29, మార్చి 2017, బుధవారం

కేసీఆర్ సుభాషితం


“ఇవ్వాళ  ఆంధ్రజ్యోతి చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు పండగ రోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“యెంత లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక  రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పడు సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.

ఇక ఎవరయినా చెప్పేది ఏముంటుంది?       

3 వ్యాఖ్యలు:

Jai Gottimukkala చెప్పారు...

మీరు ఉటంకించిన వ్యక్తులు గతంలో కెసిఆర్ గారిని ద్వేషించారు, దానివలన ఆయనకు ఎటువంటి నష్టమూ లేదు. ఇప్పుడు వీళ్ళు మెచ్చుకున్నా ఒరిగేది ఏమీ లేదు.

పదవులలో రాగానే మారొద్దన్న సలహా మంత్రులకే కాదు, కెసిఆర్ గారికీ వర్తిస్తుంది. పరాయి వారి మెప్పుకోలు కోసం ఉద్యమ స్ఫూర్తిని కోల్పోరాదు & తెలంగాణా ఆకాంక్షలను మరువరాదు.

శ్యామలీయం చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

క్షమించాలి. సాధారణంగా ఇక్కడ వ్యాఖ్యలు చేయను. కాని, నా నియమానికి విరుధ్దంగా ఒక్కముక్క చెప్పవలసి వస్తున్నది. ఏదో ఒక చర్చను లేవదీయాలన్న ఉద్దేశంతో‌ ఈమాట వ్రాయటం లేదు.

కేసీఆర్ గారు చెడ్డమాటలు సభాముఖంగా మాట్లాడినది నిజం. ఇప్పుడు అవన్నీ ఉద్యమపువేడిలో అన్నమాటలు కాబట్టి అవమానించి పలికిన నేను మరచిపోతాను - అవమానితులైన మీరూ మరవండి అంటే, ఆ దుర్వాక్యాలు మరువటం సాధ్యమయ్యే పని కాదు. ఆయనకు మరొక అవసరం వస్తే మరలా అలాగే పూర్వంలాగే దుర్భాషలు ఆడరన్న నమ్మకం‌ లేదు అలాగే అవసరమైన పక్షంలో అమితమైన ఆత్మీయతను ఒలకబోస్తూ మాట్లాడినా ఆశ్చర్యమూ లేదు. ఆయనకు అది ఒక రాజకీయక్రీడావిన్యాసం మాత్రమే.

రాజకీయులు నిస్సిగ్గుగా తిట్టనూ‌గలరు మెచ్చనూ‌గలరు. అలాగే ఎదుటివారికి సుద్దులు చెప్పటం అందరిలాగే రాజకీయులూ చేస్తారు కాని రాజకీయుల మాటలకు మన మీడియావీరులూ అమాయకజనమూ‌ కొంచెం హెచ్చు విలువను ఆపాదిస్తూ ఉంటారు. ఆ సుద్దులవలన వారిని కొత్తకొత్తగా అర్థం చేసుకోవటం మన అమాయకత్వమే కాని తదన్యం ఎప్పుడూ కాదు.

తిట్టిపోసినవారిని వదిలి తిట్లుతిన్నవారిని ద్వేషించారనటం చిత్రం. నిష్కారణంగా ఎందుకు ఎవరు మాత్రం ద్వేషిస్తారు? ఈక్రీడావినోదం ఆయనకు ఏమన్నా ఒరిగేదే కాని తరిగేది ఏమీ‌ ఉండదంటే - కాలానుగుణంగా ఏది జరగవలసి ఉందో అది జరుగుతుంది - అప్పుడే దాని విషయం మనకు తెలిసి వస్తుంది.

ఆకాంక్షల విషయానికి వస్తే అవి అందరికీ‌ ఉంటాయి. అవి నెరవేరటానికీ విఫలం కావటానికీ‌ సవాలక్ష కారణాలుంటాయి.