30, ఏప్రిల్ 2018, సోమవారం

కృష్ణా జిల్లా పేరు మారుతుందా? - భండారు శ్రీనివాసరావుకృష్ణా జిల్లా పేరును తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పేరిట మార్చాలని నిర్ణయించారు.
అయితే ఇక్కడ ఒక తకరారు వుంది. ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం అయిన తెలుగు దేశం పార్టీ కాదు. ఆ పార్టీకి బద్ధ శత్రువు, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ప్రకటించారు. ఇది సహజంగానే రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.
భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక దీన్ని భవితవ్యానికే వదిలేసి కాస్త గతంలో ఏం జరిగిందో చూద్దాం.
మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన ఆంద్ర రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ గా స్థిరపడిన తర్వాత మొట్టమొదటి సారి జిల్లాకు ఒక రాజకీయ నాయకుడి పేరు పెట్టడం 1972 లో జరిగింది.  ఉమ్మడి రాష్ట్రంలో పేరు మార్చుకున్న జిల్లా ఒంగోలు. ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరిట దాని పేరు ప్రకాశం జిల్లాగా మార్పుచేశారు.
తర్వాత, హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి 1978లో  ఒక కొత్తజిల్లాను ఏర్పాటు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ జిల్లాకు కొండా వెంకట రంగా రెడ్డి జిల్లాగా నామకరణం చేసారు. కాలక్రమంలో అది రంగారెడ్డి జిల్లాగా స్థిరపడింది. కొండా వెంకట రంగారెడ్డి అంతకు పూర్వం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు.
ఆ తర్వాత చాలా కాలానికి నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. ప్రజల కోరిక మేరకు ఈ జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రాజశేఖరరెడ్డి అనధికార తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు కూడా. తదనంతర కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ నిర్ణయాన్ని అమలు చేసారు. కాకపొతే శ్రీరాములు గారి పేరుతొ పాటు పాత పేరు నెల్లూరును కూడా జోడించారు. ఆ విధంగా జిల్లాలకు పేర్లతో పాటు ఇంటి పేర్లు కూడా జత కలిపే సాంప్రదాయం మొదలయింది.
రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చింది.      
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో జిల్లాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు   జిల్లాలకు తెలంగాణా ప్రముఖుల పేర్లు పెట్టారు. ఆ విధంగా జయ శంకర్ భూపాల పల్లి,  కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పడ్డాయి. మరో నాలుగు  జిల్లాలకు పుణ్యక్షేత్రాల పేర్ల మీదుగా జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల అనీ, యాదాద్రి భువనగిరి అని నామకరణం చేసారు.
ఇక అసలు విషయం కృష్ణాజిల్లా సంగతి తీసుకుంటే ఎప్పుడో తాతలనాడు అంటే బ్రిటిష్ పాలనలోనే అంటే 1859 లో అప్పటి సువిశాల రాజమండ్రి  జిల్లాను విడదీసి కృష్ణా, గోదావరి జిల్లాలను, మళ్ళీ   1925లో కృష్ణా జిల్లాలోని కొన్ని  ప్రాంతాలతో పశ్చిమ గోదావరి, గుంటూరుజిల్లాలను  ఏర్పాటు చేసారు.
ప్రభుత్వ పధకాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం, ఆ పార్టీ అధికారం నుంచి తప్పుకుని మరో పార్టీ అధికారంలోకి రాగానే పాతపేర్లు పోయి కొత్త పేర్లు రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. పేర్ల మార్పిడి సులభమే కానీ అందుకు బోలెడంత ప్రజాధనం ఖర్చవుతుంది అనే సంగతి రాజకీయాలల్లో మరుగునపడిపోతోంది.
       

28, ఏప్రిల్ 2018, శనివారం

హాపింగ్ మెమొరీస్ ఆఫ్ డాక్టర్ రంగారావు – ఒక సంక్షిప్త చిత్రం – భండారు శ్రీనివాసరావు


  
ఒక మనిషి ఎలా జీవించాడు అన్నది అతడి మరణం చెబుతుంది. డాక్టర్ రంగారావు విషయంలో అదే జరిగింది.
డెబ్బయి అయిదేళ్ళ జీవితం. ఎన్ని అనుభవాలు, ఎన్నెన్ని సంఘటనలు.  ముదిమి వయసులో వాటన్నిటినీ ఒకచోట గుది గుచ్చడం ఎంతటి శ్రమ!
డాక్టర్ రంగా రావు గారు ఈ శ్రమను శ్రమ అనుకోకుండా,  మరొకరిని శ్రమ పెట్టకుండా అతి తేలిగ్గా పూర్తి చేసారు. అదీ ఆయన జీవితం చరమాంకంలో.
 ‘హాపింగ్ మెమొరీస్’.  ఇంగ్లీష్ లో ఈ పుస్తకం రాసిన  వ్యక్తి  తను నిష్క్రమిస్తూ వదిలివెళ్ళిన గొప్ప పుస్తకం. జ్వాలా నరసింహారావు పట్టుదల వల్ల ఇది వెలుగు చూసింది. ఆయనే ఈ పుస్తకం పేరును ‘కదలాడే జ్ఞాపకాలు’గా తెనిగించారు.

(కీర్తి శేషులు డాక్టర్ ఏ.పీ. రంగారావు) 

నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’  ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.
అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న అనేక పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి,  ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.
ఈ పుస్తకం చాలా విస్తృత కోణాల్లో వుంటుంది. ఇది ఒక డాక్టర్ జీవితం మాత్రమే కాదు. ఒక సామాజిక కార్యకర్తగా పేదసాదల కోసం ఆయన పడిన వ్యధ కూడా ఇందులో వుంది.
సమస్యలని గుర్తించి పరిష్కారాలు అత్యంత సులభంగా చెప్పగల మేధస్సు ఆయనకు వుందని, అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ సాంకేతిక అంశాలతో కూడిన విషయాలను కూడా సులభమైన రీతిలో విడమర్చి చెప్పగల  ప్రతిభ వల్లనే ఆయన సూచించిన అనేక పధకాలను ఆచరణలోకి తేవడం సాధ్యపడిందని, వాటికి తోడ్పాటు అందించిన వదాన్యులు చెబుతుంటారు.
డాక్టర్ రంగారావు గురించి తెలిసిన వారు, తెలియని వారు కూడా  చదవాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే తెలిసిన వాళ్లకు కూడా తెలియని అనేక విషయాలు ఇందులో చాలా వున్నాయి.
ఇది వెలుగులోకి రావడానికి ప్రధాన కారకుడు జ్వాలా నరసింహా రావు. ఇంత మంచి పనిని నెత్తికెత్తుకున్న ఆయన మంచితనాన్ని మరింత పొగడడానికి సమయం, సందర్భం అడ్డం వస్తున్నాయి.
పొతే, ఇటువంటి మహత్తర కార్యక్రమానికి సాయపడ్డ మహానుభావులు ఎందరో... వారందరికీ వందనాలు             

25, ఏప్రిల్ 2018, బుధవారం

పదిహేడేళ్ళ ప్రాయంలో ప్రాంతీయ పార్టీ – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha daily today, 25-04-2018)

పదిహేడేళ్ళ క్రితం 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా అనేకమంది మెటికలు విరిచారు. గతంలో  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో పుట్టిన పలు పార్టీల సరసనే టీఆర్ఎస్ పార్టీని కూడా నిలిపి, ఆ పార్టీ భవిష్యత్తుపై  నైరాశ్యంతో  కూడిన ప్రకటనలు చేసారు. అయితే ఇటువంటి అనేకానేక  ఊహాగానాలను, అన్నిరకాల బాలారిష్టాలను అధిగమించి వెచ్చటి తెలంగాణా ప్రజానీకం పొత్తిళ్ళలో ఈ పచ్చటి పసికూన పెరిగి పెద్దదయింది.
సహజమైన బాలారిష్టాలను తట్టుకుని నిలబడ్డం వేరు, కావాలని పసికందును పసిగుడ్డుగానే చిదిమి వేయాలనే దుష్ట పన్నాగాలు వేరు. భాగవతంలో చిన్ని కృష్ణుడిని మట్టుబెట్టడానికి కంసాదిదానవులు అనేకవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని కూడా ఆదిలోనే అంతం చేయడానికి అన్ని రకాల రాజకీయ కుట్రలు జరిగాయి. కుట్రదారుల  ఉద్దేశ్యం ఒక్కటే. తెలంగాణా అనే భావన తెలంగాణా ప్రజల్లో లేదని, అది కొందరు అవకాశవాద లేదా నిరుద్యోగ రాజకీయ నాయకుల దుష్టపు ఆలోచన అని రుజువు చేసి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని శాశ్వతంగా సమాధి చేయడం. ఇక ముందు ముందు ఎవరి నోటా ఆ మాట వినిపించకుండా చేయడం.
అయితే ఈసారి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన టీఆర్ఎస్ పార్టీకి కర్తా, కర్మా, క్రియా అయిన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ  నిరర్ధకం అయిపోయాయి. కడకంటా కాడి పడవేయకుండా శ్రీ కేసీఆర్ తనదైన శైలిలో విలక్షణ౦గా ఉద్యమాన్ని నడుపుకు రావడంతో ఆ ఎత్తులన్నీ చిత్తయిపోయాయి. పుష్కరకాలానికి పైగా సాగిన ఈ మహోద్యమం వాడి, వేడి ఎక్కడా, ఎప్పుడూ, ఏమాత్రం  తగ్గకుండా చూడడానికి ఆయన ఎన్నో రకాల శ్రమదమాదులకు గురికావాల్సి వచ్చింది. అటు కేంద్రాన్ని,  ఇటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ  పార్టీలను రాజకీయంగా ఏకకాలంలో ఎదుర్కుంటూ, ఉద్యమదీప్తి కొడిగట్టకుండా చూడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇతరేతర రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ, తెలంగాణా ఉద్యమాన్ని దారితప్పించాలని ప్రయత్నించే ‘విభీషణులను’ సయితం నిలువరించాల్సిన పరిస్తితి. అటువంటి వారి కారణంగా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నప్పుడు లక్ష్యసాధన కోసం గొంగళి పురుగులను సయితం  ముద్దాడ వలసిన దుస్తితి.  వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో వెలుగు తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు.  అందుకు ప్రధానంగా తోడ్పడ్డది అనర్ఘలమైన ఆయన ప్రసంగనైపుణ్యం కాగా, తెలంగాణా పట్ల ఆయనకు ఉన్న పరిపూర్ణమైన అవగాహన. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాన్ని బంగారు తెలంగాణాగా రూపొందించడానికి ‘ఏమిచేయాలి, ఎలా చేయాలి’ అనే విషయంలో ఆయన కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడానికి రూపొందించుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు అన్నీఇన్నీ కావు.  ఇలా బహుముఖంగా ఆలోచించి చేసిన ప్రయత్నాలు కాబట్టే, పార్టీపరంగా చేపట్టిన  రాజకీయ ఉద్యమానికి ఇవన్నీ అవసరమైన ఊతాన్నీ, ఉత్తేజాన్నీ  ఇవ్వగలిగాయి. తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేయగలిగాయి.
తెలంగాణా పురపాలక,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.  గతంలో ఒకసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.  
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్క అనుమానం కూడా నిజం కాలేదు. సందేహాస్పదులు కోరుకున్నది జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా  ఎండాకాలాల్లో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న,  కేసీఆర్ సాధించిన ‘అద్భుతం’ ఇది.
అయితే, తెలంగాణా సాధన ఒక ఎత్తయితే, సాధించిన దానిని సమర్ధవంతంగా అనుకున్న రీతిలో మలచడం మరో ఎత్తు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. అప్పుడే నాలుగేళ్ళు గడిచిపోయాయి. అయితేవారనుకున్నట్టూ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం కానూ లేదు.
గతంలో ఉద్యమ సమయంలో నాటి పరిపాలకులను ఎత్తి పొడుస్తూ, వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ చేసిన వ్యాఖ్యలు తదనంతర కాలంలో అధికార పీఠాన్ని అధిరోహించినప్పుడు ముందరి కాళ్ళకు బంధాలుగా మారడం సహజం. టీఆర్ఎస్ ఇన్నేళ్ళ ప్రస్థానంలో అధికార పగ్గాలు అందుకోవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అందలం ఎక్కినంత మాత్రాన పండగ కాదు. తెలంగాణాలో రాజకీయం చాలా విభిన్నమైనది. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తూ వుంటుంది.  లక్ష్య సాధనలో ఏకోన్ముఖంగా సాగిన తెలంగాణా సమాజం అదేమాదిరి కొత్త ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ తలూపకపోవచ్చు. తెలంగాణా స్వప్నం నెరవేరింది కనుక, ఇప్పుడు ప్రజల దృష్టిలో  ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి ఇప్పటిపాలక పక్షం టీఆర్ఎస్ కూడా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటి మాత్రమే.
ఈ సమయంలో, ప్రత్యేకించి ఎన్నికల ఘడియ దగ్గర పడుతున్న వేళలో  పాలకపక్షంపై ఒత్తిళ్ళు పెరుగుతాయి. గిట్టనివాళ్ళు విరిచే మెటికల సవ్వడి పెరుగుతుంది. ప్రతిపక్షాల విమర్సల జడి ఉధృతమవుతుంది.
రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే. కాకలు తీరిన రాజకీయ యోధుడు కేసి ఆర్ కి వీటిని ఎదుర్కోవడం వెన్నతోబెట్టిన విద్య కావచ్చు.
కానీ ఒక విషయం పార్టీ అధినేత గుర్తుంచుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన విధంగానే అన్ని వైపులనుంచి ప్రత్యర్ధులు బాణాలు గురిపెడతారు. పద్మవ్యూహాల రచన బృహత్తరంగా సాగుతుంది. వాళ్ళు ఎక్కుబెట్టే అస్త్రాల పదును పెరగడానికి  పాలకపక్షం స్వయంకృతాపరాధాలు కూడా తోడ్పడిఉండవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యం, అలనాడు ప్రజల్లో అపరిమితంగా భావోద్వేగాన్ని రగిల్చిన  తెలంగాణా అనే బ్రహ్మాస్త్రం  ఇప్పుడు టీఆర్ఎస్ అంబుల పొదిలో లేదు. అదిప్పుడు స్వతంత్ర భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం రూపంలో ఆవిర్భవించి నాలుగేళ్ళు గడుస్తోంది.
తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చాలనే కేసీఆర్ కన్నకల నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో గెలిచితీరాల్సిన అవసరం ఆ పార్టీకి మునుపటికన్నా ఇప్పుడు ఎక్కువగా వుంది. పరిస్తితులు చూస్తే 2014 నాటికన్నా విభిన్నంగా వున్నట్టు తోస్తోంది.
టీఆర్ఎస్ ప్లీనరీ ఇటువంటి కొన్ని ‘కీలక’ అంశాలపై దృష్టి పెట్టాలనేది హిత వాక్యం. (EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595                             


19, ఏప్రిల్ 2018, గురువారం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాడు, నేడు – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)
నేను నిద్రపోనుమిమ్మల్ని నిద్ర పోనివ్వను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి డైలాగ్ ఇది. ఆ రోజుల్లో సంగతేమో కానీ2014 లో కొత్తగా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాదిగా ఆయన కంటినిండా కునుకు తీసిన దాఖలాలు కానరావడం లేదు. మొదటిది ఆయన రాజకీయ జీవితంలో స్వర్ణ యుగం. రెండోది ఏమిటన్నది కాలమే చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంలోకిఆయన భార్యగా  లక్ష్మీపార్వతి ప్రవేశం అనేదిఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల జీవితాలను పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు. అయిదేళ్ళ విరామం తర్వాత అధికార పీఠం ఎక్కిన కొద్ది మాసాలకే ఒకరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగా,  మరొకరు అనూహ్యంగా  ముఖ్యమంత్రి కాగలిగారు.
1995లో తెలుగు దేశం పార్టీలో ఊహకు అందకుండా జరిగిన  రాజకీయ పరిణామాల దరిమిలా ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏడాది కాలాన్ని ఆయన తన అధికారాన్ని పదిలం చేసుకోవడం పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపారు. రామారావు ఆకస్మిక మరణం కూడా పరిస్తితులు బాబుకు అనుకూలంగా మారడానికి దోహదం చేసింది. 1996 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని టీడీపీ మొత్తం 42 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ అధినాయకుడిగా ఆయనకు ప్రజల ఆమోదం లభించినట్టయింది. ఈ విజయం ఆయనకు ఎంతో నైతిక బలాన్ని ఇవ్వడంతో ఆ తర్వాత,  పరిపాలనా వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ కనబరచడం మొదలుపెట్టారు. యువకుడు కావడంఆలోచనల్లో నవ్యత్వంవాటిని ఆచరణలో పెట్టడంలో కొత్తదనంవీటికి తోడు పత్రికల ద్వారా లభించే సానుకూల ప్రచారం చంద్రబాబును యువతరానికి ఆరాధ్య రాజకీయ నాయకుడిగా మార్చివేశాయి. ముఖ్యమంత్రి పేషీలో సమర్దులువిధేయులయిన అధికారుల సాయం కూడా ఆయనకు అక్కరకు వచ్చింది. కేంద్రంలో తన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వం వుండడం చంద్రబాబుకు కలిసివచ్చిన మరో అంశం.
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ, 1983 లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ సమయంలో  మాదిరిగా ప్రజలనుంచి వ్యతిరేకత పెద్దగా వ్యక్తం కాకపోవడంతో, చంద్రబాబు అనేక కొత్త రకం పధకాలతోప్రణాళికలతో పనిచేయడం ప్రారంభించారు. ప్రజల కోసం తాను  రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నట్టు ప్రజలు నమ్మేలా చేయడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారు. రాష్ట్రం కోసం అహరహం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి అనే పేరు ఇంటాబయటా మారుమోగడంతో చంద్రబాబు ధైర్యం చేసి రామారావు ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయలకు సబ్సిడీ బియ్యం పధకంవ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ పధకాలతో పాటు టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని కూడా వీలువెంట ఎత్తి వేసారు. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలకు  దిగినా,  అప్పటికే చంద్రబాబు సమర్ధత పట్ల నమ్మకం పెరిగిన ప్రజలు ఈ నిర్ణయాలపట్ల పెద్దగా విముఖత చూపలేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయి దుమ్ము కొట్టుకుపోతున్న ఫైళ్ళకు మోక్షం కల్పించడానికి ఉద్యమ రూపంలో చేసిన ప్రయత్నాలురేడియో దూరదర్సన్ ల ద్వారా ప్రజలతో వారం వారం ముఖాముఖిరైతులుఇతర బలహీన వర్గాల కోసం వినూత్నంగా ప్రారంభించిన  రైతుబజార్లుదీపం మొదలయిన పధకాలురాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా రెక్కలు కట్టుకుని హెలికాప్టర్ లో అక్కడ వాలిపోవడంరాజధాని నగరం పొలిమేరల్లో సైబరాబాదు పేరుతొ నవనగర నిర్మాణంప్రపంచ కంప్యూటర్ పఠoలో హైదరాబాదుకు స్థానం లభించేలా కృషి చేయడంప్రతిష్టాత్మక కంప్యూటర్ కంపెనీలు హైదరాబాదుకు తరలి వచ్చేలా చేయడం ఇవన్నీ కలిసి,  ఒక కొత్త తరహా ముఖ్యమంత్రిని చంద్రబాబులో చూస్తున్నామని జనం  అనుకునేలా చేయగలిగాయి.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతాననిమిగిలిన సమయాల్లో  రాష్ట్రాభివృద్ధి   మినహా తనకేదీ పట్టదని’  అప్పట్లో  ఆయన తరచూ చెబుతుండేవారు. పరిపాలనను మెరుగు పరచడానికి ఏమి చేస్తే బాగుంటుందని చంద్రబాబు తనను చూడవచ్చిన మేధావులనువిలేకరులను అడిగేవారు. తన వేగాన్ని పాలనా యంత్రాంగం అందుకోలేకపోతున్నదనివాళ్ళలో ఆశించిన  స్పందన కానరావడం లేదని మధనపడేవారు.
నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన తరహా వేరు. చంద్రబాబుతో పనిచేసిన ఆనాటి అధికారులు అదే చెబుతారు.
ఆయన తన మనసులో మాట బయట పెట్టరు. నేనిలా చేద్దామనుకుంటున్నానుమీ అభిప్రాయం ఏమిటి అని అడగరు. కానీ కొన్ని కొన్ని అంశాల్లోముఖ్యులు అని ఆయన అనుకున్నవాళ్ళ సలహాలు తీసుకునేవారు. వాటన్నిటినీ కూలంకషంగా ఆలోచించుకుని ఒక అభిప్రాయానికి వచ్చేవారు. దాన్ని తన ముఖ్య సలహాదారులతో ముందు  పంచుకునే వారు. ప్రజలనుంచి,  పత్రికలనుంచి  ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆరా తీసేవారు. ఈ రీతిలో బాగా ఆలోచించి  నిర్ణయాలు తీసుకునే చంద్రబాబును చూసి ఆయన ప్రజ్ఞకు వారందరూ ముగ్డులయేవాళ్ళు. అయితే ఈ క్రమంలో చాలా కాలయాపన జరుగుతోంది అనే విషయాన్ని  ఆయన అసలు పట్టించుకునేవారు కాదు’      
దేశ విదేశాల్లో చంద్రబాబు సమర్ధత గురించి మాట్లాడుకునేలా చేయడంలో కూడా ఆయన విజయం సాధించారు. బిజినెస్ వీక్  అనే  పత్రిక, 1999 జూన్ సంచికలో చంద్రబాబుపై  ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో ఆయన గురించి ప్రశంసలు గుప్పించింది. ఆయన్ని స్టార్ ఆఫ్ ఆసియా’ గా అభివర్ణించింది. అలాగేటైమ్ మేగజైన్,   తన సంస్కరణలతో దేశంలో ఇతర ప్రాంతాలను అధిగమిస్తూఆంధ్రప్రదేశ్ స్వరూపాన్నే మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు’ అంటూ ప్రస్తుతించింది. ఈ రాజకీయ నాయకుడు షరా మామూలు రాజకీయ నాయకుడు కాదు. ఒక శాంతియుతమైన విప్లవకారుడు’ అని న్యూస్ వీక్ పత్రిక కితాబు ఇచ్చింది. లండన్ నుంచి వెలువడే ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక  ‘భారత దేశపు దార్శనికుడు’ అనే శీర్షికతో చంద్రబాబు గురించిన వ్యాసం ప్రచురించింది. ఆయన నిజాయితీఈ. గవర్నెన్స్ పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి రాజకీయ రంగంలో అగ్రభాగానికి చేరుకునేలా చేశాయి’ అని పొగిడింది. ఎకనమిస్ట్ పత్రిక మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబును ఆకాశానికి ఎత్తింది.డిజిటల్ విప్లవం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్దత చాలా గొప్పది. నిజానికి ఈ విషయంలో  మొత్తం భారత దేశానికి ఉండాల్సిన తెగువను చంద్రబాబునాయుడు ఒక్కరే ప్రదర్శించి చూపారు’ అని రాసింది.
ఇలా వెల్లువలా వచ్చిపడుతున్న ప్రశంసల వర్షంలో చంద్రబాబు తడిసిముద్దయ్యారు. దేనికీ పడని  వారు పొగడ్తకు పడతారంటారు.  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ పేరు ప్రఖ్యాతులు  ‘ఇంకా ఏదో చేసి చూపిద్దాం’ అనే యావను ఆయనలో రగిలించాయి. మరింత ముందుకు దూకేలా ప్రోత్సహించాయి. ఈ క్రమంలో ఒకవైపు ముందుకు దూసుకు పోతూమరో వైపు పాలకుడిగా నిర్వర్తించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో  వెనుకపడి పోతున్న విషయాన్ని ఆయన విస్మరించారేమో అనిపిస్తుంది.
చంద్రుడికి పున్నమిఅమావాస్యల మాదిరిగా చంద్రబాబు పాలనకు ప్రశంసలతో  పాటు విమర్శలు కూడా  తప్పలేదు. ప్రపంచ బ్యాంకు తాబేదారుగా ప్రతిపక్షాలు ముద్ర వేశాయి. సంస్కరణల వేగంలో తమకు అన్యాయం జరుగుతోందని అట్టడుగు వర్గాలు అనుమానించడం ప్రారంభించాయి. భుజాన ఒక కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుని వెడితే చాలు సచివాలయ గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయనీ,  ముఖ్యమంత్రి  దర్శనం ఇట్టే జరిగిపోతుందనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినబడడం మొదలయింది. ఈ ఆరోపణలువిమర్శల హోరులో ఆయన చేసిన మంచి కొట్టుకు పోయింది. చేయని మంచి’ సామాన్య జనాలకు కనబడింది. ఎందుకు చేయలేదనే ప్రశ్న ఎదురుగా నిలబడింది.
ఫలితం తెలిసిందే.
దాదాపు పదేళ్ళు దూరమైఇక చేతికి అందడం అసాధ్యమేమో అనుకున్న అధికార అందలం రాష్ట్ర విభజన కారణంగా చంద్రబాబుకు దక్కింది. దక్కిందనే సంతోషం తప్ప ఆనందించడానికి ఏమీ లేదు. రాష్ట్రం ఏర్పడింది కానీ రాజధాని లేదు. పాలకులు ఒక రాష్ట్రంలోపాలితులు మరో రాష్ట్రంలో అనే రీతిలో పాలన  కొన్నాళ్ళు సాగింది. ఎట్టకేలకు మంత్రులుఅధికారుల సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరారు.
ఈ పదవి ఆయనకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాలతో పాలించిన రాష్ట్రం పదమూడు జిల్లాలకు పరిమితం అయింది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలుఇచ్చిన హామీలు నిండుకున్న ప్రభుత్వ ఖజానా ఎదురుగా నిలబడి మా సంగతేమిటని అడుగుతున్నాయి. కేవలం చంద్రబాబు సామర్ధ్యాన్ని విశ్వసించి రైతులు మూడుపంటలు పండే భూములు ముప్పయివేల ఎకరాలకు పైగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు. ఏళ్ళు గడుస్తున్నా అరకొర భవనాలు తప్పిస్తే ప్రకటనల్లో కనిపించిన రమ్య హర్మ్య భవంతులు కలికానికి కూడా కానరావడం లేదు.
ఏం చెయ్యాలో తెలియదు. ఒకప్పుడు హైదరాబాదులో కూర్చుని ఢిల్లీలో ఫైళ్ళు కదిలించిన చాతుర్యంఇప్పుడు ఎన్నిసార్లు హస్తిన చుట్టూ తిరిగినా కొరగాకుండా పోతోంది. ఏదో చెయ్యాలనే తాపత్రయం. ఏమీ చేయలేని నిస్సహాయ స్తితి.
కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టుగా వుంది పరిస్తితి.
మరో పక్క రాజకీయంగా కలవరపెడుతున్న పరిణామాలు.
చంద్రబాబుకు ఉన్నచంద్రబాబుకు మాత్రమే ఉన్న సమర్ధత అనే ఒకే ఒక్క కారణంతో నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించారు.
కానీ సమర్ధత రాణించాలి అంటే పరిస్తితులు కూడా అనుకూలించాలి. అనుకూలించిన పరిస్తితుల నేపధ్యంలో చంద్రబాబుకు ఉన్న సమర్ధత అలనాడు రాణించింది. అది విశదం చేయడానికే ఇంతటి ఉపోద్ఘాతం అంత వివరంగా చెప్పాల్సి వచ్చింది.
ఈనాడు అలనాటి పరిస్తితులు లేవు. ఆ రోజుల్లో విశ్వసనీయంగా పనిచేస్తూతమకూ తమ ముఖ్యమంత్రికీ మంచి పేరు తెచ్చిన అధికార యంత్రాంగం ఈనాడు వుందో లేదో తెలవదు. ఇక ప్రభుత్వ యంత్రాంగం మనసు పెట్టి పనిచేయడం లేదని నేతలే అంటున్నారు. ఒక నిబద్ధత కలిగిన పార్టీగా  ఆనాడు ఉన్న మంచి పేరు ఇప్పుడు లేదని పార్టీవాళ్ళే చెప్పుకుంటున్నారు. పొతే,  ఒక స్థాయిలో అవినీతి గురించి వెలువడుతున్న  వార్తలు నమ్మతగ్గవేనా అని సందేహించేంతలోబ్యాంకు స్ట్రాంగ్ రూములను,  బంగారు దుకాణాలను తలపించేలా మీడియాలో బయట పడుతున్న అవినీతి చేపల కధనాలు. పట్టుపడ్డ అవినీతి సొమ్మును లెక్కించడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు  కరెన్సీ కౌంటింగ్ మిషన్లను వాడాల్సిన పరిస్తితులు వచ్చాయంటే పరిస్తితులు ఎంతగా దిగజారిందీ  అవగతం అవుతుంది.
అయితేగుడ్డిలో మెల్లగాఆనాడు చంద్రబాబుకు  అయాచితంగా లభించిన విశేష ప్రచారంఈనాడు కూడా  లేకపోలేదు. కాకపొతేఇంతటి బృహత్తర పార్టీ వ్యవస్థ, ప్రచార యంత్రాంగం  వుండి కూడా తన గురించి తనే చెప్పుకోవాల్సిన స్తితి రావడం ఏ నాయకుడికి అయినా బాధాకరమే. పైగాచంద్రుడిలో  మరో కోణం చూపించే మీడియా ఈనాడు పుష్కలంగా వుంది. దానికి తోడు ఎవరి అదుపాజ్ఞల్లో ఇమడని సోషల్ మీడియా రంగప్రవేశం చేసింది.  అప్పటికీ ఇప్పటికీ కొట్టవస్తున్నట్టు కనబడే తేడా ఇది. పులిమీది పుట్రలా, అదురూ బెదురూ లేని ఏకైక ప్రతిపక్షం. కలిసిరాని మిత్రపక్షం. ఆ బంధమూ మొన్నీమధ్యనే  తీరిపోయింది.
ఇప్పుడు రాష్ట్రంలో రెండే జట్లు. చంద్రబాబు వర్సెస్ రెస్టాఫ్ ఆంధ్రప్రదేశ్!
కలిసిరాని కాలంతో చంద్రబాబు నాలుగేళ్ళు నెట్టుకువచ్చారు. ఇంకా ఎన్నికలకు ఏడాది గడువే వుంది.  పరిణామాలు గమనిస్తుంటే ముందు ముందు రాజకీయమైన ఆరోపణలకు, విమర్శలకు మరింత  పదునెక్కడం తప్పిస్తే సర్దుకునే అవకాశాలు లేశ మాత్రంగా కూడా కానరావడం లేదు. కిందటి ఎన్నికల్లో పనిచేసిన అనేక అనుకూల అంశాలు ఈనాడు అంతర్ధానం అయిపోయాయి. ఒకరకంగా యుద్ధాన్ని మళ్ళీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సిన స్తితి.
పూర్తి శక్తియుక్తులు, సమస్త వనరులు సంపూర్ణంగా  ప్రయోగిస్తే మరోసారి అధికారం చిక్కవచ్చునేమో. అతి కష్టమైనా సాధ్యం కావచ్చునేమో. ఏమో అనే సంశయమే కాని, ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి.
కానీ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబుకు  లభించిన ఆదరణ ఈనాడేదీ! మరోసారి ముఖ్యమంత్రి అయిన  తరువాత కూడా లభిస్తుందన్న పూచీ ఏదీ!
ఏవి తల్లీ  నిరుడు కురిసిన హిమసమూహములు!
ఈ పుట్టిన రోజున అయినా పాత వైభవం రావడానికి ఏదైనా చేయకపోతారా అని  ఆయనకున్న అసంఖ్యాక అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు కదా! వారి ఆశలు అలాగే వుంటాయి. విరుద్ధంగా జరిగితే, వారి నిరాశ కూడా అదే స్థాయిలో వుంటుంది.
తాను పాత చంద్రబాబునే అని నిరూపించుకోవడం ద్వారా ఈ తడవ తన పుట్టిన రోజు కానుకను  ఆ రూపంలో వారందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీదే వుంది.
కానీ, ప్రస్తుత పరిస్తితులు గమనిస్తుంటే  అంతటి వ్యవధానం వున్నట్టు కనిపించడం లేదు. (EOM)     
(రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595)        

17, ఏప్రిల్ 2018, మంగళవారం

స్వర తారల సంగమం – భండారు శ్రీనివాసరావుఆకాశవాణిలో తమ స్వరాల ద్వారా అశేష తెలుగు ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న మాజీ అనౌన్సర్లు, కళాకారులు ఈరోజు హైదరాబాదులో కలుసుకుని పాత ముచ్చట్లు కలబోసుకున్నారు. ఆలిండియా రేడియో సీనియర్ న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య పూనికపై ఈ సమ్మేళనం జరిగింది. తనతో కలిసి పనిచేసిన ఒకనాటి రేడియో సహచరులను ఒక్క చోటకు చేర్చాలనే సంకల్పంతో  విందు భోజనసమేత సంగమాన్ని ఈ మధ్యాహ్నం కూకట్ పల్లి లోని చట్నీస్ కాన్ఫరెన్స్  హాలులో ఏర్పాటు చేశారు.
శ్రీ వెంకట్రామయ్య పిలుపుకు స్పందించి, అనౌన్సర్లనుంచి అడిషినల్ డైరెక్టర్ జనరల్ వరకు గతంలో రేడియోలో పనిచేసిన దిగ్గనాధీరులు ముప్పయి మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు మూడు దశాబ్దాలు కలిసి పనిచేసిన వీరందరూ ఎప్పుడో పదవీవిరమణ చేసారు. అందరికంటే పెద్దవారు రేడియో చిన్నక్కగా ప్రసిద్దులయిన శ్రీమతి రతన్ ప్రసాద్. ఆమె గారి వయసు అక్షరాలా ఎనభయ్ అయిదు సంవత్సరాలు.  అందరికంటే వయసులో చిన్నవారు శ్రీ సుధామ సతీమణి శ్రీమతి ఉషారాణి. ఆలిండియా రేడియో అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన డాక్టర్ ఆర్.ఏ. పద్మనాభరావు, మాజీ స్టేషన్ డైరెక్టర్లు శ్రీ ఆర్. విశ్వనాధం, డాక్టర్ పి. మధుసూదనరావు, డాక్టర్ పి. ఎస్. గోపాలకృష్ణ, డాక్టర్ కే.బీ.గోపాలం హాజరయిన వారిలో వున్నారు. గతంలో రేడియోలో తమ స్వర మాధుర్యంతో అసంఖ్యాక శ్రోతలను అలరించిన స్వరరాగధునులు శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీమతి ఇలియాస్ జ్యోత్స్త్న, శ్రీమతి ఆకెళ్ళ సీతాదేవి, శ్రీమతి ఇందిరాదేవి, శ్రీమతి నిర్మలా వసంత్, శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి, శ్రీ ఇలియాస్ అహ్మద్, శ్రీ రాజగోపాల్, శ్రీ మట్టపల్లిరావు, శ్రీ కోకా సంజీవరావు, శ్రీ కలగ కృష్ణ మోహన్, శ్రీ ఏ.వీ.రావు చౌదరి, శ్రీ సుధామ, శ్రీ ఎం. బాబూరావు, శ్రీ వెంకట్రామయ్య గారి భార్య శ్రీమతి కరుణ ప్రభ్రుతులు తమ రాకతో ఈ సమ్మేళనానికి కొత్త సొగసులు అద్దారు.
ఇక నా విషయం సరే, ఉభయచరం మాదిరిగా ఇటు రేడియో విలేకరిని, అటు జీవన స్రవంతి ద్వారా రేడియో స్వరాన్ని. అంటే ఒకరకంగా స్వర పరిచితుడిని అన్నమాట.
తోకటపా: ఈ కార్యక్రమం ఆలోచన, ఆచరణ, కర్తాకర్మాక్రియ అన్నీ వెంకట్రామయ్య గారే. మాది పేరంటాళ్ళ పాత్ర.

Image may contain: 19 people, including Padmanabharao Rao, Drcvn Reddi and M V Apparao Surekha, people smiling, wedding and indoor
     

8, ఏప్రిల్ 2018, ఆదివారం

చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత


“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో  ఏదైనా అప్రాత్యపు వాక్యం దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబు చెప్పేముందు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం  మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో  చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణా దులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔను అంటున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.           
పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే, విభక్తుల్లో సంబోధన  ప్రథమా విభక్తి తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసే’ అనడం, తండ్రిని ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగావడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతోంది.
వెనుకటి రోజుల్లో ....
పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ, గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని, పెద్దలు గుర్రుమనే వారు. ‘అలాంటి అపభ్రంశపు మాటలు మళ్ళీ మాట్లాడితే జాగ్రత్త’ అంటూ తొడపాశం పెట్టేవాళ్ళు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి, బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇంట్లో ‘అమ్మా’ అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం ‘మా అమ్మగారు’ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు, ‘గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి’ అనోపూజ్యులైన తాతయ్యగారికి’ అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగావిధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతాసంస్కారాలకు అదే కొలమానంగా భావించేవారు.

ఇకపత్రికల్లో వాడే భాషసినిమాల్లో వినిపించే సంభాషణలుచట్టసభల్లో జరిగే చర్చలు  చాలా వరకు పరిధులకుప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణిదూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలువార్తలు గిరి గీసుకునిమడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీకాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టితరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడంఅమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతం’ చేయడంలో ఈనాటి ఎ టూ జెడ్’ ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడంహేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పోఏది తప్పో చెప్పేవాళ్ళు లేకచెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలువైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసే అనడంనాన్నను ఒరే అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకుపత్రికలకుపుస్తకాలకుచట్టసభలకు విస్తరించి, సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులుమేధావులుజర్నలిస్టులుకవులురచయితలుకళాకారులు  చెప్పే మాటల్లోప్రవచించే పలుకుల్లోరాసే రాతల్లో  సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు  ఈనాటి సినిమాలేఈనాటి ఛానళ్ళే, ఈనాటి పత్రికలేఈనాటి పుస్తకాలే, ఈనాటి సాంఘిక మాధ్యమాలే, ఈనాటి చట్ట సభలే! 
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు. రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు. పాఠకులను బట్టే పత్రికలు. ప్రేక్షకులను బట్టే సినిమాలు. వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!