3, మార్చి 2017, శుక్రవారం

ఆంధ్రరాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు
దాదాపు 64 సంవత్సరాలక్రితం  వెనుకటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి కర్నూలు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడితే, 1956 లో అవతరించిన  మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి  తెలంగాణా విడిపోవడంతో 2014 జూన్ లో రాజధాని అంటూ లేని కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్  ఊపిరి పోసుకుంది. నాటి ఆంధ్ర రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికపై ఏర్పాటుచేసిన భవనాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన శాశ్విత భవనంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు నుంచి జరగబోతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే శాసన వ్యవస్థను అక్కడికి తరలించడం ఒక శుభ పరిణామం. శాసన నిర్మాతలకు ముందస్తు  శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా కొన్ని గత కాలపు ముచ్చట్లు.
1953 అక్టోబరు ఒకటవతేదీన అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు అసెంబ్లీకి ఆంద్ర ప్రాంతం నుంచి ఎన్నికయిన 140 సభ్యులతో ఆంధ్ర రాష్ట్రం శాసన సభను ఏర్పాటు చేసారు.118 నియోజక వర్గాలనుంచి ఎన్నికయిన సభ్యులు వాళ్ళు. ఇప్పటి కాలం వారికి తెలియని మరో విషయం ఏమిటంటే  ఆ రోజుల్లో ద్విసభ్య నియోజక వర్గాలు ఉండేవి. మొత్తం  118 నియోజక వర్గాల్లో  22 ద్విసభ్య నియోజకవర్గాలు. మళ్ళీ వీటిలో  19 షెడ్యూల్డ్ కులాలకు కేటాయించగా మిగిలిన మూడు ద్విసభ్య నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసారు. 1953  నవంబరు  23 వతేదీన ఆంధ్రా అసెంబ్లీ మొదటి సమావేశం జరిగింది. ఎం.వీ.ఎల్. నరసింహారావు ప్రోటెం స్పీకర్ గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో అదే రోజున నల్లపాటి  వెంకటరామయ్యను స్పీకర్ గా, పసల సూర్యచంద్ర రావును డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే ఈ శాసన సభ పూర్తికాలం గడవకముందే  1954 నవంబరు  15 తేదీన రద్దయింది.
తరువాత  హైదరాబాదు స్టేట్  విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  నిజాం నవాబులు నిర్మించిన అపూర్వ సౌధాలు విడిదిగా మారాయి. తదనంతర కాలంలో పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా నూతన అసెంబ్లీ భవనం నిర్మించాలనే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తలంపు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాములో ఒక రూపానికి వచ్చింది. అన్ని హంగులతో నిర్మించిన  ఆ కొత్త భవనానికి నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు స్పీకర్ గా వున్నది జీ. నారాయణ రావు. కాంగ్రెస్ వ్యతిరేక విధానంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ హయాములో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధానమంత్రిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం ఒక విశేషం. రాజీవ్ గాంధి ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తున్నంత సేపు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయన పక్కనే గౌరవపురస్సరంగా నిలబడి తెలుగువారి అతిధి మర్యాదలకు కొత్త నిర్వచనం  ఇచ్చారు.


ఇప్పుడు వెలగపూడిలో నిర్మించిన అధునాతన అసెంబ్లీ భవనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు  ప్రారంభోత్సవం చేసారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఇది తొలి సోపానంగా భావించవచ్చు.
ఒక చిన్న పోలిక ఏమిటంటే నాడు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నల్లపాటి వెంకటరామయ్య, ఈనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందినవారు కావడం.
వెలగపూడిలో అసెంబ్లీ భవనం హంగులను గురించి మీడియాలో చక్కని కధనాలు వెలువడుతున్నాయి.
నూతన భవనం  ఎంతో  అందంగా అన్ని హంగులతో  వుంది సరే! మరి  అందులో కార్యకలాపాలు సొగసుగా జరగాలి కదా!
ఈ విషయంలో కూడా శాసనకర్తలు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది!        

1 వ్యాఖ్య:

అన్యగామి చెప్పారు...

కీలకమైన వాక్యం - "శాసనకర్తలు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది!"