29, మార్చి 2017, బుధవారం

కేసీఆర్ సుభాషితం


“ఇవ్వాళ  ఆంధ్రజ్యోతి చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు పండగ రోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“యెంత లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక  రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పడు సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.

ఇక ఎవరయినా చెప్పేది ఏముంటుంది?       

24, మార్చి 2017, శుక్రవారం

సంగమం

ముగ్గురు మిత్రులు – సరస్వతి రమ  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంధ్రజ్యోతి కధనం. ఇందులో ఒకరు మన ఫేస్ బుక్ మిత్రుడు వేమవరపు భీమేశ్వర రావు కాగా రెండో వ్యక్తి తుర్లపాటి వెంకట సాంబశివరావు. అతడూ ఫేస్ బుక్ లో వున్నాడు. మూడో మనిషిని నేనే కనుక నా  గురించి చెప్పక్కరలేదు. మా ఇంట్లోనే జరిగింది ఈ అపూర్వ కలయిక. కాకపొతే, 2009 డిసెంబరులో. రాసిన విలేకరి సరస్వతి రమ. దీనికి ఆవిడ పెట్టిన శీర్హిక ‘సంగమం’.
సంగమం 
ఉదయాన్నే ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న శ్రీనివాసరావు ఇంత పొద్దున్నే ఎవరబ్బాఅనుకుంటూనే ఫోను తీశాడు. శ్రీనివాసరావా!అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న గొంతు పలకరించింది. అవును. మీరు....అన్నాడు శ్రీనివాసరావు. గుర్తు పట్టు చూద్దాంఅంది అవతలి గొంతు కవ్వింపుగా. భీమేశ్వర రావు కదూ..అంటూ నలభయ్ ఏళ్ళ తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు శ్రీనివాసరావు. అప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా పిలిచి శ్రీనివాసరావు ఇంట్లో కలవాలని నిర్ణయం చేసుకున్నారు. ఓ రోజు ఉదయం కలిసారు కూడా. నలభయ్ ఏళ్ళనాటి కబుర్లు చెప్పుకుంటూ చిన్నపిల్లలై పోయిన ఆ ముగ్గుర్నీ ఓసారి పలకరిద్దాం పదండి సరస్వతి రమ
భండారు శ్రీనివాసరావు, భీమేశ్వర రావు, తుర్లపాటి సాంబశివరావు చిన్ననాటి స్నేహితులు. స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు,పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక  ఈ మధ్యనే హైదరాబాదులో కలుసుకున్నారు. నలభయ్ ఏళ్ళ తరువాత కలుసుకున్నా ఆ ముగ్గురిలో అదే స్నేహం, అదే ఆత్మీయత. చదువులు పూర్తయ్యాక, ఉద్యోగ, ఉపాధుల నిమిత్తం ఎక్కడెక్కడో సెటిల్ అయిన తరువాత కూడా ఒకరికోసం మరొకరు  ఆరా తీసుకుంటూనే వున్నారు. వీరిలో శ్రీనివాసరావు,సాంబశివ రావు బంధుత్వం రీత్యా మధ్య మధ్య కలుసుకుంటూనే వున్నా, భీమేశ్వర రావు ఆ ఇద్దర్నీ కలవడం నలభయ్ ఏళ్ళలో మొదటి సారి. అసలు వీళ్ళ కలయిక కూడా చాలా విచిత్రంగా జరిగింది.  
క్షణంలో చేరువైన నలభై ఏళ్ళ దూరం 
భీమేశ్వరరావు కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి రెండేళ్ళ క్రితం హైదరాబాదు వచ్చారు.  వచ్చినప్పటి నుంచి కూడా తన చిన్న నాటి మిత్రుల జాడకోసం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నారు. ఆయన హోమియో వైద్యం కూడా ప్రాక్టీసు చేస్తారు. తనకు పరిచయం వున్న ఒక మీడియా మిత్రుని ద్వారా భండారు శ్రీనివాసరావు ఫోను నెంబరు పట్టుకుని ఫోనుచేసారు. ఆ విధంగా ఈ ముగ్గురు బాల్య స్నేహితులు భండారు శ్రీనివాసరావు ఇంట్లో కలుసుకున్నారు.
వేయిపడగల గ్రంధం
“మా జ్ఞాపకాలను, చిన్ననాటి అనుభూతులను  నెమరు వేసుకోవడానికి ఇప్పుడు మాకు దొరికిన ఈ రిటైర్మెంట్ లైఫ్ కూడా సరిపోదేమో. మా స్నేహాన్ని, మా బాల్యాన్ని వర్ణించాలంటే వేయి పడగలంత  పెద్ద  కావ్యం అవుతుంది” అంటూ తమ చిన్ననాటి ముచ్చట్ల మూట విప్పడం మొదలెట్టారు తుర్లపాటి సాంబశివరావు.
“ముందు నుంచీ కూడా మా భీమేశ్వర రావు చాలా క్రమశిక్షణతో వుండేవాడు. వాళ్ళ నాన్నగారి నుంచి వాడికది అబ్బింది. మితభాషి కూడా. వాడిప్పుడు ఇంతలా మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు కదా! బహుశా అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు సాంబశివరావు. ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.
“కానీ మేమిద్దరం అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్ లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి  రెండుగంటలు ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో ..చాలా వేషాలు వేశాం” అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు..వాడికి రాని కళలు లేవంటే నమ్మండి. మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు వచ్చేవాడు. ప్రతిరోజూ సాయంకాలం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని గంట, గంటన్నర కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అన్నీ కూడా విజ్ఞానాన్ని పంచుకునే అంశాలే వుండేవి, మాకబుర్లలో. అల్లరికి అల్లరి, చదువుకు చదువు అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు, భీమేశ్వర రావు.
“అంతేనా ఏ మాస్టారు తగిలినా ఆ మాస్టారు  మీద కవిత్వం రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్.  అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు, లక్ష్యాలు లేవండీ బాబూ. హాయిగా తిరిగాం, తిరుగుతూ పెరిగాం.  బాల్యాన్ని చక్కగా ఆస్వాదించాం” అంటూ గత జ్ఞాపకాల మాధుర్యాన్ని చవి చూసుకుంటూ చెప్పారు భండారు శ్రీనివారావు.
ఆ రోజులింక రావు ....
“మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం ఉద్విగ్నంగానే కాదు  ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది. నాకు చదువు పూర్తయిన తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం. మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వర రావు చెబుతుంటే, “ అవునురా! ఇప్పుడున్న రామోజీ సిటీ ప్రాంతంలో రోజుకు రెండు వైపులా ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ పోలిమేరల్లోకి బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ రాడు చల్లగా ఐసు కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు వచ్చినట్టు లెక్కన్న మాట. అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు” నిట్టూర్చారు శ్రీనివాసరావు.
ఇలా ఆ మువ్వురు బాల్య స్నేహితుల తమ జ్ఞాపకాల మూటనుంచి, హైదరాబాదు మొదలుకుని ఎన్నెన్నో చిన్ననాటి ముచ్చట్లు అలా బయటకు తీస్తూనే  వున్నారు. చమత్కారాలు, జోకులు, సరదాసరదా ముచ్చట్లతో వారి సంభాషణ అనంతంగా సాగిపోతూనే వుంది.
ఆ ముగ్గురు మిత్రుల శేష జీవితం ఈ స్నేహ మాధుర్యంతో ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం.
(సరస్వతి రమ, ఫోటోలు: బిక్షం రూధర్)

  

19, మార్చి 2017, ఆదివారం

సంతకం ఖరీదు అయిదు రూపాయలు

  
ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..
అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరికలేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.        
తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.
కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.
నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.
నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.
కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.


(శ్రీ వీవీ శాస్త్రి)


తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’  

14, మార్చి 2017, మంగళవారం

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు

చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు. 
హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండిఅంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం అన్నారు.
నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.
హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాముఅని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

10, మార్చి 2017, శుక్రవారం

అంతయు మన మేలునకే

One old story:
"అపార్టుమెంటు జీవితాల్లో మనుషుల్ని కలిపేది విడతీసేది లిఫ్టే. ఈ వాస్తవం మా లిఫ్ట్ పుణ్యమా అని మా ఎరుకలోకి వచ్చింది.
మా మధుబన్ అపార్టుమెంటులో లిఫ్ట్ చెడిపోయింది. ఇది పెద్ద వార్తేమీ కాదు. కాకపోతే అది చెడిపోయి మూడు నెలలు దాటిపోయింది. రిపేరు ఖర్చు పెద్ద మొత్తం కావడంతో చాలా రోజులు సంక్షేపించారు. మొదటి రెండు అంతస్తుల్లో వుండేవాళ్ళు మాకు లిఫ్ట్ అవసరమే లేదు అలాంటప్పుడు అనవసరంగా ఖర్చు యెందుకు భరించాలి అన్న పద్దతిలో ముందు వాదనకు దిగినా తరువాత దిగివచ్చి డబ్బులో వాటా ఇవ్వడానికి వొప్పుకున్నారు. మొత్తం మీద పని మొదలయ్యింది. కానీ చురుకుగా సాగలేదు. ఈ లోగా మూడో అంతస్తులో వుంటున్న మేమూ మాపై అంతస్తులోవున్నవాళ్ళూ గత్యంతరం లేక మెట్లమీద నుంచే రాకపోకలు మొదలు పెట్టాము. కింది వాళ్లు సరేసరి. దాంతో అపార్టుమెంటులో వుంటున్నవాళ్లందరూ రోజులో ఏదో ఒక సమయంలో మెట్లమీద ఎదురు పడడం, మర్యాదకు పలకరించుకోవడం కూడా మొదలైంది. ఏతావాతా ఈ సంబంధాలు క్రమంగా పలకరింపులదాకా, పలకరింపులు ముచ్చట్లదాకా, ముచ్చట్లు ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడాలదాకా పెరిగి మొత్తం అపార్టుమెంటులోనే ఒక సుహృద్భావవాతావరణం ఏర్పడింది. అంతకు ముందుదాకా ఎడమొహం పెడమొహంగా వుంటున్నవాళ్లు కూడా మొహాలమీద చిరునవ్వు పులుముకుని మరీ పలకరించుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా లిఫ్ట్ రిపేరు పని కూడా మొదలయింది. కానీ ఆ పనివాడికి ఈ పాత లిఫ్ట్ రిపేరుకంటే మించిన పని మరెక్కడన్నా దొరికిందో యేమో కానీ మా పనిని వాయిదాల పద్దతిలో కొనసాగిస్తూ వచ్చాడు. దానా దీనా ఈ ఆలశ్యం కూడా మంచే చేసింది. లిఫ్ట్ రిపేరు ఖర్చు విషయంలో పొట్టు పొట్టయిన వాళ్లు, వాళ్ల పిల్లలు చెట్టాపట్టాలు వేసుకుని మెట్లెక్కి దిగే పరిస్తితి ఏర్పడింది. ‘బెడ్ రూమ్ టు బాత్ రూమ్ మార్నింగ్ వాక్’ చేసే నా బోంట్లకు మెట్ల మార్గం కాసింత వ్యాయామ మార్గంగా మారింది.
కాబట్టి ఈ పొట్టి కధలో గట్టి నీతి ఏమిటంటే చెడిపోవడం కూడా కొండకచో మంచే చేస్తుంది.
(తోకవాక్యం: మా ఆవిడ నేను రాసే ఇవ్వేవీ చదవదు కాబట్టి ధైర్యంగా రాస్తున్నాను. లిఫ్ట్ లేకపోవడం వల్ల ఆవిడ వూళ్ళో బంధువుల ఇళ్లకు రోజువారీ చేసే పెత్తనాలు కూడా బాగా తగ్గిపోయాయి. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ)
17-09-2013"

నేనెవరు ?


ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక మహామహులే గింగిరాలు తిరిగిపోయారు. ఫేస్ బుక్ లో చాలామంది పర్సనల్ మెసేజ్ లు పెడుతుంటారు, మీరెవరు, ఏమిటి మీ కధాకమామిషు అని. ఎంతైనా సొంత డబ్బా కాస్త కష్టం కదా! అందుకని ఎప్పుడో రేడియో స్వర్ణోత్సవాల సమయంలో నా గురు పత్నీ పుత్రిక అనగా తురగా కృష్ణమోహనరావుగారి సతీమణి తురగా జానకీ రాణి తనయ, నా రేడియో రోజుల సహోద్యోగి తురగా ఉషారమణి నా గురించి రాసిన ఈ ఆంగ్ల పరిచయ వాక్యాలు గుర్తుకు వచ్చాయి. అవే ఇవి. అయితే నా మీది అభిమానంతో ఉత్ప్రేక్షా లంకారాలు వాడింది. వాటిని మినహాయించుకుని చదువుకోమని వినతి.


(రేడియో రోజుల్లో)

Bhandaru Srinivasa Rao is the best-known reporter among those who have put in a long innings with AIR and has dedicated his life to adapting radio news to the changing communication needs across the decades,
         
He began his career as a newspaper journalist in 1970, working as sub-editor in Andhra Jyothy, a Telugu Daily News Paper, published from Vijayavada and joined AIR, Hyderabad  in 1975 where he made an indelible mark on the traditions of radio reporting.
          An Indian Information Service officer, he believes that working with All India Radio has given him much greater exposure in reporting and helped him hone his skills as a reporter for a public broadcaster. He used to present the News Reel programme twice a week and got excellent  response and recognition as  presenter of  the popular human interest news bulletin ‘JeevanaSravanthi” (జీవనస్రవంతి}
         
He considers his stint as Telugu Language specialist with Radio Moscow as the real ‘break’ in his career, when AIR sent him on an assignment to one of the most powerful broadcasting organizations of the world, in the then Soviet Union. He subsequently captured his Moscow experiences in a book entitled ‘Maarpu Choosina Kallu’ (మార్పు చూసిన కళ్ళు- ‘The Eyes that Witnessed Change”).
 After spending almost five years in Moscow , he returned to India and rejoined RNU, AIR, Hyderabad . He subsequently moved to Doordarshan where he retired on superannuation in December, 2005.
          Bhandaru Srinivasa Rao says it was a dream come true for him to work for All India Radio, it was not a mere job but a profession with passion. He has interviewed many eminent personalities including Mother Teresa. He remembers with fondness and pride all the years he spent reporting, editing, reading and broadcasting radio news. Especially the occasion when he had the unique opportunity of accompanying the then prime minister Mr. Rajiv Gandhi during his tour of flood-affected areas in Khammam district. The dynamic prime minister suddenly jumped out of the jeep and went off on an impromptu inspection of the living conditions of the tribal people in the Chintoor forest. The Prime Minister’s move caused sensation then as the area was Naxalite infested and the Prime Minister paid no heed to his own security. Srinivas Rao  reported the entire episode exclusively  to AIR. He narrated the incident in his own style under the title “అడవి బాటలో రాజీవ్ గాంధి” in a book- “Story Behind the News” (“వార్తల వెనుక కధ”), edited by eminent journalists Shri K.Ramachandra Murthy, Editorial Director, Saakshi) and Shri Katta Sekhar Reddy (Editor, Namaste Telangana).
After retirement also Bhandaru Srinivasarao continued the profession by writing weekly column (సూటిగా.....సుతిమెత్తగా....) in  telugu  daily news paper “SURYA” for the last several years besides participating in debates and discussions of various TV channels daily.
మిలియన్ థాంక్స్ ఉషా!

కింది ఫోటో: రేడియో రోజుల్లో  


‘క్రియే’టివిటీ“సర్లెండి, మీకు ఉదయం తిన్న కూరే గుర్తుండదు, ఇక మనుషుల్ని ఎక్కడ గుర్తు పడతారు’ అంటుంది మా ఆవిడ.
ఇంటిలిఫ్టులో ఒక పెద్ద మనిషి తారస పడ్డాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ బదులుగా చిరునవ్వు నవ్వి ‘ఎవరింటికండీ’ అన్నాను. ఆయన గతుక్కుమన్నట్టు అనిపించింది. తరువాత చెప్పింది మా ఆవిడ, ఆయన మా పక్క అపార్టుమెంటు ఓనరని.
ఇళ్ళల్లో సంగతి ఏమో కాని, ఆఫీసుల్లో ప్రత్యేకించి టీం వర్కు అవసరం వున్న కార్యాలయాల్లో పనిచేసేవారికి ఒకరికొకరు తెలిసివుండడం అన్నది చాలా అవసరం.
బహుశా ఈ ‘సంస్కృతి’  పెంచాలనే ఉద్దేశ్యంతో కాబోలు ‘క్రియ’ సంస్థలో సిబ్బందికి ఒక పోటీ నిర్వహించారు. గాలి ఊదిన బెలూన్లపై పనిచేసే సిబ్బంది పేర్లు రాసివుంటాయి. ఒకొక్కరూ వెళ్లి ఒక బెలూన్ తీసుకుని దానిపై పేరు రాసి వున్న సొంతదారుకు వాటిని అందచేయాలి. ఇలా సరిగ్గా చేయగలిగితే పనిచేసే వారందరూ ఒకరికొకరు తెలిసినట్టు లెక్క. సిబ్బందిలో ‘బృంద సంస్కృతి’ పెంచడానికి ఇటువంటి ‘క్రియేటివిటీ’ కార్యక్రమాలు చాలా అవసరం అనిపించింది.

   

9, మార్చి 2017, గురువారం

డిష్యుం డిష్యుం

ఆయన తన కాలంలో పెద్ద స్టంట్ హీరో. ఒంటి చేత్తో పాతికమంది రౌడీలను మట్టికరిపించే దృశ్యాలను చూస్తూ ప్రేక్షకులు వేసే ఈలలతో, చేసే కరతాళ ధ్వనులతో సినిమా హాళ్ళు మారుమోగి పోయేవి. కొన్నాళ్ళకు ఆయన రిటైర్ అయ్యాడు. కొడుకు హీరో అయ్యాడు. స్టంట్ సీన్లలో తండ్రిని మించి పోయాడు. ఒకసారి ఆ పెద్దాయన కొడుకు నటించిన చిత్రం చూడడానికి థియేటర్ కు వెళ్ళాడు. కొడుకు చేస్తున్న స్టంట్ సీన్లు ప్రేక్షకులను అదరగొడుతున్నాయి. ‘ఏం కొట్టాడురా మన హీరో ‘ అని కేకలు పెడుతున్నారు. కాసేపటి తరువాత ఆ రణగొణ ధ్వనుల మధ్యలో పక్కన కూర్చున్న భార్యతో అన్నాడు. ‘చూశావా కాంతం. ఆ రోజుల్లో రౌడీలను చితకబాదింది నేను కాదు, ఇప్పుడు మనవాడూ కాదు. అంతా మాయ. సినీ మాయ’ 

8, మార్చి 2017, బుధవారం

బొమ్మను చేసీ....ప్రాణము పోసీ....


బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని,  రేడియో వింటూ చేసే వంట లాగాఅర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై దోసిళ్ళు  అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తుఅన్నాడు బ్రహ్మలుంగారు.
'అమ్మతనం అరవై,  ఆత్మబలం ఆరుఅహంకారం మరో ఆరు. వినయం అయిదుఅణకువ ఆరుమేధస్సు ముప్పై మానసిక బలహీనతలు నలభై దోసిళ్ళు,  శారీరకబలం కూరలో లవణం మాదిరిగా తగినంత.చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో  ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.


బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం,  ఇన్ని తెలివితేటలుఅమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.
భార్య కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు  నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే,  సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావాశారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే,  ఈ బొమ్మ బతుకూ అంతే.   తెలివితేటలుబలాబలాలుమేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక   స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా  పెద్దదిక్కుఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది.  ఈ పుత్తడి  బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'   


మనసు వుండాలేకాని మనుషుల్ని ఇలా కూడా మార్చవచ్చు


బహిరంగ సభని తలపించే సందర్భం అది.
చిత్తూరు జిల్లాలో మూడువందల గడప వున్న ఆ పాత కాలువ  గ్రామానికి ఏకంగా  పదివేలమంది తరలి వచ్చారు. అంతమంది చేరిన చోట చిన్న చిన్న సంఘటనలు తప్పవు. చిన్నవి అని ఉపేక్షిస్తే అలవికానివిగా మారే ప్రమాదం పొంచి వుంటుంది. ఆ సమయంలో ఒక గంభీర స్వరం ఆ ప్రాంతంలో మారు మోగింది.
రండి, కూర్చోండి. ప్రశాంతంగా వినండి.
“నేను మీ వూరుని దత్తత తీసుకుంటున్నా.
“మీ ఊరికి జరిగే మంచి చెప్పుకుందాం”
“ ఇది ఒక ఊరన్న మాటే కానీ పిల్లలు చదువు కునేందుకు బడి లేదు.
“మీ  పిల్లలు చదువుకోవడానికి కింద కూర్చుని ఇబ్బంది పడనక్కరలేదు. .. ఆ ముందు వరుసలో కూర్చున్న రాజు గారు మీ బడి నిర్మాణం బాధ్యత తీసుకుంటారు. బడికి కావాల్సిన బల్లలూ, కుర్చీలు అన్నీ ఇస్తారు. ఇక అదిగో ఆ వారున్నారే  మంచి ఉదారులు. మీ ఊరూ కాదు, మీ ప్రాంతమూ కాదు. అయినా మీ ఊరిమొత్తానికి చక్కటి  తాగు నీటి సౌకర్యం కల్పిస్తారు. తాగే నీళ్ళు సరిగా లేకపోతే రకరకాల రోగాలు ఒంటిని చుట్టుకుంటాయి. అందుకే ఈ ఏర్పాటు. పిల్లలకి మంచి చదువు, మీకు శుద్ధమైన మంచి నీళ్ళు. ఇంకా ఏమిటి మీ సమస్యలు, మొహమాట పడకుండాచెప్పండి." 
అంతే! సర్వత్రా కాసేపు నిశ్శబ్దం. ఆ వెనువెంటనే హర్షధ్వానాలు.
అప్పటిదాకా వకుళామాత గుడి మూలంగా తమకి క్వారీ ఉపాధి పోతుందంటూ ఉద్రేక పడుతున్న గ్రామస్తులంతా ఒక్కసారిగా మారిపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. "మన పాత కాలువ స్వామికి జై" అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ఆ మాటలు చెప్పింది, ఒక రాజకీయ నాయకుడు కాదు, సర్వం త్యజించిన ఒక సన్యాసి.
పాతకాలువ స్వామీ దండాలుఅన్నాయి అక్కడి గొంతులు.
ప్రపంచానికి పరిపూర్ణానంద స్వామిగా పరిచితులయిన శ్రీ పీఠం స్వామి వారు, ఆ క్షణంలో పాతకాలువ స్వామిగా మారిపోయారు.
స్థానికులతో మమేకం కావడం అంటే ఇదే. స్థానికుల మనసులను దోచుకోవడం అంటే ఇదే!
మన రాజకీయ నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారు - ఇలా ప్రేమతో మనుషుల్ని గెలవటం?

ఎప్పుడో కాదు ఇది జరిగింది, మొన్నీ మధ్యనే. మార్చి నెల ఐదో తేదీన.


పూబోండ్లకు పూల కానుకలు

అలనాటి, అంటే ముప్పయ్యేళ్ళ నాటి మాస్కో ముచ్చట. మేము అయిదేళ్లున్న  కమ్యూనిస్ట్ రష్యాలో మహిళా దినోత్సవం వేడుకలు చూడడానికి రెండు కళ్ళు చాలవు. మొత్తం దేశం దేశం అంతా పండగ వాతావరణంతో నిండి పోతుంది. ఆడవారికి ఆ దేశంలో ప్రతి రోజూ ప్రత్యేకమైన రోజయినా ఇక మార్చి ఎనిమిదో తేదీ మరింత ప్రత్యేకం. మహిళలకు కానుకలు ఇవ్వడానికి పురుష ప్రపంచం పోటీ పడుతుంది. రష్యన్ మహిళలకు నగలూ, నాణ్యాలు కన్నా పూలు అంటే ముచ్చట ఎక్కువ. పూలంటే జడలో పెట్టుకునే పూలు కాదు. సన్న సన్న కాడలతో వున్న పూలు. మైనస్ ఫార్టీ డిగ్రీలు వుండే  ఆ చలిదేశంలో నిజానికి పూలకు పెద్ద కరువు.  ఆడవారికి కానుకగా ఇచ్చేటప్పుడు  బొకేల్లో వుండే పూల కాడలు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. సరి సంఖ్య పనికి రాదు. అంటే, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది ఇలా అన్నమాట. తెలిసినా తెలియకున్నా, ముఖ పరిచయం కూడా లేకున్నా ఈ పూల గుత్తులను ఆరోజు బహుకరిస్తే వారు చాలా ఆనందంగా స్వీకరిస్తారు. వెలిగిపోతున్న మొహంతో కృతజ్ఞతలు చెబుతారు. ముందే చెప్పినట్టు ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. 
  

7, మార్చి 2017, మంగళవారం

666666


ఆరు లక్షల అరవై ఆరువేల ఆరువందల అరవై ఆరు.

ఈరోజు వరకు నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య. 

అందరికీ అక్షరాంజలి ! 

ఉబెర్ డ్రైవర్ నేర్పిన ఓ కొత్త పాఠం


పట్టుమని పాతికేళ్ళు వున్నట్టు లేవు.  చేసేది డ్రైవర్ పని. ఇంటర్ చదివాడు. మునిసిపల్ కార్పోరేషన్ లో తాత్కాలిక ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు. అదీ ఒదిలేశాడు. జీతం చాలక కాదు. ఎక్కువై. వినడానికే వింత అనిపించేలా వున్నాయి అతడి మాటలు. నెలకు ఆరువేలు ఇచ్చేవారు. అదేమంత పెద్ద జీతం కాదు, కానీ అందుకు తగ్గ పని వుండేది కాదు, రెండుగంటలు పనిచేయడం, ఆరుగంటలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం. ఆరువేలు తీసుకుని రోజుకు రెండు గంటలే పనిచేయడం అతడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒదిలేసి ఉబెర్ డ్రైవర్ పనిలో చేరాడు. పేరు మోడరన్  గా ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ  ఆధ్యాత్మిక భావాలు.


(శ్రీ ప్రభాత్ కుమార్)


తీరిక దొరికినప్పుడల్లా ఇందిరా పార్కు దగ్గర రామకృష్ణ మఠంలో గడుపుతాడు. రామకృష్ణ ప్రభ కు ఏడాది చందా కట్టాడు. కానీ రెండు నెలలు గడవక ముందే ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ పత్రిక చదవకపోతే అతడికి తోచదు. అందుకని మళ్ళీ వెళ్లి కొత్త చిరునామాతో మరో ఏడాది చందా కట్టాడు. నిజానికి ఆ పత్రిక తిరగేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ అతడు తిరగేయడు. చదువుతాడు. అదీ మనసుపెట్టి. ఆ మాసపత్రికను నెలంతా చదువుతూనే ఉంటాడు. చదివినదే అయినా మరోసారి, మరోసారి, అలా చదువుతూనే ఉంటాడు.
బిజినెస్ మేనేజ్ మెంట్ లాగా ఫ్యామిలీ మేనేజ్ మెంట్ కోర్సులు పెట్టాలంటాడు. చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే అలాంటి చదువులు అవసరమంటాడు ప్రభాత్ కుమార్.
చిన్నవాడయినా మంచి మాట చెప్పాడు.

ఉబెర్ డ్రైవర్ పుణ్యమా అని ఈరోజు ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను.       

5, మార్చి 2017, ఆదివారం

హృదయ వైశాల్యం


కొన్నేళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా మనుమరాళ్ళ క్లాసు టీచరు మిసెస్ సూజన్ విల్సన్, ఆమె  కుటుంబం హాలీడే కోసం ఇండియా వచ్చారు.  ‘పనిలోపనిగా హైదరాబాదు కూడా చూసిరండి’ అని మా వాళ్ళు మా అడ్రసు ఇవ్వడంతో మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వుండడం వసతిగా వుండదేమో అన్న సందేహంతో మేము వారికోసం రెండు హోటల్ గదులు బుక్ చేసాము. అయినా వాళ్ళు మాతో పాటు మా ఇంట్లోనే మూడు రోజులు వున్నారు. పిజ్జాలు అవీ ఆర్డరు చేసినా వాళ్ళు వేలేసి ముట్టుకోలేదు. కూరలు, పచ్చళ్ళతో మా ఆవిడ పెట్టిన భోజనమే తిన్నారు. ఆటోలలో ఊరంతా తిరిగారు. అమెరికాలో తమ స్నేహితులకి కానుకలుగా ఇవ్వడానికి చార్మినార్ దగ్గర గాజులు కొనుక్కుని వెళ్ళారు. వున్న మూడు రోజులు  మాతో కలిసే వున్నారు కానీ కలిసి ఉంటూ విడిగా ఉండడానికి ప్రయత్నించ లేదు.

అదే మేము అమెరికా వెళ్లినప్పుడు ఇడ్లీ, దోసె దొరికే హోటళ్ళ మీద పడ్డామే కానీ, వాళ్ళ ఆహార విహారాల ముచ్చటే పట్టించుకోలేదు.

ఇతరులతో కలిసిపోయే తత్వం, అంతటి విశాల హృదయం  మాలో లేదని ఎందుకో ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తోంది.