‘నీకు బాగా డబ్బులు వుంటే ఏం చేస్తావ్’ అని అడిగితే, ‘పుల్ల ఐస్ క్రీం బండి
కొనుక్కుంటా’ అని అమాయకంగా
జవాబు ఇచ్చే చిన్నతనపు రోజులు. సీవీఆర్ స్కూలుకు ఎదురుగా ఉండేవాడు ఈ బండి వాడు
గంటలు కొట్టుకుంటూ. వాడు, వాడి పిల్లలు
ఎంత అదృష్టవంతులో అనిపించేది. దాని వైపే చూస్తూ, కొనడానికి డబ్బులు వుండేవి కాదు కాబట్టి,
రోడ్డు దాటి సిటీ సివిల్ కోర్టు కేంటీన్ వైపు వెళ్ళేవాళ్ళం నేను, శాయిబాబు, భయం భయంగా. మా లక్కు బాగుంటే
బావగారి కంట పడకుండా, కోర్టు
గుమాస్తా గారి కంట్లో పడే వాళ్ళం. మిమ్మల్ని చూడగానే ఆయన రండి రండి అంటూ, మా ప్లీదరుగారి పిల్లలు అని క్లయింట్లకు
పరిచయం చేసి వారి డబ్బులతోనే మాకు టిఫిన్లు పెట్టిన్చేవాళ్ళు. వేడి వేడి మైసూరు
బజ్జీలు, మరోసారి
కొబ్బరి చట్నీ వేయించుకుని లొట్టలు వేసుకుంటూ తిని నెమ్మదిగా జారుకుండేవాళ్ళం.
కోర్టు గుమాస్తా గారి పేరు శ్రీరాములు. వయసులో మా బావగారి కంటే పెద్ద
వయసులో. ఆయనే అప్పుడప్పుడు మా ఇద్దర్నీ వెంటబెట్టుకుని బీసెంటు రోడ్డులోని దుర్గా
కాఫీ హౌస్ కి తీసుకువెళ్ళేవాడు. బయట అందరూ తినేచోట కాకుండా, లోపల ఒక గదిలో పీటలు
వేసి, సిల్వర్ ప్లేటు మీద విస్తరి ఆకు వేసి టిఫిన్లు పెట్టేవాళ్ళు. వేడివేడి
ఇడ్లీలు, అడిగినంత
కొబ్బరి చట్నీ, సాంబారు, కారప్పొడి, అల్లం చట్నీ చాలా రుచిగా చేసేవాళ్ళు.
గుమాస్తా గారు మాత్రం కాఫీ మాత్రం తాగేవారు. అలా దాదాపు పదేళ్లు పనిచేసిన
శ్రీరాములు గారు వయసు మేడ పడి సెలవు పుచ్చుకున్న తర్వాత మరో కొత్త గుమాస్తా
చేరారు. అయితే అప్పటికి నా చదువు ఖమ్మానికి మారింది.
ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెంకటేశ్వర్లు గారనే మాస్టారు సాయంత్రం వేళ
వచ్చేవారు. ఆయన కోపిష్టి కాదు కానీ చాలా స్ట్రిక్ట్. ఎక్కాలు చెప్పేటప్పుడు మా
చూపుడు వేలు గోరు మీద తన గోరు పెట్టి, తప్పు
చెప్పినప్పుడల్లా గట్టిగా నొక్కేవారు. ప్రాణం పోతుంది అన్న నొప్పి వేసేది. ఆ బాధలో
మళ్ళీ తప్పు చెప్పేవాళ్ళం. ఆయన మళ్ళీ నొక్కేవాడు. ఈ తతంగం అక్కడ ఉన్నవారికి కూడా
కనపడదు. మేము ఎందుకు ఏడుస్తున్నామో ఎవరికీ తెలియదు. ఎక్కాలు సరిగా చెప్పడం లేదని
అనుకునేవాళ్లు. అసలు ఈ ఎక్కాలు ఎందుకు? రెండు రెండు
నాలుగు సరే, పదమూడు పదమూళ్ళు
ఎంతయితే ఎందుకు? కూడు పెడతాయా, గుడ్డపెడతాయా అనే విధంగా సాగేవి నా
ఆలోచనలు.
చిన్నప్పుడు నాకు తగని దైవ భక్తి. మా బావగారి ఇంట్లో పెరగడం ఒక కారణం అయితే, దేవుడికి పూజలు చేస్తే కోరిన కూరికలు తీరుస్తాడు అనే నమ్మకం ప్రబలడం.
దేవుడా దేవుడా నీకు దండం పెడతాను, మేష్టారు
కొట్టకుండా నాకు చదువు వచ్చేట్టు చూడు అనేది నా నిత్య ప్రార్థన. చదువు రాకపోతే పీడాపాయే, ఆయన
కొట్టకుండా చూడు అనేది నా అనుబంధ ఆకాంక్ష. ఆ దేవుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు.
అయినా పొద్దున్నే లేచి స్నానం చేసి, విభూతి పట్టెడలు నుదుటి మీడా, భుజాల మీదా రాసుకుని చొక్కా లేకుండా, చెట్ల బజారులు అరండల్ సత్రానికి ఎదురుగా
వున్న శివాలయానికి వెళ్లి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, నంది విగ్రహం కొమ్ముల మధ్య నుంచి శివ
లింగాన్ని ఓ మారు చూసి శివుడి ఎదురుగా నిలబడి, వినాయక చవితి పూజలో బట్టీ పట్టిన రెండు
మూడు పద్యాలు పాడి, దణ్ణం
పెట్టుకుని, కాసేపు
అక్కడే బాసింపట్లు వేసుకుని కూర్చుని, గుడి ఆవరణలో
వున్న శివలింగం పూల చెట్టు రాల్చిన కొన్ని పూలు (ఈ పూలకు ఏదో పేరుంది, శివ నాగమల్లి అని గుర్తు. చిన్న లింగంపై
పాము పడగ మాదిరిగా వుంటుంది) ఏరుకుని ఇంటికి వచ్చేవాడిని. నా భక్తికి ఇంత
ఘనమైన చరిత్ర వుంది.
ఇక నెలకో రెండు నెలలకూ ఓ మారు మా అక్కయ్య రిక్షాలో మమ్మల్ని దుర్గ గుడికి తీసుకు వెళ్ళేది. వన్ టౌన్ లో ఉన్న
దుర్గగుడి మెట్ల దగ్గర రిక్షా ఆగగానే నేను ముందంటే, నేను ముందంటూ పిల్లలం మెట్ల మీద పరుగులు
పెట్టేవాళ్ళం. మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నవారికి ఐదో పదో పైసలు వేస్తూ మా
అక్కయ్య నెమ్మదిగా వచ్చేది.
దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి
తీసుకుంటుంది. విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల, ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని
స్థల పురాణం. అలాగే, మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం.
అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి
నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.
దుర్గ గుడిలో వున్న కాసేపు కళ్ళు మూసుకుని భక్తితోనే వుండేవాళ్ళం. ఒకటికి
రెండుసార్లు సాష్టాంగనమస్కారాలు చేసేవాళ్ళం. గర్భగుడి ద్వారంపై రాసివున్న, ‘మాణిక్య
వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం
మనసా స్మరాణి’ అనే శ్లోకానికి అర్ధం తెలియక పోయినా పెద్దగా
చదివేవాళ్ళం. మా దృష్టి ప్రధానంగా అమ్మవారి ముక్కు పుడకపై వుండేది. దానికి కారణం, ఏదో ఒకనాడు పక్కన పారే కృష్ణమ్మ పొంగి అమ్మవారి
ముక్కు పుడకను తాకి, దాన్ని
తీసుకుని వెళ్ళిపోతుందని, అది జరిగిన
నాడు ఈ కలి యుగం అంతం అవుతుందనీ అంతకు ముందు విని వుండడమే. ఇవన్నీ ఎందుకు
రాస్తున్నాను అంటే ఆ రోజుల్లో దుర్గగుడి దర్శనాలు ఎంత సులభంగా జరిగేవి అనే విషయమం
ఈ తరం వారికి తెలియచెప్పడం కోసం. దర్సనం
కాగానే శఠారి, అమ్మవారి కుంకుమ తీసుకుని మల్లేశ్వర స్వామి దేవాలయం వైపు పరుగులు
తీసేవాళ్ళం, పెద్దవాళ్లు వచ్చేలోగా మధ్య దారిలో ఉన్న గోపికా కృష్ణుల విగ్రహాల వద్ద
కాసేపు ఆగి, కృష్ణుడి చుట్టు వున్న గోపికలు తమ చేతుల్లోని పిచికారీలతో నీళ్ళు చల్లుతున్న
దృశ్యాలను కళ్ళారా చూడడానికి. రంగురంగుల దీపాలతో చాలా మనోహరంగా వుండేది. మల్లేశ్వర
దేవాలయం దుర్గగుడి కంటే పెద్దే అయినా అక్కడ పెద్దగా జనం వుండేవారు కాదు. తీరిగ్గా ప్రదక్షిణలు చేసి మరింత తీరుబడిగా దర్శనం
చేసుకుని, అక్కడ వున్న
నిలువెత్తు విభూతి గుండ నుంచి విభూతి తీసుకుని మొహాలకు రాసుకుండేవాళ్ళం. గుడి ఆవరణలో అద్దాల మేడ చూడడం మాకు ఇష్టం.
దానికి టిక్కెట్టు వుంది. లోపల ఎటు చూసినా నిలువెత్తు అద్దాలే. పక్కనా, పైనా అద్దాలే. బ్రూస్ ళీ సినిమాలో మాదిరిగా
ఎటు చూసినా మాకు మేమే కనబడేవాళ్ళం. మా చిన్నతనంలో ఇలాంటివే మాకు విభ్రమ కలిగించే
వింతలు.
అటునుంచి అటే కిందికి మెట్లు
వున్నాయి. దిగి రిక్షా ఎక్కేటప్పుడు అనిపించేది పక్కనే రోడ్డు దాటి కృష్ణా
బ్యారేజ్ చూసివస్తే ఎలా వుంటుంది అని. అయితే ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ వుండేది
కాదు.
కింది ఫోటో:
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి