23, ఏప్రిల్ 2023, ఆదివారం

రోడ్డు దాటగలవా ఓ నరహరి! – భండారు శ్రీనివాసరావు

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.

నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

ఇది జరిగి కొంచెం అటూఇటుగా ముప్పయ్ ఏళ్ళు.

ఈ సమస్య  పరిష్కారం కాకపోగా దాని  తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది. కారణం వీవీఐపీల సంఖ్యతో పాటు తీరుమారిన రాజకీయాల నేపధ్యంలో వారి రాకపోకలు మరింతగా పెరగడం. 

ఒకానొక కాలంలో సమయానికి అంత విలువ వుండేది కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్ ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు) రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.   

కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.

అన్నింటికంటే ముందు చేయాల్సింది,  ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలంపాటయినా,  ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని  ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బందికయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు.

రోడ్లు దాటడానికి  అనేక నగరాల్లో పలు చోట్ల లక్షలు ఖర్చు చేసి ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. వాహనాల నడుమ రోడ్డు దాటి వెళ్ళడానికే ప్రయత్నిస్తారు.  అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు వంటి చాలా నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.

ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.

ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు.

బాగా అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్  వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా,  జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా  విద్యుత్  స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక  జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది అనుమానమే మరి.   

పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో రోడ్ల మీద  ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని, సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.

అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై  వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి  స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.

ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.

తోకటపా:

ట్రాఫిక్ ఇబ్బంది అంటే ఏమిటో ప్రముఖ రాజకీయ నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి కూడా ఒకసారి తెలిసివచ్చింది. ఆ కధాక్రమంబు ఎట్టిదనిన:

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి క్లబ్ కార్యదర్శిగా నేనూ, ప్రెస్  ఫోటోగ్రాఫర్లు అందరం క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ రామచంద్రరావు కూడా వస్తున్నారు. ఖైరతాబాదు వైపు నుంచి వస్తున్న వాళ్ళ కారు,  రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని  ఆర్టీఏ ఆఫీసు పక్కనే ఉన్న  ప్రెస్  క్లబ్ కు రావాలి. అయితే  వై.ఎస్. కారు టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పట్లో మెట్రో లేదు).  కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళఎదుటే  అలా ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ  మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

22, ఏప్రిల్ 2023, శనివారం

అన్వర్ గారూ

 రంజాన్ శుభాకాంక్షలు

మీ ఈ పోస్టు చదవక పొతే జీవితంలో బోలెడు మిస్సయ్యేవాడిని. అంచేత అందులో కొన్ని పేరాలను, వాక్యాలను రాసి దాచి పెట్టుకున్నాను. తెలిసిన విషయాలను, తెలిసిన వాటిలో ఇంతవరకు తెలియని సంగతులను, అసలు బొత్తిగా తెలియని విషయాలను ఈ పోస్టు ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.  

నేను ఏరుకున్న ఆణిముత్యాలలో కొన్ని.

“అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి”

“కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో!”

ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ?

“అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా!”

“సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. “మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం.”

“పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది.”

“అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది”

“వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.”

“మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు” “జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది”

మరోసారి ధన్యవాదాలు అన్వర్ గారు మీ విలువైన  పండగ కానుకకు.

ఈద్ ముబారక్!

భండారు శ్రీనివాసరావు


(Image courtesy: Cartoonist Anwar)


22-04-2023

ఓ మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు

 ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.

ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”

బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.

పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!

నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.

నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్! ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”

ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా కూడా,  ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.

నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.

మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.

అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.

పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి  పోస్టింగుల మీద  ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.

ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.

సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. అవసరంలో ఉన్నవారికి  సాయం చేయగలిగిన మంచి పోస్టుల్లో ఎక్కువకాలం నన్ను వుంచుతారనే నమ్మకం నాకు లేదు.  ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె,  గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”

అది సరే! మీకు బదిలీల్లో  సాయం చేసిన వారి మాట చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”

సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”

విజయనగర్ కాలనీలో నివాసం  వుండే ఈ అధికారి భార్య రెండు సిటీ బస్సులు మారి, నారాయణ గూడాలో దీపక్ మహల్ పక్క సందులో వుండే  నర్సింగ్ హోం కి వచ్చేవారు. ఆఫీసు కారుని భార్యాపిల్లలను కూడా వాడనిచ్చే మనిషి కాదు.

మేనకోడలు వరసయ్యే ఓ లేడీ డాక్టర్ ది ఆ హాస్పిటల్. పైగా మా ఆవిడకి వాళ్ళ కుటుంబంతో చిన్నప్పటి స్నేహం. ఒకసారి ఆ అయ్యేఎస్ భార్యగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు నేను ఇంట్లోనే వున్నాను. ఆ అధికారి భార్య ఇలా అన్నారు. ‘మీ వారు మా వారి పనుల మీద ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు. మా ఆయన బయటే నిలబెట్టి మాట్లాడే వారు. మీరు (అంటే మా ఆవిడ) మద్రాసులో చదువుకున్నారు. మీకు తెలిసే వుంటుంది, మాకు (తమిళులకు) ఎన్ని పట్టింపులో. ఇవ్వాళ మీ ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతుంటే నాకు సిగ్గనిపిస్తోంది”   

(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి ఉన్నతాధికారులు ఆయనకి  పెట్టిన పేరు పిచ్చోడు)

19, ఏప్రిల్ 2023, బుధవారం

ఎవరేమనుకున్నా సరే! - భండారు శ్రీనివాసరావు

 అవకాశాలు రాని సమర్దులకన్నా, అవకాశాలు వచ్చిన అసమర్ధులకు మంచి పేరు వచ్చే రోజులివి. ఈ రెండో రకానికి చెందిన నేను ఆ రకంగా మా సీనియర్ల కంటే అదృష్టవంతుడిని. రిటైర్ అయిన తరువాత కూడా యేవో మనసులోని మాటలు వ్యాసాల రూపంలో రాసుకోగల బంగారు అవకాశం సాంఘిక మాధ్యమాల రూపంలో నాకు లభించింది.

వెనుకటి రోజుల్లో పత్రికలకు వ్యాసాలూ అవీ రాయడం గగనంగా వుండేది. ముందు రాయాలి. రాసింది మళ్ళీ సాఫు చేసుకుని తిరగ రాయాలి. రాసింది ‘తిరుగు టపాకు తగినన్ని స్టాంపులు జతచేసి’ మరీ పోస్టులో పంపాలి. అది చేరిందో లేదో తెలవదు. చేరినా చేరిందనే కబురు తెలవదు. ఆశ ఒదులుకున్న తరువాత ఎక్కడి నుంచో ఓ మిత్రుడు పోస్ట్ కార్డు రాసి పడేస్తాడు, ‘పలానా పత్రికలో మీ వ్యాసం చదివానని’. ఆ రచన పడ్డ పత్రిక వెతికి పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది.

ఇప్పుడలా కాదు. అంతా ఇన్ స్థంట్ కాఫీ మాదిరి. ఇలా రాసి అలా పోస్ట్ చేయడం తరువాయి బాగుందనో, బాగాలేదనో కామెంట్లు కూడా తయారు. కొందరయితే శ్రద్ధగా చదివి తప్పొప్పులను ఎత్తి చూపెడతారు. సరిదిద్దుకునే సదవకాశం కూడా వుంటుంది. అందుకే నేను పత్రికలకోసం రాసినప్పుడు, వారికి ఇష్టం వున్నా లేకపోయినా ఒక రోజు ముందే వాటిని ఫేస్ బుక్, బ్లాగు వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాను. యెంత జాగ్రత్తగా రాసినా కొన్ని స్ఖాలిత్యాలు దొర్లడం కద్దు. వాటిని ఎంచక్కా దిద్దుకోవచ్చు. అదీ నా స్వార్ధం.

కాకపోతే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పత్రికల్లో రాసినప్పుడు ఎవరికయినా నచ్చకపోయినా ఆ విషయం మనకు తెలిసేనాటికి చాలా రోజులు పడుతుంది. ఇక్కడ అలా కాదు, వెంటనే, మొట్టి కాయలు ఎలాంటి మొహమాటం లేకుండా వేసేస్తారు.

ఇన్నేళ్ళ వయస్సులో అవన్నీ పట్టించుకుంటే కష్టం. అందుకే ఎవరి ఇష్టం కోసమో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాసుకుంటూ పోతుంటాను.

పాత జోకు ఒకటి వుంది కదా!

దుకాణం బయట రాసి వుంటుంది.

మీరు అరువు అడుగుతారు. నేను ఇస్తాను. మీరు తిరిగి డబ్బు కట్టరు. చివరికి నేను బాధ పడతాను.

మీరు అడుగుతారు. నేను ఇవ్వను. ఇవ్వలేదని మీరు బాధపడతారు.

నేను బాధ పడడం కంటే మీరు బాధ పడడమే మేలు కదా!”

అల్లాగే ఇక్కడ కూడా. మీకు నచ్చాలని నాకు నచ్చనివి నేను రాయను.

మీరు ఏమనుకున్నా సరే!



NOTE: COURTESY IMAGE OWNER

18, ఏప్రిల్ 2023, మంగళవారం

ఆకిరి రామకృష్ణారావు గారు ఇక లేరు

 ఈ సంగతి చూచాయగా గంట క్రితమే తెలిసినా ఆ దుర్వార్తను ధ్రువపరచుకోవడానికి ఇంత సమయం పట్టింది. హైదరాబాదు ఆలిండియా రేడియో, దూరదర్సన్ వార్తా విభాగాల అధిపతిగా సుదీర్ఘ కాలం పనిచేసిన పిదప, పదవీవిరమణ అనంతరం వైజాగ్ లో సెటిల్ అయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థులుగా ఉంటూ, ఈ ఉదయం  తుది శ్వాస విడిచారు. ఆలిండియా రేడియోలో ఆయనతో కలిసి అనేక సంవత్సరాల ప్రయాణం నాది. మంచి స్నేహితుడు. అవసరానికి ఆదుకోవడంలో ముందువెనకలు చూసే రకం కాదు.

1987 లో నాకు రేడియో మాస్కోలో పనిచేసేందుకు మాస్కో వెళ్ళే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు రావాల్సి వుంది. ఈ నేపధ్యంలో, రామాయణంలో పిడకల వేటలా, హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపుతున్నందుకు  నన్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం, ఫలితంగా శాసన సభ ఒక రోజు వాయిదా పడడం, జర్నలిస్టుల సామూహిక ఆందోళనకు  దిగివచ్చిన ప్రభుత్వం  సంబంధిత పోలీసు అధికారిని బదిలీ చేయడం, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటనపై  న్యాయ విచారణకు ఆదేశించడం, మాజీ హై కోర్టు న్యాయమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీకావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలతో కలత చెందిన నాకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మాస్కో వెళ్ళిపోవాలని మనసులో పడింది. ఢిల్లీ వెళ్లి ఆర్డర్ పట్టుకొద్దామని ఆకిరి రామకృష్ణారావు చెప్పడంతో ఇద్దరం కలిసి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరి ఏపీ భవన్ లో దిగిపోయాము. బ్రేక్ ఫాస్ట్ కు ముందే ఆకిరి అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న మంత్రి పి. శివశంకర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన మమ్మల్ని వారి ఇంటికి రమ్మన్నారు. ఆటో పట్టుకుని పొతే, ఇంటి బయట పటిష్టమైన బందోబస్తు. పలానా అని చెప్పగానే తలుపులు తెరుచుకున్నాయి. వరండా పక్క గదిలో శివశంకర్ ఒక్కరే కూచుని  పనిచేసుకుంటున్నారు. ఆకిరిని చూడగానే ఆయన సాదరంగా లేచి ఆహ్వానించారు. నన్ను పరిచయం చేయబోతే ఆయన నవ్వి నాకు తెలియదా, రేడియో శ్రీనివాస రావు అన్నారు. ఆకిరి  మీనమేషాలు లెక్కబెట్టకుండా  సూటిగా వచ్చిన విషయం చెప్పేశారు. మా డైరెక్టర్ జనరల్ కు ఫోన్ కలపమని ముందు పియ్యేకి చెప్పి మళ్ళీ వద్దులే అని  RAX  ఫోన్లో అంటే పియ్యేలతో సంబంధం లేకుండా నేరుగా మాట్లాడడానికి వీలుండేది. ప్రధాని, కొందరు ముఖ్యమైన మంత్రులకు, ఉన్నతాధికారులకు  మాత్రమే ఈ సదుపాయం వుండేది)  మాట్లాడి నా వివరాలు చెప్పారు.

మేము ధన్యవాదాలు చెప్పి మా డీజీ ఆఫీసుకు వెళ్ళే సరికి అంతా  హడావిడిగా కనిపించింది. మా డైరెక్టర్ (పి) గుంటూరు రఘురాం గారు మమ్మల్ని చూడగానే, అమ్మయ్య వచ్చారా, హైదరాబాదు వాళ్ళు పంపిన మీ దరకాస్తు కోసం వెతుకుతున్నాము, ముందు ఈ ఫారం పూర్తి చేసి సంతకం పెట్టి ఇవ్వండి, అరగంటలో ఆర్డరు ఇస్తామని డీజీ, మంత్రి గారికి మాట ఇచ్చారు అని తొందర పెట్టారు.

అంతే! ఆయన అన్నట్టు అరగంటలోపలే నా ఆర్డరు కాగితం నా చేతిలో పెట్టారు. అలా వుంటుంది, ఆకిరి అడగకుండా చేసే సహాయం.

ఆకిరికి దైవభక్తి మెండు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే అంతా ఇంతా కాదు. స్వామికి ప్రీతికరమైన మంగళవారంనాడే ఆకిరి గారు కన్ను మూయడం విధి విచిత్రం.

ఆకిరి రామకృష్ణారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అంజనీపుత్రుడినే ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.  


(కీర్తిశేషులు ఆకిరి)


(18-04-2023)

16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఆయారాం గయారాం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 16-04-2023, SUNDAY, today)

 

జరుగుతున్న కధలు చూస్తుంటే జరిగిన కధలు గుర్తొస్తుంటాయి ఒక్కోసారి.

‘జనత పార్టీ’ ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ రాత్రికి రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు. ఆ  సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్, ఈ తరహా ‘రాజకీయ కప్పదాట్ల’కు కొత్తగా చేసిన నామకరణమే ఈ ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విషసంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 

ఏ రంగంలోనూ కానరాని ఈ అభివృద్ధి రేటు ఈ రంగంలో చూసి దేశంలోని  రాజకీయ పార్టీలే విస్తుపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం సన్నగిల్లి పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’ చాలా ఏళ్ళ కిందటే  ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’. దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాలను ‘స్కాచి’ వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు, ఈ బాండ్లు, సంతకాలు లక్ష్యపెడతారనుకోవడం అమాయకత్వం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత అయిదు దశాబ్దాల కాలంలో పాతిక ముప్పయికి పైగా ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారిపోయాయి. మరికొన్నిసార్లు రాష్ట్రపతి పాలన అదనం. 

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు. 

ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు, అందరిదీ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట.  అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల మాటల పట్ల  ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.  


పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల  అనంతరం.  ఆ విత్తనం   యెంత బలంగా పడిందంటే,  ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,  తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా  వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే, ఫిరాయింపులు యెంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.

1984  డిసెంబర్  29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం   28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి, ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  ఓటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. లేదా, రాష్ట్రపతి పాలన  విధించడం.  అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని   52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతోంది?  ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో, అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో పార్టీ మారిన వారి సంఖ్యను లెక్కవేయాలంటే అది చేతివేళ్ళతో సాధ్యం అయ్యే పనికాదు, కాలిక్యులేటర్లు కావాలి. ఈ లెక్కలు చూస్తే ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరిందా లేక ఫిరాయింపులకు చట్టబద్ధమైన మార్గాన్ని ఏర్పరిచిందా అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.

పార్టీ ఫిరాయింపులను దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లే పార్టీలు కోరుతుంటాయి.

నిజమే. ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలంలేకుండా నిర్వీర్యం చేస్తోంది.  

గతంలో ఎన్నికలకు ముందూ, లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి, పరిస్తితులకు  అనుగుణంగా ఇప్పుడవి నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి వీలు కల్పిస్తోంది. 


జూలియస్ సీజర్ నాటకంలో బ్రూటస్ అనే పాత్ర వుంటుంది. సీజర్ కు అతడు ఆరోప్రాణం. సీజర్ అంటే ప్రాణం ఇచ్చే తత్వం బ్రూటస్ ది. చివరికి ఏమైంది. సీజర్ ని అంతమొందించే కుట్రలో అతడూ పాలుపంచుకుంటాడు. ప్రత్యర్ధులు కత్తులు దూసి తనను పొడుస్తుంటే చలించని సీజర్, బ్రూటస్ తనను చంపడానికి కత్తి ఎత్తినప్పుడు మాత్రం అతడి మొహం వివర్ణమౌతుంది. ‘యూ టూ బ్రూటస్’ (బ్రూటస్ !నువ్వు కూడానా) అంటూ ఆశ్చర్యంగా అతడివైపు చూస్తూ ప్రాణాలు వదులుతాడు. 

రాజకీయాల్లో ఇవన్నీ సహజమని సరిపుచ్చుకోక తప్పని పరిస్తితి. ఎందుకంటే ఈనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అనేకమందికి ఇలాంటి అనుభవాలతో కూడిన గతమే వుంది. 


ఉపశృతి:

తమ పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా, పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’

నిజమే వారికోసమే సినారె పాట రాసివుంటారు. 

“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి, నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”