13, జులై 2024, శనివారం

అసెంబ్లీలో పనికొచ్చిన వినికిడి యంత్రంచాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పాలిస్తున్నప్పుడు మహేంద్ర నాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా వుండేవారు. నిజానికి ఆయన అప్పటికే రాజకీయాల్లో సీనియర్. జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి, ఇక చెప్పేది ఏదో చెప్పుకోండి  అన్నట్టు  నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.

8, జులై 2024, సోమవారం

రేపు మళ్ళీ పుడితే ఎంత బాగుణ్ణు

గత ఫిబ్రవరి నాలుగో తేదీ పోయిన రోజు.
జులై తొమ్మిది పుట్టిన రోజు.
మళ్ళీ రేపు పుడితే ఎంత బాగుంటుంది.
జరిగే పనేనా! 

కింది ఫోటో: 
పెళ్లి కుమారుడి దుస్తుల్లో మా రెండో వాడు సంతోష్.  ఇద్దర్నీ పోగొట్టుకుని నేను.

పోస్ట్ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి? – భండారు శ్రీనివాసరావు

 చాలా రోజులుగా ఒక విషయాన్ని గురించి విపులంగా రాయాలని అనుకుంటూ వస్తున్నాను. వీలు దొరకలేదు అని అబద్ధం చెప్పను, కానీ నేనే వీలు చేసుకోలేదు. ఇది నిజం. విషయం ఏమిటంటే పోస్టు రిటైర్మెంటు జీవితం.

2005  డిసెంబరు  ముప్పై ఒకటిన  నేను  దూరదర్సన్  నుంచి  రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. కానీ దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు. ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది. 2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను.  సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.

ఇప్పుడు మరో వ్యక్తిని గురించి చెప్పుకుందాం. ఆయన పేరు వనం జ్వాలా నరసింహారావు. నా బాల్య మిత్రుడు. చిన్నప్పుడు  స్కూల్లో సహాధ్యాయి. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేచాడు.

చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మొదలు పెట్టి  తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో  మారని ఇల్లు లేదు. అయితే,  ఈ ఒక్క విషయంలో మాత్రం  నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా  అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.

మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో,  హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ ఆలిండియా రేడియోలో. కాకపొతే చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం చేశాను. జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి.  అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం.

చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ. నాకూ ఆయనకు మధ్య ఒకటి రెండేళ్లే తేడా. కానీ  రిటైర్మెంట్ విషయంలో చాలా తేడాలు. ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది. ఒంటరితనం. ఒంటరిగా  జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.

విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు  లేవు.  వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.

ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనది రిటైర్మెంట్ జీవితమే. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ ఈ మధ్య నేను ఇల్లు వదిలి బయటకు  పోలేదు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో నా గది వదిలి  అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.

ఆయన ఇల్లు ఎప్పటిలా కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి  ఇలాగే చెప్పుకునేవారు. ఒకప్పటి  నా రేడియో సహోద్యోగి, న్యూస్ డైరెక్టర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు  అప్పటికే అక్కడ వున్నారు. గతంలో రోజూ కలిసే మేము, ఒకరినొకరం కలవక  చాలా కాలం అయింది. అలాగే ఎప్పుడో పరిచయం అయి చాలాకాలంగా కలవని మితృలు, శ్రేయోభిలాషులు వనం నర్సింగరావు గారు, వారి శ్రీమతి మాతాజీ, మా ఆవిడ ఆప్త మిత్రురాలు, బహిప్రాణం అయిన వనం గీత, భర్త వనం రంగారావు, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు, వదిన విమలాదేవి ఇలా అనేకమందితో జ్వాలా గృహం కొలువు తీరింది.

స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ.  మధ్యమధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు. అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్యమధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా.  హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.

 నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏరోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.    

ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా!  కాదని నాకు తెలుసు.

ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. నేనో సీతయ్యని.

(07-07-2024)

కింది  చిత్రం   జ్వాలా ఇంట్లో తీసినది 

 

     

 

       

 

5, జులై 2024, శుక్రవారం

సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు ఇక లేరు

 

 


ఈరోజు సాయంత్రం చిల్కూరు లోని బాలాజీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుంటే సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు గారు ఇకలేరంటూ మితృలు శ్రీ పారుపల్లి శ్రీధర్ మెసేజ్ పెట్టారు. ఆ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. ఉపేంద్రబాబు గారితో నా పరిచయం సుదీర్ఘమైనది ఏమీ కాదు. కేవలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. కానీ అది వంద సంవత్సరాలు గుర్తుంచుకోవాల్సిన పరిచయం.

వెనక్కి వెడితే.

 పందొమ్మిది వందల  డెబ్బయి ఒకటి, ఆగష్టు నెల, ఇరవయ్యవ తేది. విజయవాడలబ్బీపేటలోని ' ఆంధ్రజ్యోతికార్యాలయం.

అందులో అడుగు పెట్టి, కింద ఛాంబర్ లో కూర్చుని పనిచేసుకుంటున్న  ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా నావైపు  చూసినా పరిచయం కనుక్కుని, 'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పుఅన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్టతొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్రగారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. పీ.టీ.ఐ.యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం. ఆ విధంగా  ఉపేంద్రబాబు జర్నలిజంలో నా మొదటి గురువు. జర్నలిజంలో చమత్కారం ఏమిటంటే గురువులతో స్నేహం చేయవచ్చు.  ఆ క్రమంలో నేనే కాదు, ఆయనతో పనిచేసేవాళ్ళం అందరం ఆయనకు స్నేహపాత్రులం కాగలిగాం. నేను మరికొంత దగ్గరగా. అప్పటివరకు  శరత్ నవలలు చదివి  బాబు అనే పేరుపై మక్కువ పెంచుకున్నాను. (శరత్ బాబు  ‘భారతి’  నవలలో కథానాయకుడి పేరు అపూర్వబాబు)

ఆఫీసులోని మొదటి అంతస్తులో  గుర్రపునాడా ఆకారంలో ఒక పొడవాటి  బల్ల వుండేది. సబ్ ఎడిటర్లు అందరూ, అందరూ అంటే ఎందరో  అనుకునేరు, ఆరుగురు అంటే ఆరుగురు వుండేవారు. మళ్ళీ అందులో ఒక న్యూస్ ఎడిటర్, వీరభద్రరావు గారు నడి మధ్యలో. ఆయనకు అటూ ఇటూ సబ్ ఎడిటర్లం అందరం పరివేష్టితులమై పనిచేసుకుంటూ వుండేవాళ్ళం.

 

ఆ రోజుల్లో జర్నలిష్టుల జీతాలు మరీ నాసిరకంగా ఉండేవి. ఈ రోజుల్లో మరీ బాగా వున్నాయని కాదు. జీతాలకి, జీవితాలకి పొంతన లేని రోజులు అవి. నెలలో మొదటి వారానికే డబ్బు అవసరాలు వచ్చి పడేవి. ప్యూన్ నాగేశ్వరరావుతో ఒకరికొకరం  చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్కతప్పని అవసరాలు.

అందరిదీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి, దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవారు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్నిమరింత  గట్టిగా నిలిపి వుంచేది. అందరం అదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు. అలా అందరికీ ఉపేంద్రబాబు అనే పెద్దమనిషి, ఏటీఎంలు లేని ఆ రోజుల్లోనే ఏటీఎం మాదిరిగా, పెద్దమనసుతో  అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు చేసేవారు.  అదీ ఆయనతో మొదటి పరిచయం.

లబ్బీపేటలో మా ఇద్దరి ఇళ్ళు కూడా దగ్గరదగ్గరలో ఉండేవి. మా ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే సిలిండరు వెంటనే తెప్పించుకోగల పరపతి ఉద్యోగం ధర్మమా అని వుండేది. కానీ సిలిండర్ ధర ఇరవై మూడు రూపాయలు ఎవరివ్వాలి? ఎవరిస్తారు ఒక్క ఉపేంద్ర బాబు గారు తప్ప. ఆ రోజుల్లో కాల్ గ్యాస్ కనెక్షన్ తేలిగ్గానే దొరికేది. సిలిండర్లు కూడా. కానీ  డబ్బులో.  దానికి ఉపేంద్ర బాబే గతి. అంచేత నిశ్చింతగా వుండేవాళ్ళం. అడగగానే చేబదులు ఇచ్చేవారు. గ్యాస్ కోసం ఎందుకు చింత? ఉపేంద్ర ఉండగా మీ చెంత అని పాడుకునే వాళ్ళం. ఇంటా బయటా కూడా మంచి మనిషి అనిపించుకోవడం మాకష్టం. కానీ ఉపేంద్రబాబు ఆ విషయంలో గొప్ప మినహాయింపు.

జ్యోతిలో నేను ఆయనతో కలిసి పనిచేసింది కేవలం నాలుగున్నర సంవత్సరాలే. తోటి ఉద్యోగులను సాటి మనుషుల మాదిరిగా చూసే మంచితనం ఆయనది. మరికొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి వుంటే మరికొంత మంచితనం నా సొంతం అయ్యేదేమో.

నిన్న రాత్రి 86వ ఏట మరణించిన ఉపేంద్ర బాబు గారికి నా అశ్రునివాళి!

తోకటపా:

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి వర్ధంతి సందర్భంలో, ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం ఒకటి ప్రచురితం అయింది. అది చదివి శ్రీ ఉపేంద్ర నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదే ఇది.  

“ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.

(శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు)


(05-07-2024)

 

 

3, జులై 2024, బుధవారం

నిజంగా తప్పే - భండారు శ్రీనివాసరావుచిన్నప్పుడు మా వూరికి దగ్గరలో ఓ చిన్న రైలు స్టేషన్ వుండేది.

చిన్నప్పుడు వుండేది, ఇప్పుడు లేదా అంటే నిజంగానే లేదు. ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని ఎత్తేశారు. అదన్నమాట. ఆ స్టేషన్ ని ఆనుకుని ఒక ఎత్తయిన భవనం వుండేది. నిజానికి అది అన్ని వసతులువున్న భవంతి కాదు. రైల్వే వాళ్ళ సిగ్నల్ కేబిన్. అక్కడ పనిచేసేవాళ్ళని మచ్చిక చేసుకుని ఇనుపమెట్ల మీదుగా పైకెక్కి చూసేవాళ్ళం. తుపాకులు వరసగా తిరగేసిపెట్టినట్టు ఇనుప కమ్మీలు ఉండేవి. వాటిని గట్టిగా లాగి పెడితే ఎక్కడో దూరంగా వున్న రైలు పట్టాలు విడిపోవడమో, కలుసుకోవడమో జరిగేది. రైలు వెళ్ళే మార్గాన్ని మార్చడానికి అదో ఏర్పాటు. ఇప్పటికీ అలాగే ఉండవచ్చు. అక్కడ పనిచేసేవాళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తూ ఆ దోవన వెళ్ళే రైళ్ళు, ఒకదానితో మరొకటి డీ కొట్టుకొట్టుకోకుండా, సరయిన ప్లాటుఫారాలమీదికి చేరేలా చూసేవాళ్ళు. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఇక అంతే సంగతులు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో చాలామందిమి రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాము. రైల్వే వాళ్ళు ఇచ్చిన రగ్గులు కప్పుకుని, బెర్తులపై ఎంచక్కా ముడుచుకుని పడుకుని, కింద పట్టాలపై రైలు పరుగెడుతున్న చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటాము. ఏదైనా రైలు స్టేషన్ దగ్గర పడ్డప్పుడు, రైలు వేగంగా ఊగిపోతూ దడదడ లాడుతూ పట్టాలు మారుతున్న చప్పుడు విన్నప్పుడు గుండె కూడా అలాగే దడదడ లాడడం కద్దు. అర్ధరాత్రి వేళ జనం, అలా హాయిగా, వెచ్చగా ఏం భయం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు అంటే అలాటి కేబిన్ లలో పనిచేసే సిబ్బంది తమ నిద్ర మానుకుని పనిచేయడమే కారణం.

పొద్దున్నే లేచి వేడివేడి కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తాం. మనకోసం ఎవరో ఒకరు, డబ్బులకే కావచ్చు, తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, తెలతెలవారుతుండగానే, పాల ప్యాకెట్లు, పత్రికలు తెచ్చి, మన గుమ్మం ముందు వేయడం వల్లనే మనకీ వైభోగం అన్న సంగతి ఆ క్షణంలో గుర్తు రాదు.

ఇలా ఎందరో మహానుభావులు, వారి వారి జీవిక కోసమే కావచ్చు, కానీ వారి సుఖాలను ఒదులుకుని వేరేవాళ్ళు సుఖంగా బతకడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. అదంతా మర్చిపోయి, హాయిగా కాలు మీద కాలు వేసుకుని, ‘ఈ దేశంలో ఎవ్వరూ కష్టపడడం లేదు, నేను తప్ప’ అనే తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం నిజంగా తప్పే కదా!

2, జులై 2024, మంగళవారం

చిట్కా - భండారు శ్రీనివాసరావు“మీరు ఏదో తీవ్రమైన సమస్యతో బాధ పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్య. తల గోడకేసి కొట్టుకోవాలని అనిపిస్తుంది. ఛీ, ఈ బతుకు బతికేం లాభం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలనే నిర్వేదం కలుగుతుంది. లేదా మీ సమస్యకు కారణమైనవారిపై అకారణ ఆగ్రహం కలుగుతుంది”

ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఇలాంటివి అనుభవైకవేద్యమే.
ఈ స్తితి నుంచి బయట పడడానికి ఓ చిట్కా వుంది.
మీ మనసులో సుళ్ళు తిరిగే ఈ ఆలోచనలు అన్నింటినీ ఒక కాగితం మీద రాసుకోండి. ఆ కాగితాన్ని మీ తలగడ కింద పెట్టుకోండి. ఓ వారం పోయినతర్వాత తీసి చదువుకోండి. మీ పెదవులపై చిరునవ్వు చిందడం తధ్యం.
ఇంత చిన్న సమస్యకోసమా ఆ రాత్రి నిద్ర రాని ఆలోచనలతో సతమతమయ్యాను, ఈ చిన్ని సమస్యకోసమా ఆ రాత్రి తల పగలగొట్టుకుని బాధ పడ్డాను అని మీలో మీరే అనుకుని స్వాంతన పొందడం ఖాయం.

1, జులై 2024, సోమవారం

వున్నంతలో మానవ సేవ – భండారు శ్రీనివాసరావు


నిన్న ఆదివారం (30-6-24) వినుకొండ రైల్వే స్టేషన్ వందలాదిమంది జనంతో కిక్కిరిసిపోయింది. వారెవరూ ప్రయాణీకులు కాదు. ఆ స్టేషన్ లో చిరకాలం పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఓ చిరుద్యోగికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు వారు. ఓ రైల్వేఉద్యోగి, అదీ బుకింగ్ క్లర్క్ స్థాయి నుంచి సూపర్నెంట్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పడానికి ఇంతమంది జనం రావడం ఏమిటి? మేళతాళాల సందడి ఏమిటి?

ఇంతకీ ఎవరితగాడు? ఏమా కధ.  తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్ నలభయ్ ఏళ్ళు వెనక్కి పోవాలి.

స్టేషన్ లో నైట్ డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చాడు. ఇంటికి పోవడానికి రిక్షా కోసం చూసాడు. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ప్రాంగణంలో ఒకే ఒక రిక్షా కనబడింది. వెళ్లి ఎక్కాడు. రిక్షా మనిషి లాగలేక లాగుతున్నట్టు అనిపించింది. ఆరా తీసాడు. రెండు రోజులుగా జ్వరం. రిక్షా లాగకపోతే బతుకు గడవదు. అదొక్కటే ఆధారం. చేతకాకపోయినా బండి బయటకు తీశాడు. విషయం తెలియగానే మనవాడు వెంటనే రిక్షా దిగాడు. రిక్షా మనిషిని వెనక కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ అతడ్ని ఇంటికి చేర్చాడు. జేబులో వున్న డబ్బు లెక్కపెట్టకుండా తీసి అతడి చేతిలో పెట్టాడు. అతడితో చెప్పాడు, మర్నాడు ఉదయం మళ్ళీ వస్తానని, కొద్ది రోజులు రిక్షా తొక్కవద్దని. అంతవరకూ అతడి బాగోగులు తానె చూసుకుంటానని.

అన్నాడే కానీ, తను కూడా ఓ చిరుద్యోగి. ఉద్యోగం అప్పటికి పర్మనెంట్ కాలేదు. చేతికి వచ్చేది చాలా తక్కువ. మరి రిక్షా మనిషికి తోడు పడడం ఎలా. నిద్ర పోకుండా ఆలోచిస్తున్న అతడికి ఓ ఆలోచన స్పురించింది. అలా చేస్తే అందరూ ఏమనుకుంటారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇక అడుగు ముందుకు పడదు అని నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయంలో బాగోగులు కంటే రిక్షా మనిషి బాగోగులు ముఖ్యం అనుకున్నాడు.

అతడి ఇంటికి వెళ్ళాడు. రిక్షా తన చేతిలోకి తీసుకున్నాడు. పగలల్లా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు అతడి చేతిలో పెట్టి  నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇలా వారం రోజులు పగలు రిక్షా తొక్కి,  రాత్రీ ఉద్యోగం చేసీ, రిక్షా మనిషి ఆరోగ్యం కుదుటపడేవరకు శ్రమించాడు. ఈ విషయం మూడో మనిషికి తెలియదు.

తన నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఇలాంటి స్వచ్చంద సేవలు ఎన్నో చేశాడు. సాయం చేసిన తనకూ, సాయం పొందిన వారికీ తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

అందుకే పదవీ విరమణ రోజున అంత జనం. వినుకొండలోని ఆటో రిక్షాల వాళ్ళు అతడ్ని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద ప్రదర్శనగా తీసుకువచ్చారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి, ఉద్యోగ రీత్యా ఎక్కడో దూరంగా ఉన్న వినుకొండను తన స్వస్థలం చేసుకుని, నలుగురికీ తలలో నాలుకలా ఉంటూ, ప్రజాసేవ చేయడానికి పెద్ద పదవులు ఏమీ అక్కర లేదని, వున్నంతలో కూడా  అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చని నిరూపించాడు.

అతడి పేరు చామర్తి భవానీ శంకర్, మేమందరం శ్రీధర్ అని పిలుస్తాము. మాది బాదరాయణ సంబంధం కాదు. శ్రీధర్ ఎవరో కాదు,  స్వయానా మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు గారి బావమరది.


(01-07-2024)

29, జూన్ 2024, శనివారం

‘ఇదేమి సినిమా?‘

 


‘అదేమరి! మీ వయసు వాళ్ళు చూసే సినిమా కాదది.’

‘అవును. ఏమిటో ఆ యుద్ధాలు. ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కాలేదు. అదృష్టం ఏమిటంటే థియేటర్లో రుధిరం పారలేదు, అధునాతన మారణాయుధాల పుణ్యమా అని. ఆ యుద్ధాలు చూసిన తర్వాత సినిమాలో ఒక పాత్రకే కాదు, ఎవ్వరికీ చావు లేదేమో అనిపించింది.

‘ఇంకా

‘ ఒక్కో టిక్కెట్టు నాలుగు వందలు. యాభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి ఉద్యోగంలో మొదటి జీతం రెండువందల యాభయ్. మరి మండదా! ఆరువందల కోట్ల సినిమా అంటున్నారు. వారి డబ్బు బూడిదలో పోసినా, వారికి పన్నీరే దక్కుతోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలా వున్నాయిట భారీ స్థాయిలో  కలెక్షన్లు ఇంటా బయటా కూడా.  హైదరాబాదులో ఏ థియేటర్ లో కూడా మరో సినిమా లేదు, ఇది తప్ప, ఒకే దేశం ఒకే సినిమా లాగా. తీసిన వాళ్ళు సరే,  కానీ నా నాలుగు వందలు బూడిద పాలే కదా!’

‘తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే సినిమాకి ఆ మాత్రం డబ్బు ఖర్చు చేస్తే తప్పేమిటి’

‘’పోరాటాలు, యుద్ధాలు హాలీవుడ్ స్థాయిని మించిన మాట నిజమే. కానీ కధ సంగతి ఏమిటి? రివ్యూలు చదివి, చూసిన వాళ్ళు  కూడా ఏమీ అర్ధం కాలేదు అనేవాళ్ళు బోలెడుమంది.  అలాంటి కళ్ళు చెదిరే సన్నివేశాలు చూడడానికి ఇంగ్లీష్ సినిమాలు ఎలాగు వున్నాయి. అవతార్ లు, స్టార్ వార్స్ చూడలేదా! పైగా ఇందులో లేని యాక్టర్ లేడు అన్నట్టు బిల్డప్. అమితాబ్, ప్రభాస్, బ్రహ్మానందం ఇలా కొందర్ని తప్పిస్తే మేకప్ ముసుగులో ఎవర్నీ గుర్తు పట్టేట్టు లేరు. ఎవరో అంటుంటే వినబడింది, సినిమా మొదట్లో కనబడిన ఒక  పాత్రలో  నటించిన మనిషి రాజేంద్రప్రసాద్ లాగా అనిపించాడు అని. చివరికి, చివర్లో కనపడ్డ కమల్ హసన్ కూడా అంతే. జగన్నాధ రథచక్రాలు అనే డైలాగ్ ని బట్టి కొందరు గుర్తు పట్టారు. ఏదైనా అంటే ఈ చిత్రంలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కనిపించరు అని. ఈ మాత్రం దానికి అంత స్టార్ కాస్ట్ ఎందుకు, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి తప్పిస్తే    

‘అదే చెప్పేది, ఆ డబ్బు ఎవరికి పోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మనవే కదా! ప్రపంచ స్థాయి సినిమా తీసిన వారిని అభినందించాలి కానీ, ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా?

‘నేను చెప్పేది అదే. కోట్లాది డబ్బులు కోట్లాది డబ్బులు గుమ్మరించి ఇలా తీసే  అర్ధం పర్ధం లేని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, మరి కొందరు బడా నిర్మాతలు ఇదే దారి పట్టి, తెలుగు సినిమా ఖర్చును హాలీవుడ్ స్థాయికి పెంచుతారు. సినిమా స్థాయి సంగతి మరచిపోతారు. నిజమే! పెద్ద సినిమా ఒకటి బాగా ఆడితే పరిశ్రమను నమ్ముకుని బతుకు బండి లాగించే వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కానీ అందుకోసం లక్షలాదిమంది ప్రేక్షకులు చెల్లించుకునే మూల్యం మాటలేమిటి? ఇంతంత మొత్తాల్లో  డబ్బులు వాళ్ళూ, వీళ్ళూ తగలేయడం సమంజసమేనా!’

‘ఇక మీకు చెప్పడం నా తరం కాదు. మీ మనుమల్ని అడగండి, సినిమా ఎలావుందని, వాళ్ళు చెబుతారు మీకు సరైన సమాధానం.’  

(29-6-2024)  

 

26, జూన్ 2024, బుధవారం

అయస్కాంతం గా మారిన రాజకీయం - భండారు శ్రీనివాసరావురాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. కాదు కూడదని మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం అనుకోండి. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేశాం అనుకోండి. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం వుండి కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు, అది ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి  ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన 

‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తను వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు, ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.

ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.

ఆప్తవాక్యం:  నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం  ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు, పదవులు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.
చాలా మంది అలా చేసి చూపిస్తున్నారు కూడా.

24, జూన్ 2024, సోమవారం

ఆధునిక సీతాపహరణం

 

డోర్ బెల్ మోగుతుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఆడమనిషి వెళ్లి తలుపు తీస్తుంది.
‘అమ్మా! ఆకలి. ఏదైనా వుంటే పెట్టండి, మీ పేరు చెప్పుకుని తింటాను’
‘అయితే లోపలకు రా అన్నం పెడతాను’
‘లేదు, మీరే బయటకు రండి’
‘అయితే ఓకే!’
‘హ!హ! నా చేతికి చిక్కావ్. నేనెవర్నో తెలుసా? లంకాధిపతి రావణుడిని’
‘హ!హ! నేను సీతని కాను, వాళ్ళింట్లో పనిమనిషిని’
‘హ!హ! పనిమనిషివా? మరీ మంచిది. సీతను పట్టుకెడితే మండోదరికి కోపం వస్తుంది. పనిమనిషిని తెచ్చానని చెబితే ఎంతో సంతోషిస్తుంది. పాత పనిమనిషి మానేసినప్పటి నుంచి బాగా ఇబ్బందిగా వుంది’
‘హ!హ! నేను సీతను అయితే నా కోసం రాముడు ఒక్కడే వెతుక్కుంటూ నీ వెంట పడతాడు. నన్ను ఎత్తుకెళ్ళావని తెలిసిందంటే హోల్ మొత్తం అపార్ట్ మెంటులోని జనాలందరు వెతకడానికి బయలుదేరతారు, జాగ్రత్త!’
‘అలానా! అయితే వస్తా!’
(నువ్వు హ! హ!! అంటే నేనూ హ! హ!! అంటా)

పేరులోనే వుంది


 
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ  భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి  ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు  వస్తుంది. మీరు ఎన్నిసార్లు  ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు  సరిగా అనువాదం చేస్తున్నారో లేదో  కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు. 
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది. 
అందుకా, ‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది.

ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆ దేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో  ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”         
ఏమి సేతురా లింగా.....

23, జూన్ 2024, ఆదివారం

క్వాలిటీ టైంనెహ్రూ ప్రధమ ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో అనేక అంశాల మీద మేధావుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం ఒక పద్దతి పాటించేవారని ఆయన దగ్గర పనిచేసిన మత్తయ్ రాసుకున్నారు. (నెహ్రూ వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇంకా చాలా రాశారు అనుకోండి. అవి ఇక్కడ అప్రస్తుతం)
దేశవ్యాప్తంగా నెహ్రూకు సలహాలు ఇవ్వగలిగిన స్థాయి కలిగినవారిని ఎంపిక చేసుకుని ప్రధాని కార్యక్రమాలకు అనువుగా వుండే రోజుల్లో, ఒక్కొక్కరినీ విడివిడిగా ఢిల్లీకి ఆహ్వానించేవారు. బ్రేక్ ఫాస్ట్ బల్ల మీద భేటీ జరిగేది. ఒక అంశం అని కాకుండా కబుర్లు చెప్పుకునేరీతిలో సంభాషణ సాగేది. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసేలోగా ఏదో ఒక అంశంపై నెహ్రూకు అవసరమైన సమాధానం లేదా సమాచారం ఆ వ్యక్తి నుంచి అందేది. అవగాహన కలిగేది. ఇతరులు ఎవరూ వుండరు కాబట్టి , ఎలాంటి అంతరాయాలు లేకుండా వారిరువురూ నిష్కర్షగా చర్చించుకునే వీలుండేది. దాపరికాలు లేకుండా మాట్లాడుకునే అవకాశంవుండేది.
దీన్ని ఇప్పటి ఆధునిక కార్పొరేట్ పరిభాషలో క్వాలిటీ టైం అంటారుట

22, జూన్ 2024, శనివారం

ఉత్సుకత కోల్పోతున్న వార్తలు


ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్నప్పుడు మాకు ఏ కొరతా వుండేది కాదు,  ఒక్క తెలుగు పేపర్ రాదే అన్న లోటు తప్ప. అందుకే ఇండియా నుంచి మా వాళ్ళు ఏదయినా సరుకులు అంటే చింతపండు, బెల్లం  లాటివి పంపేటప్పుడు వాటిని న్యూస్ పేపర్ లలో చుట్టి పంపాలని కోరేవాళ్ళం. ఆ విధంగానయినా ఆ  పాత పేపర్లలోని  పాత  వార్తలనయినా  తాజాగా  చదువుకోవచ్చన్నది మా తాపత్రయం. ఆ రోజుల్లో  మాస్కోలో విదేశీ పత్రికలు  దొరికేవి కావు. విదేశీ రేడియోలు వినబడేవి కావు. విదేశీ టీవీ ఛానళ్ళు కనబడేవి కావు. అందుకని ఇండియా వార్తలకోసం ముఖ్యంగా తెలుగు వార్తలకోసం మొహం వాచినట్టుగా వుండేది. నేను పని చేసేది మాస్కో రేడియోలో కాబట్టి కొంత పరవాలేదు. కాస్త  ఆలస్యంగానన్నా యేవో కొన్ని వార్తలయినా చెవిన పడుతుండేవి. కానీ వాటిని శ్రోతల చెవిన వేయాలంటే వెయ్యి అడ్డంకులు. ఒక రోజు ఎం జీ రామచంద్రన్ మరణించిన వార్త వచ్చింది. కానీ వెంటనే ప్రసారానికి నోచుకోలేదు. ఎందుకంటె ఆ మదరాసీ రాజకీయ నాయకుడు ఢిల్లీ లోని ఫెడరల్ ప్రభుత్వానికి అనుకూలమో కాదో నిర్ధారణ చేసుకునేవరకు ఆ చావు వార్తను చావనివ్వకుండా బతికించే వుంచారు.
పోతే, సమాచారానికి సంబంధించినంతవరకు  మాస్కోలో వున్న మిగిలిన ఇండియన్ల పరిస్తితి మరీ ఘోరం. అర్ధం కాని రష్యన్ టెలివిజన్, చదవడానికి భాష తెలియని  రష్యన్ పత్రికలూ తప్ప, కనీసం ఒక్క  ఇంగ్లీష్ పత్రిక  కూడా కనబడేది కాదు.  అయితే ఈ విషయంపై  మాస్కోలోని హిందుస్తానీ  సమాజ్ చేసిన  అభ్యర్ధన మేరకు ఇండియన్ ఎంబసీ వారు ఢిల్లీ నుంచి కొన్ని ఇంగ్లీష్ దినపత్రికలు తెప్పించేవారు.  పదిరోజులకోమారు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చే డిప్లొమాటిక్ బాగ్ లో ఈ పత్రికలు భారత రాయబార కార్యాలయానికి చేరేవి. మాస్కో రేడియో నుంచి మూడు మెట్రో రైల్వే స్టేషన్ల  అవతల ఇండియన్ ఎంబసీ వుండేది. రేడియోలో పనిచేసే భారతీయులం వంతులు వేసుకుని  ఎంబసీ కి వెళ్లి పత్రికలు పట్టుకొచ్చేవాళ్ళం. ఈ బాధ్యతను ఒకటికి రెండు సార్లు నేనే భుజానికి ఎత్తుకునేవాడిని. దీంట్లో నా స్వార్ధం కూడా కొంత వుంది. ఇంటికి తిరిగి వస్తూ ఎంచక్కా మెట్రోలోనే కొన్నిపేపర్లు చదువుకోవచ్చు. అంతేకాదు, డిప్లొమాటిక్ బాగ్ లోనే మాస్కోలోని ఇండియన్లకు ఉత్తరాలు కూడా  వచ్చేవి. అదెలాగంటే, హైదరాబాద్ లో కానీ మరో చోట వున్న వారు కానీ మాస్కోలో వున్న తమ వాళ్లకు  జాబు రాయాలనుకుంటే ఎయిర్ మెయిల్ అవసరం లేదు. కవరుపై   పేరురాసి కేరాఫ్ ఇండియన్ ఎంబసీ, మాస్కో -  విదేశీ వ్యవహారాల శాఖ, న్యూ ఢిల్లీ అని రాసి ఢిల్లీ కి పోస్ట్ చేస్తే – అది డిప్లొమాటిక్ బాగ్ ద్వారా మాస్కో చేరేది. కాకపొతే ఆ ఉత్తరాలను ఎంబసీ కి వెళ్లి ఎవరికి వారే తెచ్చుకోవాలి. ఉత్తరాలతో పాటు అలా తెచ్చుకున్న పత్రికలనే –రేడియో మాస్కో బిల్డింగ్ లో వున్న భారతీయులం  అందరం అపురూపంగా చదువుకునేవాళ్ళం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే – దూరంగా వున్నప్పుడు  సొంత వూరి సమాచారం కోసం మనిషి ఎంతగా వెంపర్లాడి పోతాడో చెప్పడానికి.
అయితే, ఇప్పుడు విదేశాల్లో వుంటున్న భారతీయులకు కానీ, ప్రత్యేకించి తెలుగు వారికి కానీ ఇలాటి ఇబ్బందులు వున్నట్టు లేదు. ఉపగ్రహాల ద్వారా సమాచార  వినిమయం పెరిగిన తరువాత విషయాలు తెలిసిరావడానికి అమలాపురంలోవున్నా ఒకటే అమెరికాలో వున్నా వొకటే. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల పుణ్యమా అని ఎలాటి కబురయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది.
ముప్పయి నలభయ్ ఏళ్ళ క్రితం మన దగ్గర కూడా  పరిస్తితి వేరుగా వుండేది. ఆ రోజుల్లో ఏదయినా వార్త ముందు తెలిసినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్రుత వుండేది. విషయం తెలుసుకున్న వారు కూడా తెలిపినవారిపట్ల కృతజ్ఞతతో వుండేవారు. ప్రత్యేకించి వార్తా పత్రికల్లో, రేడియోలో పనిచేసే వారిపట్ల ఒక ప్రత్యేక గౌరవభావం సమాజంలో వుండడానికి కూడా ఇది ఒక కారణం. కొన్ని విషయాలు జర్నలిష్టులు ఫోను చేసి చెప్పేవరకు అధికారులకు, మంత్రులకు కూడా ముందుగా తెలిసేవి కావు. రేడియోలో వార్తలు రోజూ నియమబద్ధంగా నియమిత సమయాల్లో మాత్రమే ప్రసారం అయ్యేవి. పత్రికలు చదవాలంటే మరునాటి దాకా ఆగాలి. అందుకే మాకు ముందుగా తెలిసిన వార్తలను తెలిసినవారితో పంచుకోవడం ఒక ఉత్సాహంగా వుండేది. ఉదాహరణకు సంజయ్ గాంధీ దుర్మరణం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల దారుణ హత్య, అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత మొదలైనవి.
రాజీవ్ గాంధీ హత్య గురించి హైదరాబాదులో కంటే మాస్కోలో వున్న మాకే ముందు తెలిసింది. అలాగే, మానుంచి వార్తలు తెలుసుకోవాలనే వాళ్ళల్లో కూడా  ఓ ఆత్రుత  కనబడేది. కానీ,   ఇప్పుడో!. మిన్ను విరిగి మీద పడ్డంత సంచలన సమాచారం తెలుపుదామని ఎవరికయినా ఫోను చేసారనుకోండి. ‘ఓస్ ఇదా! మాకెప్పుడో తెలుసు. టీవీ స్క్రోలింగుల్లో ఆల్రెడీ చూసేశాము’ అనేస్తారు. అందుకే,  వార్త అనే దానిలో ఒకప్పుడు దాగున్న ఉత్సుకత ఇప్పుడు కలికానికి కూడా లేకుండా పోతోంది.

21, జూన్ 2024, శుక్రవారం

పృచ్ఛకుడిగా ప్రధాన మంత్రిహైదరాబాద్ లో జరిగిన శ్రీ నాగఫణిశర్మ మహా శతావధానంలో ఒక పృచ్ఛకుడిగా నాటి ప్రధానమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు అడిగీ అడగని ప్రశ్న:

శ్రీ పీవీ: 
“ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్న నాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

శ్రీనాగఫణి శర్మ :

”సకల భారతమును శాసింపగల రేడు 
ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె
ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన
ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”