30, అక్టోబర్ 2019, బుధవారం

రేడియో రోజులు -3


(Published in SURYA daily on 31-10-2019,Thursday)
రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలుఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.
అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.
వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.

వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట,  ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు,  గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ, ఆ మాట  నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.
రేడియో విలేకరిగా ముఖ్యమంత్రి వెంగళరావు పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన డెడ్ లైన్లువుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసే వారు. తరువాత ఆయనే లేచి నిలబడి  మంచిది వెళ్ళిరండిఅంటుంటే ఇక విలేకరులు మాత్రం ఏం చేయగలరు? విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. ఆంధ్రజ్యోతి ఐ. వెంకట్రావు, హిందూ రాజేంద్రప్రసాద్ వంటివారితో ఆయనే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడం నాకు తెలుసు.
ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని  కూడా  వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు  ఒక్కరే ఆయన పేషీలో  ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఒ మోస్తరు  ఉద్యోగులే.  ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి.  మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ  స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు  సీఎం ప్రధాన  భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు. తరువాత కొన్నాళ్ళు ఈ బాధ్యతలను సి. నరసింహా రెడ్డి చూసేవారు.  నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక  వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే!  సీ ఎం కాన్వాయ్. సచివాలయంలో ఆయన   కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది.
ముఖ్యమంత్రి గదిలో ఓ పది, పన్నెండు పేము కుర్చీలు ఉండేవి. హైదరాబాదులో పనిచేసే అన్ని పత్రికల విలేకరులు అందరూ వచ్చినా ఇంకా ఒకటి రెండు ఖాళీగానే ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు. విలేకరుల సమావేశం పెట్టాలి అంటే ఫతే మైదాన్ ఇండోర్ స్టేడియం కావాలి అని జోకులు వేసుకునే రోజులివి.
ముఖ్యమంత్రి వెంగళరావుతో  నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ, ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ఆహా ఏమి అదృష్టంఅనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరదన్నారు.  నేను గట్టిగా చెప్పడంతో  ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ఇల్లు వసతిగా వుంది కదా!అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని.
(ఇంకా వుంది)

రేడియో రోజులు – 2 - భండారు శ్రీనివాసరావు

(30-10-2019 తేదీ బుధవారం సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఉద్యోగం చేసేవాడికి డ్రెస్ కోడ్ వుండాలనేది మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి నిశ్చితాభిప్రాయం. అంటే  యూనిఫారం అని కాదు. హుందాగా వుండే దుస్తులు వేసుకుంటే అవతలవారికి మనపట్ల సరయిన అభిప్రాయం కలుగుతుందని ఆయన ఉద్దేశ్యం. అయితే, ‘రేపటి మనిషి’ గా నాకు నేను కితాబు ఇచ్చుకునే నాకు మాత్రం  వేసుకునే దుస్తులమీద అంత పట్టింపులు ఏమీ లేవు. ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు న్యూస్ పేపర్ నమూనాలో ప్రింట్స్ వున్న చొక్కాలు వేసుకుని తిరిగేవాడిని. రేడియోలో చేరిన తరవాత మా అన్నయ్య పట్టుబట్టి నా వేష ధారణలో కొంత మార్పు తీసుకురాగలిగారు. ఒకరోజు ఏదోపనిమీద రేడియో స్టేషనుకు వచ్చిన అయన మా న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధరావు గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటె ఆయన రంగురంగుల బొమ్మల బుష్కోటు(బుష్ ష ర్ట్) తో ఆఫీసులో కనిపించారు.చూడడానికి చిన్న ఆకారమయినా - రంగనాధరావు గారిది నిజమయిన రేడియో స్వరం. ఆయన వార్తలని ఈ నాటికీ గుర్తుచేసుకునేవారు వున్నారు.
“ఆకాశవాణి – తెలుగులో వార్తలు చదువుతున్నది – పన్యాల రంగనాధరావు –డిల్లీ నుంచి ప్రసారమవుతున్న ఈ వార్తలను హైదరాబాద్, విజయవాడ, మద్రాసు  రేడియో  కేంద్రాలు రిలే చేస్తున్నాయి.” అంటూ ఆ వార్తలు మొదలయ్యే తీరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అలాగే, జగ్గయ్యగారు వార్తలు చదివితే ఆయన కంఠం కంచులామోగేదని వినడమే కానీ ఎన్నడు ఆ వార్తలు వినలేదు. వార్తలు వినే వయసు వచ్చేసరికే బహుశా ఆయన సినిమా రంగానికి వెళ్ళిపోయివుంటారు.
హైదరాబాద్ లో రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావు గారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు.  ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా  మోహంలో రంగులు మారడం చూసి – “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది?  రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి- తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని  ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్  పాసు తీసుకున్న తరవాతే –మిగిలిన ఏ పనులయినా! – తెలిసిందా” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.
ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నార్ల గారితో నాకు ఇలాటి అనుభవం ఇంకో రూపంలో ఎదురయింది. ఆయనకు   చండశాసనుడనే పేరు. పెద్దవాళ్ళకే ఆయన గారితో మాట్లాడాలంటే కాళ్ళల్లో వొణుకు. జ్యోతిలో చేరిన నాలుగు  నెలలకే నాకు రెండు రోజులు సెలవు కావాల్సివచ్చింది. ధైర్యం కూడదీసుకుని వెళ్లాను. ఏకళన వున్నారో ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే సంతకం పెట్టి ఆ రోజు  సంపాదకీయం రాసే పనిలో మునిగిపోయారు. నిజానికి ఎవరికీ సెలవు ఇచ్చే పరిస్తితి లేదు. ఆ విషయం నాకూ తెలుసు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఒక కొలిక్కి వస్తున్నరోజులవి. అందరం రాత్రీ పగలూ అనకుండా పనిచేస్తుండేవాళ్ళం. నేను చేసే సబ్ ఎడిటర్ పనికి తోడు, యుద్ధ రంగంలో  భారత సైన్యం కదలికలను సూచించే మ్యాపులను కూడా తయారుచేసే పని చూసేవాడిని.
సరే. సెలవునుంచి వచ్చిన తరవాత వెళ్లి నార్లగారిని కలిసాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన సంగతి చెప్పాను. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. “ఆదర్శాలు అంటూ ఏదేదో రాస్తూ వుంటాము. కానీ కుర్రాడివి నువ్వు చేసి చూపట్టావు. పో!  మళ్ళీ సెలవు ఇస్తాను పో! హాయిగా తిరిగి  నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా! పో!” అన్నారు ఆయన స్టయిల్లోనే కరుగ్గా.
“నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణాఖండలశస్త్రతుల్యము” అని వూరికే అన్నారా!   (ఇంకా వుంది)

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

(29-10-2019 తేదీ  మంగళవారం సూర్య దినపత్రికలో ప్రచురితం)

‘ఆకాశవాణి కేంద్రం, హైదరాబాదు’
(నిషిద్ధ ప్రదేశం, అనుమతిలేనిదే లోనికి రాకూడదు)
“ఒక్కసారయినా ఇందులోకి వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో!”
ఇలా మనసులో అనుకుంది ఎవరో కాదు, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుడుగా వున్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కేవీ. రమణాచారి. ఆయన స్వయంగా ఒక సభలో ఈ విషయం చెప్పారు.
అలాంటి రేడియో స్టేషన్ లో మూడు దశాబ్దాలకు పైగా కొలువు చేసే అపూర్వ అవకాశం నాకు  లభించింది. ఇది పూర్వ జన్మ సుకృతం.
అలనాటి అనుభవాలను కొన్నింటిని సూర్య పాఠకులతో పంచుకోవాలనే సంకల్పానికి సుముఖత చూపిన  ఆ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.
ఇక చదవండి!


2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే పిల్లల దగ్గర  వొదిలేసి.
పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందని మావాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవు పెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అయితే ఆకాశవాణి ప్రాంతీయ విభాగంలో పనిచేస్తున్న మాడపాటి సత్యవతి, అమర్ చదివే విధానం నచ్చి ఆయన చేత వారానికి రెండుసార్లు ప్రసారం అయ్యే ‘వార్తావాహిని’ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అప్పుడు అక్కడే విలేకరిగా పనిచేస్తున్న నాకు, అమర్ తో అప్పటివరకు ఉన్న పరిచయం అంతంత మాత్రమే  అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహశీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ ఛానళ్ళకు అలవాటు పడి రావడం చేత, తెలతెలవారే   ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళకాని వేళలో  టీవీలో ఈ  వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళకు పైగా  రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆనాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా అక్కడి మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. (ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు). ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.
ముందు అడుగు వేసినవాడే మునుముందుకు పోగలుగుతాడని అనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ  రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను. (ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ను, అందులో తెలుగు టీవీని  దిగంతాలకు చేర్చగలిగిన సత్తా చూపిన రవిప్రకాష్ విషయంలో ఇటీవల వెలుగు చూసిన కొన్నిపరిణామాలు, ఆయన శక్తి సామర్ధ్యాలను మసకబారేలా చేయడం ఓ విషాదం)   

అదలా ఉంచితే, తదనంతర కాలంలో ఎస్. జైపాల్ రెడ్డి  మా మంత్రిగా పనిచేసిన కాలంలో, ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలా సంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్రమే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.
 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ ఛానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు. (ఇప్పుడు ఇంకా సులువయింది. చిన్న సెల్ ఫోన్ తోనే ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.)

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు చెప్పేవారు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి రోడ్డు మీదికి  చూస్తే కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా, ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం.
అన్నట్టు, ఆశ పడడం, ఆశగా ఎదురు చూడడం  మన దేశం మనకిచ్చిన జన్మహక్కు.

17, అక్టోబర్ 2019, గురువారం

వింత




వింతలలోకెల్లా పెద్ద వింత ఏమిటన్న సందేహం సృష్టికర్తకు కలిగింది. తన మానస పుత్రుడు, త్రిలోక సంచారి అయిన నారద మహర్షే  ఈ సంశయ నివృత్తి చేయగల సమర్దుడని భావించి ఆ మహర్షినే అడిగాడు చతుర్ముఖ బ్రహ్మ.
నారద మహర్షి ఇలా బదులు చెప్పాడు.
‘వింతలలో పెద్ద వింత నాకు భూలోకంలో కనబడింది తండ్రీ. ఒకడు ఆయువుతీరి కన్నుమూశాడు. బంధుమిత్రులు అతడి శవం చుట్టూ మూగి, శోకాలు పెడుతున్నారు. ఏదో ఒకనాడు తామూ అలాగే మృత్యువు బారినపడాల్సివస్తుందని వారికి ఆ క్షణంలో గుర్తులేదు. ఇంతకంటే చిత్రం, విచిత్రం ఏముంటుంది చెప్పండి’
(మా లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి, వరం బామ్మ అనేవాళ్ళం, పచ్చీసు ఆడడానికి వచ్చిన అమ్మలక్కలతో ఇలాంటి కబుర్లు కధలు కధలుగా చెబుతుండేదని మా రెండో వదినెగారు విమలాదేవి గుర్తు చేసుకున్నారు)           

14, అక్టోబర్ 2019, సోమవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ


ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ఎక్కిన అనేకానేక  నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.
ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తాను.
నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్  ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం  వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.
సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.
‘నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం  అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’
రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది.  పైకిలేపిన  చేతులను  అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.
సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.
సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి  దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.
మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
‘ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.
వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా  యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.                
        

13, అక్టోబర్ 2019, ఆదివారం

ఏం చేసినా కలెక్టర్ గానే.......

“మేము ఏం చేసినా, మంచి పేరు తెచ్చుకున్నా అది జిల్లా అధికారులుగా పనిచేసినప్పుడే. ఒక్కసారి సచివాలయంలో అడుగు పెట్టాము అంటే మొత్తం సమయం విధానాల రూపకల్పనకూ, వాటి అమలు పర్యవేక్షణకే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెక్రెటరీ ఉద్యోగం పేరుకు పెద్దదే కావచ్చుకాని నిజానికి అది గ్లోరిఫైడ్ క్లర్క్”
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి మాటల సందర్భంలో చెప్పిన మాట ఇది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కలెక్టర్లుగా పనిచేసి తరువాత సచివాలయంలో డిప్యూటీ సెక్రెటరీలుగా, కార్యదర్శులుగా విధులు నిర్వహించిన అనేకమంది ఐఏ ఎస్ అధికారులతో వృత్తిరీత్యా ఏర్పడ్డ అనుబంధాలలో భాగంగా చోటుచేసుకున్న ముచ్చట్లలో అధిక భాగం వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసినప్పటి విషయాలే కావడం నన్ను అబ్బురపరిచేది.
సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఆయన వద్ద జిల్లా పౌర సంబంధాల అధికారిగా వుండేవారు. (తదనంతర కాలంలో ఆ శాఖకు డైరెక్టరుగా, అయిదుగురు ముఖ్యమంత్రులకు, 'చెన్నా టు అన్నా' - పీఆర్వోగా పనిచేశారు) ఆ కలెక్టర్ గారు ఎప్పుడు దౌరా వెళ్ళినా మా అన్నయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేవారు. పత్రికల్లో వార్తలు, ఫోటోలు వేయించుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం వుండేది కాదు. మరి, ఎందుకు తనని కూడా తీసుకువెడుతున్నట్టు. అసలు విషయం ఏమిటంటే జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలు, ప్రధానంగా బీదాబిక్కీ ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకునే వారు. హషీం ఆలీ గారి తెలుగు భాషా పరిజ్ఞానం అంతంత మాత్రం. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది తర్జూమా చేసి చెప్పేటప్పుడు తనని తప్పుదోవ పట్తిస్తారేమో ఆయనకు అనుమానం. అందుకని ఆ పనిలో తోడ్పడడం కోసం మా అన్నయ్యను వెంట ఉంచుకునే వారు. ఈ సాన్నిహిత్యాన్ని కొందరు అపార్ధం చేసుకున్నారు కూడా. కలెక్టర్ గారితో మీకు బాగా పరిచయం వున్నట్టుందే అని అడుగుతుండేవారు. మా అన్నయ్య స్వతహాగా హాస్య ప్రియుడు. ‘అవునండీ. బాత్ రూమ్ అవసరం లాంటిది మా పరిచయం. బాత్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే వుండిపోరుకదా. అలాగే నేను కలెక్టర్ గారిని రోజూ ఎన్నిసార్లు కలుసుకున్నా అవసరం మేరకే. అది పూర్తికాగానే బయటకు వస్తాను’ అనేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్ రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.
ఆ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని ‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.
Note: Inputs courtesy my second brother Shri B.Ramachandra Rao, CGM, SBI, (Retired)