31, జులై 2015, శుక్రవారం

'ఊ' అంటే వస్తుందా?




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎక్స్ ప్రెస్ టీవీలో గురువారం  సాయంత్రం  చర్చ జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రతినిధి చెబుతున్నారు. 'పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదన్నది ఆయన ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ పడుతున్నారనీ, ఆయనా, కొందరు  మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద  చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఈ చర్చ తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు సాయంత్రం  కాగానే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,  ఆ కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
'బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి వుంటే వస్తుందా?'
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'


(30-07-2015)       

30, జులై 2015, గురువారం

ఉగ్రవాదులకు మతం లేదు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 02-08-2015, SUNDAY)




బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తన కర్తవ్య పాలనలో మునిగి తేలింది. స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళలో ఏనాడు కనీ వినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఒక కేసుని తెల్లవారుఝాము వరకు  విచారించి,  తన తుది తీర్పుని వెలువరించింది. అదీ ఒక ఉగ్రవాదికి సంబంధించిన కేసు కావడం ఓ విశేషం అయితే, ఆ ముద్దాయికి  కింది కోర్టు విధించిన మరణ దండనను ఖరారు చేయడం అన్నది మరో అపూర్వ సంఘటన. కేవలం సినిమాల్లో, కాల్పనిక సాహిత్యంలో మాత్రం కావవచ్చే ఇటువంటి సన్నివేశం ఆ రాత్రి చోటు చేసుకుందన్న సమాచారం   దేశ ప్రజలకు గురువారం ఉదయం కానీ తెలియరాలేదు.
సుప్రీం కోర్టు అసాధారణ రీతిలో తీసుకున్న ఈ చర్యకు కారణ భూతమైన కేసు, దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఏళ్లతరబడి సాగిన ఈ కేసు విచారణ నత్త నడకకు పర్యాయపదంగా మారడం, తిరిగి అదే కేసు చివరి అంకంలో లేడి పరుగు అందుకోవడం ఇందుకు ఉదాహరణ.
ఇరవై రెండేళ్ళ క్రితం  దేశాన్ని కుదిపేసిన మారణ హోమానికి సూత్రధారులు అయిన వ్యక్తులు ఈ కేసులో ముద్దాయిలు. నాటి నరమేధం తరువాత దేశంలో ఈ మాదిరి ఉగ్రవాద దాడులు పదుల సంఖ్యలో జరిగాయి. మరెంతో మంది వాటికి బలయ్యారు. 1993 లో ముంబై లో విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదులు హఠాత్తుగా తెగబడి ఒకే ఒక్క రోజున,  కొన్ని గంటల వ్యవధిలో నగరంలో జన సంచారం అధికంగా వుండే ప్రాంతాలలో, కార్యాలయాల్లో బాంబులు అమర్చి  వరుస పేలుళ్లు జరిపి 257 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. వందల సంఖ్యలో అమాయకులు క్షత గాత్రులై, కళ్ళూ, కాళ్ళూ  పోగొట్టుకుని ఇన్నేళ్ళుగా జీవచ్చవాల్లా జీవనం సాగిస్తున్నారు. ఈ స్థాయిలో నరమేధానికి పధకం వేసిన వ్యక్తులు మాత్రం  హాయిగా విదేశాల్లో కాలం గడుపుతున్నారు. పైపెచ్చు మరిన్ని దాడులకు పధక రచనలు చేస్తున్నారు. పట్టుబడిన వారిలో పదిమందికి మరణ శిక్ష పడింది. వారిలో తొమ్మిది మందికి, పై కోర్టులో ఊరట లభించింది. ఉరి శిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. ఇక ఒకే ఒక ముద్దాయి అయిన యాకూబ్ మెమన్ మాత్రం మరణ దండన తప్పించుకోలేకపోయాడు. అయితే, పలు మానవ హక్కుల సంఘాలు, సమాజాల  మద్దతుతో,  భారత శిక్షాస్మృతిలో వున్న  అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ దశాబ్ద కాలానికి పైగా న్యాయపోరాటం చేస్తూనే వచ్చాడు. ఈ పోరాటంలోని చివరి మలుపులే ముందు పేర్కొన్న అసాధారణ సన్నివేశాలకు వేదికగా మారాయి.
ఈ కేసులో ప్రధాన ముద్దాయి టైగర్ మెమన్ సోదరుడే ఈ యాకూబ్ మెమన్. తొలుదొల్త, టాడా కోర్టు ఈ కేసును విచారించింది. అనేక వందలమంది ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారణం అయ్యాడన్న హేతువు చూపి న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది. అతడు అంతటి కఠిన శిక్షకు అర్హుడా కాదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే, వరుస బాంబు పేలుళ్ళతో సుమారు  మూడువందలమంది ఉసురు తీసిన ముష్కరులకు సాయపడ్డారన్న అభియోగాన్ని సుదీర్ఘ కాలం విచారించిన పిమ్మటే, టాడా కోర్టు అతడికి మరణ దండన విధించింది. హైకోర్టు ఆ తీర్పును ఖరారు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు, ఈ  కేసు  విచారణకు వచ్చినప్పుడు ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, సాంకేతిక కారణం చూపి   భిన్న స్వరాలు వినిపించడంతో, కేసు భారత ప్రధాన న్యాయమూర్తి చెంతకు చేరింది. దానితో సహజ న్యాయ సూత్రాలకు లోబడి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడం,  ఆ ముగ్గురు న్యాయమూర్తులు  వెనువెంటనే విచారణ  జరిపి అతడికి  ఉరిశిక్షను ఖాయం చేయడం,  క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి సైతం తిరస్కరించడం జరిగి పోయాయి. మరునాడు గురువారం ఉదయం యాకూబ్ మెమన్ ను ఉరి తీయడానికి నాగపూరు కేంద్ర కారాగారంలో  నిబంధనల ప్రకారం ఓ  పక్క ఏర్పాట్లు జరుగుతుంటే, మరో పక్క దేశ రాజధాని ఢిల్లీలో ఈ కేసు అర్ధరాత్రి వేళ అనేక కీలక మలుపులు తిరిగింది. క్షమాభిక్ష అభ్యర్ధనను తిరస్కరిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేసరికే బుధవారం చాలా పొద్దుపోయింది. దరిమిలా, యాకూబ్ న్యాయవాదులు  సుప్రీం తలుపు తట్టారు. నిబంధనల ప్రకారం ఉరి శిక్షను రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దానితో, అసాధారణ రీతిలో రాత్రికి రాత్రే సుప్రీం ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. ఉభయ పక్షాల వాదనలు గురువారం తెల్లవారుఝాము  వరకు సాగాయి. ఎట్టకేలకు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో యాకూబ్ ఉరి శిక్షను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేయడంతో, ముద్దాయి తరపు  న్యాయవాదులు కడకంటా చేసిన న్యాయపోరాటం బూడిదలో పోసిన పన్నీరు చందం అయింది. కోర్టు నిర్ణయానికి అనుగుణ్యంగా గురువారం ఉదయం ఏడుగంటల లోపే నాగపూరు కేంద్ర కారాగారంలో యాకూబ్ మెమన్ ను ఉరితీసారు. 1962లో ముంబై లో జన్మించి,1986 లో ఎంకాం పట్టా పుచ్చుకునిసీఏ పూర్తి చేసి  చార్టర్డ్  అక్కౌంటెంట్ గా ప్రాక్టీసు ప్రారంభించిన ఒక యువకుడి జీవితం, ఉగ్రవాదులతో సాన్నిహిత్యం పుణ్యమా అని యాభయ్ మూడేళ్ళ వయస్సులో, ఆ విధంగా  అర్ధాంతరంగా ముగిసిపోయింది. అందులో సింహభాగం జైలు జీవితంలోనే గడిచిపోయింది. ఈ యువకుడి పేరు యాకూబ్ మెమన్ అనే ముస్లిం నామం కావడం కేవలం యాదృచ్చికమే. ముస్లిం మతానికి, ఉగ్రవాదానికీ ఎటువంటి సంబంధం లేదు. అదే నిజమయితే అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాదుల మారణ హోమానికి వందల సంఖ్యలో ముస్లింలు మరణించే అవకాశమే వుండదు. ఉగ్రవాదులకు మతమౌడ్యం తప్పిస్తే  వారికి  మతం అంటూ లేదు. తాము నమ్మిన మార్గంలో, ఆ మార్గాన్ని  నమ్మని  వారిని తెగనరుకుంటూ  పోవడం ఒక్కటే వారికి తెలిసింది.  వారి చేతిలో పేలే తుపాకీ తూటాలకి ఎదుటి వ్యక్తి ఏ మతంవాడు  అన్న సంగతే పట్టదు. అందుకే మతం పేరుతొ ఉగ్రవాదులు సాగించే దుశ్చర్యలకి మతం రంగు పులమడం తగని పని. నిజానికి దేశాన్ని ప్రేమించడానికి  మతంతో నిమిత్తం లేదు. అలాగే దేశాన్ని ద్వేషించడానికి  మతం అక్కరలేదు.               
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కిందటి బుధవారం నాడు కన్నుమూసిన ఓ మహానీయుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.
ఆయన ఆకస్మిక మరణ వార్త విని యావత్ భారతం కులమతాలతో నిమిత్తం లేకుండా ఆ మహనీయుడ్ని తలచుకుంటూ భోరున విలపించింది. ఆ అకళంక దేశభక్తుడి భౌతిక కాయాన్ని   గురువారం నాడే, అంటే యాకూబ్ మెమన్ ని ఉరితీసిన కొన్ని గంటల తరువాత  తమిళనాడులోని రామేశ్వరంలో సమస్త అధికార లాంఛనాలతో ఖననం చేశారు. పసిపిల్లలనుంచి వయోవృద్దులవరకు, నిరక్షరాస్యుల నుంచి మేధావులవరకు కంట తడిపెట్టని మనిషంటూ లేడు.    
ఏపీజే అబ్దుల్ కలాం అన్న పేరు వున్నంత మాత్రాన ఆయనకు  మతాన్ని ఆపాదించలేము. భారత దేశాన్ని అనుక్షణం ఆరాధించే,  దేశం బాగుండాలని  అహరహం తపించే గొప్ప దేశ భక్తుల వరుసలో ఆయన ప్రధముడు. పేరు చూసి ఆయన్ని ముసల్మాన్ అని అనుకుంటే అంతకంటే మూర్కత్వం మరోటి వుండదు. అబ్దుల్ కలాం ముస్లిం కావచ్చు కాని ఆయన సర్వోత్తమ భారతీయుడు.
మెమెన్ యాకూబ్ కూడా అదే మతానికి చెందిన వాడు. కాని, దేశ ద్రోహులతో చేతులు కలిపిన వాడు. బాంబులు పేల్చి, అమాయకుల ప్రాణాలు హరిస్తూ, అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తూ భారత దేశ సార్వ భౌమత్వానికీ, సమగ్రతకూ ముప్పు తెస్తున్న విదేశీ ముష్కరులకు ఏదో ఒక రూపంలో సహాయ హస్తం అందించిన వ్యక్తి. యాకూబ్ పేరును బట్టి, జన్మను బట్టి ముస్లిం కావచ్చు కానీ, ఆయన సామాన్య జనం దృష్టిలో, సర్వోన్నతన్యాయస్థానం దృష్టిలో కరడు గట్టిన ఉగ్రవాది.
చనిపోయిన ఇద్దరూ ఒకే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారిలో ఒకరు నిష్కళంక దేశ భక్తులు. దేశ రక్షణకు కవచంలా ఉపయోగపడే అనుక్షిపణుల రూపశిల్పి.  మరొకరు దేశాన్ని నిర్వీర్యం చేయాలనే దుష్ట శక్తులతో చేతులు కలిపిన దేశ ద్రోహి. భారత శిక్షా స్మృతి ప్రకారం విచారణ జరిగి వుండవచ్చు. కానీ ఇది మనదేశంపై పొరుగు దేశం జరిపిన ప్రచ్చన్న యుద్ధంగానే పరిగణించాలి. కేసు దర్యాప్తులో అధికారులకు యాకూబ్ మెమన్ సహకరించాడనే కారణంతో శిక్షను తగ్గించినంత మాత్రాన, ముంబై పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాల గర్భశోకం తీరదు. 'ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం' అనే నాయకుల ఉద్ఘాటనలకు అర్ధం  వుండదు. 'వెయ్యిమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదు' అనే సినిమా డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించవచ్చునేమో  కానీ, దేశం మీద ఇలా దొంగ దెబ్బలు తీసేవారి పట్ల ఏమాత్రం వర్తించవు.   
ఈ తేడా ఒక్కటే భారతీయుల మనస్సుల్లో వారిద్దరి స్థానాలను వేరు చేసింది. అబ్దుల్ కలాం చనిపోతే కుటుంబంలో ఒక ఆత్మీయుడు చనిపోయినట్టుగా దేశ ప్రజలు దుఖపడ్డారు. పరలోకంలో ఆయనకు సద్గతులు లభించాలని అన్ని మతాలవాళ్ళు వారి వారి దేవతలను వేడుకున్నారు. అదే యాకూబ్ మరణం పట్ల ప్రజల స్పందన మరో రకంగా వుంది.
ఓ పక్క మతాన్ని ప్రేమిస్తూ, మత విశ్వాసాలకు కట్టుబడి జీవనం సాగిస్తూ  అబ్దుల్ కలాం తన జీవితాన్ని దేశ సౌభాగ్యం కోసం పణంగా పెట్టి పనిచేశారు. ఒక శాస్త్రవేత్తగా ఆయన తన మేధస్సును యావత్తు,  భారత దేశాన్ని రక్షణ పరంగా పటిష్టం చేయడానికి ఉపయోగించారు. 'గొప్ప కలలు కనండి, వాటిని నిజం చేసుకుని దేశాన్ని మరింత గొప్ప దేశం చేయండి'  అంటూ అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశంతో లక్షలాదిమంది భారత యువజనులు స్పూర్తి పొంది  ఉత్తెజితులయ్యారు.                               
నదుల్లో పారే నీటికి కులం లేదు.ఒంట్లో పారే నెత్తురుకు మతం లేదు. జనం పీల్చే గాలికి కులం లేదు, మతం లేదు.
గురువారం నాడు, రామేశ్వరంలో  నేలతల్లి ఒడిలో ఒదిగి దీర్ఘ నిద్రలో మునిగిన అబ్దుల్ కలాం చనిపోయి ప్రజల మనస్సుల్లో జీవిస్తున్న మహా మనీషి. కుల మతాల చట్రంలో చిక్కని మహనీయుడు.
అదే గురువారం నాడు నాగపూరు జైల్లో  ఉరితీతకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న యాకూబ్,  దేశ భద్రతకు ముప్పుగా తయారయిన విదేశీ ఉగ్రవాదులకు సహకరించిన స్వదేశీ ఉగ్రవాది. ఆయన్ని ముస్లిం అనడం తప్పు. అలా ఎవరయినా అంటే, భారత దేశాన్ని ఇతర మతాలవారితో సమానంగా ప్రేమిస్తున్న ముస్లిం  మతస్తులను ఘోరంగా  అవమానించడమే అవుతుంది.
అందుకే వీరిద్దరిలో ఒకరు దేశ ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానం సంపాదించుకుంటే, మరొకరు వారికి భౌతికంగా, మానసికంగా కూడా దూరం అయ్యారు.
ఒకరు అజరామరమైన కీర్తిని మూటగట్టుకుని పరలోకాలకు తరలిపోయారు.  మరొకరు జన్మజన్మలకూ జనాలు మరచిపోలేని అపకీర్తిని వెంటబెట్టుకుని వేరే లోకానికి వెళ్ళిపోయారు.  
ఒకరి కోసం దేశం మొత్తం ఒక్కటై కన్నీరు మున్నీరు అవుతుంటే, మరొకరికోసం రెండు కన్నీటి బొట్లు రాల్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు.
రచయిత ఈ మయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner 

కట్టుటా? పడగొట్టుటా? - భండారు శ్రీనివాసరావు


(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 30-07-2015, THURSDAY)

కీర్తిశేషులు ఎన్టీ రామారావు కొత్తగా తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీ పెట్టి, పెట్టి తొమ్మిది నెలలు తిరక్కుండానే అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాల్లో ఒక కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుకున్నారు. అలాగే తన తొలివిడత పాలనలో కొత్త అడుగులు వేస్తూ పాత సంస్థలను, పురాతన వ్యవస్థలను పెక్కింటిని, కాలం చెల్లినవిగా పరిగణించి వాటిని రద్దు చేస్తూ వరుస నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తమది  'రద్దుల ప్రభుత్వం' అనే అపఖ్యాతిని కూడా కొంత మూటగట్టుకున్నారు.     
సాధారణంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయినప్పుడు, కొత్త పాలకులు పరిపాలనలో తమదయిన శైలి కనబరచడానికి, విధానాలలో తమదయిన సొంత ముద్ర కనిపించేలా చేయడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయడం అసాధారణమేమీ కాదు. అయితే తాము తీసుకునే నిర్ణయాలు, కొన్ని  సందర్భాలలో వివాదాలకు కేంద్ర బిందువులుగా మారే అవకాశం వుంటుందన్న వాస్తవాన్ని వాళ్లు మరచిపోతుంటారు.
అయితే, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా  ప్రభుత్వాలు మారే అవకాశం వున్నప్పుడు, ప్రతి కొత్త ప్రభుత్వం తనకు తోచిన రీతిలో మార్పులు చేస్తూ పోతుంటే చివరికి మార్పే శాశ్వితం అయ్యే ప్రమాదం వుంటుంది.
పూర్వం సోవియట్  యూనియన్ అనే పేరుతొ దిగద్దంతాలకు వెలుగులు విరజిమ్మిన రష్యాలో ఏలికలు మారినప్పుడల్లా మార్పులు చోటుచేసుకోవడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు స్టాలిన్ విగ్రహాలు లేని వూరంటూ ఆ దేశంలో వుండేది కాదు. కానీ ఆయన శకం అంతరించి కృశ్చేవ్ పాలన మొదలు కాగానే ఒక్కమారుగా స్టాలిన్ బొమ్మలన్నీ మంత్రం వేసినట్టు మాయం అయిపోయాయి. రెండో ప్రపచ యుద్ధ సమయంలో స్టాలిన్ గ్రాడ్ అని పేరు మార్చుకున్న పట్టణం కాస్తా కృశ్చేవ్ కాలంలో మళ్ళీ పాత పేరు 'ఓల్గా గ్రాడ్' కు మారిపోయింది. అల్లాగే లెనిన్ గ్రాడ్ అని పేరు మారిన సెంట్ పీటర్స్ బర్గ్ తదనంతర కాలంలో తిరిగి పూర్వపు పేరుతోనే కొనసాగుతోంది. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల పేర్లే మారిపోయాయి. ఉదాహరణకు ఒకప్పటి రొడీషియా ఇప్పుడు జాంబియా అయిపొయింది.
మన దేశంలో కూడా ఇటువంటి పేర్ల మార్పిడి కొత్తేమీ కాదు. బొంబాయి ముంబైగా, మద్రాసు చెన్నైగా, కలకత్తా కోల్ కతాగా మారాయి. ఇక మైసూరు రాష్ట్రం ఏకంగా  కర్ణాటకగా పేరు మార్చుకుంది. అలాగే ఒరిస్సా ఒడిశా అయింది. ఆంధ్ర, తెలంగాణాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా విలీనం అయి ఇటీవలే మళ్ళీ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు పుష్కరాల పుణ్యమా అని రాజమండ్రి పట్టణం  రాజమహేంద్రవరంగా మారుతోంది. ఏలూరు, నెల్లూరు పేర్లను కూడా హేలాపురి, సింహపురి గా మార్చాలనే డిమాండ్లు వూపందుకుంటున్నాయి.                
సంస్కృతీ పరిరక్షణలో భాగంగా మార్పులు జరిగితే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. మార్పుకోసమే  మార్పు చేస్తున్నాం అనే వాదన చేస్తేనే అడ్డు చెప్పాల్సిన పరిస్తితి వస్తుంది.
పోతే, పేర్ల మార్పిడి ఒక ఎత్తు. పాత ప్రభుత్వ పధకాలకు, పాత వూర్లకు కొత్త పేర్లు పెట్టడం వల్ల ప్రజాధనం కొంత వృధా కావడం తప్పిస్తే వేరే ఇబ్బంది ఏమీ వుండదు. ఇలాటి మార్పులను కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు.
ఈ సుదీర్ఘ నేపధ్య వివరణకు దోహదం చేసిన అంశం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ, తన పాలనలో, పధకాలలో, నిర్ణయాలలో  ఏదో ఒకరకమైన కొత్తదనం కొట్టవచ్చినట్టు కనబడాలనే ఆసక్తి కనబరచడం రహస్యమేమీ కాదు. సచివాలయం తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఎన్టీయార్ స్టేడియం వున్నచోట సాంస్కృతిక భవన సముదాయాల నిర్మాణం మొదలయిన సరికొత్త ప్రతిపాదనలతో ఎప్పటికప్పుడు  చర్చలకు తెర లేపుతూ వస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను కూలగొట్టి, సరికొత్త భవనాలను నిర్మించాలనే నిర్ణయాన్ని ఆఘమేఘాల మీద తీసుకున్నారు. పాత భవనం శిధిలావస్థకు చేరుకుందనీ, అక్కడ వుండే రోగులకు, సిబ్బందికీ ఎంతమాత్రం క్షేమం కాదనీ, అంచేత ఆ భవనం పడగొట్టి కొత్త భవనాన్ని నిర్మించడం ఒక్కటే పరిష్కారమనీ ఈ నిర్ణయానికి మద్దతుగా వివరణ ఇస్తున్నారు.
నిజమే. రోగుల ప్రాణాలు నిలబెట్టడానికే ఆసుపత్రులు కాని,  ప్రాణాలు తీయడానికి కాదు. శిధిలావస్థకు చేరిన భవనాలను కూలగొట్టడం, ప్రత్యేకించి అవి ఆసుపత్రులు అయినప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించడం ప్రభుత్వాల విధి.

అయితే, ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి సాంస్కృతిక పరమైన ఒక చరిత్ర వుంది. హైదరాబాదు అనగానే తటాలున గుర్తుకు వచ్చే పేర్లలో అదొకటి. మనోఫలకంపై కదలాడే రూపాల్లో ఉస్మానియా ఆసుపత్రి భవనం ఒకటి. అటువంటి భవనం, తెలంగాణా సాంస్కృతిక పరిరక్షణకు నడుం కట్టిన కేసీఆర్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూల్చివేతకు గురవడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న. ఆయనే స్వయంగా ఉస్మానియా భవనం కూల్చివేతకు ఉత్తర్వు చేయడం అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో తెలంగాణా అభిమానులు అనేకులు అభిప్రాయపడుతున్నారు.
భవనం శిధిలం అయితే అక్కడ ఆసుపత్రిని కొనసాగించడం యెంత మాత్రం మంచిది  కాదు. అయినా ప్రత్యమ్నాయం ఆలోచించకుండా ఏకబిగువున భవనం పడగొట్టడం కూడా వారసత్వ సంపదని చేజార్చుకోవడమే అవుతుంది. ప్రభుత్వం తలచుకుంటే, ఆసుపత్రికోసం మరో మరో భవనం నిర్మించి,  ఇప్పుడు వున్న పాత   భవనాన్ని భావి తరాలకోసం పరిరక్షించడం సబబయిన చర్య అవుతుంది. చారిత్రిక సంపదను పరిరక్షించడం కూడా ప్రభుత్వ కర్తవ్యం అని మరచిపోకూడదు. 
మరికొద్ది సంవత్సరాల్లో నూరేళ్ళు నిండబోతున్న ఉస్మానియా ఆసుపత్రి భవనం అప్పుడూ ఇప్పుడూ కూడా భాగ్య నగరానికి ఒక ప్రతీకగా వుంటూ వస్తోంది. ఆ భవనం శిల్ప వైభవం చారిత్రిక విలువలకు అద్దం పడుతోంది. ఆ భవనానికి సకాలంలో సరయిన మరమ్మతులు జరగక శిధిలావస్థకు చేరిన భవనాల జాబితాలో చేరిపోవడం చాలా దురదృష్టకరం.
మూసే నది ఒడ్డున దాదాపు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో నెలవయిన ఉస్మానియా ఆసుపత్రి పదునాలుగు వందల పడకలతో రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది పేద రోగుల వైద్య అవసరాలను తీరుస్తోంది. సుమారు నాలువందలమంది డాక్టర్లు, వందలాదిమంది సిబ్బంది పనిచేస్తున్నారు. శిధిల భవనంలో ఇంతమంది పనిచేయడం అనేది క్షేమకరం కాని మాట నిజమే. కానీ, అలాగని హైదరాబాదు నగరానికి తలమానికంగా వుండే ఇటువంటి చారిత్రిక భవనాలను కూలగొట్టుకోవడం కూడా ఆహ్వానించతగ్గ పరిణామం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యేమార్గం అన్వేషించాలి. రోగుల క్షేమం ముఖ్యమే, అదేసమయంలో వారసత్వ సంపద పరిరక్షణ కూడా అంతే ప్రధానం.
పోతే, ఇటువంటి చారిత్రిక భవనాలే హైదరాబాదు నగరానికి విశ్వవ్యాప్తంగా  విశిష్టతను సమకూర్చి పెట్టిన విషయం మరువకూడదు. విశ్వనగర నిర్మాణానికి కంకణం కట్టుకున్న వారు, చారిత్రిక వైశిష్ట్యం కలిగిన నిర్మాణాలను కనుమరుగు చేసుకోరాదు. ఒక జాతి చరిత్రకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దాలే ఈ భవనాలు. ప్రాచీన కట్టడాలు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. తరువాతి తరాలకి పాత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపగలిగే సజీవ సాక్ష్యాలు.
ప్రపంచ వ్యాప్తంగా మనకు ఇదే రీతి కానవస్తుంది. పూర్వపు సోవియట్ యూనియన్, పేరుకు కమ్యూనిష్టు రాజ్యం అయినా, వారి చారిత్రిక వారసత్వ సంపదని వారు చాలా  పదిలంగా కాపాడుకున్నారు. పుష్కిన్, టాల్ స్టాయ్, గోర్కీ, మయకోవేస్కీ వంటి మహా రచయితల పేరిట ఆ దేశంలో మ్యూజియంలు ఏర్పాటు చేశారు. పుష్కిన్ పేరు వూళ్ళకీ, వీధులకీ పెట్టుకున్నారు. మాస్కో నగరంలో అర్బాత్ స్కయా అనే పేరుతొ ఒక వారసత్వ వీధి వుంది. అందులోకి పాదచారులను మినహా ఎటువంటి వాహనాలను అనుమతించరు. పాదచారులు మాత్రమే తిరుగాడగలిగే ఇటువంటి ప్రాచీన వీధులు లండన్, ప్యారిస్ నగరాల్లో కూడా వున్నాయి. అలాగే హైదరాబాదుకు సంబంధించి చార్మినార్ వంటి ప్రాంతాలను ఆ విధంగా పరిరక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలి. భవన నిర్మాణ రంగంలో వ్యాపారం చేసేవారికి పాత భవనాల్లో వారసత్వ విలువలు కానరావు. వారికి ఆ శిధిల భవనాల్లో తమ పెట్టుబళ్లకు తగ్గ లాభాలు తెచ్చి పెట్టే వాణిజ్య విలువలే కనిపిస్తాయి. అందుకే ఉస్మానియా మొదలయిన చారిత్రిక వారసత్వ భవనాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలే భుజానికి ఎత్తుకోవాలి.
ఈ సందర్భంలో తెలంగాణా ప్రభుత్వ నేతలకి  ఒకటే విజ్ఞప్తి.
రోగుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని ఉస్మానియా ఆసుపత్రిని ఆలశ్యం చేయకుండా మరో చోటికి మార్చండి. దానికి కొత్త భవనం కట్టండి. కానీ, హైదరాబాదు చారిత్రిక వారసత్వ సంపదకి  గుర్తుగా నిలిచిన ఉస్మానియా ఆసుపత్రి పాత  భవనాన్ని కూలిపోకుండా ప్రభుత్వ నిధులతో నిలబెట్టండి. తెలంగాణా సంస్కృతీ పరిరక్షణకు పెట్టని కోటగా నిలబడండి. (29-07-2015)

NOTE: Courtesy Image Owner                                        

27, జులై 2015, సోమవారం

మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 28-07-2015, TUESDAY)

(ఈ సోమవారం సాయంత్రం షిల్లాంగ్ లో కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంస్మరణార్ధం ) 
ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా  పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 
అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన అనుగ్రహ భాషణం’ ఇది. తెలుగుదనం కోసంఅనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం.
చిత్తగించండి.


మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలుమన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం.
పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశమే మొదటి వరసలో వుంది.
ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభంవీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలుఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే.
ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది  కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులుచంపడాలుబాంబు దాడులుపేలుళ్లుఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు  ప్రచురించవన్న సంగతి అప్పుడే  అర్ధం అయింది.
మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులుజబ్బులునేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
ఎందుకిలా జరుగుతోందిజవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు.
అదేమిటంటే.  విదేశీ వస్తువుల  మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై  వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము.
ఆ  మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను జీవితంలో నీ లక్ష్యం ఏమిటని. ఆ అమ్మాయి బదులిచ్చింది. 'అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన  భారత దేశంలో జీవించాలని వుంది అని.
ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత  మనందరిమీదా  లేదంటారా. ఆ కర్తవ్యం  మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
మరో విషయం. మనందరికీ  ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారువీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా  లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము.
ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన  జన్మ హక్కు అనుకుంటాము.
వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే.  కానీ మనమేం చేస్తున్నాముఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా? 
మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్! యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక.  సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడతాము. ఏ షాపింగ్ మాలుకోరెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదాస్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు.
లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లినేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని  నాకు బిల్లు పడకుండా చూడండి’ అని అడిగే ధైర్యం చేయం.
వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు  మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసిట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!’ అంటూ హుంకరించం. లేదా నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో’ అని ఆమ్యామ్యా పైసలు  చేతిలో పెట్టే తెగింపు చేయం.
అలాగేఆస్త్రేలియాలోనోన్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూతాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం.  వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి  బిన్ లో వేసికాని రాము.
టోకియోలో  పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమావిదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే!  కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా?
ఎందుకంటేమనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే  కనిపెట్టి చూడాలని కోరుకుంటాం.
వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని  తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి  మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే  సిబ్బందికి కూడా  మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది.
ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి  సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని   ఆపగలవారుఅడ్డగలవారు  వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను  చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూ’ అంటూ   అని ధర్మపన్నాలు వల్లిస్తాం.
మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడందానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను, సమాజాన్ని  క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటిసమాజం అంటే ఎవరుపక్కింటివాళ్ళుఎదురింటివాళ్ళుమన  కాలనీవాళ్లువూళ్ళో వున్న పౌరులులేదా  మునిసిపాలిటీప్రభుత్వంప్రభుత్వ అధికార్లు. అంతే. మనం  కాదు. ఈ వ్యవస్తలో  మనం మాత్రం  వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారా’ అని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతేవిమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని,  వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరంఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితేఅంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి.
ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం.

భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికాఇతర పాశ్చాత్య దేశాలు  ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.  (14-08-2012)
NOTE: Courtesy Image Owner 

ఈ పధ్ధతి మారాలి. మారితీరాలి.

"PEOPLE LOVE TO HAVE A MOTHER, A WIFE AND OFCOURSE A GIRL FRIEND. THEN WHY NOT A DAUGHTER?"


ప్రతి ఒక్కరూ తమకు తల్లి కావాలనుకుంటారు, ఒక భార్య కావాలని కోరుకుంటారు, చెల్లి వుంటే బాగుండని భావిస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక ఆడపిల్ల తమకు స్నేహితురాలయితే యెంత బాగుంటుందో అని కూడా అనుకుంటారు. అదేం చిత్రమో ఆడపిల్ల పుట్టగానే 'ఆడపిల్లా' అని పెదవి విరుస్తారు.

ఈ పధ్ధతి మారాలి. మారితీరాలి.  

25, జులై 2015, శనివారం

మళ్ళీ మొదలయిన పాదయాత్రలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 26-07-2015, SUNDAY)

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగేవుంటుంది. అయితే, చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాద యాత్ర చేసి తిరిగి చక్కాపోయారు. నడిచింది పది కిలోమీటర్లు మాత్రమే కానీ రాజకీయంగా చతికిల పడివున్న  తన పార్టీకి ఓ మేరకు జవసత్వాలను అందించిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం నిజానికి కాంగ్రెస్ పార్టీకి  సీమాంధ్ర ప్రాంతంలో నూకలు చెల్లిపోయాయనే అంతా అనుకున్నారు. నిరుడు అసెంబ్లీకి, లోక సభకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని నిట్ట నిలువునా మట్టి కరిపించారు. విభజన నిర్ణయంలో అన్ని పార్టీలకి ఎంతో కొంత పాత్ర వున్నప్పటికీ సీమాంధ్ర ఓటర్లు మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని  ఘోరాతిఘోరంగా ఓడించారు. ఇది ఆ పార్టీకి నిజంగా మింగుడు పడని విషయం. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని పేరున్న కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇంతటి స్థాయిలో ఘోర పరాజయం ఎన్నడూ దాపురించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇక ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు వుండవని ఆ పార్టీవారే బలంగా నమ్మే స్తితి ఏర్పడింది. కొంత కాలం  క్రితం తెలంగాణా రాష్ట్రంలో పర్యటించి వెళ్ళిన రాహుల్ గాంధీ, అదే సమయంలో సీమాంధ్ర పర్యటనను దానితో  జత చేసుకోవడానికి సంకోచించాల్సిసిన పరిస్తితి ఏర్పడిందంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ దీనస్తితి అర్ధం చేసుకోవచ్చు. మరి రాష్ట్ర విభజన జరిగి ఏడాది తిరగగానే ఆ విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ  అదే ప్రాంతంలో ఒకరోజు పాదయాత్ర చేసి వెళ్ళగలిగారంటే, అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. అంటే ఏమిటి? అలా తిరగగలిగిన పరిస్తితి విపక్ష నేతకు కల్పించింది అక్కడి పాలక పక్షమే. అందుకే  రాహుల్ పర్యటనలో ఆయన చేసిన ప్రసంగాలపై తెలుగుదేశం అధినేత స్వయంగా కల్పించుకుని వ్యాఖ్యానాలు చేయాల్సిన పరిస్తితి ఆ పార్టీకి ఏర్పడింది. ఈసారి రాహుల్ తన పర్యటనకు రైతుల ఆత్మహత్యలను కీలక అంశంగా తీసుకున్నారు. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పాపం పూర్తిగా తెలుగుదేశానిదే అని సూత్రీకరించారు. నిజానికి రైతుల ఆత్మహత్యలకు ఏఒక్క ప్రభుత్వాన్నో కారణంగా చూపించడం సమంజసం కాదు. ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినా అవి తీసుకునే నిర్ణయాలు లేదా వాటి ఆలోచనలు దీర్ఘ కాలంలో ఇటువంటి పర్యవసానాలకు, పరిణామాలకు  కారణం అవుతాయి. అంటే, రైతన్నల ఉసురు తీయడంలో అన్ని  పార్టీలకి ఎంతో కొంత పాత్ర వుండే తీరుతుంది. కానీ ఈ రోజుల్లో రాజకీయాల రంగూ రుచీ వేరు. అధికారంలో లేనప్పుడు చెప్పే మాటలు వేరు. చేసే ఆరోపణలు వేరు. అదే పార్టీ అధికారంలోకి రాగానే అదే అంశంపై మాట్లాడే మాటలు వేరు, చేసే ప్రత్యారోపణలు వేరు. అధికారానికి రాకముందు రైతే వారికి  దేముడు. రైతులకు ఏంచేసినా తక్కువే అనే రీతిలో నాయకుల ప్రసంగాలు సాగుతాయి. 'మీకు నేనున్నా' అనే భరోసాలకు కొదవే వుండదు. అదే అధికారపీఠం ఎక్కగానే మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం కనిపించదు. అన్నీ ఆ తానులో ముక్కలే.   ఇందుకు చరిత్ర పుటలను గాలించాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఏన్నర్ధం క్రితమో అంతకు కాస్త ముందో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి తనకున్న అనేక రాజకీయ రికార్డులకు మరోటి జోడించారు. ఇటీవలి సంగతే కనుక చాలామందికి ఇది గుర్తు వుండి వుండవచ్చు. కానీ ఆయన అంతకు ముందు ముప్పయి అయిదు సంవత్సరాలకు పూర్వం జరిపిన పాదయాత్ర గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.             

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా  పరిచయం లేని చంద్రబాబు నాయుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి అడిగి  తెలుసుకున్నారు.
రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.



ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు పూర్వం  ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే మార్గంగా  ఎంచుకున్నారు.. వస్తున్నా మీకోసంఅంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. కాకపొతే, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులు, చెప్పులతో, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీ మార్భలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జరిపిన  పాదయాత్రలో అంతా కొత్తదనమే.   విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించి, కుడియెడమల పార్టీ  నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా, ‘రాజువెడలె రవితేజములడరగ’  అన్నట్టు పాదయాత్రకు నడుం కట్టారు. ఇప్పటి  పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. పైగా తొమ్మిదేళ్ళ పైచిలుకు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. రెండు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వోడించి సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా దేశవిదేశాల్లో మన్ననలందుకున్న రాజకీయ నాయకుడు. ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందే విషయంలో ఆయువుపట్లన్నీ  తెలిసిన వాడు.  తెలుగుదేశం పార్టీకి  పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలలో  ఏఒక్క చిన్న అంశాన్ని కూడా విస్మరించినా అది కూడదీసుకోలేని  తప్పిదం కాగలదన్న ఎరుక గలిగిన రాజకీయ దురంధరుడు. అందుకే, ఈ యాత్రకు పేరు పెట్టడం దగ్గరనుంచి, యాత్రసాగే మార్గం నిర్ణయించే వరకు ఆయన  అనేక రోజులపాటు సహచరులతో మంతనాలు జరిపారు. పార్టీకి  చెందని వృత్తి  నిపుణులను  కూడా విశ్వాసంలోకి తీసుకుని, యాత్ర సందర్భంగా చేసే ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునే హావభావాలు మొదలయిన అంశాల్లో  కూడా గట్టి కసరత్తు చేసారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. సుదీర్ఘ  పాదయాత్రల్లో  ఎదురయ్యే సాధకబాధకాలు, శారీరక ఇబ్బందులు  అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మటనే ఆయన ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. పార్టీ  ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్తితిని దృష్టిలో వుంచుకుని ఆలోచిస్తే,  తెలుగు దేశాన్ని  వొడ్డున పడేయడానికి ఇంతకంటే మరో దారి కనిపించని స్తితిలోనే,   ఆయన ఇంతటి ధైర్యం చేశారని అనుకోవాలి. నాటి  ఉప ఎన్నికల్లో వరస పరాజయాలు, కట్టుతప్పుతున్న పార్టీ శ్రేణులు, నాయకత్వ పటిమపట్ల  తలెత్తుతున్న సందేహాలు, ప్రాంతాల పరంగా  నాయకుల్లో  రగులుతున్న విద్వేషాలు, రాజకీయ వారసత్వం గురించి కుటుంబ సభ్యుల్లో పొటమరిస్తున్న విభేదాలు ఇలా వొకటి కాదు రెండు కాదు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం  కనిపించకనే అలవికి మించిన ఈ భారాన్ని తలకెత్తుకోవాల్సివచ్చింది.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ  కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో  వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. షష్టిపూర్తి దాటిన  వయస్సులో ఇంతంత దూరాలు నడవడం ఆషామాషీ కాదు. కాకపొతే, వ్యక్తిగత క్రమశిక్షణకు, దినవారీ వ్యాయామాలకు, యోగాభ్యాసాలకు   మారుపేరు చంద్రబాబు అన్న పేరు తెచ్చుకున్న మనిషి కాబట్టి  కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించి  తన గురుతర లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆరోజుల్లో ఇది సాధ్యం అని ఎవరయినా అన్నా ఎవరూ నమ్మలేని పరిస్తితి.


అంతకుముందు దశాబ్దం క్రితం  వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర, దానితో సాధించిన విజయం  రాజకీయ నాయకులను  పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. ఆ యాత్ర చేసిన రాజశేఖర రెడ్డి, అంతకు ముందు రెండు మార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.  
ఈ పాదయాత్రల  వల్ల రాజకీయ పార్టీలకు  వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక  ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలాంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. కాపపోతే, యాత్ర సందర్భంలో ప్రజల సమస్యలు ప్రస్తావనకు తెచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది. అంతకు ముందు అధికారంలో వున్నప్పుడు  ఏం చేసారన్న ప్రశ్న సహజంగా జనం నుంచి ఎదురయ్యే అవకాశం వుంటుంది.
ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాద యాత్రల  వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే  యాత్రా ఫలసిద్ధి కూడా  ప్రాప్తిస్తుంది. 
2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ప్రజా ప్రస్తానంపాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.  చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసంపాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి  శ్ర్రీకాకుళంజిల్లా ఇచ్చాపురంలోనే ముగిసింది. మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం, ఏ పేరుతొ అయితేనేం నాయకులు ఏసీ గదులు ఒదిలి కొద్ది కాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. (25-07-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE : Courtesy Image Owner