2, జూన్ 2018, శనివారం

నాలుగేళ్ల కేసీఆర్ పాలన – భండారు శ్రీనివాసరావు“ఇవ్వాళ  పేపరు చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు ఓరోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా శ్రవణపేయంగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“ఎంత లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక  రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.
సరే! తెలంగాణలో సెటిలయిన ఆ ఆంధ్ర మితృడి అభిప్రాయం ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా అలాగే వుంది. మార్పులేదు.
కానీ అసలు సిసలు తెలంగాణా బిడ్డలు కూడా అలాగే అనుకుంటున్నారా!
దీనికి సమాధానం అన్వేషించేందుకే ఈ ప్రయత్నం.
ఏళ్ళ తరబడి తెలంగాణా ప్రజలు కలలుకన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయి నాలుగేళ్ళు. ఆ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యతలు చేపట్టి కూడా నాలుగేళ్ళు.
కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించింది. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలిన ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
వాటిల్లో ప్రధానమైనది రైతులకు పెట్టుబడి సాయం. నిజానికి ఎవరూ చేయని ఆలోచన ఇది. దాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముందు భూముల రికార్డులను ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏడాదికి ఎకరానికి, రెండు కిస్తీల్లో కలిపి ఎనిమిది వేల రూపాయలు, అదీ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని ఆర్ధిక సాయం. ఇంతకంటే  రైతులకు కావాల్సింది ఏముంటుంది? దీనికి తోడు వారికీ, రైతు కూలీలకు బీమా పధకాలు. ఆ బీమా ప్రీమియం మొత్తాలను చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. ఎన్నికల మీద కన్నేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడలకు పూనుకుందని ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తూనే మరో పక్క తాము అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి సాయం పధకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు.
రైతులనే కాదు, తెలంగాణా సమాజంలో వున్న అన్ని వర్గాలను, ఆఖరికి కులాలను కూడా వదిలి పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చయ్యే అనేక పధకాలను ప్రవేశపెట్టింది. వాటిని ఓటు బ్యాంకు పధకాలని ఎద్దేవా చేయవచ్చు కానీ ప్రభుత్వం తలపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు మాత్రం  దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిని పూర్తిచేయడానికి ఉపయోగిస్తున్న ఇంజినీరింగ్ కౌశలాన్ని చూసి నిపుణులు దిగ్భ్రమ చెందుతున్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వని పక్షంలో ప్రజలను ఈసారి ఓట్లు అడిగేదే లేదని గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు ఆ మాటల్ని తేలిగ్గా తీసుకున్న చాలామంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు అమలు జరుగుతున్న వేగాన్ని గమనించి ఆశ్చర్యపోతున్నారు.
అలాగే మరో అపూర్వ పధకం పేద ప్రజలకు రెండు గదుల ఇళ్ళ నిర్మాణ పధకం.
నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ఇలా కాలానుగుణంగా రూపాలు మార్చుకుంటూ వస్తున్న పేదవారి ఇల్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని సంపన్నులు సయితం అసూయపడేరీతిలో రెండు పడక గదుల గృహంగా రూపాంతరం చెందింది. ఎన్నో ఏళ్ళుగా అమలవుతున్న ఈ పధకాన్ని గమనిస్తూ వస్తున్న నా బోంట్లకు  కేసీఆర్ రెండు గదుల ఇంటి పధకం అపూర్వం, విప్లవాత్మకం అనిపించింది. కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు. నేను చూసిన దానికే ఇది అక్షర రూపం.
అది మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం.
తెలంగాణలో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు సామూహిక గృహప్రవేశాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వర్ణ శోభిత తెలంగాణాను కళ్ళముందు నిలిపాయి.
విలేకరిగా ఉత్సాహం కొద్దీ నేను కూడా  ముహూర్త సమయానికి  ఎర్రవల్లి  వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు  ముఖ్యంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటమే వేరు. నిజానికి డబల్ బెడ్ రూమ్ పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ కాబోలు. రెండు గదుల ఇళ్ళతో పునర్నిర్మించిన  నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కాలినడకన ఆయన  కలయ తిరిగారు.  ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు. ఇల్లంటే ఇలా వుండాలి అని  కలిగిన వాళ్ళు కూడా అబ్బురపడేలా ఆ గృహాలకు  రూపకల్పన చేసారు. ఇక వూరి సంగతి చెప్పక్కర లేదు. వీధులకు ఇరువైపులా ఒకే నమూనా కలిగిన ఇళ్ళు. సిమెంటు రోడ్లు, మురికి నీరు పోయేలా రోడ్లపక్కన కాలువలు, పచ్చని మొక్కలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు, ఇంకుడు గుంటలు, ఇంటర్  నెట్ సేవలు,  కళ్యాణ మండపం ఒకటేమిటి ఒక వూరికి ఉండాల్సిన సౌకర్యాలు సమస్తం ఈ ఊళ్లకు అమర్చి పెట్టారు. కొంతకాలం క్రితం ఇదే ఊళ్లలో పాత ఇళ్ళను పడగొడుతున్నప్పుడు, ‘ఇదంతా జరిగేదేనా’ అని నిరాశతో  నోళ్ళు నొక్కుకున్నవాళ్ళ నోళ్ళు, కళ్ళెదుట జరిగిన  ఈ గ్రామ  పునర్నిర్మాణాన్నిచూసిన తరువాత మూతబడి వుంటాయి.
వందల మంది పేదల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిజంగా ధన్యజీవి. ప్రజలు అప్పగించిన అధికారాన్ని, తిరిగి ఆ ప్రజల మేలుకే ఉపయోగించడం ఎలాగన్నది ఆయన చేసి చూపెట్టారు. ఆరోజు నాకు కలిగిన అభిప్రాయం అది. 
కానీ, గత ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన  ఈ రెండు గదుల ఇళ్ళ పధకం ప్రారంభించినప్పుడు ఉన్న వేగం వడీ ఇప్పుడు తగ్గిపోయాయనే భావం ప్రజల్లో వుంది. కేసీఆర్ కి రాజకీయంగా, బడుగు జనులకు ప్రయోజనకరంగా వుండే బహుళార్ధ సాధకమైన ఈ  పధకం పూర్తిగా అమలుచేయగలిగితే బంగారు తెలంగాణాకు మెరుగులు  దిద్దినట్టు అవుతుంది.         
అయితేబంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు.
చూస్తుండగానే నాలుగేళ్ల పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చేసినవి చాలా వున్నా, చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన అయిదేళ్ళ  సమయంలో మిగిలివున్న వ్యవధానం  ఒక్క ఏడాది మాత్రమే.   చివరి ఏడాది కూడా  ఎన్నికల నామ సంవత్సరమే.
మొదటి రెండు మూడేళ్ళు అచేతనంగా వున్న ప్రతిపక్షాలు ఎన్నికల ఘడియ ఏడాదికి చేరువ కావడంతో స్వరాలు పెంచుతున్నాయి. అది సహజం కూడా. ‘చెప్పినదేమిటి, చేస్తున్నదేమిటి’ అని కొన్ని ప్రజాసంఘాలు సర్కారును నిలదీస్తున్నాయి. ఈ నేపద్యంలోనే కొత్త రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుడుతున్నారు.
ప్రతిపక్షాలు రాజకీయంగా చేసే ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం పాలక పక్షానికి లేకపోవచ్చు. ప్రజాసంఘాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అగత్యం  లేదని అనుకోవచ్చు.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం వున్నది ఒక్కరికే.
అది  ప్రజలకు.
తమను నమ్మి పాలనా పగ్గాలు అప్పగించిన ఆ  ప్రజలకు ఏ ప్రభుత్వం అయినా జవాబుదారీగా ఉండక తప్పదు.
(EOM)
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

37 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

పార్టీలు గెలుస్తాయి ఓడుతాయి, నాయకులు గద్దె ఎక్కుతారు దిగుతారు, నాయకుల శైలి & పధకాలు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు. ఇవన్నీ సర్వసాధారణం, ఎప్పుడూ ఉండేవే. ఇందుట్లో కొత్తదనం, వైవిధ్యత లాంటివి ఏవయినా అంటూ ఉంటే అది కేవలం డీటెయిల్ మాత్రమే.

తెలంగాణా అవతరణ పైవాటికి భిన్నంగా ఒక వినూత్న ప్రక్రియ. భారత దేశ చరిత్రలోనే నిలిచిపోయే మహోన్నత ఘట్టం. ప్రజాబలం ముందు ఎంతటి శక్తులయినా బలాదూరని నిరూపించిన చారిత్రిక సన్నివేశం.

తెలంగాణా ఉద్యమం & తద్వారా ఏర్పడ్డ రాష్ట్రం మన దేశానికి వన్నె తేవాలని, దేశప్రజలు అందరికీ ఒక దిక్సూచి & మార్గదర్శకం కావాలని కోరుకుందాం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala THANKS

అజ్ఞాత చెప్పారు...

వ్యాసం మొదట్లో చక్కగా వివరించి చివర్లో బుచికిగా దాటవేశారు. మరదే. కుచికుచి అంటే. బాబు నాలుగేళ్ల పాలన వ్యాసం బాగుంది. It is true that many Andhra people like kcr. I've should have become cm of united Andhra.

నీహారిక చెప్పారు...


>>>తెలంగాణా అవతరణ పైవాటికి భిన్నంగా ఒక వినూత్న ప్రక్రియ. భారత దేశ చరిత్రలోనే నిలిచిపోయే మహోన్నత ఘట్టం. ప్రజాబలం ముందు ఎంతటి శక్తులయినా బలాదూరని నిరూపించిన చారిత్రిక సన్నివేశం.>>>

తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ దేశానికే సిగ్గుచేటు...కాంగ్రెస్ పార్టీ చేసిన అత్యంత హేయమైన చారిత్రిక తప్పిదం.కేసీఆర్ మొత్తం ఆంధ్రా రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా కోరుకున్నవాళ్ళలో మొదట నేనే ఉంటాను. కొన్ని ప్రెస్ మీట్ లలో చెప్పాను కూడా....అపుడు ఆంధ్రా వారు ఒప్పుకుంటారా అని అడిగారు.అపుడు ఒక్కరు కూడా ఒప్పుకోలేదు.ఇపుడు కేసీఆర్ స్పీడ్ చూసి ఒప్పుకోక తప్పదు.

నీహారిక చెప్పారు...


>>>ప్రజాబలం ముందు ఎంతటి శక్తులయినా బలాదూరని నిరూపించిన చారిత్రిక సన్నివేశం.>>>

ప్రజాబలంతో తెలంగాణా ఏర్పాటయిందా ? పార్లమెంట్ తలుపులు మూసి మూజువాణి ఓటుతో రెండు రాజకీయ పార్టీల స్వార్ధానికి పరాకాష్టకు నిదర్శనంగా తెలంగాణా ఏర్పడింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ప్రజాబలంతో తెలంగాణా ఏర్పాటయిందా ? పార్లమెంట్ తలుపులు మూసి ........... “ //

Well said నీహారిక గారూ.

Jai Gottimukkala చెప్పారు...

"పార్లమెంట్ తలుపులు మూసి"

1953లో ఆంద్ర రాష్ట్రం, 1956లో ఆంద్ర ప్రదేశ్ ఎలా ఏర్పడ్డాయి? అప్పుడు తలుపులు తెరిచారా, టీవీలు పని చేశాయా?

"మూజువాణి ఓటుతో"

మూజువాణీ కాకుండా రహస్య బాలట్ ప్రకారం ఏర్పడ్డ ఒక్క రాష్ట్రం, పాసయిన ఒక్క చట్టం చెప్పండి చూద్దాం!

"రెండు రాజకీయ పార్టీ"

ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు మీద విషం కక్కుతున్న టీడీపీ కూడా తీర్మానం చేసింది, ఉత్తరాలు రాసింది మరిచారా? చిరంజీవి కూడా తెలంగాణా వాగ్ధానం చేసే ఎన్నికలకు దిగాడు. మార్క్సిస్టు పార్టీ తప్ప అందరూ అంతే.

"కేసీఆర్ మొత్తం ఆంధ్రా రాష్ట్రానికే ముఖ్యమంత్రి"

ఎవరూ శాశ్వతం కాదు, వస్తారు పోతారు. వ్యక్తుల కన్నా వ్యవస్థలు, విధివిధానాలు & ఆలోచనా సరళి ముఖ్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు గద్దె ఎక్కినా కోటి ఎకరాలకు సాగునీరు సాధ్యం కాదు సరికదా కనీసం ఊహలకు కూడా అందేది కాదు.

శ్యామలీయం చెప్పారు...

జై గారూ,

మీరు కూడా వృత్తి రాజకీయనాయకుల వలె మాట్లాడితే ఎలాగండీ?

1953లో ఆంద్ర రాష్ట్రం, 1956లో ఆంద్ర ప్రదేశ్ ఎలా ఏర్పడినా ఎవరినీ తన్నో తన్నినంతపనో చేసి ఏర్పడ్డాయంటారా? తీవ్రమైన నిరసనలు ప్రజాబాహుళ్యం నుండీ, ప్రజాప్రతినిథుల నుండీ ఆందోళనల రూపంలో వెల్లువెత్తుతున్నా పెడచెవిని పెడుతూ ధాష్టీకం చేస్తి ఏర్పడ్డాయంటారా చెప్పండి. ఆయా రాష్ట్రాలు ఏర్పడిన సంఘటనలు అన్నీ కూడా ఇలగే ఎవరో కొందరు వ్యక్తులకు లాభాలు చేకూర్చటానికి దురాశలతోనే జరిగాయంటారా?

మూజువాణీ ఓటు ద్వారా రాష్ట్రాలు ఏర్పడ్డం కొత్త కాకపోయినా ఆ మూజువాణీ ఓటు తీవ్రమైన గందరగోళం మధ్యనే తీసుకోవటం ఇంతకుముందు ఎన్ని సందర్భాల్లో జరిగిందో చెప్పండి దయచేసి.

విషం కక్కటం వంటి రాజకీయపడికట్టు పదాలు పక్కన పెట్టండి. ఆమాటకు వస్తే తెరాస అధినేత అక్షరాలా ఆంద్రప్రజానీకం మీద నిరంతరాయంగా కక్కినవిషం మీ దృష్టికి ఎందుకు రాదు? ప్రజల్లో విద్వేషభావాలు వ్యాప్తిచేసిన సంగతి మీకెందుకు దృష్టికి రాదు? కేంద్రప్రభుత్వం ఉభయప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేస్తామని చెబుతూ వచ్చి హఠాత్తుగా రాజకీయప్రయోజనం కోసం ఒకప్రాంతాన్ని చీకటికొట్టు చేస్తూ విభజన చేయటం న్యాయమే అంటారా మీరు? తెలంగాణా ఏర్పాటుకు అనుకూలం అని కొందరు నేతలో కొన్ని పార్టీలో అంటే తెలంగాణాను విభజించి ఆవలి ప్రాంతాన్ని ముంచటం సమ్మతమే అని చెప్పటం కూడా అవుతుందా? సరిగా ఆలోచించగలవారు కూడా రాజకీయ కోణాలు తప్ప మాట్లాడకపోతే ఎలా?

విధివిధానాలు ముఖ్యం అంటారు. విభజనచేయటంలో పాటించిన విధివిధానాలు ఎంత అందంగా ఉన్నాయి? ఆలోచనాసరళి ముఖ్యం అంటారు. విభజనచేయటానికి వారు ఎంత మంచి ఆలోచనాసరళిని చూపారు? విభజన అనంతరం 1956కన్నా ముందే తరలివచ్చిన కుటుంబాలు తప్ప మిగిలిన ఆంద్రప్రాంతనుండి వచ్చిన కుటుంబాలను వేరు పెట్టాలని చూచిన తెరాస ఆలోచనా సరళి బాగుందా? పార్లమెంట్ లోపల ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తదుపరి ప్రభుత్వం కుంటిసాకులతో ప్రక్కనపెట్టటం అనే ఆలోచనాసరళి బాగుందా?

అయ్యా అటు ఉన్న తెలుగువారూ ఇటు ఉన్న తెలుగు వారూ కూడా బాగుపడాలి కదా? అలాంటి అవసరం లేదంటారా? జరిగినది అవకాశవాదంతో కేంద్రలో ఉన్న జాతీయపార్టీలు ఆడిన కుట్రనాటకం కాదని మీరు అనుకుంటే అది వేరే విషయం. ఎంతో పరిపక్వమైన రాజకీయ పరిణతితోనూ రాజకీయ ప్రక్రియతోనూ చేసిన విభజన అని మీరు అనుకుంటే అది వేరే విషయం. అందరూ అలా అనుకునే పరిస్తితుల్లో మాత్రం ఈ రాష్ట్రవిభజన జరగలేదని అనుకునే వారి సంఖ్య గణనీయంగానే ఉందనీ వారంతా మీరనుకుంటున్నట్లు కేవలం తెలంగాణా విద్వేషులు మాత్రమే కానక్కరలేదని గమనించమని నా ప్రార్థన.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

"ఎవరినీ తన్నో తన్నినంతపనో"

తెలంగాణా ఏర్పాటు సమయంలో ఎవరిని తన్నారండీ? లగడపాటి రాజగోపాల్ నిర్వాకం తప్ప ఇంకేమి జరిగింది?

"కొందరు వ్యక్తులకు లాభాలు చేకూర్చటానికి దురాశల"

మీకు తెలంగాణా ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష & పోరాటం కనిపించలేదా? కాదు కూడదు ఆంధ్రుల మాటే చెల్లాలి ఆంటే నడవదు కదండీ.

1953-56 లో ఏమి జరిగిందో ఎవరెవరు ఏమేమి ఎత్తులు చిత్తులు చేశారో ఇప్పుడు చిట్టా తెరవడం ఎందుకు లెండి?

"మూజువాణీ ఓటు తీవ్రమైన గందరగోళం"

గందరగోళాలు చట్టసభలలో సర్వసాధారణం.

"అయ్యా అటు ఉన్న తెలుగువారూ ఇటు ఉన్న తెలుగు వారూ కూడా బాగుపడాలి కదా?"

29 రాష్ట్రాలలో అన్ని భాషలు మాట్లాడే వారందరూ బాగుండాలి.

"అవకాశవాదంతో కేంద్రలో ఉన్న జాతీయపార్టీలు ఆడిన కుట్రనాటకం"

తెలంగాణా ప్రజలు ఆంధ్రతో కలిసే ఉందామని కోరుకున్నారు కానీ ఒకరిద్దరు స్వార్ధపరులు (తాగుబోతు మతోన్మాద నక్సలైటు తెలబాన్లు) కుట్రతో కుతంత్రాలతో వేరు పడ్డారని అనుకునే వాళ్ళు ఎందరున్నా అది వాస్తవం కాదన్నది చరిత్ర చెప్పే సాక్ష్యం.

నచ్చినా మానినా మాతో పాటు ఉండాల్సిందే అన్న ధోరణి బలవంతపు సావాసం అమానుషమే అవుతుంది తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.

నీహారిక చెప్పారు...

జై గారూ,
ప్రజాబలం అన్న పదప్రయోగం చేసింది మీరే ! ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ఓటింగ్ జరిగింది అని మేము చెపుతూనే ఉన్నాం.మీవాళ్ళే జరగలేదని వాదిస్తూ వచ్చారు.ఇప్పటికైనా ఓటింగ్ జరిగింది అని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం.
ప్రజాబలం అంటే ఎన్నికలలో విభజన గురించి తీర్పు చెప్పమని ప్రజలని కోరాలి.ఎన్నికలకు ముందే హడావిడిగా విభజించి అధోగతి పాలయ్యారు.చేసిన పాపం చెపితే పోతుంది.ప్రజలంటే తెలంగాణా ప్రజలే కాదు.ఆంధ్రులు కూడా ప్రజలే.
అదృష్టం ఈడ్చి తన్నితే అంజయ్య కూడా ముఖ్యమంత్రి అయినట్లు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు.ముఖ్యమంత్రి అయి చరిత్రలో నిలిచిపోయే పనులు చేసారు అని అంటున్నారు.అది అంజయ్య గొప్పతనమో కేసీఆర్ గొప్పతనమో కాదు.హనీమూన్ అయ్యాక ఖర్చు ఎంతయ్యిందో లెక్క తీస్తే కేసీఆర్ జేబులోనుండి ఎంత తీసారో బయటపడుతుంది.

నీహారిక చెప్పారు...

విభజనకి ముందు మీతో కలిసిఉండాలని కోరుకున్నాం కానీ ఇపుడు కలిసిపోవాలని కోరుకోవడం లేదు.విభజన హామీలు నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నాం.
బలవంతపు సావాసం వద్దే వద్దు.ఆంధ్రా ప్రజలతో మీరు పడ్డబాధలు పగవారికి కూడా వద్దు.కోటి ఎకరాల పంటా మీరే తినండి.మిగిలింది మార్కెట్ యార్డ్ లో పడేసి నిప్పు పెట్టుకోండి.
విభజనకు ముందు 250 రూ ఉన్న కంది పప్పుని ఇపుడు 60 రూ అమ్ముతున్నారు.మీ వల్ల రైతు ఎంత లాభపడుతున్నాడో కళ్ళారా చూస్తున్నాం.సర్వే జనో సుఖినోభవంతు....

Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

ప్రజాబలం ఆంటే brute force కాదండీ, ప్రజాభిప్రాయం అనే అర్థంలోనే అన్నాను.

నల్లమోతు చక్రవర్తి రాసింది అబద్దం, 1956 లో వోటింగ్ జరగలేదు.

ఆంధ్రులు ప్రజలు కాదని నేను ఎప్పుడూ అనలేదు. అన్ని రాష్ట్రాల/భాషల/మతాల/కులాల వారందరూ బాగుండాలనే నేను కోరుకుంటాను.

ఎవరు ముఖ్య/ప్రధాన/మంత్రి అయినా మానినా అది ఐదేళ్లే. Long term interests are more important than minor things like which politician wins which temporary post.

Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

"ఇపుడు కలిసిపోవాలని కోరుకోవడం లేదు"

"సర్వే జనో సుఖినోభవంతు"

ఆస్తు :)

శ్యామలీయం చెప్పారు...

జై గారూ,
ఇతః పూర్వం జరిగిన కొత్త రాష్ట్రాల ఏర్పాట్లు కూడా ఇలాగే మీ దృష్టిలొ సర్వసాధారణమైన తీవ్రగందరగోళ పరిస్థితుల మధ్యనే జరిగాయా? తెలంగాణా ఏర్పాటును దశాబ్దాలుగా నాన్చినాన్చి హఠాత్తుగా అనుకూలప్రకటన చేయటం వెనుక సోనియమ్మగారికి తెలంగాణావారిపైన కలిగిన ప్రేమాభిమానాలా లేదా తమ సుపుత్రునికి లబ్ధిచేకూర్చేందుకు ఇదొక అవకాశం అన్న ఆలోచనా అన్నదానిపై సమాధానం అందరకూ తెలిసిందే. చిన్నరాష్ట్రాలూ అంటూ తెలంగాణా ప్రకటనకోసం సాకు చూపిన భాజపావారు తరువాత మిగిలిని చిన్నరాష్ట్రాల ఏర్పాటును నాలుగేళ్ళుగా తలకెత్తుకోకపోవటం బట్టి కూడా అప్పట్లో వారు ఈ కార్యక్రమాన్ని అధికారసోపానం క్రిందే పరిగణించారన్నది తెలపటం లేదా? 1956లో ఏమిజరిగినా ఇలాంటి తలుపులుమూసి హడావుడిగా మమ అనిపించినట్లు మాత్రం చేయలేదేమో - కాదంటే ఆ వివరం తెలియజేస్తే గ్రహించి తరిస్తాము. సందర్భంలో ఉన్నది తెలుగువారు కాబట్టి అటూఇటూ ఉన్న తెలుగువారన్న మాట వాడితే మీరు మరింత పెద్దగీత గీసి చూపి నా సంకుచితత్వాన్ని ఎత్తిచూపటం ముచ్చటేసింది. మీరు యావన్మంది విశ్వప్రజానీకమూ బాగుండాలని అంటే ఇంక ఆ మాటకు అప్పీలుండేది కాదు కదా! పోనీయండి. తెలంగాణా ప్రజలు కలిసి ఉండాలనుకున్నట్లైతే అది వారి సౌహార్ద్రభావమూ ఆమాట ఆంధ్రులు అంటే అది వారి దోపిడీ మనస్త్వత్త్వమూ అంటే చెప్పేది ఏమీ లేదు.
హైదరాబాదులో స్థిరపడ్డ ఆంద్రులను దోపిడీదారులుగా జమకట్టిన మనిషి గొప్పదనాన్ని మీరు మెచ్చుకోండి దానికేం, ఇక్కడికి ఉద్యోగార్థులై వచ్చినవాళ్ళంతా దోపిడీదారులంటే మీరూ ఒప్పుకోండి దానికేం, చావుబ్రతుకుల అంచుదాకా వెళ్ళిపోయాడని గడబిడ రేగి ఆపిమ్మట హడావుడిగా తెలంగాణా వచ్చిందనే సరికి మర్నాడు పెళ్ళికొడుకులాగా టీవీలో దర్శనం ఇచ్చిన మనిషి నిష్కపటి అనండి దానికేం. చరిత్రదేముంది లెండి మళ్ళీ అనుకూలంగా తిరుగవ్రాసుకుంటున్నారు కదా. సంతోషం అది మీ చల్లనిప్రభువుల పాలనలో మీ ప్రాంతంలో మీ పుస్తకాల్లో మీ ప్రభువులకు అనుకూలమైన మాటే చెబుతుంది. బలవంతంగా కలిపి ఉంచటం అమానుషమే అని ఒప్పుకోవాలి - 1969 ఉద్యమం తరువాత 1972లో ఆంద్రులు విడిపోతామనే అన్నారు నిజమే కదా? వారిని బలవంతంగా కలిపిఉంచి బాగానేదోపిడీ చేసారు అందరు పాలకులూను - అందుకే విభజన తరువాత దోపిడీదారులన్న ముద్రతో గెంటబడ్డ వాళ్ళు పేదలుగానూ దోపిడీకి గురయ్యాని యాగీచేసివాళ్ళు ధనికులుగానూ మిగిలారు చిత్రం! పోనివ్వండి. జరగేదేదో కాలమే నిర్ణయిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

>>మర్నాడు పెళ్ళికొడుకులాగా


ఎలక్షన్ల టైంలో యాక్సిడెంట్ అయ్యాక.. ప్రతిరోజూ తమ అనుంగు పత్రికలలో బెడ్ మీద పడుకునే ప్రకటనలిచ్చి, ఎన్నికలైపోయిన రెండోరోజే లటుక్కున లేచి తిరిగిన జూ. ఎంటీఆర్ గుర్తుకొచ్చాడు.

అజ్ఞాత చెప్పారు...

ఈ గొట్టిముక్కలతో వాదించడం వేస్ట్...

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

1953/56లలో తేరా ముందు & వెనుక ఏమి జరిగిందో చెప్పడానికి అప్పట్లో ఈ మీడియా లేదు. అప్పటి పత్రికలూ చూస్తే ఇప్పటిలాగే ఎవరికి నచ్చిన వాదం వారు మోయడం మాత్రం స్పష్టం.

నాకు తెలిసి బీజేపీ "చిన్న" రాష్ట్రాల తీర్మానం నాలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణాతో పూర్తి అవుతుంది. కొత్తగా విదర్భలో ఉద్యమం బయలుదేరి బీజేపీ ఇవ్వకపోతే అప్పుడు విమర్శిద్దాం, మనమూ విదర్భ ప్రజల వైపు నిలబడదాం.

రెండు వైపులా తెలుగు వాళ్ళు ఉన్నారన్న మీ వ్యాఖ్యతో *మళ్ళీ* విభేదిస్తున్నందుకు మన్నించాలి. తెలుగేతరులు రెండు రాష్ట్రాలలో అప్పుడూ ఇప్పుడూ గణనీయంగానే ఉన్నారు. A state belongs to every resident irrespective of accidents of birth like language, caste & religion.

ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలకి ఉంటుంది. కర్ణాటకలో ఉండే ఆంధ్రులు టీడీపీ-బీజేపీ విబేధాలు పట్టించుకుంటారని చంద్రబాబు గారు పడ్డది అపోహే.

తెలంగాణను ఆంధ్రులు దోచుకున్నారని నేను ఎప్పుడూ అనలేదు. అలా అన్నవారిని నేను ఎన్నడూ సమర్తించలేదు, ఇక ముందూ చేయను.

నేను తెరాస చంచాను కాను, కనీసం సభ్యత్వం కూడా లేదు. దొరవారి నీడ చల్లనా కాదా, ఆయన పెళ్ళికొడుకు వేషాలు లాంటివి నాకు ఆసక్తి లేదు.

ముల్కీ వ్యతిరేక ఉద్యమం సమయంలో తెలంగాణాలో "సమైక్య" ఉద్యమాలు ఎవరూ చేయలేదు. నచ్చినా మానినా మాతో పాటు ఉండాల్సిందే అన్న ధోరణి తెలంగాణాలో ఎప్పుడూ లేదు. 1972 ఉద్యమం తాత్కాలికంగా విఫలం అయినా దాని లక్ష్యం (పొట్టి శ్రీరాములు కోరుకున్న 1953 నాటి ఆంద్ర రాష్ట్రం పునరావృత్తం) అంతిమంగా నెరవేరింది. 1956 తప్పిదం ఆలస్యంగా అయినా రివర్స్ చేయడం రెండు రాష్ట్రాల & దేశ ప్రజలకు మంచిదే.

శ్యామలీయం చెప్పారు...

1953 అన్నది ఏమీ రాతియుగం అంతపాతదా? పత్రికలలో చారిత్రక ఆధారాలను ఎవరికితోచినట్లు వారు ఎలా అన్వయిస్తారు? చిన్నరాష్ట్రాలు మేలు అన్నది ఒక సిధ్ధాంతం. అది పూర్తికావటం అన్నమాట రాజకీయం. తెలుగువారు కానివారిని గురించి ఇక్కడ చర్చించటం లేదు కాబట్టి విషయపరిమితిని బట్టి అలా అనటం సబబు కాదా? ప్రతిరాష్ట్రమూ అందరు భారతీయులదీ అన్నమాట స్థూలసత్యం. అంతమాత్రం చేత తెలుగురాష్ట్రాలు అనటాన్ని తప్పుపట్టి మీరు మీ విశాలదృక్పథాన్ని చావలసిన అగత్యం కనబడదు. అప్రస్తుతం అవుతున్నది. మీరు ఆంద్రులను దోపిడీదార్లన్నారా అన్నది ప్రశ్నకాదు. అలా అన్నవారి గురించి మీ దృక్పథం మీదే అభ్యంతరం. అలాగే మీకు తెరాసతో సంబంధం ఎవరూ అంటకట్టలేదు కాబట్టి ఆ ప్రసక్తి అనవసరం. అలాగే కర్ణాటకు ఈడ్చి చర్చలోనికి చంద్రబాబును విమర్శించటం బయటవిషయాన్ని ప్రస్తావించటమే. తెలంగాణావారు సమైక్య ఉద్యమం చేయకపోతే ఎవరూ అక్షేపించలేదు - చేస్తారని అప్పుడూ ఎవరూ ఆశించలేదు. వారి ధోరణి నచ్చకే ప్రత్యేకాంద్ర ఉద్యమం వచ్చింది. 1956లో జరిగినది తప్పిదం ఐతే అది ఆంద్రప్రజలతప్పిదం కాదు - కలిస్తామని వచ్చిన తెలంగాణా సర్కారు తప్పిదం మాత్రమే. నలబైఏళ్ళ మోసాన్ని తాత్కాలికం అనలేము. అప్పట్లో ఎన్నడూ విడిపోదని మాట ఇచ్చింది ఇందిర. ఆమె కోడలు విడగొట్టింది. అదీ ఇదీ కూడా ఆ పార్టీ రాజకీయప్రయోజనాలకోసం జరిగిన సంఘటనలే కాని అందులో ప్రజల ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళ ప్రమేయమూ లేదు. స్వస్తి.

Krishna చెప్పారు...

కర్ణాటకలో ఉండే ఆంధ్రులు టీడీపీ-బీజేపీ విబేధాలు పట్టించుకుంటారని చంద్రబాబు గారు పడ్డది అపోహే -

పొరపాటు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాలాంటి కర్నాటకాంధ్రులు ఎందరమో బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ లేదా కాంగ్రస్‌కి వేసాం, వేయించాం. ఇందులో ఎక్కువమంది 2014 మోడీ గెలిచాడని సంబరపడ్డవాళ్ళమే. ఎప్పటినుంచో కాంగ్రెస్‌కి బద్ద వ్యతిరేకులు కూడా ఈసారి జేడీయస్ గెలవదనుకున్న చోట, గెలిచినా బీజేపీతో చేరుతుందని నమ్మినవారు వేరేదార్లేక కాంగ్రెస్‌కి వేసి దిగులు మొహాలతో పోలింగ్ బూత్ బైటికొచ్చాం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శ్యామలరావు గారూ, ఎందుకీ చర్వితచర్వణం?
ఈ చర్చ పలుమార్లు జరిగినదేగా. వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం లభించడంతో తెలంగాణా వారిది కడుపునిండిన బేరం. దానికి తోడు ఆంధ్రా పట్ల కరడుగట్టిన అభిప్రాయాలు. మీరు ఎంత వాదించినా ఉపయోగమేముంది కంఠశోష / బ్లాగుశోష తప్ప?

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

"మీరు ఆంద్రులను దోపిడీదార్లన్నారా అన్నది ప్రశ్నకాదు. అలా అన్నవారి గురించి మీ దృక్పథం మీదే అభ్యంతరం"

ఆయన ఆంధ్రులను అన్న మాటలను నేను ఎప్పుడూ సమర్తించలేదు. నాకు ఆయన, మీరు ఇద్దరితో సమాన అనుబంధం. ఇరువురిపై నాకు గౌరవమే . మీతో కొన్ని విషయాలలో ఉన్నట్టే వారితో కూడా కొన్ని అంగీకారాలు & ఇంకొన్ని అభిప్రాయబేధాలు ఉన్నాయి.

"కలిస్తామని వచ్చిన తెలంగాణా సర్కారు తప్పిదం మాత్రమే"

దయచేసి చరిత్ర మళ్ళీ చూడగలరు. విశాలాంధ్ర ప్రతిపాదనకు ఆంధ్రాలో (రంగా గారిలాంటి అతికొద్ది నాయకులను మినహాయిస్తే) బహుళ స్థాయి ఆమోదం ఉండింది. ఆంద్ర శాసనసభ రెండు తీర్మానాలు (హామీలు) చేసింది.

తెలంగాణాలో ప్రజాభిప్రాయం అదే మోస్తరులో ఖచ్చితంగా లేదు. అప్పటి ప్రత్యక్ష సాక్షి స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్.

"అప్పట్లో ఎన్నడూ విడిపోదని మాట ఇచ్చింది ఇందిర"

ఒకవేళ నిజంగా మాటిచ్చినా తెలంగాణా ఆవిడ జాగీరు కాదు కదండీ. జన్మజన్మాలకు కష్టమయినా ఇష్టమయినా ఇందిరమ్మ మాట బంగారు బాట అని పాడుకుంటూ ఉండాల్సిందేనా?

"ప్రజల ప్రయోజనం ఏమీ లేదు"

ఒకరి ప్రయోజనం ఇంకొకరు ఎలా నిర్ధారించగలరు? తెలంగాణా (లేదా ఇతర ప్రాంత, ప్రస్తుతానికి x అనుకుందాం) ప్రాంత ప్రయోజనాలను x ప్రజలే నిర్ణయించు కోవడమే ప్రజాస్వామ్యం.

శ్యామలీయం చెప్పారు...

కొందరు సహృదయులు ఆయన అన్న దుర్వాక్యాలను సమర్ధించలేదు. నిజమే. అలాంటి వా రనేకులు ఆమాటలను తప్పుపట్టి ఏమీ మాట్లాడనూ లేదండీ. విశాలాంధ్ర విషయంలో తెలంగాణాను బలవద్విలీనమూ చెయలే దనుకుంటాను. ఇందిర మాట యిచ్చినది ప్రధానిహోదాలో. ప్రభుత్వాలు ఇచ్చిన మాటలను నమ్మి నాడూ నేడూ కూడా ఆంధ్రులే మోసపోయారు. ప్రజలు చట్టసభలద్వారా నిర్ణయించుకోవటం ప్రజాస్వామ్యవిధానం అనుకుంటాను.

శ్యామలీయం చెప్పారు...

వచ్చే పెద్ద ఎన్నికలలోనూ ఆంధ్రులదీ ప్రవాసాంధ్రులదీ అదే పరిస్థితి. ఈమధ్య కొందరు తెలంగాణాలోని ప్రవాసాంధ్రులంతా కేసీఆరు గారి పట్ల అభిమానంతో ఉబ్బితబ్భిబ్బు అవుతున్నారని ప్రచారం చేస్తున్నా ఆయన దుర్వాక్యాలు ఇంకా చెవుల్లో గింగుర్లాడుతునే ఉన్నాయి. ఇలాంటి దుష్ప్రచారాలు ఆంధ్రులను మరింత గాయపరచేవే అని గమనించాలి. గతిలేక ఎవరికి ఓటెయ్యీలా అన్నదే బెంగ.

శ్యామలీయం చెప్పారు...

కంఠశోషే నండీ. కాని చూచారు, మిన్నకుంటే ప్రచారాలే నిజాలౌతాయి.

hari.S.babu చెప్పారు...

జై గారి లాంటి వారు ఎంత గింజుకున్నా ఆంధ్రప్రదేశ్ విభజన అనేది సామాన్య ప్రజల కోసం మాత్రం జరగలేదు - అది రాజకీయానికీ ఆర్ధికానికీ ఉన్న దగ్గరి సంబంధాన్ని స్పష్టంగా చూడగలిగినవాళ్ళకి మాత్రమే తెలిసే పరమ సత్యం!

గ్రామం.మండలం,తాలూకా,ఫిర్కా,జిల్లా,రాష్ట్రం,దేశం - ఏ రేంజిలో ఉన్న భూమి మీద అయినా ప్రజల్లో పాలితులు,పాలకులు,వ్యాపారస్తులు/దళారులు అనే వర్గాలు మాత్రమే ఉంటారు.పూర్వకాలం యుద్ధాలతో రాజ్యాల సరిహద్దులు మారినా ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారా రాష్ట్రాల సరిహద్దులు మారినా ప్రభుత్వాన్ని స్పాన్సర్ చేసే వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమే జరుగుతాయి.

కాళోజీ అన్న రెండున్నర జిల్లాలవాళ్ల పెత్తనం అన్న మాట సరైనదే - కానీ అది దుర్మార్గమో దోపిడీయో కాదు.ఆర్ధికచట్రం ఒక పిరమిడ్ అనుకుంటే చురుకైన వాడు త్వరగా పైకి చేరుకోవటం ఎక్కువ కాలం అక్కడే పాతుకుపోవడం ప్రపంచంలోని ప్రతి చోటా జరిగినదే అప్పుడు సమైక్య రాష్త్రంలోనూ జరిగింది!కృష్ణా,గుంటూరు,గోదావరి జిల్లాలలో సంపదని పిండగలిగిన జనం ఎక్కువ ఉండేవాళ్ళు అప్పట్లో.మద్రాసులో తమిళ పెత్తనం నుంచి విడిపోయింది వీళ్ళే కదా!అప్పట్లోనే తెలంగాణా వాళ్ళు భయపడుతూనే వీళ్ళతో కలిశారు గదా!

వీళ్ళతో కలుపుకోవటానికి తెలంగాణా వాళ్ళకి ప్రత్యేక బడ్జెట్లు వేసుకునే సౌకర్యం కూడా ఇచ్చారని గుర్తు,అలాంటి సాంకేతికమైన వివరాలు జై గారికి బాగానే తెలుస్తాయి - జర్నలిస్టు కాబట్టి భండారు వారు కూడ చెప్పగలరు!ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా తెలంగాణా వాళ్లు రెండవ స్థానం వార్కు తప్ప మొదటి స్థానంలోకి ఎదగలేకపోవదం వల్లనూ ఆంధ్రా మోతుబరులు మొదటి స్థానాన్ని వీళ్ళకి వదలకపోవడం వల్లనూ ఇప్పటి విభజన జరిగింది!దానికి కారణం ఈ పిరమిడ్ గురించిన జ్ఞానం తెలంగాణా మేధావులకి/నాయకులకి తెలియడమే తప్ప మరొకటి కాదు.సామాన్య ప్రజలు ఎప్పటికీ సమైక్క్య రాష్ట్రంలో బతికినట్టే బతుకుతారు - రాష్ట్రం తెచ్చుకున్న మోతుబరులు మాత్రం ప్రభుత్వాన్ని ఎక్కువ స్థాయిలో శాసించి ఎక్కువ లాభాలు దండుకోగలుగుతారు.

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ నుంచి కోదండరాం వంటివారి మీదుగా జై,మధుసూదన్,ఫణీంద్ర వార్కూ సాగిన అందరూ బంటులే తప్ప రాజుగానో మంత్రిగానో నిలబడలేరు - మ్యాపులో కొత్త ముక్కని చూసుకుని ఆనందించే అమాయకత్వమే వీరి ఆనందానికి హేతువు.

అజ్ఞానంలో తామర వ్యాధి పీడితులకి ఉండే గోకుడు సుఖం లాంటి ఆనందం ఉంటుంది - జై గారిని కొంతకాలం ఆనందించనివ్వండి శ్యామలీయం గారూ!

P.S:ఆంధ్రా వాళ్లు కొట్తేసిన లక్ష ఉద్యోగాలు ఏమైపోయినాయో హొర్రెల్ని కాసుకు బతకమని విత్తనాల కోసం ఆంధ్రా పంపించాడు!అక్కడే తెలుస్తున్నది గద ఉద్యమ కాలపు వాదనల డొల్లతనం.పాత అసెంబ్లీని పాఉబడెయ్యటానికి వాస్తుని అడ్డం పెట్టుకున్నాడని వెక్కిరిస్తున్నారు గానీ తెదెపా మంత్రివర్గపు రోజులు గుర్తుకొచ్చి సిగ్గుగా అనిపించి ఉండొచ్చునని నాకు జాలే ఎక్కువ వేస్తున్నది!

Jai Gottimukkala చెప్పారు...

@Haribabu Suraneni:

"రాష్ట్రాల సరిహద్దులు మారినా ప్రభుత్వాన్ని స్పాన్సర్ చేసే వ్యాపారస్తుల ప్రయోజనాల"

"రాష్ట్రం తెచ్చుకున్న మోతుబరులు మాత్రం ప్రభుత్వాన్ని ఎక్కువ స్థాయిలో శాసించి ఎక్కువ లాభాలు దండుకోగలుగుతారు"

"మ్యాపులో కొత్త ముక్క"

"గోకుడు సుఖం లాంటి ఆనందం"

మీరు చెప్తున్న ఉన్నతస్థాయి సామాజికార్ధిక విశ్లేషణ (పిరమిడ్ సిద్ధాంతం) సరైనంత మేరకు 1953కి కూడా వర్తిస్తుందేమో? What, if anything, is different?

ఇకపోతే మీరు ఉటంకించిన రెండు specificsలో ఉద్యోగాల (గిరిగిలాని, 610 జీవో) గురించి నాకు పెద్దగా తెలీదు. నిధుల పంపిణీ గురించి మీకు పెద్దగా ఆసక్తి ఉన్నట్టు లేదు, ఉంటే చర్చకు నేను తయారు.

hari.S.babu చెప్పారు...

@Jai Gottimukkala
మీరు చెప్తున్న ఉన్నతస్థాయి సామాజికార్ధిక విశ్లేషణ (పిరమిడ్ సిద్ధాంతం) సరైనంత మేరకు 1953కి కూడా వర్తిస్తుందేమో? What, if anything, is different?

hari.S.babu
మద్రాసు నుంచి ఆంధ్రావాళ్ళు విడిపోవటం అనేదాన్ని కూడా కలిపాను, తెలంగాణా వాళ్ళు ఇష్టం లేకుండానే కలవడం గురించీ చెప్పాను - అయినా మళ్ళీ అదే ప్రశ్న అడగటం అమాయకత్వమా?లేక వెక్కిరింతా!నాకు వెక్కిరింతలానే అర్ధమయ్యింది.ఎలా కనిపిస్తున్నాను మీకు?తమిళుల గురించి ఒకలా,ఆంధ్రావాళ్ళ గురించి ఒకలా,తెలంగాణా వాళ్ళ గురించి ఒకలా మాట్లాదే మూడు నాలకల్ పాములా కనిపిస్తున్నానా?అన్నింటిలోనూ విడిపోవటానికి గల ఉద్దేశం ఒకటే - అర్ధమయిందా?పిరమిడ్ విశ్లేషనలు కూడ అబహుచక్కగా వర్తిస్తాయి,చాలునా?కాకపోతే ఈ విభజన ఒక్కటే పరమ చెత్తగా జరిగింది, అది మీరు ఒప్పుకుంటారా?ఒప్పుకోకపోతే నమస్కారం!ఒప్పుకుంటే అది చెత్తగా జరగటానికి మీలాంటివాళ్ళ అజ్ఞానముతో కూడిన మూర్ఖత్వమే కారణం!

వేరేవాళ్ళ సంగతి యెందుకు, సూటిగా మీ ధోరణి గురించే ఒక ప్రశ్న వేస్తాను - దానికి తడుముకోకుండా జవాబు చెబితే తర్వాత నిధుల పంపిణీ గురించి చర్చించుదాం.

అన్ని భాషలూ నాకు సమానమే అంటూనే తెలుగుభాష దగ్గిరకొచ్చేసరికి అది ఒక టూల్ మాత్రమే అంటున్న మీకు రాళ్ళూ రప్పలూ మట్టీ అయిన తెలంగాణ భూమి ఎలా ప్రీతిపాత్రం అయింది?మనిషికీ మనిషికీ జ్ఞనాన్ని పంచే భాష పట్ల ఆప్యాయత లేని మీకు పనిముట్లని వాడుకోవటానికి పనికొచ్చే ప్రాంతం గొప్పది యెట్లా అయింది?

మీ తాతాజీ కవిత్వం రాసిన తెలుగుభాషని మాతృభాష అనుకోవటానికే మనస్కరించని మీరు యెడాపెడా అయిదు భాషల పదాల్ని ఇముడ్చుకున్న రూపాన్ని "పంచవేణీసంగమం" అని యెట్లా మురుసుకోగలుగుతున్నారు?నిజంగా పంచవేణీసంగమంలా అయిదు భాషల్ని కలపటం సాధ్యమా?భాష ధాతుజన్యం, అంటే క్రియ మీద ఆధార్పడినది.మరి క్రియారూపాన్ని కూడా అయిదు భాషల్లోకి మారుస్తున్నారా అక్కడ?లేదే!ఒక వాక్యంలో కర్త(subject)కీ కర్మ(object)కీ విశేషణ(adjective)కీ విడివిడిగా ఎన్ని భాషల పదాల్ని వాడినా క్రియ మాత్రం ఏ భాషలో అఘోరిస్తే ఆ వాక్యం ఆ భాషకి చెందినది అని చెప్తారు,అవునా?మీరు చెప్పుకునే పంచవేణీసంగమంలో క్రియాపదాలు ఏయే భాషల్లో ఉంటున్నాయి?

One thing I really wonder మిగతా అన్ని విషయాల్లో హేతుబద్ధంగా వాదించే మీరు తెలంగాణాకి వచ్చేసరికి వింత వాదనలు చెయ్యడానికి కారణం ఏమిటి?


P.Sప్రశ్నలు అనేకం ఉన్నప్పటికీ. "తెలుగుభాషని మాతృభాష అని ఒప్పుకోలేక టూల్ మాత్రమే అని తీసిపారేస్తున్న మీకు తెలంగాణ నేల ఎందుకు అద్భుతమైన మరియూ ఉత్తేజకరమైనది అయింది?" అనే ప్రశ్నకి జవాబు చెప్తే అన్నిటికీ అదే సరిపోతుంది.

నీహారిక చెప్పారు...

>>>ఆంధ్రప్రదేశ్ విభజన అనేది సామాన్య ప్రజల కోసం మాత్రం జరగలేదు>>>>
సామాన్య ప్రజల కోసం జరిగిఉండకపోవచ్చు కానీ సామాన్య ప్రజల కోరిక మేరకు జరిగిందనేది వాస్తవం కదా ?
హరిబాబు గారూ మీకన్యాయం జరిగింది అని ఎవరయినా మిమ్మల్ని అన్నారనుకోండి....నా తలరాత ఇంతే అని మీరు ఊరుకుంటారా లేక నిజంగానే నాకు అన్యాయం జరిగిపోయింది అని బాధపడిపోయి నా వాటా నాకిచ్చేయి నా బ్రతుకు నేను బ్రతుకుతా అని అంటారా ? మీ వాటా అంటే ఉమ్మడి ఆస్థిలో మీ వాటా మాత్రమే సుమా ...జైగారు లెక్కలు చెపుతారంట బాగా చర్చించండి.

Jai Gottimukkala చెప్పారు...

@Haribabu Suraneni:

ముందు "పిరమిడ్ సిద్ధాంతం" గురించి నా అభిప్రాయం. అసమానతలు ఆర్ధిక చట్రంలో భాగమే కాకపొతే standard deviation కూడా ముఖ్యం. వ్యవస్థ మార్పులకు అనేక కారణాలు ఉన్నా, కొంతలో కొంతయినా బహుళీకృతం (broadbasing of power structures) ఉంటేనే ఆ మార్పు నిలబడుతుంది. ఉ. తెలంగాణాలో రాబోయే రోజులలో బహుళ ప్రయోజనాలు నెరవేరక "వివక్ష" పెరిగితే, 2014 ప్రయోగం విఫలం అవుతుంది. మున్ముందు చూద్దాం.

తెలుగు నా మాతృభాషే. భాష అనేది సంస్కృతిలో భాగమే. ఈ రెండు విషయాలలో సందేహం అక్కరలేదు.

ఇదే సమయంలో భాష ప్రధాన (లేదా ఏకైక) లక్ష్యం నాలెడ్జీ & భావాలు పంచుకోవడం. భాష సంస్కృతికి ప్రత్యంతరం కాదు.

పనిముట్టు అంటే విలువ లేనట్టా? ఒక ప్రయోజనం చేకూర్చే టూల్ ఏదయినా పనికి వచ్చేదా కదా. There should be no reason why we should be offended by the word "tool": in fact it denotes great value & significance.

ప్రతి భాషకు సొంత వ్యాకరణం & నుడికారం ఉంటుంది నిజమే. కానీ ప్రతి భాషలో అరువు పదాలు, పరస్పర ప్రభావాలు ఉంటాయి. ఏ భాష దీవి కాదు. ఉ. సంస్కృత పదాలు లేని తెలుగు ఊహించలేము.

పంచవేణీసంగమం అంటే మిశ్రమ సంస్కృతి, పరస్పర గౌరవం. ఇది తప్పెలా అవుతుందో నాకు అర్ధం కావడం లేదు.

తెలంగాణ నేల, మట్టి & రాళ్లు అద్భుతం, అమోఘం అని నేను అనలేదు. ఏ రాజకీయ విభాగం (political unit) అయినా ఆశయాలకు దర్పణం (vehicle for aspirations) తప్ప ఇంకోటి కాలేదు. అక్కరకు వచ్చేదే దేశం.

Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

ప్రజల కోరిక మేరకు >>> ప్రజల కోసం

Ultimately people are the arbiters of their own well being in a democracy.

ప్రజల బాగోగులు వారికి తెలీదు, వారికేమి కావాలో మేమే నిర్ణియిస్తాం అన్న ధోరణి నియంతృత్వం, కనీస పక్షంలో tyranny of experts అవుతుంది.

hari.S.babu చెప్పారు...

@jai
ముందు "పిరమిడ్ సిద్ధాంతం" గురించి నా అభిప్రాయం. అసమానతలు ఆర్ధిక చట్రంలో భాగమే కాకపొతే standard deviation కూడా ముఖ్యం. వ్యవస్థ మార్పులకు అనేక కారణాలు ఉన్నా, కొంతలో కొంతయినా బహుళీకృతం (broadbasing of power structures) ఉంటేనే ఆ మార్పు నిలబడుతుంది.
hari.S.babu
నేను చెప్పిందే మీరూ చెప్పారు.ముందుగానే మోనోపలీ సాధించిన ఆంధ్రా వ్యాపారులు/దళారులు తెలంగాణా వ్యాపారుల/దళారులకి వాటా ఇవ్వకపోవడం వల్ల విడిపోయారు అని నేను చెప్పినదే కదా!దానినే మీరు (broadbasing of power structures) పేరుతో చెప్పారు.అందులో మీకూ నాకూ తేడా ఏమీ లేదు,అవునా?

పంచవేణీసంగమం అనే పదానికి మీరు ఇప్పుడు ఇచ్చిన నిర్వచనం ఆంధ్ర ప్రాంతానికి వర్తించదా?అక్కడి మాండలికాల్లోనూ ఉర్దూ,ఇంగ్లీషూ,హిందీ,సంస్కృతం కలిసాయి గదా!ప్రపంచంలో ఏ ప్రాంతమూ ఏ భాషా విడిగా ఉండదంటూనే కేవలం మీ ప్రాంతపు యాస(slang)కే ఆ పదం చేర్చుకుని గర్వించడం అంటే అర్ధం ఏమిటి?I am not too much negative about it,just saying that It is too much to claim it only for you!దేశంలోని అని ప్రాంతాలకీ కనెక్టివిటీ ఉండటం వల్ల అన్ని చోట్ల కన్న ఎక్కువ కలవడం జరిగిందని నేనూ ఒప్పుకుంటాను.కానీ మూలభాష తెలుగే కదా!

@jai
ఇది తప్పెలా అవుతుందో నాకు అర్ధం కావడం లేదు.
hari.S.babu
తప్పని నేనూ అనలేదు లెండి!P.S:నిధుల కేటాయింపు లెక్కల గురించి ఇప్పుడు మీరు చెప్తానంటున్నారు గానీ అప్పుడు ఉద్యమకారులు అలాంటి గంభీరమైన విషయాలని ఏనాడూ చెప్పలేదు కదండీ!మా యాసను వెక్కిరించారు(ఈ వాదన గట్టిగ చేసిన ఫణీంద్రా శ్రీకాంతచారీ ఈ మధ్య "చెప్పాలి" కనన్ "చెప్పాలె" దేవభాషకి దగ్గిరనీ గోదావరి జిల్లాల వాళ్ళు వాడే "డి"కి బరువెక్కువ మా "రి" బాగుంటుంది మార్చుకోండని సలహాల వంటి ఎద్దేవాలు చేశారు,ఔరా!),మా ఉద్యోగాలని కొట్టేశారు,మా నీళ్ళ్ళని దోచుకున్నారు అనే యాగీ తప్ప ఇలాంటి లెక్కలు ఎప్పుడూ చెప్పలేదు కదండీ - ఇప్పుడు వాటి పురాణం ఎత్తుకుంతే ఎవరు వింటారు?

ఇక్కడ పాయింటు విడిపోవటం తప్పు కాదు,విడిపోయిన పద్ధతి బాగలేదు అని!అది ఎందుకు బాగలేదు అంటే "మేము విడిపోవాలని నిర్ణయించేసుకున్నాం - ఇప్పుడే కావాలి!ఎట్లా ఇచ్చినా పర్లేదు!" అనే పంతం వల్ల జరిగింది.ఈ ఎట్లా ఇచ్చినా అనే మాటలో ఆంధ్రాకి అన్యాయం జరిగినా సరే అన్న అభిప్రాయముందనేది అందరికీ తెలుసు,ఇప్పుడు గింజుకుని ప్రయోజనం లేదు.బిల్లులో మెలికలు లేకుండా మాకు ప్రతికూలతలు లేకుండా ఉంటే మేమెందుకు మిమ్మల్ని తప్పు పట్టాలి?విభజన బిల్లులో ఉన్న మెలికల గురించి ఎవరికి తెలియదు?తెలిసే చేశారు!ఈ బిల్లు ఆంధ్రాకి అన్యాయం చేస్తూ తెలంగాణా ఇచ్చే విధంగారూపు దిద్దినట్టు కాంగ్రెసువాళ్ళు చూపిస్తే మొదట చూసిన కేసీయారుకి తెలియదా?క్షుణ్ణంగాగా పరిశీలించనక్కర లేకుండానే ఒక్కసారి రేఖామాతరంగా చదివితే చాలు తెలిసిపోతుంది,ఆవునా కాదా?అయినా విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణా ఏర్పడినదంటే ఆంధ్రా ఏమయిపోయినా మాకు సంబధం లేదు, మా ప్రాంతం కొత్త రాష్త్రంగా అవతరించి మేం బాగుపడితే చాలు అన్నట్టు కాదా?

అంతా తెలిసే చేశాక మీనుంచి సానుభూతులూ సహాయాలూ ఓదార్పులూ దేనికి లెండి!కాంగెస్,భాజపా,తెరాసా పార్టీల్లోని ప్రతి ఒక్కరికీ ఆంధ్రావాళ్ళ ఉసురు తగుల్తుంది - తప్పదు!ఇంతవరకు జరిగిన సంభాషణల్లో మీరు తెలుగుని మతృభాషగా చెప్పుకోవడానికి ఇబ్బందిపడినట్టు కనిపించింది,ఇప్పుడు ఒప్పుకున్నారు, సంతోషం!

Jai Gottimukkala చెప్పారు...

హరిబాబు గారూ,

చర్చలో మనం ఇద్దరమే మిగిలాం, అసలు టపా విషయం ఎప్పుడో దాటిపోయాం కూడా.

తెలంగాణా, తెలుగు భాష లాంటివి మీరు నేనూ ఇతర మిత్రుల వాదనలు ఎప్పటినుండో ఉన్నవి కనుక ఇంకోచోట ఇంకోసారి (next year around the same time?) కొనసాగిద్దాం.

"పిరమిడ్ సిద్ధాంతం" గురించి మనకు nuanced differences ఉన్నట్టున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతె మీ బ్లాగులో నా అభిప్రాయం క్లుప్తంగా రాస్తాను.

hari.S.babu చెప్పారు...

@jai
చర్చలో మనం ఇద్దరమే మిగిలాం, అసలు టపా విషయం ఎప్పుడో దాటిపోయాం కూడా.

hari.S.babu
మీరు ఇప్పుడు వాదించి నిరూపిస్తానంటున్న నిధుల కేటాయింపులో అన్యాయం కాన్సెప్టు 12 యేళ్ళ పాటు పోట్లాడినవాళ్ళకీ ఇంకా ప్రాచీన కాలపు 1953 నాటి వాళ్ళకీ మరింత ప్రాచీన కాలపు 1943 నాటి తెలంగాణ వాదులకీ చెప్పండి వీలయితే టైం మెషీన్ ఉపయోగించుకుని!

ఫలానా జై అనే మేధావి ఫలానాహరిబాబుని ఒప్పించేస్తే సరిపోతుందా?తెలంగాణ నుంచి శాసనసభకి ఎన్నికై తెలంగాణ కావాలని అడుగుతున్నవాళ్ళకి రాష్ట్రం ఏర్పాటయినప్పటి నుంచి జరిగిన కేటాయింపుల లెక్కలు దొరకవా?మీరు నాకు చెబుతానంటున్న లెక్కలు అక్కడి నుంచి కాక ఎక్కడినుంచి కొట్టుకుస్తున్నారు?శాసనసభలో చర్చ జరపడం అంటేనే తెలంగాణ ఇవ్వకుండ ఎగ్గొట్టటానికి వేసిన ఎత్తుగడ అని చర్చతో అనిలేని ఆర్టికిల్ మూడుని ఎంచుకుని ఏ పాయింటు మీద ఇవ్వాలి తెలంగాణ అనే ప్రశ్నకి ఒక జవాబు తెలివితక్కువదని తెలిస్తే మరొకటి ఎత్తుకోవడం ఎన్నిసార్లు జరగలేదు?

పిరమిడ్ సిద్ధాంతం నేను కొత్తగా కల్పించి భుజానికి ఎత్తుకున్నది కాదు.ఎకాలజీలో ఫుడ్ పిరమిడ్ దగ్గిర్నుంచి అన్నిచోట్లా ఉంటుంది.ఎకనామిక్సులో వచ్చే ఎపెక్స్ మోనాపలీ అంటే పిరమిడ్ పైకొసని చేరటం.ఉక్కు పరిశ్రమ,వస్త్ర పరిశ్రమ - ఒకటేమిటి అన్ని రకాల ప్రొడక్టివ్ మార్కెట్లనీ బేస్/గ్రాస్ లెవెల్,మిడిల్ లెవెల్,టాప్ లెవెల్ అనే మూడు రకాల స్థాయీభేదాలతో విడగొట్టి చెబుతున్నారుగా!

ఎకనమిక్సులో నాకు మరీ Deep Knowledge లేదు. కొన్ని Patterns గుర్తు పట్టగలను,బేసిక్ స్ట్రక్చర్ గురించి కొంత తెలుసు.కానీ అప్లికేషన్ ముఖ్యం - Politics లోకి దైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోయేముందు దాని గురించి తప్పకుండా తెలుసుకుని తీరతాను.ప్రస్తుతానికి మాత్రం వాదనల్లోకి దిగడం కష్టమే.

అజ్ఞాత చెప్పారు...

"చర్చలో మనం ఇద్దరమే మిగిలాం, అసలు టపా విషయం ఎప్పుడో దాటిపోయాం కూడా."

మీ ఇద్దరికీ ఇదేం కొత్త విషయం కాదే!

అజ్ఞాత చెప్పారు...

అవతలివాడి లెక్కల్లో బొక్కలు వెతకడం ఎవడికైనా ఈజీయే.. మన లెక్కలు బయటకి తీస్తేనే బూతులు లంకించుకునేది. ఆ విషయంలో హరిబాబు ఫుల్లీ ఎక్స్పీరియెన్సుడు

hari.S.babu చెప్పారు...

@అజ్ఞాత
ఆ విషయంలో హరిబాబు ఫుల్లీ ఎక్స్పీరియెన్సుడు

hari.S.babu
స్కాచి వదబోసి బీరుని పిండినట్టున్నారు:-)
ఇసక నంచి నూనె కూదా పిందగలరు,ట్రై చెయ్యండి!

hari.S.babu చెప్పారు...

@అజ్ఞాత
మన లెక్కలు బయటకి తీస్తేనే బూతులు లంకించుకునేది

hari.S.babu
లెక్కలు ఆయనే చెబుతానంటున్నాడు,
నా పని బొక్కలు వెతకడమే -
కాబట్టి బొక్కలు బయ్టపడినప్పటి బూతులు
నా నుంచి రావు, ఆ చాన్సే లేదు:-)