9, మార్చి 2017, గురువారం

డిష్యుం డిష్యుం

ఆయన తన కాలంలో పెద్ద స్టంట్ హీరో. ఒంటి చేత్తో పాతికమంది రౌడీలను మట్టికరిపించే దృశ్యాలను చూస్తూ ప్రేక్షకులు వేసే ఈలలతో, చేసే కరతాళ ధ్వనులతో సినిమా హాళ్ళు మారుమోగి పోయేవి. కొన్నాళ్ళకు ఆయన రిటైర్ అయ్యాడు. కొడుకు హీరో అయ్యాడు. స్టంట్ సీన్లలో తండ్రిని మించి పోయాడు. ఒకసారి ఆ పెద్దాయన కొడుకు నటించిన చిత్రం చూడడానికి థియేటర్ కు వెళ్ళాడు. కొడుకు చేస్తున్న స్టంట్ సీన్లు ప్రేక్షకులను అదరగొడుతున్నాయి. ‘ఏం కొట్టాడురా మన హీరో ‘ అని కేకలు పెడుతున్నారు. కాసేపటి తరువాత ఆ రణగొణ ధ్వనుల మధ్యలో పక్కన కూర్చున్న భార్యతో అన్నాడు. ‘చూశావా కాంతం. ఆ రోజుల్లో రౌడీలను చితకబాదింది నేను కాదు, ఇప్పుడు మనవాడూ కాదు. అంతా మాయ. సినీ మాయ’