25, మే 2018, శుక్రవారం

ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు

(ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)
2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (అప్పటి ఎన్నికల్లో అమేధీలో రాహుల్ గాంధి మీద పోటీ చేసి ఓడిపోయి కూడా మోడీ కరుణాకటాక్షాల వల్ల కేంద్ర మంత్రివర్గంలో చేరారు) ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
రాజకీయాల్లో ఈ మాదిరి వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు అత్యంత సహజం అనుకుంటే పేచీయే లేదు. కానీ ఈనాటి రాజకీయాల తీరుతెన్నులే వేరు.
ఇలాంటి సందర్భం మరోసారి వస్తోంది. ఈ ఏడాది మే ఇరవై ఆరోతేదీకి నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు పూర్తవుతున్నాయి.
ఈ ఘడియ దగ్గర పడడానికి నెలా, నెలన్నర ముందు అంటే ఏప్రిల్ లో మోడీ తన పాలనపై తనే ఒక వ్యాఖ్య చేశారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రసంగం చేసినప్పుడు విడవకకుండా మోగిన కరతాళధ్వనుల ప్రతిధ్వనులు జనం చెవుల్లో గింగురుమంటూ ఉన్న నేపధ్యంలో నెల రోజులు తిరక్కముందే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో చేతికి చిక్కింది అనుకున్న విజయం ఆఖర్లో చేజారి కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయినప్పటికీ బీజేపీ గతంలో కంటే తన స్థానాల సంఖ్యను బాగా మెరుగుపరుచుకుంది. మిగిలిన పార్టీల కంటే అత్యధిక స్థానాలు సంపాదించుకున్న ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంది. కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ సంఖ్యకు ఎనిమిది సీట్ల దూరంలో బీజేపీ విజయ యాత్ర ముగిసింది. (రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి)
అయితే తదనంతర పరిణామాలు మోడీకి. ఆయన నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని అపఖ్యాతిని మూటగట్టి పెట్టాయి.
ఈ నేపధ్యంలోనే లండన్ టౌన్ హాల్ మీటింగులో మోడీ మాటలను పునశ్చరణ చేసుకోవాల్సిన వస్తోంది. లండన్ ప్రసంగంలో స్పష్టంగా కనవచ్చిన నిజాయితీ కర్నాటక వ్యవహారాల్లో ఆయన పార్టీ అనుసరించిన విధానాల్లో ప్రతిఫలించిందా అంటే ‘ఔన’ని చప్పున చెప్పలేని పరిస్తితి.
బీజేపీకి అత్యధిక స్థానాలు లభించిన మాట వాస్తవమే. కానీ కాంగ్రెస్, జెడిఎస్ కలిపి సాధించిన స్థానాలు అంతకంటే ఎక్కువే. అయినా ప్రభుత్వం ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు ముందుకు వచ్చినా కాదని, కర్నాటక గవర్నర్ వజుభాయ్ వాలా, బీజేపీ నాయకుడు యడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈలోగా కాంగ్రెస్ సుప్రీం తలుపు తట్టడం, అత్యున్నత న్యాయస్థానం అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఉభయ పక్షాల వాదప్రతివాదనలను ఆ రాత్రంతా విని తెల్లవారే సమయంలో తీర్పు ఇవ్వడం జరిగింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం జరగకుండా ‘నిలుపుదల’ ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. శాసన సభలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ యడ్యూరప్పకు పదిహేను రోజులు వ్యవధానం ఇస్తే, సుప్రీం మాత్రం ఆ వ్యవధిని ఇరవై నాలుగు గంటలకు కుదించడంతో రాజకీయ పరిణామాలు ఊహించనంత వేగంతో మారిపోయాయి. కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో విఫలమైన యడ్యూరప్ప బల పరీక్షకు ముందే చేతులు ఎత్తేసి రాజీనామా చేయడం, తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, కుమారస్వామి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన పరమేశ్వరన్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. మోడీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకోబోయే ఆఖరు ఘడియల్లో జరిగిన ఈ పరిణామాలు జాతీయ పాలక పక్షానికి మింగుడు పడని వ్యవహారాలుగా పరిణమించాయి. అనుకోని ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి జాతీయ అధ్యక్ష బాధ్యతలు కొత్తగా స్వీకరించిన యువ నేత రాహుల్ గాంధీకి ఒకింత ఊరటను, మరింత ఉత్సాహాన్ని కలిగించి ఉంటాయనడంలో సందేహం లేదు. సరే! ఈ విషయాలు అలా ఉంచుదాము.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
‘దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. మీరు కలలు కంటున్న మంచి భారతాన్ని మనం కలిసి నిర్మించుకుందాం. ఈ విషయంలో మీ సంపూర్ణ సహకారం, మద్దతు నాకు లభిస్తుందన్న విశ్వాసం నాకున్నది’ అంటూ ప్రధాని తన లేఖ ముగించారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
అంచేతే కాబోలు తన పాలన రెండేళ్ళు పూర్తయిన కొన్ని మాసాలకే మోడీ తన అంబుల పోదిలోని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించారు. సైనిక దాడి ‘సర్జికల్ స్త్రయిక్’ తో పోల్చతగ్గ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించి ప్రజలనూ, పార్టీలను నివ్వెర పరిచారు. అయితే ప్రయోగించిన చాలా కాలం వరకు ఆ అస్త్రం గురికి తగిలిందా, గురి తప్పిందా అనే విషయంపై వాదోపవాదాలు సాగుతూనే వున్నాయి. ఇలా ఉండగానే మరో రెండేళ్ళ పదవీ కాలం పూర్తి అవుతోంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన విజయాల వల్ల సాధించుకున్న ప్రతిష్టను, తగినంత బలం లేకపోయినా కొన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే క్రమంలో ఆ పార్టీ అనుసరించిన అనైతిక విధానాలు మసకబారేలా చేసాయి. పులిమీద పుట్రలా కర్నాటక పరిణామాలు.
మరో ఏడాది మాత్రమే పదవీ కాలం మిగిలుంది. మోడీ మనసులో ముందస్తు మాట మెదులుతోందని వస్తున్న సమాచారం నిజమైతే ఇక అంత వ్యవధానం కూడా ఉండకపోవచ్చు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
వచ్చే ఏడాది ఎన్నికల కాలమే కనుక రాజకీయ ప్రత్యర్ధుల నడుమ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు ముదిరి పాకాన పడడం వింతేమీ కాదు. నాలుగేళ్ళుగా బీజేపీ పాలకులు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నలభయ్ ఏళ్ళలో సాధించలేని ప్రగతిని నాలుగేళ్లలో చేసి చూపించామని మోడీ మద్దతుదారులు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఎట్లాగో చేస్తారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా ‘పాలకపక్షం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని నిష్క్రియాపరత్వం ప్రదర్శించింది’ అనడం పూర్తిగా నిజమూ కాదు, అలాగే ‘కళ్ళు మిరుమిట్లు గొలిపే పురోగతిని సాధించాము’ అనే ప్రభుత్వ పక్షం ప్రకటనలు కూడా సంపూర్తిగా వాస్తవమూ కాదు. అసలు వాస్తవం ఈ రెంటి నడుమా వుంటుంది. కాకపోతే, రాజకీయం వారిచేత అలా మాట్లాడిస్తుంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం గడుస్తున్నా మళ్ళీ ఆ పాత పల్లవే అందుకుంటూ వుంటే, ప్రజలు విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.
పాలకులు గమనంలో ఉంచుకోవాల్సిన వాస్తవం ఇది. (EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595
(మే నెల ఇరవై ఆరవ తేదీకి నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు)

21, మే 2018, సోమవారం

యద్దనపూడి సులోచనారాణి - ఒక జ్ఞాపకం


మా ఆవిడకు ‘ప్రత్యేక స్థాయి’ కల్పించిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి  
ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు లేకున్నా వారికి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని వుంటాయి.
అలాంటిదే ఇది.
నలభయ్ ఏళ్ళ కింద  సంగతి. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్  ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆంద్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వచ్చేది. ఆ నవల మీద పాఠకుల ఆసక్తి ఎంతగా ఉండేదంటే ఖమ్మంలో ఉన్న మా చుట్టాలు పత్రిక పార్సెల్ వచ్చే రోజున  ఏకంగా రైల్వే స్టేషన్ కు వెళ్లి పార్సెళ్ళు విప్పెదాకా వేచి వుండి వీక్లీ కొనుక్కుని అక్కడికక్కడే ఆ సీరియల్ చదివి ఇంటికి తిరిగొచ్చేవాళ్ళు. అలా వుండేది మార్కెట్లో ఆమె రచనల డిమాండు.
ఇక విషయానికి వస్తే, అప్పట్లో  ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూ హాండ్ కంపోజింగ్. కంపోజ్ అయినతర్వాత తీసిన ప్రూఫ్ గ్యాలీలో తప్పులు సరి దిద్దిన తర్వాత ఎడిటర్ ఫైనల్ గా చూసే ఎస్ గ్యాలీ కొన్ని కాగితాల మీద హాండ్  ప్రింటు చేసేవాళ్ళు. ఆ తర్వాతే ప్రింటింగుకు పంపేవాళ్ళు.  సులోచనారాణి గారి నవల ఎస్ గ్యాలీని నేను మా ఇంటికి తీసుకుపోయేవాడిని, హైదరాబాదులో ఉంటున్న ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారి సతీమణికి  కూడా యద్దనపూడి రచనల పట్ల చాలా ఆసక్తి వుండేది. నిజమెంతో తెలియదు కాని, ఆవిడగారు చదువుకోవడం కోసం ఆఫీసువాళ్ళు కూడా ఆ యస్ గ్యాలీని ముందుగా హైదరాబాదుకు పంపేవాళ్ళని చెప్పుకునే వాళ్ళు.  
మళ్ళీ విషయానికి వస్తే, యద్దనపూడి రచనలంటే ప్రాణాలు పెట్టే వారికి నేను ఇంటికి తెచ్చే ప్రూఫు కాగితాలు చూడగానే ప్రాణం లేచి వచ్చేది. మా ఆవిడ సరే సరి. ఆ రోజు అంతా మాఇంటికి చేరేవాళ్ళు, వారం తర్వాత మార్కెట్లో కనబడే ఆమె సీరియల్ ను  ముందుగా చదవడం కోసం.  ఆ విధంగా చుట్టపక్కాల్లో, ఇరుగుపొరుగు వాళ్ళల్లో మా ఆవిడ స్థాయి ఒకింత పెరిగిందనే చెప్పాలి.
అలా ఒకానొక కాలంలో  తెలుగు లోగిళ్ళలో ఇంటిల్లిపాదినీ  సమ్మోహితులను చేసిన తెలుగు పాఠకుల కలల రాణి యద్దనపూడి సులోచనా రాణి ఇక లేరని తెలిసి చాలా బాధనిపిస్తోంది.                

9, మే 2018, బుధవారం

ఇలా గుర్తుకు వస్తుంటాయి – భండారు శ్రీనివాసరావు


దాదాపు పుష్కరం దాటింది అనుకుంటా డాక్టర్ రంగారావు గారికి ఈ ఆలోచన వచ్చి. అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి. గత నెలలోనే ఆయన మరణించారు. కనుక  ఆయన మదిలో కదిలిన ఆ కొత్త ఆలోచనను ఎవరు ముందుకు తీసుకు పోతారో తెలియదు. ఈ గతం గుర్తుకు రావడానికికల  వర్తమానం గురించి చెప్పాలి.
నిన్న మమ్మల్ని ఒక సమస్య ఎదుర్కుంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.
ముందే చెప్పినట్టు పెద్ద సమస్యేమీ కాదు. ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. ఈ మధ్య కరెంటు అవస్థలు లేకపోవడంతో ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.
మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!
చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు నిన్ననే ఎవరో ఇచ్చిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది.
మరి దీనికీ, రంగారావు గారి ఆలోచనకూ లంకేమిటంటారా!
ఆయన సరిగ్గా ఇదే ఆలోచించారు. మనుషులను ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది.
ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లను మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. ఇలాటి వాళ్ళ వివరాలను ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు. చిన్నా చితకా పనులు పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంలో జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.
అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.
ఇతి వార్తాః              

8, మే 2018, మంగళవారం

ఎర్రకోటపై నీలినీడలు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN ANDHRAPRABHA DAILY ON 08-05-2018)
ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిన మాట నిజమే కాని, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి ఈసారి ఎగురవేస్తారా లేదా అనే సందేహం మొట్టమొదటిసారి మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఎర్రకోట చుట్టూ ముసురుకుంటున్న నీలినీడలు. ఈ అనుమానాలు పూర్తిగా ఆధారరహితం కాదని వాటిని వెలిబుచ్చుతున్న వాళ్ళు చెబుతున్నారు.
వీటన్నిటికీ మూలకారణం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.
దేశంలో అనేక చారిత్రిక కట్టడాలు సరయిన నిర్వహణ లేక శిధిలమవుతున్న మాట వాస్తవం. అలాటి చారిత్రిక సంపదను పరిరక్షించుకోవడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేసిన ఆలోచనల ఫలితమే ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ (చారిత్రిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన కట్టడాలను దత్తత తీసుకోవడం) అనే పధకం.
ఈ పధకం కింద ఢిల్లీ లోని ఎర్రకోటను ఐదేళ్ళపాటు పరిరక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం దాల్మియా భారత్ సంస్థకు అప్పగించింది. పంచదార, సిమెంటు వ్యాపారాలు చేసుకునే సంస్థకు ఒక చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒక అద్భుత కట్టడం పరిరక్షణ బాధ్యతను ఒప్పచెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి వ్యాపారాలు చేసుకునే అటువంటి సంస్థలు ఆ రకమైన బాధ్యతలు నెత్తికెత్తుకోవడానికి దోహదం చేసిన కారణాలు ఏమయ్యుంటాయి అని కూడా రంద్రాన్వేషకులు అన్వేషిస్తున్నారు. దీనికి తోడు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన దాల్మియా భారత్ సంస్థకు మొఘల్ చక్రవర్తుల పరిపాలనా కేంద్రం అయిన ఎర్రకోట పరిరక్షణ బాధ్యత ఎలా అప్పగిస్తారు అనే చర్చ కూడా మొదలయింది.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. చారిత్రిక జాతీయ వారసత్వ సంపదకు ప్రతీకలైన అపూర్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతను, ఆరంగంలో ఎలాటి అనుభవం లేని సిమెంటు కంపెనీ ఎలా నిర్వర్తించగలుగుతుందని ప్రశ్నించింది. ఈ వివాదాల నేపధ్యంలో ఈసారి పంద్రాగస్టు నాడు ప్రధాని మోడీ ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారా లేదా అనే సందేహాలు పొటమరిస్తున్నాయి.
సరే! ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుందా, అనేక వివాదాల మాదిరిగానే కొన్నాళ్ళు తాటాకు మంటలా మండి ఆరిపోతుందా అనేది ఇప్పుడే చెప్పలేము. అయితే ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేసే అంశానికి సంబంధించి ఇంతవరకు ఎక్కువగా వెలుగు చూడని వివరాలు తెలపడం కోసమే ఈ ప్రయత్నం.
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
పొతే మరో ఆసక్తికర చారిత్రిక విషయం ఏమిటంటే మొదట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని 1948లో ఇవ్వాలని అనుకున్నారు. అయితే 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ గా నియమితులయిన లార్డ్ మౌంట్ బాటెన్ మాత్రం వేరే విధంగా తలపోయడంతో బ్రిటిష్ పాలకులు తమ నిర్ణయం మార్చుకుని స్వతంత్ర భారత ఆవిర్భావానికి 1947 ఆగస్టు పదిహేనును ముహూర్తంగా ఎంచుకున్నారు. ఈ మార్పుకు మరో కారణం కూడా చెబుతారు. అంతకు మునుపు రెండేళ్ళ క్రితం, రెండో ప్రపంచ యుద్ధం ముగియవచ్చే తరుణంలో సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీనే, జపాన్ సైన్యం బ్రిటిష్ వారికి లొంగిపోవడంవల్ల, ఆ తేదీ పట్ల మౌంట్ బాటెన్ ముచ్చట పడ్డారనేది ఆ కధనం.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది రాజ్యంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.
తోక టపా:
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎర్రకోట గురించి కూడా సంక్షిప్తంగా నాలుగు ముక్కలు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ నిర్మించిన మొగలాయీ పాదూషా షాజహాన్ ఢిల్లీ లో ఎర్రకోట (లాల్ ఖిలా) నిర్మించాడు. 1592 లో జహంగీర్ చక్రవర్తికి తనయుడిగా జన్మించిన షాజహాన్ 74 ఏళ్ళు జీవించి 1666 లో మరణించాడు. 1628 లో సింహాసనం అధిష్టించిన షాజహాన్ 1658 వరకు పాలించాడు. ఆయన కాలంలో, 1639 లో నిర్మించిన ఈ లాల్ ఖిలా 1856 వరకు అంటే సుమారు రెండువందల సంవత్సరాల పాటు మొఘల్ చక్రవర్తుల నివాసంగా కొనసాగింది.
2007లో యునెస్కో ఎర్రకోటని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. (EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595