12, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (35) - భండారు శ్రీనివాసరావు

 

స్కూలుకు డుమ్మా కొట్టడం ఎన్నడూ చేయలేదు కానీ, మిగిలిన వ్యాపకాలపై ఉన్నంత శ్రద్ధ  చదువు పట్ల చూపడం లేదన్న సంగతి మా అన్నయ్యకు తెలిసి పోయింది. కేశవరావు గారి ఇంటి ఎదురుగా రాముడు మంచి బాలుడు అనే తరహా మోహనరావు గారు మెరిట్ స్టూడెంట్ ఉండేవాడు. తర్వాత ఇంజినీర్ అయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు కూడా. వయసులో నా కంటే పెద్దవాడు. నన్ను ముద్దు చేసేవాడు. దగ్గర కూచోబెట్టుకుని , అక్కినేని నాగేశ్వర రావు సినిమాలో ఒక పాట, మేనాలోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా  అనే పాటను నా చేత పదేపదే పాడించుకుని వినేవాడు. ఇలా పాటలతో, ఆటలతో  కాలక్షేపం చేస్తున్న సమయంలో, నిమిషం నిమిషం తేడాతో మూడు కారు హారన్లు వినపడేవి. ఇంటికి దగ్గరలో వున్న  మూడు మలుపులు తిరిగి మా అన్నయ్య వ్యాను వస్తోందని అర్ధం అయ్యేది. చటుక్కున గేటు తీసుకుని ఇంట్లోకి పరిగెత్తి పుస్తకం పట్టుకునే వాడిని. ఆయన కారు దిగి డ్రైవర్ కి చెప్పాల్సింది చెప్పేసి నేరుగా తన గదిలోకి వెళ్ళేవాడు. ఆయన తెలివి అమోఘం. నాకు పుస్తకం పట్టుకోవడం అంటే బద్ధకం అని గ్రహించాడు.

స్టేషన్ రోడ్డు సీదా వెడితే మునిసిపాలిటీ ఆఫీసు. దానిపక్కనే జిల్లా గ్రంధాలయ శాఖ. అక్కడి నుంచి అనేక పుస్తకాలు, అన్నీ నవలలు, కదల పుస్తకాలు తెచ్చి నాకిచ్చి చదవమనేవాడు.  ఏదోవిధంగా చదవడం అలవాటు చేయాలనేది ఆయన తాపత్రయం. ఆ విధంగా చాలా చిన్న వయసులోనే శరత్ సాహిత్యం, జైనేంద్ర సాహిత్యం, విశ్వనాధ సాహిత్యం మొత్తం చదివేశాను. అలాగే ఇంటికి వచ్చే దినపత్రికలు, వార పత్రికలు. ఈనాడు తెలుగులో ఏదైనా నాలుగు ముక్కలు  రాయగలుగుతున్నాను అంటే అది మా అన్నయ్య పుణ్యం.

స్కూలు జీవితంలో చేసిన ఘన కార్యాలు ఏవీ లేవు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం తప్పిస్తే. రిక్కబజారు స్కూలుకు దగ్గరలో తాత కొట్టు వుండేది. అక్కడ జీడి ఉండలు, పప్పు ఉండలు, చాక్లెట్లు, సరే మనకు (అప్పటికి) అలవాటు లేని కిళ్ళీలు, సిగరెట్లు. నన్ను బాగా ఆకర్షించింది ఇవన్నీ కాదు, గంటకు అణాకు అద్దెకు ఇచ్చే సైకిళ్ళు. అలా ఒకసారి సైకిల్ తీసుకుని నడిపించుకుంటూ దగ్గరలో వున్న పెవిలియన్ గ్రౌండ్ కు వెళ్లి అక్కడ తొక్కే ప్రయత్నం చేసేవాళ్ళం. సీటు మీద కూర్చొంటే కాళ్ళు ఫెడల్ కు ఆనేవి కావు. అలాంటి వాళ్ళకోసం కాంచీ తొక్కుడు అనే పద్దతి ఒకటి వుందని తెలిసింది. అంటే సీటు మీద కూర్చోకుండా సైకిల్ ఫ్రేము మధ్యనుంచి కాళ్ళు పెట్టి తొక్కడం. కాళ్ళూ చేతులు గీసుకుపోయి, మోకాలి చిప్పలు పగలగొట్టుకున్న తరువాత మొత్తం మీద సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. ప్రాక్టీసు చేయడానికి సైకిల్ ఎవరింట్లో సైకిళ్ళు లేవు. హీరో, ర్యాలీ, అట్లాస్ బ్రాండ్ సైకిల్ వుంటే ఈ రోజుల్లో బెంజ్ కారు ఉన్నంత హోదా. మా పెద్ద బావగారు రామారావు గారికి మంచి కండిషన్ లో వున్న సైకిల్ వుంది. చీకటి పడితే లైట్ వెలగడానికి చిన్న మోటారు ఏర్పాటు వుండేది. చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ మోటారు పనిచేసి, హ్యాండిల్ కు బిగించి  వున్న లైట్ వెలిగేది. లైట్ లేని సైకిళ్ళను రాత్రిపూట  పోలీసులు పట్టుకుని జుల్మానా వేసే వాళ్ళు. బావగారి సైకిల్ కి ఇలా అన్ని హంగులతో పాటు తాళం వేసే ఏర్పాటు కూడా వుంది. ఊరికి వెళ్ళేటప్పుడు దాని తాళం చెవి కూడా వెంటబెట్టుకు వెళ్ళేవాడు. ఎప్పుడైనా టైరు పంచర్ పడ్డప్పుడు మెయిన్ రోడ్డు  వరకు నడిపించుకుంటూ వెళ్లి, పంచర్ వేయించే బాధ్యత పడేది. వేయించి  తిరిగి వచ్చేటప్పుడు దర్జాగా తొక్కుకుంటూ ఇంటికి తెచ్చేవాడిని. ఇల్లు మరింత దూరంలో వుంటే బాగుండు అనిపించేది, వచ్చేటప్పుడు. 

చిన్నప్పుడు సైకిల్ పిచ్చి బాగా వుండేది. పరీక్ష తప్పి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపరేషన్ పేరుతొ కొన్నాళ్ళ పాటు మా ఊరు కంభంపాడు వెళ్ళేవాడిని. అయిదారుగురం కలిసి సైకిళ్ళు వేసుకుని ముప్పయ్ కిలోమీటర్ల దూరంలో వున్న నందిగామకు వెళ్లి మొదటి ఆట సినిమా చూసి వచ్చేవాళ్ళం. పోయేటప్పుడు బాగానే వుండేది కాని, వచ్చేటప్పుడు కటిక చీకటి. ఆ రోజుల్లో బెజవాడ- హైదరాబాదు మధ్య సింగిల్ రోడ్డు. ఎదురుగా లారీలు, బస్సులు వస్తుంటే వాటి హెడ్ లైట్ల కాంతికి కళ్ళు బైర్లు కమ్మేవి. దూరంలో లైటు కనబడగానే, ముందుగానే సైకిల్ దిగి రోడ్డు పక్కన ఆ లారీ వెళ్ళేదాకా నిలబడే వాళ్ళం. మొత్తం మీదం బితుకుబితుకుమంటూ  ఇళ్లకు చేరేవాళ్ళం. మేము తిరిగివచ్చేదాకా మా అమ్మగారు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేది. 

‘ఎందుకు భయం, మేమేమన్నా చిన్నపిల్లలమా!’ అనేవాళ్ళం, మేకపోతు గాంభీర్యంతో

అన్ని కధలకు ఉన్నట్టే నా సైకిల్ కధకు కూడా తొందరలోనే ముగింపు కార్డు పడింది.

మా పెద్ద బావగారు రామారావు గారి రెండో అమ్మాయికి పెళ్లి కుదిరింది. వరుడు మా క్లాస్ మేట్ అయిన జూపూడి ప్రసాద్. పెద్ద మేనకోడలు, హైమక్కయ్యకు (వరుసకు మేనకోడలు కానీ, వయసులో మాకంటే చాలా పెద్ద. అందుకే అక్కయ్య అని పిలవడం అలవాటు అయింది)  అంతకు ముందే పెళ్లి అయింది. కల్లూరు సంబంధం. ప్రతి ఊరికి దొరలు ఉంటారని, మా హైమక్కయ్య భర్త కొండపల్లి లక్ష్మీ నరసింహా రావు గారిని  అందరూ  కల్లూరు దొరవారు అని పిలుస్తుంటే అర్ధం అయింది. పెద్ద మేనల్లుడు డాక్టర్ ఏపీ రంగారావు చనిపోయిన తర్వాత ఇప్పుడు మా కుటుంబంలో హైమక్కయ్యే అందరికీ పెద్ద దిక్కు. 85 ఏళ్ల వయసులో కూడా ఒక్కతే కల్లూరులో వుంటూ సొంతంగా వంటచేసుకుని, ఇంటికి వచ్చిన వాళ్లకు వండి పెడుతూ వుంటుంది. తెలంగాణా ప్రాంతంలో దొరల రాజ్యం ఏనాడో పోయినా, చుట్టుపకల వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆమెను దొరసాని అనే పిలుస్తారు. నెలకోసారి అయినా, హైదరాబాదులో ఉంటున్న మాకు ఫోను చేసి, ఎలా వున్నారని మమ్మల్ని  గురించి వాకబు చేస్తుంది. కల్లూరు రమ్మని పదేపదే చెబుతుంది. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా పాత కాలపు ఆపేక్షలు గుర్తుకు వస్తాయి. క్రమంగా అవి అంతరించి పోతున్నాయేమో అని భయం వేస్తుంది.

రిక్కా బజారు స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్న జూపూడి ప్రసాద్ కి కానీ, మాకు కానీ పెళ్లి అంటే తెలియని వయసు. వాళ్ళనాన్న గారు, నరసింహారావు గారు ఖమ్మం మొత్తంలో కిరోసిన్, పెట్రోలు, డీసెల్ డీలర్. ట్రంక్ రోడ్డులో పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ముందు స్కూలుకు దగ్గరలో తాత కొట్టు పక్కనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న లేనప్పుడు వెళ్ళేవాళ్ళం. అందరి ఇళ్ళల్లో కుర్చీలు చూశాము కానీ, సోఫాలు చూడడం అదే ప్రధమం. ఆయనకో కారు వుండేది. పెట్రోలు బంకు చేతిలో వున్నప్పటికీ,  నడిచిగాని, రిక్షాలో గాని తిరిగేవారు. నడుం వంగని ఆరోగ్యం. తెల్లటి గ్లాస్కో పంచె, లాల్చీ ధరించి నడిచి వెడుతుంటే ఎదురు పడ్డవారు గౌరవంగా నమస్కారాలు పెడుతుండేవారు. హైదరాబాదులో  కంపెనీ (అప్పుడు బర్మా షెల్) పనిపడితే మాత్రం  కారు తీసేవారు. ఖమ్మం బిర్లా అనే పేరుండేది. నరసింహారావు గారికి ఒక్కడే కొడుకు. ప్రసాద్. ఆడపిల్లలు కూడా లేరు. మా మేనకోడలు జ్యోతితో సంబంధం కుదరడంతో మాకు, క్లాస్ మేట్ తోనే  బంధుత్వం కుదిరింది.  మా కుటుంబంలో జ్యోతి చక్కటి చుక్క. దానికి తగ్గట్టుగా గొప్ప సంబంధం కుదిరిందని అందరూ సంతోషపడ్డారు. పెళ్లి ఎంత ఘనంగా జరిగింది అంటే అంత హంగామా  చూడడం కూడా నాకు కొత్తే. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన అక్కయ్యల పెళ్ళిళ్ళు అన్నీ ఇంటి ముందు  తాటాకు పందిళ్ళు వేసి చేసిన సింపుల్  పెళ్లిళ్ళే! షామియానాలు, డైనమో పెట్టి ట్యూబ్ లైట్ల వరుసలతో ఊరేగింపు, టపాసులు కాల్చడం, యూనిఫారాల బ్యాండ్ మేళం ఇవన్నీ ఆ పెళ్ళిలో మాకు అంతవరకూ తెలియని ఆకర్షణలు. ఆ రోజుల్లో ఇవన్నీ కొత్త.   ప్రసాద్ ను, జ్యోతిని పెద్ద రధంలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. వాళ్ళు నిద్రకు తాళలేక మధ్యలో కునుకు తీశారు.

ఈ పెళ్లి జరగడానికి ముందు ఊళ్ళో కొందరి ఇళ్లకు వెళ్లి శుభలేఖలు ఇచ్చే బాధ్యత మా బావగారు నాకు అప్పగించారు. అంతేకాదు, ఈ పని త్వరగా తెముల్చుకు రావడానికి మొట్టమొదటిసారి తన సైకిల్ తాళం చెవిని కూడా నాకు అప్పగించారు. వెంటనే పంచకల్యాణి గుర్రం ఎక్కినంత ఉత్సాహంతో నేను సైకిల్ ఎక్కి ఒకటి రెండు శుభలేఖలు పంపిణీ చేశాను. మా రెండో బావగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తల్లి, మాపెద్ద మేనత్త  కాఫీ తాగిపోరా సన్నాసీ అంది. ఆవిడ మాట అందరికి వేదం. కానీ నా తరహా వేరు కదా. పైగా గుర్రం లాంటి సైకిల్ వుండగా, ఆమె కుంపటి మీద తయారుచేసి ఇచ్చే కాఫీ కోసం టైం వేస్టు చేయడం ఇష్టంలేక, ఆమె మాట కాదని, బయటకు వచ్చి సైకిల్ ఎక్కాను. రెండు గజాలు కూడా పోలేదు, బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను. పడడం పడడం ఎడమ చేయి మణికట్టు దగ్గర విరిగింది. ఖమ్మం స్టేషన్ పక్కన ఖుద్దూస్ డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన ఎక్స్ రే తీయించి చేతికి వెదురు బద్దలు కట్టి, దానిమీద  సిమెంటు కట్టు వేశాడు. ఆ కట్టుతోనే పెళ్ళిలో తిరిగాను. తరువాత మూడు నెలలకి కాబోలు కట్టు విప్పారు.

ఈ సంఘటనతో నా సైకిల్ ఉబలాటానికి శాశ్వతంగా తెర పడింది.

కింది ఫోటో:

స్కూల్లో నా క్లాస్ మేట్, తర్వాత మేనకోడలు భర్త కీర్తిశేషుడు జూపూడి ప్రసాద్  




(ఊహా చిత్రం, చిత్రకారుడికి కృతజ్ఞతలు)




(ఇంకా వుంది) 

      

         

 

 

కామెంట్‌లు లేవు: