3, మార్చి 2017, శుక్రవారం

రాజకీయ నాయకులు, అధికారులు

‘నిశ్శబ్దం చాలా భయంకరంగా వుంటుంది’ అనే డైలాగు వుంది ఓ సినిమాలో.
ఒక్కోసారి నిశ్శబ్దం దిమ్మ అదరగొడుతుంది.
లెఫ్ట్ నెంట్ జనరల్ నిరంజన్ మాలిక్ అనే రిటైర్డ్ సైనికాధికారి చెప్పిన విషయం ఇది.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో జవహర్  లాల్   నెహ్రూ భారత సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే విషయంలో సీనియర్ సైనికాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో  నెహ్రూ చేసిన ప్రతిపాదన అధికారులను నివ్వెర పరచింది. ‘ఈ పదవికి భారత సైన్యంలో తగినవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కొంతకాలం పాటు ఎవరయినా  అనుభవం కలిగిన బ్రిటిష్ అధికారితోనే వ్యవహారాలు నడిపించాలనేది నెహ్రూ ఉద్దేశ్యం. ఆ పదవికి తగిన అనుభవం, సమర్ధత వున్న భారతీయులు లేరని తాను అనుకుంటున్నానని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు. సాక్షాత్తు నెహ్రూనే  అలా అంటుంటే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా తల ఊపారు. ఇంతలో నాథూ సింగ్ రాథోర్ అనే సీనియర్ అధికారి లేచి నిలబడి మాట్లాడడానికి అనుమతి కోరాడు. అలా ధైర్యంగా ఒక ఆధికారి చొరవ  తీసుకుని అడగడంతో నివ్వెర పోవడం నెహ్రూ వంతయింది. అయినా తేరుకునిచెప్పదలచుకున్నది సూటిగా, భయపడకుండా చెప్పమని ప్రోత్సహించాడు. అప్పుడు రాథోర్ ఇలా అన్నాడు.
‘సర్! దేశాన్ని పాలించే సమర్ధత కలిగిన నాయకుడు కూడా మనకు లేడనుకుందాం. అలా అని,  బ్రిటన్  నుంచి మంచి అనుభవశాలిని మన ప్రధానమంత్రిగా తెచ్చుకోవడం సబబుగా ఉంటుందా?’
రాథోర్ అలా అడగడంతో అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. నెహ్రూకు కూడా అతడు అడిగిన దాంట్లో విషయం బోధ పడింది. అయన వెంటనే  రాథోర్ వైపు తిరిగి ‘ఈ పదవి నీకే ఇస్తానునువ్వు నిభాయించుకునిరాగలవా?’ అని అడిగారు.
రాథోర్ తొట్రు పడకుండా సమాధానం చెప్పాడు.  ‘సర్! మన సైన్యంలో అత్యంత సమర్థుడు అయిన ఓ అధికారి వున్నారు.ఆయన  నా సీనియర్. జనరల్ కరియప్ప. మా అందరిలోకి చాలా చేవకలిగినవాడు’
ఆ విధంగా జనరల్ కరియప్ప భారత దేశపు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు కాగలిగారని నిరంజన్ మాలిక్ కధనం.