30, నవంబర్ 2021, మంగళవారం

పుణ్యం ఊరికే పోదు

 

జ్ఞాపకాల గొందుల్లో

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అడపాదడపా కొంత పైకం మా వదినెగారి చేతికి ఇచ్చి మా అమ్మగారికి ఇమ్మనేవారు. మా కుటుంబంలో అటు ఏడుతరాలకు, ఇటు ఏడు తరాలకు వయసులో మా అమ్మే పెద్ద. చుట్టపక్కాలు, చిన్న వాళ్ళు ఇంటికి వచ్చి చూసి వెడుతూ కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు వాళ్ళచేతిలో పదోపరకో డబ్బులు పెట్టడానికి ఈ ఏర్పాటు.

మా అన్నయ్యగారి ఆఖరి అమ్మాయి వాణి పెళ్ళిలో కన్యాదానం చేసే మహత్తర అవకాశాన్ని, నాకు ఆడపిల్లలు లేనందువల్ల, మా పెద్దన్నయ్య కల్పించారు. ఆ సందర్భంలోనే  మా అమ్మగారి సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయిదు రూపాయల కొత్తనోట్లను తెప్పించి వాటిని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, చిన్నలకు, పెద్దలకూ మా అమ్మగారి చేతుల మీదుగా ఇప్పించాడు.

మా అమ్మ గారి చివరి రోజులవరకు మా అన్నగారే ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టుకు చూసుకున్నారు. చనిపోయినప్పుడు ఆమె ఉత్తర క్రియలు కాశీలో జరిపించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు సీపీఆర్వోగా, సమాచార శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అనేక ఉన్నత ఉద్యోగాలు చేసి, సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన లేకుండా చివరికి పుట్టపర్తిలో మా వదిన గారెతో కలిసి ఓ చిన్న గదిలో జీవితం గడుపుతూ, నరసింహస్వామి తత్వాన్ని గురించి అనేక సంపుటాలతో కూడిన బృహత్ గ్రంధాన్ని రచించి, ఆధ్యాత్మిక వాతావరణంలో చివరి రోజులు గడిపాడు.      

ఈ పుణ్యం ఊరికే పోలేదు.

అనాయాసమరణం రూపంలో మా అన్నగారికి దక్కింది.

 




 

29, నవంబర్ 2021, సోమవారం

హమే తుమ్సే ప్యార్ కిత్ నా...... భండారు శ్రీనివాసరావు

  నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ. ఈ హిందీ ప్రస్తావన దేనికంటే... మా పెద్దవాడు సందీప్ పెళ్ళికి రాంచీ నుంచి ఆడపెళ్లి వాళ్ళు తరలివచ్చారు. రవిగారు, విజయ శ్రీనగర్ కాలనీలో తాము కొనుక్కున్న కొత్తఫ్లాటును వాళ్లకి బసగా ఇచ్చారు. శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది వచ్చారు. 1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు. ఈ పెళ్ళికి అరుణ, శేఖర రెడ్డి దంపతులు మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును మా అధీనంలో ఉంచారు. అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు. ఆరోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు. బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన హనుమంతరావు బావ పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏక కాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా. అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము. అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది.హమే తుమ్సే ప్యార్ కిత్ నా......” అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటి) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

డియర్ భావన, సందీప్

మీ పెళ్లి రోజున, మీ పుట్టిన రోజున, సఖి, సృష్టి పుట్టిన రోజుల్లో అమ్మ చేసే హడావిడి నాకింకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అమెరికా టైం ప్రకారం మీకు గ్రీటింగ్స్ చెప్పాలని చాలా ఆత్రుత పడేది. ఎందుకు వాళ్ళని అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్పాలా అని నేను అంటున్నా తను పట్టించుకునేది కాదు.

తన నుంచి ఇలాంటి ఆప్యాయతానురాగాలు నేను నేర్చుకునేలోగా తను దాటి వెళ్ళిపోయింది.

ఈరోజు, మీ పెళ్లి రోజు, మీ ఇద్దరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రియ, రాజేష్ లకు ముందస్తు శుభాశీస్సులు.

-నాన్న

 పైన రాసిన ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g




28, నవంబర్ 2021, ఆదివారం

ఒక్క అవకాశం - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు, 28-11-2021, ఆదివారం ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

ఈ మాట మీరు ఎక్కడో విన్నట్టున్నప్పటికీ ఈ ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశం గురించి మాత్రం కాదు. ఇది వేరే. అది వేరే!
2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి నేను రిటైర్ అయ్యేంతవరకు ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు ఏ ప్రోగ్రాముకు పిలిచినా నేను ఒప్పుకునేవాడిని కాదు, ఒక ఛానల్ లో పనిచేస్తూ మరో ఛానల్ కు పోకూడదని నాకు నేనై పెట్టుకున్న నిబంధన కారణంగా.
ఆ తర్వాత మాత్రం పిలిచిన ఎవ్వరినీ కాదనలేదు. ఆ క్రమంలో రోజుకు రెండు మూడుసార్లు టీవీ చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాను. ఆ రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, అంశాన్ని బట్టి స్వతంత్రంగా విశ్లేషణ చేసే అవకాశాలు దొరకడంతో, నేను టీవీ చర్చల పర్వాన్ని నిశ్చింతగా కొనసాగిస్తూ పోయాను. అలా పుష్కర కాలానికి పైగా టీవీలతో కాలక్షేపం చేశాను. వారంలో ప్రతి రోజూ ఒక ఛానల్ అని ముందే నిర్ణయించుకుని టైం టేబుల్ మాదిరిగా వెడుతుండే కాబట్టి నన్ను వారాలబ్బాయి అని పిలిచేవారు కూడా. ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనేది మా ఆవిడ నిర్మల.
2019లో నా భార్య మరణం తర్వాత టీవీ చర్చలకు పోవడం పూర్తిగా మానుకున్నాను. క్రమం తప్పకుండా నన్ను తన చర్చలకు స్వయంగా ఆహ్వానించే ఓ ప్రముఖ ఛానల్ మోడరేటర్ ఒకరు, ఓసారి ఫోన్ చేసి ‘మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈ రెండేళ్ల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, మునుపటిలా స్వతంత్రించి మాట్లాడించడానికి మాకూ, స్వతంత్రంగా మాట్లాడడానికి మీకూ వీలులేని రాజకీయ వాతావరణం ప్రస్తుతం వుంది’ అని చెప్పారు.
రోగి కోరుకుంది, వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్టు నేను కూడా సంతోషించాను. తదాదిగా నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఇలా వారం వారం ఆంధ్రప్రభ దినపత్రికకు వ్యాసాలు రాస్తూ వస్తున్నాను. చాలా తృప్తిగా వుంది.
మరి ఈ ఒక్క అవకాశం సంగతి ఏమిటంటారా!
చెబుతాను. అది చెప్పడానికే ఈ అవకాశం తీసుకున్నాను.
నేను ముప్పొద్దులా, మూడు ఛానళ్ళు. ఆరు చర్చలు అనే రీతిలో పొద్దు పుచ్చుతున్న రోజుల్లో, ఓరోజు పొద్దున్నే ఒకతను మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
‘నాకు టీవీ చర్చల్లో పాల్గొనాలని వుంది. మీరు ఎవరికైనా చెబుతారా! ఎలాగైనా సరే, ఒక్క అవకాశం దొరికేలా చూడండి’
ఆయన్ని చూడడం నాకు అదే మొదటిసారి. అయినా భేషజాలకు పోకుండా, మనసులోని మాటని బయటపెట్టడానికి తాత్సారం చేయకుండా, చల్లకు వచ్చి ముంత దాచిన చందం కాకుండా నేరుగా చెప్పిన తీరు చూసి, ఇతడు ఎవరి సాయం లేకుండానే టీవీ రంగంలో రాణించే రోజు వస్తుందని నేను అప్పుడే అనుకున్నాను.
ఉద్యోగం చేసే రోజుల్లో మా ఆవిడ ఇలా పనిమీద వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడే విధానం గమనించి, ‘కొబ్బరికాయ పైరవి’ అనేది. అంటే పని కాకపోతే తిరిగి ఎలాగూ రాడు. పని అయినా రాకపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పని మీద శ్రద్ధ వున్నవాళ్ళు, ఏ ఒక్కరినో నమ్ముకుని ఊరుకోరు. మరో నలుగురితో చెప్పించుకుంటారు. ఆ విధంగా ఏదో విధంగా పని జరిగిందని తెలిసినప్పుడు ఆ శనివారం దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, అది దేవుడి ఖాతాలో వేసేవాడిని. దానికి మా ఆవిడ పెట్టిన ముద్దు పేరు ‘కొబ్బరి కాయ పైరవి’
‘అలాగే ! చెప్పిచూస్తాను’ అనేశాను మేకపోతు గాంభీర్యంతో.
ఆయన పోతూ పోతూ ఓ సలహా చెప్పాడు.
‘చాలాకాలం నుంచి చూస్తున్నాను. మీరు టీవీలో మాట్లాడేటప్పుడు, ఎప్పుడూ కెమెరా వంక చూడరు. మిమ్మల్ని జనం గుర్తు పెట్టుకోవాలి అంటే కెమెరా వంకే చూస్తూ మాట్లాడాలి, యాంకర్ వంక కాదు’
నాకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేదు.
‘యాభయ్ ఏళ్ళుగా ఈ రంగంలో ఉంటున్నాను. ఇంకా నా మొహం గుర్తు పెట్టుకునేది ఏమిటి నా మొహం!’ అనుకున్నాను మనసులో.
ఆయన వెడుతూ వెడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించి వెళ్ళాడు.
‘నాకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని వుంది. ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్ధికంగా నా నేపధ్యం గొప్పది కాదు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. ఇలా విశ్లేషకుడిగా టీవీల్లో మాట్లాడుతూ వుంటే ఎవరో ఒకరి కంట్లో పడకపోను. అప్పుడు ఏదో ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో ప్రతి ఛానల్లో కనబడే ఛాన్స్ లంహిస్తుంది. నాకు పార్టీలో అవకాశం ఇచ్చిన నాయకుడి కంటే కూడా ఎక్కువగా ప్రజల కళ్ళల్లో పడే మహత్తర అవకాశం నాకే వుంటుంది. రోజూ నా మొహం టీవీల్లో చూస్తుంటారు కాబట్టి నా నియోజకవర్గం ఓటర్లకు నేను బాగా గుర్తుంటాను. ఎప్పటికో అప్పటికి నా కోరిక తీర్చుకోకపోను’ అన్నాడు ధీమాగా!
అతడు చెప్పింది నిజమే. డబ్బులు ఊరికే రావు అన్నట్టు పదవులు, అవకాశాలు ఊరికే రావు. ప్రయత్నిస్తూనే వుండాలి.
అతడు కోరుకున్నట్టే టీవీల్లో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. సద్వినియోగం చేసుకున్నాడు అని వేరే చెప్పాల్సిన పని లేదు.
చూస్తూ ఉండగానే అతడు తన దీర్ఘకాలిక ప్రణాళికలో నిర్దేశించుకున్న మొదటి రెండు లక్ష్యాలు సాధించాడు. సొంత ప్రతిభతో విశ్లేషకుడిగా రాణిస్తూనే ఓ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా నాతోనే పలు చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. విషయ పరిజ్ఞానం, కష్టపడి సమాచారం సేకరించే అలవాటు, పెట్టుకున్న ధ్యేయం పట్ల చిత్తశుద్ధి, అనుకున్నది సాధించాలనే తపన ఈ ఎదుగుదలకు కారణం అని నాకు అనిపించేది.
నాకొక అనుమానం వుండి పోయింది. అతడు చేరాలి అనుకుంటే, అతడి ప్రతిభ చూసి అధికార పక్షం కూడా ఆహ్వానించి వుండేది. మరి ప్రతిపక్షం పాత్రను ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు?
ఒకరోజు విరామ సమయంలో ఆయన్నే అడిగాను. చెప్పిన జవాబు విని నివ్వెరపోయాను.
‘నాకిప్పుడు వున్న ప్లస్ పాయింటు నా వయస్సు. మరో పదేళ్లు ఓపిగ్గా ఎదురుచూడగలను. ఒక రాజకీయ భావజాలం అంటూ ప్రత్యేకంగా నాకు ఏమీ లేదు, ఎందులో అయినా సర్దుకుపోగలను. అధికార పార్టీ అయితే పుణ్యకాలం కాస్తా పార్టీ కార్యకలాపాలను సమర్ధించుకోవడంలోనే సరిపోతుంది. అదే ప్రతిపక్షం అయితే గొంతెత్తి మాట్లాడానికి, ఎంత ఘాటు విమర్శలు అయినా చేయడానికి అవకాశం వుంటుంది. వీక్షకులకీ, టీవీల వాళ్ళకీ కావాల్సింది ఇదే. చర్చల అవకాశాలు బాగా వుంటాయి. అంచేత ఇదే సరైన పద్దతి అనుకున్నాను. అధికార పక్షంలోకి సమయం చూసుకుని చేరతాను. అందుకు ఇంకా సమయం వుంది. తొందరపడితే అసలుకే మోసం. ‘మరో విషయం గమనించారా! విశ్లేషకుడిగా కాకుండా నేను సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరివుంటే ఎక్కడో రోడ్ల మీద ధర్నాలు చేస్తూ మిగిలిపోయేవాడిని. ఇప్పుడు చూడండి. ఎండనక, వాననక వీధుల్లో ఆందోళనలు చేస్తూ, గొంతు ఎండిపోయేలా నినాదాలు చేసే మా పార్టీ వాళ్లకు అనుకూలంగా, హాయిగా స్టూడియోల్లో కూర్చుని, స్వరం పెంచి మాట్లాడగలుగుతున్నాను. హోటళ్ళకు పోయినా, సినిమాలకు వెళ్ళినా జనం గుర్తు పట్టి పలకరిస్తున్నారు.
‘మరో రహస్యం చెబుతున్నా మీరు కాబట్టి. మా అధినాయకుడిని కలవాలంటే మా పార్టీ నాయకులకే దుర్లభం. అలాంటిది నేను నేరుగా కలవగలుగుతున్నాను. అయిదేళ్ళ కాలంలోనే ఇదంతా! ఇంకో అయిదేళ్లు మిగిలే వుంది’ అన్నాడు.
అతడి మాటల్లో ఎనలేని ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది.
ఏదో ఒకరోజు ఆయన్ని అసెంబ్లీలో చూస్తాను అని నాకో ఫీలింగు కూడా ఈ మధ్య కలుగుతోంది. అతడికేదో దారి చూపించడంలో చిటికెన వేలంత పాత్ర నాది ఉందనే గర్వం ఇన్నాళ్ళు నా మనసులో ఏ మూలో వుండేది. ఇప్పుడది తొలగిపోయి, అతడే నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేశాడనే భావన కలుగుతోంది.
ముగించే ముందు ఓ విషయం చెప్పాలి.
ఆయన మొట్టమొదటిసారి టీవీలో కనపడ్డ రోజు, మరచిపోకుండా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నాను. ఎందుకంటే అతడి కోరిక తీరడంలో నా ప్రమేయం ఏమీ లేదని నా అంతరాత్మకు తెలుసు కాబట్టి.
తోకటపా: ఈ రచన నా స్వకపోల కల్పితం అని పాఠకులకు మనవి.



27, నవంబర్ 2021, శనివారం

మాటల ఊరేగింపు పాశం యాదగిరి – భండారు శ్రీనివాసరావు

 ‘ఎందుండి ఎందు బోవుచు ఇందులకేతెంచినారు? అంటాడు ప్రవరాఖ్యుడు తమ ఇంటికి  అతిధిగా వచ్చిన యతితో. (నిజానికి ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేవాళ్ళని అభ్యాగతి అంటారని కాలేజీలో మా తెలుగు లెక్చరర్ గారు చెప్పేవారు.

ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడకు పోతున్నారు అని అడగడం మర్యాదగా భావించేవారు కాదేమో ఆ కాలంలో.

అలాగే యాదగిరిని ఈ రెండు ప్రశ్నలు అడగడం అనవసరం. కాళ్ళకు పసరు రాసుకోకపోయినా, చక్రాలు తగిలించుకాకపోయినా ఎక్కడి నుంచయినా రాగలడు, అలాగే ఎక్కడికి అయినా పోగలడు. అంచేత ఈ రెంటి నడుమ లభించిన విరామంలో అతడు చెప్పింది వింటూ పోవడమే విజ్ఞుల లక్షణం.

యాదగిరి అంటే తెలియని వాళ్ళకోసం జర్నలిస్టు పాశం యాదగిరి అని పరిచయం చేస్తున్నాను.

కూర్చున్నది కాసేపే అయినా చాలా విషయాలు మాట్లాడాడు. అన్నీ రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది.

గోల్కొండ కోటలో అభ్సీ గేట్ వుంది తెలుసు కదా అన్నాడు.

ఔరంగజీబు సైన్యాలు గోల్కొండ పై దాడి చేసినప్పుడు ఆ కోటకు ఉన్న అయిదు ప్రధాన ద్వారాలలో ఒక ద్వారానికి  ఆఫ్రికన్ దేశం అభ్సీనియా కు చెందిన మహమ్మద్ బిలాల్ అనే నీగ్రో బంటు కాపలాగా వున్నాడు. అతడు అక్కడ వున్నాడు అంటే గోల్కొండ ప్రభువులకు అపరిమితమైన భరోసా. అతడి చివరి శ్వాస వరకు చివరి శత్రువు కూడా  కోటలోకి అడుగుపెట్టలేడని ఓ నమ్మకం. అందుకే ఆ గేటుకు అబ్సీ గేటు అని పేరు పెట్టారు.

ఇంతకీ యాదగిరి ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు. బంటు అనేది తెలుగు పదం కాదని చెప్పడానికి.

“సర్కారు జిల్లా తెలుగు అంటారు. నిజానికి అందులో  తెలుగు అనే పదం  తప్ప తెలుగే లేదని అతడి ముక్తాయింపు. ఏమిటంటే సర్కారు తెలుగు కాదు, జిల్లా తెలుగు కాదు. ఆ రెండూ ఉర్దూ పదాలే. నిజం ఒప్పుకోవాలి. అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడుకునే భాషలోనే ఎక్కువ ఉర్దూ పదాలు మనకు వినవస్తాయి, కనబడతాయి. భాష విషయంలో వారిది ఉదారవాదం అని తీర్మానించాడు.

“అమితాబ్ బచన్ వాయిస్ కల్చర్ గురించి గొప్పగా చెబుతారు. నిజానికి ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచన్ కు ఈ ఖ్యాతి దక్కాలి. ఆయన కొడుకు స్వరంలో స్పష్టత రావడం కోసం కఠిన మైన శిక్షణ ఇచ్చాడు. వేదాలు ఎక్కడా రాసిలేవు. వాటిలోని పనసలు ఒక పట్టాన కొరుకుడు పడవు.  గురువు ముఖతః వాటిని విని బట్టీయం వేయాలి. శిష్యుల నోట  ఎక్కడా ఉచ్ఛారణ దోషం రాకుండా చూడడానికి గురువులు చాలా కష్ట పడేవారు. ఒక్కో అక్షరానికి ఒక్కో అర్ధం వుంటుంది. తభావతు లేకుండా పలకాలి. ఉర్దూలో కబర్, ఖబర్ ఈ రెండు పదాలు దగ్గరగా అనిపిస్తాయి. కానీ ‘క ‘ఖ ఒక్క   అక్షరం తేడాతో మొత్తం  అర్ధం మారిపోతుంది. మసీదుల్లో ప్రార్ధనలు కూడా అంతే! అవి చదవడానికి మదర్సాల్లో గట్టి తర్పీదు ఇస్తారు. మహమ్మద్ ప్రవక్త మొట్టమొదట ఈ ప్రార్థన చదవడం కోసం ఎంపిక చేసుకున్నది బిలాల్ అనే వాడిని. మంచి స్వరం తప్పిస్తే అతడిలో గొప్ప అర్హతలు ఏమీ లేవు. అయినా పవిత్రమైన కార్యం కోసం ప్రవక్త అతడినే ఎంపిక చేసుకున్నాడు.

“సాహెబ్! సాహెబా! సాహెబా అంటే తల్లి. మసాబ్ ట్యాంక్ అని పిలుచుకుంటున్న చెరువుకు అసలు పేరు మా సాహెబా టాంక్. కాలక్రమంలో మసాబ్ టాంక్ అయింది. చెరువు రూపురేఖలు లేకుండా పోయింది”

ఇలా సాగిపోయింది యాదగిరి వాగ్జరి.

మా పిల్లలు కూడా శ్రద్ధగా వింటున్నారు.

చాయ్ బిస్కెట్ వంటి స్వల్ప ఆతిధ్యం స్వీకరించి ఇక వెడతాను అని లేచాడు.

జర్నలిస్ట్ కాలనీలో కదా ఇల్లు. ఈ టైంలో ఎలా వెడతావు అన్న ప్రశ్నకు నవ్వలేదు. సరికదా! రాజ కపూర్ నటించిన శ్రీ 420 హిందీ చిత్రంలోని పాట వినిపించాడు.

మేరా జూతా హై జాపానీ, ఏ పంట్లూన్ ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ,  ఫిర్ దిల్ హై హిందూస్తానీ!

“నికల్ పడే హై ఖులీ సడక్ పర్  అప్నా సీనా తానే

మంజిల్ కహాఁ కహా రుకానా  ఊపర్ వాలా జానే!”

ఇంకాసేపు వుంటే బాగుణ్ణు అనిపించింది.

“పక్కనే మెట్రో. చెక్ పోస్టు దగ్గర దిగితే జర్నలిస్ట్ కాలనీ” అన్నాడు.

పై పాట మళ్ళీ వినిపించింది. యాదగిరి పాడలేదు.

నాకే చెవుల్లో వినిపించినట్టు అనిపించింది, యాదగిరి మాటలు విన్నాక.

(27-11-2021)  

ఒంటి చేత్తో లిఖించిన భారత రాజ్యాంగం – భండారు శ్రీనివాసరావు

 

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక పవిత్ర గ్రంధం.

రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు మననం చేసుకోవడం వ్యాసకర్త ఉద్దేశ్యం.

“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అనేది నేడు కొంత మంది అభిప్రాయం. సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని  వారి నమ్మకం.

“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని వారు చేసే వ్యాఖ్యానం.

“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ఇలాంటి ధర్మ పన్నాలు వల్లిస్తున్నారని  వారి ప్రత్యర్థుల వాదన.

“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

ఘర్షణాత్మక రాజకీయాలు వద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి అవసరం అని ఇంకో పక్క ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడుతున్నాయనే వాస్తవం ఎవ్వరికయినా  ఇట్టే బోధపడుతుంది.

భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు ఈనాడు వెలుగులోకి వస్తున్నాయి.

సుమారు  ఏడు దశాబ్దాలుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది. స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది. 1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం 299 కి తగ్గింది. కొందరు ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్ సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచన అక్షరాలా రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు. 1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన 1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు. వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యయనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడంవల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం 25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్, 448 అధికరణలు, అయిదు అనుబంధాలు. ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు.

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది.



26-11-2021

26, నవంబర్ 2021, శుక్రవారం

కాణీ ఖర్చులేని ఎనర్జీ టానిక్!- భండారు శ్రీనివాసరావు

 

రాత్రి పది గంటల సమయంలో మా కోడలు (ఇప్పుడు నా కోడలు అనాలేమో, తను లేదుగా) నా గదిలోకి వచ్చింది, రావచ్చా అని అడుగుతూనే.  ఆ సమయంలో ఎప్పుడూ రాని మనిషి రావడం నాకు ఆశ్చర్యం అనిపించింది. తనకు తెలుగు రాదు. నాకు ఆమెకు అర్ధం అయ్యే రీతిలో మాట్లాడగలిగే స్థాయిలో  ఇంగ్లీష్ రాదు. మా మధ్య సంభాషణ తెలుగులో జరిగి వుంటే, అది  ఇలా వుండేది. (నిజానికి ఇదంతా ఇంగ్లీష్ లోనే సాగింది, భాషకు భావం ప్రధానం అనే రీతిలో. అది వేరే మాట)

“భోజనం అయ్యిందా పాపా!”

“లేదమ్మా! ఏం”

“వంటమ్మాయి పొరబాటున పొద్దుటి పెరుగు గిన్నె మీ గదిలో పెట్టి పోయింది. ఇది ఈ పూట తోడుకున్నది”

“సరే! అమ్మా! థాంక్స్!  అక్కడ పెట్టి వెళ్ళు. అయినా ఒక్క పూటకు సర్డుకుంటే  ఏమవుతుంది!”

వెంటనే వెళ్లకపోవడం చూసి అడిగాను నేనే.

“ఏమిటమ్మా! ఏమిటి సంగతి?” ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా!”

“అమెరికాలో థాంక్స్ గివింగ్ డే. వాళ్లకు లాంగ్ వీకెండ్. అంచేత మాకిక్కడ పెద్దగా ఆఫీసు పని వుండదు. కాల్స్ వుండవు. రేపూ ఎల్లుండీ కూడా ఖాళీనే”

మౌనంగా వింటున్నాను.

“అవును కానీ పాపా! చాలా రోజులుగా చూస్తున్నాను. మీరు చాలా సమయం ఒంటరిగా మీ గదిలోనే  వుంటున్నారు. బయటకే రావడం లేదు. ఏదో రాసుకుంటూ వుంటారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకుంటాను”

డెబ్బయి ఆరో ఏడు నడుస్తోంది. ఈ వయసులో వెనక్కి చూస్తూ ముందుకు నడవడమే. అంటే గత అనుభవాలే దిక్సూచి. వాటిని రాసుకుంటూ, వాటిని తలుచుకుంటూ రోజులు గడపడమే పని.

“వున్న ముగ్గురం మధ్యమధ్య కలిసి కూర్చుని రోజులో కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా!” అన్న నిషా మాటకి ఆశ్చర్యంగా తలెత్తి చూశాను.

“మంచి ఐడియా! నేనే అందామనుకున్నాను”

“నిజానికి మధ్యాన్నం అందరం కలిసే భోజనం చేస్తున్నాము. కానీ మాటలు వుండడం లేదు.”

“అదీ! నిజమే! ఏదో సినిమా పెడతారు. అది చూస్తూ ఏం మాట్లాడుకుంటాం.”

“మీకు తెలుగు సినిమాలు ఇష్టం అని సంతోష్ చెప్పాడు. అందుకని నేను రోజూ మంచి రేటింగ్ వున్న సినిమాలు  సెలక్ట్ చేసి ఉంచుతున్నాను. మీరు వాటిని కూడా పూర్తిగా చూస్తున్నట్టు లేదు”

“............”

“పోనీ ఓ పని చేద్దాం. సినిమా వద్దు. భోంచేస్తూ మాట్లాడుకుందాం. ఏదో ఒకటి. చూసిన సినిమాలమీదే అయినా సరే  ఏవో  ముచ్చట్లు చెప్పుకుందాం!”

“తప్పకుండా! మంచి ఐడియా” అన్నాను మరోసారి.

గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది.

ఈ మధ్యాన్నం కొత్తగా గడిచింది.  ఎన్నో రోజులుగా మౌనం కాపురం చేస్తున్న ఇంట్లో మళ్ళీ మాటలు నోళ్ళు విప్పాయి. నిండా పరచుకున్న స్తబ్ధత తొలగిపోయింది. పట్టపగలే మరోసారి తెల్లవారింది (అవునూ! ఇలాంటి ఆలోచనలు ఇంతకు ముందు నాకెందుకు రాలేదు?)

మాటామంతీలో ఇంత మహత్యం ఉందా!

నిజంగా  మంచి ఐడియా ఇచ్చావు నిషా!

మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి ఒక్కోసారి మాటలు దొరకవు. నోరు పెగలదు.

(26-11-2021)

నోరు జారిన మాట - భండారు శ్రీనివాసరావు

 మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.

కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.

నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’

సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.

ఏం మాట్లాడవు. అవునులే ఏం చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా వస్తావా? అసలు జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’

మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే వుంది. డాక్టర్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.

ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.

కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.

భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’ అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.

మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే ఆగ్రహాన్ని కలిగించింది.

ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ పొడిపొడిగా చెప్పేసి అలా వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.

నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.

అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం. పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా, మేము కబురు చేయగానే అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’




(నెట్లో కనబడిన ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం - ఇమేజ్ సొంతదారుకు కృతజ్ఞతలు)