశం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నారు. ఇది కూడా ఆక్షేపనీయం కాదు. గతంలో ఇలాంటి ‘థాంక్స్ గివింగ్ సమ్మేళనాలు’ జరిగాయి కూడా. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇదేమాదిరి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అయితే ఈ సమావేశానికి హాజరయ్యే సిబ్బందికి ప్రయాణ వసతి, భోజన ఖర్చుల కింద మనిషికి మూడువందల రూపాయలు చెల్లించాలని రాజంపేట రెవెన్యూ అధికారి ఇచ్చిన ఒక ఉత్తర్వును సాక్షి పత్రిక ప్రచురించింది. అదే ఈ నాటి చర్చలో మొదటి అంశం అయి కూర్చుంది. జనసేన, వైసీపీ ప్రతినిధులు సహజంగానే దాన్ని తప్పుపట్టారు. ప్రజాధనం దుర్వినియోగం అని ఆరోపించారు. నిజానికి ఈ నిర్ణయంతో నేరుగా ముఖ్యమంత్రికి సంబంధం ఉండకపోవచ్చు.”More loyal than the King” అనే బాపతు అధికారులు అలాంటి ఒక ఉత్తర్వు జారీ చేసి ఉండవచ్చు. అతి స్వల్ప జీతాలు తీసుకుంటున్న సిబ్బందికి ఆ మాత్రం ఆర్ధిక సాయం అందిస్తే తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
అయితే, ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి ఫోన్ లైన్లోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం విస్మయ పరిచేదిగా వుంది. ఆయన ఏమన్నారంటే:
“ముఖ్యమంత్రిగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రతిగా ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞత తెలపాలని అనుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం వంటి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆర్టీసీ ప్రత్యెక బస్సులు వేస్తోంది. వచ్చే వారికి టిఫిన్, మధ్యాన్న భోజనం, రాత్రి భోజనం పెట్టడానికి ఒక్కో ఉద్యోగికి మూడు వందలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కూడా మా సంఘం సభ్యులే. పైగా ఆ డబ్బును ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇక ఇందులో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది?”
నిజమే. ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారు. కానీ ప్రభుత్వ ఖజానా అనేది ఇలాంటి ఖర్చులకు ‘చేబదులు’ ఇచ్చే వ్యవస్థ కాదుకదా. సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూడడమే ఉద్దేశ్యం అయితే సంఘమే ఆ ఖర్చులు భరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, పైగా అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలకు జవాబు చెప్పాలిసిన దుస్తితి కూడా వచ్చేది కాదు.
ఈ సింపుల్ లాజిక్ ను ఆ నాయకుడు ఎలా మిస్సయినట్టు?

లింక్:
https://www.youtube.com/watch?v=o-eZo6_KZxk

12, జూన్ 2018, మంగళవారం

రాజకీయ రంగస్థలం

మహానటి సావిత్రి ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒక సినిమాలో, చెల్లెలుగా మరో సినిమాలో వేస్తే ప్రేక్షక జనాలు ఆదరించిన మాట నిజమే కానీ, వేషాలు మార్చుకున్న రాజకీయ రంగస్థల నటులను మాత్రం ఇట్టే గుర్తు పట్టేయగలరన్న సంగతిని వాళ్ళు మరచిపోతున్నట్టున్నారు. అందుకే కాబోలు వేషం మార్చినా ప్రజలు పట్టుకోలేరన్న నమ్మకంతో వ్యవహరిస్తున్నారు.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూడండి. రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, చూస్తుండగానే పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు జనాలు పండిత, పామరులనే తేడా లేకుండా ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఎప్పటిదాకా!
వచ్చే ఎన్నికల దాకా.


ఆ తర్వాత నాటకాలు ఆడేవాళ్ళే ప్రేక్షకులుగా మారిపోతారు.

11, జూన్ 2018, సోమవారం

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావునూట యాభయ్ రూపాయలతో చూపిస్తా రండంటున్నారు రాజేష్ వేమూరి.
నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్. 
కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు) 
నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.
వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.
విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో పడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!
పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.
ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.
(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551

5, జూన్ 2018, మంగళవారం

ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్ల ప్రస్థానం – భండారు శ్రీనివాసరావుMy article on YS Jagan Mohan Reddy completing four years as AP Opposition Leader published in Andhra Prabha today, 5th June, 2018)
నా నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో వినని మాట గత నాలుగేళ్ళలో తరచుగా వినబడుతోంది. అదేమిటంటే వైసీపీ నేత జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలం అయ్యారని. సాఫల్య వైఫల్యాలు లెక్కించడానికి ప్రతిపక్షం చేతిలో ఉన్న అధికారాలు ఏమిటన్నది, నాకు అర్ధం కాని విషయం. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి విఫలం అయ్యారు అనడానికి అధికార పీఠం ఎక్కనే లేదు. ఇక ప్రతిపక్షంగా విఫలం అవడం అంటే ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి దోహదపడకపొతే అప్పుడు వైఫల్యాలు గురించి మాట్లాడుకోవచ్చు. ‘సమస్యలే లేవు, ఒక వేళ వున్నా వాటిని ఒకరు చెప్పే పనిలేకుండా తక్షణమే పరిష్కరిస్తున్నాం’ అనే ధోరణితో పాలకపక్షం వున్నప్పుడు ప్రతిపక్ష నేత వైఫల్యాల ప్రసక్తి ఎందుకు తీసుకువస్తున్నట్టు? ఈ రకమైన విమర్శలు చేసేవాళ్ళు ఈ లాజిక్ ని ఎందుకు మరచిపోతున్నట్టు?
జగన్ మోహన రెడ్డి మీద మరో విమర్శ. ప్రజల పక్షం నుంచి కాదు, పాలక పక్షం నుంచి. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుని జగన్ మోహన రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం పాలు చేస్తున్నారన్నది ఆ విమర్శ. ప్రజాస్వామ్య ప్రియులెవ్వరూ ఇటువంటి నిర్ణయాన్ని హర్షించని మాట నిజమే. కానీ ఏ పరిస్తితుల్లో అటువంటి నిర్ణయం తీసుకున్నదీ ఆయనే పలుమార్లు బాహాటంగా చెప్పారు. గడచిన నాలుగేళ్ల కాలంలో పాలక పక్షంలోకి చేర్చుకోవడం మాత్రమే కాకుండా, వారిలో ఒకరిని మంత్రి పదవిలో కూర్చోబెట్టడం ద్వారా పాలక పక్షమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని, తాము అసెంబ్లీలో లేవనెత్తే ప్రజా సమస్యలకు, తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడే మంత్రి రూపంలో సమాధానం ఇచ్చే దుస్తితిని చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ చేసే వాదనలో వాస్తవం లేకపోలేదు. తమ ఎమ్మెల్యేలను గతంలో పాలకపక్షంలోకి తీసుకున్న రోజుల్లో కూడా తాము అసెంబ్లీకి హాజరయిన సంగతిని ఆ పార్టీ గుర్తుచేస్తోంది.
ఏది ఏమైనా నాలుగేళ్ల నవ్యాంధ్రలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన జరగడం లేదని జగన్ మోహన రెడ్డి తన సంకల్ప యాత్రలో అనుదినం చెబుతూ వస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఆయన చేసే ప్రసంగాలలో చంద్రబాబు నాయుడి ప్రసక్తే తరచుగా వినబడుతోంది. ఆయన పేరు పలుమార్లు ప్రస్తావిస్తూ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అందుకు ప్రతిగా చంద్రబాబు మంత్రివర్గంలోని మెజారిటీ సభ్యులు విడివిడిగా, కొండొకచో ఒక్కుమ్మడిగా జగన్ మోహన రెడ్డి పై మాటల దాడి చేస్తున్నారు. వీరికి పాలక పక్ష ఎమ్మెల్యేలు గొంతు కలుపుతున్నారు. ఏతావాతా జరుగుతున్నది ఏమిటంటే, ప్రజాసమస్యలకంటే వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే మీడియాలో విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. అలాగే, ఇదే సమయంలో తాము రాష్ట్రానికి చేసిన మంచి పనులని గురించి చెప్పుకోవడం కంటే జగన్ పార్టీని, ముఖ్యంగా జగన్ మోహన రెడ్డిని చెడుగా చిత్రించడానికే పాలక పక్షం ఎక్కువ శ్రమ పడుతున్నట్టు కానవస్తోంది. నిజానికి ఇవేమీ కొత్తవి కాదు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు చేసినవే. ప్రజలు వాటిని పట్టించుకోలేదన్న సంగతి వైఎస్ఆర్ సీపీకి లభించిన ఓట్ల శాతం తెలుపుతోంది.
ప్రజలు పట్టించుకోని ఈ అవినీతి అంశాన్ని ఈసారి ఎన్నికల్లో ఉభయ పక్షాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు వారి మాటల తీరు తెలుపుతోంది.
ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. అసెంబ్లీ వేదికపైనా, లేదా ఇతర వేదికలపైనా అనేది వేరే విషయం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన ప్రజా సంకల్ప యాత్రలో కొంత సమయాన్ని ఇందుకు కేటాయిస్తున్నమాట నిజమే అయినా, అత్యధికంగా చంద్రబాబుపైనే ఆయన తన విమర్సనాస్త్రాలను సంధిస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన అవినీతి మాయం అని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క పాలక పక్షం కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేదు. ఆఖరికి అధికారికంగా, ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలపై, ముఖ్యంగా, వైసీపీ నాయకుడిపై పేరు పెట్టి విరుచుకుపడుతూ, ఆ పార్టీని అవినీతి కూపంగా వర్ణిస్తూ, ఆ విషయాన్ని ప్రజలకు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, రానున్న ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది అని వారు ఉభయులూ బలంగా నమ్ముతున్న ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని సొంతం చేసుకునే దిశగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
అయితే, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటుచేసే సభల్లో ప్రతిపక్షనేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి చేసే ప్రసంగాలలో కొన్ని అతిశయోక్తులు, మాట జారడాలు వెలుగు చూస్తున్నాయి. జనాలను ఉత్తేజ పరిచే ప్రసంగాలలో ఇవి సహజం అని సర్ది చెప్పుకున్నా, ఏ పార్టీకి చెందని వారిని కొంత కలవర పరుస్తున్నాయి. పాలక పక్షం గతంలో ప్రతిపక్షంగా వున్నప్పుడు ఇదే విధంగా వ్యవహరించేది అనే విషయం గుర్తు చేసి తప్పించుకోవడం అంటే విలువలను పక్కన పెట్టడమే. అలాగే, విశ్వసనీయతకు తమ పార్టీ ప్రతిబింబం అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి ఆకాశమే హద్దుగా ప్రతి రోజూ చేసుకుంటూ పోతున్న హామీల ప్రకటనలు గమనిస్తుంటే ఇవన్నీ సాధ్యమయ్యే వ్యవహారాలేనా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో ఒక పర్యాయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో అలా హామీలు గుప్పించిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఎంతగా ఉడ్డుకుడుచుకున్నదీ తెలిసిన విషయమే. ఇస్తున్న ప్రతి హామీ అమలు ఎలా సాధ్యమో మరునాడే జగన్ ఒక ప్రకటన రూపంలో వెల్లడిస్తే విశ్వసనీయత మసక బారకుండా వుంటుంది.
రానున్నది ఎన్నికల కాలం. గత ఎన్నికల్లో చేతికి అందినట్టే అంది చేజారిన అదృష్టాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించడంలో అబ్బురం ఏమీ లేదు. అలాగే కొన్ని ఊహించని పరిస్తితుల్లో దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీడీపీ శాయశక్తులా కృషి చేయడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ ప్రయత్నాలు, ఈ కృషి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగితే జనం సంతోషిస్తారు.
ఎన్నికల కోయిల కూయక ముందే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతంగా ప్రారంభించాయి. నిజానికి నాలుగేళ్ల క్రితం కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరినప్పటించే ఇది మొదలయిందని చెప్పాలి. అప్పటినుంచీ, అక్కడ జరిగే అభివృద్ధి గురించి కంటే పాలక ప్రతిపక్షాల కుమ్ములాటలే మీడియాలో ప్రధానంగా చోటు చేసుకుంటూ రావడం ఓ విషాదం.
ఏదో ఒక పేరుతొ పాత పార్టీలు, కొత్తగా ఎన్నికల బరిలో దిగిన పాత పార్టీలు, ఇంకా పురుడు పోసుకోని సరికొత్త పార్టీలు లేదా వాటి నాయకులు ప్రజల మధ్యనే ఉంటున్నాయి. ఈ విషయంలో పాలక పక్షానిది వడ్డించిన విస్తరి. అన్నీ అమర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సదా సిద్ధంగా వుంటుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జగన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్రంలో తన పార్టీని రద్దుచేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఆ రోజుల్లో కొందరు ఆక్షేపించినా నిజానికి ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం.
అలాగే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి నాలుగేళ్లయినా ఒక అవతరణ దినం నిర్ణయించడంలో జరుగుతున్న జాప్యం కూడా ఒక ఎత్తుగడే అనే విషయాన్ని కూడా గుర్తించాలి. విభజన కారణంగా ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహం, అసంతృప్తి జ్వాలలు చల్లారి పోకుండా చూడాలనే అనుభవం పుష్కలంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు అయినా ఆలోచిస్తాడు.
రాష్ట్ర విభజన అనేది ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం. దానిని భావోద్వేగ అంశంగా మార్చి పబ్బం గడుపుకోవాలని చూడడం రాజకీయంగా పనికి రావచ్చేమో కాని భవిష్యత్తులో అది మానని, ఏ చికిత్సకు లొంగని వ్రణంగా మారే ప్రమాదం వుంది.
ప్రతిపక్షాన్ని నిలువరించడానికి పాలక పక్షం ఈ అంశాన్ని వాడుకోవాలని చూడడం విజ్ఞత అనిపించుకోదు. ఇది విశాల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయం. కానీ రాజకీయాల్లో ఇలాటి వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఎవరి ప్రయోజనాలు వారివి. విజయం ముందు ఏ విలువలు అయినా దిగదుడుపే.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

2, జూన్ 2018, శనివారం

వెలుగు నీడల నడుమ నాలుగేళ్ల చంద్ర పాలన - భండారు శ్రీనివాసరావుఈరోజు జూన్ రెండో తేదీ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురితం.
(నాలుగేళ్ల పరిపాలనకు మాత్రమే ఈ వ్యాసం పరిధి పరిమితం, రాజకీయ అంశాలను, అందుకు సంబంధించి చంద్రబాబు సాఫల్య, వైఫల్యాలను ఇందులో చేర్చడం లేదు,  దానికి ఈ సందర్భం తగినది కాదని రచయిత అభిప్రాయం)
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ పైచిలుకు చంద్రబాబు సాగించిన పరిపాలనతో సరిపోల్చకుండా ప్రస్తుత నాలుగేళ్ల బాబు పాలన గురించి చేసే ఏ సమీక్ష అయినా అది అసమగ్రమే అవుతుంది.
ఇది జరిగి పదిహేడు సంవత్సరాలు. అప్పట్లో  స్టేట్ బ్యాంక్ చెన్నై చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మా అన్నగారు రామచంద్రరావు ఓ రోజు ఉదయం బెంగుళూరు నుంచి విమానంలో చెన్నై వస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్  ఆంగ్ల దినపత్రికలో మొదటి పేజీలో పతాక శీర్షికలో ప్రచురించిన ఒక వార్త ఆయన దృష్టిని ఆకర్షించింది.
“నేను చంద్రబాబును మాట్లాడుతున్నాను, మీ నాన్నగారిని ఫోను దగ్గరికి పిలుస్తావా!”
ఆ వార్తాకధనం ఇలా సాగుతుంది.
“విపరీతంగా కురిసిన భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో ఒక చెరువుకు గండి పడింది. మరునాడు ఉదయం అయిదు గంటలకు సంబంధిత ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంట్లో ఫోను మోగింది. ఆ సమయంలో ఆ అధికారి గాఢ నిద్రలోవున్నారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న ఆయన కుమారుడు ఫోను తీసాడు. ఆ అధికారిని నిద్రలేపి ‘వెంటనే సిబ్బందిని తీసుకుని ఆ గ్రామానికి వెళ్లి గండి పూడ్చే చర్యలు తీసుకోవాల్సింద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ వార్తలో ప్రధాన విషయం ఏమిటంటే  చెరువుకు గండి పడిన  విషయం హైదరాబాదునుంచి ముఖ్యమంత్రి ఫోను చేసి చెప్పేదాకా జిల్లాలో వున్నఆ అధికారికే తెలవదు.
అదే విమానంలో మా అన్నయ్యతో కలిసి ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రయాణీకుడు కూడా అప్పటికే ఆ వార్తను చదివాడు. ఆయనిలా అన్నారుట. ‘ఈసారి చంద్రబాబు నాయుడు మా రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుండు’ అని.
ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభ అలా వెలుగుతుండేది, రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలో, ఆఖరికి విదేశాల్లో కూడా.
ఈ నేపధ్యంలో గత నాలుగేళ్ళుగా చంద్రబాబు సాగిస్తున్న పరిపాలనను ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన  హుద్ హుద్ తుపాను తదనంతర పరిణామాలు, అత్యంత వేగంగా సహాయక చర్యలను పూర్తిచేసి  బీభత్సంగా దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించడలో చంద్రబాబు ప్రదర్శించిన పాలనా సామర్ధ్యం ఈ నాలుగేళ్లలో ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనది.  తుపాను తాకిడికి చిగురుటాకులా దెబ్బతిన్న వైజాగు నగరంలో నాలుగైదు రోజులపాటు బస్సులోనే మకాం వేసి, సహాయ కార్యక్రమాలను స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అతితక్కువ వ్యవధిలో నగరాన్ని, పౌరజీవనాన్ని ఒక గాడిన పెట్టడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. నాటి పరిస్తితిని నేటితో పోల్చుకుని వైజాగ్ నగర పౌరులు ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటూ వుండడం ఇందుకు ఉదాహరణ.
అనేక వివాదాలు ఉన్న మాట నిజమే అయినా, నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం సుమారు ముప్పయి మూడువేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించగలగడం చంద్రబాబు ఈ నాలుగేళ్లలో సాధించిన మరో ఘనత. భూములు తీసుకుని నాలుగేళ్ల కాలం గడుస్తున్నా వాటిని స్వచ్చందంగా ఇచ్చిన రైతుల నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ప్రతిఘటన కానీ నిరసనలు కానీ వ్యక్తం కాకపోవడం గమనిస్తే ఆయన దక్షత పట్ల రైతులు పెట్టుకున్న నమ్మకం ఎలాటిదో అర్ధం అవుతుంది. 
గత నాలుగేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు.  వీధి దీపాలకు ఎల్.ఈ.డీ. విద్యుత్ బల్బులు, వృద్ధాప్యపు పించన్లు నెలనెలా ఠ౦చనుగా అందేలా తీసుకున్న చర్యలు ఈ జాబితాలో వున్నాయి.  చాలా ఏళ్ళ నుంచి  కాంగ్రెస్ గ్రామంగా, ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీ గ్రామంగా ఉంటూ వస్తున్న మా స్వగ్రామం కంభంపాడులో కూడా ఎలక్ట్రిక్ క్రిమటోరియం నిర్మాణానికి నిధులు, అనుమతులు మంజూరు కావడం ఒక విశేషం.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం కొత్త రాష్ట్రంలో ఊపిరి పోసుకున్నాయి. మూడు విమానాశ్రయాలను ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇందుకు అవసరం అయ్యే భూములను సేకరించి పెట్టడంలో,  కేంద్రంనుంచి రావాల్సిన  అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి చూపిన వ్యక్తిగత చొరవ ఉపయోగపడిందని చాలామందికి తెలియక పోవచ్చు.
అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు  దూరదృష్టిని శంకించాల్సిన అవసరంలేదు.  2022 లో, 2029లో   ఆఖరికి 2050లో ఆంధ్రప్రదేశ్ స్వరూపం  ఎలా ఉండాలో అన్నదానిపై ఆయన కంటున్న కలలను కూడా ఆక్షేపించాల్సిన పని లేదు. ‘పెద్ద కలలను కనండి, వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి’ అనే కలాం సూక్తిని  ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
హైదరాబాదు నుంచి పరిపాలనా కేంద్రాన్ని అమరావతికి తరలించిన సందర్భంలో ప్రతిపక్షాల నుంచి ఎదురయిన విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, అతి తక్కువ వ్యవధిలో సిబ్బందిని  మార్చడంలో చంద్రబాబు చేసిన కృషి మెచ్చదగింది.
ఇలాగే మరెన్నో. రియల్ టైం గవర్నెన్స్, సీఎం డాష్ బోర్డు, చౌక ధరలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మొదలయినవి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరయిన బిల్ గేట్స్, చంద్రబాబునాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ముగ్ధుడై లేచి నిలబడి కరతాళధ్వనులతో తన హర్షాన్ని తెలపడం బాబుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుకు ఒక మచ్చుతునక.
కాకపొతే, చంద్రుడిలో వెలుగు నీడలు ఉన్నట్టే  చంద్రబాబు పరిపాలనలో కూడా ఆ ఛాయలు వున్నాయి.
పాత దేవదాసు సినిమాలో జమీందారు పాత్ర వేసిన సీఎస్ఆర్, తనకు రెండో భార్యగా కాపురానికి వచ్చిన పార్వతి పాత్ర ధరించిన సావిత్రితో ఇలా అంటాడు. “ ఒక్కోసారి దేవుడు కూడా పొరబాట్లు చేస్తుంటాడు, లేకపోతే, చంద్రబింబం లాంటి నీ మొహంపై ఈ మచ్చ ఏమిటి చెప్పు?”
సమర్ధుడు, పరిపాలనాదక్షుడు అని సర్వత్రా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు  కొన్ని లోపాలకు అతీతుడేమీ కాదు. ఆయన ప్రస్తుత వ్యవహారశైలి  కూడా దీనికి అద్దం పడుతోంది.
కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక పోస్టు చదివాను.
‘నేను చంద్రబాబు నాయుడిని నరనరాన ద్వేషిస్తాను. అమరావతి రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్మించదలపెట్టిన నిర్మాణాలు, అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం, ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని పూర్తిచేసినా సరే, 2019లో నా ఓటు మాత్రం చంద్రబాబుకే’
సాంఘిక మాధ్యమాల్లో కానవచ్చే శ్లేషతో కూడిన ఇటువంటి వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలులేదు. భవనాల డిజైన్లు ఖరారు చేయడంలో, నిర్మాణాల పని మొదలు పెట్టడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యాన్ని చూస్తూ చంద్రబాబు అభిమానుల్లో అనేకమంది   అసంతృప్తితో వున్నారనేది కూడా వాస్తవం. అభిమానులే కాదు, ఏ పార్టీకి చెందని తటస్తులది కూడా ఇదే అభిప్రాయం. ఈ పనికి నాలుగేళ్ళు తీసుకోవడం అవసరమా అనేది వారి మనసులోని మాట.
చంద్రబాబునాయుడు వద్దా,  రాజశేఖర రెడ్డి దగ్గరా వారు ముఖ్యమంత్రులుగా వున్నప్పుడు వారితో కలిసి పనిచేసిన ఒక రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి ఇలా చెప్పారు.
‘చంద్రబాబు చాలా కష్టపడి పనిచేస్తారు, సందేహం లేదు. విషయాల పట్ల ఆయనకు  పూర్తి అవగాహన వుంటుంది. సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు చాలా లోతుకు వెళ్లి చర్చిస్తారు. ఎంత సీనియర్ అధికారి కూడా చంద్రబాబును తేలిగ్గా తీసుకుని వ్యవహరించే అవకాశం వుండదు. అయితే ఆయనకున్న బలహీనత ఒక్కటే. అన్నీ తానై స్వయంగా పర్యవేక్షించాలని అనుకుంటారు. తాను  తీసుకున్న నిర్ణయాల అమలును అధికారులకి బదలాయించి పై నుంచి పర్యవేక్షిస్తే సరిపోతుంది. కానీ ఆయన  అలా చేయరు. ప్రతిదీ తన కనుసన్నల్లో జరగాలని కోరుకుంటారు. ఈ బలహీనతని ఆయన అధిగమించగలిగితే  మరింత సమర్దుడయిన పాలకుడు కాగలుగుతాడు.’
ఈ అధికారి చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు.
చంద్రబాబు అభిమానులకి కూడా రుచించని విషయం మరోటుంది. అది స్వోత్కర్ష. అది బహిరంగ సభ కావచ్చు, సమీక్షా సమావేశం కావచ్చు ఏదైనా సరే ఆయన ప్రసంగంలో ఈ స్వోత్కర్ష మితిమించి వ్యక్తం అవుతుంటుంది.
నిజమే, దేశం మొత్తంలో ఆయన ఒక సీనియర్ నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా అనేక ఘన కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ అదేపనిగా వాటిని చంద్రబాబే స్వయంగా వల్లెవేస్తూ పోతుంటే వినేవారికి ఒకసారి కాకపోయినా మరోసారి అయినా కంపరం కలుగుతుంది. ‘నేనే చేసాను’ అనడానికి‘, మా ప్రభుత్వం చేసింది’ అని చెప్పుకోవడానికి నడుమ  చాలా తేడా వుంటుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో అనేక వ్యంగ్య వ్యాఖ్యానాలు అనునిత్యం వెలువడుతున్నాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా డాష్ బోర్డు ద్వారా తనకు ఇట్టే  తెలిసిపోతుందని చెప్పుకునే చంద్రబాబు దృష్టికి ఇవి రాకపోవడం వింత విషయమే.  ఈ సంగతిని ఎంత త్వరగా గమనంలోకి తీసుకుంటే అంత మంచిది.
గతంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడినుంచి ఏ విమర్శ వెలువడినా ఆ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చేది.  వెనువెంటనే చక్కదిద్దడానికి చర్యలు మొదలయ్యేవి. ఇప్పుడా పరిస్తితి లేకపోగా విమర్శలను అరాయించుకోగల సంయమనం ప్రభుత్వంలో లోపించింది.  వీటి వెనుక ప్రతిపక్షం హస్తం ఉందని  మంత్రులు, ముఖ్యమంత్రి కూడా సందేహించడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే అంశంగా మారుతోంది.  చంద్రబాబు మునుపటి మాదిరిగా సమర్ధంగా వ్యవహరించడం లేదేమో అనే అనుమానం ప్రజల్లో ప్రబలుతోంది.
వెనుకటి మాదిరిగా చంద్రబాబు దృఢంగా వ్యవహరించడం లేదనేది కూడా వాస్తవం. గతంలో జరిగిన కొన్ని  సంఘటనలు ఇందుకు ఉదాహరణ.
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లోని పాలక, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి, మునిసిపల్ కమీషనర్ ప్రవీణ్  ప్రకాష్ ని తక్షణం బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు.  కానీ, చంద్రబాబు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. సొంత పార్టీ మనుషుల పిర్యాదులను కూడా పెడచెవిన పెట్టి ఆ ఐఏఎస్   అధికారి పట్లనే మొగ్గు చూపారు.
ఇటువంటిదే మరో దృష్టాంతం.
సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న మరో ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీమతి లక్ష్మీ పార్వతిని హెచ్.ఎం.డీ.ఏ. మేనేజింగ్  డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని స్థానిక టీడీపీ అగ్ర నాయకులే కాకుండా  కొందరు మంత్రులు సయితం ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు.
మరిప్పుడో! అలాంటి సందర్భం ఒక్కటి ప్రస్తావించుకోగలమా! ఇప్పటి పాలక పక్షం ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఎలా వ్యవహరిస్తున్నారన్నది అందరికీ తెలిసిందే.
చంద్రబాబును గురించి వారి పార్టీలోని వారే చెప్పుకునే విషయం ఒకటుంది. అధికారులకి ఆయన దర్శనం లభించినంత సులువుగా పార్టీ నాయకులకు దొరకదని. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నకాలంలో కార్యకర్తలతో ఆయన పెంచుకున్న సాన్నిహిత్యమే పార్టీలో ఆయన స్థానం సుస్థిర పడడానికి దోహదం చేసింది. అలాటి లక్షణం ఇప్పుడు కానరావడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు మధనపడుతున్నారు.
తన పరిపాలన గురించి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి బేరీజు వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. ముఖ్యమంత్రిగా తన పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా వున్నారని ఆయన పదేపదే చెప్పుకుంటూ వుంటారు. ఇది నిజమే కావచ్చు. కొందరు ఎమ్మెల్యేల తీరును ప్రజలు ఇష్టపడడం లేదన్నసంగతి  ఆయనకు తెలియకుండా వుండే అవకాశం లేదు.   అయితే మరోసారి టీడీపీ  ప్రభుత్వం అధికారంలోకి  రావాలంటే పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా అవసరం. చంద్రబాబు పట్ల వున్న అభిమానం ఒక్కటే ఆ పార్టీని ఒడ్డున పడేయలేదు.   
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సులభసాధ్యం అనుకున్న ఆయన అభిమానులు కూడా ఇప్పుడు డోలాయమానంలో వున్నారు. రుచించని సంగతే అయినా ఇది నిజం. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఈ నాలుగేళ్ళుగా చంద్రబాబును రాజకీయంగా వ్యతిరేకిస్తూ  ఒక్క స్వరం మాత్రమే వినిపించేది. ఇప్పుడో. ఆయన ఒక్కడూ ఒకవైపు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఒక్కటి కాకపోయినా మరోవైపున ఒకే మాదిరి విమర్శనాస్త్రాలు ఆయనపై ఎక్కుబెడుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితిని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే – “చంద్రబాబు వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”.
చంద్రబాబు తన గురించి తాను ఎప్పుడూ ఒక మాట చెప్పుకుంటూ వుంటారు, ‘సమస్యలు ఎదురయినా వాటిని అవకాశాలుగా మార్చుకుంటాన’ని. అయితే ఆయనకు ఎదురయిన ప్రతి ఇబ్బందీ ఒక అవకాశంగా మారుతోందని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా కర్నాటక  పరిణామాల అనంతరం చూస్తే, ఆ కోణంలో చంద్రబాబునాయుడు అదృష్టవంతుడయిన రాజకీయ నాయకుల కోవలోని వాడే అని చెప్పాలి.
కొత్తతరం తీరాలు దాటుకుని రంగప్రవేశం చేస్తోంది.  రాజకీయాల్లో  సుదీర్ఘకాలం మనగలగడం అతి కష్టం. అలాంటిది నలభయ్ ఏళ్ళకు పైగా రాజకీయాల్లో రాణించడం అనేది బహు కష్టం. దాన్ని సాధ్యం చేసి చూపించిన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన నడిచివచ్చిన దారిలో ఎత్తులు ఎక్కువ, పల్లాలు తక్కువ కావడం ఆయన అదృష్టం. అలా అని ఈ ప్రస్తానం అంతా పూలు పరిచిన రహదారి కూడా కాదు.
చంద్రబాబు మరో అదృష్టం ఏమిటంటే ఆయన ఏమిచేసినా పెద్దమనసుతో స్వీకరించి అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా వున్నారు. అదే సమయంలో చంద్రబాబును, ఆయన రాజకీయాలను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
2014 ఎన్నికల సమయంలో ఆయన విజయానికి తోడ్పడిన అనేక సానుకూల అంశాలు ఈసారి కరువైన నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి  ప్రజాతీర్పును  కోరబోతున్నారు. అయినా ఆయనకు కలిసి వచ్చే అంశాలు రెండున్నాయి.
ఒకటి కష్టపడే తత్వం. ఆయన చేతుల్లోనే వుంది.
రెండోది అదృష్టం. అది దైవాధీనం. ఆయన చేతుల్లో లేదు.
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595  
LINK:
http://www.andhrajyothy.com/artical?SID=586936

నాలుగేళ్ల కేసీఆర్ పాలన – భండారు శ్రీనివాసరావు“ఇవ్వాళ  పేపరు చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు ఓరోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా శ్రవణపేయంగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“ఎంత లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక  రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.
సరే! తెలంగాణలో సెటిలయిన ఆ ఆంధ్ర మితృడి అభిప్రాయం ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా అలాగే వుంది. మార్పులేదు.
కానీ అసలు సిసలు తెలంగాణా బిడ్డలు కూడా అలాగే అనుకుంటున్నారా!
దీనికి సమాధానం అన్వేషించేందుకే ఈ ప్రయత్నం.
ఏళ్ళ తరబడి తెలంగాణా ప్రజలు కలలుకన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయి నాలుగేళ్ళు. ఆ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యతలు చేపట్టి కూడా నాలుగేళ్ళు.
కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించింది. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలిన ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
వాటిల్లో ప్రధానమైనది రైతులకు పెట్టుబడి సాయం. నిజానికి ఎవరూ చేయని ఆలోచన ఇది. దాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముందు భూముల రికార్డులను ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏడాదికి ఎకరానికి, రెండు కిస్తీల్లో కలిపి ఎనిమిది వేల రూపాయలు, అదీ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ఆర్ధిక సాయం. ఇంతకంటే  రైతులకు కావాల్సింది ఏముంటుంది? దీనికి తోడు వారికీ, రైతు కూలీలకు బీమా పధకాలు. ఆ బీమా ప్రీమియం మొత్తాలను చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. ఎన్నికల మీద కన్నేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడలకు పూనుకుందని ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తూనే మరో పక్క తాము అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి సాయం పధకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు.
రైతులనే కాదు, తెలంగాణా సమాజంలో వున్న అన్ని వర్గాలను, ఆఖరికి కులాలను కూడా వదిలి పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చయ్యే అనేక పధకాలను ప్రవేశపెట్టింది. వాటిని ఓటు బ్యాంకు పధకాలని ఎద్దేవా చేయవచ్చు కానీ ప్రభుత్వం తలపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు మాత్రం  దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిని పూర్తిచేయడానికి ఉపయోగిస్తున్న ఇంజినీరింగ్ కౌశలాన్ని చూసి నిపుణులు దిగ్భ్రమ చెందుతున్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వని పక్షంలో ప్రజలను ఈసారి ఓట్లు అడిగేదే లేదని గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు ఆ మాటల్ని తేలిగ్గా తీసుకున్న చాలామంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు అమలు జరుగుతున్న వేగాన్ని గమనించి ఆశ్చర్యపోతున్నారు.
అలాగే మరో అపూర్వ పధకం పేద ప్రజలకు రెండు గదుల ఇళ్ళ నిర్మాణ పధకం.
నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ఇలా కాలానుగుణంగా రూపాలు మార్చుకుంటూ వస్తున్న పేదవారి ఇల్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని సంపన్నులు సయితం అసూయపడేరీతిలో రెండు పడక గదుల గృహంగా రూపాంతరం చెందింది. ఎన్నో ఏళ్ళుగా అమలవుతున్న ఈ పధకాన్ని గమనిస్తూ వస్తున్న నా బోంట్లకు  కేసీఆర్ రెండు గదుల ఇంటి పధకం అపూర్వం, విప్లవాత్మకం అనిపించింది. కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు. నేను చూసిన దానికే ఇది అక్షర రూపం.
అది మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం.
తెలంగాణలో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు సామూహిక గృహప్రవేశాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వర్ణ శోభిత తెలంగాణాను కళ్ళముందు నిలిపాయి.
విలేకరిగా ఉత్సాహం కొద్దీ నేను కూడా  ముహూర్త సమయానికి  ఎర్రవల్లి  వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు  ముఖ్యంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటమే వేరు. నిజానికి డబల్ బెడ్ రూమ్ పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ కాబోలు. రెండు గదుల ఇళ్ళతో పునర్నిర్మించిన  నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కాలినడకన ఆయన  కలయ తిరిగారు.  ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు. ఇల్లంటే ఇలా వుండాలి అని  కలిగిన వాళ్ళు కూడా అబ్బురపడేలా ఆ గృహాలకు  రూపకల్పన చేసారు. ఇక వూరి సంగతి చెప్పక్కర లేదు. వీధులకు ఇరువైపులా ఒకే నమూనా కలిగిన ఇళ్ళు. సిమెంటు రోడ్లు, మురికి నీరు పోయేలా రోడ్లపక్కన కాలువలు, పచ్చని మొక్కలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు, ఇంకుడు గుంటలు, ఇంటర్  నెట్ సేవలు,  కళ్యాణ మండపం ఒకటేమిటి ఒక వూరికి ఉండాల్సిన సౌకర్యాలు సమస్తం ఈ ఊళ్లకు అమర్చి పెట్టారు. కొంతకాలం క్రితం ఇదే ఊళ్లలో పాత ఇళ్ళను పడగొడుతున్నప్పుడు, ‘ఇదంతా జరిగేదేనా’ అని నిరాశతో  నోళ్ళు నొక్కుకున్నవాళ్ళ నోళ్ళు, కళ్ళెదుట జరిగిన  ఈ గ్రామ  పునర్నిర్మాణాన్నిచూసిన తరువాత మూతబడి వుంటాయి.
వందల మంది పేదల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిజంగా ధన్యజీవి. ప్రజలు అప్పగించిన అధికారాన్ని, తిరిగి ఆ ప్రజల మేలుకే ఉపయోగించడం ఎలాగన్నది ఆయన చేసి చూపెట్టారు. ఆరోజు నాకు కలిగిన అభిప్రాయం అది. 
కానీ, గత ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన  ఈ రెండు గదుల ఇళ్ళ పధకం ప్రారంభించినప్పుడు ఉన్న వేగం వడీ ఇప్పుడు తగ్గిపోయాయనే భావం ప్రజల్లో వుంది. కేసీఆర్ కి రాజకీయంగా, బడుగు జనులకు ప్రయోజనకరంగా వుండే బహుళార్ధ సాధకమైన ఈ  పధకం పూర్తిగా అమలుచేయగలిగితే బంగారు తెలంగాణాకు మెరుగులు  దిద్దినట్టు అవుతుంది.         
అయితేబంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు.
చూస్తుండగానే నాలుగేళ్ల పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చేసినవి చాలా వున్నా, చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన అయిదేళ్ళ  సమయంలో మిగిలివున్న వ్యవధానం  ఒక్క ఏడాది మాత్రమే.   చివరి ఏడాది కూడా  ఎన్నికల నామ సంవత్సరమే.
మొదటి రెండు మూడేళ్ళు అచేతనంగా వున్న ప్రతిపక్షాలు ఎన్నికల ఘడియ ఏడాదికి చేరువ కావడంతో స్వరాలు పెంచుతున్నాయి. అది సహజం కూడా. ‘చెప్పినదేమిటి, చేస్తున్నదేమిటి’ అని కొన్ని ప్రజాసంఘాలు సర్కారును నిలదీస్తున్నాయి. ఈ నేపద్యంలోనే కొత్త రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుడుతున్నారు.
ప్రతిపక్షాలు రాజకీయంగా చేసే ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం పాలక పక్షానికి లేకపోవచ్చు. ప్రజాసంఘాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అగత్యం  లేదని అనుకోవచ్చు.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం వున్నది ఒక్కరికే.
అది  ప్రజలకు.
తమను నమ్మి పాలనా పగ్గాలు అప్పగించిన ఆ  ప్రజలకు ఏ ప్రభుత్వం అయినా జవాబుదారీగా ఉండక తప్పదు.
(EOM)
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595